‘మట్టిపూల గాలి’లో స్వేచ్ఛ ఒంటరి దు:ఖగానం

కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ రచయిత పరిచయం ఉంటే వారి రచన అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. ‘మట్టిపూల గాలి’ కవితా సంపుటి 22 ఫిబ్రవరి 2018న సహచర బుక్ హౌజ్ శంకరన్న ఈ పుస్తకాన్ని అందజేస్తు చదవి రాయండని చేతికిచ్చారు. ‘స్వేచ్ఛ’ కవిత్వం ద్వారా నాకు పరిచయంలోకి వచ్చింది. ఏడేళ్లలో చాలాసార్లు ‘మట్టిపూల గాలి’ వర్షించిన తడిలో నేను తడిసిపోయాను. స్వేచ్ఛ అకాలమరణం తరువాత ఆమె కవిత్వం మీద ఒక సమీక్షను ఏడేళ్లకు రాయాల్సి రావడం బాధాకరమైనప్పటికీ, ఇపుడు ఇదొక అక్షర నివాళిగా భావిస్తున్నాను. స్వేచ్ఛ అంతరంగ ఘర్షణను నాకున్న పరిమితమైన జ్ఞానం ద్వారా అవగాహన పరచడానికి ప్రయత్నం చేశాను. జీవితానికి, సృజనకు విడదీయరాని సంబంధం ఉందనే భావన కలిగింది. తన జీవితంలోని మానసిక సంఘర్షణ నుంచి బయటపడటానికి కవిత్వాన్ని ఓదార్పుగా భావించి ‘మట్టిపూల గాలి’తో కొంతమేరకు ఉపశమనం పొంది వుంటుంది.

జీవితంలో ఉత్తాన పతనాలకు గురిచేసే నమ్మకం వెనక దాగుండే ద్రోహమే సంక్షుభిత సందర్భాల నుంచి తనను తాను నిలబెట్టుకోవడంలోనే సాహస వ్యక్తిత్వం చేయగలిగే పని, జీవితంలో సెదతీరడానికి చెట్టుకోసం వెతకడం కంటే తనను తానే ఒక వచ్చని చెట్టుగా నిలుపుకున్న కవయిత్రి స్వేచ్ఛ. ఈమె కవిత్వంలో బయటకు కనిపించని సముద్రపు అలజడులున్నాయి. వత్తిళ్లకు లోనైనప్పటికీ తల ఎత్తి నిలబడటం అంటే

‘నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసినపుడు
మళ్లీపైకి ఎక్కి నిలబడింది నేనే
పసి చివురును పొత్తిళ్లలో పొదుముకున్నంతలోనే వేరు తెగినపుడు
నేలలోకి కుంగి మళ్లీ మొలకెత్తింది నేనే’ అంటూ ఒక ఆత్మవిశ్వాస ప్రకటన చేయడం స్వేచ్ఛ
కవిత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణ.

స్వేచ్ఛ తన కవితా సంపుటిని నవంబరు 2017లో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ‘నన్ను నాకిచ్చిన నీకంకితం’ అంటూ చేసిన ప్రకటనలో తన సహచరునికి ఇచ్చినట్లుగా భావిస్తున్నాను. నూట నాలుగు పేజీల పుస్తకంలో డెబ్బయి ఒక్క కవితలను ముద్రించారు. అందమైన అత్యాధునిక కళతో కవర్ పేజీని ఏలె లక్ష్మణ్ చిత్రించారు. ఈ కవితలన్నీ 27, ఏప్రిల్ 2016 నుంచి 1, అక్టోబరు 2017 మధ్యకాలంలో రాసినవి, కాసింత విరామం కూడా లభించని నిత్యం బీజీగా ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న స్వేచ్ఛ ఒకవైపు వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు కుటుంబ బాధ్యతల నిర్వహణ కత్తి మీద సాములాంటిదే. సమాజాన్ని, సమాజంలో తన చుట్టూ ఉండే మనుషుల అంతరంగాల ఆలోచనలు, నమ్మకమైన మోసాలను అనుభవించి బాధాసారుప్యత వల్ల దుఃఖ గాఢత ఎక్కువ గా ఉన్న కవితలు మనల్ని మళ్లీ మళ్లీ చదివేలా చేస్తూ గుండెను బరువెక్కిస్తుంది.

