కడవెండి – ఒక అగ్నిశిఖ

ఊరు వీరుని దేహంలో హృదయం స్పందించినట్లు ,అమరజీవి ధమనులలో విమల రక్తం ముడుకున్నట్లు,సమర శిలీ నాసికలో శ్వాసలు ప్రసరించినట్లు హే సాధారణ గ్రామమూర్తి ,ఇతిహాసపు పుటలలో స్పందించుము,జ్వలించుము,ప్రసరించుము,కొమురయ్య అమరత్వంపై సరోజిని నాయుడు తమ్ముడు హరీంద్రనాథ్ చటోపోద్యాయ రాసిన కవిత

విప్లవాలు మంచివి.అవి నూతన యుగాన్ని ప్రారంభిస్తాయి.తెలంగాణలో నూతన యుగ ఆవిష్కరణ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం( 1940-1951)వలన జరిగింది.ఆ విప్లవ లక్ష్యాలు నీరుకారిపోకుండా ,వెనుకడుగు వేయకుండా కొనసాగింపులో ఉన్న అద్వితీయ ప్రస్థానం తెలంగాణలో ఆవిష్కృతం అవుతున్నది.అది సాయుధ మరియు ఇతర ప్రజాస్వామిక రూపాలతో ఉద్యమ జ్వాలను రగిలిస్తూనే ఉంది.భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యి ,రైతాంగంలో బలపడిన ప్రజా ఉద్యమం సాయుధ పోరాటం.ఇది క్రమంగా భారత ప్రభుత్వ వ్యతిరేక గెరిల్లా పోరాట స్వభావం పొందింది.

నిజాం రాజ్యంలో 70% వ్యవసాయ యోగ్య భూమి 500 వందల మంది జాగీర్దార్,దేశముఖ్ లా యాజమాన్యంలో ఉండేది.ఒక భూస్వామికి పది వేల ఎకరాల నుండి లక్షన్నర ఎకరాల భూమి వరకు ఉండేది.భూ యజమానుల వర్గంతో పాటు గ్రామీణ అధికారుల నిరంకుశ అకృత్యాలకు అంతులేకుండా ఉండేది.ప్రభుత్వ ప్రత్యక్ష అధికారంలో ఉన్న ప్రాంతాల కంటే అధిక పన్నులు,అధిక అసమానతలు ,అధిక దోపిడీ జాగీర్ దేశముఖ్ ప్రాంతాలలో ఉండేది.పశువుల మేత,కల్లు గీత ఇలా ప్రతి దానికి పన్ను చెల్లించడం జరిగేది.ఉద్యగుల వడ్డీ వ్యాపారుల దళారీల దోపిడీ నిత్య కృత్యంగా ఉండేది..వెట్టి చాకిరి,రుణ గ్రస్టత ప్రతి శ్రమజీవిలో భాగమయ్యింది.కులీన వర్గానికి పన్నులు తాకనే లేదు.నిజాం రాజ్య రాజధాని,దాని పరిసర ప్రాంతాలలో ఓ మేరకు మెరుగైన పాలన ఉండేది.గ్రామీణ ప్రజల అవసరాలు,బాధలకు తగినట్టు స్పందించేది కాదు.

ఫ్యూడల్ వ్యవస్థ పీడనతో పాటు ఒకటవ ,రెండవ ప్రపంచ యుద్ధం సమస్యల తీవ్రతకు ఆజ్యం పోసింది.ఆర్థిక మాంద్యంలో వాణిజ్య పంటలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.మూలన పడి ఉన్న మెట్ట భూములకు సాగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.అప్పటికే అప్పుల భారీ పడి ఉన్న చిన్నకారు రైతాంగం ఈ రాయితీని ఉపయోగించుకోలేకపోయింది.కానీ భూస్వాములు ఈ రాయితీలను ఉపయోగించడం కోసం తమ మీద ఆధారపడి ఉన్న చిన్న రైతులను,కౌలు దారులను నెట్టేసి ,వారి వారసత్వ భూములను కాజేసుకున్నారు.గ్రామీణ ప్రాంతాలు విప్లవానికి పరిపక్వంగా మారాయి.ఇలాంటి గడ్డు స్థితుల నుండి గట్టెకించడానికి ఒక మహా విప్లవం కోసం తెలంగాణ సమాజం నిరీక్షిస్తున్నది.

