అక్షరాస్యతా ఉద్యమానికి పతాక గీతం ‘నా చిట్టి చేతులు’

ఉద్యమాల కొండ నల్లగొండ బాటల మీదుగా పాటను పోరు గీతంగా మలచిన సహజకవి చింతల యాదయ్య. చిన్నప్పుడు అమ్మ జోలపాటతో పాటు నాయిన తత్వగీతాలలో పాటను బతుకాటగా చేసుకున్న ఆశుకవి. కాలం కదులుతున్నకొద్దీ పొరుబాటలో కదం తొక్కుతూ నడక మొదలైంది. అక్షరమాలను దిద్దుకోకముందే జీవిత పాఠాల పరీక్షలకు ప్రయోగశాలగా మారిండు. సామాజిక చింతనను శ్వాసగా చేసుకున్న చింతల యాదగిరి నల్గొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి గ్రామంలో 1975 జనవరి 26న జన్మించాడు.తల్లిదండ్రులు చింతల సైదమ్మ, నర్సింహ్మ. తాళ్ళెక్కి కల్లుగీసే కులవృత్తికి తోడు, తండ్రి జానపద కళాతృష్ణను సాంస్కృతిక వారసత్వంగా అందుకొని పాటకు కొండంత చిరునామాగా నిలబడ్డాడు యాదగిరి.

పాఠశాల చదువు పూర్తికాకుండానే అర్ధాంతరంగా ఆగిపోయింది. లోకమనే విశ్వవిద్యాలయంలోకి పాటతో ప్రవేశించాడు. జననాట్యమండలి వేదికకు ఉత్తేజ గీతమైండు. ప్రజానాట్యమండలి ప్రదర్శనల్లో ఉద్వేగ స్వరమైండు. బిగిసిన పిడికిళ్లలో ఎర్రజెండా రెపరెపలాడింది. నిషేధాలు, నిర్బంధాలు, రాజ్యహింసతో బతుకు వలస దారుల్లోకి పయనమైంది. అజ్ఞాతంలో స్వరం మరింత పదునెక్కింది. పాటల ప్రవాహం పరవళ్లు తొక్కింది. ఈ క్రమంలో బడి మానేసిన ఈ డ్రాపౌట్ స్టూడెంట్ రాసిన గీతం “నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో” అక్షరాస్యత ఉద్యమానికి పతాక గీతంగా మారడం అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ గీతంలోని సామాజిక సమస్యలను చింతన చేసుకుందాం.

“నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో
నా సంకల మేడితో సాలిరువాలు దున్నీనానయ్యో”
1996 లో ఈ పాట పుట్టగానే ప్రతిధ్వనించడం ఆరంభమైంది. కవి స్వీయానుభవంలో నుంచి ఉద్భవించిన ఈ పాటలోని దుఃఖం, వేదన బడిమానేసి వెట్టి చాకిరిలో కూరుకుపోయిన ప్రతి బాలకార్మికుడి సామూహిక స్వరంలా రూపుదిద్దుకుంది. చిత్తశుద్ధి లేని విద్యావేత్తలు, పాలకుల పునాదుల్ని కదిలించి కరిగించిన పాట ఇది. మేధావుల మదిలో ఆత్మవిమర్శాగ్నిని రగిలించిన జ్ఞానగీతం ఇది. పాఠశాలలన్నీ బడి మానేసిన పిల్లల్ని తలచుకుంటూ కన్నీళ్లతో పాడుకున్న ప్రార్థనా గీతంలా మార్మోగింది. అందరి పిల్లల్లా పలక బలపం పట్టుకొని బడికెళ్ళి చదువుకోవాలనే గాఢమైన ఆకాంక్ష కలిగిన బాలుడి ఆర్థ్రగీతం. పసితనం వీడని చిన్నారుల చిట్టి చేతులు ఏ వంకర టింకర గీతలు గీయడానికి కూడా అవకాశం లేనితనాన్ని తలచుకుంటూ పొగిలి పొగిలి ఏడుస్తూ పాడుకుంటున్న ఆత్మగీతం ఇది. చిన్న చేతిసంచి కూడా సరిగ్గా మోయలేని భుజాలు మేడి పట్టుకుని పొలం దున్నవలసిన దుస్థితిని వర్ణిస్తున్నాడు కవి. ఒక వేదనాభరితమైన వాస్తవిక పరిస్థితిని, దయనీయ బాల్యాన్ని దృశ్యమానం చేస్తున్నాడు యాదగిరి.

ఈ పాట తెలుగు ప్రాంతంలో ప్రకంపనాన్ని సృష్టించింది. కరుడుగట్టిన పాలనాధికారులను సైతం కన్నీరు పెట్టించింది. పాటలోని ప్రతీ చరణం గుక్కపట్టి ఏడిచే పసి హృదయంగా మారి మనసును మెలిపెడుతుంది.

