మరణ వాంగ్మూలం కాదు; జీవన సాఫల్య ప్రకటన

కరుణని చూసిన తొలి రోజుల్లో ఆమె రాసిన తాయమ్మ కథ గుర్తొచ్చేది. ఆ కథలో కడుపు లుంగలు చుట్టుకుని యేడ్చిన తాయమ్మ దుఃఖమే తలపుకొచ్చేది. కానీ కరుణ రాసిన ‘సహచరులు’ కథ చదివిన తర్వాత మాత్రం ఆమెను చూసినప్పుడల్లా అమరుడు మంజీర స్ఫురద్రూపమే కళ్ళముందు కదలాడేది. విప్లవోద్యమంలో స్త్రీ పురుష సంబంధాల గురించి, వాటి పట్ల పార్టీ వైఖరి గురించి, వుద్యమ జీవితంలో యెదురయ్యే అనేక వైరుధ్యాల గురించి సంక్లిష్టతలు గురించి ఆలోచనలు చుట్టుముట్టేవి. కరుణతో మాట్లాడిన ప్రతిసారీ యెందుకో మంజీర గురించిన జ్ఞాపకాలు ఆమె తడి కళ్ళలో మెరిసి కలతపెడతాయి. ఆమె పదిలంగా దాచుకున్న మంజీర జ్ఞాపకాలంటే వుద్యమ జ్ఞాపకాలే. జీవిత సహచరుడిగా వుద్యమ సహచరుడిగా మంజీరతో కలిసి నడిచిన తోవ, అతని జీవితాశయాలు, అతని సాహిత్యాభిరుచులు, విప్లవ సాహిత్యం గురించి అతని విమర్శనాత్మక అభిప్రాయాలు యెన్నో ఆమె మాటల్లో మత్తడి దుంకుతాయి. విప్లవోద్యమ నేపథ్యం నుంచి వాళ్ళిద్దర్నీ విడదీసి చూడలేనితనం యెందుకనో నన్ను వదలదు. సాహిత్య చర్చల్లో సైతం మా రవి అయితే ఫలానా విషయమై యిట్లా అనేవాడు అట్లా అనేవాడు అని ఆమె పదే పదే ప్రస్తావించకుండా వుండదు. రచయితగా తన యెదుగుదలలో మంజీర పోషించిన మెంటర్ పాత్ర గురించి చెప్పేటప్పుడు ఆమెలో వొకవిధమైన ఆరాధనాభావం కూడా కనిపిస్తుంది. కరుణ వేర్వేరు సందర్భాల్లో చిత్రించిన మంజీర వ్యక్తిత్వాన్ని నేను అతని కవిత్వంలో వెదకడానికి ప్రయత్నించాను.

మంజీర విప్లవాచరణ ప్రస్థానానికీ వ్యక్తిత్వ నిరూపణకూ అతను అమరుడైన తర్వాత వచ్చిన ‘మంజీరా మూడ్స్’ నిలువెత్తు అద్దం. పీడిత ప్రజా సమూహాల పట్ల నిబద్ధత అతని కవిత్వంలో ప్రతి వాక్యంలోనూ నిప్పై కురుస్తుంది. ‘ఎన్ కౌంటర్ ను కౌంటర్ చేసి ప్రజల నాలుకలపై పాటగా ఉదయించడానికి’ అతను చేసిన ప్రయాణం ప్రతి పదంలోనూ కదలాడుతుంది. ‘ఒక నిషిద్ధ సత్యాన్ని ఫలింప చేసుకున్నప్పుడే’ జీవితం చరితార్థం అవుతుందన్న అతని ఆకాంక్షే ప్రత్యక్షరంలోనూ జ్వలిస్తుంది.

‘చెరగని చిరునవ్వుల కోసం వెలుగొందే ఆశల కోసం నిషేధించిన స్వప్నాలను వెతుకుతూ స్వేచ్ఛా రాజ్య స్థాపన కోసం సామ్రాజ్యవాద మృత్యువుకి విరుగుడు వెతుకుతూ వ్యర్థంగా బతికే జీవితాల నుండి జీవితాలను వికసింపజేసే పోరాటంలో’ వర్గ పునాది మీద నిలబడి అతను చేసిన ఆచరణాత్మక సైద్ధాంతిక చర్చల సారాన్ని ‘మంజీర మూడ్స్’లో చూడగలం. అంతర్జాతీయ పటం మీద ఆకలి కేకల సోమాలియాని నెపం చేసుకొని సామ్రాజ్యవాదపు అమానవీయ ముఖం గురించి రాసినా కూల్చిన లెనిన్ విగ్రహంలో ప్రజల అజ్ఞాత శక్తిని దర్శించినా ఇంద్రవెల్లి – తీన్మెన్ స్క్వేర్ నెత్తుటి స్థూపాల్ని పోల్చి చూసినా మంజీర తన రాజకీయ అవగాహని వ్యక్తపరచడానికి కవిత్వాన్ని మాధ్యమంగా చేసుకొన్న తీరు ఆశర్యం కలిగిస్తుంది. ‘వర్గ యుద్ధంలోనే చరిత్ర రూపుదిద్దుకుంటుంది’ అన్న విశ్వాసం అతని కవిత్వానికి శ్వాస. తరచి చూస్తే పోరు బాటలో నడిచే ప్రజా మిలిషియా ఆలోచనలనే అతని కవితలు రికార్డ్ చేశాయి. ఆచరణ గీటురాయి మీదే సాహిత్యం విలువ నిరూపితమౌతుంది అని అవి అన్ని విధాలా తేల్చిచెప్పాయి.

రాజ్యానికి యెదురు నిలిచి పోరాడే విప్లవకారులు చావు యే నిమిషంలోనైనా ముంచుకు రావొచ్చు అన్న స్పృహలోనే జీవిస్తుంటారు. సహచరులతో ప్రతి కలయికలోనూ యెడబాటుకు సిద్ధమై వుంటారు. వెంటాడే అనిశ్చితిలోనే సుందర భవిష్యత్తు గురించి కలగంటారు. రేపటి ప్రపంచంపై వాళ్ళ సడలని విశ్వాసమే పెదాలపై చిరునవ్వుతో మృత్యువుని ఆహ్వానించే స్థైర్యాన్ని యిస్తుంది. ‘చావుదేముంది/ బతకడం శాశ్వతమైతేకదా!/ క్షణకాలం బతికినా సరే/ పరిమళభరితంగా బతకడం!/ చుట్టూ ప్రపంచాన్ని పరిమళభరితం చేయడం’ అంటాడు కౌముది. ‘చావునన్ను సమీపించి/ గుసగుసలాడకముందే/ ఆంక్షల సంకెళ్ళు దాటి/ నిన్ను ఒక్కసారి చూడాలని/ నా చివరి కోర్కె’ అని శివసాగర్ అమ్మకు విప్లవాభివందనాలతో తన చివరి కోర్కె తెలియజేస్తాడు.

అదొక చిత్రమైన మానసిక స్థితి. దాన్ని విప్లవకారులు వుద్యమ గమనంలో ప్రతినిత్యం యెదుర్కొన్నప్పటికీ సూక్ష్మదృష్టితో తరచి చూసుకునే వ్యవధి వుండదు. అవకాశం అరుదు. అటువంటి మానసిక స్థితిలోనే యుద్ధ విరామ సమయాల్లో ఆగి చూసుకున్న క్షణంలో మంజీర గుండె లోతుల్లో నుంచి పెల్లుబికిన వుద్వేగాల వెల్లువే ‘మరణ వాంగ్మూలం’ కవిత. మరణించడానికి యే ఆరునెలల ముందో కూర్చిన ఆ కవిత నిజానికి మరణ వాంగ్మూలం కాదు; ‘ధైర్యాన్ని దీపం చేసుకుని గమ్యం వైపు నడిచే’ దారిలో నిండు గుండె విప్పి చేసిన జీవన సాఫల్య వ్యక్తీకరణ. రక్తచలన గీతం. ఉద్యమాలు వెనుకతట్టు పట్టొచ్చు; ఓడిపోవు. మనుషులు మరణించవచ్చు; త్యాగాలు వృధాపోవు అని చెప్పిన బహిరంగ ప్రకటన.

ఎప్పుడో అమ్మ ‘జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావ’ని మందలించిందో యేమో అది మంజీర మనసులో గాఢంగా నాటుకొని వుంటుంది. జైల్లో వున్నప్పుడు (మర్యాద మంట కలిపాడని కోపంతో?) అమ్మ చూడటానికి రానందుకు కూడా బలంగా గాయపడి వుంటాడు. జైలుని విద్యాలయం చేసుకొని ‘చీకటి తర్వాత మోగే వెలుగు గంట’ కోసమే యెదురు చూశాడు తప్ప అమ్మను తప్పుబట్టలేదు. తాను విశ్వసించిన ఆచరణ సరైనదే అని ఆమెను చివరి వరకూ వొప్పించడానికే ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే అమ్మ పంచి యిచ్చిన తన జీవితం వృధా కాలేదని ప్రకటిస్తున్నాడు. మృత్యువు ముందు నిలబడి చేస్తున్న ఛాలెంజ్ కూడా ఆ ప్రకటనలో దాగి వుంది.

నవమాసాలు నన్ను మోసి, కాన్పులో
నువ్వు పడ్డ బాధ వృధా కాలేదు
నాకు పంచిచ్చిన
రక్తమాంసాలు వృధా కాలేదు
అవునమ్మా! నా జీవితం వృధా కాలేదు
ప్రేమతో నువ్విచ్చిన చనుబాలు వృధా కాలేదు
పాడిన లాలి పాట వృధా కాలేదు
అమ్మా! నా జీవితం వృధా కాలేదు
అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి తొమ్మిది నెలలు తన రక్తమాంసాలు పంచి పోషించించింది. తల్లికి మాత్రమే అనుభవ వేద్యమైన ప్రసవవేదనని భరించి కన్నది. ప్రేమతో చనుబాలు తాపింది. జోలపాటలు పాడింది. అవేవీ వృధా కాలేదని తనలోకి తాను చూసుకుంటూ తన వుద్యమ ప్రస్థానాన్ని పరిశీలించుకుంటూ అమ్మకు చేసిన నివేదన యిది. ప్రత్యక్షరం అతనిలోని సున్నితత్వాన్ని ప్రతిఫలిస్తుంది. ప్రజల పట్ల అమేయమైన ప్రేమను ప్రతిధ్వనిస్తుంది.

సాధారణంగా జీవితం చివరి క్షణాల్లో నడిచిన దారి గురించిన సమీక్ష వుంటుంది. చాలామంది చేసిన తప్పులకు పశ్చాత్తాప పడతారు. జీవితాన్ని అర్థవంతంగా గడిపిన వాళ్ళే సమీక్ష/ పునస్సమీక్షల్లో వొకవిధమైన తృప్తిని అనుభవిస్తారు. విప్లవకారులు మాత్రమే ప్రజా క్షేత్రంలో సామాజిక పరివర్తనలో తమ ఆచరణనే ప్రమాణంగా తీసుకొని గర్వంగా నిష్క్రమించగలరు. అందుకు ప్రజలే పరీక్షకులు. ప్రత్యక్ష సాక్షులు. అంతిమ తీర్పరులు.

చివరి ఊపిరి బిగబట్టి నేలకొరుగుతూ
నా ప్రజల సాక్షిగా చెప్తున్నాను
అమ్మా!
నా జీవితం వృధా కాలేదు.
అమ్మ వొడిలో వుగ్గుపాలతో నేర్చిన పాఠాలు చదువులు నీతికథలు .. వాటన్నిటినీ వుద్యమాచరణలో జైల్లో అజ్ఞాతంలో అడవిలో ప్రజా సమూహాల మధ్య నేర్చిన పాఠాలతో విమర్శనాత్మకంగా బేరీజు వేసికొని గతి తార్కికంగా అర్థం చేసుకొని గమ్యాన్ని నిర్దేశించుకున్నానని కవితలో నిక్కచ్చిగా నిరూపిస్తున్నాడు. ప్రజల కోసం తానేం చేయగలిగానో ప్రస్తావిస్తున్నాడు.
ఒడిలో పడుకోబెట్టుకొని నువ్వు నేర్పిన
తొలి చదువు వృధా కాలేదు
చెప్పిన నీతి కథలు వృధా కాలేదు
అమ్మా నా జీవితం వృధా కాలేదు
ప్రజల కోసం నేను చేయగలిగిన పనులన్నీ చేసాను

తన కవిత్వం కథలు కళలు ఆట పాటలు పాఠాలు అన్నీ సమాజం కోసమే అంకితం చేశానని చెబుతూ ఆ నేర్పు తనకు తల్లి వొడిలోనే లభించిందని కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. నేర్పరితనం దానికదే స్వతంత్రం కాదు. దానికి కార్యకారణ సంబంధం వుంటుంది. దాని నైమిత్తికతని గ్రహించేది సమాజంలోనే. వ్యక్తుల సామాజిక గమనంలోనే. అది సాయుధ పోరాట మార్గమే. అందులో భాగమే సాహిత్యమైనా కళలైనా ..త అనే స్పృహతో రాసిన పంక్తులివి. విప్లవమే సృజనకు అంతిమ రూపం. సాయుధమై పోరాడే దిశలోనే తన రచనా ప్రస్థానం సాగిందనీ సమస్త సృజనాత్మకత వర్గపోరాటంలో భాగమేననీ అమ్మకు తెలియజేసే నెపం మీద తనను తాను assert చేసుకోవడం యీ కవిత పొడవునా గమనిస్తాం. ప్రతి సామాజిక రాజకీయ సందర్భంలోనూ రచయితలందరికీ యీ assertion/ reassertion అవసరం. అందులోనే ఆత్మవిమర్శకు సైతం చోటుంటుంది. ఈ అంశాలే మంజీర తన పాఠాల్లో బోధించి వుంటాడు. అవి కేవలం మార్క్సిస్టు తత్వశాస్త్రం చెప్పే రాజకీయ పాఠాలే కాకపోవచ్చు. జీవిత పాఠాలు కూడా. అతని దగ్గర నేర్చుకుని జీవితాల్ని దిద్దుకున్నవాళ్ళ జ్ఞాపకాల్లో అవి యీ రోజుకీ సజీవంగా వున్నాయి. గత వర్తమానాల్ని మూల్యాంకనం చేసుకున్నప్పుడు తన కర్తవ్యాన్ని తాను సక్రమంగా నిర్వర్తించాననే ధీమా కూడా మంజీర మాటల్లో కనిపిస్తుంది. చూడండి.

కవిత్వం రాసాను, కథలు రాసాను
ఆడాను, పాడాను, వైద్యం చేసాను, పాఠాలు చెప్పాను
అన్నిటికి మించి ఆయుధం పట్టి పోరాడాను
సమాజ గమనంలో
నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాను
అమ్మా! నా జీవితం వృధా కాలేదు

పెద్ద చదువులు చదివి (రవి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు) వుద్యోగం చేసి తండ్రి చనిపోయాకా పెద్ద కొడుకుగా యింటి బరువు కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడని తల్లి సహజంగానే ఆశించి వుంటుంది. కానీ అతను వేరే మార్గం యెంచుకున్నాడు. సమాజమే తన కుటుంబమని నమ్ముకున్నాడు. చేతికందిన కొడుకు అందకుండా పోవడం ఆ తల్లి జీర్ణించుకోలేక పోయుంటుంది. తల్లీ కొడుకుల మధ్య నడిచిన యీ ఘర్షణ అంతా అతనిలో కవిత్వమైంది.
ఆశలు పెట్టుకుంటే
అందకుండా పోయానని
కష్టాలకు నిన్నొదిలి కారడవులకు పోయానని
నాపై వున్న చిరు కోపాన్ని
అమ్మా! ఇకపై వుండనీయకు
అందుకు తనను మన్నించమని అతను అమ్మను అడగడంలేదు. దుఃఖాన్ని అణచుకొని లక్షలాది తల్లుల్లో తన తల్లిని చూసుకున్నాడు. తల్లి రుణం ప్రజల దగ్గర తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మరణానికి సిద్ధమయ్యే పోరుబాట పట్టాడు.

కారే కన్నీటిని కొనవేలితో తుడిచి
నిన్నిక చూడలేనన్న బాధను అణచుకుంటూ
సగర్వంగా ప్రకటిస్తున్నాను
నువ్వు నాకు చేసిన సేవలు వృధా కాలేదు
నీ రుణం ప్రజల దగ్గర తీర్చాను
నేను ప్రజల కోసం యుద్ధంలో మరణిస్తున్నాను
శివసాగర్, కౌముది కూడా దాదాపు యిలాగే అమ్మలతో సంభాషించారు. పూర్తి కాలం వుద్యమంలోకి వెళ్లే ముందో అజ్ఞాత జీవితం గడుపుతున్నప్పుడో వుద్యమ క్షేత్రంలో నిలబడి శత్రువుతో తలపడుతున్నప్పుడో విప్లవకారులందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగా వుత్తరాల ద్వారానో తమ ఆత్మీయులతో యిటువంటి సంభాషణే నెరపి వుంటారు.

రాలిపడిన పూవులకై
గాయపడిన పిట్టలకై
ప్రాణమివ్వ నేర్పినావు
ఉరికొయ్యను ధిక్కరించు
సాహసాన్ని తాపినావు
ఏటికి ఎదిరీదమని
ఉగ్గుపాలు పోసినావు
నెలబాలుని నీ చనుబాలతో
పెంచి పెద్ద చేసినావు
అమ్మా! నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు! (శివసాగర్ )
పీడిత ప్రజలకోసం ప్రాణాలివ్వమని వుగ్గుపాలతో ఉరికొయ్యని ధిక్కరించమని చనుబాలతో అమ్మ నేర్పినందుకు శివసాగర్ ఆమెకు విప్లవాభివందనాలు తెలిపాడు. ఈ పాట కనీసం మూడుతరాలుగా విప్లవోద్యమ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూనే వుంది. ఆ స్ఫూర్తినుంచి పురుడు పోసుకున్నవాళ్ళే కౌముది అయినా మంజీర అయినా.

‘ఈ యుద్దరంగంలో నుండి నేను రాకపోతే
ఎన్నటికీ రాలేకపోతే
ఒకవేళ నేను చనిపోతే
నా కోసం నువ్వెప్పుడూ ఏడ్వకమ్మా
కదిలే మేఘాల వైపు చూడు
నా రూపు కన్పిస్తుంది
నా పుట్టినరోజు వాకిట్లో నెత్తుటి ముగ్గు వేసి
కదనరంగానికి రంగం సిద్దం చెయ్యమ్మా
కత్తీడాలునై నీ చేతుల్లోకి వస్తాను’
అంటాడు కౌముది. విప్లవ కవిత్వం ‘కొట్టు, చంపు’లతో నినాదప్రాయమైందని అన్నవాళ్ళు గుడ్డివాళ్ళయినా కావాలి, చూడడానికి నిరాకరించేవాళ్లయినా కావాలి. మార్క్సిస్టు సౌందర్య శాస్త్ర విమర్శ వెలుగులో ‘విప్లవ కవిత్వంలో అమ్మ’ పై పరిశోధన చేస్తే వాళ్ల కళ్ళు విచ్చుకుంటాయి. నా కోసం ఏడవ వద్దని కౌముది అంటే నీ కన్నీటి బొట్టు వృధా కాదనీ తన మరణం కడుపుకోత మిగిల్చినా అది పుడమి తల్లి పురిటి నొప్పులుగా మారి కొత్త సృష్టికి కారణమౌతుందనీ మంజీర విప్లవ స్వప్నాన్ని ఆవిష్కరించాడు.

శత్రు తూటాలకు గాయపడి
ఆణువణువూ వణుకుతున్న శరీరాన్ని
అదిమిపట్టి, ఆనందంగా చెప్తున్నాను
అమ్మా! నా జీవితం వృధా కాలేదు
కారుతున్న చివరి నెత్తుటిపై
అరచేతిని బిగించి పట్టి
ఆవేశంగా చెబుతున్నాను
అమ్మా! నా జీవితం వృధా కాలేదు
చివరి మాటగా చెప్తున్నా
వీడుకోలుగా పాడుతున్నా
అమ్మా! నీ కన్నీటి బొట్టు వృధా కాబోదు
నీ కడుపుకోత
పుడుమి తల్లి పురిటి నొప్పులుగా మారుతున్నది
అమ్మ తన కాన్పులో పడ్డ వేదన దగ్గర మొదలైన కవిత పుడమితల్లి పురుటి నొప్పుల దగ్గర ముగియడంతో వీడ్కోలు పాట పరిపూర్ణమైంది. ప్రతి మరణం కడుపులో మరొక జననం వుంటుంది. ప్రతి విధ్వంసం నుంచి నిర్మాణం పురుడు పోసుకుంటుంది.

‘అంతా అణగిపోయింది
అడవి ఎండిపోయింది’
అని వాడూ వాడి వందిమాగధులూ అరచి అలసిపోతారు. విప్లవం ఆగదు. వసంత మేఘం మళ్ళీ మళ్ళీ గర్జిస్తుంది. అడవి యెప్పట్లానే చివుళ్ళు తొడుగుతుంది. ఉద్యమ సహచరులారా, నేలను ముద్దాడిన మీ పెదవి చివరి నెత్తుటి బొట్టు రేపటి వుదయాన్ని హామీ ఇస్తుంది. రెడ్ సాల్యూట్స్.

(మంజీర స్మృతిలో .. అడవి మీదా ఆదివాసీ మీదా కార్పొరేట్ దళారి పాలకుల దాడుల్ని నిరసిస్తూ .. ప్రజలు అజేయులని విశ్వసిస్తూ .. )

★★★

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “మరణ వాంగ్మూలం కాదు; జీవన సాఫల్య ప్రకటన

  1. గుండెల్ని తాకే రచన. అభినందనలు..

    ముకుంద రామారావు

Leave a Reply