సంస్థానాధీశులు.జాగీర్దార్ ,దేశముఖ్ లు గా పాలన యూనిట్స్ ను కలిగివున్న నిజాం రాజ్యంలో ఉన్న ఒక ప్రాంతం విస్నూరు.దీని దేశముఖ్ పేరు రాపాక రామ చంద్రారెడ్డి.60 గ్రామాలు ఇతని అధీనంలో ఉండేవి.ఇందులో కడవెండి అనే గ్రామం ఉంది.ఈ గ్రామంలోనే దేశముఖ్ తల్లి జానమ్మ ఉంటూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది.నలభై ఎకరాల సాగును 400 వందల ఏకారాలకు చేర్చింది.అన్ని గ్రామాలలాగే కడవెండి కూడా రాచరిక,భూస్వామ్య పాలన దుష్ఫలితాలను అనుభవిస్తున్నది.పండించిన కొద్ది పంటను తక్కువ ధరకు అమ్మడం,లేదా బలవంతపు లేవికి ఇవ్వడం.భూమి పన్ను,ఎద్దులను కొనడం మొదలగు వాటికి అప్పు మీద అప్పు చేయడం జరిగేది.ఆంధ్ర మహాసభ,కమ్యూనిస్ట్ పార్టీ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్ అకృత్యాలను,పెత్తందారీ సంస్కృతిని విమర్శించడం ,ధిక్కరించడం మొదలు పెట్టింది.స్వీయ చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటితం అయ్యింది.

1944 భువనగిరి రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ పిలుపుతో కడవెండి గ్రామం అగ్నిశిఖగా మారింది.తమ సంఘటిత శక్తికి భరోసా ఉందని ,దున్నేవానికి భూమి,అక్రమ పన్నుల రద్దు వంటి కమ్యూనిస్ట్ నినాదాలతో ప్రేరితమయ్యి ,సంతోషంతో,ఉత్తేజంతో ,దొరల అక్రమాలను ఎదుర్కోవడం కోసం దొడ్డి కొమురయ్య,మల్లయ్య,నల్లా నరిసింహ ,కొండల్ రెడ్డి ,కొండయ్య,అస్నాల నర్సోజీ ,మోహన్ రెడ్డి,దావిద్ రెడ్డి వంటి వారితో గ్రామ రక్షణ కమిటీ ఏర్పడింది.నల్లా వజ్రమ్మ ,శేరమ్మ తో మహిళా దళం ఏర్పడింది.

దొడ్డి కొమురయ్య మల్లయ్య సోదరుల నాయకత్వంలో కడవెండి ఒక తిరుగుబాటు తోట అయ్యింది. విరుగకాయు పళ్లలాగ ..ఎంత బాధిస్తే అంత ఎర్ర నౌతాము అని చాటి చెప్పింది.

దేశముఖ్ వారి గుండాల ఆగడాలను దెబ్బకు దెబ్బ రీతిలో సమాధానం చెపుతున్నది.పాలకుర్తి ఐలమ్మ కౌలు పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి విజయం సాధించింది.నును లేత యవ్వనంలో ఉన్న కొమురయ్య కమ్యూనిస్ట్ శిక్షణ శిబిరాలలో కర్రలు ఒడిసెలు వంటి ఆయుధాల సాయుధ శిక్షణలో,సిద్ధాంత అవగాహనలో ఆరితేరాడు.గుత్పల సంఘాలు ఏర్పడి పాలకుర్తి పరిసర ప్రాంతాలకు విస్తరించడంలో కొమురయ్య చైతన్యవంతంగా పాల్గొన్నాడు.

మన నెత్తురు మన చెమట మాగాణిని తడుపుతాయి,ఏటికి ఏతము ఎత్తి వెయ్యి పుట్లు పండిస్తాము,ఎందుకు ఒక మెతుకు ఎరగం అంటూ,గాలి మీద బత్కలేము,కడుపు మంటను భరించలేము,కనుక తెగించి పోరాడుదాము అని కొమురయ్య ప్రజలలో ప్రచారం చేశాడు.

ఈ క్రమంలో కడవెండి గ్రామానికి1946 జూలై 4 న నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు రావడం జరిగింది.తమ దగ్గర తిండికి ధాన్యం లేదని ,లెవీ సేకరణకు ఒక్క గింజ లేదని రైతులు కూలీలు తేల్చి చెప్పారు.తమ గ్రామంలో కల జానమ్మ దొరసాని ఇంట్లో 800 బస్తాల ధాన్యం ఉందని దానిని సేకరించమని చెప్పారు.ధాన్యపు గిడ్డంగులలు కాపాలా కాస్తున్న దొర గుండాలకు కు వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో పెద్ద ఊరేగింపును గ్రామ కమిటీ తీసింది.ఊరేగింపు పై మిస్కిన్ అలీ నేతృత్వంలో దొర గుండాలు కాల్పులు జరిపారు. నాయకత్వం వహిస్తున్న కొమురయ్య గుళ్ల వానకు బెదరలేదు,చలించలేదు,వళ్లంతా తూట్లు తూట్లు అవుతున్నా ఆంధ్ర మహాసభకు జై,కమ్యూనిస్ట్ పార్టీకి జై అంటూ ప్రాణాలు వదిలాడు.ఇంకా అనేక మందికి గాయాలయ్యాయి.ఈ వీర మరణం తెలంగాణ చరిత్రను నూతన యుగంలోకి తీసుకెళ్లింది.

