‘నా వరకు కవిత్వం అంటే నేను జీవించే వున్నాను అనే ఒక ప్రకటన .. జీవితాన్ని కొనసాగించే ఒక ప్రక్రియ అనిపిస్తుంది. కవిత్వం అనేది అంతరాత్మ .. బయట వున్న మనిషికీ లోపల వున్న మనిషికీ సంఘర్షణే కవిత్వం ..’
‘మట్టిపూల గాలి’ కవిత్వం ఆవిష్కరణ సందర్భంగా స్వేచ్ఛ పలికిన పై మాటలు ఆమె ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి. స్వేచ్ఛ జీవించిన జీవితాన్ని అర్థంచేసుకోడానికి ఆమె కవిత్వమే వొక వాహికగా సాయపడుతుంది. స్వేచ్ఛ మనఃప్రవృత్తికి ఆమె కవిత్వమే నిలువెత్తు అద్దం. ఆమె లోపలా బయటా చోటుచేసుకున్న ఘర్షణ నుంచి ఆమె కవిత్వాన్ని విడదీసి చూడలేం. తన లోపల జరిగిన కల్లోలాన్ని వ్యక్తీకరించడానికి యెన్నుకున్న పద భావచిత్రాలు ప్రకృతిపట్ల మనుషులపట్ల సమాజంపట్ల వాటిమధ్య అల్లుకొని వుండే/ వుండాల్సిన సంబంధాల పట్ల ఆమె దృక్పథానికి సాక్ష్యంగా నిలుస్తాయి. జీవితాంతం ఆమె కాపాడుకున్న సున్నితత్వాలకి దృష్టాంతాలుగా అవి యివ్వాళ మనముందు మిగిలి వున్నాయి. ఆమెలో పెల్లుబికిన విరుద్ధ భావనల ఆలోచనల క్రమాలు కవిత్వ వ్యక్తీకరణలో గోచరిస్తాయి. ఆమె అకాల మరణం వాటిపై మరింత వెలుగు ప్రసరించడానికి సందర్భమైంది. బలీయమైన యాతన గొంతులో అడ్డుపడుతున్నప్పటికీ కొత్తగా రూపొందుతున్న కథనాల మధ్య భిన్న వ్యాఖ్యానాల మధ్య మాట్లాడకుండా వుండలేని పరిస్థితి.
దుఃఖానికి అంతులేదు
ఎడతెరిపిలేని వానలా
ముసురుకుంది
దుఃఖమూ నా లాంటిదే
ఒంటరిగానైనా ముందుకే పయనిస్తుంది
ఈ దారి కొత్తదో, పాతదో తోవంతా కన్నీటి పూలే
వంటి పంక్తులు స్వేచ్ఛ కవిత్వంలో యాంకరింగ్ పాయింట్ గా కనిపిస్తాయి. అయితే దుఃఖం ఆమెను లొంగదీసుకోలేదు. కష్టాలు ఆమెను కబళించలేదు. వాటితో ఆమె సహజీవనం చేసింది. కలిసి ఆడుకొంది, పాడుకొంది. జీవిత గమనంలో అవి సహజమే అని ఆమె వాటిని స్వీకరించింది. దుఃఖానికి యెదురెళ్ళి ఆహ్వానించిందేమో కూడా.
జీవితంలో నిట్టూర్పూ తానే. ఓదార్పూ తానే. దుఃఖమూ తానే. దాన్ని జయించే సాంత్వనా తనే. నిరాశా తనే. చెప్పుకొనే ధైర్యమూ తనే. ఈ ద్వంద్వాలన్నీ తానే అనుకుంటే వాటికి కుంగిపోవడమూ పొంగిపోవడమూ వుండదు. ఆధార ఆధేయాల మధ్య గీత చెరిగిపోతుంది. ఈ జీవన తాత్త్వికతనే వొకచోట యిలా విప్పి చెప్పింది.
ప్రతి రోజూ .. కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా
ఎగిరీ ఎగిరీ అలసిపోయినట్లై
ఒక్కసారి
ఏదైనా చెట్టు కింద సేదతీరాలనిపించింది
నా పిచ్చిగానీ..
మళ్ళీ గుర్తొచ్చి నవ్వొచ్చింది
ఆ చెట్టూ నేనే అని….
