శ్రీ శ్రీ కవిగా ప్రపంచానికంతటికీ సుపరిచితుడు. నాటక కర్తగా సాహిత్యలోకంలో నిష్ణాతులైన ఈనాటి రచయితలలో కూడా చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు!
శ్రీ శ్రీ విద్యార్ధి దశలోనే అబ్బూరి రామకృష్ణారావు గారి శిష్యరికంలో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదువుతుండేవాడు. ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలనే తపనతో పాశ్చాత్య సాహిత్యంలో కూడా కనిపించిన ప్రతి పుస్తకాన్నీ ఆబగా చదివేస్తుండేవాడు. అంతేగాక ఆ రోజుల్లో Giles Cooper, Dylan Thomas, Louis MacNeice, Archibald MacLeish, W.H. Auden, T.S. Eliot మొదలైన ప్రముఖ రచయితలు “Isms” ప్రభావంతో సమకాలీన జీవితం మీద రేడియో నాటికల ద్వారా అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీ శ్రీ ‘40 వ దశకంలో ప్రసారమైన పాశ్చాత్య రేడియో నాటికలను బి. బి. సి. లో వింటుండేవాడు.
శ్రీ శ్రీ రేడియో నాటికల రచనాకాలానికి అప్పుడప్పుడే మన దేశంలో ఆధునికత చిగురిస్తున్న దశలో ఉంది. ఆకాశవాణి కూడా అప్పుడే కొత్తగా వచ్చిన రోజులు. ఆ రోజుల్లో ప్రజలకు రేడియో గొప్ప వినోద సాధనం. యంత్ర స్వరూపం గురించి, పరిశ్రమ స్వభావం గురించి, వీటి పునాది మీద ఏర్పడిన ఆధునిక వ్యవస్థ గురించి శ్రీ శ్రీకి లోతైన అవగాహన ఉంది. భారతీయ సాహిత్యంలో సుమిత్రానందం పంత్, రవీంద్రనాధ్ టాగోర్, గురజాడ అప్పారావు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీ శ్రీ మొదలైన వారు – సాంకేతిక రంగంలో మానవుడు సాధిస్తున్న ప్రగతికి అమితానందపడ్డారు. మరీ ముఖ్యంగా కొడవటిగంటి కుటుంబరావు, శ్రీ శ్రీ జీవితానికీ -సైన్స్ కీ, జీవితానికీ-టెక్నాలజీకి ఉన్న సంబంధాన్ని, సమాజాభ్యుదయ కాంక్షతో శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషిస్తూ రచనలు చేశారు.
తీరికా, స్థిమితమూ లేని ఎలెక్ట్రిక్ యుగపు ఆధునిక మానవుడి కోసం స్వల్ప వ్యవధిలో వినోదం కలిగించడానికి అవతరించింది ఆధునిక రేడియో నాటిక. తెలుగు జీవితాన్ని సహస్ర ముఖాల వెల్లడి చేయగల అపూర్వమైన అవకాశాన్ని శ్రీ శ్రీ వదులుకోలేదు. 40 వ దశకంలోనే దాదాపు 20 రేడియో నాటికలు రాశాడు. శీర్షికను ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు నిర్ణయించేవారు. తన కాలానికి సరికొత్తదైన వస్తువుతో, “జ్ఞానం కన్నా ఊహ గొప్పది” అన్న ఐన్ స్టీన్ మాటల్ని రుజువు చేస్తూ శ్రీ శ్రీ శీర్షిక చుట్టూ కథను అల్లడంలో శ్రోతలను దిగ్భ్రాంతులను చేసే ఊహాలోకం చూపించేవాడు. స్వల్ప పరిమాణం గల ఇతివృత్తంలో అత్యంత గంభీరమైన అర్ధాలను శ్రోతల హృదయాలలో స్ఫురింపజేయాలని శ్రీ శ్రీ ఉద్దేశ్యం. శ్రీ శ్రీ తన నాటికలన్నిటిలో తీసుకున్న వస్తువు “మానవుడు-అతని సమస్యలు.” వ్యక్తిగత, రాజకీయ, ఆర్ధిక, సౌందర్య, మానసిక, నైతిక, సామాజిక అంశాలనూ, పరిణామాలనూ ప్రభావితం చేయడానికి వర్తమాన జీవితం మీద బ్రహ్మాండమైన బాణాలు విసిరాడు. “ఇదీ మన ప్రపంచం” అని సమాజాన్ని కళ్ళకి కట్టించడానికి శ్రీ శ్రీ ఎన్నో ప్రయోగాలు చేసి ఈ శతాబ్దపు దూరదృష్టాన్ని, మన లోపలి అన్ని కోణాలనూ స్పృశిస్తూ శ్రోతలను తన వెంట నడిపిస్తాడు. శ్రీ శ్రీ మేధాశక్తి వత్తిడుల వల్ల, ఆయన చెప్పదలచుకున్న విషయాన్ని రేడియో శ్రోతల కోసమే రాశాడనడానికి వీలు లేదు. ఆయన శ్రోతలూ, పాఠకులూ భూత, వర్తమాన, భవిష్యత్తులలో వ్యాపించుకొని ఉన్న సర్వకాల మానవులు!
