ఇది అరుణోదయం. వసంత మేఘ గర్జనల అరుణోదయం. చీకటి రాజ్యంపై ఎక్కుపెట్టిన వసంత మేఘ గర్జనల ధిక్కార పాట. రగల్ జెండా రాగాలాపన. ఈ నేల విముక్తి కోసం నెత్తురు చిందిస్తున్న వీరయోధుల పాట. చరిత్ర పొడవునా అణచివేతల్లోంచి ప్రతిఘటనై ఉవ్వెత్తున లేస్తున్న వీరగాధ. తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయల్లో ప్రతిధ్వనించిన విల్లంబుల గానం. ఇప్పపూల వనాల్లోంచి అగ్గిపాటల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధభేరి. పల్లెపల్లెనూ సంఘటితం చేసి, గుండె గుండెనూ మీటుతున్న జనం పాట. అరుణోదయ పాట యాభై ఏళ్ల ప్రజా పోరాటాల చరిత్ర. రక్తసిక్తమయిన పోరు దారుల చరిత. దోపిడీ, పీడన, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తిన వసంత మేఘ గర్జన. తెలంగాణా నేలంతా నెత్తురై పారిన పాటల ఏరు. పొంగే మానేరు. పోటెత్తే గంజి వాగు. పాలవాగు. గుండెల్ని రగల్ జెండాలుగా ఎగరేసిన పగిడేరు దారి.
ఎక్కడ పుట్టిందీ పాట? ఏ నేలన ఉదయించిందీ అరుణోదయం?
నక్సల్బరీ వసంత మేఘ గర్జన దేశమంతా అలముకున్న కాలమది. శ్రీకాకుళం, గోదావరిలోయ, ఉత్తర తెలంగాణలు కొలిమంటుకున్న రోజులవి. కూడు గుడ్డా లేని కూలినాలోళ్లంతా తిరగబడ్డ రోజులు. దోపిడీ, పీడన, వివక్ష, అణచివేతలపై మర్లబడ్డ జనం. అప్పుడు పుట్టిందీ పాట. సామ్రాజ్యవాద, భూస్వామ్య సంస్కృతులను ఎదిరిస్తూ నూతన ప్రజాస్వామిక విప్లవ సంస్కృతిని నిర్మిస్తోంది. కార్మికులు, కర్షకులు, స్త్రీలు, విద్యార్థులు, మేధావులకు నూతన ప్రజాస్వామిక విప్లవ చైతన్యాన్ని అందిస్తోంది. విముక్తి పోరాటాల్లో చరిత్ర నిర్మించే ప్రజలతో కలిసి నడుస్తోంది. యుద్ధభూమిగా మారిన తెలుగు నేల వీరత్వాన్ని గానం చేస్తోంది. యాభై వసంతాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎర్రజెండా రెపరెపల యుద్ధభేరై మోగుతోది. జనగానమై హోరెత్తుతోంది.
అరుణోదయ ఏర్పాటు :
1967లో పశ్చిమ బెంగాల్‌లో నక్సల్బరీ సాయుధ పోరాటం మొదలైంది. ఈ విప్లవ జ్వాలలు తెలుగు నేలనూ తాకాయి. దీంతో ఆంధ్రా మార్క్సిస్టు పార్టీలో కలకలం రేగింది. మార్క్సిస్టు పార్టీ రెండుగా చీలింది. తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మాదాల నారాయణస్వామి, కొల్లా వెంకయ్య తదితరులు విప్లవ పార్టీగా ఏర్పడ్డారు. 1969లో ప్రభుత్వం శ్రీకాకుళ పోరాటాన్ని తీవ్రంగా అణచివేసింది. ముఖ్య నాయకులందర్నీ కాల్చిచంపింది. నెత్తురుటేరులు పారించింది. దీంతో శ్రీకాకుళ పోరాటం సెట్‌బ్యాక్‌కు గురైంది. 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడిరది. తెలుగు సాహిత్యంలోకి వర్గపోరాట రాజకీయాలను తీసుకువచ్చింది. చెమట చిత్తడి జీవితాలను సృజనాత్మక సాహిత్యంగా మలిచింది.
1971లో విప్లవోద్యమం మూడుగా చీలింది. చారు మజుందార్ వర్గం, చండ్ర పుల్లారెడ్డి వర్గం, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు వర్గం. 1968 చివరలో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి గోదావరిలోయ అటవీ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే పొట్ల రామనర్సయ్య సి.పి.తో కళారంగం ఏర్పాటు గురించి చర్చించాడు. 1971లో పొట్ల రామనర్సయ్య, నీలం రామచంద్రయ్యలు విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి కృషిచేశారు. విద్యార్థి సంఘాల నిర్మాణంతో పాటు 1972లో ‘అరుణోదయ’ పేరుతో కళారంగ నిర్మాణానికి పునాది వేశారు. జార్జిరెడ్డి దారుణ హత్య తర్వాత ఉస్మానియా విద్యార్థులు ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులు’ (పి.డి.ఎస్.) అనే వేదికను ఏర్పాటు చేసుకున్నారు. 1973 నాటికే సి.పి.ఐ. (ఎం.ఎల్.) చండ్ర పుల్లారెడ్డి వర్గం ప్రజా సంఘాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అదే ఏడాది అక్టోబర్‌లో పార్టీ రాష్ట్ర మహాసభలు అడవుల్లో జరిగాయి. ఈ సభలకు హైదరాబాద్ విద్యార్థి నాయకులు జంపాల చంద్రశేఖర ప్రసాద్, సిరిల్‌రెడ్డి (జార్జిరెడ్డి సోదరుడు), మధుసూదన్ రాజ్, మహిపాల్, బూర్గుల ప్రదీప్‌లు హాజరయ్యారు. పి.డి.ఎస్.యూ. మొదటి మహాసభకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభల కంటే ముందే కళారూపాల్లో శిక్షణ ఇచ్చేందుకు కానూరి వెంకటేశ్వరరావును హైదరాబాద్‌కు పిలిచారు. అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ‘అరుణోదయ’ పనిచేస్తున్నది. దీని బాధ్యుడు కామ్రేడ్ చలపతి. ఉస్మానియా విద్యార్థులు వివిధ జిల్లాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరిలో గీత, లలిత, రామసత్తెయ్య, విక్రం, అంజయ్య, ప్రసాద్‌లాంటి వాళ్లు ఉత్తేజంగా పాటలు పాడేవాళ్లు. ఖలీల్, శాండిల్య, పార్థసారధి, సురేష్‌రెడ్డి, మాధవరావు, యలవర్తి రాజేంద్రప్రసాద్, రామకోటేశ్వరరావు, అనూరాధ, అంబిక, అశ్విని, వినయ్, సుమిత్ లాంటి కళాకారులు అనేకచోట్ల ప్రదర్శనలిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీలో కళారంగంపై శిక్షణ :
ఈ మహాసభల తర్వాత ఈ వేదికను ‘ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం’ (పి.డి.ఎస్.యు.)గా మార్చారు. విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆహ్వానంతో కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు. ”1973 ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాను. ఆ పిల్లలు, వాళ్ల వేషభాషలు చూస్తే, నేను వీళ్లకు టీచర్‌నా అనే సందేహం పట్టుకుంది. జంపాల ప్రసాదు నన్ను పరిచయం చేస్తూ, ‘తాతగారు కళారంగంలో పండిపోయాడు, ఎండిపోయాడు అంతా, ఇంతా కొండంత’ అని వాళ్లను ఉబ్బేశాడు” (కానూరి వెంకటేశ్వరరావు, కథకాని కథ, 2005, పుట:112) అక్కడ సాంస్కృతిక శిబిరం పెట్టి అనేకమంది విద్యార్థులకు వివిధ ప్రజాకళారూపాల్లో శిక్షణ ఇచ్చాడు. ఇందులో ఇంజనీరింగ్, ఎం.ఏ. విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొని నేర్చుకున్నారు. లలిత, గీత, అంబిక లాంటి వాళ్లు బుర్రకథలో శిక్షణ పొందారు. వందలాది మంది విద్యార్థులు కళారంగం వైపు వచ్చారు.
‘అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య’ ఏర్పాటు :
12, 13 సెప్టెంబర్, 1974న పి.డి.ఎస్.యు. మొదటి మహాసభలు హైదరాబాద్‌లోని సరోజినీదేవి హాల్‌లో జరిగాయి. ఈ సభల్లో రెండో రోజు కానూరి రూపొందించిన ‘ప్రగతి’ బాగోతం ప్రదర్శించారు. ఇందులో అనూరాధ, శ్యామల, మాళవిక, లలిత, గీత అనే ఎం.ఏ విద్యార్థుల కళారూపాలు, యాధాటి కాశీపతి ఉపన్యాసాలు విద్యార్థి, యువతరాన్ని ఆలోచింపజేశాయి. రచయితలూ, కళాకారులకూ ఒకే సంస్థ ఉండాలనే ఆలోచనతో ‘అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య’ ఏర్పడింది. దీని ఏర్పాటులో జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ది ముఖ్య భూమిక.
