స్వేద రాత్రి
వెలసిన నిప్పుల వాన
కదలాడని కొబ్బరాకులు
ఆకాశంలో ఉడికిన పుల్ల గడ్డ
వెన్నెల పొగలు
సగం మెలుకువలో
సగం నిద్రలో
రాతి కింద కప్ప
గూడు అల్లుకుంటున్న సాలీడు
మంచం కింద పొర్లుతూనే ఉంది నీడ
శరీరాన్ని చుట్టుకున్న
స్వేద రాత్రి
ఎంతకు కాటేయదు
*
కొందరు కవులు కవిత్వంలో తమని చూసుకుంటారు. కొందరు కవుల్ని కవిత్వమే తనలో వారిని చూసుకుంటుంది. రెండో రకం కవులు అరుదు.
రెండూ కవిత్వానికి సంబంధించిన విషయాలే అయినా పామర జనం అస్తిత్వ వేదనని గట్టిగా పట్టుకునే కవిత్వం ఈ స్వేద రాత్రి లా ఉంటుంది. ఆ విశిష్టత గొప్పది. నేరుగా జనజీవితాన్ని స్పర్శించే నిశితమైన చూపు ఉండి దానికి తగ్గ భాషనీ ఆ ప్రకృతి దృశ్యాలను పిండి తీసిన పదజాలాన్నీ, తను నివసించిన స్థలకాలాల వాస్తవికత నుండి స్వీకరించిన “దేశీయత” కవిత్వమై ఎదురు నిలుస్తుంది. “దేశీయత” అనే పరిధిలోకి కవిత్వాన్ని కుదించడం మంచి పనేనా? అంటే కాకపోవచ్చు కానీ రెండో రకం కవుల విషయంలో ఈ పరిధిని దాటి వారి కవిత్వాన్ని మాత్రమే చూడవలసి వస్తుంది. జీవితం నుంచి కళనీ, కళ నుంచి జీవితాన్ని వేరు చేయలేనంత గాఢంగా కవిత్వంలో పెనవేసుకుపోయి ఉంటుంది. అందులో అరుదుగా కవిత్వం రాసి, ఒక్కటంటే ఒక్క సంపుటి “పొద్దున్నే వచ్చిన వాన” వేసిన గోపినీ కరుణాకర్ పేరుని ప్రస్తావించకుండా ఉండలేము.
ఈయన చాలా విరివిగా కథలు రాసాడు ఒకప్పుడు. “కథల మాంత్రికుడు” అనే ప్రశంసనీ పొందాడు. రాసిందంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల జీవన దర్శనమే! అయితే అరుదుగా కవిత్వం రాశాడు. రాసిందంతా కవిత్వమే రాసాడు. రాసిందంతా రాయలసీమ గురించే రాశాడు. పొద్దున్నే వచ్చిన వానలో అది విశ్వరూపమై కనిపిస్తుంది.
నీళ్ళు తక్కువ పారే జిల్లా చిత్తూరు జిల్లా! తిరుపతి కొండలలో వెంకన్న వెలసి ఉన్నా పేదరికం తాండవిస్తున్న జిల్లా. దశాబ్దాలుగా నీళ్ళకోసం అర్రులు చాస్తూ ఉంది. అటు తమిళనాడు ఇటు ఆంధ్ర రెండు సంస్కృతుల మధ్య ఆత్మీయ వారధి కూడా!
“పొద్దున్నే వచ్చిన వాన” అని నామకరణం చేసిన కవితలో “పొద్దున్నే వస్తే ఏమీ రాకపోతే ఏమి? రాయలసీమలో ఏ పూట వానపడినా, కరువు దీరా పడాలి, నేల పదును దీరాలి! ఈ రెండు ఫలితాల్లో ఏదో ఒకటి ఇవ్వకపోతే, ఎలా వస్తే ఏమిటి వాన?” వానతో మానవుడి సంబంధాన్ని కేవలం నీళ్ళు అనే ఒక భౌతిక పదార్థంగా రాయలసీమలో తూచరు. రాయలసీమకు నీరే సంస్కృతి నీరే చరిత్ర. నీరు సంవృధ్ధిగా దొరికే ప్రాంతాల్లో నీటిని చులగ్గా చూడడం, చులాగతగా వాడడం చేస్తారేమో? రాయలసీమకు నీరు జీవనాధారం. రైతు పాలిటి అమృతం.
మానవ సంబంధాలను విఛ్ఛిన్నం చేసి ఒకరి నుంచి ఒకరి విడదీస్తున్న పరిస్థితుల నుంచి కదా వాన కాపాడాలి? వలసను కదా నిరోధించాలి? ఈ దృశ్యాన్ని కవిత్వంలో ఊహించుకోండి. మీ ఊహాశాలిత బలమైందైతే బరువైన కవిత కన్నీళ్ళు తెప్పించేలా మీరే కట్టుకోగలరు. దుఃఖం ఏరులైపారే జూదం వ్యవసాయం రాయలసీమకు అని చెపుతుందీ కవిత! మొత్తం రాయలసీమ జీవితానికి మకుటంగా నిలిచిందీ సరే, కవిత్వంలో కొత్త పోకడలనూ, కొత్త రూపకాలనూ, నవీన శిల్పాన్నీ, తనకే స్వంతమైన ఫ్లో ని తద్వారా పాఠకుడిలో అనేకానేక ఉద్వేగ ప్రకంపనలని కరుణాకర్ కవిత్వం కలిగిస్తుంది. దీనికి ఉదాహరణగా కథనాత్మక కవిత “కోడిపిల్ల పద్యం” తీసుకోవచ్చు. నిజానికి ఈ కవిత కవి తన పల్లె జీవన అనుభవాల్లోంచి అల్లినట్టు ఉంటుంది. ఇది స్వీయానుభవమే అయినా ఈ కవితలో ప్రకృతి తో ముడిపడిపోయిన జీవప వర్ణన గొప్పగా అనిపిస్తుంది. దాదాపు ప్రతి రాయలసీమ పల్లె జీవనంలో మనకు కనబడే దృశ్యాలన్నీ ఈ కవిత నిండా దృశ్యమానమౌతాయి.
“కుమ్మరి వేమసిద్దు చక్రం మీద కుండని చేసినంత సహజంగా రాత్రంతా నీ జ్ఞాపకాలని పొదుముకుంటాను/ పొద్దున్నే కలను పగలగొట్టుకొని పురిటివాసనతో పరిమళిస్తూ తడిరెక్కల్ని రెపరెపలాడించి కోడిపిల్ల పద్యం ఊపిరి పోసుకుంటుంది” మామూలు గా కనబడే దృశ్యానికి కవి అందాన్నీ ఆ అందం రూపుదిద్దుకునే క్రమంలోని ఘర్షణను చిత్రించగలిగాడు. ఈ పద్యం మొత్తం ఇలాంటి దృశ్యాలతో నిండి ఉంది. మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ కవిత ఇది. అదే కోవలో “పీర్ల సావిట్లో” కవిత బహుశా రాయలసీమ పల్లెల్లో పీర్ల పండుగను ఇంత గొప్పగా చిత్రించిన కవిత ఇంకొటి ఉందా? అని అనిపిస్తుంది. ఈ రెండూ కూడా గొప్ప కవితలే! పీర్ల పండుగలో అలావా వేసుకొని జనం నర్తించే ఉద్వేగ దృశ్యాన్ని భలేగా చిత్రించాడు కవి. ఇది కూడా రాయలసీమ సాంస్కృతిక మనుగడలోని విబిన్నతలనీ, లౌకికత్వాన్ని దర్శింపజేస్తుంది. ఈ కవిత ఎత్తుగడే ఉద్వేగంగా ప్రారంభమౌతుంది. “అగ్నిగుండం లో చుట్టూ అడుగులో అడుగేస్తా దౌసేన్ దూయ్, పూల లేస్తా పై గుడ్డలు ఎగరేసి దౌసేన్ అసాన్ పీరుకి ఉగ్రం వచ్చింది” అంటూ చివరికంటా పాఠకుణ్ణి లాక్కెళుతుంది.
“పాలకొండమింద మబ్బై తొంగి చూడొద్దు” కవితా వస్తువు విరివిగా రాయలసీమ కవులు వాడారు కానీ ఈ కవిత కూడా ఓ భిన్నమైన అనుభూతి నిస్తుంది. కొండల మధ్య అడవులు ఎండకాలం వేళ మంటలెగరేయడం రాయలసీమలో కద్దు. వానకాలంలో ఎంత పచ్చబడినా ఎండాకాలంలో ఆకులు రాల్చే గుణం కలవీ అడవులు. పాలకొండలలో ఇలాంటి మంటలు జీవన వ్యతలతో రిలేట్ చేయడం దగ్గర అదీ ఒక అధివాస్తకవితగా రూపొందించడం దగ్గర కవి ప్రతిభ బయటపడుతుంది. వాన కేవలం మబ్బులాగా వచ్చా తొంగి చూస్తే ఎట్లా? కురిసి బతుకును బుగ్గిపాలుజేస్తున్న పరిస్థితుల మంటనార్పి కదా పోవాలి ఎందుకంటే-
“ఏరు ప్రాణమిడిచింది
ఆకులు రాల్చిన చెట్ల కొమ్మల్లో వాలిన కోకిల
గొంతు సవరించుకునేసరికి పాటను ఎవరో దొంగలించినారు
భగభగ మంటలు నింగినందుకున్నాయి