“1+1=1” (చతురస్రం) అనే రేడియో నాటికలోని విషయమే “చరమరాత్రి” అనే కథలోనూ ఉంది. రేడియో నాటికల సంపుటికి
“1+1=1” అనే శీర్షికనూ, కథల సంపుటికి ““చరమరాత్రి” అనే శీర్షికనూ పెట్టాడు శ్రీ శ్రీ. అందువల్ల ఈ నాటికకి శ్రీ శ్రీ దృష్టిలో విశేష ప్రాధాన్యత ఉందని గమనించవచ్చు. మానవజాతి భవిష్యత్తు, కాలం ప్రాతిపదికగా ఈ నాటికను రచించాడు శ్రీ శ్రీ. విషయం 2000 సంవత్సరం నాటిది.
ఇతివృత్తం: 1999, డిసెంబర్ 31 వ తేదీన ఈ నాటిక కథ ప్రారంభమవుతుంది. చంద్రలోకం నుంచి మానవుడు తెచ్చిన అమృతాన్ని ప్రపంచ ప్రజలందరికీ పంచాలని ఐక్యరాజ్యసమితి నిశ్చయిస్తుంది. ఈ సమావేశంలో బ్రిటన్, అమెరికా వంటి అగ్రదేశాలు ఆ ప్రయత్నానికి అడ్డు పడతాయి. ఆఫ్రో-ఆసియన్ దేశాల తరఫున లుముంబా జూనియర్ ప్రతిపాదించిన తీర్మానం నెగ్గి అమృతాన్ని ప్రపంచ ప్రజలందరికీ పంపిణీ చేయడానికి నిర్ణయిస్తుంది ఐక్యరాజ్యసమితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి భారత దేశానికి డాక్టర్లు వచ్చి ఇంజెక్షన్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో, వివిధ ప్రాయలు గల జ్ఞానం, రాజ్యం, సిరి, కళ అనే వ్యక్తులకు అమృతం ఇచ్చి వెళతారు. డెబ్బయి ఏళ్ల జ్ఞానం యువకుడవగా. పదేళ్ళ కళ యువతి అవుతుంది. యాభై ఏళ్ల రాజ్యం ముప్పై ఏళ్ల యువతి అవుతుంది. సిరి అనే కవి మాత్రం అప్పుడూ ఇప్పుడూ ముప్పై ఏళ్ల వాడే! అమృతం తాగాక నలుగురూ ముప్పై ఏళ్ల వాళ్ళయిపోతారు. ఇక వాళ్ళలో గొడవ మొదలవుతుంది. జ్ఞానం రాజ్యంని కాదని కళని పెళ్ళాడబోగా, కవి కూడా కళనే పెళ్ళాడతానంటాడు. జ్ఞానం రాజ్యాన్ని చేసుకోమని కవికి సలహా ఇవ్వగా ఆమె పెళ్ళికి పెడమొఖం పెడుతుంది. కళ జ్ఞానాన్ని నిరాకరిస్తుంది. ఈ రభసలో ఒక స్త్రీ అవతరించి, తానే దైవాన్నీ, సత్యాన్నీ అంటుంది. కవి ఆ స్త్రీతో సంభాషిస్తూ “రెండు ఖడ్గా లు” అనే సుదీర్ఘ కవిత వినిపిస్తాడు.
“రెండు కాంకాళాల కార్తీక దీపాలు (ప్రమీదా, కొవ్వొత్తీ)
ఇంకా రెండేమిటి ? ఒకే ఒకతనం, ఒకే రెండుతనం
లేకపోవడం వొకే నిండుతనం”.
అని రెండులో ఏకత్వాన్ని సూచించడానికి శ్రీ శ్రీ ఈ పాట పాడించాడు. ఈ గీతం ఆధునిక కవిత్వంలో ఉత్తమ శ్రేణికి చెందిన ఉదాహరణమనీ, మానవాళితో తన ఆత్మైక్యాన్ని శ్రీ శ్రీ తెలుపుతున్నాడనీ విమర్శకులు భావించారు.
శ్రీ శ్రీ “చతురస్రం” నాటికను ప్రారంభిస్తూ, “ఈ నాటికను నేను ఎప్పుడో రాయవలసింది. భగవంతుని గురించీ, మానవుని గురించీ నాకున్న అభిప్రాయాలను కొంతలో కొంతయినా ఈ నాటిక ద్వారా తెలియజేయగలిగినానని నేను అనుకుంటున్నాను. శ్రీ శ్రీని నిరీశ్వరవాదిగా చిత్రించేవారు కొందారున్నారని నాకు తెలుసు. అలాంటివారినే నేను ముఖ్యంగా ఈ నాటికను శ్రద్ధగా చదవండని కోరుతున్నాను. ఎప్పటికైనా మానవుడు మరణం మీద విజయం సాధిస్తాడనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకమే ఈ నాటికా రచనకు ఆధారం” అని అంటాడు.
“…. మానవ మనస్సులో అనేక చతురస్రాలున్నాయి. రెండేసి రెండేసి సమానాంతర రేఖలు నిలువుగా ప్రవిహిస్తున్నాయనుకోండి. అప్పుడు వాటిమధ్య ఎన్నో చతురస్రాలు ఏర్పడతాయి కదా. అయితే అవి స్క్వేరులా లేకపోతే రెక్టాంగిల్సా? సమ బాహు చతురస్రాలా? విషమ బాహు చతురస్రాలా? ఈ చతురస్రాల సమస్యలను పరిష్కరించడం ద్వారా కూడా ప్రజలందరికీ అమృతాన్ని పంచిపెట్టవలసిందే. ప్రస్తుత ప్రపంచ స్థితిలో వీటిని రెక్టాంగిల్స్ అని నేను అనుకుంటున్నాను. ప్రవహిస్తున్న అడ్డం నిలువు సమానాంతర రేఖలుగా కాలాన్ని నేను భావిస్తున్నాను. మానవుడు టైముని స్క్వేర్ చెయ్యాలి” అని అంటాడు శ్రీ శ్రీ.
ఈ నాటికలోని నాలుగు పాత్రలకు శ్రీ శ్రీ సాంకేతికంగా పేర్లు పెట్టాడు. జ్ఞానం అంటే విజ్ఞానం, రాజ్యం అంటే రాజకీయం, కళ అంటే సౌందర్యం, సిరి అంటే కవిత్వం. ఈ నాలుగు అంశాలూ నాలుగు బాహువులు. నాలుగు పాత్రలకీ వయస్సులో ఉన్న బేధం, ఆ నలుగురికీ స్వభావాల్లోనూ, సర్వ విషయాల్లోనూ ఉన్న భేదానికి ఉపలక్షకం. వీటికి ఒకదానితో ఒకదానికి పొత్తు లేదు. అందుకే ఇది మొదట విషమ బాహు చతురస్రం. ఇది సమ బాహువుగా మారడమన్నదాన్ని శ్రీ శ్రీ నలుగురినీ 30 ఏళ్ల వాళ్ళనిగా చేయడంగా భావించాడు.
మానవుడు రాజకీయ స్వాతంత్ర్యమూ, ఆర్ధిక స్వాతంత్ర్యమూ సాధించినా ఇంకా మానసిక స్వాతంత్ర్యం సాధించవలసే ఉంటుందని శ్రీ శ్రీ అభిప్రాయం. ఈ అభిప్రాయానికనుగుణంగా, నాటికలో 2000 సంవత్సరం నాటికి మానవ కుటుంబమంతా రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యాలను అనుభవిస్తూ మానసిక స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటుందని రచించాడు. ఈ అంశాన్ని ప్రయోక్తే స్వయంగా నాటికలో తెలియజేస్తాడు.
మానవుడు కాలాన్ని జయించడం అనేది 1999 వ సంవత్సరం, డిసెంబర్ 31 వ తేదీ నాటికి సాధ్యమవుతుంది అన్నట్లుగా ఊహించాడు ఆశావాది శ్రీ శ్రీ. సరిగ్గా ఆ సంవత్సరమే కాకపోయినా, ఎప్పటికైనా మానవుడు ఆ స్థితిని సాధిస్తాడు అనేది శ్రీ శ్రీ విశ్వాసం. సైన్స్, టెక్నాలజీ సాధించిన, సాధిస్తున్న అద్భుతమైన విజయాలను తన కాలంలో చూస్తున్న శ్రీ శ్రీకి, అవి కాలాన్ని జయించడానికి కావలసిన అమృతం లాంటి దాన్ని కనుక్కోవడానికి మానవుడికి తోడ్పడతాయని శ్రీ శ్రీకి నమ్మకం. ఈ నమ్మకాన్ని చంద్రుడి మీదకి దిగగల్గిన మానవుడు అక్కడి అమృతాన్ని నేలమీదికి తీసుకొస్తాడనే కవితాత్మక ఊహతో ముడి పెడతాడు. అమృతాన్ని త్వర త్వరగా ప్రపంచానికంతటికీ పంపిణీ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి సంస్థలు ఉన్నాయనీ, టాబ్లెట్ల ద్వారా, ఇంజెక్షన్ల ద్వారా అమృతాన్ని ప్రతి మనిషికీ అందించే వీలుందనీ అద్భుతంగా ఊహిస్తాడు శ్రీ శ్రీ. “చతురస్రం” Futuristic నాటిక. అంతా ఊహాత్మకమే! భవిష్యత్తు మీద గాఢమైన వాంఛకీ, విశ్వాసానికీ శబ్దరూపం ఈ నాటిక.
ప్రపంచం ఏమిటి? అనేది శ్రీ శ్రీ మొదటి ప్రశ్న అనుకుంటే అందులో మనిషి పాత్ర ఏమిటి? అనేది అతని రెండవ ప్రశ్న. దైనందిన మానవ జీవితం ఒక నాలుగు స్తంభాలాట. అమృతం తాగడానికి ముందు తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా జ్ఞానం, రాజ్యం ప్రవర్తిస్తారు. అమృతం తాగినప్పటికీ వారిలో మానసిక వృద్దాప్యం పోలేదని సూచించడానికి శ్రీ శ్రీ ఇలా చేశాడు. అంతకుముందున్న మానసిక స్థితి కవి లోనూ, కళ లోనూ కొనసాగింది. ఇది విషమ బాహు చతురస్ర సమస్య. ఈ సమస్య పరిష్కారానికి దైవ సహాయం కావాలి. ఇక్కడ దైవమంటే ఈశ్వరుడు కాదు. శ్రీ శ్రీ ప్రకారం ఇక్కడి దైవం విజ్ఞానం, కవిత, తపస్సు, స్వప్నం, సౌందర్యం వగైరాలు. అన్నిటికీ సృష్టికర్త మానవుడే. కవిత్వానికీ, శాస్త్రానికీ వైవిధ్యం ఉందని సామాన్యమైన అభిప్రాయం. ప్రతి కళకూ శాస్త్ర నిబంధనాలుంటాయి. అలాగే ప్రతి శాస్త్రానికీ కళాత్మకత ఉంటుంది. రెండిటికీ వైరుధ్యం లేదని చెప్తుంది ఈ సన్నివేశం.
“సిరి: ఫ్రెయిల్ టీ దై నేమ్ ఈజ్ ఉమన్ అన్నాడు
షేక్ స్పీయర్ ఆనాడు. ప్రేయసీ! నీ పేరు
రాక్షసి అన్నాడు శ్రీ శ్రీ యీనాడు.