దుఃఖాన్ని వానతోనూ సముద్రంతోనూ సరస్సుతోనూ కన్నీళ్ళని వాన చినుకులతోనూ కష్టాలను మబ్బులతోనూ చీకటి తోనూ .. పోలుస్తూ రూపిస్తూ స్వేచ్ఛ కవిత్వంలో అనేక ప్రయోగాలు చేసింది.
ఎర్రబడబోతున్న ఆ సాయంత్రం
ఆకాశపు దుఃఖాన్నెత్తుకుంది..
ఇలా వొకానొక వ్యక్తం చేయలేని మానసిక స్థితిని పట్టుకోడానికి కొత్త పదబంధాల్ని యేరి తెచ్చుకుంది. రెండు విరుద్ధ భావనల్ని కలిపి ముడివేసింది. కొత్త అర్థాల్ని ధ్వనింపజేసింది. అవి యేకకాలంలో స్పష్టమూ అస్పష్టమూ కూడా. వాటిని అర్థం చేసుకోవడమంటే ‘మట్టి పూల కొత్త గాలిని దోసిట్లొ పట్టుకొగలగడమే’. అదే ఆమె వ్యక్తిత్వం కూడా అనిపిస్తుంది. కవిత్వంలా ఆమె యెంత బాహాటమో అంత గూఢం కూడా. అందుకే స్వేచ్ఛ కవిత్వంలో యెన్నో రంగులు తొంగి చూస్తుంటాయి. ఒక్కో రంగు గాలితో చెవిలో గుసగుసలు పోతుంది. మరో రంగు నిదురించే నింగి పక్కన మెలకువతో వుంటుంది. భిన్న వర్ణాల మేళవింపుతో కొత్తరంగుల్ని సృష్టించడం ఆమె కడదాకా సాధన చేసింది. ఆ రంగుల మేళవింపు వొక తెలీని ఆల్కెమీ వంటిది. దాని రహస్యం ఆమెకే తెలుసు. చెట్టు కింద సేద తీరుతున్న దారి, మడత పడిన మబ్బుల వనం, వెన్నెల ప్రవాహం కింద పొగమంచు పరుగులు లాంటి భావస్ఫోరకమైన పంక్తులు ఆ మార్మికత పొరను తొలగించడానికి తోడ్పడతాయి.
స్వేచ్ఛ కవిత్వం నిండా అది దుఃఖమో వానో తెలీదు; జలపాతం పగిలి భోరుమన్నట్టు కురుస్తుంది. పఠితలను వుద్వేగాల తీవ్రత వుక్కిరిబిక్కిరి చేస్తుంది. సంవేదనల సాంద్రత సన్నిహితం చేస్తుంది. అనుభూతుల ఆర్ద్రత ఆత్మీయం చేస్తుంది. చివరికి ఆమె సమస్త వుద్వేగ సంవేదన అనుభూతుల్ని మనం కూడా సొంతం చేసుకుంటాం. వాటిలో లీనమౌతాం. ఆమె వాక్యానికి వశమవుతాం.
తనలోని ‘దుఃఖాన్ని ఒలకనీయకుండా లోలోపలికే దాచేసుకొని వెంటాడుతున్న ఒంటరితనాన్ని సవాల్ చేస్తూ మరణం కావాలి’ అని యే బలహీన క్షణాల్లోనో ఆమెకు అనిపించి వుండొచ్చు. అందుకు ఆమెపై మనలో కొందరు జాలిపడుతూనే కోపించవచ్చు. నొచ్చుకొంటూనే నిందించవచ్చు. కానీ ఆమె యెక్కడో యెవ్వరికీ అందని చోట యేకాంతాన్ని కోరుకుంది.
ఎక్కడో ఓ చినుకు కింద
దాక్కున్న మట్టిలో ఓ కునుకు తీయాలి
అన్నప్పటికీ, వొంటరితనంలోని దుఃఖాన్ని జయించడానికి వూపిరి తీసుకోనివ్వనంత ప్రేమను కోరుకొంది. ఆకాశమంత ఆత్మీయతని ఆకాక్షించింది. మనిషికో మనిషిని తోడుగా ఆశించింది. అందుకు తనను తాను కోల్పోడానికి సిద్ధమైంది. కోల్పోకుండా వుండడానికి ఘర్షణ పడింది. మనిషి నుండి మనిషిని దూరం చేసేవాళ్ళని చూసింది. మనుషులుండనితనాన్ని అనుభవించింది. మనిషిలోని మనిషిని చీల్చేవాళ్ళని మనిషికున్న మనిషిని తీసుకెళ్లిపోయేవాళ్ళని గర్హించింది. చివరిగా నమ్మకద్రోహాల్ని ఖండించింది.
నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసినప్పుడు
మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే
పసిచివురును పొత్తిళ్లలో పొదుముకున్నంతలోనే వేరుతెగినప్పుడు
నేలలోకి కుంగి మళ్ళీ మొలకెత్తింది నేనే
ఇలా ప్రతి దుఃఖ సందర్భంలోనూ తనను తాను పదే పదే పునర్నిర్మించుకోడానికే ప్రయత్నించింది. జీవితంలోని ప్రతి క్షణాన్నీ ‘నిండుగా చేతుల్లోకి తీసుకొని ముద్దాడాల’నే కాంక్షించింది. అనుబంధాల్లోని తాత్కాలికతను గుర్తిస్తూనే శాశ్వత బంధాలకై పిచ్చిగా అన్వేషించింది. ప్రకృతితో తాదాత్మ్యం చెందుతూ చెట్టుతో చెట్టుపై వాలే పక్షులతో మబ్బుతో మబ్బు చాటున దాగిన చందమామతో సముద్రంతో దానిమీద పరచుకున్న వెన్నెలతో సంభాషించింది. ప్రతి అడుగులోనూ యెదురైన అనిశ్చితిని, వోటముల్ని అధిగమించడానికి సమస్త శక్తుల్నీ కూడగట్టుకునేది. ఇదంతా స్వేచ్ఛ వ్యక్తిత్వమే.
అయితే ఆమె దుఃఖంగానీ క్రోధంగానీ కేవలం వ్యక్తిగతం కాదు. తన లోపల సుళ్ళుతిరిగే వైయక్తిక వేదనకు మూలాల్ని సమాజంలో చూసింది. ‘తాను’ క్రమంగా విస్తరించి సామాజికతగా రూపుదిద్దుకుంటుందని చెప్పడానికి వుదాహరణలు చాలా వున్నాయి. ఆ క్రమంలోనే భూమ్మీద నీటితో పోటీ పడుతూ ప్రవహించే కన్నీటిని మోస్తున్న ఆడబిడ్డలు భద్రంగా బతకాలంటే లోపల బయటా చేయాల్సిన యుద్ధాలు అనేకం అని ఆమె గుర్తించింది. నిర్భయలాంటి ఆడపిల్లందరి తరపునా వకాల్తా పుచ్చుకొంది. మహిళల రక్షణ అంటే అడగటమో అడుక్కోవడమో కాదనీ ఆత్మ గౌరవమనీ యెలుగెత్తి చాటింది.
రానురానూ ఆమెలో యీ సామాజికత మరింత బలపడింది. సల్వాజుడుం క్యాంపుల్లో బందీలయిన అడవి బిడ్డల జీవితాలు, దేశం నడిబొడ్డున సైన్యం చేతిలో అత్యాచారాలకు గురైన బాలింతలు, తల్లి గర్భం చీల్చి పెకలించబడి మంటల్లో కాల్చబడిన అయిదారు నెలల పిండాలు, అడవుల్లో చెరువుల్లో ఊరిచివరో ఉరివేయబడో మనుషులుగా ఛిద్రమైపోయిన దళిత ఆడబిడ్డలు, పాలిచ్చే తల్లి శవమైపోయిందని తెలియక రొమ్మును పీలుస్తున్న పసిబిడ్డలు స్వేచ్ఛ కవిత్వంలోకి అనివార్యంగా చొరబడ్డారు. ఈ నేలని (వతన్) ని హిందుత్వ దుర్మార్గానికీ అగ్ర కుల అహంకారానికీ బ్రాహ్మణీయ ఆధిపత్యానికీ అణచివేతల నిరంకుశత్వానికీ నెలవుగా మార్చిన దేశభక్త వున్మాదుల్ని గుండె లోతుల నుంచి అసహ్యించుకొంది. దేశం ఫాసిస్టు శక్తుల పాలవున్నందుకు ఆక్రోశించింది. అందులో భాగంగానే కశ్మీర్ ప్రజలపై అనునిత్యం జరిగే మారణకాండపై ఆగ్రహాన్ని కవిత్వంలోకి చాలా subtle గా తీసుకురాగలిగింది. ‘కళ్ళల్లో వేల శవాల బరువు’ మోసింది. వాలని రెప్పల నడుమ పారిన నెత్తుటి వరదలు చూసింది. మనసు పొరలపై రాలిన పూల గాయాల్ని తడిమింది. కనుపాపల్లోకి గుచ్చుకున్న పెల్లెట్లు లెక్కించింది. అది సానుభూతి కాదు. సహానుభూతి. సాలిడారిటీ.