దొడ్డి కొమురయ్య అంత్య క్రియలకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. తొలి అమరుడిగా నిలిచిపోయాడు. కడవెండి వీర భూమిగా మారి లక్షలాది ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చింది. విప్లవాన్ని ఎలా నడపాలో తిరుగుబాటును ఎలా లేపాలో అనేదానికి కడవెండి నమూనాగా నిలిచింది. కొమురయ్య అమరత్వంను గానం చేస్తూ,పెను మంటల ఎర్ర జెండాలను మోస్తూ ప్రతిజ్ఞ చేస్తూ,సాగిస్తాము సమరం,సాధిస్తాము విజయం అంటూ   వందలాది సాయుధ దళాలు ఏర్పడి తమ గ్రామాల రక్షణ బాధ్యతను తీసుకున్నాయి.సంకెళ్లు లేని జగతి కోసం అంకితం మా బతుకులు అని శ్రామిక జనావళి గెరిల్లా పోరాటం చేశారు.

రాచరికాన్ని కూల్చి ప్రజా రాజ్య స్థాపన లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో మహత్తర సాయుధ పోరాటంగా మారింది.అన్యాక్రాంతమైన భూములను తిరిగి రైతులకు అప్ప చెప్పింది.బారెన్ బాస్టింగ్ పోరాట రూపంతో గిడ్డంగుల పై దాడి చేసి ధాన్యాలను రైతులకు పంపిణీ చేసింది.మూడు వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పంపిణీ చేసింది.గ్రామ రాజ్య కమిటీలతో ప్రజా పాలన చేసింది.ఉధృతమవుతున్న పోరుతో నిజాం రాచరికం ప్రాభవం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అయ్యింది.దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన స్వంతంత్ర రాజ్యాంగ ఉంటానన్న ఉస్మాన్ అలీ ఖాన్ కలలను ఛిద్రం చేసింది.మతోన్మాద రాజ్యాన్ని కోరుకున్న రజాకార్లను అంతమొందించింది.ఎన్నో రాజకీయ సాంఘిక ఆర్థిక మార్పులను తెచ్చి హైదరాబాద్ రాజ్యంను భారత్ లో విలీనం చేసింది.

ఇంతటి మహత్తర గొప్ప ముందడుగును వేయించిన కడవెండి గ్రామం చరిత్ర చలనానికి అవసరమైనప్పుడల్లా నిప్పురవ్వలను అందిస్తూనే ఉంది.సంతోష్ రెడ్డి రేణుక రమణ రాజు శ్రీను లాంటి వైతాళికులను అందించింది.చరిత్ర చోదక శక్తిగా నిలుస్తున్నది

ముల్కీ,తొలి దశ,మలి దశ ,నక్సలైట్ పోరాటాలు ఆనాటి సాయుధ పోరాట లక్ష్యాల కొనసాగింపులో జరిగాయి.మలి దశ పోరులో ఆనాటి కాంగ్రెస్ శాసనసభ్యులు జూలై 4 ను తమ రాజీనామా తేదీగా ఎంచుకున్నారు.విప్లవ రచయితల సంఘం 1972 జులై 4 న ఏర్పడింది.తెలంగాణ తొలి ప్రభుత్వం కొమురయ్య వర్ధంతి జయంతి లనునిర్వహణలను అధికారికంగా ప్రకటించింది.

దొడ్డి కొమురయ్య అమరత్వం తదనంతర సమరశీలతతో తెలంగాణ సమాజం ఎన్నో ముందడుగులు వేసింది.ఈ ముందడుగులను వెనుకడుగులు వేయించడానికి ఫాసిస్ట్ మతోన్మాద శక్తులు తెగిస్తున్నాయి.శ్రామిక ప్రజానీకాన్ని సంకుచిత .విద్వేష భావాలను కలిగించి చైతన్య రహితంగా మారుస్తున్న మనువాద ధోరణులు విస్తరిస్తున్నాయి.మాకు ముందడుగులు వద్దు ,పరిణామమే వద్దు అనే రాతియుగ ఆటవిక తిరోగమన శక్తులు ప్రబలమవుతున్న కాలంలో వనరులపై ప్రజల హక్కును,భిన్నత్వంలో ఏకత్వంను హరించివేసే ఉన్న ఈ సందర్భంలో ప్రజాస్వామిక శక్తుల అనివార్య ఐక్యతకు దొడ్డి కొమురయ్య మనకు మార్గదర్శిగా ఉంటాడు.ఉద్యమ కాలంలో నినదించిన నినాదం తెలంగాణ మార్గమే భారత మార్గంకు కొమురయ్య దిక్సూచిగా ఉంటాడు.

పత్రికా రచయిత, కవి. స్వగ్రామం-కడవెండి. ఉస్మానియాలో వృక్షశాస్త్రం, తత్వశాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వృత్తి- ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా. సామాజిక సాహిత్య విద్యా పాఠశాల గా నడిపించే దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, పోటీ పరీక్షల శిక్షకుడిగా పని చేస్తున్నారు.

Leave a Reply