ఎన్నో ఆశలతో, ప్రాణ త్యాగాలతో, దశాబ్దాల ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణ లో అన్ని వర్గాల నుండి, అన్ని వైపులా నిరాశలు, నిరుద్యోగం, స్త్రీలు పిల్లలపై అఘాయిత్యాలు, నిర్బంధాలు, పెరిగిపోతున్న పేదరికం వంటివి కళ్లారా చూస్తున్నాం.
సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం లో ‘దళిత’ మరియమ్మ లాకప్ డెత్ ఒక సంచలనంగా ముందుకు వచ్చింది. ప్రభుత్వం తో పాటు మనకందరికీ ఒక సవాల్ విసిరింది. నిజానికి ఇది ఒక ఉద్యమాల గడ్డ అని, నిప్పు కణిక, త్యాగాల చరిత్ర అని చెప్పుకుని తిరిగే వాళ్ళంగా నేడు సిగ్గు పడాల్సిన సందర్భం వచ్చింది. ఒక పేద, దళిత, ఒంటరి స్త్రీ పొట్టకూటి కోసం ఒక దేవాలయంలో పూజారి, ఫాథర్, పాస్టర్ అని పిలుచుకునే వ్యక్తి ఇంటికి వస్తే, అతని కారణంగా ఆ అమాయకురాలు దారుణంగా పోలీసుల చేతిలో చంపబడ్డది అంటే మన వ్యవస్థ వైఫల్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మన కుల, మహిళా, ప్రజాస్వామిక ఉద్యమాలు ఎంత బలహీనంగా ఉన్నాయో మరొక సారి కళ్ళకి కట్టి మరీ చూపించింది మరియమ్మ చావు. ఇంతకీ ఎవరీ మరియమ్మ?
అంబటిపూడి మరియమ్మ (43) ఊరు కోమట్లగూడెం, ఖమ్మం జిల్లా. భర్త యేసు అనారోగ్యం కారణం గా మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు. మరియమ్మకి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు, సుజాత (25), స్వప్న (23), చిన్నవాడు ఉదయ్ కిరణ్ (20). సుజాత ఇంటర్ వరకూ చదువుకుంది, కొడుకుని కూడా స్కూల్ కి పంపించేది. అమ్మ ఒక్కతే పని చేస్తుంది అని స్వప్న స్కూల్ కి పోకుండా తల్లితో కూలికి పోయేది. ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి చేయడానికి ఉన్న చిన్న జాగాని కూడా అమ్మింది. పెళ్లిళ్లు, భర్త అనారోగ్యం కుటుంబ భారం అంతా మరియమ్మ మీదే. అయితే పెద్ద అల్లుడు నాగరాజు నల్గొండ కాథెలిక్చ మిషన్ చర్చ్ హాస్టల్ లో పని చేసే వాడు. మరియమ్మ కూలికి బయటికి వెళ్ళ లేకపోతుందని తనకి తెలిసిన చర్చ్ గోవిందా పురం, యాదాద్రి జిల్లా, బోనగిరి లో ఫాథర్ బాల శౌరి దగ్గర వంట మనిషిగా మూడు నెలల క్రితం కుదిర్చాడు. ఇంకా పూర్తిగా మూడు నెలలు కూడా కాలేదు.
జూన్ నెల 3వ తేదీ న మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ అతని స్నేహితుడు, వడ్డెర కులస్తుడయిన శంకర్, కలిసి మరియమ్మ పని చేసే దగ్గరికి వెళ్ళినారు. అదే సమయం లో చర్చ్ ఫాథర్ బాల శౌరి ఊరికి వెళ్లి వచ్చి శంకర్ ని వెళ్ళమన్నాడు. అదే రోజు రాత్రి మరియమ్మ ని, ఉదయ్ కిరణ్ ని పిలిచి బీరువా లో 2 లక్షల రూపాయల నగదు కనిపించడం లేదని అడిగాడు. వీళ్లిద్దరు తమకి తెలియదని శంకర్ ఏమన్నా తీసాడేమో అడుగుతాం అని 8 వ తారీఖు న కోమట్లగూడేనికి బయలుదేరారు. అదే విషయం పెద్ద అల్లుడు నాగరాజు కి కూడా చెప్పాడు. అదే నెల 15 వ తారీఖు న బాల శౌరి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో తన డబ్బు పోయాయి అని ఫిర్యాదు చేశాడు. చేయడమే కాకుండా తన వద్ద ఉన్న వాహనం ఇచ్చి పోలీసులని పంపించి మరియమ్మని, ఉదయ్, శంకర్ ని పిలిపించారు. ఉదయ్ ని, శంకర్ ని విపరీతంగా కొట్టారు, తరువాత మరియమ్మ ని శంకర్ ని వదిలేశారు. ఉదయ్ ని మాత్రం కొట్టటం ఆపలేదు, దెబ్బలకి తాళలేక ఉదయ్ ఒక సారి ఊరి పొలం లో ఉన్నాయని అబద్దం చెపితే పోలీసులు అక్కడ తీసుకెళ్లి వెతికించారు, తరువాత తన అక్క స్వప్న పేరు చెప్పాడు. అక్కడికి పోయి పోలీసులు వెతికి ఉదయ్ ని, పెద్ద పెద్ద గొలుసులతో బంధించి ఊరి మధ్యలోనుండి తీసుకొచ్చి కొట్టారు. అక్కడ ఇంట్లో ఉన్నాయని మరొక అబద్దం చెప్పడంతో మరియమ్మ ఇల్లు ని చిందర వందర చేస్తూ ఉదయ్ ని కొట్టారు. ఎక్కడో దాక్కుని ఉన్న మరియమ్మకి తన కొడుకుని చంపేస్తారు అని చెప్పడంతో పోలీసుల ముందుకు వచ్చింది మరియమ్మ. అక్కడినుంచి మరియమ్మ మీద దాడి మొదలు అయింది.
మరియమ్మని, కూతురు స్వప్నని, ఉదయ్ ని తీసుకుని చింతకాని పోలీస్ స్టేషన్, ఖమ్మం కి ఆరోజు సాయంత్రం తీసుకు పోయారు. స్వప్న కి ఒక పాలు తాగే బిడ్డ ఉంది, రాత్రి అంతా స్వప్నని కింద కూర్చో బెట్టి మరియమ్మ ని ఉదయ్ ని పైన అంతస్తు కి తీసుకెళ్లి కొడుతూనే ఉన్నారు. ‘ఒక విరిగిన కట్టెల కుప్ప మా అమ్మ పక్కన పడి ఉంది’ అని కూతురు స్వప్న చెప్పడం అందరినీ కలచివేసింది. మరియమ్మ మంచి నీళ్లు అడిగితే నీళ్ల బాటిల్ మూత లో పోసి మరియమ్మ ముందు చూపిస్తూ, బూతులు తిడుతూ ఆరుగురు పోలీసులు కొడుతూ ఉన్నారు కానీ నీళ్లు కూడా ఇవ్వలేదు. అట్లా కొన్ని గంటలు లాఠీ లు ఆ బక్క శరీరాల మీద విరుగుతూనే ఉన్నాయి, చివరికి 18 ఉదయం నాలుగు గంటలకి స్వప్న ని తన ఊరికి వెళ్లమన్నారు. చిన్న పిల్ల కనుక లేకపోతే నీకు ఇదే గతి పట్టేది అని తిట్టారు, అయితే మరియమ్మ పోలీసులని బ్రతిమాలుకుంది. ‘ఈ చీకట్లో నా కూతురు చంటి బిడ్డని వేసుకొని ఎట్లా పోతుంది జర ఇంటి దగ్గర దింపి నన్ను ఏమన్నా చేసుకోండి’ అని ఏడుస్తూ చెప్పింది. అప్పటికే ఓపిక లేక పడిపోతుంది మరియమ్మ. ‘మీ అమ్మ నీటి చుక్క కూడా తాగలేదు, ఇంకా బతికే అవకాశం లేదు అని అపుడే చెప్పారు’ అని స్వప్న ఏడుస్తూ చెపుతూనే ఉంది.
చిన్నప్పటి నుండి తల్లి తోనే పని చేస్తూ ఎక్కువ దగ్గరగా తల్లి కష్టాలని చూసిన స్వప్న తన కళ్ళముందే తల్లిని దారుణంగా కొట్టడం, తమ్ముడు, తల్లి అరుపులు ఆ రాత్రి అంతా వినడం ఇంకా తనకి వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి అనే చెపుతుంది. ఆ ఉదయమే అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కి తల్లి, కొడుకులని ఇద్దరినీ రెండు వాహనాలలో తీసుకొని వెళ్లారు. వెళ్ళేటప్పుడూ కొడుతూనే ఉన్నారు. ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి మరియమ్మ కళ్ళు తేలవేసింది. ఉదయ్ ఎంత పలకరించి, కళ్ళు తెరిచి, గిచ్చి చూసినా పలకడం లేదు, పోలీసులు దగ్గర్లో ఉన్న ఆర్ఎంపీ కి చూపించి బోనగిరి ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లేసరికి చనిపోయింది అని చెప్పారు. అయితే ‘తల్లి నా వోడి లోనే కన్ను మూసింది’ అని ఉదయ్ చెపుతున్నాడు. పోలీసులు మాత్రం బాల శౌరి దొంగతనం మోపిన కేసులో తెచ్చి విచారిద్దాం అనే లోపు గుండె ఆగి పోయింది అని ఒక ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అదే ఉదయం స్వప్న కి కాల్ చేసి మీ అమ్మకి సీరియస్ గా ఉంది అని చెప్పారు, హుటాహుటిన పరుగెత్తికొచ్చేసరికి అమ్మ ని ఒక చుట్ట చుట్టి పోస్ట్ మార్టం కి తయారు చేస్తున్నారు, కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా పోస్ట్ మార్టం జరిపిస్తున్నప్పుడే దగ్గర్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో, మరియమ్మ ఊరి గ్రామస్తులు, కుల పెద్దలు, బంధువులు, పోలీసులు, ఫాదర్ బాలశౌరి సమక్షంలో మరియమ్మ చావు మీద నోరు మూసుకోవడానికి బేరసారాలు నడిచాయి.
15 లక్షలు అడిగితే 9 లక్షలకి బేరం కుదిరి 3 లక్షలు చేతిలో పెట్టారు. అయితే తల్లిని తలుచుకొని గుక్క తిప్పకుండా ఏడుస్తున్న స్వప్నని మాత్రం ఈ డబ్బు, బేరాలు ఏవీ ఆపలేదు. మీడియాలో కూడా ఈ విషయంపెద్దగా రాలేదు. అయితే కొణిజెర్ల నియోజకవర్గం లో చింతకాని పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన కాబట్టి అక్కడి కాంగ్రెస్ నాయకులు మల్లు భట్టీ విక్రమార్క గారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఉదయ్ ని, స్వప్నని కలవడం మీడియా లో పెద్దగా వచ్చింది. ఉదయ్ వంటి మీద ఉన్న దెబ్బలు మామూలువి కావు. వెనక పిరుదుల మీద పెద్ద పెద్ద చిల్లు పడేలా కొట్టారని, చాలా రక్తం పోయిందని, కడుపులో బూటు కాలితో తన్నడం తో కిడ్నీలకు కూడా దెబ్బ తగిలి ఉందని డాక్టర్ లు చెప్పారు. ఆ విషయాన్ని అయన అక్కడ పోలీసు కమిషనర్ కి, గవర్నర్ కి లేఖ రాసాడు. అప్పుడు కానీ అందరికీ ఈ వార్త తెలవలేదు, అప్పటికే మరియమ్మ లాకప్ డెత్ యాదాద్రి భువనగిరి జిల్లాలో కొద్ది మంది సంఘాలను కదిలించింది. అందులో భాగంగా అనేక మంది నిజ నిర్ధారణ కి వెళ్లడం, డిజిపి గారిని రాష్ట్ర ముఖ్య మంత్రి వెళ్లి రమ్మని ఆదేశించడం జరిగింది. వెంటనే ముగ్గురికి మూడు పది లక్షలు, ఉదయ్ కి చిన్న ఉద్యోగం కూడా ప్రకటించారు కాకపొతే నిందితుల అరెస్ట్ లు కానీ, కేసులు కానీ జరగలేదు. వెంటనే ముగ్గురు పోలీసులను సస్పెండ్ మాత్రం చేశారు. అయితే మళ్ళీ శ్రీ ఆకునూరి మురళి, IAS అధ్యక్షతన ఒక బృందం పర్యటించడం, వేగంగా పోలీసులని, మానవ హక్కుల సంఘాన్ని కలవడంతో కేసుపై రాష్ట్రం అంతటా ఒక కుతూహలం మొదలైంది. పోలీసులని బర్తరఫ్ చేయాలని ఒక డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అయితే బాధితుల తరపున కేసు నమోదు కాక పోవడం, చదువుకున్న వాళ్ళు ముందుకు రాకపోవడం దళిత ఉద్యమాలలో పెద్ద దెబ్బ. వారం రోజుల తరువాత స్వప్న కేసు పెట్టడంతో అక్కడ సస్పెండ్ చేసిన పోలీసులలో ముగ్గురిని పదవుల నుండి తొలగించారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ లు చేయలేదు.
సాధారణంగా గ్రామాలలో దళితుల మీద హింస, అత్యాచారాలు జరిగినప్పుడు పెద్ద మనుషులు కూర్చొనో కొంత డబ్బుతో రాజీ ప్రయత్నాలు చేసేవాళ్ళు. అట్లానే ఈ కేసులో కూడా స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆర్థికంగా చేయూత నివ్వడం ఈ రాజీ ప్రయత్నాల మాదిరిగానే ఉందని విమర్శ కూడా ఉంది. స్వయానా డీజీపీ వెళ్లి కూడా బాధితులకి ఏవిధమైన న్యాయపరమైన భరోసా ఇవ్వకుండా కేవలం చూసి రావడం కూడా వింతగానే ఉంది. మొత్తానికి దళితుల నిరసన, రౌండ్ టేబులు సమావేశం, సోషియల్ మీడియా లో వార్త ల పై ప్రభుత్వం ఒక కమిటీ వేసి ముగ్గురు పోలీసులని సర్వీసు నుండి తొలగించింది. అయితే అరెస్ట్ మాత్రం ఇప్పటివరకు చేయలేదు.
ఇక్కడ మరియమ్మ రెండు లక్షల రూపాయల దొంగతనం నెపంతో చంపబడ్డది, అది కూడా పోలీసుల చేతిలో. రెండు నిండు ప్రాణాలని కూడా లెఖ్ఖ చేయలేదు అంటే కేవలం మరియమ్మ ‘దళితురాలు’ కావడమే ప్రధాన కారణం. ఉదయ్ కూడా ఒక్క రోజు ఉంటే చని పోయేవాడిని అక్కడి వైద్యులు చెపుతున్నారు. ఇప్పటికీ సరిగ్గా కూర్చోలేడు, నడవలేడు, పడుకోలేడు. స్వప్న, ఉదయ్ కళ్ళముందే అంత దారుణమైన హింస కి గురియై చంపబడ్డ సంఘటన ని మరచిపోలేక ఏడుస్తూనే ఉన్నారు. దీనికంతటికి కారణమైన చర్చ్ ఫాదర్ (70 ఎళ్ల క్రితం తెలగ కులానికి చెందిన అనేక మంది గుంటూరు జిల్లా ల నుండి చర్చ్ ఫాదర్ లుగా వచ్చి బోనగిరి ప్రాంతం లో స్థిరపడ్డ వాళ్ళు వేల సంఖ్య లో ఉన్నట్టు అక్కడి ప్రజలు చెపుతున్నారు) మీద కేసు కాలేదు. ఆరుగురు కొడితే కేవలం ముగ్గురిని డిస్మిస్ చేసినట్టు చెప్పినా ఇది ఏది కూడా ఎస్సి ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద శిక్షలు పడ్డట్టు కాదు.
ఇక్కడ మనకి కళ్ళముందు కనిపిస్తున్న లోపాలు :
అసలు ఒంటరి స్త్రీలకి, గ్రామీణ పేదలకి ఉపాధి, భూమి, ఏదన్నా భరోసా ఉంటే మరియమ్మ తన స్వంత ఊరు వదిలి వచ్చేదా? దేవుడు, ప్రేమకి ప్రతి రూపం అని చెప్పుకు తిరిగే చర్చ్ ఫాదర్ మీద ఇదివరకే కొన్ని కేసులు ఉన్నాయి అని అక్కడి ప్రజలు చెపుతున్నారు. అతని మీద నిఘా కానీ పెడితే లేదా అక్కడ సిసి టీవీలు ఉంటే ఈ దొంగతనం నెపం మోపే అవకాశం ఉండేదా? అసలు పోలీసులకి కొట్టే అధికారం ఎవరిచ్చారు? కేసు నమోదు కి మా పోలిసు స్టేషన్ పరిధి కాదు అనే వారు కొట్టడానికి వేరే పోలీస్ స్టేషన్ లో అనుమతి ఎట్లా ఇచ్చారు? ఒక్క మహిళా కానిస్టేబుల్ లేకుండా ఒక పాలు తాగే పిల్ల తల్లిని, ఒక స్త్రీని అంతమంది మగ పోలీసులు తీసుకొని రాత్రి అంతా పోలిసు స్టేషన్ లో పెట్టడం తప్పుగా ఈ ‘ఫ్రెండ్లి పోలీసులకి’ ‘షీ టీమ్’ లకి కనిపించలేదా? పొద్దున్న లేస్తే టెక్నలాజి అని, ఎన్నో అవార్డులు ప్రకటించుకొని, ఆధునికతలో ముందుకు పోతున్నామని చెప్పుకొనే ప్రభుత్వాల లో కనీసం ఒక పోలీస్ స్టేషన్ లో కూడా సిసి కెమెరాలు పని చెయ్యవు.
ఈ నిర్లక్షానికి, నిర్లిప్తతకి కారణం తెలుసుకోవాలంటే ‘కులం ‘ పరిధిని, ప్రభావాన్ని, అది మన మెదళ్లలో ఎంతగా పాతు కు పోయిందో తెలుసుకోవాలి. కొద్ది కాలం క్రితం దిశ రేప్ జరిగినప్పుడు ఉర్రూతలూగిన జనానికి ఈ ‘దళిత’ మహిళల చావులు, అత్యాచారాలు ఎందుకు కనపడవు? మీడియా, రాజకీయ నాయకులు దోషులని ఎంకౌంటర్ చేయాలని ఎందుకు మొత్తుకోరు? (ఎలాంటి హత్యలకైనా, చావులకైనా నేను వ్యతిరేకం, ఆ స్పందనలని గుర్తు చేస్తున్నాను అంతే.) మరియమ్మ ఒక రావో, రెడ్డి అమ్మనో అయితే ఈ స్థితి పడుతుందా? అసలు దగ్గరికి వచ్చే ధైర్యం చేస్తారా పోలీసువాళ్ళు. వచ్చినా జనాలు ఊరుకుంటారా? అటు ఒకళ్ళో ఇద్దరో తప్పితే మహిళా సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ ఎక్కువగా స్పందించలేదు, దానికి కారణం కూడా కులమే.
మరియమ్మ కి ఏ సంఘాలతో, సంస్థలతో సంబంధం లేదు, ఎటువంటి రాజకీయాలు తనకి తెలియవు, జీవితమంతా భారంగా ఈడ్చుకొచ్చిన ఒంటరి స్త్రీ. బహుశా సుఖం అంటే ఏమిటో తెలిసి ఉండక పోవచ్చు కానీ చావు ఇంత భయంగా ఉంటుందని ఊహించక పోవచ్చు, చేయని నేరానికి ఇంత కిరాతకంగా చంపబడతానని ఎప్పుడూ అనుకోకపోవచ్చు. దీనికి కారణం ఎవరు? మనమే, మనమందరం సామూహిక బాధ్యత వహించాల్సిందే. ఒక బలహీనమైన స్త్రీని అధికారమే చంపితే ఇంక సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? డబ్బు ఇచ్చినంత మాత్రాన పోయిన తల్లి తిరిగి వస్తుందా? పేద వాళ్లకి తల్లి, తండ్రులే పెద్ద ఆధారం, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఇపుడు జరిగిన గాయం వాళ్ళ జీవిత కాలంలో మానుతుందా?
మళ్ళీ మళ్ళీ చెపుతున్నాం, వివక్షకు గురి అయిన వాళ్ళుగా చెపుతున్నాం, ఈ సమాజానికి, వ్యవస్థలకు, ఉద్యమాలకి, మీడియా కి, స్పందనలకి కూడా కులం ఉంది అని మరొక సారి నిరూపించబడ్డది. కులం పోవాలంటే నాలుగు పధకాలు సరిపోవు. బాబాసాహెబ్ చూపిన ‘కుల నిర్మూలన’ కావాలి, అది కావాలంటే ఒక్క అంటరాని వారు మారితే సరిపోదు అందరూ మనుషులుగా మారాలి, కనీస స్పందనతో బతకాలి అప్పుడే ఏ చట్టమైనా పనిచేస్తుంది. ఉద్యమాలు బలంగా లేవు కాబట్టే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని కూడా గుర్తించాలి. మరొక మరియమ్మ చావు లేకుండా చూసే బాధ్యత మన అందరిదీ.