సామూహికత అడుగంటి స్వార్థం శిఖరాయమానంగా పెరిగిన కాలం. “మా ఇంటికి వస్తే ఏమి తెస్తవు, మీ ఇంటికి వస్తే ఏమిస్తవు” అన్న ధోరణి బాగా పెరిగి పోయింది. మానవ విలువలు లుప్తమై, వ్యాపార విలువలు పెరుగుతున్నయి. మనిషి సమూహంలో ఒంటరి కావడం చూస్తున్నాం. ఇది పెట్టుబడిదారి యుగ లక్షణం.
సాహిత్య రంగంలో చదువరుల సంఖ్య తగ్గి చూపరుల సంఖ్య పెరిగింది. రోజూ నలుగురి నోళ్ళలో నానాలనే యావ పెరిగింది. ఏదో ఒకటి రాసి ఇన్‌స్టా, వాట్సప్, ఫేస్బుక్, ఎక్స ల్లో పోస్టు పెట్టి, వాటిని చూడడానికి, ఫోను చేసి మరీ చూపించుకొంటున్నరు.
రోజులో ఉన్న 24 గంటలు కూడ సామాజిక మాధ్యమాలను చూడటానికి మనిషికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడింది. రోజూ ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు ఏదో రకమైన పోస్టింగులు, రాళ్ళ వాన కురిసినట్లు, నోటీఫై అవుతూనే ఉంటాయి.
ఈ మధ్యన కొందరు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండమని హితబోధ చేస్తున్నారు. ఏ సాంకేతిక పరిజ్ఞానానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి. అవి అనుకూల, ప్రతికూలాలు. అనుకూలమైనదాన్ని గుర్తించి స్వంతం చేసుకొన్నవారు ముందుకు పోతూనే ఉన్నారు. దాని చీకటి కౌగిలిలో చిక్కినవారే ఎటు కాకుండా పోతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న మనుషులను దగ్గర చేసింది ఈ సాంకేతికతనే. పక్కపక్కకు మనుషులు ఉన్నా మాట్లాడుకోకుండా చేసింది ఇదే.
కొందరు మేధావులు కరోనా వచ్చిన కాలంలో, సామాజిక మాధ్యమాల ద్వార అనేక బౌద్ధిక అంశాల మీద విషయజ్ఞుల చేత ఉపన్యాసాలు ఇప్పించినారు. ఆసక్తి ఉన్నవారు వాటిని విని, వాటి వెలుగులో మరింత అధ్యయనం చేసి తమ జ్ఞాన పరిధిని విస్తరించుకొన్నారు. ఇది అనుకూల పార్శ్వం.
ఇదే సామాజిక మాధ్యమం గత దశాబ్దం పైబడి అబద్ధాలు, అశాస్త్రీయ భావనలు, ద్వేషం మొదలైన వాటికి కేంద్ర బిందువుగా మారింది. మూకస్వామ్యం ముదిరింది. సత్యాన్ని నమ్మి ప్రచారం చేసిన వారిని బూతులు తిట్టి, మానసికంగా కుంగదీయడం, బెదిరించడం, దాడులు చేయడం, కొట్టి చంపడం(lyching) పరిపాటి అయింది. ఈ పని చేసేవారికి డబ్బులు ముట్ట జెప్పుతారు.
ఇప్పుడు అదే సామాజిక మాధ్యమం యువతను కూడగట్టింది. “నీట్” ప్రశ్న పత్రాల లీకుల మీద ప్రభుత్వాన్ని నిలదీసి, సంబంధిత మంత్రి రాజీనామా చేసే దాక తెచ్చింది. కోచింగ్ మాఫియాల దోపిడీని ఎండగట్టింది. “నీట్” ఆదివాసులకు, దళితులకు అందని ద్రాక్ష అని నిరూపించినారు. పౌరులందరికి సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం విధి అన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ పరీక్షను రద్దు చేసి, ప్రాంతాల వారీగా నిర్వహించుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండు పెట్టినారు.
ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, పౌరులు అనేక భావధోరణులకు చెందినవారు. వీరిని ఏకం చేసింది సెల్‌ఫోన్, పవర్ బ్యాంకు, సామాజిక మాధ్యమం.
అంతకు ముందటి సామాజిక మాధ్యమం, అజ్ఞానాన్ని పంచడానికి చీకటిలోనే ఉంచడానికి పని చేస్తే, అదే మాధ్యమం ఇప్పుడు చైతన్యాన్ని నింపడానికి పని చేస్తుంది. అప్పటికీ ఇప్పటికి తేడా ఇది.
సామాజిక మాధ్యమం మాదిరిగానే సామాజిక చైతన్యరూపం అయిన సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం వాస్తవికతను వీడి, వైయక్తికతను ఆశ్రయించింది. ఇది వ్యక్తి హితాన్ని దాటి, సామూహిక హితం కోసం పని చేయాలని కోరుకొంటున్నాను.
“అదనపు కణజాలం” కవితా సంపుటి మీ చేతిలో ఉంది. ఇది నా మూడవ కవితా సంపుటి. నా మొదటి, రెండు కవితా సంపుటులు కట్టె పల్క, జమిడికలను ఆదరించినట్లే, “అదనపు కణజాలాన్ని” ఆదరిస్తారని ఆశిస్తున్న.
దీని గుణ దోషాలను నిర్ణయించేది సహృదయులైన పాఠకులు, విమర్శకులు మీ స్పందన కోరుతూ…