”భూస్వామ్యం బుగ్గిచేసి ధనస్వామ్యం దగ్ధ పరచి
అగ్రరాజ్య పెత్తనాలను తుత్తునియలుచేసి
కార్మికులతో కర్షకులతో చేయిచేయి కలుపుతూ
సమరాజ్యం స్థాపనకై తుదిదాక పోరుతాం (అరుణ కిరణాలు, 1992, పుట:1)
ప్రజాతంత్ర విప్లవమే పల్లవిగా పాడుతాం…” అని అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య స్పష్టం చేసింది. ఈ పాట కవి కాశీపతి. ”సమసమాజ స్థాపనకై కార్మిక, కర్షకులు సాగించే సమరంలో అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా పీడిత, తాడిత జనావళిపై సాగే దోపిడీ, అణచివేత, దమనకాండలను ఎండగడుతూ వివిధ కళారూపాల ద్వారా బుర్రకథ, నృత్యరూపకాలు, పాటలు వగైరా… ప్రజలను జాగరూకులను చేస్తున్నది”. (అరుణ కిరణాలు, 1992, పుట:1)
ఇంతలో ఎమర్జెన్సీ (1975) వచ్చింది. నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర ప్రసాద్‌లను విజయవాడలో అరెస్టు చేసి, ఇల్లందు అడవుల్లో కాల్చిచంపారు. దీంతో విద్యార్థి నాయకులు స్తబ్దతకు గురయ్యారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ చీకటి పాలనలో విప్లవ కవి యాధాటి కాశీపతి రాజకీయ ఖైదీగా జైల్‌లో ఉన్నాడు. ఈ హత్యాకాండను నిరసిస్తూ…
”ఉయ్యాలలూగింది శిశువు
విప్లవ సయ్యాటలాడిరది శిశువు
ఉయ్యాలో… జంపాలా
ఈ దోపిడి కూలదొయ్యాలా…
విప్లవాల డోలలలో వూగే ఓ కామ్రేడా (అరుణ కిరణాలు, 1992, పుట:18)
నీ బాలసాల జరిపేము చెరసాలలో మేము…” అంటూ విప్లవ కర్తవ్యాన్ని నిర్ధేశించాడు. స్తబ్దతకు గురైన విద్యార్థుల్లో ఉత్తేజం నింపాడు. దోపిడీ వ్యవస్థను కూల్చేదాకా వెనుదిరిగేది లేదని చెప్పిన పాట ఇది. జంపాల కలలుగన్న దారిని విడవొద్దన్న పాట.
”అరుణోదయం శుభోదయం నూత్నక్రాంతి యుగోదయం
అరుణోదయం అరుణోదయం అరుణోదయం
అడుగున పడి నలుగుతున్న బడుగు జనుల బతుకుల్లో (అరుణ కిరణాలు, 1992, పుట:1)
నవోదయం శుభోయం నూత్నక్రాంతి యుగోదయం…” అంటూ కాశీపతి అరుణోదయ పతాక గీతం రాశాడు. మూడు దశాబ్దాల పాటు ఈ పతాక గీతం అనేక సభల్లో మార్మోగింది. అరుణోదయ ఎజెండాను చాటింది.
1976 నవంబర్‌లో పొట్ల రామనర్సయ్యతో పాటు మరో ఐదుగుర్ని హైదరాబాద్‌లోని మలక్‌పేటలో పట్టుకున్నారు. వరంగల్ జిల్లా పాకాల చెరువు వద్ద కాల్చిచంపారు. దీంతో అరుణోదయ కార్యకలాపాలు ఆగిపోయాయి. 1984లో పార్టీ చీలిపోయింది. దీంతో అరుణోదయ కూడా రెండుగా విడిపోయింది. అరుణోదయ రామారావు, విమల ఒకవైపు; కానూరి వెంకటేశ్వరరావు, శక్తి, నాగన్న, జయరాజు మరోవైపు వెళ్లారు. ఈ చీలిక సందర్భంగానే విరసం నుంచి కొందరు రచయితలు బయటికి వచ్చారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య :
కొంతకాలంలో రచయితలకు వేదికగా ‘ప్రజారస’ (ప్రజా రచయితల సమాఖ్య) ఏర్పడిరది. అనంతరం ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’గా కొనసాగింది. తర్వాత కాలంలోనూ ఘర్షణ, ఐక్యతతో నడుస్తోంది. చీలిక తర్వాత కానూరి వెంకటేశ్వరరావు తెలుగు నేలంతా తిరుగుతూ వందలాది మందికి శిక్షణ ఇచ్చాడు. కళాకారులుగా తీర్చిదిద్దాడు. ఇందిరాజాలం, బాయిబాగోతం, జనగానం(నృత్యరూపకం), ఒగ్గుకథలు, అమరవీరుల రక్తగానం, నెల్లిమర్ల కార్మికుల పోరాట బుర్రకథ, వందలాది పాటలు రాశాడు. ‘జనతంత్రానికి బాటలు వేసిన మహాశక్తి మావో రణశక్తి’ని గానం చేశాడు.
అమరవీరుల స్మృతిలో కానూరి…
”వీరగాధల పాడరా
విప్లవ వీరచరితల పాడరా…
తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల
నక్సల్బరీలోన నవయుగ శివలీల
శ్రీకాకుళం ఈ సింహాల జయహేల (అరుణ కిరణాలు, 1992, పుట:8)
వీర గోదావరి గిరిజన చెరబాల…” అంటూ విప్లవ వీరుల త్యాగాలను అజరామరం చేశాడు. ఈ పాట వేలాది సభల్లో మార్చింగ్ సాంగ్‌గా మార్మోగింది. అరుణోదయ రామారావు, కానూరి, నాగయ్యల గొంతుల్లో నింగీనేలా దద్ధరిల్లేలా పెను విస్ఫోటనమైంది. ప్రజా ప్రభంజనమైంది. కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య స్కృతిలో అంగడి చెన్నయ్య రాసిన ‘అన్న అమరుడురా’ పాట పల్లెపల్లెనా పల్లవించింది. ఈ పాట చివరి చరణం విన్న ప్రతీఒక్కరూ దు:ఖ నదిలో మునిగిపోతారు. ‘తెలంగాణా వీణమీద విప్లవాన్ని మీటిన’ నీలం రామచంద్రయ్య అమరత్వంపై యాధాటి కాశీపతి ‘జోహార్లు రామచంద్రయ్య’ పాట రాశాడు. ఈ పాట అరుణోదయ విమల గొంతులో పల్లవించి విప్లవ కర్తవ్యాన్ని నిర్ధేశించింది. ప్రజాయుద్ధ మార్గంలో పయనించిన వీరత్వపు జాడల్ని గానం చేసింది. విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానంపై ‘శక్తి’ రాసిన ‘విద్యార్థుల రక్తం’ పాటను నాగయ్య అజరామరం చేశాడు.
కానూరి వెంకటేశ్వరావు, యాధాటి కాశీపతి, అంగడి చెన్నయ్య, గూడ అంజయ్య, శక్తి, నాగయ్య, అంజయ్య, కూర దేవేందర్, పురోగామి, హిమజ్వాల, వై.వెంకన్న, విముక్తి, కె.గంగాధర్, బి.ఎన్.బి., ఐ.కె., ఎస్.లింగయ్య, హెచ్.ఆర్.కె., తిర్మల్, ఘర్షణ, అరుణ్, సాగర్, మోహన్, ధర్మ విఠల్‌రెడ్డి, నమ్ము, రశ్మి, నారాయణ, నిశితాసి, జయరాజు, గర్జన, దయానర్సింగ్, యశ్‌పాల్ లాంటి పాట కవులు ఎర్రజెండా వెలుగులో, అమర వీరుల స్మృతి, కార్మిక పథం, రైతుకూలీ పోరు, విద్యార్థి ఉద్యమాలు, యువజన పథం, మహిళాలోకం, పోరుబాటలో వందలాది పాటలు రాశారు. కళారూపాలు రూపొందించారు. ఒకవైపు జననాట్య మండలి, మరోవైపు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు తెలుగు నేలంతా విప్లవీకరించాయి.
దొరల దోపిడీపై :
తెలంగాణలో దొరల దోపిడీ అంతులేకుండా సాగింది. గ్రామాలన్నీ మేల్కొని దొరల దోపిడీపై ఉద్యమించాయి. పల్లె పల్లె రగిలింది. సాయుధమైంది. ఉత్పత్తి కులాలను సంఘటితం చేస్తూ పాటకవి గూడ అంజయ్య రాసిన పాట, ‘ఊరు మనదిరా’. ఇది గద్దర్ గొంతులో గళగర్జనల జడివానైంది. దేశవ్యాప్తంగా 18 భాషల్లోకి అనువాదమైంది.
”ఊరు మనదిరా ఈ వాడ మనదిరా….
