అంబేద్కర్ ఇజ్రాయెల్ ను సమర్థించాడా!?

ఈ వ్యాసం మొదలుబెట్టే నాటికే లేటెస్ట్ పాలస్తీనా, ఇజ్రాయెల్ ల 11 రోజుల యుద్ధంలో కాల్పుల విరమణ జరిగింది. ఇజ్రాయెల్ క్రూర దాడికి గాజా బూడిదగా మారింది. జన జీవితం దినదిన గండంగా పరిణమించింది. 232 మంది పాలస్తీనా పౌరుల్ని, అందులో 65మంది పిల్లల్ని బాంబులతో చంపింది ఇజ్రాయెల్. 1900 మందిని ఆసుపత్రి పాలు జేసింది. జర్నలిస్టుల ఇళ్లను కూల్చింది.

గ్రామాల్ని తగలబెట్టి, ఇళ్లు కూల్చి, పొలాలు లాక్కొని, తాగే నీళ్లను అందకుండా జేసీ, అందే నీళ్లను కలుషితం జేసీ, అడిగిన వాళ్ళను జైళ్లలో కుక్కి, విస్తాపనకు గురిచేసి- ఇలా కనీసం 73 ఏళ్లనుంచి అమానవీయ ఫాసిస్టు పాలన జేయటం ఇజ్రాయెల్ చరిత్ర. 2008 నుంచి 2020 వరకు ఇజ్రాయెల్ ఆత్మ సంరక్షణ నెపంతో చంపిన పాలస్తీనియన్లు 5590 మంది. టెర్రరిస్టు వ్యవస్థ గా చిత్రించబడిన పాలస్తీనా చంపిన ఇజ్రాయెలీలు 251 మంది.

ఈ సారి ఇజ్రాయెల్ రక్షణ దళం మసీదులోకి జొరబడి ప్రార్థన జేసుకునే జనాల మీద పెల్లెట్ల వర్షం కురిపించి పౌరుల కళ్ళు బోగొడుతుంటే ప్రతిఘటన చేయడం హమాస్ వంతయ్యింది. హమాస్ రాకెట్ వల్ల చనిపోయింది కేవలం 12 మంది ఇజ్రాయెలీలు. ప్రస్తుతం పాలస్తీనా ప్రజలెవరూ హమాస్ ను నిందించడంలేదు.

ఇజ్రాయెల్ పౌరులు చాలామంది ఇజ్రాయెల్ ప్రభుత్వాన్నీ సైన్యాన్నీ తప్పుపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు మేధావులూ, రచయితలూ, శాస్త్రవేత్తలు పాలస్తీనా భూముల్ని, ఆస్తులనీ తిరిగి ఇచ్చివేయమని, పాలస్తీనా ప్రజల్ని గౌరవంగా చూడమనీ ఇజ్రాయెల్ ను కోరుతున్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఆగాలనీ, దాని ఉగ్రవాదం ఆపాలనీ యూదు మత పెద్దలు కోరుతున్నారు. ఇక అరేబియాన్ దేశాలు, అమెరికా, బ్రిటన్ దేశాలూ వాటి రాజకీయ లబ్దికోసం అవి నాటకమాడుతున్నాయి. ఒక పక్క ఇజ్రాయెల్ కు ఆయుధాలు అమ్ముతూ మరొక పక్క యుద్ధం ఆగాలని అమెరికా, బ్రిటన్ లు అనడంలో ఎంత హిపోక్రసీ వుందో చూడండి. మిగతా అరబ్బు దేశాలూ అంతే.

నేను ఈ సంఘర్షణ ని భారతీయ కోణం నుంచి ముఖ్యంగా దళిత కోణం నుంచి చర్చిస్తున్నాను. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధంలో అంబేద్కర్ ఇజ్రాయెల్ ను సమర్ధించాడని కొంతమంది బహుజనవాదులు వాదిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని ఇజ్రాయెల్ ను గుడ్డిగా సమర్ధిస్తున్నారు. దీనికి సంబంధించిన కొంత వివరణ ఇవ్వాలని పించింది. The Jewish Advocate అనే ఆంగ్ల పత్రిక ఎడిటర్ అంబేద్కర్ ను చేసిన ఇంటర్వ్యూ 1941 లో నవంబర్ సంచికలో ప్రచురించబడింది. ఆ తరవాత అది అంబేద్కర్ రచనలు, ప్రసంగాల 17 వ వాల్యూమ్ లోని మొదటి పార్ట్ లో ‘Ambedkar and The Jewish People’ అనే పేరుతో పొందుపరచబడింది. ‘One of the India’s most respected leaders expressed openly his admiration for the pioneering efforts of the Jews in Palestine’ in respect of the social order that was being created in Palastine’ అని ఇంటర్వ్యూయర్ సగర్వంగా చెప్పుకున్నాడు ప్రారంభంలో. కానీ పూర్తి ఇంటర్వ్యూలో ఈ వాక్యం ఎక్కడా మనకు కనపడదు. కాగా Moses and his Significance అనే శీర్షికతో అంబేద్కర్ రాసిన వ్యాసం నుంచి కొన్ని భాగాల్ని మాత్రం ఇవ్వడం జరిగింది. అందులో బైబిల్ పాత నిబంధనలో చిత్రితమైన మోజెస్ వీరోచిత నాయకత్వం తనకు బాగా నచ్చినట్లు అంబేద్కర్ చెబుతాడు.” But the heart of everyone who is working for emancipation of a depressed people is bound to go to Moses, the man who brought about the emancipation of Jews” అని మోజెస్ పాత్రని ప్రశంసిస్తాడు. ఈజిప్టు చేతిలో jews పడిన బాధలకీ ఇండియా లో దళితులు పడే బాధలకీ పోలిక ఉందనీ చెబుతాడు.” I see in the present day condition of the depressed classes of India a parallel to the Jews in their captivity in Egypt”. ఈ పోలికను ఇంకా ముందుకు తీసుకెళ్లి బైబిల్ లో jews కి యహోవా చేసిన వాగ్దాన భూమిలాగా దళితులకు కూడా ఇక్కడ వారిదైన భూమి ఉన్నదని చెబుతాడు.” I believe that just as there was a land of promise for the Jews so the depressed classes must be destined to have their land of promise” అంటాడు. దీన్ని చూపి అంబేద్కర్ ఇజ్రాయెల్ పక్కన మాట్లాడినట్లు ప్రచారం చేస్తాడు ఇంటర్ వ్యూయర్. అంబేద్కర్ ఎక్కడా పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఏమీ మాట్లాడడు. అయినప్పటికీ అంబేద్కర్ ఇజ్రాయెల్ ఆక్రమణను సమర్ధిస్తున్నాడనే ట్రాప్ లో కొంతమంది బహుజనవాదులు పడుతున్నారు. అంబేద్కర్ ఈనాడు ఉండివుంటే స్పష్టంగా ఇజ్రాయెల్ దురాక్రమణ నూ, హింసానూ ఖండించి ఉండేవాడు.

నిజానికి ఇజ్రాయెల్ నాయకులు ఆనాడు ప్రపంచవ్యాప్తంగా తమపట్ల సానుకూలతను తెచ్చుకోవడానికి రకరకాల వ్యూహాలు పన్నారు. ఇందులో భాగంగా ఐన్ స్టీన్ లాంటి వాళ్ళను కూడా రంగంలోకి దింపారు. ఐన్ స్టీన్ చేత ఇజ్రాయెల్ కు మద్దతు తెలపమని నెహ్రూ కు కూడా లేఖ రాయించారు. తాను ఇజ్రాయెల్ ను సమర్ధించేది లేదని నెహ్రూ తెగేసి చెబుతాడు. గాంధీ అయితే 1938 నాటికే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతూ Jews and Palestine అని ఒక వ్యాసం రాశాడు.” Palestine belongs to the Arabs in the same sense that England belongs to the English or Frans to the French.It is wrong and inhuman to impose the Jews on the Arabs. What is going on in Palestine today cannot be justified by any moral code of conduct” అని నిర్మొహమాటంగా చెబుతాడు. ఈ వ్యాసం తన collected వర్క్స్ వాల్యూం 91 లో లభిస్తుంది. 1946 రాసిన మరో వ్యాసంలో ” But in my opinion, the Jews erred grievously in seeking to impose themselves on Palestine with the aid of America and Britain and now with the aid of terrorism” అంటూ అసలైన టెర్రరిజం పాలస్తీనా ది కాదనీ ఇజ్రాయెల్ దే ననీ ఖరాఖండిగా మాట్లాడతాడు. ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని గాంధీ రచనల వాల్యూమ్74 లో చదవొచ్చు.

నెహ్రూ నుంచి వాజ్ పేయి వరకు ఇండియా ప్రధానమంత్రులందరూ పాలస్తీనా పక్షానే మాట్లాడారు. మోడీ గ్యాంగ్ రంగంలోకి వచ్చినాకే సీను మారింది. అమెరికా, బ్రిటన్ లలాగా ఇండియా కూడా ఇజ్రాయెల్ ను సమర్ధించడం మొదలయ్యింది. మోడీ గ్యాంగ్ పాటిస్తున్న ముస్లిం ద్వేషమే ఈ ధోరణికి కారణం. ఇండియన్ ముస్లిం లను సెకండ్ రేట్ పౌరులుగా, టెర్రరిస్టు లుగా చిత్రించే హిందూ ఫాసిస్టు రాజకీయాలలో భాగంగా ప్రపంచ ముస్లిం సమాజాన్ని శత్రువుగా చూస్తూ పాలస్తీనా ప్రజల్ని కూడా అదే గాట కట్టడం మోడీ రిజిమ్ చేస్తున్న రాజకీయం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్న దళిత క్రైస్తవులు కూడా భిన్న భాషలో ఇదే చేస్తున్నారు.

హిందూ శ్రేణులలాగే దళిత క్రైస్తవ శ్రేణులు కూడా హమాస్ రూపంలో పాలస్తీనా టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడుతుందని నిందిస్తున్నారు. హమాస్ ను గానీ, అంతకు ముందు ఇతర పాలస్తీనా మిలిటెంట్ సంస్థల్ని కానీ తయారు చేసిందే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ హింసను భరించలేకే దానికి ప్రతిఘటన గానే ఇవన్నీ వచ్చాయి. గతంలో యూదుల్ని అక్కడినుంచి తరిమేసింది రోమన్లు. పాలస్తీనియన్లను కూడా యూరోపియన్ లూ, టర్కు లూ తరిమారు. ఆక్రమించుకున్నారు. కానీ వారు వారి దేశాన్ని వదలకుండా అక్కడే కొనసాగారు. యూదులు యూరోప్ పారిపోయారు. హిట్లర్ లక్షల మంది యూదులను సామూహికంగా ఊచకోత కోసినాక, యూరోపియన్, తదితర క్రిస్టియన్ దేశాల్లో యూదులపట్ల ఉన్న వ్యతిరేకతతో జరుగుతున్న దాడుల రీత్యా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ తో బేరసారాలు జరిపి మళ్లీ అక్కడకు వచ్చారు. అప్పటికే పాలస్తీనా ఒక దేశంగా బ్రిటన్ ఆక్రమణలో ఉంది. తమ తమ దేశాల్లో యూదుల బరువును పాలస్తీనా మీద దింపి పెద్ద దేశాలన్నీ చేతులు దులుపుకున్నాయ్. వారి ఆయుధాలతో, ఆర్ధిక సహాయంతో ఇజ్రాయెల్ హింసాత్మకంగా పాలస్తీనాను ఆక్రమించింది. ఒక పక్క రాజ్య హింస, మరొక పక్కప్రైవేటు యూదు టెర్రరిస్టు సంస్థల దాడుల ద్వారా పాలస్తీనీయుల్ని ప్రతిఘటన తప్ప వేరే మార్గంలేని పరిస్థితికి ఇజ్రాయెల్ గురిచేసింది. 1907 ప్రాంతంలోనే యూదు మత పెద్దలు రాసిన రచనల్లో ఇది వ్యక్తమయ్యిందని Noam Chomsky తన Middle East Illusions లో స్పష్టంచేశాడు. ‘హాశిలూ’ అనే హీబ్రు పత్రికలో ఒక యూదు పెద్ద, ‘we have to admit that we have thrown Palestine people out of their miserable lodgings and taken away their sustenance’ రాసిన మాటను చోంస్కీ కోట్ చేశాడు. 1958నాటికే 2,50,000 ఎకరాల పాలస్తీనా భూమిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. 7,50,000 మంది పాలస్తీనా ప్రజల్ని తరిమేసింది. నిరాశ్రయుల్ని చేసింది. ఈక్రమం అర్ధం కానిదే ఈ సంఘర్షణ స్వభావం అర్థంకాదు.

