వ్యక్తుల చరిత్రే సామాజిక చరిత్ర

భూస్వామ్య, కుల సంబంధాలు ఉన్న మన సమాజంలో చరిత్ర రచన పాక్షికంగా ఉంటుంది. భారతీయ చరిత్ర మొత్తం పాలకుల చరిత్రగానే నమోదు అయింది. ప్రజల వైపు నుంచి చరిత్ర రచన చాలా అరుదుగా జరిగింది. సమాజం నిండా ఆవరించి ఉన్న భావజాలమే చరిత్ర రచనలో కూడా ప్రతిఫలిస్తుంది. కనుక చరిత్రకారుల దృష్టికోణాన్ని బట్టే సామాజిక చరిత్ర నిర్మాణమవుతుంది. ఈ దేశంలో మొదట విద్యను అభ్యసించింది పై వర్గాల/కులాల వాళ్లే. ఆంగ్ల విద్య, సాహిత్యం, చరిత్ర మొదలైన యురోపియన్ అధ్యయన పద్ధతులను నేర్చుకున్నది కూడా వెసులుబాటు ఉన్న సమూహాలే. రచనా వ్యాపకంలోకి ప్రాచీన కాలం నుంచే బ్రాహ్మణులు ప్రవేశించారు. ఆధునిక కాలంలో కొన్ని మినహాయింపులతోనైనా సరే మరికొన్ని ఎగువ సమూహాలు సాహిత్యం, చరిత్ర రచనా పద్ధతిని అందుకున్నారు. వాళ్లు రాసిందే చరిత్రగా రూఢీ అయిపోయింది.

ఇక చరిత్ర రచనలో తిరోగామి, పురోగామి దృక్పథాల పాత్ర కూడా ఉంటుంది. పురోగామి శక్తుల పాత్రను చరిత్ర నిర్మాణంలో విస్మరిస్తూ అలౌకిక భావనల ఆధారంగా చరిత్ర రాసే మేధావులు కొందరుంటారు. వీళ్లు ఊహలను, కథలను, వర్ణనలను, పురాణాలను చరిత్రకు ఆకరాలుగా భావించి తిరోగామి పద్ధతిలో మానవ చరిత్రను నిర్మించే ప్రయత్నం చేస్తారు. వ్యక్తులే చరిత్ర నిర్మాతలుగా, హీరోలుగా, వారి సాహస గాథలే చరిత్రగా కల్పనలు జోడించి మానవ ప్రయత్నాలకు ద్వితీయ స్థాయిని కల్పిస్తారు. చరిత్ర పురోగమనంలో ప్రజల పాత్రను నిరాకరిస్తారు. ఇక పురోగామి దృక్పథం కలిగిన వాళ్లు ప్రజల కోణం నుంచి చరిత్రను రాస్తారు. ప్రజల పూనిక వలననే చరిత్ర పురోగమనంలో ఉందని వీరి భావన. గతితర్కపు నియమాలను చరిత్రకు అన్వయించి చారిత్రక భౌతిక వాద దృష్టితో చరిత్ర రచనను కొనసాగిస్తారు. ప్రజల చరిత్రనే సామాజిక శక్తుల చరిత్రగా భావిస్తారు. చరిత్రలో ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల పాత్రను విశ్లేషించడం వలననే శాస్త్రీయ చరిత్ర నిర్మాణమవుతుందనే ఈ సత్యాన్ని ఎవరూ నిరాకరించలేరు.

అయితే పురోగామి దృష్టితో వ్యక్తుల చరిత్రను విశ్లేషిస్తే అది సామాజిక చరిత్రగానే ఉంటుందని అర్థమవుతుంది. వ్యక్తులు ఎవరు కూడా విడిగా ఉ ండరు. సామాజిక సంబంధాలలో భాగంగా జరిగే రాజకీయార్థిక పోరాటాలలో భాగమవుతూ వ్యక్తులు నిర్మాణమవుతారు. కార్యకర్తలుగా, నాయకులుగా చలనంలో ఉన్న చరిత్రను ప్రభావితం చేస్తూ, తమకు తాము ప్రభావితం అవుతూ విస్తరిస్తారు. కనుక ఎంత కాదనుకున్నా వ్యక్తులు లేకుండా సమూహం లేదు. సమూహం లేకుండా చరిత్ర లేదు. అందుకే వ్యక్తుల చరిత్రనే సామాజిక చరిత్రగా భావించే పద్ధతిని కూడా విస్మరించలేము. అంటే ఇక్కడ వ్యక్తులను సమూహం నుంచి వేరు చేసినట్లుగా, హీరో వర్షిప్ను పెంచినట్లుగా భావించనక్కర్లేదు. వ్యక్తులకు కూడా చరిత్రలో సముచితమైన స్థానాన్ని కల్పించే సమతూక భావనను గుర్తించినట్లు అవుతుంది.

ఈ నేపథ్యంలోనే డా॥దుబ్బ రంజిత్ చరిత్ర మరవని వీరయోధుడు పుస్తకాన్ని రచించి మన ముందుకు తెస్తున్నాడు. రంజిత్ చరిత్ర విద్యార్థి కాదు. అంతకంటే అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు చదువుకున్న కులం నుంచి రాలేదు. వేల సంవత్సరాలుగా గుడికి, బడికి, సంపదకు దూరం నెట్టబడిన అట్టడుగు మాదిగ కులంలో పుట్టాడు. ప్రగతిశీల, విప్లవోద్యమాల ప్రభావంతో చైతన్యం పొంది, అక్షరాన్ని, దాని మాధుర్యాన్ని తెలుసుకున్నాడు. అంటరాని తన మునివేళ్లతో కాగితాన్ని, కలాన్నిపట్టి జ్ఞానాన్ని వెలిగించుకున్నాడు. అక్షరానికి ఉండవలిసిన సామాజిక బాధ్యతను గుర్తెరిగి వ్యక్తమయ్యాడు. ఉ ద్యమాల పేరు మీద అధ్యయనాన్ని, అధ్యయనం పేరు మీద ఉద్యమాలను వదిలి వేయకుండా రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించిన ఈ తరం పరిశోధకుడాయన. తాత పరుశురాములు (అమ్మ తండ్రి) అప్పటికే విప్లవ రైతుకూలిసంఘంలో ఉండటం వలన బాల్యంలోనే రాజకీయ ప్రభావానికి గురయ్యాడు. తెలివిడి వచ్చిన తర్వాత ఆ తరం వాళ్లకు వేముల వీరేశం హీరోగా ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి వీరేశం పీడీఎసు నాయకుడు. రంజిత్ నకిరేకల్ వయా నల్గొండ మీదుగా ఎకనామిక్స్ మీనయ్యసర్ నేర్పిన సబ్జెక్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చాడు. తన పరిశోధన పూర్తయ్యాక తన చరిత్రను, తన ఊరు చరిత్రను రికార్డ్ చేసి సమాజం ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు.

తెలంగాణ సమాజంలో వ్యక్తుల జీవిత చరిత్రలు, గ్రామ చరిత్రలు రాయటం పట్ల మొదటి నుంచి ఆసక్తి లేదు. ఆంధ్ర ప్రాంతంలోనైతే, జాతీయోద్యమం జరుగుతుండిన కాలంలోనే ఆయా ప్రాంతాల చరిత్రను అక్షరబద్దం చేసారు. కానీ తెలంగాణలో మహెూజ్జ్వలమైన రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పటికీ క్షేత్రస్థాయి చరిత్ర నిర్మాణం జరగలేదు. ఎందరో సామాన్యులు అసమాన్యులుగా ఎదిగి నాయకత్వం అందించారు. కానీ వారి వివరాలేవి అంతగా చరిత్రలో దొరకడం లేదు. పుచ్చలపల్లి సుందరయ్య రాసిన ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం’ దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన ‘తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర’ పుస్తకాలే ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. చరిత్ర రచన పట్ల మొదటి నుంచి తెలంగాణ సమాజానికి ఒకింత నిర్లక్ష్యం ఉందని అర్థమవుతుంది లేదా తమ చరిత్రను తామే రాసుకోవాలనే ఎరుకలేకపోవడం కూడా ఒక పరిమితిగా మనకు అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, చరిత్ర, ఆర్థిక, సాంస్కృతిక వివక్షను ప్రశ్నిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ప్రజల కోణం నుంచి చరిత్ర రచన జరగాలనే అవగాహన పెరిగింది. ఈ ప్రాంతం నుంచి ఎదిగిన మేధావులు, ఉన్నత విద్యను అందుకున్న మొదటితరం యువత తమ చరిత్రను తమదైన కోణంలో మూల్యాంకనం చేయాలని, పునర్నిర్మాణం జరగాలని పరితపిస్తున్నారు.

ఇదిగో అందుకే డా. రంజిత్ పట్టుదలగా ఈ పని పూర్తి చేసాడు. యానాల మల్లారెడ్డి సమగ్ర జీవిత చరిత్ర అంటే సంపూర్ణంగా నకిరేకల్ చరిత్ర, పాక్షికంగా నల్గొండ చరిత్ర అని అర్థం. కనుక మల్లారెడ్డి చుట్టూ ఉ న్న ప్రజల చరిత్రనే ఆయన చరిత్ర, మల్లారెడ్డి చరిత్రనే ఆ ప్రాంత చరిత్రగా మనం అభేదంగా అర్థం చేసుకోవచ్చు. కనీసం నాలుగు వందల సంవత్సరాల కిందికి వెళ్లి ఊట్కూర్ చరిత్రను రంజిత్ మన ముందు ఉంచే ప్రయత్నం చేసాడు. యానాల ఆశరెడ్డి నుంచి ప్రారంభించి యానాల మల్లారెడ్డి వరకు కొనసాగించాడు. ఈ మొత్తం పుస్తకానికి మల్లారెడ్డి కథా నాయకుడు.

1925 సంవత్సరానికి దేశంలో చాలా ప్రత్యేకత ఉంది. రెండు వైరి శిబిరాలు ఈ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి ఒకటి ఆర్ఎస్ఎస్, రెండు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఏర్పాటు జరిగింది(డిసెంబర్ 26) సరిగ్గా ఈ సంవత్సరమే యాదృచ్ఛికంగా యానాల మల్లారెడ్డి జన్మించాడు. తండ్రి పోలీస్ పటేల్, స్థిరమైన జీవితం. చదువు పట్ల ఉన్న ఆసక్తితో చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ అని అనకుండా అనేక ప్రశ్నలతో తండ్రి ముందు ప్రత్యక్షమయ్యేవాడు. చరిత్ర అంటే కేవలం నిజాం పూర్వీకుల చరిత్రగా ఉ డిన కాలంలో మల్లారెడ్డి చరిత్ర పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. భూగోళ శాస్త్రం అంటే నిజాం సరిహద్దులే అని చెప్పే జ్ఞానంలోని సత్యాన్ని అన్వేషించాడు. ఇలా బాల్యంలో కలిగిన ఆలోచన, మల్లారెడ్డిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. తన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిపరివిధాల ప్రశ్నించుకున్నాడు. నిజాం తరతరాల బూజు అనే అవగాహన మెల్లగా కల్గటం మొదలయింది. తన ఆలోచనలకు సరైన సమూహం కోసం వెతకటం ప్రారంభించిన రోజులలోనే ఆర్యసమాజ్ ఆఫీస్ కన్పించింది. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్లు చేసే కార్యకలాపాల్లో భాగమయ్యాడు. రామానంద తీర్థ అరెస్టు సందర్భంలో అసలైన రాజ్య స్వభావం అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది.

ఒక్కసారి ఆలోచించటం మొదలయ్యాక ఏ మనిషి కూడా సరైన ఆలోచనలను చేరుకోకుండా ఉండలేరు. అలాంటి సరైన భావాలు, ఆలోచనలు దేవులపల్లి వెంకటేశ్వరరావు పరిచయంతో మల్లారెడ్డికి చేరాయి. ఆర్యసమాజ్ కార్యకలాపాల నుంచి ఆంధ్ర మహాసభ ఆచరణలోకి ఆయన ప్రయాణించాడు. డీవీ ఉపన్యాసాల పరంపరలో నుంచి మల్లారెడ్డి బయట పడలేకపోయాడు. మార్క్సిజం తెలిసిన వ్యక్తులు అందించే సమాచారం ఎంత వాస్తవికంగా, సత్యంగా ఉంటుందో, ప్రజాపక్షం వహిస్తుందో దీవీని చూసాక మల్లారెడ్డి అనుభవంలోకి వచ్చింది. ఆ విధంగా భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభలలో వాలంటీర్గా పాల్గొన్నాడు. అక్కడే తన పక్క గ్రామ(చెరువు మాదారం)వాసి అయిన వట్టికోట ఆళ్వారుస్వామితో పరిచయం కూడా జరిగింది. భువనగిరి ఆంధ్ర మహాసభ ఇచ్చిన రాజకీయ చైతన్యంతో నకిరేకల్ ప్రాంతంలో ప్రజల మధ్యన పనిచేయడానికి సిద్ధపడ్డాడు.

తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత చాలా తక్కువ. కనుక ప్రజలకు ప్రపంచ పరిణామాలను, నిజాం దోపిడీ విధానాన్ని అర్థం చేయించడంలో మల్లారెడ్డి అనేక పరిమితులను ఎదుర్కొన్నాడు. కనుక డీవీ సలహాతో రాత్రి బడి నిర్వహణకు పూనుకున్నాడు. అక్షరాస్యులైన ప్రజలను చైతన్యం చేయడంలో ఉన్న సౌలభ్యం నిర్లక్ష్యరాస్యుల దగ్గర ఉండదని భావించాడు. కానీ రెక్కాడితే డొక్కాడని ప్రజలు పగలంతా పొలాలలో పనిచేసి తీవ్ర అలసటకు గురయ్యేవారు. తిరిగి రాత్రి పూట బడికి వచ్చి చదువుకోవటం ఇబ్బందిగా ఉండేది. మల్లారెడ్డి జీవితంలో ఇదొక ఆచరణాత్మక అనుభవాన్ని పొందాడు.

తెలంగాణలో గ్రామాలు మునుపటి వలె లేవు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన చైతన్యంతో, పోరాట స్ఫూర్తితో గ్రామాలన్ని మండుతున్న కొలిమిలా మారాయి. జగీర్దార్లకు, జమీందార్లకు, దేశముఖ్ కు వ్యతిరేకంగా తిరగబడటం మొదలు పెట్టారు. కడివెండిలోని విసునూర్ రామచంద్రారెడ్డి గడీల మీద ప్రజలు దాడి చేసారు. ఆ సందర్భంలో దొరలు జరిపిన కాల్పుల్లో దొడ్డికొమరయ్య అమరుడయ్యాడు. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లిన మల్లారెడ్డి అక్కడ జరిగిన పోరాట స్ఫూర్తిని పొందడమే కాకుండా కొమురయ్య అమరత్వాన్ని గుండె నిండా నింపుకొని ఆయన ఆశయ సాధన కోసం కంకణబద్దుడై తిరుగు ప్రయాణమయ్యాడు. దొడ్డి కొమురయ్య అమరత్వం ఆంధ్ర మహాసభకార్యాచరణలో మౌలికమైన మార్పును తీసుకొచ్చింది. ఆత్మరక్షణకైన ఆయుధం పట్టక తప్పని స్థితిని కల్పించింది. అందుకే డీవీ సలహా మేరకు మల్లారెడ్డి ఉద్యమానికి కావలసిన ఆయుధ సేకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పటికే నిజాం పోలీసులు, రజాకారులు, భూస్వాముల ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల మీద నిఘా పెంచారు. ప్రజల మీద పడి దాడులు చేయడం, ఉద్యమకారులను హత్యలు చేయడం లాంటి క్రూర నిర్బంధ పద్ధతులను అమలు చేయడం ప్రారంభించారు. కనుక ఆ పరిస్థితులలో నాయకులను కాపాడుకోవడం, ఆయుధాలను సమకూర్చుకోవడం కత్తి మీద సాములా మారింది. ఆయుధాలను ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేసే పనిని డీవీ, మల్లారెడ్డికి అప్పగించాడు. మల్లారెడ్డి ఆయుధాలను తీసుకొని వస్తుండగా ఒకచోట పోలీస్ స్టేషన్ దాటి రావలసి ఉంది. పోలీసుల కంటపడకుండా ఆయుధాలను తీసుకెళ్లడానికి మల్లారెడ్డి మెరుపు లాంటి ఆలోచన చేసాడు. ఒక ఎద్దుల బండిని ఏర్పాటు చేసుకొని, దాని నిండా వరిగడ్డి తొక్కి మధ్యలో ఆయుధాలను కనిపించకుండా దాచిపెట్టాడు. ఆ విధంగా ఆయుధాలను సురక్షితంగా శిక్షణా క్యాంప్కు చేర్చాడు. రజాకారులు ఒక ఇంట్లో ఉన్నారనే విషయం తెలుసుకొని వరిగడ్డిని ఉండలుగా చుట్టి, అందులో మిరపకాయలు పెట్టి కిరోసిన్తో తో అంటించి ఆ ఇంటి మీదకు విసిరి వేసేలా ఏర్పాటుచేసాడు. మిరపకాయల ఘాటు బాధను తట్టుకోలేక బయటికి పరుగెత్తే రజాకారుల మీద దాడి చేయాలనే యుద్ధతంత్రాన్ని మల్లారెడ్డి రూపొందించాడు.

భిన్నమైన పోరాట రూపాలతో ఆనాడు ప్రజలను ఉద్యమానికి, సాయుధ పోరాటానికి ఆంధ్ర మహాసభ సిద్ధం చేసింది. ప్రారంభంలో కార్యకర్తగా, తర్వాత నాయకుడుగా మల్లారెడ్డి ఈ మొత్తం క్రమంలో చురుకైన పాత్రను పోషించాడు. గ్రామ రక్షణ దళాలను ఏర్పాటుచేయడం, గుత్పల సంఘాలను రూపొందించడం, యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి సైనికులుగా మార్చడం, పార్టీని నిర్మాణం చేయడం… మొదలైన పద్ధతులలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని మల్లారెడ్డి నడిపించాడు. నాయకత్వం వహించాడు. ప్రజా వెల్లువకు బయపడిన నిజాం సైన్యం, రజాకారు మూకలు తోకముడిచాయి. ఆనాటి నాయకత్వం వేలాది ఎకరాల భూమిని ప్రజలపరం చేసి, వేలాది గ్రామాలను విముక్తి చేసారు.