కాలిబూడిద అయ్యేదాకా ఇది ఆరదు
ఎందుకట్లా కండ్లమీద వాలతావు
మానతాండే పుండును కలై పొడుస్తావు
ఈడ మిద్దల్లేవు
మేడల్లేవు నగలు లేవు
నాజుకైన కోకలు లేవు
కరెంటు దీపం లేదు
ఉక్కపొస్తే పైన తిరిగే దానికి గాలిమర లేదు
నెల పెడితే కరుకుమాయని నోట్లు ఎంచుకునే దానికి నాకు ఉద్యోగం లేదు
ఏముండాదని ఈడ
ఎందుకు తొంగి చూస్తావు
ఉండేది తొండాకులు గుడ్లు పెట్టే జానడు నేల లోతుకుపోయిన బాయ్ ని తోడి తోడి
గిట్టలరిగిన జతబక్కెద్దులు
చెదలు మేసేసిన గుడిసె
దుమ్ములో పొర్లాడి పొర్లాడి
మన్ను వాసన కొట్టే మాయమ్మ
చమటకంపుగొట్టే నేను
అడవంతా కాలి
బూడిదైంది కండ్లు కాలిపాయ
మొనుసూ కాలిపాయ”
*
రాయలసీమ మాండలికం లో సీమ ఫ్యాక్షనిజాన్ని అత్యంత సున్నితంగా, ప్రకృతిలోని భయం గొలిపే దృశ్యంతో కవి ఊహల దారంతో కలిపి కుట్టి చేసి రాసిన కవిత ఉత్తీత పాట. ఇందులో వాడిన ప్రతీకలూ పదజాలం ఓ హింసాత్మక వాస్తవాన్ని ఒళ్ళుగగుర్పొడిచే విధంగా ఉన్నాయి.
ఉడత తలతెగింది ఉత్తీతా!
ఊరు నెత్తురు మడుగు అయింది ఉత్తితా!
సద్దకంకులకు బదులు ఉత్తితా!!
వేట కొడవండ్లు మొలిసినాయి ఉత్తీతా!!
చెండుమల్లె పూలకు బదులు
ఉత్తితా!!
నాటుబాంబులే పూసినాయి ఉత్తీతా!!
బిగిసడలని నడక గోపినీ కవిత్వాన్ని గట్టిగా నిలబెట్టిన పునాది!
“నీటి ప్రాణం పోసుకొని సుడులు తిరుగుతూ పరిగెడుతున్న నదిని చాలా రోజుల అమ్మను చూసినట్టుంది”
చిత్తూరుకు ప్రత్యేకమైన నది” పీలేరు తల్లి “అది ఎప్పుడో గాని పారదు పారినప్పుడు అమ్మనదికి స్వాగతం పలుకుతుంది
పాదాలను తాకిన నదిని
దోసిలిలోకి తీసుకొని ముద్ధు పెట్టుకుంటాడు నాన్న
దోసిలి వడ్ల గింజెలతో నిండుతుంది”
కానీ
ఇది నిత్యకృత్యం కాదు
కరువు వచ్చినప్పుడు నది చచ్చిపోతుంది. అప్పుడొస్తుంది దుఃఖం…”
( కరువు )మంటల్లో కాలిబూడి దౌతూన్న
అమ్మను చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటాను.
“ఆమె తిరిగి బతుకుతుందా”
అమ్మ వస్తుందేమో తొంగి చూస్తాను
కానీ రాళ్ళ మీద నృత్యం చేస్తూ అమ్మ రాదు.
ఆశ చావదు.
కవిత ఓ అందమైన భావన నుండి మొదలై కరువు అనే విధ్వంసం లోకి ప్రయాణించి తిరిగి ఆశ దగ్గర ముగుస్తుంది. ఆశ నిరాశల మధ్య లోలకం కదా సీమ జీవితం.
ఈ కవిత్వం అంతా సీమ బతుకు విధ్వంసాన్నే ఎక్కువగా పరిచయం చేస్తుంది. ఇలాంటి జీవితం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. గోపిని కరుణాకర్ ఎంత బలంగా ఈ జీవితాన్ని తడిమాడో ఈ కవిత్వం అక్షరమక్షరం ఆ జీవన తడితో నిండి పోయింది. అయితే ఇది ఏడుపుగొడ్డు కవిత్వం కాదు. చాలా సందర్భాల్లో కోపాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఈ కవిత్వం చదవడం గొప్ప అనుభవం. ఎవరైనా రి ప్రింట్ చేయాలి ఈ పుస్తకాన్ని. అట్లాగే చాలా రోజులుగా కవిత్వం రాయని ఈ కవి మళ్ళీ కలమెత్తాలి, రాయలసీమ కోసం గళమెత్తాలి.
Gopini Karunakar గారి కవిత్వాన్ని హృదయంలోకి తీసుకుని రాసిన సమీక్ష. చాలా బాగుంది. ఇరువురికి అభినందనలు 💐
Thank you my dear friend