పల్లె మనదిరో ప్రతి పనికి మనంరా…
కూలినాలి పేదోల్లం కలిసి మెలిసి ఉండాలె
సంఘపోల్ల జెండకింద సంఘమొకటి పెట్టాలె (అరుణ కిరణాలు; 1992, పుట:66)
మనల దోచె ఈ దొరల మక్కెలిరగ దన్నాలె…” అంటూ ఉత్పత్తి శ్రామికవర్గాన్ని సంఘటితం చేసిందీ పాట.
పరాధీన భారతదేశంపై :
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఖమ్మం జిల్లా కవులు భారతదేశ నగ్నస్వరూపాన్ని చిత్రించిన అనేక పాటలు రాశారు. పరాధీన భారతం గురించి యశ్‌పాల్ రాసిన పాట, ‘ఎంత సొంపుగున్నది’.
”ఎంత సొంపుగున్నదీ స్వతంత్రం
సూడసక్కంగున్నదీ స్వరాజ్యం
పల్లెలన్నీ సూడు వలసబోతున్నాయి
పొట్టచేతాబట్టి పట్టణాలకెళ్తె
ఉండ జాగాలేదు గాలినీరూ లేదు
మురికి మోరీలల్ల ఈగలు దోమలల్ల
కుక్కలు పందులతోటి మందులు మాకులు లేక
రోగం నొప్పులతోటి రోజు సస్తావుంటె… ||ఎంత సొంపు|| (అరుణోయ పాటల కేసెట్)
ఈ పాట అణగారిన బతుకుల్ని చిత్రించింది. వెలిగిపోతున్న పరాధీన భారతదేశ దీన స్థితిని చెప్పింది.
”భారత పాలకులు రమ్మని అనగానె
జర్మనీ జపాను అమెరికా బ్రిటనోడు
అప్పిచ్చి దేశాన్ని ఏలుకుంటావుండ్రు
ఎండవానలు తప్ప అన్ని వాళ్లేనంట
మిఠాయి పొట్లంల దేశాన్ని అమ్మేసి
స్వాతంత్ర దేశమని సోది చెప్తావుండ్రు…” ||ఎంత సొంపు||
అంటూ విదేశీ బహుళజాతి సంస్థలకు తాకట్టుపెట్టిన భారతదేశ స్వరూపాన్ని చెప్పాడు. ఒకవైపు దేశ ప్రజలంతా కరువు, పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలతో అల్లాడిపోతుంటే పాలకవర్గం మాత్రం దేశాన్ని ప్రపంచ మార్కెట్‌కు అమ్మేసింది. పరాధీన భారతాన్నే స్వతంత్ర దేశమని ప్రజల్ని నమ్మిస్తున్నారు. సామ్రాజ్యవాద మార్కెట్ దళారీలు, భారత పెట్టుబడిదారులు కలిసి దేశాన్ని ఎట్లా కొల్లగొడుతున్నారో వివరించిన పాట ఇది. యశ్‌పాల్ మరో పాట, ”భారతదేశం బాకిన పడ్డదిరో…”. ఈ పాట వింటే గద్దర్ రాసిన ‘భారతదేశం భాగ్యసీమరా…’ పాట గుర్తుకు వస్తుంది.
దగాపడ్డ రైతన్నల బతుకులపై :
ఆరుగాలం కష్టపడ్డా చేసిన కష్టం చేతికిరాని రైతుల దీనస్థితిని చెప్పిన పాట, ‘కల్లం నిండ గింజలున్నా రైతన్నా’. యశ్‌పాల్ రాసిన ఈ పాట అరుణోదయ నాగయ్య గొంతులో ఊరూరా పల్లవించింది. నాగేటి సాళ్లలో చెమటా నెత్తురూ కాల్వలై పారుతున్న రైతన్నల బతుకు చిత్రమిది. భార్య పుస్తెలమ్మినా పస్తులు తప్పని స్థితి. పంట దాచే పాతరబోయింది. గుమ్ములు గరిసెలు కూలిపోయినయి. మోటబాయి ఊటలు పోయినయి. మోటతోలే పాటలు పోయినయి. పాడి ఆవులు పశువులు పోయినయి. మిత్తికి తెచ్చి పత్తి పండిస్తే గిట్టుబాటు ధరలేక మెడకు ఉరిబిగిసింది. సకల పంటలు తీసినా బతుకుల్లో వెలుగు లేదు. ఇంటిల్లిపాదీ పొద్దంతా కష్టం చేసినా పూటకు లేని దయనీయ స్థితిని చిత్రించిందీ పాట.
”కల్లం నిండ గింజలున్నా రైతన్నా
పల్లెం నిండ మెతుకుల్లేవో రైతన్నా
అన్నదాత అలమటించే ఏలేటోడు యాడాసచ్చె….” అంటూ రైతుల బతుకుల్ని పాటల్లాడు. మిత్తికి తెచ్చిన అప్పులు పుట్లకొద్దీ పెరిగిపోయి రైతుల మెడకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రేమగా పెంచుకున్న పశువులు అంగట్లో హర్రాజు పాలవుతున్నాయి. తన పొలంగట్లపై వేపచెట్టుకు నిర్జీవంగా వేలాడే రైతుల్ని చూసి దుక్కులన్నీ దు:ఖటిల్లుతున్నాయి. చావే పరిష్కారం కాదనీ, తిరుగుబాటు చేయకతప్పదని చెప్పిన పాట ఇది.
”రక్తం ధారపోసినోడా రైతన్నా
రాజుకోరా రగులుకోరా రైతన్నా
పంటలు తినే దున్నలపైన రైతన్నా
సన్నగొయ్యలు తిరగెయ్యన్నా రైతన్నా
వలస పిట్టలు వాలకుండా రైతన్నా
వడిసెలా గురిపెట్టి కొట్టో రైతన్నా
భూమిని దున్నిన రైతన్నా దేశాన్నేలా నీవేరారా…” అంటూ రైతన్నల్ని సంఘటితమై తిరుగుబాటు చేయాలన్నాడు. వలసదారుల కుట్రల్ని తెలుసుకొని వడిసెల గురిపెట్టాలన్నాడు. ఆధిపత్యాన్ని ఎదిరించకపోతే బతుకులేదని చెప్పిన పాట ఇది.
ఖమ్మం జిల్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో నాగయ్య, జయరాజు, యశ్‌పాల్, శక్తి, కొమిరె వెంకన్న, రడం శ్రీను, పమ్మి రవి, నున్నా నాగేశ్వరరావు, అరుణ, సృజన, లక్ష్మక్క, మరెందరో పాట కవులు, గాయకులు విప్లవోద్యమాన్ని ప్రచారం చేశారు.
సి.పి.ఐ.(ఎం.ఎల్. – జనశక్తి) పార్టీ నాయకుడు కామ్రేడ్ కూర దేవేందర్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కోసం వందలాది పాటలు రాశాడు. దేవేందర్ విద్యార్థి ఉద్యమం నుంచి ప్రజా పోరాటాల్లోకి నడిచాడు. విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరాడు. నృత్యరూపకాలు, బాగోతాలు రాశాడు. మహిళా ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించే కళారూపాలు రూపొందించాడు. విప్లవ పార్టీ నాయకుడిగా ఎదిగాడు. తన కలాన్నీ గళాన్నీ పీడిత ప్రజల విముక్తి కోసం అంకితమిచ్చాడు. మార్చ్, 1994లో ‘మానేటి పాట’ పేరుతో పాటల సంపుటి తెచ్చాడు. ఇది నలభై ఐదు పాటల మానేటి పాట. మానేరు పాటై పోటెత్తిన దేవేందర్‌ను విప్లవోద్యమ ఆచరణ ‘అమర్’గా రూపొందించింది. ‘అమర్’ విప్లవోద్యమ పేరు. అతని సృజన పేరు మిత్ర. విప్లవోద్యమం అతణ్ని రాటుదేల్చింది. నిమ్మపెల్లిని చూసి క్యాంపస్‌ను వదిలిన యువరక్తం అడవుల్లో వ్యూహాల పాటలల్లింది. అడవుల్లో వెన్నెల రాత్రుల్లో ఆకుపసరుతో పద్యాలు అల్లాడు. ట్రిగ్గర్‌పై వేళ్లతో రక్తచలన సంగీతాన్ని సృష్టించాడు. యుద్ధభూమిలో రణన్నినాదాల పాటలు పాడాడు. తనను పాట కవిగా సాయుధం చేసిన నేల గురించి మిత్ర, ”నాకు భౌతికంగా, రాజకీయంగా జన్మనిచ్చిన పోరాట గడ్డ తెలంగాణ. ఇక్కడి జీవితం-సంఘర్షణల నుండే నాకు కార్మికవర్గ ప్రాపంచిక దృక్పథం అబ్బింది. నాలాంటి ఎంతోమంది ప్రజా కార్యకర్తలం తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక విప్లవ పోరాటాల నుండే ప్రపంచాన్ని చూడగలిగాము. దోపిడీ, పీడనలు, అసమానతలు లేని నూతన ప్రపంచాన్ని కలగన్నాము. నిత్యనూతన మార్పుల కోసం ఆ ప్రాపంచిక దృక్పథం నుండే తెలంగాణ లాంటి ప్రాంతీయ ప్రజాస్వామిక ఆకాంక్షల్ని గుర్తించగలిగాం. ఇలా నిర్ధిష్టత నుండి సార్వజనీనతకు, సార్వజనీనత నుండి నిర్ధిష్టతకు సాగిన పయనంలో అనేక వైరుధ్యాలు పరిష్కారమైనాయి. అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి” అని రాశాడు. (కైతల కవాతు; 2016, పుట:12)
మిత్ర సహచరి విమల గొంతులో మానేటి పాటలూ, మంజీర నాదాలూ కలిసి తెలుగు నేలంతా హోరెత్తాయి. పల్లెపల్లెనా శ్రామికజన విముక్తి గీతాలై. ఆ పాటలన్నీ రాసింది మిత్ర. ఐనా పల్లెల్లో విమల పాటలుగానే ప్రాచుర్యం పొందాయి. విమల తండ్రి బండ్రు నర్సింహులు రైతుకూలీ సంఘం నాయకుడు. ఆమెకు చిన్ననాటి నుంచే విప్లవ పాటతో పరిచయం. ప్రవేశం. పన్నెండేళ్ల వయసులోనే విప్లవగీతిక ఆలపించింది. ఎమర్జెన్సీకి ముందే ఆలేరులో జరిగిన రైతుకూలీ సంఘం మహాసభల వేదికపై విప్లవించిన ఆమె గొంతు దేశమంతా పరీవ్యాప్తమైంది. కానూరి శిక్షణలో పాటను సాయుధం చేసింది. ఆమె గొంతులో జలపాతాల సంగీతం ఉన్నది. గంధక గనులున్నాయి. దిక్కులన్నీ పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే మందుపాతరలున్నాయి. కరుణా ఉన్నది. ప్రేమా ఉన్నది.
