హౌడి!

ఒక లీటర్ పెట్రోల్‌తో రెండు లీటర్ల పాలొస్తాయి. పాలు తాగి సైకిల్ తొక్కండి. ఆరోగ్యంగా ఉండండి. ఆత్మనిర్భర్ భారత్ నిర్మించండి.

“ఒక లీటరు పెట్రోలుతో రెండు లీటర్ల పాలొస్తాయి…”

“ఔను, నాలుగు లీటర్ల నీళ్ళొస్తాయి…”

“ప్చ్… అది కాదు, పెట్రోలు బండిలో పోసేకన్నా పాలు వొంట్లో పోసుకుంటే మేలు…”

“అప్పుడు బండిలా మనమే పరుగులు పెట్టొచ్చు… అంతేనా?”

“ప్చ్… అది కాదు, సైకిలు తొక్కడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యమూ వ్యాయామానికి వ్యాయమమూ…”

“ఔను, యింట్లో సైకిలింగు చెయ్యక్కర్లేదు…”

“పైగా పొల్యూషన్ కూడా వుండదు…”

“ఓహో… వోజోన్ పొర చిరిగిపోకుండా కాపాడడానికే పెట్రోలు రేట్లు రోజూ పెంచుతునారన్న మాట…”

“అదనే కాదు, యేది బెస్ట్ వే అయితే ఆ వేలో మనమూ వెళ్ళిపోవాలి…”

“అంటే హెల్తీ వెల్తీ…”

“ఇంకా చెప్పాలంటే ఎకనిమికల్లీ…”

“ఏమి ఎకనిమికల్లీ? పాలు పచ్చివి తాగలేం కదా?”

“యా… లేనిపోని రోగాలొస్తాయి… నీళ్ళే కాదు, పాలెప్పుడూ మరిగించుకొనే తాగాలి. అప్పుడే…”

“ఆరోగ్యం, లేదంటే మళ్ళీ డాక్టర్లనీ మందులనీ సిక్కనీ సెలవనీ, దాని కన్నా పెట్రోలు పోయించుకోవడమే బెటర్…”

“దాందేముంది? పాలు మరిగించుకొని తాగితే సరి కదా?”

“పెట్రోలు లెక్క కన్నా పాల లెక్క వినడానికి బాగుంది, బట్… ప్రాక్టికల్లీ గ్యాసు లెక్క మర్చిపోయారు…”

“ఓ… అలా వచ్చారా?”

“ఎలా వచ్చినా ట్రాఫిక్ జామే…”

“ఎప్పుడూ మన ఇంట్రెస్టే కాదు, యిప్పుడు నేషన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు… దిగుమతులు తగ్గించుకోవాలి కదా?”

“ఓహో… చమురు దిగుమతులు తగ్గించుకోవడానికే పెట్రోలు రేట్లు రోజూ పెంచుతునారన్న మాట…”

“అలా అనే కాదు, రోడ్లు కూడా పాడవకుండా వుంటాయి…”

“ఓహో… పెట్రోలు ధరలు పెరగడం వల్ల దిల్లిలో లాగ జంబులింగు సిస్టమ్ కాదు, దాని బాబు సిస్టమ్ అమల్లోకి వస్తుంది. ఎక్కడి బైకులూ కార్లూ అక్కడే గప్ చిప్…”

“మనలో మన మాట… మన పేద దేశంలో వుండి కూడా ప్రపంచ దేశాల్లోనే అత్యంత ధనవంతులుగా రాణిస్తున్న మనవాళ్ళకి నష్టం వస్తే యెంత నామోషీ మరెంత నామర్దా… ఆ?”

“ఓహో… మన కుబేరులు ప్రపంచ కుబేరులుగా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా పెట్రోలు రేట్లు రోజూ పెంచుతునారన్న మాట…”

“ఇంకో విషయం… చమురు సంస్థలు లాభాల్లో వున్నప్పుడే వాటి షేర్లు అధిక ధరలకు వెళ్తాయి. ఆ షేర్లు కొన్న ప్రజలూ లాభపడతారు…”

“అరే నాకీ విషయం తట్టనే లేదు, పెట్రోలు రేట్లు రోజూ పెంచడంవల్ల అల్టిమేట్‌గా ప్రజలకే లాభమన్నమాట…”

“మరి?”

“పాపం యీ విషయం తెలియక లీటరు పెట్రోలుని యింకా ముప్పైయ్యారు రూపాయలకే అమ్ముతూ పాకిస్తాను వెనుకబడిపోయింది…”

“యెస్… మన దేశంలో అయితే ఆ ముప్పైయ్యారు కార్పోరేట్ వాడికి అటుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మరో ముప్పైయ్యారు కేంద్ర ప్రభుత్వానికి యింకో ముప్పైయ్యారు…”

“అంతేకాదు, పెట్రోలు రేట్లు రోజూ పెంచడంవల్ల అన్ని నిత్యావసరాల రేట్లూ ట్రాన్సుపోర్టు కారణంగా పెరుగుతాయి. అంటే దానివల్ల మన ప్రజలు విరివిగా డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది. సో…”

“సో… మనీ రొటేట్ అవుతుంది….”

“ఈ లాభాలన్నీ ప్రజలు గుర్తించాలి…”

“గుర్తిస్తారు… ఎందుకంటే…”

“మన దేశం గొప్పది”

“మన దేశభక్తి మరీ గొప్పది”

ఆ యిద్దరి మాటల వెంట నీడలు నడిచాయి, వింటూ. వెంటబడుతూ.

వీడిన నిఘా నీడలు దూరంగా నడిచాయి.

మాటలు వూపిరి పోసుకున్నాయి, గుసగుసగా. ఒక్కమాటై.

“హమ్మయ్యా… యీ రోజుకి మనం ఉపా నుండి తప్పించుకున్నాం!”

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply