‘అంటరాని వసంతం’ కథ వెనుక కథ

“మీ జీవిత కథ చెప్పండి” అని ఆమె అడుగుతుంది. దోస్తవిస్కీ నవల White Nights (శ్వేత రాత్రులు) లో. ” నా జీవితానికి ఏ కథా లేదు” అని అతనంటాడు. “ఏ కథా లేకుండా యింతకాలం ఎట్టా జీవించారు” అని ఆమె ఎదురు ప్రశ్న వేస్తుంది. ఇక్కడ మనం అనుకోవాల్సింది జీవితం, రచన వేరు కాదని.
నిజం. Life and fiction are inseperable. Life is experience. Fiction is expression… రచన వేరుకాదు. ఒకటి అనుభవం. ఒకటి అనుభూతి. ఒకటి నది. ఒకటి దాని ప్రవాహం – అంతే.

మనకి ఓ జీవితం వుంది. దానికి అనుభవం వుంది. మన జ్ఞాపకాల నిండా ఆక్రమించుకొని అనుభవం. ఆ అనుభవాన్ని రాసుకొంటూ పోదాం. అదో అద్భుతమైన రచనలా ముందు నిలుస్తుంది. రాయడం చేతరాదా? ఏం ఫర్వాలేదు. చెప్పుకుంటూ పోదాం మన పక్కవారికి, మన దగ్గరివారికి మనం చెప్పటం, వాళ్ళు వినటం ‘మనం మర్చిపోకూడదు. ప్రపంచంలో ఏ దేశ సాహిత్యం చూసినా దాని తొలి అడుగులన్నీ ‘చెప్పటం-వినటం’ తోనే మొదలయ్యాయి. పెరల్. యస్. బక్ తనకు నోబుల్ బహుమతి వచ్చినప్పుడు చైనా నవలని గూర్చి మాట్లాడుతూ అంటుంది “చైనాలోని నవల చదువురాని వాళ్ళు చదువురాని వాళ్ళకు చెప్పటంతో, వినడంతో మొదలై చివరకు రాజ మందిరా ల్లోకి వెళ్ళింది” అని.

‘అంటరాని వసంతం’లో నేను చేసిందంతా నన్ను నేను వెతుక్కోవడం. నా పరిసరాల్ని, నా వాళ్ళని, నా పూర్వీకుల్ని ముందుంచు కోవటం. అంతే. అంతే చేశాను. రాశాను. నాకు నా వాళ్ళు చెప్పింది. వాళ్ళకి వాళ్ళ ముందు వాళ్ళు చెప్పింది
ఆనందాలు…. అంతులేని దుఃఖాలు
అనుభవాలు…. అనుభూతులు… అన్నీ
జీవితాలు… వాటి జ్ఞాపకాలు
They loved, they lived, they liked, they disliked. జ్ఞాపకాలు. రూబేను చెప్పిన రూతు జ్ఞాపకాలు. జీవితం గొప్ప పోరాటం. యుద్ధం. అదే చెప్పి రూబేను వెళ్ళాడు. అదే చెబుతూ రూతు, రూబేనుల మనవడు జెస్సీ పోరాడుతున్నాడు. ఈ దేశంలో అంటరాని జాతులకి అనుభవం, దాని తాలూకూ జ్ఞాపకం అంతా యుద్ధంలాంటి ప్రయాణం. ప్రయాణం లాంటి యుద్ధం. ఆ యుద్ధం లాంటి ప్రయాణమే. అంటరాని వసంతం”. అవును జ్ఞాపకాలు…. వాస్తవాలు.

“In spite of its heavy autobiographical content, Kalyana Rao still terms it a novel” అని ఇంగ్లిష్ లోకి “Untouchable Spring” పేరుతో తర్జుమా చేసిన ఉమ, శ్రీధర్ లు అంటారు. నేను వాళ్ళ అభిప్రాయాన్ని కాదనను. అవును. నేను ముందే చెప్పినట్టు యిది నా కథ. మా అమ్మా నాన్నల, వాళ్ళ అమ్మా నాన్నల కథ. తరతరాల దళితుల జ్ఞాపకాల గొలుసు కథ. ఈ జ్ఞాపకం ఎప్పటిది? బహుశా ఈ నేలమీద భౌతికవాద విత్తనాలు చల్లి. వేదాల్ని, వేదాంతాల్ని, బ్రహ్మ జ్ఞానాలని ప్రశ్నించి రాజ్య హింసకు బలైన తొలి తరం తిరుగుబాటు దార్లయిన లోకాయతుల నాటిది కావచ్చు. చరిత్రలో రికార్డు కాని జ్ఞాపకాలు ఎన్నో.

నిన్న తమ మనుషులు చేసిన యుద్ధం తాలూకూ జ్ఞాపకాలు, ఈ రోజు వాళ్ళ బిడ్డలు చేస్తున్న యుద్ధం తాలూకూ వాస్తవాలు. మలుపు మలుపుకు పూసిన జ్ఞాపకాలు. పూసి రాలిన జ్ఞాపకాలు. రాలి మొలిచిన వాస్తవాలు. కథలుగా మలచుకొన్న జ్ఞాపకాలు. కవితలుగా అల్లుకొన్న జ్ఞాపకాలు… కల్లోలం సృష్టించుకొన్న వాస్తవాలు… అంతా యుద్ధమే. వళ్ళూ, యిల్లూ, ఆకలి, చెట్టూ, చేనూ… అంతా… అంతా యుద్ధమే.

ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరుగు తీసిన ఎల్లన్న మొదలు ప్రజల కోసం సాయుధమైన జెస్సీ దాకా. మడవ మీద కాలుపెట్టి పార పైకెత్తిన సుభద్ర మొదలు నీళ్ళలో చేపలా జనంలో కలిసి పోయిన రూబీ దాకా… అంతా యుద్ధమే, ఒక సుదీర్ఘ పోరాటమే.

సిన సుబ్బడు-చిన సుబ్బి, ఎల్లన్న-లచ్చిమి, ఎర్రెంకడు-లింగాలు, ఎంకట నర్సు-బూదేవి, పిట్టోడు-చిన్నమ్మి, ఎల్లన్న-సుభద్ర, శివయ్య-శశిరేఖ, రూబేను-రూతు, యిమ్మానుయేలు-మేరి సువార్త, జెస్సీ-రూబి,

మార్టిన్ -శారమ్మ, పోలడు-పోలడు భార్య, ఫ్రాన్సిన్-మరియ, సినసుబరాయుడు-ఎంకాయి, నారన్న, నారిగాడు, మాతయ్య, జింకోడు… మనిషి ఎవరైనా
కావచ్చు. తరం ఏదైనా కావచ్చు. వాళ్ళు మామూలు మనుషులు కావచ్చు. కవులు కావచ్చు. కళాకారులు కావచ్చు. మతం మారొచ్చు. కాస్తో కూస్తో మడి చెక్కకు యజమానులు కావచ్చు. ఎవరైనా కావచ్చు చిన్నోడు మార్టిన్ అయినా, పోలమ్మ శారమ్మ అయినా, శివయ్య సీమోను అయినా…. అంటరానితనం కాటెయ్యకుండా పోదు.

ఈ నేలమీద చాలా చరిత్ర నడిచింది. రాజులు పోయారు. మొగలాయి సామ్రాజ్యాలు, ఆంగ్లేయుల పాలన… ఆగస్టు 15, రి రాజ్యాలు పొయ్యాయి. మహమ్మదీయ దండయాత్రలు, 1947… ఎన్ని దశలు చూసింది దేశం. ఎంత మారింది దేశం!… అయినా కులం పోలా. కుల వ్యవస్థ చావలా.

                    2

History is a search for treasure (నిధి అన్వేషణ) అని అంటుంది రొమిల్లా థాపర్. నిజమే. చరిత్ర ఓ గొప్ప నిధి కోసం జరిపిన అన్వేషణే, ప్రశ్నల్లా..
What are the things recorded?
What are protected?
What are the things neglected and ignored?
What are supressed?
Why some are recorded, respected, protected and propogated ?
Why some are neglected, ignored, and mercilesly supressed ?
ఎందుకని? ఎందుకిలా కొన్ని విషయాలు రికార్డు చెయ్య బడ్డాయి. గౌరవించ బడ్డాయి. సంరక్షించ బడ్డాయి. ప్రచారం చెయ్య బడ్డాయి.

కొన్ని విషయాలు రికార్డుకు దూరం చెయ్యబడ్డాయి. పట్టించు కోకుండా వుండిపొయ్యాయి. నిర్దయగా తొక్కివేయబడ్డాయి. ఎందుకని? ఎందుకిలా? జవాబులు వెతకాల్సిన ప్రశ్నలు యివి. ఓసారి ప్రజాస్వామ్యవాదైన వాల్టేర్ నియంతైన ఫ్రెడరిక్ ది గ్రేట్ని జర్మనీలో కలిశాడట. ఆ యిద్దరూ ఒకరినొకరు పొగడు కొన్నారు. తమ స్నేహం చిరకాలం వర్ధిల్లాలని కోరుకొన్నారు. అయితే ఆ స్నేహం కొద్ది రోజుల్లోనే చెడిపోయింది. వాల్టేర్ తిరిగి ఫ్రాన్సు వెళ్ళాక తన జర్మనీ పర్యటనని గూర్చి తన మిత్రుడికి వో ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ‘but’ అనే పదాన్ని చాలాసార్లు వాడతాడు వాల్టేర్ – “It all may seem nice upon the surface – but; the tyrant may be charming and intelligent – but; the mechinery may work perfectly but !…. రాసుకొంటూపోతూ… Something is missing? అని ప్రశ్నించుకొని “The Human Spirit is missing”అని జవాబు చెప్పుకుంటాడా ఉత్తరంలో. వాల్టేర్ కు జర్మనీ పైకి చూడటానికి చాలా బాగుంది-అయితే, నియంత ఫ్రెడరిక్ వెలిగి పోతున్నాడు. గొప్ప మేధావి… అయితే, అక్కడి యంత్రాంగం చాలా సమర్థవంతంగా వుంది… ఐతే, ఏదో వెల్తి కన్పిస్తోంది. కావాల్సిందేదో కన్పించడం లేదు. మనిషి ఆత్మ అక్కడ వాల్టేర్ కు కన్పించలేదు.

భారతదేశ చరిత్రతో నాకున్న అనుభవం ఫ్రెడరిక్ని, వాల్టేర్ని గుర్తు చేస్తుంది. చాలా చరిత్ర చదివాను నేను. కొశాంబి…. రొమిల్లా… ముజుందార్…. స్మిత్… అయ్యంగార్…. సర్కార్… ఎల్ఫిన్ స్టోన్… వెంకటస్వామి… అట్లా భారతదేశ చరిత్ర తాలూకు చాలా చాలా మంది చరిత్రకారులు పుస్తకాలు చదివాను… ఎన్నో వేల పేజీలు… లక్షలాది వివరణలు… వాళ్ళు చాలా కొత్త కోణాలు తాకారు. చాలా కొత్త అంశాలు ముందుంచారు. కాని… కాని… something… something is missing. నా పేజీ కన్పించడం లేదు. దాని కోసమే వెతికాను. ఆ వెతుకులాటే “అంటరాని వసంతం”.

ఈ దేశ చరిత్రకి మట్టివాసన, మనిషి వాసన లేదు. కారణం ఒక్కటే. ఈ దేశ చరిత్రని బ్రిటీష్ వాళ్ళు రాశారు. బ్రాహ్మణ మేధావులు రాశారు. “అంటరాని వసంతం” లో చంద్రప్ప అన్నట్టు “తవ్వాల్సింది, పూడ్చాల్సింది” చాలావుంది. చరిత్రంతా దిబ్బలు, గుంటలు, గోతులు, లోయలు.

ఏ గోతిలో ఏ వాస్తవం విసిరేయబడ్డదో తెలీదు. ఏ దిబ్బ కింద ఏ బతుకులు శాశ్వత సమాధులయ్యాయో తెలీదు. ఏ లోయలో ఏ నాగరికత ఉరితీయబడ్డదో తెలీదు- మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా విభజించి, వేరుచేసి, వెలివేసి, అణచివేసిన కౌటిల్యం…. విసిరేయబడ్డ బతుకులు…. సమాధి చెయ్యబడ్డ జీవితాలు…. ఉరితీయబడ్డ నాగరికతలు, జాతులు…. తమిళ దేశంలో పెరియాలు, కన్నడలో హెూళీలు, మహారాష్ట్రలో మాంగ్లు, మహర్లు, భంగీలు, చమార్లు, తెలుగులో మాలలు, మాదిగలు… అట్లా అన్ని చోట్ల ఈ దేశం ప్రతిమూల అపవిత్రంగా అసహ్యంగా చూడబడ్డవాళ్లు. చరిత్రలో వీళ్ళ పేజీలు ఎక్కడ? అందుకే చరిత్రని నా పూర్వీకుల కోణం నుంచి చూడాలను కొన్నాను. అంటరాని వసంతంలో అదే పనిచేశాను. చరిత్రని మేధావుల కోణంలో చూడలేదు. మట్టి మనుషుల కోణంలో చూశాను.

ఈ దేశంలో వర్గం వుంది. దాని పక్కనే కులం వుంది. ఇక్కడ వీచే గాలికి, తాగే నీటికి, పారే పంట కాల్వకి, పండే భూమికి, బడికి, గుడికి, రచ్చబండకి… తినే తిండికి, వుండే ఇంటికి, కట్టే బట్టకి, మాటాడే మాటకి, సాహిత్యానికి, సంస్కృతికి, మతానికి, రాజ్యానికి, దాని చట్టానికి, న్యాయానికి, న్యాయ స్థానానికి, శవానికి, శ్మశాన వాటికకి, దేవునికి, దెయ్యానికి… అన్నిటికీ కులముంది.

చరిత్రలో చాలా అంశాలు నోట్ కాలేదు. అసలు ఈ దేశ చరిత్రే “అవునొపోల కాదొపోల సంకలనం”. కనీసం అక్కడా

ఆ “అవును కాదోల” సందుల్లో కూడా నేను లేను. నా పూర్వీకులు లేరు. మేము ఎందుకు అంటరాని వాళ్ళమయ్యాం? చరిత్ర పేజీలు వెతకండి. స్పష్టమైన జవాబు దొరికితే చెప్పండి. బకింగ్హామ్ కాల్వ తవ్వకాల్లో కులం పేరుతో కూలిపని కూడా ఇవ్వలేదు. భయంకరమైన కరువు సందర్భం అది. చరిత్రలో అది రికార్డు కాలేదు. చరిత్ర పేజీల్లో దొరకని ఆ సందర్భాన్ని చర్చి రికార్డుల్లో వెతకాల్సి వచ్చింది.

నాగరికుల బ్రాహ్మణ మతం (నాగరికులు అనే పదం నాది కాదు, కోశాంబిది) బలమైన బ్రాహ్మణవాదంగా ముందుకొచ్చింది. ఆ వాదం “యింతై వటుడింతై” అన్నట్టు బ్రాహ్మణ సామ్రాజ్య వాదంగా విశ్వరూపం దాల్చింది. ఆ విశ్వరూపం పడగ నీడలో సాగిన చరిత్రని, సంస్కృతిని, సాహిత్యాన్ని, అవి వక్రీకరించిన దుర్మార్గాన్ని ఎత్తి చూపకుండా భారతదేశ చరిత్రని, సంస్కృతిని, సాహిత్యాన్ని మాట్లాడటం సరైంది కాదనుకొంటాను. అందుకే సమస్త చరిత్రని సరికొత్తగా అధ్యయనం చెయ్యమని ఏంగిల్సు చెప్పింది.

ఇంకా కులముందా అని ఆశ్చర్యపడేవాళ్ళున్నారు. నేను గొప్పగా గౌరవించే ఓ ప్రొఫెసర్ వున్నారు. ఆయన అన్నారు “మిస్టర్ రావ్. ఇది కంప్యూటర్ ఏజ్. ఈ కంప్యూటర్ ఏజ్లో కూడా కులమా?” అని. నేను అందుకు చాలా వినయంగా అన్నాను. “సార్ నిజమే. ఇది కంప్యూటర్ ఏజే… but Sir! caste is computarised. కులం కంప్యూటరైజ్డ్ డయ్యింది. అంతే కాదు. మనువుకు ఆయన సొంత వెబ్ సైట్ వుంది అని” అని.

మనది బ్రహ్మ జ్ఞానంతో, చాతుర్వర్ణ కుల వ్యవస్థతో కూడిన పవిత్రమైన దేశం. మనువు, కౌటిల్యుడు గతం కాదు. వర్తమానం. వాళ్ళ బోధనలు, సూత్రాలు, ధర్మాలు గతాలుకావు, వర్తమానాలు. కుల వ్యవస్థ ఇక్కడ కట్టుదిట్టమైన ఆర్గనైజ్ఞు ఫోర్సు. భగవద్గీత కులాన్ని తప్పుపట్టలేదు. చాతుర్వర్ణాన్ని నేనే సృష్టించానని భగవద్గీతలో శ్రీకృష్ణులవారే చెప్పారు. మర్చిపోవద్దు. కృష్ణుడు రంగస్థలంమీద కేవలం పాత్ర మాత్రమే. ఆ పాత్ర రచయిత, దర్శకుడు, ప్రామ్టింగ్ చెప్పేవాడు బ్రాహ్మణ మతవాది. ఆ భగవద్గీతని పవిత్రంగా చూసే శంకరాచార్యులు, తిలక్లు, గాంధీలు, సర్వేపల్లి రాధాకష్ణలు, కోర్టులు వున్నంతకాలం కులం పోదు. అత్యంత ఆధునికంగా వుంటుంది. గాంధీగారు కుల వ్యవస్థని తప్పుపట్టలేదు. కాని అంటరానితనం పోవాలన్నారు. కుల వ్యవస్థ పోకుండా అంటరానితనం ఎలా పోతుంది? అందుకే డా. బి. ఆర్. అంబేడ్కర్ అన్నారు “Beware of Gandhi”. “గాంధీ ఉన్నాడు జాగ్రత్త” అని.

                3

“అంటరాని వసంతం” లోని శిల్పాన్ని గూర్చి చాలామంది. మాట్లాడారు. దీనిలోని శైలి, శిల్పం మీద విశ్వ విద్యాలయాల్లో ఎం.ఫిల్. చేశారు. పిహెచ్.డి. లు చేశారు. ఈ శిల్పానికి, శైలికి చాలా రకాల పేర్లు పెట్టారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు మెచ్చు – కొన్నారు. ఆ క్రెడిట్ మొత్తం నాదికాదు. మా అమ్మమ్మది. నా కన్నతల్లి నా పదకొండో నెలలోనే చనిపోయింది. అప్పటి నుంచి మా అమ్మమ్మ ఒడిలోనే పెరిగాను నేను. ఆమె నన్ను నిద్ర పుచ్చుతూ కథలు చెప్పేది. పాటలు పాడేది., ఆమె చెప్పే కథలు, పాటలు ఆమె అల్లినవే. ఆమెకు చదవను రాదు. రాయను రాదు. కాని అద్భుతంగా అల్లేది. ఒకే కథని రోజులు తరబడి డైలీ సీరియల్లా నాకు నిద్రొచ్చేంతవరకు చెప్పేది. నాది ఆ అల్లిక వారసత్వం. ఆమె అల్లికలో అద్భుతమైన శిల్పం వుండేది. ఆమె చిన్ని చిన్ని వాక్యాల్లో కథ చెప్పేది. ఆ శిల్పాన్నే… ఆ శైలినే… ‘అంటరాని వసంతం’ లో వాడాను చెప్పటం, వినటం ఎంత అద్భుతమైందో మా అమ్మమ్మ నాకు నేర్పింది., ఆమె ‘ఓ హెన్రీ’ కన్నా గొప్ప కథకురాలు. ఆమె చెప్పటంలో ఓ పట్టు వుంది. ఓ రిథమ్ వుంది. ఆమె కథ చెబుతుంటే కవిత్వం చెప్పినట్టు వుంటుంది. అదే నేను నా నవలలో ఉపయోగించాను. గాయకుడికి, శ్రోతకి వున్న సంబంధం అది. అల్లిక వారసత్వం – ఎంత గొప్పదో అంటరాని వసంతం రుజువు చేసింది.

మా పూర్వీకులు వీధి బాగోతాలు ఆడేవాళ్ళు. మా నాన్నవైపు వాళ్ళు ఆడేవాళ్ళు. మా అమ్మవైపు వాళ్ళు ఆడేవాళ్ళు. చెంచులక్ష్మి నాటకం ఆడటంలో వాళ్లకు పెద్ద పేరుంది. నా “తెలుగు నాటకం మూలాలు” అనే పుస్తకంలో వివరంగా రాశాను. తెలుగు నాటకానికి మూలం వీధి భాగోతం. “చెంచులక్ష్మి” లో చెంచు 0 లక్ష్మి పాత్ర చాలా గొప్ప వ్యక్తిత్వమున్న పాత్ర. మన విశ్వ విద్యాలయ పరిశోధకులు, విమర్శకులు వసంతసేనని, మధుర వాణిని ఆకాశాలకు ఎత్తారుగాని చెంచులక్ష్మిని పట్టించుకోలేదు. కారణం ఒక్కటే అది దళితులు అల్లుకున్న పాత్ర. దళితులాగే , ఆ పాత్ర అంటరానిదయింది. ఈ దేశంలో సాహిత్యానికీ కులం వుంది.

బ్రెట్, బోల్ నాటకాల కన్నా మాలల వీధి భాగోతాలు, మాదిగల చిందు భాగోతాలు, యానాదుల, ఎర్రగొల్లల వీధి భాగోతాలు చాలా ఆధునికమైనవి – విమర్శకులు దీన్ని గుర్తించ లేదు. నవలలో రూతు అన్నట్టు “గుర్తించడం కాదు. గుర్తించడానికి యిష్టపడకపోవటం” అది. రూతు మాటల్లోనే చెప్పుకుంటే “ఎంతో సత్తావుంటే తప్ప ఆ కులాల (మాలా, మాదిగ) వాళ్ళు గుర్తింపు పొందరు. పరిచయానికి నోచుకోరు. చరిత్ర వాళ్ళని తన పేజీల్లో రాసుకొన్నట్టు దాఖలాలు లేవు. ఈ దేశంలో కళకన్నా కులం ముఖ్యమైంది. కళని కూడా కులం తక్కెట్లో తూచారు. వీళ్ళని మాత్రం తూకానికే కాదు, అసలు తక్కెడదాకా రాకుండానే చేశారు”.

నిజమే రూతు అనేకసార్లు అనుకొన్నట్టు “భూమ్మీద యిన్ని పాటలు పుట్టాయి. ఈ పాటలకి ప్రాణం పోసిందెవరు? ఈ ప్రాణానికి రాగం ఇచ్చిందెవరు?”…. అన్నీ ప్రశ్నలే. అన్వేషించా ల్సిన జవాబులే.
అనుభవాల్లో తేడాలుంటాయి. మనిషికి మనిషికి మధ్య, వర్గానికి వర్గానికి మధ్య, కులానికి కులానికి మధ్య, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య… చాలా తేడాలుంటాయి. నా పూర్వీకులు ఊరి బయటే నివసించారు. చాతుర్వర్ణ పరిధిలో వాళ్ళు లేరు. కాని వాళ్ళు మహోన్నత సంస్కృతికి వారసులు. గొప్ప కళా కారులు. గొప్ప కవులు. పద్యాలు అల్లారు. పాటలు అల్లారు. నటనకు నాట్యానికి రూపమిచ్చారు. కళని, కవిత్వాన్ని, దేవాలయాల్లో, రాజ సభల్లో బందీలను చెయ్యలేదు. ఆరుబయట, అందరి మధ్య, తెరలు లేకుండా, జనం మధ్య, జనంలో భాగంగా ఆడారు. పాడారు. వాళ్ళకు చదువురాదు. చదివితే సీసం పోస్తామన్నారు చాతుర్వర్ణ సృష్టికర్తలు. రాత రాదు. అయినా అల్లారు, అల్లుకున్నారు. ఈ నేలమీద ఓ గొప్ప అద్భుతాన్ని అల్లుకుంటూ దేశాలు తిరిగారు. గ్రీకు సాహిత్యంలో హెూమర్ లాంటి సంచార గాయకులున్నారు. తెలుగు నేలమీద “సంచార భిక్షకుల్లా” ఎందరో అంటరాని హెూమర్లు. వాళ్ళు బతుకును కయి కట్టారు.

అంటరాని వసంతంలో – ఎల్లన్న, కుమ్మరి కోటేసు ఇలా మాట్లాడుకొంటారు.

“ఎక్కడ నేర్చావు ఈ ‘కత’ని”
“నేను కయి కట్టాను”
“నీ ‘కత’ లో మాటకి పాటకీ లంకె వుంది”
“వాలు వరుస అది”
“ఆటవాలు అంటాం. మా దేశంలో”
“మేం మా దేశంలో ‘వాలు వరుస’ అంటాం”

కత, కయికట్టడం, లంకె, వాలువరుస, ఆటవాలు, అచ్చమైన తెలుగు పదాలు. వాడుక భాషంటే అది…. జానపదం అంటూ జనరలైజ్ చేశారు దీన్ని,

పల్నాటి యుద్ధం మొదట మాల కన్నమదాసు వారసులు అల్లి పాడారు వీరగాథలా. కాటంరాజు కథని మొదట మాదిగ గోసంగి వీరుడు బీరనీని వారసులు అల్లిపాడారు వీరగాథగా. వాటినే శ్రీనాథుడు తన రాతలో రికార్డు చేశాడు. మూల రచయితలు ఎటో పొయ్యారు. రికార్డు చేసిన వాళ్ళు అసలు రచయితలయ్యారు. జానపద భ్రమని కలిగించిన రామదాసు, జానపదాన్ని అనుకరించిన అన్నమయ్య, బతుక్కి పాటకి గండి కొట్టిన త్యాగయ్య, క్షేత్రయ్య వాగ్గేయకారులుగా చరిత్రలో ఆకాశానికి ఎత్తబడ్డారు. అసలైన ప్రజల గొంతుతో పాటను, మాటను, బాణీని విన్పించినవారు అంటరాని హెూమర్లయ్యారు-అణగతొక్కబడ్డారు.

తక్కువ కులాలుగా, జాతులుగా నెట్టివేయబడ్డవాళ్ళు తమ పనిపాటలతోపాటు, జీవితంలో ఒక భాగంగా తమ కళని, సాహిత్యాన్ని సృష్టించుకొన్నారు. కూడు, గూడు, నీడ లాగే వాళ్ళ జీవితంలో ఆట, పాట, మాట పుట్టి పెరిగాయి. రాతకు ముందే ఈ నేలమీద జరిగిన అద్భుతమది. తమ చెమటతో ఈ నేలమీద సంపదల్నేకాదు, సాహిత్యాన్ని కూడా సృష్టించారు వాళ్ళు.

దోపిడీ వర్గాలు, దోపిడీ కులాలు కృత్రిమ కళని. కృత్రిమ సాహిత్యాన్ని, కృత్రిమ సంస్కృతిని వాళ్ళ ఆధిపత్యం కోసం – సృష్టించారు. వాళ్ళు సాహిత్యంలో ఆదికవుల్ని, పితామహుల్ని, మాతామహుల్ని సృష్టించారు. ఈ దేశంలో ‘కులం’ అన్ని పెట్టుబడులకన్నా గొప్ప పెట్టుబడి. ఎవరీ ఆదికవులు? ఎట్టా అయ్యారు?