అబ్రాహాముకు కలలో కనిపించి యోహాను చేసిన వాగ్దానం ప్రకారం ఇజ్రాయెల్ తన భూమికి తాను చేరుకోవడం న్యాయమని మాత్రమే కాదు అది దైవ సంకల్పం, మహిమ అంటారు దళిత క్రైస్తవులు.

అయితే ఇది పాత నిబంధన ( old testament)మాత్రమే ప్రామాణిక గ్రంథంగా భావించే యూదు మతస్తుల వాదన. క్రైస్తవులు కొత్త నిబంధనను(న్యూ టెస్టమెంట్)ను పాటిస్తారు. వారు పాత నిబంధన ఇచ్చే పై వివరణను అంగీకరించరు. పాత నిబంధనను ఏసు ఖండించడం, ఉల్లంఘించడం కూడా కొత్త నిబంధనలో చూడొచ్చు. రాజకీయార్ధిక సామాజిక వ్యవస్థ పట్ల ఏసు చూపిన రాడికల్ ధిక్కార వైఖరి ముందు పాత నిబంధన నిలబడదు. సుఖశాంతులతో కూడిన దేవుని పరలోక రాజ్యం ఈ భూమి మీద కూడా రావాలని ఆయన కోరుకున్నాడు. దేవాలయంలో చేసిన తిరుగుబాటుతో ప్రజలు ఆయనను తమ రక్షకునిగా, రాజుగా భావించడం యూదా మత పూజారి వర్గం సహించలేకపోయింది. అందుకే రోమన్ సామ్రాజ్యం ఆయన్ను విడిచివేసినప్పటికీ శిలువ వేయాల్సిందేనని పట్టుబట్టి సాధించింది. ఏసు కొత్త నిబంధన ప్రవేశపెట్టాడు. యూదు మత పెద్దలు దాన్ని తిరస్కరించారు. చివరకు ఆదిమ కమ్యూన్ భావాలున్న వ్యవస్థను ఏసు శిష్యులు రహస్యంగా స్థాపించారు.

పేదలలో దావానలంగా వ్యాపించిన ఏసు సిద్ధాంతాన్ని గమనించి రోము సామ్రాజ్యాధినేతలు దాన్ని రోమన్ క్యాథలిక్ మతంగా మార్చి స్వీకరించారు. గమనించాల్సిన విషయమేమంటే పాత నిబంధనలోని దేవుడిని పూజారివర్గం చేతుల్లోంచి లాక్కొని ‘తండ్రి’గా ప్రజలందరికీ ఏసు అప్పగించాడు. అప్పటినుంచి పాత నిబంధన స్థానే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. నమ్మినవారు క్రైస్తవులయ్యారు. నమ్మనివారు యూదా మతంలోనే వుండిపోయారు. ఎవరైనా క్రైస్తవులు కావచ్చు, కానీ యూదులు మాత్రమే యూదు మతస్తులౌతారు. ఈ రకంగా ఆలోచిస్తే క్రైస్తవులు ఇజ్రాయెల్ ఆక్రమణకును సమర్థిస్తూ చేసే వాదన జీసస్ కు వ్యతిరేకం అని గూడా వారు గమనించాలి.