బలిమెల ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే (2016 అక్టోబర్) దుఃఖాగ్రహంతో రాసిన కవితలోని intensity స్వేచ్ఛ హృదయాన్ని ఆవిష్కరిస్తూనే కవిగా సామాజిక కార్యకర్తగా ఆమె యెక్కడ నిలబడిందో కూడా తెలియజేస్తుంది. ‘సమ సమాజపు బడికి పోయిన బిడ్డలు’ అని వారిని మొత్తం సమాజానికంతటికీ చెందినవారిగా సంభావించి వారి అమరత్వాన్ని కీర్తించింది. బిడ్డల మృతదేహాల్ని తల్లులు సైతం గుర్తుపట్టనంతగా హింసించిన అమానవీయను నిరసించింది.
ఒక బిడ్డకి రొమ్ములు కోసేసి ఉన్నాయి
ఇంకొకరికి కళ్ళు పీకేసి ఉన్నాయి
కాళ్లు చేతులు .. ఆఖరికి జననాంగాలు
ఒంట్లో ఉన్న అవయవాలన్నీ
ఛిద్రమైపోయినాయి
పోలీసుల క్రూరత్వాన్ని చెబుతూనే ‘ఓయమ్మ ఎట్ల గుర్తుపడతావే’ అని అడిగి ఆ వొక్క మాటతో కవిగా ఆ తల్లుల దుఃఖంలో మమేకమైపోయింది. తక్షణం వీరుల ఆశయాలు, ఆశయాలకు బిగించిన పిడికిలి, చావుకైనా వెరవని నిబద్ధతా అన్నీ ఆమె మనసులో ముప్పిరిగొన్నాయి. అవే వారిని గుర్తించడానికి చిహ్నాలుగా పేర్కొంటూ అమరుల త్యాగాల్ని యెత్తిపట్టింది.
బిగించిన పిడికిలి ఒక్కటే గుర్తు –
బిడ్డల ఆశయాల దారెంట
గొంతు తెగినా పాట ఆగదు
దేహం గాయాల జల్లెడయినా
ఎరుపుకి మెరుపు తగ్గదు
చివరి మాట ద్వారా పోరాటం నిరంతర ప్రక్రియ అన్న స్ఫూర్తిని అందిస్తుంది. అది వ్యక్తిగతమైనా సామూహికమైనా చేస్తున్న యుద్ధం ఏకవచనం కాదు అన్న యెరుకను కలిగిస్తుంది. బిగిసిన పిడికిళ్ళను సడలనివ్వరాదన్న నిబద్ధతకు వూపిరిపోస్తుంది. జీవితానికి కొత్త నిర్వచనమిస్తుంది.
అప్పుడప్పుడు ఆకాశంలోకెగిరి..
నక్షత్ర ధూళిలో కలిసిపోయి..
ఈ విశ్వానికి ప్రేమనిద్దామా..
జీవించడమే కదా జీవితమంటే..
అంతిమంగా యిదే స్వేచ్ఛ అంతరంగం. చలాకీతనానికి పర్యాయపదంగా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిరంతరం తపించే నిండైన మనిషి అకస్మాత్తుగా నిష్క్రమించడం మనందరిలోనూ గూడుకట్టుకుని వున్న ఖాళీతనానికి నిదర్శనం. పూడ్చుకొమ్మని చెప్పడమే స్వేచ్ఛ చివరి సందేశం. అందుకు మరణం మాధ్యమం కావడమే అసలైన విషాదం.