నేను కవిని కాదు. కవిత్వం మాట్లాడటం తప్ప రాయటం చాతరాదు. నేను అల్లిక వారసత్వం నుంచి వచ్చాను. కాని నేను అల్లుకొన్న నాలుగు పాదాల్ని మీముందు ఉంచుతాను-
మా అయ్య అల్లిందాన్నే
వాడయ్య రాసేడు
అల్లిక అంటరానిదైంది
రాతేమో రాజై కూసుంది
తెలుగు కవిత్వాన్ని, కథని, నవలని, నాటకాన్ని, విమర్శని… అనుకొన్నప్పుడల్లా వాటి మూలాలు వెతికినప్పుడు నాకు ఆ నాలుగు పాదాలు నిజమనిపిస్తాయి. విషయం చిన్నదే కాని చంద్రప్ప అన్నట్టు తవ్వాల్సింది. పూడ్చాల్సింది చాలా వుంది.

అనుకుంటే నెత్తురు మండుతుంది. కళ్ళు వర్షిస్తాయి. ఆ నెత్తుటి మంటల కన్నీటి సంద్రమే “అంటరాని వసంతం”.

అంటరాని వసంతాన్ని Alex Hailey “Roots”తో పోల్చారు కొందరు. Mine is not a search to find out the roots of my own family.
“Roots” నవలల్లో ఒకటి. ఐతే అంటరాని వసంతంలో నేను చేసిన అన్వేషణంతా నా సొంత కుటుంబం మూలాలకోసం కాదు. వెంటాడే ప్రశ్నలకు జవాబుల కోసం. నా అన్వేషణలో చరిత్ర వుంది. సంస్కృతి వుంది. సాహిత్యముంది. సమాజం వుంది. దాన్ని ఏలుతున్న చాతుర్వర్ణ వ్యవస్థ వుంది. దాని మీద నా జనం చేసిన నిరంతర పోరాటముంది.

నా పూర్వీకులు చాలా పోగొట్టుకొన్నారు. దాన్నే వెతుకు తున్నాను నేను. మా ముత్తాతలు వెతికారు. వాళ్ళ ముత్తాతలు వెతికారు. మా అమ్మమ్మలు వెతికారు. వాళ్ళ అమ్మమ్మలు వెతికారు. మా తాతలు వెతికారు. మా నానమ్మలు, అమ్మమ్మలు వెతికారు. మా నాన్నలు వెతికారు. మా అమ్మలు వెతికారు. ఇప్పుడు మేము వెతుకుతున్నాం. వెతగ్గా – వెతగ్గా – ఆ మూల నుంచి ఈ మూలదాకా వెతగ్గా ఈ నేలమీద ఎంత భూమిని పోగొట్టుకొన్నామో తెలిసింది. ఈ పవిత్ర దేశంలో మా ఆత్మ గౌరవానికి ఎన్ని సిలువలు వేశారో, ఎన్ని సీలలు గుచ్చారో, ఎంత నెత్తురు వరదలై పారిందో తెలిసింది.

ఈ భూమికి తొలి పుత్రులు నా పూర్వీకులు కాదా?
Are not my ancestors, the first inhabitants of this land?
ఎందుకు? ఎందుకు? ఎందుకీ భూమి పుత్రులు, the real owners of this land, the sons and daughters of the soil – are neglected… అమానుషంగా ఎందుకు తొక్క బడ్డారు. ఎందుకు అంటరానివారయ్యారు. ఎందుకు భూమిలేని నిరుపేదలయ్యారు. a search… ఓ అన్వేషణ ఇది.

ఆఫ్రికన్ రచయిత గూగీ “రివర్ బిట్వీన్” నవలలో నదికున్న ఆవలివొడ్డు పాశ్చాత్య సంస్కృతి, ఈవలివొడ్డు ఆఫ్రికన్ సంస్కృతి అంటాడు. ఈ దేశంలో వున్న పవిత్ర నదులకున్న “వొడ్డు” ల్లో ఏ వొడ్డు నాది అని బ్రాహ్మణీయ సంస్కృతి చెప్పింది? విచిత్ర మేమిటంటే ఈ నదులు, వొడ్లు వాటి పరిసరాల్లో కురిసిన తొలి వసంతం, తొలి నాగరికత నిర్మాతలు నా పూర్వీకులు. దాన్ని ధ్వంసం చేశారు బ్రాహ్మణ సామ్రాజ్యవాదులు. కులం పునాదుల మీద అమానవీయ, అనాగరిక వ్యవస్థను స్థాపించారు. దాన్ని కాపాడుకోవటానికి అనేక కుట్రలు, అణిచివేతలు.

నిజానికి అట్టడుగు వర్గాల సంస్కృతి ఎవరికన్నా తక్కువ కాదు. మిమ్మల్ని సంస్కరిస్తాం మేము అని ఏ సంస్కరణవాది అన్నా నేను అనేది ఒక్కటే మాట. వద్దు. మమ్మల్ని సంస్కరించ వద్దు. నా సంస్కృతికన్నా నీ సంస్కృతి ఎక్కువ కాదు. నేను నీకు అంటరానివాడినైతే నువ్వు నాకు అంటరానివాడివి. ఆకలి, ఆత్మ గౌరవం రెండూ మాకు పోరాటాలు. పోరాటం మాకు ఆదర్శం కాదు. అవసరం. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటరాని వసంతం. ఇంత జీవితం దీనికి ప్రేరణ. నా పూర్వీకులు, వాళ్ళ మహోన్నత సంస్కృతి, కళలు, సాహిత్యం, సహజమైన మానవ సంబంధాలు, పోరాటం అంతా ఓ చుక్కల ముగ్గుకర్ర. అంతే. అల్లుకొంటూ పొయ్యాను.

నిజం ఈ దేశ సంస్కృతిని, చరిత్రని, సాహిత్యాన్ని, సమాజాన్ని, ఆధిపత్యాన్ని అనుకొంటే… అత్యంత క్రూరమైన వేట నా ముందు నిలుస్తుంది. అంతేకాదు ఆ వేటాడిన వేటగాళ్ళ గొప్పతనాల చిట్టా ఈ నేలంతా చరిత్ర పేరుతో పరుచుకొని వుంది. ఓ సుదీర్ఘ మారణహోూమ కాలమంతా ఈ వేటగాళ్ళు చేసిందంతా తాము అనుకొన్న మనుషులపైన, సమూహాలపైన, జాతులపైన, వాళ్ళ సమస్తంపైన దాడి చెయ్యటం. అంతేకాదు తాము అనుకొన్న ధర్మాలని, చట్టాలని, నియమాలని, తీర్పుల్ని ఇతరులపైన రుద్దడానికి తమకున్న క్రూరమైన వేటని హక్కుగా వినియోగించుకోవటం. వేటని హక్కుగా భావించారు వాళ్ళు. ఆ హక్కు సహజమైందన్నారు. పవిత్రమైందన్నారు. ధర్మబద్ధ మైందన్నారు. ప్రశ్నించడానికి వీలులేని దన్నారు. ఏ శిక్షకూ జవాబుదారి కాదన్నారు.

విషాదమంతా ఎక్కుడుందంటే ఎక్కడ చూసినా ఆ వేటగాళ్ళ విగ్రహాలే. చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్యంలో అన్నిచోట్లా ఆ క్రూరమైన వేటగాళ్ళ విగ్రహాలే. ఆ విగ్రహాల ధ్వంస రచన జరిగితే తప్ప ప్రజల చరిత్ర, ప్రజల సంస్కృతి, ప్రజల సాహిత్యం, ప్రజల జీవితం తాలూకు ఆనవాలు దొరకవు. అందాకా ఈ వేటగాళ్ళు విజేతలే. అశేష జనసందోహం మాత్రం ఆ వేటగాళ్ళ ధర్మసూత్రాలు చెప్పినట్టు ఓడిపోవటానికి పుట్టిన అసంఖ్యాక పరాజితులే.

వేదం ఇంటర్నెట్లో అత్యంత ఆధునికంగా వుంది. యజుర్వేద కాలంనాటి పురుషసూక్తం వర్గాలు, వర్ణాలు, కులాలు, కలిమిలేములు పూర్వజన్మ సుకృతమని టిట్టర్ల సాక్షిగా, ఫేస్బుక్ల సాక్షిగా చెప్తూనే వుంది.
5

నా స్నేహితులు అడిగారు; కొందరు సాహితీ విమర్శకులూ అడిగారు – “నువ్వు నవల చివరలో జెస్సీని ఎందుకు సాయుధ పోరాటంలోకి పంపావు” అని.
నిజానికి జెస్పీని నేను సాయుధ పోరాటంలోకి పంపలేదు. అతనంతట అతనే వెళ్ళాడు. అతని తండ్రి యిమ్మానుయేలు పోరాటంలోకి వాళ్ళు వెళ్ళటం నేను యిష్టపడ్డాను. సాయుధ కూడా శ్రీకాకుళ పోరాట మార్గాన్నే ఎన్నుకొన్నాడు. సాయుధ పోరాటం మీద నాకు గట్టి నమ్మకముంది. ఈ దేశంలో పేదల పక్షాన నిలబడి పోరాడుతోంది విప్లవోద్యమమే అని నా నమ్మకం. అందుకే యిమ్మానుయేలు శ్రీకాకుళ పోరాటంలోకి వెళ్ళడాన్ని, జెస్సీ నల్లమలకి వెళ్ళడాన్ని నే స్వాగతించాను.

యిమ్మానుయేలు తల్లి రూతు కూడా తన బిడ్డ శ్రీకాకుళం వైపు ఎందుకు అడుగులేశాడు అని ఆలోచిస్తుంది. ఆమెకు తాను చదివిన “భూమితో మాట్లాడు. అది జ్ఞానాన్ని యిస్తుంది” అనే 0% వాక్యం గుర్తొస్తుంది. భూమి తన బిడ్డతో మాట్లాడింది. భూమితో తన బిడ్డ మాట్లాడాడు. భూమి అతనికి బోలెడు రహస్యాలు చెప్పింది. భూస్వాముల చెరనుండి తనని విడిపించి తన కిష్టమైన పేదల సొంతం చెయ్యమని అడిగి వుంటుంది. అందుకే తన బిడ్డ అడుగులు శ్రీకాకుళం వైపు వెళ్ళి వుంటాయి అని అనుకొంది రూతు.

ఈ దేశంలో దళితుల విముక్తికి, అన్ని కులాల్లో వున్న పేదల విముక్తికి, సాయుధ పోరాటం వక్కటే సరైన మార్గమని నా విశ్వాసం. నవల కావచ్చు, కథ కావచ్చు. అది ఏదైనా కావచ్చు. జీవితం దానికి వస్తువు. పాత్రల్ని రచయిత సృష్టించడు. సమాజంలో వున్న మనుష్యుల్నే పాత్రలుగా తీసుకొంటాడు. చారుమజుందార్లూ, వెంపటావు సత్యాలూ, పులి అంజన్నలూ, ఆదిరెడ్లూ, సంతోష్ రెడ్లూ, నరేష్ లూ, కిషన్ జీలూ- రచయితలు సృష్టించిన పాత్రలు కాదు. నా నవలలో జెస్సీ కూడా అంతే. నేను సృష్టించిన పాత్ర కాదు. ఈ సమాజంలో నాకు దొరికిన విప్లవ సందేశం జెస్సీ.