జ్ఞానం: నేను బయాలజిస్టుని, ఫిజియాలజిస్టుని, సైకాలజిస్టుని.
రాజ్యం: జిష్ణుని, విష్ణుని, కృష్ణుని.”
ఈ పై వాక్యాల్లో కవి చెప్పిన కవిత్వం, జ్ఞానం వినిపించిన సైన్స్, రాజ్యం చెప్పిన మతం ఈ మూడూ మూడు స్థాయిలలో మనిషిని నడిపిస్తాయి. మానవ సమాజాభివృద్ధికి కళలూ, సైన్సూ, మతం తలోక విధంగా తోడ్పడ్డాయి. కళలు మానవ వికాసాన్నీ, సైన్స్ మానవ భౌతిక జీవితాభ్యుదయాన్నీ, మతం మొదట్లో మానవ సామాజిక వర్తననూ శాసించాయి. జీవితాన్ని సౌఖ్యంగా మలచుకోవడానికి సైన్స్-టెక్నాలజీ సాధిస్తున్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటూ మానవుడు అత్యద్భుతమైన నాగరికతను నిర్మించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో మతాన్ని, సైన్స్ సంకుచిత పరిచింది. అలాగే కళలు కూడా సైన్సుతో పాటు తమ స్వభావాలనీ, లక్ష్యాలనూ మార్చుకుంటూ రావలసి వచ్చింది. అందుకే కొందరు కళాకారులు మతం వేరు, సైన్స్ వేరు అని ప్రచారం చేస్తారు. కానీ శ్రీ శ్రీ అలా కాకుండా దైవం గురించి చేసిన చర్చలన్నీ మానవత్వం-మానవత అనే పదాల సంపూర్ణమైన అర్ధం వచ్చేవరకూ వివరించాలని తాపత్రయ పడ్డాడు. ఈ ప్రపంచానికి సర్వ సమానత్వం, ప్రశాంతత, శాంతి, సౌఖ్యం ఏర్పడాలని రచయిత ధ్వనింపజేశాడు. మానవ జీవితంలోని చిన్న, పెద్ద సంఘర్షణలన్నీ పరిష్కారమైన స్థితినే రచయిత సమ బాహు చతురస్రంగా భావించాడు.
మొత్తం మానవజాతికి ఉపయోగపడవలసిన వనరులన్నీ కొందరు వ్యక్తుల పరమై, కొన్ని వ్యాపార సంస్థల పరమై, మానవ సమాజంలో ఎగుడు దిగుళ్ళు, హెచ్చు తగ్గులు, ద్వేషాలు, కుట్రలు, కార్పణ్యాలు మొదలైన అమానుషాలకు దారి ఏర్పడింది. ఈ భూగోళంపై లభించే వనరులు, సంపద, మానవుడు సృష్టించిన విజ్ఞానం యావత్ప్రపంచాన్ని సుఖ సంతోషాలతో ఉంచగల ప్రమాణాలతో ఉన్నప్పటికీ ప్రపంచంలో దారిద్ర్యం పోలేదు. అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకులకు కల్పిస్తున్న దారిద్ర్యమే కాని ఇది ఎవరు చేసుకున్న “ఖర్మ” కాదని శ్రీ శ్రీకి తెలుసు. ఈనాటి ప్రపంచంలో కుబేర వైభవం పక్కనే కుచేల దారిద్ర్యం ఉండడం కృత్రి మమని శ్రీ శ్రీ అభిప్రాయం. శాస్త్ర జ్ఞానం కనిపెట్టిన టెక్నాలజీ మానవజాతి మొత్తానికీ ఉమ్మడి సొత్తు కావాలని శ్రీ శ్రీ ఆకాంక్ష. మనిషిని సుఖపెట్టడానికి, అతనికి సౌకర్యాలు కలిగించడానికి ఉపయోగపడవలసిన శాస్త్రం, మనిషిని ఆహ్లాదపరిచి, ఆవేశపెట్టి మానవత్వం వికసింపజేసే కళ రెండూ మానవజాతికి దూరమైపోయాయి. వ్యక్తిగతమైన ఆస్తి, హక్కుల వ్యవస్థ ఉన్నంత కాలం మానవుడు సాధించిన విజయాలు మానవత్వ స్పర్శను కోల్పోయి అమానుషీకరణలో భాగం పంచుకుంటాయి. మహర్షుల ఋగ్వేద కాలం నుంచి అత్యాధునిక కాలం వరకు పరిఢవిల్లిన విజ్ఞానమైనా, కళ అయినా మానవాళికి ప్రయోజనకారిగా మారి వారి అభ్యుదయానికి దోహదాకారి కావాలన్నది శ్రీ శ్రీ సత్సంకల్పం. సైన్స్ మీద ఆయనకున్న అపారమైన నమ్మకాన్ని, మానవాళి మీద ఆయనకున్నఅమితమైన ప్రేమను తెలుపుతుంది ఈ నాటిక.
“1+1=1” అని అనడం మానలేను
అంటే దీని అర్ధం; ఔను/కాదు. మంచి/చెడ్డ, వెలుగు/చీకటి, చావు/బతుకు, మనిషి/దేవుడు, అంతా ఒకటే అని. ఇందు మూలంగా శూన్యం మీదనూ, అనేకం మీదనూ ఏకానికి గల ఆధిక్యాన్ని ఊగ్గడిస్తున్నాను. ఈ ఏకం ఎవరో కాదు. మానవుడు. అతడే సత్యం. అతడే నిత్యం. అతడే ఈశ్వరుడు.”- అని అంటూ మానవజాతి మీద అపారమైన ప్రేమను వర్షిస్తాడు శ్రీ శ్రీ.