”దండులో కలిసిన బిడ్డవో…
నా గుండెలో మాయని గురుతువో
పోరులో నీ పేరు వినిపిస్తువున్నా
పొలిమేరనైనా కనిపించవమ్మా…” అని పాడుతుంటే రాజ్యం కాల్పుల్లో దారుణ హత్యకు గురైన బిడ్డల తల్లులు కంటికి పుట్టెడు ఏడుస్తరు. తమ బిడ్డలు గుర్తొచ్చి తల్లడిల్లుతరు. విమల పాట ఆ దు:ఖంలోంచే వీరత్వాన్ని పలికిస్తది.
”పోరులో ఒరిగిన బిడ్డవో
పోరు జెండయ్యి నిలిచిన జాడవో
సాలు సాలుకు మీ నెత్తురొలికిందీ
పంటచేలూ మీ త్యాగమై పండింది….” అంటూ కన్నబిడ్డల త్యాగాలు గుండెల్ని తాకేలా పాడుతుంది. విమల పాటలు తాకని తెలుగు పల్లె లేదు. ఆమె పాటలకు కోరసివ్వని మనుషుల్లేరు. గుండె గుండెనూ మీటిన పాట అది. మిత్ర కలంలోంచి కాయితంపైకి ప్రవహించిన తడారని పాటల్ని విమల మందుపాతరల్ని చేసింది. ఆమె గొంతు ఓ ఊట సెలిమె. చీకటి రోజుల్లో వెలుతురు పాటలు పాడిరది. మొగులుపై ఎన్నెలైంది. మొగిలిపూల వెన్నెలైంది. ఎన్నెన్ని శిశిరాలు రాల్చినా చిగురించే వసంతగీతమైంది. తన గొంతులో వేనవేల జలపాత సంగీతాల్ని సృష్టించింది. ఒక్కమాటలో విమల ‘పీపుల్స్ కల్చరల్ లెజెండ్’. ఒక జననాట్య మండలి. ఒక అరుణోదయ. ఒక గద్దర్. ఒక విమల. అంతే. ప్రజల బాణీలను విప్లవీకరించి, సాయుధం చేసిన లెజెండ్స్. తర్వాత వేలాది మంది కవిగాయకులు వీళ్లను అనుసరించారు.
మిత్ర పాటల్లో పాండిత్యం ఉండదు. అర్థంకాని ఛందస్సు ఉండదు. ఆ పాటలంతటా అమ్మ చనుబాల తీపి ఉంటది. జంగిడిబర్ల పిలగాని ఊపిరిలోంచి అలవోకగా పిల్లంగోవిలోకి దూకే పాటల ఊటలా ఉంటుంది. ఆ పాట విమల గొంతులోంచి మన రక్తనాళాల్లోకి పరీవ్యాప్తమయ్యే రక్తచలన సంగీత శ్రుతిలా పోటెత్తుతుంది. ఆమె ఊపిరిలోంచి ఉబికిన పాట నింగీనేలను ఏకం చేసేలా ఉంటుంది.
పని పాటల గురించి మిత్ర…
”పూసింది ఎన్నేల పువ్వోలే
మా పేదోల్ల బతుకుల్లో పాటోలే
దంచంగ ఇసురంగ అలసటై
దరువులె బుట్టెను మా నోటా
రోకలె కోలగ మారంగ – మా (మానేటి పాట; 994, పుట:1)
రెక్కలె గొంతయి పాడంగా…” అంటూ పాటల మునుంబట్టి సాగిపోతున్నాడు. ఈ పాటంతా పువ్వులా పూసిన ఎన్నెల. రోకలి పొన్నులు తాకి దుంకే గింజల సవ్వడి. నాట్లేసే కూలితల్లుల చేతిగాజుల సవ్వడి. చెమట చిత్తడి దేహంపై మెరిసే వానచినుకులు. నెలవంకలై మెరిసే కొడవలి అంచులు. కష్టజీవుల గుండెలయల్లో కైగట్టే పాట. పనీపాట జమిలిగా ప్రవహించే శ్రమైక జీవన సౌందర్యాన్ని దృశ్యమానం చేశాడు.
వీర తెలంగాణ గురించి…
”ఎంత సాహసమైనదీ తెలంగాణ
ఎర్రజెండే ఎరుపు ఈ నేలపైనా
ఎవరి రక్తమ్మిచట ఏరులై పారెనో
ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెనో
ఆ అమరవీరులను మదినిండ దలుచుకో (మానేటి పాట; 994, పుట:35)
వారు చూపిన బాట వదలకా నడుచుకో…” అంటూ వీరతెలంగాణ తెగువను చాటాడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమింపజేసి, శాంతి పరివర్తనమని చెప్పిన కమ్యూనిస్టుల పార్లమెంటరీ పంథా ద్రోహాన్ని చెప్పాడు. ఎన్నెన్ని దాడులు ఎదురైనా ఎత్తిన తుపాకీ దించని వీరుల తొవ్వల్ని గానం చేశాడు. ఈ నేల విముక్తి కోసం గొంతెత్తి నినదించి నేలకొరిగిన వీరుల త్యాగాల దారుల్లో నడవాలని చెప్పాడు. పీడిత ప్రజల విముక్తి దారిని ఎన్నటికీ వదలొద్దని చెప్పిన పాట ఇది. మిత్ర రహస్య జీవితంలో, జైళ్లలో ఉన్నపుడు అనేక పాటలు రాశాడు. వీటిని అరుణోదయ, విరసం పుస్తకాలుగా ప్రచురించాయి. జంగ్ సైరనూదే పాటల్ని జనంలోకి తీసుకెళ్లాయి. మిత్ర ప్రజల చరిత్ర, సంస్కృతి, కళల్ని అత్యంత ఇష్టంగా ప్రేమించాడు. తాను వచ్చిన శ్రామిక జీవితం నుంచి జనసంద్రంలోకి ఒడుపుగా ఒల విసిరి పాటల్ని పట్టుకున్నాడు. పల్లవుల్ని ఊపిరిలో నింపుకున్నాడు. అందుకే అతని పాటకు అంత పదును. అది కైతల కవాతై తెలంగాణ జనవిముక్తి గీతాలను ఆలపిస్తున్నది.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పాలనలో తెలంగాణలో నెత్తురు ఏరులై పారింది. మిస్సింగ్‌లు. హత్యలు. దొంగ ఎదురుకాల్పులు. కోవర్ట్ ఆపరేషన్‌లు. విప్లవించే ప్రజలపై తీవ్ర అణచివేత. నిర్బంధాల్లోంచే జైత్రయాత్రగా మారిన పోరాటాలపై మిత్ర పాట, ‘పోరాటాల యాతర’…
”కాకి, కాకి బట్టలోల్ల లాఠీల మోతజూడ
దెబ్బ దెబ్బ దెబ్బలకూ ఎగిసిన పిడికిళ్ల జూడ
అణచివేత ప్రతిఘటనై సాగిన ఆ తీరు జూడ (మానేటి పాట;1994, పుట:40)
మూల నుండి జిల్లంత అల్లుకున్న పోరుజూడ…” అంటూ కరీంనగర్ జిల్లాలో పెల్లుబికిన పోరాటాల జాతరను, ఆనాటి వర్తమాన రాజ్యహింసను చిత్రించాడు.
వీరత్వపు జాడల్లో :
సమ్మక్క, సారక్క, బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీమ్, సర్ధార్ సర్వాయి పాపన్న, షోయబుల్లాఖాన్, బైరాన్‌పల్లి వీరుల వీరోచిత తిరుగుబాటు, త్యాగాలను పాటలల్లిన మిత్రకు మూలవాసీ చరిత్ర, సంస్కృతి, పోరాటాలపై ప్రేమ ఉన్నది. అది తల్లి పేగుబంధం. మాయిముంత.
”మన అమ్మల రాజ్యమొకటుండెరా – అది
లోకమంతా విలసిల్లెరా
అది ఆత్మగౌరవాల బాసరా – అది (కైతల కవాతు; 2016, పుట:6)
ఆకలి కేకల పేగురా…” అంటూ ఆదివాసీల వనరాజ్యం కోసం పోరాడిన ఆదివాసీ అమరవీరులకు జోహార్లర్పించాడు. ఇది స్వయం పాలన కోసం నెత్తురు చిందిన యోధుల వీరగాధ. ఆధిపత్యానికి వ్యతిరేకంగా మహోజ్వల పోరాటాల్ని నడిపిన వీరగాధ.
రాజ్యం గిరిజన ఆదివాసీల భూముల్ని బహుళజాతి సంస్థలకు తాకట్టుపెట్టింది. ఆదివాసీల కాళ్లకిందున్న అపార ఖనిజ నిక్షేపాలను తవ్వుకోవడానికి అనుమతులిచ్చింది. దీంతో రాజ్యం గిరిజన ఆదివాసీల అడవుల్ని ఖాళీచేయిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అడవులపై గద్దల్లా వాలుతున్నాయి. ఆదివాసీల కాళ్లకిందున్న దీనికోసం ఆదివాసీలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్ని జల్లెడ పడుతున్నాయి. అడవుల్లో వేలాది మంది ఆదివాసీలపై మారణకాండ జరుగుతున్నదని హక్కుల సంఘాలు బయటి సమాజానికి నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు. ఇదంతా వ్యవస్థీకృతంగానే జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. అడవుల్ని కొల్లగొడుతున్న దోపిడీదారుల గురించి మిత్ర…
”సమ్మక్క సారక్కలా జంపన్న పగిడిద్ద రాజులా
కొమరం భీమన్నలా త్యాగాలు మంటగల్పినారురో
పచ్చాని అడవులపై ఎక్కడి వలస పచ్చులాలెరో
బంగారు భూములనూ గజదొంగలోలె దోసినారు
నీళ్ళులేని గూడెం రోజు కోసుపెట్టు నడ్సెరో (కైతల కవాతు, 2016, పుట:247)
అడవి బిడ్డలడివికే సూడ సుట్టాలైపాయెరో…” అంటూ అడవుల్ని కాజేస్తున్న దోపిడీ గుట్టును చిత్రించాడు. అడవుల్నీ, ఖనిజ సంపదనూ, ప్రకృతి వనరుల్నీ కాపాడుకునేందుకు యుద్ధంచేయక తప్పదంటున్నాడు. కోయలు, గోండులు, సవరలు, జాతాపులు, కొండరెడ్లు తమ స్వయం పాలన కోసం ఉద్యమించాలంటున్నాడు.
పచ్చని తండాల్లో అగ్గి కురుస్తున్నది. పరుపు బండలూ, పాడి ఆవులూ కనుమరుగయ్యే స్థితి వచ్చింది. ఆవుల మందలు ఆగమైనై. తండాల్లో తీజ్ పండుగ చేద్దామన్నా గోధుమ గింజలు దొరకని పరిస్థితి. నిండు గర్భిణీలు కూడా పొట్టకూటి కోసం వలసపోవాల్సి వస్తున్నది. కాంక్రీట్ జంగిల్‌లో కాటగల్సి పోతున్నారు. చాలీచాలని కూలీ కల్తీసారా పాలవుతున్నది. కన్న బిడ్డల్నీ అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది.
గత కాలం నాటి ప్రేమలూ, ఆప్యాయతల్నీ నిలుపుకుందామని పిలుపునిచ్చాడు కవి. ఆగమైపోతున్న తండాల గురించి చెప్తూ…
”అడవి మీదనే హక్కని చాటే
రోజులన్నీ రావాలి
దొడ్డి నిండుగా ఆవుల మందలు
నిండి కళకళలాడాలి
ఫెరియా కాన్లి టూక్రి లేసి
బోంగ్రమోలె తిర్గాలి
ప్రకృతి కూడా మాతో కల్సి
పరవశించి ఆడాలి
తండాలో రాజ్యమంటు చాటాలి (అదే, పుట: 250)
మా రాజ్యమంటు చాటాలి” అని పిలుపునిస్తున్నాడు.
‘మిత్ర’ గిరిజనం గోసను పాటలల్లాడు. గిరిజనంపై కొనసాగుతున్న దోపిడీ గురించి చిత్రించాడు. గిరిజనాన్ని సంఘటితం చేసే పోరాట పాటలు రాశాడు. ‘కొండ కోనలుండేటి కోయన్నా…’ అనే పాటలో దోపిడీపై ప్రతిఘటన చేయాలని ప్రబోధించాడు. గోదావరిలోయ అటవీ ప్రాంతంలో కొండకోయలను దోపిడీ చేస్తున్న పాలకుల స్థితిని ప్రత్యక్షంగా చూశాక రాసిన పాట ఇది. ఇది 1987 రాసిన పాట.
గిరిజనం అడవినే నమ్ముకొని బతుకుతున్న అమాయక జనం. పోడు భూమే జీవనాధారం. చింతపండు, బంక, ఇప్పపూలు, కట్టెలమ్ముకొని బతుకీడుస్తున్న జనం. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లు గిరిజనుల్ని మోసం చేస్తున్నారు. వాళ్లకు అప్పులిచ్చి, దొంగలెక్కలు రాసి భూముల్ని గుంజుకుంటున్నారు. వాళ్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. దీంతో గిరిజనమంతా నిరుపేదలుగా మారుతున్నారు. అందుకే దోపిడీపై తిరగబడకపోతే బతుకులేదని చెప్పాడు మిత్ర.
”క్రూరమృగాలెన్నింటినో ఎదిరించి నిలిచావు
పంటను కాపాడుకోను వింటినారి కట్టావు
రెండు కాళ్ల జంతువుల కోయన్నా
కోరలన్ని ఊడబీక రారన్నా
ప్రతిఘటన పోరులోన – ఓరన్నా (కైతల కవాతు, 2016, పుట: 235)
పట్టువిడుపు లేకుండా – సాగన్నా…. ” అంటూ గిరిజనాన్ని సంఘటిత పోరాటాల్లోకి కదిలించాడు.
ప్రభుత్వం గిరిజన సంక్షేమ పథకాలు పెట్టింది. కానీ, ఈ పథకాల మాటున తమను దోపిడీ చేస్తున్నారని గిరిజనం ఆరోపిస్తున్నారు. చీకట్లో మగ్గిపోతున్న గిరిజనుల్ని విముక్తి పోరాటాల్లోకి నడిపించే పాటలు రాశాడు మిత్ర. ఇది 1980 దశకంలో గోదావరిలోయ ఉద్యమ పరిస్థితులపై స్పందిస్తూ రాసిన పాట ఇది. బూటకపు సంస్కరణలను ఎదిరిస్తూ సంపూర్ణ విముక్తి కోసం పోరాడాలని చెప్పాడు. ‘ఇన్నేండ్లు లేని’ అనే పాటలో…
”చెట్లల్ల బతికి చేవంతదీసి
చేస్తివి అడివి బంగారం
ఎంగిలికూడుతో ఏజెన్సి మారదు
ప్రతిఘటన పోరును విడువకయ్యో – నీవు (కైతల కవాతు, 2016, పుట: 238)
పోరాట బాటను మరువకయ్యో…’ అంటూ పోరాట బాటను వీడొద్దని విజ్ఞప్తి చేశాడు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకవర్గ విధానాలకు వ్యతిరేకంగా గిరిజనమంతా విముక్తి పోరాటాల్లోకి నడిచారు. పోరాటం ఒక్కటే మార్గమని నమ్మారు.
1990వ దశకంలో గిరిజన ఆదివాసీ ప్రజల జీవన చిత్రాన్ని వివరిస్తూ మిత్ర ‘మొగులుపై ఎన్నెలా’ అనే పాట రాశాడు. అడవిపై, జలవనరులపై కొనసాగుతున్న దోపిడీని ఈ పాట ద్వారా వివరించాడు. ఇది శ్రమైక జీవన సౌందర్యం నిండివున్న పాట.
ఆదివాసీలకు పని దొరకని రోజు పస్తులు తప్పవు. ఒకవైపు మూఢనమ్మకాలు. మరోవైపు గిరిజనేతరుల దోపిడీ. ఇంకోవైపు పాలకవర్గ దోపిడీ. ఇవన్నీ కలిసి గిరిజనం బతుకుల్ని ఆగంచేస్తున్నాయి. సొంత నేలపై పరాయివాళ్లలా బతకాల్సిన దుస్థితి వచ్చింది.
”కంపెనోనికి కర్రాబాయె – బొగ్గుబాయికి భూమి పాయె
కాలువ అడుగున గూడెం బాయె – నిలువ నీడ లేకపాయె
సదువులేదు కొలువులేదు – ఉన్నా గ్యారెంటీ లేదు
అడిగేటోల్లు ముందూకొస్తె తన్నేటోల్లు మీదపడిరి
ఘోరం నేరం ఘోరం నేరం గొల్లూమాని ఏడ్చెరా… (కైతల కవాతు, 2016, పుట: 240)
అడవి గొల్లూమాని ఏడ్చెరా…” ఇదీ గిరిజన ఆదివాసీల బతుకు చిత్రం. బహుళజాతి సంస్థలు గిరిజనుల భూములపై రాబందుల్లా వాలాయి. ఖనిజ వనరుల్ని కొల్లగొడుతున్నాయి. పచ్చని అడవుల్ని కాలుష్య కాసారాలుగా మార్చుతున్నాయి. దీంతో అడవులన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి.
తెలంగాణ విధ్వంసమైంది. సెజ్‌ల పేరుతో రైతుల్ని నిండా ముంచారు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రజల్ని నిర్వాసితుల్ని చేశారు. వాళ్లకు పునరావాసం లేదు. ఉపాధి లేదు. తమ నేలనుంచి తరిమేయబడ్డ అమాయకజనం వాళ్లు.
విధ్వంసకర అభివృద్ధికి వ్యరేకంగా :
అభివృద్ధి మాటున కొనసాగుతున్న విధ్వంసం ఇది. ప్రాజెక్టుల పేరుతో లక్షలాది గిరిజనుల్ని నిర్వాసితుల్ని చేస్తున్న కుట్ర ఇది. ప్రత్యేక ఆర్థికమండళ్ల పేరుతో రైతుల భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్న దౌర్జన్యమిది. ఇదంతా చట్టబద్ధంగానే కొనసాగుతున్న దోపిడీ. గిరిజనులకు రాజ్యాంగం ఇచ్చిన హామీలను అతిక్రమిస్తున్న దౌర్జన్యం. కళింగనగర్‌లో, నందిగ్రామ్‌లో తిరగబడుతున్న ఆదివాసీలపై మారణకాండ కొనసాగుతున్నది. తమ నేలను చెరబడుతున్న మల్టీనేషనల్ కంపెనీలపై గిరిజనం తిరగబడుతున్నారు. సంఘటిత పోరాటాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిత్ర రాసిన పాట, ‘సిరిసిరి కొండలు’. ఇది 2007లో రాసిన పాట.
”సిరిసిరి కొండల
సింహనాదములు
మూగవోయెనయ్యో
ఎన్నెల సాక్షిగ రేలపాటలు (కైతల కవాతు, 2016, పుట:241)
నేలరాలెనయ్యో…” అంటూ పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు పారిస్తున్న చట్టబద్ధ మారణకాండను చిత్రించాడు కవి. ఆకుపచ్చని లోయల్ని దోచుకోవడానికి వస్తున్న బహుళజాతి సంస్థల నగ్నస్వరూపాన్ని పాటగా మలిచాడు. ప్రజల నెత్తురు తాగుతున్న బహుళజాతి సంస్థల దోపిడీని చిత్రించిన పాట ఇది. ఆదివాసీలను నిలువునా ముంచుతున్న విషాదాన్ని కన్నీటి పాటగా మలిచాడు.
”చెరువులన్నియు కూలేకరువు కాటకాలాయే ప్రాజెక్టులా పేరునా
ఊర్లకూర్లు మునిగీ
లక్షలాది నిర్వాసితులంతా గొల్లుమన్నరయ్యో (అదే, పుట:242)
ఏ అభివృద్ధీ గరీబు బతుకుల దరికి జేరదయ్యో…” అంటూ వెలుగు నీడల విధ్వంసాన్ని కైగట్టాడు మిత్ర. గూడు చెదిరిన పక్షుల్లా మారిని గిరిజనులు, ఆదివాసీల గోడు ఇది. ఏ పంచవర్ష ప్రణాళికలూ వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపలేదు. ఏ అభివృద్ధి ప్రణాళికలూ వాళ్ల జీవితాల్లో వెన్నెల కురిపించలేదు. చరిత్ర పొడవునా వంచనకు గురవుతున్నారు. ఏ దిక్కూలేని అమాయక జనం వాళ్లు. అట్లాంటి జనం కోసం పోరుపాటై నినదించాడు మిత్ర. అడవుల్నీ మైదానాల్నీ రగిలించే పాటల్ని రాజేశాడు.
”కళింగ నగర్ ఘోరం నందిగ్రామ్ నరమేధం తెగిన చేతులమట్టి
కారిన రక్తపు వరదా
ఆగదు విస్థాపన పోరు ప్రతిఘటించెనయ్యో
సాగునీ ప్రస్థానం అంటూ చాటి చెప్పెనయ్యో
‘‘సిరిసిరి కొండల సింహనాదములు మారుమోగెనయ్యో (అదే)
శివాలెత్తిన రేలపాటలు చిందులేసెనయ్యో…” అంటూ తిరగబడుతున్న ఆదివాసీల తెగువను చిత్రించాడు.
పచ్చని తండాల్లో పాడి ఆవులు మాయమయ్యాయి. భూములన్నీ బీళ్లుగా మారాయి. ఇండ్లన్నీ పడావు పడ్డాయి. గిరిజనుల బతుకుదెరువు ఆగమైంది. పసిపిల్లల్ని అమ్ముకునే విషాద స్థితి. ఈ పరిస్థితి మారాలంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనేక పాటలు రాసింది. ‘అప్‌నా తండామే ఆప్‌నా రాజ్’ అని డిమాండ్ చేస్తూ సాగుతున్న పోరాటానికి సంఫీుభావం తెలిపాడు మిత్ర.
”కొండకోనలుండేటి-కోయన్నా
సంఘమండ ఇడ్వకుండ పోరన్నా
లాయిరె లాయిరె లల్లాయిలే – లాయిరె లాయిరె లల్లాయిలే`
లాయిరె లాయిరె లల్లాయిలే…” (కైతల కవాతు, 2016, పుట:233)
అంటూ గిరిజన ఆదివాసీల బతుకు చిత్రాన్ని చెప్పాడు. షావుకార్లు గిరిజన గూడేల్ని ఆగం చేశారు. దొంగ లెక్కలు రాసి భూముల కాజేశారు. దీంతో గిరిజనం బతుకులు చీకట్లో కలిశాయి. ఈ చీకట్లు పోవాలంటే వెన్నెల్లాంటి సంఘం అండ ఉందని చెప్పాడు. అడవుల్ని కొల్లగొడుతూ, సహజ వనరుల్ని దోచుకుంటున్న వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పిన పాట ఇది.
”పోడుగొట్టి పొలంనేమో పొతం జేసుకున్నారు
నాగరికం దెల్సుకుని న్యాయానికె నిలిచారు
మేకవన్నె పులులాను – కోయన్నో (కైతల కవాతు, 2016; పుట:233
మీరు ఏటాడి తరమాలి – ఓరన్నో” అంటూ ఆదివాసీలను ఆగంజేస్తున్న ప్రజా వ్యతిరేకుల్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు మిత్ర. ఈ పాట లక్షలాది మంది ఆదివాసీలను సంఘటితం చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా :
పోలవరం ప్రాజెక్టు కింద ఆదివాసీల భూములు జలసమాధి అవుతున్నాయి. అడవుల్ని, సమస్త జీవరాసుల్ని ముంచేసింది. లక్షల ఎకరాలు నీటమునుగుతున్నాయి. లక్షలాది మంది గిరిజనం నిర్వాసితులవుతున్నారు. తరతరాలుగా ఆదివాసీల స్థావరంగా ఉన్న పాపికొండలు మాయమవుతున్నాయి. తమ నేల నుంచి తరిమేయబడ్డ గిరిజనం కంటికి పుట్టెడు ఏడుస్తున్నారు.
ఈ విధ్వంసాన్ని, గిరిజనం గోసను మిత్ర ‘బంగారు మాయలేడి పోలవరం’ పాటగా రాశాడు. ఇది పోలవరం నేలన పొంగుతున్న ఆదివాసీల కన్నీళ్లను చిత్రించిన పాట. విధ్వంసకర పోలవరం ముంపు వ్యతిరేక ఉద్యమం కోసం రాసిన పాట ఇది.