“నను గన్నవాళ్ళకు ఏడేండ్లప్పుడు దూరమయ్యాను
దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యాను
మూడు మూరలకర్రతో ముప్పైగాడ్లతో సోపతి నాదయ్యో
దిక్కు దిక్కూన ఉరుకంగ లేలేతకాళ్ళకు గుచ్చెనుముండ్లయ్యో”
బాల్యంలోనే బతుకు ఎలా పరాయీకరణకు గురైందో వ్యక్తపరుస్తున్నాడు యాదగిరి. తల్లిదండ్రుల కళ్ళముందు బొంగరంలా తిరిగే పసితనం ఎలా మాయమైందో తెలుపుతుంది. దొరల ఎడ్ల కొట్టంలో తానో గానుగెద్దులా మారిపోయిన బాల్యరోదన ఈ చరణాల్లో నిక్షిప్తమైంది.

చిన్ననాటి సోపతిగాళ్లతో కలిసి చిర్రాగోనేలాటలు ఆడుకునే వయసు మూడు మూరల కర్రలో బందీ అయిపోయింది. చుట్టూ మనుషుల్లేక గొడ్లతోనే సావాసం చేయవలసిన అనివార్య పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ పశువుల్లో తానొక లేగదూడగా మారిపోయాడు. సరదాగా గడిచే పసితనం పశువుల వెనక పరుగెత్తవలసి వచ్చింది. ఏ దిక్కూలేని అనాథగా ఆ ముప్ఫై గొడ్ల వెంట నలుదిక్కుల తిరుగుతూ కాపల కాయడం చాలా కష్టం. దానికితోడు చెప్పుల్లేని లేలేత కాళ్లలో గుచ్చుకునే ముండ్లు బాలుడి బతుకును రక్తస్రావంలో ముంచెత్తాయి. ఈ చరణాల్లోని ముండ్లు అందరికీ గుచ్చుకుంటాయి.

“వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను
మా అమ్మాఅయ్యా రాకముందే నిదురపోతాను
సుక్కగూకిన జాముకు ఎడ్లకొట్టం సూరుకాడుంట
తెల్లవెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయికాడుంట”
ఈ “చిట్టి చేతులు” పాట వినగానే సుద్దాల హనుమంతు “పల్లెటూరి పిల్లగాడ” అనే గీతం స్ఫురణకు వస్తుంది. 1946లో వచ్చిన ఆ గీతంలోని పసివాడి దుఃఖం ఈ ‘చిట్టి చేతులకు’ తగులుతుంది. లేత వయసులో అమ్మ ఒడికి, నాన్న భుజాలకు, బడికి, బాల్యక్రీడలకు దూరమైన పాలబుగ్గల జీతగాడు మరింత బరువుతో కష్టాలతో ఈ పాటలో ప్రత్యక్షమవుతాడు. తల్లిదండ్రుల సంరక్షణలో భద్ర జీవితాన్ని ఆశించే పిల్లలు వెట్టిచాకిరిని వారసత్వంగా అందుకోవలసిన విషాదాన్ని ఆవిష్కరిస్తాడు యాదగిరి. చీకట్లు కమ్ముకున్నప్పుడు ఇంటికిపోయిన బాల్యం చీకట్లోనే తెల్లవారుతుంది. అమ్మా అయ్యను చూడకుండానే సొమ్మసిల్లి నిద్రపోతాడు. గానుగెద్దులా మారిపోయిన బాల్యంలోని బతుకుభారం మనం మోస్తున్నట్లుగా దుఃఖిస్తాం.

“బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య బెడుతుంటే
తేపతేపకు దొరసాని రోకటి పోటుల మాటలంటుంటే
అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే
ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే”
తెలంగాణ గ్రామీణ జీవితంలో వెట్టిచాకిరి వ్యవస్థలోని చిత్రహింస స్వభావాలను, ధోరణలను స్పష్టంగా ప్రకటిస్తుందీ గీతం. లేత భుజాలు శక్తికి మించిన బరువును మోస్తున్నా, కనికరం లేకుండా దొరసాని తిట్టే తిట్లు ఎక్కువగా బాధిస్తాయి ఈ పిల్లలను. జాలి, సానుభూతిలేని దొరసానుల క్రూర మనస్తత్వాన్ని చూపుతాడు కవి. నిరక్షరాస్యులైన ప్రజలకు అప్పులిస్తూ దొంగవడ్డీ లెక్కలతో వారిని శాశ్వత బానిసలుగా మార్చుకునే అన్యాయాన్ని కవి కళ్ళముందు కదలాడిస్తాడు. ఉచ్చులో పడిన పక్షి పరిస్థితి ఎలా వుంటుందో ఈ మనుషుల పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంటుందనే వాస్తవం ప్రతి చరణంలో ప్రకటితమైంది.

“వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగజూస్తారే
కడుపుగాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే
చిన్నవొళ్ళుకు చిల్లులు పడ్డా అంగీ ఒక్కటున్నాదే
వాళ్ళ బిడ్డల ఒంటికి రంగు బట్టలు రోజు మారేనే”
మనిషి బతుకు పశువుల కంటే హీనమైపోయిందని కవి వాపోతున్నాడు. శ్రమకు తగిన కూలి దొరకడం కష్టమైన చోట కడుపునిండా తినడానికి పిడికెడు తిండైనా దొరుకుతుందనే ఆశ కూడా లేకుండా పోయింది. పశువులకు ఉలవపిండి, ఆకలితో అల్లాడిపోతున్న చిన్నారికి గొడ్డుకారం ముద్దలు తినవలసిన కష్టం ఎదురైంది. మనిషి మౌలికవసరాలైన కూడు, గూడు కరువైన కాలంలో బతుకులీడుస్తున్న యదార్థాన్ని గుండెలు పిండేసేలా గానం చేస్తున్నాడు కవి.

“పెద్దోళ్ళ బిడ్డలు ఏమీజేసిన ఎంతో ప్రచారం
నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో యికారం”
ఈ పాటంతా పసితనంలో వెట్టిచాకిరి పనుల్లోకి బాలలు బానిసలుగా మారిన తరం అస్తిత్వ వేదనను గాఢంగా చిత్రించింది. కవి యాదగిరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు జన్మించాడు. ఆ రిపబ్లిక్ పండుగ సాక్షిగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం కింద రేపటి భావి భారత పౌరుల దయనీయ దీనగాథను జాతీయ గీతం కంటే శ్రద్ధగా, పవిత్రంగా భారతావనికి విన్నవించుకుంటున్నాడు. ఎన్ని సాహసాలు, త్యాగాలు చేసినా గుర్తింపుకు నోచుకోని అజ్ఞాత వీరుల్లాంటి ఈ బాల బానిసల ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. విదేశీ దాస్య శృంఖలాలను ఛేదించుకుని బయటపడ్డ జాతి మనది. స్వదేశీదొరల చెరలో బందీలైపోయిన భావి భారత జనావళి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం, సాధికారిక జీవనం కోసం కవి స్వర పేటిక పగిలిపోయేలా గళమెత్తి గర్జిస్తున్నాడు.

“చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే
నా గుండెలమీద పుండునుజేసే పనులకు పంపకురే
అమ్మా నాన్నా అందరికీ నే దండం పెడుతున్నా
నా బాధను గాథను ఆలోచించురి కాళ్ళు మొక్కుతున్నా…”
సుద్దాల ‘పాలబుగ్గల పసివాడా’ గీతం ఏ సమస్య దగ్గర ముగిసిందో అక్కడినుండి ఈ గీతం ఆరంభమైంది. “పాఠశాల ముందుచేరి/తోటి బాలుర తొంగిచూసి/ ఏటికోయి వెలవెల బోతావు? ఓ పాల బుగ్గల పసివాడా/ వెలుగులేని జీవితమంటవా” అన్న సుద్దాల ఆశయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లిన కవి చింతల యాదగిరి. పసివాళ్ళు బాల్యంలో జీతగాళ్ళుగా మారడం వెనక అనేక కుట్రలు, కుతంత్రాలు దాగి వున్నాయి.

గ్రామీణ ప్రాంతాలలో దొరలు, భూస్వాములు,అగ్రవర్ణాలవారు తమ దగ్గర జీతగాళ్లుగా పనిచేసే వారి పిల్లలను సైతం వడ్డీల కింద ఇంట్లో పనివాళ్లుగా నియమించుకున్నారు. దాంతో సహజంగానే పిల్లలు బడికి దూరమయ్యారు. వారి చదువుపై అనధికార నిషేధం అమలైంది. కింది కులాల పిల్లలు వెట్టిచాకిరి పనులకు పరిమితమైనారు. ఇతర వృత్తికారుల పిల్లలు సైతం జీవనోపాధి కోసం కుటుంబంతో పాటు దొరల పనుల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఇటువంటి తరం పిల్లలంతా బడికి వెళ్లి చదువుకునే అవకాశం వస్తే జ్ఞానం పెరుగుతుంది. తామెలా మోసపోతున్నామో అర్థమవుతుంది. ప్రశ్నిస్తారు. తిరగబడతారు. దొరల ఆధిపత్యం అంతమవుతుంది. కవికి చదువు విలువ తెలుసు. సుద్దాల ఈ కోణంలోంచే పాలబుగ్గల పసివాడిని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు. చదువు లేకపోతే వెలుగు లేదనే సత్యాన్ని బలంగా వ్యక్తపరిచాడు సుద్దాల. ఆ సత్యాన్ని ఉద్యమ స్థాయిలో పరివ్యాప్తం చేశాడు చింతల యాదగిరి.