ఈ కవితలను చదువుతున్నంతసేపూ ఒక మానసిక సంఘర్షణ, ఒక బాధ, దుఃఖ అనుభూతికి గురవుతాం. కవిత్వం లోపలి తీపిచేదు జ్ఞాపకాలు మనల్ని ఒక ఆలోచనల ఆవలి తీరంవైపు నడిపిస్తాయి. కొన్నిసార్లు హృదయాంతరంగంలో చిత్తడి మేఘాలు కమ్ముకుంటాయి. ఆ ఉద్వేగంలో కన్నులు తడవకుండా చూపు ముందుకు కొనసాగదు. వైయుక్తిక జీవితంలోని ఎదురుచూపుల తలపోతలతో శిఖరాలు లోయలను దాటుతూ స్థిమితంగా నిలవడటానికి మనసును గట్టిపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఊపిరి సలవనీయని వేదనా భరితమైన దుఃఖనది ప్రవాహంలో కాగితంలోని అక్షర పడవల్లో పాఠకులను ఆగకుండా శ్వాసించేలా చేసే గుణమే ‘మట్టిపూల గాలి’ ప్రత్యేకత.

గతం తాలుకూ అనుభవాల్ని తడుముకొని అక్షరాలతో ‘ద్విపాత్ర’ అభినయాన్ని చేయించి చూపిస్తుంది. అమ్మగా పొందిన అనుభవాన్ని, ఆ ఉమ్మనీటి అక్షరాల్లో తాను తల్లినో… బిడ్డనో తెలియని తాదాత్మికరణానందాన్ని చవి చూసిన క్షణాలను ఆవిష్కరిస్తుంది.

‘ఓ వేకువ/ బొడ్డుతాడు తెంచకుంది.
మట్టిని తాకితే అమ్మవాసనేస్తుంది
వెంటనే ఓ సందేహం/ నిజంగా పుట్టానా… అని
ఏదీ… అమ్మ కనిపించదేం!! అయితే నేనే అమ్మను/ మరి పాపెక్కడ ?
ఉమ్మనీటి అక్షరాల్లో / తల్లినో…! బిడ్డనో…! నా గర్భంలో
నన్నే మోయలేకపోతున్న’ అంటూ మాతృత్వానుభూతిలోని ఒక ఆలాపన.

స్వేచ్ఛ కవిత్వంలో అత్యద్భుతమైన తన స్నేహితుల మనస్తత్వాన్ని చిత్రీకరించారు. ప్రతీ వ్యక్తీ జీవితంలో తన మిత్రుల అంతరంగాల ప్రకంపనాలు గుర్తించి అర్థం చేసుకునేవారు ఉండటం అపురూపమే. విశాలమైన ప్రపంచాన్ని నిర్మించుకున్న ‘స్వేచ్ఛ’ స్నేహ ప్రపంచంలో మంచి మనసున్న ‘స్నేహితురాలు’ మీద రాసిన పద్యం మనల్ని కదిలించక మానదు.

‘ఎలా వెళ్లిపోతాయో, నా ఒంటరి కన్నీళ్లు
దాని బుగ్గల మీదికి
ఏ నవ్వుల లోతుల్లో/ రహస్యంగా దాక్కున్నా లాక్కుంటుంది.
ఖననమైన/ కన్నీటి చారికల్లో / నా సవ్వడి వింటుంది.
ఎంతైనా స్నేహితురాలు కదా/చివరిసారి మాట్లాడింది.
నా శవంతోనే’

స్వేచ్ఛ కవిత్వంలోని అనుభూతిలోని అంతరంగాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠకుడి జీవితంలో కూడా జీవన అనుభవసారం ఉండి ఉంటే తప్పా అర్థం చేసుకోవడం సాధ్యం కాదేమో?

కవులకు విశాలమైన దృక్కోణం ఉంటుందన్నట్లుగానే స్వేచ్ఛకు ప్రపంచంలోని వివిధ సంఘటనలకు స్పందించే చాలా సున్నితమైన హృదయం కూడా ఉందనిపిస్తుంది. ఐలాన్ కుర్ది సిరియా నుంచి శరణార్థిగా తన కుటుంబంతో కలిసి టర్కీ నుంచి గ్రీసుకు వస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోతాడు. టర్కీ సముద్రతీరంలో అతని మృతదేహం ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరలయింది. ప్రపంచవ్యాప్తంగా కళాకారులు, సృజనకారులు ఐలాన్ కుర్ది మరణానికి వివిధ కళారూపాల్లో నివాళులు అర్పించారు. ఆ సంఘటన మీద ‘స్వేచ్ఛ’ హృదయం గాయపడి ‘కుద్దీ’ శీర్షికతో ఆగస్టు 2016లో కదిలించే కవిత రాసింది. ఈ కవితలో తాను చూసిన దృశ్యాలకు ఎంతటి కలవరానికి గురయింది అవగాహన చేసుకోవచ్చు. ‘కుర్టీ’ కవిత కేవలం ఐయాన్ కుర్టీకి మాత్రమే పరిమితమై రాయలేదు.

ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాల్లో బలవుతున్న బాల్యం కోసం దు:ఖితమయి రాసినట్లు కనిపిస్తుంది.
‘నిదుర పట్టని రాతిరి/ఎన్నివేల రెప్పల్ని మూసినా
మరో రెప్ప తెరచుకునే వుంటుంది. కదలని రెప్పల కలవరమేదో, కనుపాపల్లోకి చొరబడుతుంది.
కాళ్లకు చెప్పులు, ఎర్రని టీ షర్టు / నీలపు నిక్కరుతో అలిగి అటుతిరిగినట్టు బలవంతంగా శాశ్వతంగా / నిద్ర పుచ్చబడిన చిన్నారి కుర్దీ’

జర్నలిస్టుగా పనిచేస్తున్న కవయిత్రి సమాజంలోని భిన్న సంఘటనలు తన దృష్టిలో పడకుండా తప్పించుకోలేవు. అలా అన్ని సంఘటనలపై రచయితలకు భిన్నమైన దృక్పథాల వల్ల చూసిచూడనట్లుగానే మిన్నుకుండిపోతారు. కానీ స్వేచ్ఛకు ఒక ప్రాపంచిక దృక్పథం కలిగిన రచయిత్రని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో బూటకపు ఎన్ కౌంటర్లో హత్యకు గురైన శృతి, విద్యాసాగర్లను తన కవిత్వ వస్తువుగా ఎంచుకుని రాసింది. శృతి మర్మావయాల మీద తీవ్రమైన గాయాలు, లైంగికదాడి, యాసిడ్తో గాయపరిచిన గాయాలను చూసి చలించి ఆమె మనసు గాయపడి రాసిన గేయమే ‘ఎలా గుర్తు పట్టాలి’ రాసిన తీరు పాఠకులను సైతం చలింపచేస్తుంది. దేహం గాయాల జల్లెడయినా ఎరుపుకి మెరుపు తగ్గదని విప్లవోద్యమం పట్ల సహానుభూతిని ప్రకటించడం గమనార్హం.

‘సమసమాజపు బడికిపోయి బిడ్డలు ఇంటికొస్తున్నారు బిడ్డని తల్లి గుర్తుపట్టి తెచ్చుకోవాలి
ఒక బిడ్డకి రొమ్ములు కోసి ఉన్నాయి ఇంకొకరికి కళ్ళు పీకేసి ఉన్నాయి కాళ్లు చేతులు… ఆఖరికి జననాంగాలు ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ఛిద్రమైపోయినాయి ఓయమ్మా ఎట్ల గుర్తు పడతావే
బిగించిన పిడికిలొక్కటే గుర్తు బిడ్డల ఆశయపు దారెంట గొంతు తెగినపాట ఆగదు దేహం గాయాల జల్లెడయినా

ఎరుపుకి మెరుపు తగ్గదు’ అంటూ ఒక భవిష్యత్తుప విశ్వాసాన్ని ప్రకటించడం స్వేచ్ఛలోని మానవీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. మనుషుల కోసం నిరంతరం వెతికి విసిగిపోయింది. యాంత్రికమైన సమాజంలో స్వచ్ఛమైన మనుషుల జాడ కోసం, పసి పిల్లల్లా స్వచ్ఛమైన నవ్వుల కోసం వెతుకుతూ నిరాశ నిస్పృహలతో అలసిపోయింది. దుఃఖంలోనే స్వాంతన పొందగలిగింది. ఏడవకుండా ఉంటే నిర్జీవంగా మారిపోయే పరిస్థితుల నుండి బయటపడటానికి బతుకు ప్రవాహంలోని అవరోధాలను దాటడానికి దు:ఖపు పడవలే ఆమెకు తోడుగా నిలిచాయని ‘దుఃఖపుతోడు’లో తన గాథను పాడుకుంటుంది.

‘ఎలా ఉండగలను ఏడవకుండా చచ్చిపోలేను కదా… బతకడమంటేనే ఏడవటం అయినపుడు
అందుకే / విషాదమొక్కటే మిగిలిపోయిన నేస్తమైనపుడు ఏడుపొక్కటే ఓదార్చగలదు ఏడుపు మాత్రమే ప్రేమించగలదు / ఏడుపులోనే బతికించగలదు
ఏడుపంటే బాధే కాదు / జీవన ప్రవాహం నడవలేనపుడు / తనలో ఈదుకొమ్మంటుంది. ఈదలేనపుడు / ప్రాణం తనలో దాచుకొని దేహాన్ని దూరంగా విసిరేస్తుంది
ప్రేమో / ద్వేషమో / ఇష్టమో / పగో
ఏదీ లేకుండా / ఉండటంకంటే

ఏడుపై బతకడమే / నాకు చేతనయ్యేది.’ ఇంతటి వేదనామయ ప్రపంచంలో తనను కాపాడుతున్నది దు:ఖమేనంటూ, ఆ బాధను, బరువును దింపుకోవడానికి దుఃఖంలో ఐక్యంచెంది ఆ తాదాత్మీకరణను కవిత్వమై మన ముందు సజీవంగా నిలబడుతుంది. తన కవిత్వానికి తన బాధ, మానసిక ఘర్షణ, తీవ్రమైన ఒత్తిడి భావనలను వస్తువులుగా చేసుకొని తనను తాను కవిత్వంలో ప్రధాన కేంద్రంగా చేసుకుంది. వైయుక్తిక అనుభూతి కవిత్వంలో ఇస్మాయిల్, మో, ఎమ్మెస్ నాయుడు తదితరులు రాసినప్పటికీ ‘స్వేచ్ఛ’ కవిత్వంలో ఒకరకమైన దుఃఖ బాధిత స్వరం చాలా కవితల్లో అంత: ప్రవాహంగా పాఠకులను కదిలిస్తుంది.

స్వేచ్ఛ మరణం తర్వాత ఆమె ఫెస్బుక్ వాల్ మీద రాసిన కవిత్వం కూడా పరిశీలించాను. ఆత్మాశ్రయస్థితి నుండి సామాజిక మీర్గంలోకి ప్రయాణం చేసినట్లు చెప్పవచ్చు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంచె గచ్చిబౌలి అటవీ ప్రాంతంలోని విధ్వంసాన్ని నిరసిస్తూ కూడా ప్రతిస్పందించారు. వన్యప్రాణుల పట్ల ‘మీ ప్రాణాలను మా ప్రాణాలు అడ్డుపెట్టయినా మిమ్మల్ని కాపాడుకుంటా’మని ప్రతిజ్ఞ చేయడం ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా ‘సారంగ’ అంతర్జాల పత్రికలో ఆగస్టు 2024లో సంచికలో రెండు కవితలు- ‘యుద్ధం అంటే అనేకం’, ‘అలల తత్వమై’ కవితల్లో జీవిత ఆకాంక్ష కనిపిస్తుంది.

ఈ సంపుటికి ముగ్గురు ప్రధాన స్రవంతి విమర్శకులు రాసిన ముందుమాటలు కవిత్వంలోని మార్మికతను సులభంగా అర్థం చేసుకోవడానికి టార్చిలైటుగా ఉపకరిస్తుంది. ‘స్వేచ్ఛ’ ఎగరేసిన సేచ్ఛాపతాక అని ప్రముఖ తెలుగు రచయిత్రి శిలాలోలిత అభినందిస్తారు. స్వేచ్ఛను ఇవ్వాల్టీ వర్తమాన కవయిత్రిగా అభివర్ణిస్తారు. చిన్నమాటలతో లోతైన భావాల్ని చెప్పిందని ప్రశంసించారు. అదేవిధంగా ‘కంటి నుండి ఒంపిన కవిత్వ కడలి’ అని ఆర్. సీతారామ్ వ్యాఖ్యానిస్తూ కొన్ని జ్ఞాపకాలను వర్తమాన అనుభవస్థితికి ముడివేసుకుని అన్వేషించడం స్వేచ్ఛ కవితల్లో కనిపించే ఒక లక్షణమంటారు. వ్యక్తిగత దుఃఖం చుట్టూ ఈ కవిత్వం తిరిగినట్లనిపించిననా ఇది సామూహిక దుఃఖాల్లోకి సామాజిక ఆగ్రహ ప్రకటనలోకి క్రమేణా నడుస్తుందన్నారు. మరో ప్రముఖ విమర్శకురాలు డాక్టర్ ఎం. ఎం. వినోదిని స్వేచ్ఛది ‘ఏ పేచీలు లేని స్వచ్ఛమైన వొద్ది ప్రేయసి కవిత్వం’ అని పేర్కొన్నారు. కవిత్వం భుజం మీద తలవాల్చి పెట్టుకొని కన్నీటి భారాన్ని దింపుకొని తిరిగి తనను తాను పునర్నిర్మించుకుంటుందన్నారు. పూర్తి ఆత్మాశ్రయ. సామాజికేతర మార్గమని ఈ పరిమితిలో నుంచి ఈ కవిత్వాన్ని చదవాలంటారు వినోదిని.

ఏదీ ఏమైనప్పటికీ స్వేచ్ఛను. ఆమె జీవన ఆకాంక్షను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఆమె కవిత్వాన్ని, వ్యాసాల్ని చదవడం ద్వారా మాత్రమే సాధ్యమని అనుకుంటున్నాను. స్వేచ్ఛలాంటి ఒక వర్ధమాన కవయిత్రిని తెలుగు సమాజం కోల్పోవడం విషాదకరమైన ఘటన, అరణ్యను శంకరన్న, శ్రీదేవి అక్క ఉన్నతంగా తీర్చిదిద్దడానికి స్వేచ్ఛ ప్రపంచంలోని మిత్రులు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

Leave a Reply