సంకెల

తెరమీద హాయిగా సాగుతోంది పాట. లీనమయి చూస్తోంది రమ. గతంలో చూసిన సినిమానే అది. అయినా మళ్ళీ చూద్దామని ఫ్రెండ్ని లాక్కొని మరీ వచ్చింది. ఆర్ట్ మూవీ కావడంతో హాల్లో ఏ గోలలూ ఈలలూ లేకుండా ప్రశాంతంగా ఉంది. అంతా లీనమయి చూస్తున్నప్పటికీ ఆమె చేతికి తగిలిన స్పర్శవల్ల చటుక్కున చేయిని వళ్ళోకి లాక్కొంటూ పక్కకు తిరిగి చూసింది.

విషయం అర్ధం కావడానికి క్షణం కూడా పట్టలేదు రమకి. ఒళ్ళు మండిపోయింది. అయినా యాంత్రికంగా తెరవైపు చూస్తుండిపోయింది. కొన్ని క్షణాలు గడిచాయో లేదో…. ఈసారి రమ కాలికి వాడి కాలు తాకుతోంది. కాలు జరుపుకొంది. చిరాకు పెరుగుతోందామెలో. సినిమావైపు మనసు పెట్టలేక పోతోంది. ఆమెకిష్టమైన చరణం వస్తోంటే తెరవైపు చూడకుండా తన బ్యాగు కోసం చూసుకుంది. వళ్ళో బ్యాగులేదు. ఫ్రెండ్ దగ్గరున్నట్లు గుర్తొచ్చింది. ఫ్రెండ్ వైపు వొరిగి “రాధా! బ్యాగులో పిన్నుంది తీసివ్వు” గుసగుసగా అంది.

విషయం కొంత అర్థమయిందేమో “పిన్నెందుకే ఇప్పుడు” మెల్లగా అంది రాధ.

“పక్క సీటువాడు పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నాడే.”

రమ పిన్నెందుకు అడిగిందో పూర్తిగా అర్థమయింది రాధకు. “గొడవవుతుందేమో” అంది సంశయంగా.

“అవుతే అవనీ” లక్ష్యం లేనట్టుగా అంది రమ.

“అందరూ సైలెంట్గా సినిమా చూస్తున్నారు, గొడవైతే బాగుండదేమో”

“వాడు నామీద చేతులేయడం మాత్రం బావుంటుందా? నోర్మూసుకుని పిన్నివ్వవే”

“ఓసారి చెప్పి చూడరాదు” పిన్నుకోసం వెతుకుతూ అంది రమ.

“చెప్తా, వాడికర్థమయ్యే భాషలోనే చెప్తా” అంటూ రాధ చేతిలోంచి పిన్ లాక్కుంది.

మళ్ళీ తెరవైపు చూస్తుండిపోయారు స్నేహితురాళ్ళిద్దరూ. తెరవైపు చూస్తున్నారే కానీ సినిమా ఏ మాత్రం బుర్ర కెక్కడం లేదు. ప్రత్యర్థి దాడిని తిప్పికొట్టడానికి ఎలర్ట్ వుంది రమ. గొడవవుతుందేమోనని భయపడుతూ ఉండిపోయింది రాధ.

“ఛ! ఇష్టమైన సినిమా ఇష్టమైన రీతిలో చూసే అవకాశం లేదు” బాధపడ్డాయి ఇద్దరి మనసులూ.

కొన్ని నిమిషాలు గడిచాక రమ చేయిమీద చేయి పడింది. ఏమాత్రం కదల్లేదామ్మాయి. ఏ వ్యతిరేకతా రాకపోవడంతో ఆ చేయి నెమ్మదిగా నెమ్మదిగా కదులుతూ రమ ఒడిలోకి జారసాగింది. కుడిచేత్తో సిద్ధంగా పట్టుకున్న పిన్నుతో నిర్దాక్షిణ్యంగా గుచ్చిందాచేతిని రమ. చటుక్కున చేయి వెనక్కి వెళ్ళిపోయింది. కిక్కురుమనికూడా అన్లేదు వాడు.

ఓ రెండు నిమిషాలైనా గడవకముందే సీట్లోంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు.

“రోగం తిరిగింది వెధవకి” కోపంగా అంది రమ.

“ఏయ్! గుచ్చావా పిన్నుతో?” ఆతృతగా అడిగింది రాధ.

“అహ, గుచ్చక ఊరుకుంటాననుకున్నావా?” ఈసారి రమ గొంతులో విజయంతో కూడిన నవ్వు ధ్వనించింది.

గొడవవుతుందేమోనని భయపడ్డ రాధ ఊపిరి పీల్చుకుంది. ఇంతలో ఏదో గుర్తొచ్చి “వాడు హాలు బయట పట్టుకొని గొడవ చేస్తాడేమో” అంది.

“ఆ! వాడి మొహంలే! ఇంతమందిలో మనల్నేం చేస్తాడు. అయినా వాడేం గుర్తుపడతాడు మనల్ని” ధీమాగా అంది.

గొడవవుతుందేమోనని మొదట భయపడినా “తగిన శాస్తి జరిగింది వెధవకి” అనుకుంది మనసులో రాధ.

ఇద్దరూ మళ్ళీ సినిమా చూడ్డంలో మనసుల్ని నిమగ్నం చేయ ప్రయత్నించసాగారు.

బస్సు నిండా జనం. తొక్కిసలాడుతోన్న జనం. ఉక్కిరిబిక్కిరవుతోన్న జనం. ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న జనం. చిన్నా పెద్దా, ఆడా మగా అన్ని వయసుల వాళ్ళూ అన్ని రకాల వాళ్ళూ స్కూళ్ళ నుంచీ, ఆఫీసుల నుంచీ, సినిమాహాళ్ళ నుంచీ ఎక్కడెక్కడినుండో వస్తోన్న జనం.

అప్పటిదాకా ఆఫీసు పనితో మనసూ, శరీరమూ అలసి పోయినప్పటికీ ఇంటికెళ్ళి ఓ క్షణం రెస్ట్ తీసుకుందామని ఆలోచించకుండా అంత గందరగోళంలోనూ, అంత తొక్కిసలాటలోనూ ఉక్కిరి బిక్కిరవుతూ కూడా ఇంటికెళ్ళి చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. దొరకని రెస్ట్ గురించి ఆలోచించడం వేస్టని వాళ్ళకెప్పుడో అనుభవంలోకొచ్చుంటుంది.

కాలు పెట్టడానికే కష్టంగా వున్న రద్దీలో భుజాలమీద మూటెడు పుస్తకాలతో పిల్లలు. గుంపులు గుంపులుగా పిల్లలు. ఇంటికెళ్ళి చేయాల్సిన హోం వర్క్ ఆలోచనలను పక్కన పెట్టి రకరకాల కబుర్లు చెప్పుకుంటున్నారు. టీవీలో రాత్రి చూసిన హారర్ సీరియల్ గురించీ, ఇటీవలే రిలీజయిన సినిమాలోని పాటల గురించీ, ఇంకా తమ టీచర్ల గురించీ ఇలా ఏవేవో తోచిందల్లా చెప్పుకుంటూ, కామెంట్స్ చేస్తూ గట్టిగా నవ్వుకుంటున్నారు.

ఇలా ఎవరి గొడవల్లో, ఎవరి ఆలోచనల్లో వాళ్ళుంటే… ఆడవాళ్ళ జారే పైటల్నీ, చెదిరే చీరల్నీ ఆబగా చూసేవాళ్ళు కొందరూ, ఏదో విధంగా తాకుతూ వికృతానందాన్ని పొందేవాళ్ళు మరికొందరూ…..

వీళ్ళందరితో ఉక్కిరి బిక్కిరిగా ఉన్న బస్సులో మధ్య సీటులో కిటికీ పక్కన కూర్చొనుంది రమ. ఆమె వళ్ళో తన పక్కనే నిలబడి ఉన్న పిల్లల పుస్తకాల సంచులు రెండో మూడో ఉన్నాయి.. ఆ బరువుల్ని ఓ శిక్షలా రోజూ మోసే వాళ్ళ దుస్థితికి ఓ వైపు జాలిపడుతూ, వాళ్ళు చెప్పుకుంటున్న కబుర్లు వినసాగింది.

వాళ్ళ టీచర్ని ఇమిటేట్ చేస్తూ ఏదో చెప్తున్నాడు ఒకబ్బాయి. పడీ పడీ నవ్వుతున్నారు. మిగతా పిల్లలు.

ఆసక్తిగా వినసాగింది రమ. వాళ్ళ అల్లరి, స్కూలు రోజుల్ని గుర్తు తెస్తున్నాయామెకు. సూల్లో ఫ్రెండ్స్ ఆడుకున్న ఆటలూ, చేసిన అల్లరీ, క్రమశిక్షణ పేరిట తిన్న దెబ్బలూ, కట్టిన ఫైన్లూ ఒక్కొక్కటే గుర్తు తెచ్చుకుంటున్న రమ కాలికి ఏదో తాకింది. ‘ఏదో’ ఏంటి, అది వెనక కూర్చున్న వాడి కాలని రమకు స్పష్టంగానే అర్ధమయింది. పొరపాటున తగల్లేదని కూడా అర్థమయింది. వెంటనే కాలుని కొంచెం జరుపుకుంది. కొన్ని క్షణాలు గడిచాక మళ్ళీ అదే తంతు. మళ్ళీ జరుపుకుంది కాలును. అయినా ఆగలేదా తంతు. ఈసారి కాలుని తాకుతోన్న కాలు మడమను నొక్కుతూ పైపైకి పాకడానికి ప్రయత్నిస్తోంది. కంపరంగా ఉందామెకు ఆ స్పర్శ. ‘ఏం చేయాలా’ అని ఒక్క క్షణం ఆలోచించింది. ఎప్పుడూ బ్యాగులో పదిలంగా ఉంచుకునే ఆయుధం పిన్నీసును తీద్దామా అనుకుంది. కానీ కాలుని గుచ్చడం కన్వీనియెంట్గా ఉండదని భావించింది. వాడిని రహస్యంగా శిక్షించడం కాకుండా నలుగురి ముందూ అవమానం చేయాలనుకుంది. వాడి కాలుని తన కాలుతో బలంగా తన్నుతూ వెనక్కి తోసి, వెనక్కి తిరిగి వాడివైపు చూస్తూ…

“కాళ్ళూ చేతులూ దగ్గర పెట్టుకుని కూర్చో” కోపంగా గట్టిగా చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించేలా అంది.

“ఏమయిందమ్మా” అడిగింది పక్కన కూర్చున్నావిడ.

“కాలుతో టచ్ చేస్తున్నాడండీ.”

“ఏం! అక్కాచెల్లెళ్ళు లేరు నీకూ?” అంటూ చీవాట్లు పెట్టసాగిందామె.

“నేనేమన్నా కావాలని తాకానా, పొరపాటున తాకింది” దబాయించబోయాడు.

“ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పొరపాట్లు జరగవు” గట్టిగా చెప్పింది రమ.

“ఆడవాళ్ళను చూస్తే చాలు ఏం రోగం పుట్టుకొస్తుందో వెధవ్వేషాలేస్తారు” అంది పక్కనే నిలబడి ఉన్న మరొకావిడ.

గొడవ అర్దమయిన ఆడవాళ్ళంతా తలో మాట అనసాగారు.

వాడి మొహం మాడిపోయింది. ఆడపిల్ల సిగ్గుపడి ఊరుకుంటుందనుకున్నాడు కానీ ఇంత గొడవ చేసి అవమానిస్తుందనుకోలేదు. ఏదో స్టాప్ దగ్గరవడంతో దిగే సాకుతో లేచి తలొంచుకుని గబగబా ఎప్పుడూ లేంది వెనుక డోరైవైపు నడిచాడు.

తనకు జరిగిన అవమానాన్ని తగిన రీతిలో తిప్పికొట్టినందుకు సంతృప్తి పడింది రమ. ‘అవమానాన్ని సహించి ఊర్కోకుండా ఇలా చేస్తేగాని బుద్దిరాదు వెధవలకి’ అనుకుంది.

చుట్టుపక్కల వాళ్ళు స్పందించిన తీరును మనసులోనే అభినందించింది రమ.

“ఏదైనా సినిమాకు వెళ్లామా, విసుగ్గా ఉంది” అన్నాడు మధు.

“సినిమాకా? మంచి సినిమాలేం లేవే” సాలోచనగా అంది రమ.

“అబ్బా! ఏ సినిమా అయితే ఏంటీ, ఇద్దరం కలిసి అలా వెళ్ళి రావడానికి.”

“అయితే సరే! అయిదు నిమిషాల్లో రెడీ అయి వస్తా” అంటూ అక్కడనుండి కదిలింది రమ.

దగ్గర్లో ఉన్న సినిమాహాలుకు నడుచుకుంటూ వెళ్ళారిద్దరూ. సినిమా హాలు ముందున్న పోస్టర్ చూడగానే ‘అమ్మో! ఇదేదో భయంకరంగా ఉండేలాగుందే’ అనుకుంది రమ. కానీ ఇంకో హాలుకి వెళ్ళేంత టైం లేకా భర్త కోరిక కాదనలేకా భర్తవెంట హాల్లోకి నడిచింది.

నెంబర్స్ చూస్కోని కూర్చున్నారిద్దరూ. ఇంకా సినిమా మొదలవలేదు. భర్త చెప్తోన్న కబుర్లు చిరునవ్వుతో ఇష్టంగా వినసాగింది. ఇంతలో సినిమా మొదలయినట్టు గుర్తించి తెరవైపు దృష్టి సారించాడు మధు. తప్పనిసరై తనూ తెరవైపు కళ్ళు తిప్పుకుంది రమ.

ఓ అయిదు నిమిషాలు సినిమా చూసిందో లేదో “ఛీ! వెధవ సినిమా” అనుకోకుండా ఉండలేకపోయింది.

హీరో హీరోయిన్ల రెండర్థాల మాటలతో, వెకిలి నటనతో, అసహ్యపు వేషధారణతో కంపరమెత్తుతోందామెకు. మొదటిసారి భర్తతో చూస్తోన్న సినిమా అది. ఇబ్బందిగా ఉందామెకు. “ఛీ! ఈ సినిమా చూసే బదులు డాబామీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఈ సాయంత్రం గడిపేస్తే ఎంత బావుండేది” అనుకుంది.

మొన్నే పెళ్ళయింది. ఇంకా ఆమె మనసు విప్పి మాట్లాడనే లేదనితో, ఎన్నెన్నో ఊసులు చెప్పుకోవాలనుందామెకు అతనితో. అందుకే తమ చక్కని సాయంత్రాన్ని వృధా చేస్తోన్న ఆ చెత్త సినిమాని మరోసారి తిట్టుకుంది.

ఇంతలో పాట మొదలయింది. ఇంక చెప్పేదేముంది ‘అసలే కోతి ఆపైన కల్లు తాగింది’ అన్నట్లుంది. సినిమాల్లో పాటలు పెట్టేది కేవలం హీరోయిన్ వళ్ళు చూపించడానికే అన్పించింది రమకు.

తెరమీద పరుగు పందాలు, సర్కస్ ఫీట్లూ, కిందా మీదా పడి దొర్లడాలూ రోతగా అన్పించిందామెకు. ఇంక చూడలేక కళ్ళు దించుకుంది. ‘సినిమాల్లో ఆడవాళ్ళను ఇంత నీచంగా చూడడానికి అలవాటుపడ్డ మగవాళ్ళు నిజ జీవితంలో మాత్రం ఎలా గౌరవిస్తారు?” అని ఆలోచించసాగింది.

ఆమె ఆలోచనలను తెగ్గొడుతూ ఆమె భుజంమీద చేయిపడింది. ఎప్పటిలాగే అసంకల్పితంగా విదుల్చుకోబోయింది. అయితే ఈసారి ఆమె భుజంమీద పడింది అధికారంతో కూడుకున్న చేయి. అందుకే ఆమె విదిలింతకు కొంచెం పట్టు తప్పినా వెంటనే సర్దుకొని భుజాన్ని గట్టిగా పట్టుకుంది.

తన చేత్తో అతని చేతిని పట్టుకొని భుజం మీదనుండి లాగేయబోయింది. మరోచేత్తో, ఆమె చేయిని పట్టుకున్నాడు మధు.

“చేయి తీసేయండి” నెమ్మదిగానే అయినా స్థిరంగా చెప్పింది.

“అంత సిగ్గయితే ఎలా?” తన తలను ఆమె తల దగ్గరకు చేర్చుతూ అన్నాడు.

“సిగ్గు కాదు. నాకిష్టముండదు.”.

“ఏం! నేనే కదా.”

“అయినా సరే నాకు కంపరంగా ఉంది.”

“మొగుడు చేతులేస్తే కంపరంగా ఉండడమేంటి” అతని గొంతులో ఆశ్చర్యం.

“ఏమో నాకలాగే ఉంది చేతులు తీసేసి సరిగా కూర్చోండి” ఖచ్చితంగా అంది. “అసలే సినిమా అసహ్యంగా ఉంటే ఈ వికారపు చేష్టలేంటీ” అనుకుంది మనసులో. పైకి అనేంత చనువు ఇంకా రాలేదు.

ఆమె అయిష్టాన్నీ, కంపరాన్నీ కేవలం సిగ్గుగానే భావిస్తోన్న అతను “ఆ హీరోయిన్ను చూడు, నీలా సిగ్గుపడుతోందా?” అన్నాడు. అతని గొంతులో వెకిలితనం.

ఒళ్ళు మండిపోయింది రమకు. “డబ్బు కోసం సిగ్గునూ, అభిమానాన్నీ చంపుకున్న ఆ హీరోయిన్ తో నన్ను పోల్చడమేంటీ” అనుకుంది.

“ఒక్క టికెట్కు రెండు సినిమాలు చూస్తున్నాంరోయ్!” అన్నాడు వెనకనుంచెవరో. సిగ్గు, అవమానంతో కుంచించుకు పోయింది రమ. పక్కవాళ్ళు తిరిగి తిరిగి చూసి నవ్వుకోసాగారు.

‘ఎవరు చూస్తే నాకేం, నా పెళ్ళాం నా ఇష్టం’ అన్నట్లు ప్రవర్తించసాగాడు మధు. నాలుగు గోడల మధ్య ఎదలో సరాగాలు పలికించే అతని స్పర్శ ఇప్పుడామెకు దుర్భరంగా ఉంది. కానీ ఏం చేయాలో అర్ధం కాలేదు. ఎన్నోసార్లు ఎన్నో మగ శరీరాలు బస్సుల్లోనో, కాలేజీలోనో, సినిమాహాళ్ళలోనో, నడిరోడ్డుమీదనో, అఖరికి వరసైన వాళ్ళ వంకతో ఇంట్లోనూ ఆమెను స్పర్శించి అవమానించాయి. ఆ అవమానాలను స్పర్శలనెప్పుడూ ఆమె భరించలేదు, సహించలేదు. ఛీత్కరించింది, చీవాట్లు పెట్టింది, చెంప దెబ్బలూ కొట్టింది, చివరకు గాయపరిచింది. తనకు జరిగిన అవమానాన్ని పదిమందిలో బట్టబయలు చేసి, ఆ అవమానం చేసినవాడ్ని తలవంచుకునేలా చేసింది.

ఇంతకుముందు ఎన్నో మగ శరీరాలు తాకిన స్పర్శకీ ఇప్పుడు భర్త తాకుతోన్న స్పర్శకీ ఆమెకేం తేడా తెలియడం లేదు. తన అభిప్రాయాల్ని, ఇష్టాయిష్టాలను పట్టించుకోని అతని ధోరణి ఇంతకుముందు ఎంతోమంది మగవాళ్ళు చేసిన అవమానంలాగే ఉంది.

మొదటిసారిగా ఈ అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కావడం లేదామెకు. ఎప్పుడూ తన బ్యాగులో పెట్టుకొనే ఆయుధం పిన్నీసుతో ఇందాకే దారిలో భర్త కొనిచ్చిన మల్లెపూలను మురిపెంగా తల్లోముడుచుకుంది. పక్కన చెట్టంత మొగుడుండగా ఇంకా ఆ చిన్న ఆయుధంతో పనేముందీ అనుకునుంటుంది.

“వద్దని గట్టిగా చెప్తే…. అమ్మో ఇంకా ఎక్కువ మంది దృష్టిలో పడతాం” అనుకుంది. ఎప్పుడూ తనకు జరిగిన అవమానాన్ని నలుగురికీ తెలిసేలా గొడవ చేసే ఆమె, ఇప్పుడు నలుగురికీ తెలిస్తే మరింత అవమానం అనుకుంటోంది. ఒకవేళ నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారు. అంతేకాని పరాయి మగవాడు చేసే అవమానాన్ని ఎదుర్కోవడంలో అంతో యింతో సాయపడే ఈ సమాజం దృష్టిలో మొగుడు చేసేది అవమానం కిందికి వస్తుందా?

“పోనీ లేచి ఇంటికెళ్ళిపోతే….” అనుకుంది.

“కానీ అతని రియాక్షన్ ఎలా వుంటుందో. కోపం తెచ్చుకుంటాడో లేక తన వెంటపడి గొడవ చేస్తాడో.”

ఇంటికెళ్తే మాత్రం….. “సినిమా మధ్యలో వచ్చేశావేం! ఒక్కదానివే వచ్చావేం?” అనే ప్రశ్నలకు తానేం చెప్తుంది.

ఎప్పటిలాగానే “ఓ వెధవకి బుద్ధి చెప్పి చక్కా వచ్చేశా” అని ధైర్యంగా గర్వంగా చెప్పలేదు కదా.

దిక్కు తోచలేదు రమకు. వేయి ఆలోచనలు, లక్ష సందేహాలతో తల మునకలవుతోంది. మొగుడు చేసే అవమానాన్ని ఎదుర్కోవాలంటే ఎన్ని సంకెళ్ళో!

(ఆదివారం, ఆంధ్రజ్యోతి సంచిక, 13 అక్టోబరు 1996)

Leave a Reply