”ఆ… బంగారు మాయలేడి పోలవరమొచ్చెరో
మా అడవులను, జీవులను ముంచేయ జూసెరో
హే… బాణాలు, పాణాలు రెండే మాకున్నాయి
సావైనా… బతుకయినా
సావయినా ఈ అడివే బతుకయినా ఈ అడివే (కైతల కవాతు, 2016, పుట: 243)
అడవి బిడ్డ లేవరో – విల్లంబులు బట్టరో…” అని పోలవరం ఆదివాసీలను చైతన్యం చేశాడు. సంప్రదాయ ఆయుధాలతో దోపిడీదారులపై యుద్ధానికి పిలుపునిచ్చిన పాట ఇది.
జలవనరుల్ని, ప్రకృతిని నాశనం చేస్తున్న అభివృద్ధి వెలుగు నీడల విధ్వంసం గురించి మిత్ర రాసిన పాట ‘ఓ పోలవరమా! తెలంగాణ శాపమా!’.
”నీల్లన్ని దోసుకుంటె నీ మాటలిందుమా
నీల్లల్లో నిప్పులు రాజేస్తే సూద్దుమా
ఓ పోలవరమా ఓ పోలవరమా
పెట్టుబడి పాపమా తెలంగాణ శాపమా
ఓ పోలవరమా ఓ పోలవరమా (అదే; పుట: 127)
ఊర్లన్ని ముంచేస్తె ఉప్పెనై లేవమా…” అంటూ పాపికొండల్నీ, పోలవరం ఆదివాసీల భూముల్నీ ముంచెత్తుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజనాన్ని చైతన్యం చేశాడు.
ఆదివాసీలు, గిరిజనులు వేల ఏళ్లుగా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చరిత్ర పొడవునా ఆదివాసీల నెత్తురు చిందని పోరు లేదు. గిరిజనం అడవుల రక్షణ కోసం ఆయుధాలు పట్టారు. సాయుధమయ్యారు. సమ్మక్క, సారక్కలు. రాంజీ గోండు, కొమురం భీంలాంటి ఆదివాసీ వీరులు ఈ నేల విముక్తి కోసం నెత్తురు ధారపోశారు. ఆదివాసీ గిరిజనం విముక్తి కోసం రగల్ జెండాలు ఎగరేశారు. అట్లాంటి వీరత్వం ఉన్న ఆదివాసీ గిరిజనుల్ని బహుళజాతి సంస్థలు ఆగం చేస్తున్నాయి. వాళ్లపై క్రూరమైన దాడులు చేస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన 1/70 చట్టాన్ని నీరుగార్చారు. గిరిజనంపై మైదాన ప్రాంత దోపిడీదారుల ఆధిపత్యం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆదివాసీలను చైతన్యం చేస్తూ మిత్ర రాసిన పాట- ‘రేలా రేలారే… రేలా రేలారే’.
”రోగాల నీ సావుకూ ఇంకా రోజుకో ఎన్‌కౌంటరూ
కాలిన గూడాలతో బతుకు కాలిబూడిదయ్యెరో
నీవూళ్లో నీ రాజ్యం నీనుండి గుంజుకున్నదెవ్వడో
పి.ఓ.ల కప్పజెప్పి నీవీపు దువ్వుతున్నదెవ్వడో – ఆహ
తెగపాలనెటుపాయెరో నీ గణరాజ్యమెటుబాయెరో (కైతల కవాతు, 2016, పుట: 246)
తెలంగాణనడుగరో నీ స్వయం పాలనడగరో…” అంటూ ఆదివాసీ స్వయం పాలన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలను చైతన్యం చేశాడు.
నిర్వాసితుల గోడుపై :
ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కవ్వాల అడవిని పులుల అభయారణ్యంగా మార్చింది. దానికి అనుబంధంగా బఫర్ జోన్‌ను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వం ఆదివాసులను నిర్వాసితులుగా మార్చే ప్రయత్నం చేసింది. కుంటాల జలపాతాన్ని ప్రయివేట్ విద్యుత్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీలవాదులు క్యాంపెయిన్ నడిపారు. ఈ సందర్భంగా మిత్ర ‘పులుల పేర మనుషుల వేటా మానుకోవా’ అనే పాట రాశాడు. ఈ పాటలో కవ్వాల, కడెం వాగు, కుంటాల జలపాతం, ఉట్నూరు కోట, ఇందన్‌పల్లి, జన్నారం, తాళ్లపేట, బీర్సాయిపేట ప్రాంతాల్లో కొనసాగుతున్న విధ్వంసాన్ని చిత్రించాడు. 2012 ఏప్రిల్‌లో రాసిన పాట ఇది.
”పెసా చట్టం ఏమైపాయె – మనిషివెంట రావా
ఖనిజాల దోసేకాడ – పులులు ఏమి లేవా
మావాట్ మావారాజ్ – మాటలినుకోవా (కైతల కవాతు, 2016, పుట: 246)
పులుల పేర మనుషుల వేట మానుకోవా…” అంటూ ప్రజల భూముల్ని గుంజుకోజూస్తున్న పాలకవర్గాన్ని ప్రశ్నించిందీ పాట. ‘మా ఊళ్లో మా రాజ్యం’ మాటను మళ్లోసారి గుర్తుచేశాడు. కొమురం భీమ్ పోరాట వారసత్వాన్ని అందుకున్న ఆదివాసీ గిరిజనాన్ని చైతన్యం చేసిన పాట ఇది.
లంబాడీ తండాలు పేదరికంతో అల్లాడుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్నాయి. కడుపున పుట్టిన బిడ్డల్ని అమ్ముకుంటున్న విషాద స్థితి. చాలీచాలని కూలీ డబ్బులతో నిరుపేదలుగా మారారు. ఒకనాడు పచ్చని ప్రకృతితో, పశు సంపదతో అలరారిన తండాలు ఇప్పుడు అణగారిపోతున్నాయి. జీవశ్చవాలుగా మారుతున్నాయి. లంబాడీల బతుకు వెతలపై మిత్ర రాసిన పాట ‘పచ్చపచ్చని తండయ్యి’. ఇది 2012లో రాసిన పాట.
గిరిజనులు కొండకోనల్లో నిరంతరం దోపిడీకి గురవుతున్నారు. ఒకవైపు మైదాన ప్రాంతవాసుల దాడి. మరోవైపు అటవీ అధికారుల దాడులు. మరోవైపు ప్రజా వ్యతిరేక పాలకవర్గ విధానాలు. వీటన్నిటితో గిరిజనం తల్లడిల్లుతున్నారు. అడవుల్లో క్రూరమృగాలను ఎదుర్కొనే గిరిజన ఆదివాసీలు గిరిజనేతరుల దోపిడీని ఎదిరించలేకపోతున్నారు. ఆదివాసీలంతా పొద్దున లేస్తే అడవి దారులే దిక్కు. ఇప్ప పువ్వు, చింతపండు ఏరుతారు. కట్టెలమ్ముకుంటారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన దోపిడీ షావుకార్లు దొంగ లెక్కలు రాసి ఆదివాసీల భూములు గుంజుకున్నారు. దిక్కులేని పక్షుల్ని చేశారు. గిరిజనుల అభివృద్ధికోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ కూడా వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపలేకపోయింది. గిరిజనం దీనావస్థపై మిత్ర రాసిన పాట- ‘కొండ కోనపలుండేటి కోయన్నా’.
”ఇప్ప పువ్వు ఏరుకుని తిప్పలెన్నో పడ్డారు
చింతపండు అమ్ముకుని శారెడుప్పు తెచ్చారు
బంకతీసి బాధపడ్తి రోరన్నా
కట్టెలమ్మి కాటికైతి రేలన్నో (కైతల కవాతు, 216, పుట: 233)
లాయిరె లాయిరె లల్లాయిలే – లాయిరె లాయిరె లల్లాయిలే…” అంటూ గిరిజన జీవితాల్లో నెలకొన్న చీకట్లను కైగట్టాడు. ఆదివాసీలు పోడుగొట్టి పొలం చేసుకుంటున్నారు. నీతికీ, న్యాయానికీ నిలబడుతున్నారు. అడవుల్లోకి వచ్చిన విప్లవోద్యమం వాళ్లను చైతన్యం చేసింది. గిరిజనేతరుల దోపిడీని అర్థం చేయించింది. తమ భూముల రక్షణ కోసం వాళ్లను తిరగబడేలా చేసింది. తమను తాము రక్షించుకునేందుకు సంప్రదాయ ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. దోపిడీని ఎదిరించేందుకు సాయుధమయ్యారు. ఈ నేపథ్యంలో మిత్ర…
”క్రూరమృగాలెన్నింటినో ఎదిరించి నిలిచావు
పంటను కాపాడుకోను వింటినారి కట్టావు
రెండు కాళ్ళ జంతువుల కోయన్నా
కోరలన్ని ఊడబీక రారన్నా
ప్రతిఘటన పోరులోన-ఓరన్నాపు (అదే, పుట: 234)
పట్టువిడుపు లేకుండా-సాగన్నా…” అని పిలుపునిచ్చాడు. ప్రతిఘటించకపోతే ప్రాణాలు కాపాడుకోలేమని చెప్పాడు. ఇట్లాంటి జనచైతన్య గీతాలు గిరిజన ఆదివాసీలను సంఘటితం చేస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఆదివాసీ గూడేల్లో అభివృద్ధి చేస్తున్నది. వీధి లైట్లు వేసి గిరిజన జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్తున్నది. కనీస మౌలిక వసతుల్లేక లక్షలాది గిరిజన గ్రామాలు అవస్థలు పడుతున్నాయి. రాజ్యం చెప్పే అభివృద్ధి మాటల్ని నమ్మి అసలు పోరాటాన్ని వదలొద్దని చెప్తున్నాడు మిత్ర. ‘ఇన్నేండ్లు లేని’ వయినం ఇప్పుడెట్లొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నాడు.
”బుడ్డ గోసి పోయి గడ్డి గుడిసె పోయి
పెంకుటిల్లొస్తెనే సరిపోయెనా
పేగు మాడకుండా బతుకు వాడకుండా (అదే, పుట: 236)
భూములన్నీ నీకు దక్కాలయ్యో…” అంటూ ఆదివాసీ భూముల రక్షణ కోసం రణభేరి మోగించే పాటలు రాశాడు. అభివృద్ధి వెలుగు నీడల మాటున విధ్వంసం దాగివున్నదనే సత్యాన్ని చాటాడు. ఈ దోపిడీని ఎదిరించేందుకు…
”చెట్లల్ల బతికి చేవంత దీసి
చేస్తివి అడివిని బంగారం
ఎంగిలి కూడుతో ఏజెన్సీ మారదు
ప్రతిఘటన పోరును విడువకయ్యో`నీవు (అదే, పుట: 238)
పోరాట బాటను మరువకయ్యో…” అంటూ గిరిజన ఆదివాసీలను ప్రతిఘటన పోరులోకి నడవమంటున్నాడు మిత్ర.
రాజ్యహింసపై :
దోపిడీ, పీడన, అణచివేతపై పోరాడుతున్న ప్రజానీకంపై రాజ్యం తీవ్ర నిర్బంధం అమలు చేస్తున్నది. కన్పించిన విప్లవకారులందర్నీ పట్టుకొని చెట్లకు కట్టేసి కాల్చిచంపుతున్నది. ‘ఎన్‌కౌంటర్’ కథలల్లుతున్నది. పోలీసుల బూటకపు ఎదురు కాల్పుల్లో వేలాదిమంది చనిపోయారు. రాజ్యహింస రోజురోజుకూ చెలరేగిపోతున్నది. రాజ్యహింసపై మిత్ర రాసిన పాట, ‘ఎన్నెలెలుగు రేపైనా రాకపోదు’.
”రాజ్యహింస చెలరేగి పోయెగదనే
ఎదురు కాల్పుల పేరమిము జంపె గదనే
వీరులారా…
వీరులారా మీ పేరు మాసిపోదు
ఎన్నెలెలుగూ రేపైనా రాకపోదు”. (మానేటి పాట; 1994, పుట:59)
ఈ పాట ఆనాటి శ్రీకాకుళ గిరిజన పోరాటం నుంచీ నేటి దండకారణ్య విప్లవ పోరాటం దాకా చిత్రించింది. రాజ్య స్వభావంలోనే హింస ఉన్నది. దోపిడీ ఉన్నది. పీడన ఉన్నది. వీటిని ఎదిరించే తెగువున్న ఎవరినైనా అది విడిచిపెట్టదు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే దొంగ ఎదురుకాల్పులే. ఈ పాట రాజ్యహింసల్లో ధ్వంసమవుతున్న తెలంగాణ పల్లెల్ని గుర్తుచేస్తుంది.
”ఆకలయ్యి బువ్వదినెటోల్ల
అలసి సొలసి నిద్రపోయెటోల్ల
తొవ్వనడ్సి పోయే అన్నల
తోటి జనులాతో మాట్లాడేటోల్ల
పట్టుకోనీ…
పట్టుకోనీ పిట్టలోలే కాల్చిరన్నా
ఎదురు కాల్పుల కట్టుకథలల్లిరన్నా…” అంటూ విప్లవకారులపై కొనసాగుతున్న రాజ్యహింస, దొంగ ఎదురుకాల్పుల గురించి చిత్రించాడు, మిత్ర.
”ఆడుదాం డప్పుల్ల దరువెయ్‌రా…” అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గొరుకొయ్యలా దారిచూపే పాట కైగట్టాడు. అతని పాటల్లో సాంస్కృతిక జనరాగం ‘సిబ్బిలో సింగిడి’ అయింది. సెరువులు అలుగులు దుంకాయి. సెలుకలన్నీ సిలుకవన్నెలయ్యాయి. చెరసాల (2008)లో ఉన్నా జనస్వప్నాలనే కలగన్నాడు మిత్ర. ‘మంచెనెక్కి రాత్రి – కాసేను నెలవంక’ అంటూ తెలంగాణ పాటెత్తుకున్నాడు. ఊపిరిలో రగిలే రణన్నినాదాల్ని కలంలో నింపుకున్నాడు. నెత్తుటి నరాల్లో తెలంగాణ పాటై పోటెత్తింది. జైలు నుంచీ జంగ్‌సైరనూదే పాటలు రాశాడు. ‘ఎట్లెట్ల తెలంగాణ తెల్లవారలేదో’ విప్పి చెప్పాడు. దోపిడీ పాలనను ఎదిరించకపోతే బానిసత్వం తప్పదని హెచ్చరించాడు. పి.వి.నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నపుడు తెలంగాణకు పంజాబ్ కమెండోలను దించాడు (1992-1993). దీనికి నిరసనగా ‘మండే గుండెలారిపోవు’ పాట రాశాడు. ‘వేరే దారే లేదు తెలంగాణకు – జనరాజ్యం దప్ప’ అని 1990లలోనే స్పష్టం చేశాడు మిత్ర. అతని కలంలో వనరుల కోసం దరువులయిన పాటలు పుట్టాయి. ‘తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో…’ అంటూ తడి గొంతులారిపోతున్న పల్లెల దూపను కైగట్టాడు. 1990లో గోదావరి వరదకాలువ, ఎగువ మానేరుతో కలిపి కరువు ప్రాంతాలకు నీళ్లందించాలని కరీంనగర్ జిల్లాలో ఉద్యమం జరిగింది. జలవనరుల సాధన సందర్భంగా రాసిన పాట ఇది. ఈ పాట అరుణోదయతో పాటు కామ్రేడ్ బెల్లి లలిత గొంతులో తెలంగాణ అంతటా పోరుగీతమైంది. వందలాది సభల్లో జనగానమై మార్మోగింది. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే’ అంటూ విధ్వంసమైన తెలంగాణ పల్లెల గుండె గోసను పాటల్లాడు. 2002లో ‘సినుకూ సినుకూ కురిసిన నేలన’ అంటూ తెలంగాణ రైతుల బతుకుల్ని చిత్రించిన పాట ఇది. ‘కోయిలా నల్లకోయిలా…’ అంటూ స్త్రీవిముక్తి బాటలో శ్రామిక మహిళల చైతన్యాన్ని రాశాడు, మిత్ర. బీడీ, చేనేత, సింగరేణి, సఫాయి కార్మికుల శ్రమైక జీవనంపై శ్రమరాగం ఆలపించాడు. ఈ కైతల కవాతు అంతటా మేలుకున్న మాదిగ వాడలు. గౌండ్లన్న కల్లు మండువలు. ముదిరాజుల బతుకులు. చాకలి పోరాటం. మంగలి రామయ్యలు. ‘ఊరుకు గుండెలాంటి చెరువులిచ్చిన’ వడ్డెరలు. నాగలి తయారుచేసి నాగరికతకు నడకలు నేర్పిన విశ్వకర్మలు. కాపుదానపోల్లు. ఆరెకటికలు. కుమ్మరోల్లు. బహుజన రిథమై ఉత్పత్తి కులాల హక్కుల పోరుజెండా ఎగిసింది. ‘ఎగిసిపడే జ్వాలా – తెలంగాణ నేల’యి వలస పీడనపై జాతరైంది. సామాజిక నవతెలంగాణ జనజాతరైంది. మిత్ర అమరవీరులపై అజరామర బాణీలు అల్లాడు.
యాభై వసంతాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పాట కవులు, గాయకులు, కళాకారులు, వాద్యకారులు… ప్రతీఒక్కర్నీ గుర్తుచేసుకోవాలి. వాళ్లందరి సామూహిక సృజనే అరుణోదయం.
”అరుణోదయం, శుభోదయం, నూత్నక్రాంతి యుగోదయం
అరుణోదయం అరుణోదయం అరుణోదయం
అడుగునపడి నలుగుతున్న బడుగు జనుల బతుకుల్లో
నవోదయం, శుభోదయం, నూత్నక్రాంతి యుగోదయం”
-కానూరి
(యాభై వసంతాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సావనీర్ కోసం రాసిన వ్యాసం)
★★★