శ్రీ శ్రీ కళలకు, కాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ నాటిక. ప్రజల స్మృతులను, ఉద్వేగాలను, స్వప్నాలను తనవిగా చేసుకొని అద్భుతంగా చిత్రించాడు శ్రీ శ్రీ. నాటికలో ఐక్యరాజ్యసమితి భవనం ఆంధ్రదేశంలో ఉన్నట్లు, అది అరవై అంతస్తుల భవనమైనట్లు, సమితి సభ్యులంతా తెలుగుని అమితంగా గౌరవించినట్లుగా శ్రీ శ్రీ ఊహించి రచించాడు. ఇవన్నీ శ్రీ శ్రీ ఆకాంక్షలే! శ్రోతలందరికీ సంతోషం కలిగించేవే. శ్రీ శ్రీకి అంతర్జాతీయత అంటే ఎంత మోజు ఉందో జాతీయత అన్నా ఉపజాతీయత (తెలుగుతనం) అన్నా అంతే వ్యామోహం ఉంది. ఈ విషయం నాటికలో అనేకచోట్ల వ్యక్తమవుతుంది.
శ్రీ శ్రీకి ప్రపంచ పౌరుడి స్పృహతో పాటు, ఆయనకి ప్రపంచ రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉంది. దాదాపు ఎనిమిది దశాబ్దాల ముందు ఆయన ప్రతిపాదించిన మానవుడి సమస్యలు, అగ్రరాజ్యాలు-చిన్నదేశాల మధ్య సంబంధాలు నేటికీ ఏమాత్రం మార్పు లేకుండా చెక్కు చెదరకుండా ఉన్నాయి. సమాజంలోని ఇతర సంపదల లాగా టెక్నాలజీ కూడా పెత్తందారుల స్వార్ధ ప్రయోజనాలకే వినియోగించబడుతోంది అని శ్రీ శ్రీ ఆవేదన చెందాడు. సాంకేతిక రంగంలో శ్రీ శ్రీ ఊహించినట్లే కాకపోయినా అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ వాటి ఫలాలు సమాజంలోని మనుషులకందరికీ అందడంలేదు.
నాటికలో ఒకచోట ఒక పాత్ర చేత శ్రీ శ్రీ “కరక్ట్ గా గెస్ చేయడమే కవిత్వం” అనిపిస్తాడు. ఈ విషయాన్నే ఒక వ్యాసంలో శ్రీ శ్రీ, “అనేక విధాల క్షణ క్షణ పరిణామం పొందుతున్న ప్రపంచానికి కళాశీలురే పురోగాములు. వీరి దృష్టిలో ప్రజ్వరిల్లిన ఆదర్శలోకమే కాలక్రమాన భౌతిక లోకంలో రూపు కడుతుంది. .. కవి దర్శించిన నేటి కలలే రేపటి యదార్ధాలవడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం”-అని అంటాడు. నిజమే. Marshall McLuhan ముందుగా చెప్పిన ప్రపంచ కుగ్రామం (Global Village) లో ఇప్పుడు మనం నివశిస్తున్నాం. మానవుడు సాధించగలిగే అత్యున్నత విజయాన్ని శ్రీ శ్రీ కాలాన్ని జయించడంగా భావించాడు. సాంకేతిక విజ్ఞానం సాధించిన కంప్యూటర్ సమాచార విప్లవం (ఎలెక్ట్రిక్ సర్క్యూట్రీ) మనకు తిరిగి మానవుని బహుముఖీన దృక్కోణాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనందరం ఒక చిన్న గ్రామంలో ఉన్నాం. పల్లెటూరికి రహస్యాలుండవు. గ్రామంలో మానవీయ స్పందనలు, మంచితనం, పరస్పర సహకారం వెల్లివిరుస్తాయి. కాలం నిలిచిపోయింది. కాలానికే కాలం చెల్లింది. “స్థలం” అదృశ్యమైపోయింది. భిన్న ప్రాంతాలలో ఉంటూనే, భిన్న విభిన్న మనస్తత్వాలతో ఉంటూనే ఏక కాలంలో జీవిస్తున్నాం. ఉదాహరణకి ప్రిన్సెస్ డయానా అంతిమ యాత్రలో యావత్ జనాభా పాలుపంచుకుంది. ఎంత వద్దనుకున్నా, ఎంత ఒక మూలాన పడుందామన్నా మనిషికీ- మనిషికీమధ్య సత్సంబంధాలు పెంపొందే రోజులవచ్చేశాయి.
నాటికలో ఐక్యరాజ్యసమితి సమావేశారంభంలో, “యుద్ధ స్పర్శ లేకుండా చేయడం మానవజాతి సాధించిన ప్రగతి”- అని అనడం శ్రీ శ్రీ అసంఖ్యాక స్వప్నాల్లో ఒకటి.