పదవి కోల్పోయే ప్రమాదం లో పడిన నెతన్యాహు జియోనిస్టు టెర్రరిజాన్ని రెచ్చగొట్టేందుకు, మన మోడీ తరహాలో ముస్లిం, క్రైస్తవ పాలస్తీనియన్లపై దాడి చేస్తున్నాడని దళిత క్రైస్తవులు గమనించాలి. అంబేడ్కరిజాన్ని క్రైస్తవ్యాన్ని నెతన్యాహుకి అడ్డం పెట్టడంలో పెద్ద అవగాహనా లోపముంది. నెతన్యాహు ఏనాడైనా దళిత, ఆదివాసీ క్రైస్తవులపై హిందూ ఫాసిస్టులు చేసిన దాడులను ఖండించాడా అంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. తెలిసో తెలియకో దళిత క్రైస్తవులు చేస్తున్న వాదనలు భారతీయ క్రైస్తవ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ ఫాసిస్టులకు అనుకూలంగా పరిణమించే ప్రమాదాన్ని వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు.

హమాస్ ఒక మిలిటెంట్ సంస్థ కానీ ఒక రాజ్యంగా ఇజ్రాయేల్ దేశమే ఒక పెద్ద టెర్రరిస్టు, రోగ్ స్టేట్. రష్యన్ కమ్యూనిజాన్ని ఓడించేందుకు ముస్లిం మతాన్ని అడ్డుపెట్టుకొని ఆదిలో ఆఫ్ఘనిస్తాన్లో నజీబుల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్లను పెంచి పోషించిందీ, రష్యాను ముక్కలు చేసిందీ, అటు పిమ్మట అల్ఖైదా, ఐసిస్ వంటి కిరాయి, తాబేదారు, దళారీ తోలుబొమ్మ సంస్థలను శిక్షణ ఇచ్చి నడిపించిదీ అవసరం తీరాక వాటిని ధ్వంసం చేసిందీ మొస్సాద్, సి.ఐ.ఎ. వంటి సంస్థలని అందరికీ తెలుసు.

ఐసిస్ దాడులన్నీ ముస్లిం దేశాలైన ఇరాక్, సిరియా, లెబన్నాన్ లపైనే కానీ ఇజ్రాయేలు మీద వాళ్ళు ఏనాడూ దాడి చేయలేదు. అరాఫత్ నాయకత్వంలో జరిగిన పాలస్తీనా విమోచన ఉద్యమంలో ఏనాడూ మత పర దాడులు జరగని చరిత్ర పాలస్తీనాది. తోటి అరబ్ దేశాలను కూడా ఈ విషయంలో దూరంగా ఉంచిన సంప్రదాయం పాలస్తీనా పోరాట చరిత్ర కుంది.

2001 డర్బన్ World Conference Against Racism(WCAR)లో పాలస్తీనియన్లు, బ్లాక్స్, దళితులు కలిసి జియోనిజం, క్యాస్టిజం..లను రేసిజంగా గుర్తించాలని పోరాడిన చరిత్ర, అప్పటి అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా ప్రభుత్వాలు ఏకమై ఈ మూడు పీడిత సమూహాల గొంతు నొక్కిన చరిత్ర దళిత క్రైస్తవులు తెలుసుకోవాలి

పీడితులు ప్రగతివాదులుగానే కాదు ఫాసిస్టులుగానూ తయారయ్యే అవకాశం ఉందనే దానికి మత భావజాలం ఎంతగా ఉపయోగపడుతుందో ఇజ్రాయెల్ దురాక్రమణ పట్లా, పాలస్తీనా ప్రజల పట్లా వ్యక్తమౌతున్న దళిత క్రైస్తవ వైఖరి కూడా ఒక ఉదాహరణ.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

2 thoughts on “అంబేద్కర్ ఇజ్రాయెల్ ను సమర్థించాడా!?

  1. జి లక్ష్మీ నరసయ్య గారి ఈ వ్యాసం చాలా వివరణత్మకంగా ఉంది. ఈ వ్యాసం చదవకముందు నేను ఇజ్రాయెల్ సామర్థ్యం మెచ్చుకున్నాను. అయితే ఈ వ్యాసం చదివాకా నా ఆలోచనలో మార్పు వచ్చింది. లక్ష్మి నరసయ్య గారికి అభినందనలు. కొలిమి నిజంగానే ఆలోచనను రగిలించింది 🙏డా కాకాని సుధాకర్

  2. అవసరమైన వ్యాసం. హింస గురించి మాట్లాడేటప్పుడు ఇర్గున్ గురించి కూడా ప్రస్తావించి ఉండాల్సింది.

Leave a Reply