“కొలిమంటుకున్నాది
తిత్తి నిండా గాలి
పొత్తంగ ఉన్నాది
నిప్పారిపోనీకు – రామన్నా
పొద్దెక్కిపోనీకు – లేవన్నా…”
— చెర
సాహితీ మిత్రులారా…
ప్రపంచంలోనూ, దేశంలోనూ, తెలుగు భాషా ప్రాంతాలలోనూ సమాజంలో తీవ్రమవుతున్న సంక్షోభాల సందర్భంలో ఉన్నాము. ఈ సంక్షోభం బుద్ధిజీవుల మనసులను కల్లోల పరుస్తున్నది. ఆయా సంక్షోభాల వెనుక ఉన్న వ్యవస్థీకృత అంశాలను అర్థం చేసుకోవలసిన, ఇతరులకు అర్థం చేయించడానికి కళారూపంలో వ్యక్తీకరించవలసిన స్థితిలో కూడ ఉన్నాము. ఈ సంక్షోభం మధ్యనే కొనసాగుతున్న హింసను, పీడనను ఎండగడుతూ, వ్యతిరేకిస్తున్న ప్రత్యామ్నాయ సాహిత్యం, సంస్కృతులు కూడ వున్నాయి. ప్రజలపై పెరుగుతున్న అన్ని రకాల హింసలను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల, కులాల, లింగాల, జాతుల, ప్రాంతాల, మత మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం కవులు, కళాకారులు, బుద్ధిజీవులు నిరంతర ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఈ మొత్తం సామాజిక అనుభవంలో తెలుగు నేలకు ఒక ప్రత్యేకతవుంది. దేశాన్ని ప్రభావితం చేసిన ప్రతి చారిత్రిక మలుపులో తెలుగు పౌర సమాజం తనదైన ప్రత్యామ్నాయ గొంతుకను వినిపిస్తూ వచ్చింది. బుద్ధిజీవులు చూపిన ఆ చైతన్యానికి ప్రధానమైన కారణం ఇక్కడ నిరంతరంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలే. నిజమే, మానవీయ సమాజాన్ని కలగని అపారమైన త్యాగసంప్రదాయాలు నెలకొల్పిన తెలుగు నేలపై ఇప్పుడు రాజకీయ స్తబ్దత ఆవరించివుంది. కాని ప్రజల జీవితాలలో సంక్షోభం, సంఘర్షణ ఏమీ ఆగిపోలేదు. అవి ఇంకా తీవ్రమై, లోపలి మనిషి విధ్వంసమవుతున్న విషాద పరిస్థితి నెలకొనివుంది. ఈ స్థితిలో ‘సృజనకారులుగా మనమేం చేయవలసి ఉంది, ఏం చేద్దాం’ అనే ఆలోచనల్లోనుండి పుట్టిందే ఈ ‘కొలిమి’ వెబ్ పత్రిక.
కళాసాహిత్యాలు మానవ ఉద్వేగాలు, చైతన్యం, విలువల ఉన్నతీకరణను చిత్రించే మహోన్నత రూపాలు. అవి సామాజిక చలనాలను నమోదు చేస్తాయి, అర్థం చేయిస్తాయి. సమాజ దుస్థితిని అవగాహనకు తెచ్చి, ఆ దుస్థితిని మార్చే ఆచరణ వైపు ప్రజల్ని పురికొల్పుతాయి. అటువంటి ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించే కళనూ, సాహిత్యాన్నీ జనజీవన చిత్రాన్నీ సమాజానికి అందించే ప్రయత్నంలో భాగంగానే ‘కొలిమి’ వెబ్ పత్రికతో మీ ముందుకు వస్తున్నాం. ఇది మనందరి పత్రిక. ఇదొక ప్రజాస్వామిక, కళా సాహిత్య సాంస్కృతిక వేదిక. భిన్న ఆలోచనలు, సంఘర్షణలకు ఇదొక వాహిక కావాలని మా కోరిక.