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది అంటే ఆ యుద్ధం ఆ దేశాల ప్రజల మధ్య జరగదు. ఆ యా దేశాల ప్రజలకి యుద్ధాల ద్వారా పరిష్కరించుకోవలసిన సమస్యలేమీ ఉండవు. రెండు దేశాల మధ్య పాలకులకూ, ఆ రెండు దేశాలకూ అటూ-ఇటూ ఆయుధాల సరఫరా ద్వారా, వ్యాపారం చేసే బడా సామ్రాజ్యాధినేతలకూ మాత్రమే వైరుధ్యాలుంటాయి. యుద్ధాలు చేసి పెట్టి, మరణాల పాలయ్యేది రెండు దేశాల పేద ప్రజలే. ప్రయోజనాలు, పేరు, కీర్తులు మాత్రం పాలకులకూ, పెద్దలకే! వేరు వేరు సాంఘిక వ్యవస్థలు గల దేశాలు నేడు “సహజీవనం” చేయడాన్ని మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. టెక్నాలజీ సాధించిన కమ్యూ నికేషన్స్, టి వి, కంప్యూటర్ – ఇవన్నీ దేశాలనూ, మనుషులనూ ఏకం చేస్తూ, వారి మధ్య భావైక్యతను పెంపొందిస్తూ “పల్లెటూరి సమిష్టి చేతన” లోకి జనావళిని తీసికెళుతోంది. ఉదాహరణకు వాలసవాదులు రైళ్ళు, తంతి తపాలాశాఖలను తమ దోపిడీని కొనసాగించడానికి ఉపయోగించుకున్నారు. “ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు” అనే మన పెద్దల సామెతను రుజువు చేస్తూ అవే రైళ్ళు, తదితర టెక్నాలజీ సాధించిన విజయాలు మనుషుల్ని ఏకం చేస్తున్నాయి. రవాణా సౌకర్యాలు కల్పించడం వల్ల ధన్యవంతులనూ-పేదలనూ పక్క పక్క సీట్లలోకి చేరుస్తున్నాయి. ఏ వార్త అయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోవడం వల్ల మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగి విముక్తి పోరాటాలకు దారి తీస్తున్నాయి. పాలకులు టెక్నాలజీని తమకే దాస్యం చెయ్యాలనుకుంటారు. కానీ అది నేడు గాలీ, నీరూ, నిప్పూల లాగా మానవాళికి ఉపయోగపడుతుంది.
మనుషులు నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న శీతోష్ణ పరిస్థితులు, ఆ వాతావరణానికి అనువయ్యే ఆహారపు అలవాట్లు, పని పరిస్థితులు మొదలైనవన్నీ మనుషుల జీవన శైలిని వాటికి అనుకూలంగా మార్చుకుంటాయి. లేకపోతే అక్కడున్న మనుషులే వాటికి అనుకూలంగా తమ జీవన సరళిని మలచుకుంటారు. ఈ క్రమం అక్కడున్న ఏ దేశాల ప్రజల మధ్యైనా స్నేహ సంబంధాలనే పెంచుతుంది గానీ విరోధాలు వచ్చే సందర్భమే రాదు. కాబట్టి ఏ రెండు దేశాల మధ్యైనా ఆయుద్ధాలతో మనుషులు కొట్టుకు చచ్చేంత శత్రుత్వం ఉండడమనేది ఎంత అర్ధరహితమో ప్రజలు గుర్తిస్తున్నారు. ముందు ముందు ఇంకా గుర్తిస్తారు. శ్రీ శ్రీ నాటిక ఆరంభంలో శ్రీ రావు అనే పాత్రతో – “మానవజాతి ఒకే కుటుంబం అన్న మాటకి ప్రాణం వచ్చింది” – అని అనిపించి ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే కలగన్నాడు.
ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో అనవసరమైన శ్రమ, కాల యాపనా, వాగ్వివాదాలే తప్ప ప్రపంచ ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టడం చాలా తక్కువవి నొక్కి చెప్పాడు శ్రీ శ్రీ. అదిప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. నాటికలో రెండు రంగాలను సృష్టించాడు. ఒకటి విశాల ప్రపంచం. అందులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం. 150 స్వతంత్ర దేశాలకు ప్రాతినిధ్యం వహించే 150 సభ్యులు. రెండోది చిన్న ప్రపంచం. అది జ్ఞానం, రాజ్యం, కవి, కళ సంభాషించుకునే చోటు. రెండు రంగాల్లో సామాన్య మానవుడి గురించి చర్చించుకునే విషయాలే ఉంటాయి. యావత్ ప్రపంచాన్నీ ఒక వైపు ఉంచి – విజ్ఞానం, సౌందర్యం, కళ, తపస్సు, స్వప్నం మొదలైన ఉన్నత మానసిక చర్యల ద్వారా భారత దేశాన్ని మరో వైపూ చిత్రించి శ్రోతల్ని ఎవరి శక్తి మేరకు వాళ్ళను ఊహించుకోమంటాడు శ్రీ శ్రీ.
నాటిక అంతంలో కవికీ-స్త్రీకీ జరిగిన సంభాషణలో కవి స్త్రీని “మానవా” అని సంభోదిస్తే, ఆ స్త్రీ కవిని, మాధవా అని సంభోదిస్తుంది. ఈ సంభోదనల వల్ల స్త్రీ అంటే ప్రకృతి లో దాగిన పురుషుణ్ణీ, మానవుడిలో దాగిన మాధవుణ్ణీ తలపుకి తెస్తాడు శ్రీ శ్రీ. శ్రోతలకి “మానవుడే – మాధవుడు” అనే సూక్తి చటుక్కున స్ఫురిస్తుంది.
2000 సంవత్సరం నాటికి ఏ మార్పులను ఆశించాడో వాటికి భిన్నమైన వాతావరణాన్ని చిత్రిస్తూ ఈనాటికీ వాస్తవమనిపించే సంఘటనల్ని కళ్ళకు కట్టిస్తాడు శ్రీ శ్రీ. చిన్న రాజ్యాల పట్ల న్యూనతాభావం అగ్రరాజ్యాలకు ఇప్పటికీ పోవడం లేదు. ఆ కాలంలోనే అమెరికా ప్రపంచరాజకీయాల్లో సైంధవుడి పాత్రను నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పాడు శ్రీ శ్రీ.