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా పిల్లల జీవితాల్లో మార్పులు చోటుచేసుకోలేదు. రేపటి పౌరులు తరగతి గదుల్లో కాకుండా అనేక చోట్ల పెద్ద కార్మికుల్లా వెట్టిచాకిరిలో మునిగిపోయి మగ్గిపోతున్నారు. బాల్యం నుంచి బతుకులోని తండ్లాటను తట్టుకుంటూ నడుస్తున్న యాదగిరి బాలకార్మికుడి చిట్టి చేతుల్లోని గాయాల స్పర్శను అనుభవించినవాడే. ఆ గాయాల గొంతుకతో చిట్టి చేతుల చిన్నారిగా మారి ప్రత్యక్షంగా తన ఆవేదనను, ఆశయాన్ని వినిపించాడు.

‘గుండెల మీద పుండుగా మారిన బానిస బాధలను కన్నీటి గీతమై విలపించాడు. ఈ విలాపమే రాగాల ఉప్పెనలై నిర్మాణాత్మక పరిణామాలకు నాందీ గీతాలైనాయి. “అమ్మా నాన్నా అందరికి నే దండం పెడుతున్నా” అనే చిన్నారి విన్నపం ఈనాటికి వెంటాడుతూనే ఉంది. ఒక అక్షరాస్యతా తరమంతా కవి పాటకు నిత్యం దండం పెట్టవలసిందే. ఈ పాట పాడుకోవలసిన అవసరం లేని కాలాన్ని కవి కలగంటున్నాడు.

నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన ఈ పాట కవి పేరుతో సంబంధం లేకుండా తెలుగు ప్రాంతమంతటా ఆదరణ పొంది ప్రజాగీతమనే పదానికి ప్రతీకగా స్థిరపడింది. పాటలను ఉగ్గుపాలుగా తాగిన యాదగిరి రాసిన ” నా చిట్టి చేతులు” పాట సమాజానికి అందించిన పౌష్టికాహారం లాంటి జ్ఞానచైతన్యం గీతం!

( పూర్తి గీతం )

నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో
నా సంకల మేడితో సాలిరువాలు దున్నీనానయ్యో
నను గన్నవాళ్ళకు ఏడేండ్లప్పుడు దూరమయ్యాను
దొరగారి ఎడ్ల కొట్టంకాడికి చేరువయ్యాను
మూడు మూరలకర్రతో ముప్పైగాడ్లతో సోపతి నాదయ్యో
దిక్కు దిక్కూన ఉరుకంగ లేలేతకాళ్ళకు గుచ్చెనుముండ్లయ్యో || నా చిట్టి చేతులు||
వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను
మా అమ్మాఅయ్యా రాకముందే నిదురపోతాను
సుక్కగూకిన జాముకు ఎడ్లకొట్టం సూరుకాడుంట
తెల్లవెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయికాడుంట || నా చిట్టి చేతులు||
బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య బెడుతుంటే
తేపతేపకు దొరసాని రోకటి పోటుల మాటలంటుంటే
అయ్యజేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే
ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే || నా చిట్టి చేతులు||
వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగజూస్తారే
కడుపుగాలిన నాకు గొడ్డుకారం ముద్దలు పెడతారే
చిన్నవొళ్ళుకు చిల్లులు పడ్డా అంగీ ఒక్కటున్నాదే
వాళ్ళ బిడ్డల ఒంటికి రంగు బట్టలు రోజు మారేనే || నా చిట్టి చేతులు||
పెద్దోళ్ళ బిడ్డలు ఏమీజేసిన ఎంతో ప్రచారం
నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో యికారం
చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే
నా గుండెలమీద పుండునుజేసే పనులకు పంపకురే || నా చిట్టి చేతులు||
అమ్మా నాన్నా అందరికీ నే దండం పెడుతున్నా
నా బాధను గాథను ఆలోచించురి కాళ్ళు మొక్కుతున్నా

రచన: చింతల యాదగిరి

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

2 thoughts on “అక్షరాస్యతా ఉద్యమానికి పతాక గీతం ‘నా చిట్టి చేతులు’

  1. వెట్టి చాకిరీ వ్యవస్థ దూరం అయినందుకు అదృష్టముగా భావిస్తున్నాను.

Leave a Reply