కొలిమి మానవ నాగరికతకు పునాది. ముడి సరుకును కొలిమిలో కరిగించి సానబెట్టడంతో ఉత్పత్తిలో భాగమయ్యే పనిముట్లకు ఒక రూపం వస్తుంది. ఈ పనిముట్లతోనే నాగరికత నడకలు నేర్చింది. కొలిమిని రాజేసి గడ్డకట్టుకు పోతున్న వ్యవస్థని కరిగించి చలనం తీసుకువచ్చే మహత్తర కృషిలో ఈ పత్రికతో మా వంతు ప్రయత్నమిది. కొలిమిలో కరిగిన ముడి సరుకు యథాస్థితి నుంచి పురోగామి స్థితికి మారినట్టుగానే ఈ పత్రికతో ఉన్న స్థితి నుంచి ఒక అడుగు పైకి ఎదిగే సామాజిక చైతన్యానికి దోహదపడాలని మా అభిలాష.
ఇంతకు ముందు ఊరి రచ్చబండకు కొలిమి ప్రత్యామ్నాయ వేదికగా ఉండేది. ఈ వేదిక దగ్గర చేరిన ఉత్పత్తి కులాల ప్రజలందరూ తమ కష్టాలనూ, కన్నీళ్లనీ పంచుకునేవాళ్లు. అట్లనే ఈ ‘కొలిమి’ పత్రికను విభిన్న ప్రాంతాల, అస్తిత్వాల, సమూహాల ప్రజాస్వామిక స్వరాలకు వేదికగా తీర్చిదిద్దాలని మా కోరిక.
సాహిత్యం ఒక సామాజిక బాధ్యత. సృజన వ్యక్తిగతమే. కానీ, అభివ్యక్తి సామూహికం. సామాజికం. ఆ సామాజిక బాధ్యత లోంచే మనం కొత్త దారిని వెతకాలి. సామాన్యుల కోసం పరితపించే కలాలను, గళాలను ఎత్తి పట్టాలి. మా సామాజిక బాధ్యతగా ఇదొక చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రతి ఊరిలోనూ కొలిమిలెన్నో అవసరం ఉన్నట్టే ఊరూరా ఇలాంటి కొలిమిలెన్నో రాజేయాల్సే ఉన్నది.
ప్రజావ్యతిరేక సాహిత్యానికి ‘కొలిమి’ పత్రికలో తావులేదు. కుల వివక్షనూ, హిందుత్వ విద్వేషాన్నీ, భూస్వామ్య అంతరాలనూ, పెట్టుబడిదారీ స్వార్థ ప్రవృత్తినీ, సామ్రాజ్యవాద విస్తరణాకాంక్షనూ ఏ రూపంలోనైనా సమర్థించే రచనలకు ఈ కొలిమిలో చోటు లేదు. సమాజ బహుళత్వాన్ని అంగీకరిస్తూ, ఆదివాసీ, దళిత, బహుజన, మైనారిటీ అస్తిత్వాలను గౌరవించే రచనలకు సాదర ఆహ్వానం. అనవసరమైన వివాదాలకు ఆస్కారం లేని నిర్మాణాత్మక చర్చ, విమర్శలే ఈ కొలిమికి బొగ్గూ నిప్పూ ఊదుడుగొట్టమూ.
‘కొలిమి’కి మీ రచనలే ఊపిరి. ప్రతి నెలా ఒకటో తేదీన వెలువడే ఈ ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక కళా సాహిత్య వేదికకు ప్రజాస్వామిక విలువలున్న కవిత్వం, కథలు, పాటలు, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శలు రాసి పంపండి. సాహిత్య పరిచయాలు, సాహిత్య వార్తలు పంపండి. ఈ కొలిమిని రాజేయడంలో మాతో చేతులు కలపండి. మనందరమూ కలిసి ఈ ‘కొలిమి’ని నిరంతర జ్వలన ధారగా మారుద్దాం. రాతిమట్టిముద్దగా ఉన్న ముడి ఇనుమును పదునెక్కిన కొడవలిగా, సుత్తెగా, పాళీగా, కీబోర్డు అక్షరంగా, తుప్పుపట్టిన సమాజావగాహన తాళాన్ని తెరిచే తాళంచెవిగా తయారు చేద్దాం. రండి.