శ్రీ శ్రీ ఈ నాటిక రాసే కాలానికి మొత్తం సభ్య దేశాల సంఖ్య 51 మాత్రమే! బ్రిటన్, అమెరికా, చైనా, రష్యాలకు 1945 లోనే శాశ్వత సభ్యత్వం వచ్చింది. శ్రీ శ్రీ ఆ కాలంలోనే ఆశించినా భారతదేశానికి తన కాలంలో సభ్యత్వం రాలేదు. ఆయన చెప్పినట్లే – ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, జర్మనీలు భారతదేశానికి సభ్యత్వం ఇవ్వడానికి మొగ్గు చూపుతుండగా, అమెరికా మాత్రం ఇండియాకి అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ, “తీవ్రంగా పరిశీలిస్తాం” అంటూ ‘సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం’ పై సంతకం చేయమని షరతులు పెట్టడం గమనిస్తాడు శ్రీ శ్రీ (‘భిన్నాంశం-జులై 11, 2000- భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం-భారత్ కి అనుకూలంగా కదులుతున్న పావులు’ అనే వార్త పేపర్ లో ప్రకటించిన విషయం ద్వారా తెలియజేశాడు శ్రీ శ్రీ)
“నిజంగానే నిఖిలలోకం
నిండు హర్షం వహిస్తుందా?”
అనే అనుమానంతో శ్రీ శ్రీ ఆవేదన చెందుతాడు. ఇటీవల ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నివేదిక వెలువడిన సందర్భంగా “ప్రతి వ్యక్తికీ పుట్టుకతోనే స్వేచ్చ, సమానగౌరవం, ఆహారం, వైద్యం, నివాసం, విద్య వంటి హక్కులు ఉంటాయని, ఈ హక్కులే మానవుడికి సౌభాగ్యం, గౌరవం కల్పిస్తాయంటూ అవి నేటి మానవాళిలో అందరికీ అందడం లేదంటూ అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు. (జులై4 2000 – వార్త). శ్రీ శ్రీ ఆశించిన రోజులు ఇంకా రాకపోవడం అటుంచి ఇంకా హీనాతి హీనంగా మన దేశంలోని, ఆ మాటకొస్తే ప్రపంచంలోని మూలవాసుల్ని వేలాదిగా, లక్షలాదిగా యధేచ్చగా జాతి హననాలు చేస్తున్నారు.
కొందరు భౌతిక వాంఛలు తుఛ్చమైనవనీ, ఆధ్యాత్మిక చింతన చాలా ఉన్నతమైనదనీ బోధిస్తుంటారు. అలాంటివారిని శ్రీ శ్రీ “మాయంటావా స్వామీ, మిధ్యంటావా” అనే కవితలోనూ, “స్వామి- భూస్వామి” అనే రేడియో నాటికలోనూ హేళన చేశాడు. ఆధ్యాత్మికం లేకుండా మనిషి బతికిన రోజులున్నాయి గానీ ఆహారం లేకుండా బతికిన రోజులు లేవు. ఆకలి దహిస్తుంటే మనిషికి ఏమి తోచదు. జ్వరమో, తలనొప్పో వస్తే నీతి శాస్త్రాలూ, ధర్మ శాస్త్రాల సంగతి దేవుడెరుగు ముందు వైద్య శాస్త్రం సంగతి చూడమని శాసిస్తుంది శరీరం. ఆకలి తెలిసిన శ్రీ శ్రీ ఉన్నతమైన విలువలు కూడా భౌతికమైన క్షేమానికీ, సౌఖ్యానికీ ముడిపడి ఉంటాయని గ్రహించాడు. అందుకే నాటికలో అమృతాన్ని అందరికీ పంచేలా చూస్తాడు.
మానవ శ్రమ వల్ల సృష్టింపబడుతున్న సకల సంపదలు – సర్వ మానవులందరికీ అందడానికి అనువైన సామాజిక వ్యవస్థ రావాలని శ్రీ శ్రీ ఆరాటపడతాడు. ఇదే విషయాన్ని అనేక విధాలుగా వ్యక్తీకరిస్తాడు. మహాప్రస్థానంలో ఒకచోట
“.. స్వాతంత్ర్యం,
సమభావం
సౌభ్రాత్రం
సౌహార్ధం
పునాదులై ఇళ్ళు లేచి,
జనావళికి శుభం పూచి –
శాంతి, శాంతి, శాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది,
ఈ స్వర్గం ఋజువవుతుంది!”
-అంటూ మానవాళికి ఆశ్వాసాన్ని కలిగిస్తాడు.
“చతురస్రం” నాటికలో కవికి ఎప్పుడూ 30 ఏళ్ళేనని రాశాడు. కవులు ఎప్పుడూ మానసికంగా యవ్వనదశలో ఉండాలంటాడు శ్రీ శ్రీ. కవులు స్తంభించకూడదనీ, సమాజానికి అంతఃకరణలుగా పని చేయాలనీ, సామాజిక శరీరంలో బ్రహ్మరంధ్రం దాకా పరివ్యాప్తమయ్యే సుషుమ్నాడిగా స్పందించి రచనలు చెయ్యాలని కవుల బాధ్యతను నిర్దేశించి చెప్పాడు శ్రీ శ్రీ. ప్రస్తుతం మన చుట్టూ పరివ్యాప్తమై ఉన్న “ఎలక్ట్రిక్ డ్రామా” యువతరానికి అతి సహజంగా అర్ధమవుతోంది. రాకెట్ స్పీడ్ తో ప్రయాణించే సాంకేతిక పరిణామాల కాలంలో జీవిస్తూ – ఈ తరం అన్ని రకాల వేగాలకీ లోనవుతూ, ఒత్తిడులకు గురవుతోంది. ఈ కాలానికి పనికి రావని తెలిసీ, నేటి ప్రశ్నలకు సనాతన ధర్మాల పేరిట నిన్నటి సమాధానాలు చెప్తూ, 30 ఏళ్ళకే ముసలివాళ్ళై పోతున్న అధ్యాపకుల్ని కాలంతో పాటు వేగాన్ని అందుకోమంటాడు శ్రీ శ్రీ.
ఆధునిక కవిత్వంలో ఇంటి పేర్లు ఉండడం చాలా అవసరమంటాడు శ్రీ శ్రీ. “గుమాస్తా కల” అనే రేడియో నాటికలో “జటావల్లభుల” అనే ఇంటి పేరుని ఆధునికంగా “జటావల్” అని మార్చేస్తాడు. ప్రపంచం మొత్తంలో, కోనేటిరావు (తెలుగు వాడు) ని మించిన ఇంజనీరు లేడని అమెరికా ఆహ్వానిస్తుంది. ఐక్యరాజ్యసమితి భవనం శ్రీ శ్రీ ఊహించినట్లు 2000 సంవత్సరం నాటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదు గానీ అగ్రరాజ్యాధినేత ప్రపంచ ప్రధమ పౌరుడు 2000 సంవత్సరం లోనే ఆంధ్రప్రదేశ్ ని సందర్శించారు. అంటే ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పలుకుబడిని గుర్తించవచ్చు.
గమ్మత్తు ఎక్కడుందంటే సమాచార మాధ్యమాలను ఇలా ఇంత వేగంగా సృష్టిస్తుందని Jules Verne వంటి అపారకల్పనాశక్తి ఉన్న సైన్స్ కథా రచయిత కూడా ఊహించలేకపోయాడు. టి వి. 29 వ శతాబ్దానికి గాని కనుక్కోలేరని ఆయన జోస్యం చెప్పాడు. (చూడండి – Marshall McLuhan “The Medium is the Massage”-P:24 1st para) 2000 సంవత్సరం నాటికి విద్యుత్ సమాచార మాధ్యమం సృష్టించబోయే కొత్త వాతావరణాన్ని శ్రీ శ్రీ అర్ధ శతాబ్దం ముందే ఊహించాడు.
గురజాడ “కన్యాశుల్కం”, పికాసో చిత్రించిన “గుయెర్నికా” ఛార్లెస్ డికెన్స్ నవలలు, ఛార్లీ చాప్లిన్ సినిమాలు, టి.ఎస్.ఇలియట్ వస్తు సంవిధానం-మొదలైన వన్నీ శ్రీ శ్రీకి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. అంతేగాక వైజ్ఞానిక పరిశోధనల పట్ల ఆసక్తీ; స్వేఛ్చా, సౌభ్రాతృత్వం, సమానత్వం లాంటి భావాల పట్ల ఆదరణా; డార్విన్, ఫ్రాయిడ్, మార్క్స్ వంటి మేధావుల సిద్ధాంతాల ప్రభావం, యూరప్ నుంచి వచ్చిన ఆధునిక సాహిత్య, ప్రక్రియల, కళా స్వరూపాల, ఉద్యమాల, విప్లవాల పట్ల సంపూర్ణమైన అవగాహనను సమ్మిళితం చేసుకున్న వ్యక్తి శ్రీ శ్రీ.
బహుముఖంగా ఆధునికయుగంలో ఉవ్వెత్తున వచ్చిన వికాసాన్ని ఏకోన్ముఖంగా తెలుగు ప్రజలకు అందించాలని, సమ సమాజ నిర్మాణ సాధనకు ఉపయోగించాలనేదే శ్రీ శ్రీ లక్ష్యం. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలో శ్రీ శ్రీ Wave Length ని కొంతమంది మేధావులు మాత్రమే అందుకుని ఉండవచ్చు. కొత్త వాతావరణంలో సరి కొత్త జీవితం అనుభవంలోకి వస్తున్నకొద్దీ అందరికీ అర్ధమవుతాయని నాటికల ప్రయోక్త బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆన్నారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే కొత్త కొత్త అంశాల్ని కూడా పురాణ కాలపు మానసిక నియంత్రణలతో, పరిమిత స్పందనలతో పరిశీలించడం మనం అలవాటుగా చేస్తున్న అతి పెద్ద పొరపాటు. నేటి కాలం డిమాండ్ చేసే సవాళ్ళకు పరిష్కారాల మూలాలు కూడా ప్రస్తుత కాలంలోనే ఉంటాయని గమనిస్తే – 2000 సంవత్సరం గురించిన శ్రీ శ్రీ ఊహలు, కలలు అద్భుతంగా తోస్తాయి. ఇప్పడు గనక శ్రీ శ్రీ జీవించి ఉండి ఉంటే ఈ సంక్షోభ కాలం గురించి ఏమంటాడో అనే ఆలోచనలు శ్రోతల్ని చుట్టూ ముడతాయి.
ఇప్పటి సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్న యువతరం 1950 వ దశకంలోనే అంతులేని ఆశావాదంతో శ్రీ శ్రీ రాసిన ఈ నాటికలను అర్ధం చేసుకుని భావితరాలకు అవగాహన చేయించగలిగితే అదే ఆ మహాకవికి మనమిచ్చే నివాళి అవుతుంది.