నవలలో రూతు అన్నట్టు ప్రతిదీ పోరాటమే. ప్రతిదీ యుద్ధమే. చుక్కల్లో ఎల్లన్న సుభద్రని చూశాడు. అదే చుక్కల్లో అతని వారసుడు జెస్సీ అమరుల్ని చూశాడు. వాళ్ళ అమరత్వాన్ని చూశాడు. తన నానమ్మ రూతుకు రాసిన ఉత్తరంలో జెస్సీ అంటాడు : “ఎత్తయిన కొండల మీద యిట్టా పడుకొని అట్టా ఆకాశంలోకి చూస్తే ఎన్ని చుక్కలు. ఆ చుక్కలకి మా అమరుల పేర్లు పెట్టుకొంటాం మేము. ఆదమరచి నిద్రపోయినా ఆ చుక్కల వెలుతురు మామీద కురుస్తూనే వుంటుంది” అని. ఎన్నెట్లో చుక్కల్ని చూడటం నాకు చాలా యిష్టం. మనిషి పక్షాన నిలబడే చారిత్రక బాధ్యతే సాయుధ పోరాటం. అమరులు చిందించిన నెత్తురు వృథా కాదు. అందుకు ఆ చుక్కల వెలుతురే సాక్షి.
6

1999లో “అరుణ తార” లో సీరియల్ గా ప్రారంభమైంది ‘అంటరాని వసంతం’ ప్రస్థానం. ఏ వర్గం జీవితం అంటరాని వసంతంలో వర్ణించానో ఆ వర్గాలు ఈ నవలని గుండెలకు హత్తుకొన్నాయి. గొప్ప అంశమేమిటంటే పల్లెల్లో ఈ నవలని ఒకరు చదువుతుంటే పదులుగా గుంపులుగా కూర్చొని విన్నారు.

“అంటరాని వసంతం” 2000లో నవల రూపంలో తెలుగులో వచ్చింది. 2004లో “తీనా దాద వసందం” పేరుతో తమిళంలో తర్జుమా అయింది. 2010లో ఇంగ్లీష్ “Untouchable Spring” పేరుతో వచ్చింది. 2010లో కన్నడంలో “అస్ప్రుశ్య వసంతం” పేరుతో వచ్చింది. 2011లో “తీన్దాద వసంతం” పేరుతో మళయాళంలో వచ్చింది. అదే సంవత్సరం “అచ్యుత్ వసంత్” పేరుతో హిందీలో వచ్చింది. ఇప్పుడు మరాఠీ, పంజాబీ, గుజరాతీ, వరియా, ఉర్దూ, బెంగాలీ భాషల్లో తర్జుమా మొదలైంది. ఇంగ్లీష్ కాకుండా మరికొన్ని ప్రపంచ భాషల్లో వచ్చే అవకాశం వుంది.

అంటరాని వసంతం జీవితం తాలూకూ రఫ్ నోట్సు. ఆ నోట్సు ఇంకా వుంది. మూడు భాగాలు రాద్దామనుకున్నాను. మొదటి భాగం రాయాల్సి వుంది. మూడో భాగం రాయాల్సి వుంది. అంటరాని వసంతం నేను తయారు చేసుకొన్న రఫ్ నోట్సులో రెండో భాగం. మిగిలిన రెండు భాగాలు పూర్తి చేస్తాను. నా పూర్వీకులు వదలి వెళ్ళిన బోలెడు అల్లిక వుంది. దాన్ని బయటకు తీసుక రావాల్సి వుంది.

ఏది చేసినా నాకు జీవితం, రచన, పోరాటం వేరుకాదు. ఈ భూమ్మీద మనిషి హృదయంలో మంచి భవిష్యత్తు మీద విశ్వాసాన్ని పెంచాలి. అట్టా పెంచడం మంచి రచన బాధ్యత, కర్తవ్యం. ఈ నేలమీద మంచి సమాజాన్ని కలలు కనే పోరాట యోధులున్నారు. వాళ్ళ కలలన్నీ ఓ విప్లవ సంకలనం. ప్రేమ, పోరాటం, త్యాగం ఆ సంకలనం నిండా అల్లుకొని వుంటాయి. వాళ్ళు విజయాన్ని చవి చూస్తారు.నా విశ్వాసం చిన్నది కాదు. వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు.

నా నమ్మకం వొమ్ము కాదు. నా రచన, నా జీవితం, నా భవిష్యత్ ప్రణాళిక అక్కడే వుంటాయి. అంటరాని వసంతంలో రూతు జ్ఞాపకం యుద్ధంలో విశ్రమిస్తుంది. నా రచనా అంతే. యుద్ధంలోనే, నా విశ్రాంతి యుద్ధంలోనే, శ్వాస ఆగినా, కలం ఆగినా అక్కడే. నా భవిష్యత్ ప్రణాళిక నా చేతిలో లేదు. ప్రజల చేతిలో వుంది. వాళ్ళ పోరాట మార్గంలో వుంది. అంతా ఓ నడక. నా నడకకి చేయూత నా సహచరి, నా అమృత…. బతుకులో, రచనలో….

కవి, రచయిత, విమర్శకుడు. నాటక కర్త. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. కాలం (కవిత్వం), 2. అంటరాని వసంతం(నవల), 3. నేనేమడిగానని(కథలు), 4. తెలుగు నాటక రంగ మూలాలు, 5. ఆఖరి మనిషి అంతరంగం.

Leave a Reply