కానీ తెలంగాణ పరిస్థితి మరో తలంలోకి ప్రవేశించింది. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నడిచిన నిజాం వ్యతిరేక పోరాటం ప్రాథమిక స్థాయిలో వర్గపోరాటంగా జరిగిందని, భవిష్యత్లో దీర్ఘకాలిక వర్గపోరాటంగా పరిణమించే అవకాశాలున్నాయని గమనించిన కేంద్ర పాలకవర్గం, నాటి హెూంశాఖ మంత్రి వల్లభాయ్పటేల్ నాయకత్వంలో ఇండియన్ ఆర్మీ తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించింది. అప్పటికే చైనాలో మావో నాయకత్వంలో జరుగుతున్న వర్గపోరాట విజయాన్ని చూసి భయపడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం లేకుండా చేయాలని కుట్రచేసింది. ఈ పథకంలో భాగంగానే నిజాంను లొంగదీసుకోవాలనే నెపంతో వచ్చిన భారతసైన్యం గ్రామాల మీద పడి కమ్యూనిస్టు కార్యకర్తలను చంపింది. స్వాధీనం చేసుకున్న భూములను లాక్కొని తిరిగి భూస్వాములకు అప్పగించింది. విముక్తి అయిన గ్రామాల మీది అధికారాన్ని పెత్తందారులకు దఖలు పర్చారు. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో నాయకత్వం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లే స్థితి వచ్చింది. ఈ పరిణామాలన్నీ మల్లారెడ్డి కళ్లముందే జరిగిపోయాయి. ఈ సమయంలోనే సాయుధ పోరాట విరమణ అనే ప్రతిపాదన కేంద్ర కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చింది. దీనిని మల్లారెడ్డి, భీంరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

మల్లారెడ్డి జీవితంలో ముఖ్యమైన విషయం చైనా-భారత్ యుద్ధం సందర్భంలో ఆయన చేసిన ఉపన్యాసాలు. యుద్ధంలో ఎవరి పక్షం తీసుకోవాలనే చర్చలో యువకులు చీలిపోతుంటే యుద్ధంలోని పాలకవర్గాల ద్వంద్వనీతిని బట్టబయలు చేసాడు. యుద్ధం అంటే సంక్షోభమని, యుద్ధమంటే అశాంతిని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని వివరించి చెప్పాడు. ఆ ఉపన్యాసం విన్న వాళ్లంతా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపి, అప్పటికే ప్రదర్శిస్తున్న నాటకాన్ని కూడా నిలిపివేసారు. మల్లారెడ్డి విశ్లేషణకు ఆకర్షితులైన కొందరు యువకులు పార్టీలో చేరారు. తాము నమ్మిన రాజకీయ విలువలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మల్లారెడ్డి నేర్పును ప్రదర్శించేవాడు. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టు, ఆరునెలల జైలుజీవితం, డీవీతో విప్లవ రాజకీయాల చర్చలు, ఫలితంగా 1969 ఏప్రిల్ 22న ఏర్పడిన సీపీఐ(ఎం.ఎల్) పార్టీ నిర్మాణం జరిగిపోయాయి. ‘మేం విలాసభోగ పురుషులం కాదు-నికార్సయిన విప్లవకారులం’ అంటూ మల్లారెడ్డి పాలకొల్లు తీర్మానాన్ని కూడా ఓడించాడు.

అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దీర్ఘకాలిక వర్గపోరాటం తప్ప మరో మార్గం లేదని భావించిన మల్లారెడ్డి రివిజనిజంతో తెగతెంపులు చేసుకొని విప్లవ పంథా ఆచరణలోకి వచ్చాడు. ప్రజల పట్ల ప్రేమ, విశ్వాసం ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోగలరని మల్లారెడ్డిని చూస్తే అవగతమవుతుంది. రివిజనిస్టుల భౌతిక, మానసిక ముసుగుదాడులు, కాంగ్రెస్ నాయకుల దాడులు, రాజ్యనిర్బంధం వీటన్నింటిని లెక్క చేయకుండా నమ్మిన ఆశయం కోసం మల్లారెడ్డి నిలబడ్డాడు. వర్గ పోరాటంలో రైతుకూలీ సంఘాల పాత్ర ఎలా ఉంటుందో నమూనాగా తన గ్రామంలో ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన పెళ్లి సందర్భంలో, నిర్బంధ సమయంలో, అనారోగ్య కాలంలో మల్లారెడ్డి చూపిన నిబద్దత ఈ తరానికి ఆదర్శంగా ఉంటుంది. ఇక్కడ నేను పేర్కొన్న ప్రతి విషయం రంజిత్ రాసిన మల్లారెడ్డి జీవిత చరిత్ర క్రమం నుంచి స్వీకరించినదే. సమాచారం ఆయనది. విశ్లేషణ నాది. చరిత్రకు ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని రంజిత్ ఈ పుస్తకంలో పాటించాడు.

బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యమ జీవితం అనే అకాడమిక్ పద్ధతిని అన్వయించి రంజిత్ ఈ పుస్తకాన్ని రాసాడు. సాధారణంగా విప్లవోద్యమంలో పనిచేసే వాళ్ల చరిత్రను రాసేటప్పుడు వారి బాల్యం, విద్యాభ్యాసానికి ప్రాధాన్యతను ఇవ్వరు. కానీ ఒక మనిషి సంపూర్ణ పరిణామం అర్థం కావాలంటే ప్రాథమిక విషయాలైన బాల్యం, విద్యాభ్యాసం తెలియవలిసినదే. కనుక రంజిత్ అధ్యాయాలుగా విభజించుకొని రాసాడు. చరిత్రలో సంభాషణ ఉండవచ్చా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. రెండు కాలాల మధ్య జరిగిన సంభాషణనే చరిత్ర అని ఇ.హెచ్.కార్ చెప్పి ఉన్నారు. అందుకే ఇద్దరు మనుషుల మధ్య జరిగిన సంభాషణను కూడా రంజిత్ చరిత్రలో భాగం చేసాడు. మల్లారెడ్డికి ఆయన తండ్రికి మధ్యన జరిగిన సంభాషణను ఇందులో చేర్చాడు.

ఇక రచయిత రంజిత్ తన జీవితంవలె సరళమైన శైలిని ఎంపిక చేసుకున్నాడు. అందరికీ అర్థమయ్యేలా రాసాడు. సంక్లిష్ట వాక్యాలు లేకుండా చూసుకున్నాడు. చరిత్రను ఉటంకిస్తూనే కథనాత్మకంగా చెప్పుకుంటూ పోయాడు. చరిత్ర చదివినట్లు కాకుండా కల్పనా సాహిత్యం చదువుతున్న భావాన్ని కల్గించాడు. ఇలాంటి చరిత్రలు రంజిత్ మరిన్ని రాయాలని కోరుతూ, ప్రతీ గ్రామం నుంచి యువత పూనుకొని తమ గ్రామ చరిత్రను బయటకు తీసుకరావాలని ఆశిస్తూ, ఆసక్తికరమైన ఒక పోరాటయోధుని జీవిత చరిత్రలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ…

(డా. దుబ్బ రంజిత్ రాసిన ’చరిత్ర మరవని వీరయోధుడు యానాల మల్లారెడ్డి సమగ్ర జీవిత చరిత్ర‘ పుస్తకానికి రాసిన ముందుమాట.)

★★★

పాలమూరు జిల్లా అంబట్ పల్లి. కవి, రచయిత, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు. విరసం సభ్యుడు. రచనలు: పొలమారిన పాలమూరు, గుత్తికొండ, మానాల(దీర్ఘ కవితలు), నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, తెలంగాణ ఉద్యమాలు-పాట, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ-సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు, తెలంగాణ సాహిత్యం, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు; అగ్రకులత్వం, టీఎస్ఎఫ్ చరిత్ర, కాగితం మీద అక్షరానికి కమిటైన కవి, అకడమిక్ అన్ టచ్ బులిటీ. ఇరవయేళ్ల కవిత్వమంతా ''కాశీం కవిత్వం (1994 -2014)'' పేరుతో సమగ్ర సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply