అనేక పోరాటాలకు చిరునామాగా పేరుగాంచిన తెలుగు నేల కొద్దికొద్దిగా కాషాయ విష కౌగిలిలోకి ఎలా వెళ్ళిపోతున్నది? అనే ప్రశ్న ఇప్పుడు చాలా ప్రధానమైనది. గత కొన్ని నెలలుగా మతం, మనోభావాల కేంద్రంగా జరుగుతున్న సంఘటనలు మనకు విడివిడిగా కనిపించవచ్చేమో, కానీ వాటిని కలిపే ఒకే ఒక్క సూత్రం బ్రాహ్మణీయ హిందుత్వం.
బ్రాహ్మణీయం కొత్తగా ఎక్కడినుండో ఊడిపడింది కాదు కదా? దాన్ని చూసి అంతగా భయపడటం ఎందుకు? అనే ప్రశ్న రావడం సహజం. నిజమే. అదేమీ కొత్త ముప్పు కాదు. అది ఈ నేల మీద వేల ఏళ్లుగా కులంగా, పితృస్వామ్యంగా, సాంస్కృతిక ఆధిపత్యంగా కొనసాగుతూనే ఉంది. కానీ, ఆ సామాజిక ఆధిపత్యం ఇప్పుడు రాజకీయ పెత్తనంగా మారడానికి దూకుడుగా ప్రయత్నిస్తున్నది. హిందుత్వ రాజకీయ నిర్మాణ ప్రక్రియలో, చరిత్రలో యూరోపియన్ ఫాసిస్టులు అనుసరించిన పద్ధతులనే కాషాయ శక్తులు వాడుతున్నాయి. ఇది కాస్త అరిగిపోయిన మాటలా అనిపించవచ్చు. కానీ, నాజీలు హింసతో పాటుగా భావజాలాన్ని ఎలా ఉపయోగించుకున్నారో చూస్తే, ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది.
ఏ నేల మీదనైనా ఫాసిస్టు రాజకీయాలు, నిరాకరణ (Negation) అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని వేళ్లూనుతాయి. ఫాసిస్టులు ముందుగా అస్తిత్వంలో ఉన్న కొన్ని భావనలను, రాజకీయ ప్రక్రియలను నిరాకరించే పనిలో భాగంగా, వాటిని తప్పుడు ధోరణలుగా, జాతి వ్యతిరేక పోకడలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వారు ఎంచుకునే ప్రధాన రాజకీయ సమూహాలు మూడు : ఉదారవాదులు, హేతువాదులు, కమ్యూనిస్టులు.
అయితే, నిరాకరణ అనేది కేవలం ఫాసిస్టులు అవలంబించే పద్ధతి మాత్రమే కాదు. నిజానికి, నిరాకరణ అనే భావనను హెగెల్ భావజాల రంగంలో ఆలోచనల అభివృద్ధి క్రమాన్ని వివరించడానికి ఉపయోగించాడు. ఆయన సూత్రీకరణ సమాజంలో ఆలోచనలు ఎలా మార్పుకు గురవుతాయో అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇది మూడు దశల ప్రక్రియగా జరుగుతుంది. థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్. (హెగెల్ సూత్రీకరణగా బహుళ ప్రచారం పొందిన ఈ భావనలలో భావం ఇదే కాని ఆయన ఈ భాష వాడలేదు!).
థీసిస్ అనేది ఒక ఆలోచన. అది సమాజంలో ఒక కాలంలో ప్రబలంగా ఉండే ఆలోచన. కానీ, ఆ ఆలోచనలో ఉండే సమస్యలు, వైరుధ్యాల వల్ల, దానికి వ్యతిరేకంగా మరో ఆలోచన, అంటే యాంటీ థీసిస్ వస్తుంది. థీసిస్, యాంటీ థీసిస్‌ల (ఆలోచనల) మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ ద్వారా ఒక కొత్త పరిష్కారం, అంటే కొత్త, మెరుగైన ఆలోచన (సింథసిస్) వస్తుంది. సింథసిస్ అనేది గుణాత్మకంగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది పాత ఆలోచనల బూజును దులిపి, వాటిలోని కొంత మంచిని స్వీకరించి, సరికొత్తగా మారుతుంది.
భావజాల రంగంలో జరిగే ఈ గతితార్కిక ప్రక్రియను మార్క్స్ చారిత్రక భౌతిక పరిస్థితులకు అన్వయించి, సమాజాలు వర్గపోరాటాన్ని పునాదిగా ఒక వ్యవస్థను నిరాకరిస్తూ, మరొక (సాపేక్షికంగా) ఉన్నతమైన వ్యవస్థలోకి ఎలా ప్రయాణం చేస్తాయో సూత్రీకరించాడు. భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ విధానానికి, ఆ తర్వాత సోషలిస్టు వ్యవస్థలోకి సమాజం ఎలా పరివర్తనం చెందుతుందో ఆయన వివరించాడు. మార్క్స్ చెప్పిన “నిరాకరణ యొక్క నిరాకరణ” (The Law of the Negation of the Negation) అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. ఇది గుణాత్మకంగా ఒక ముందడుగు. అలాగే సమాజాన్ని మరింత మానవీయంగా మార్చే ప్రక్రియ.
అయితే, ఫాసిజం కూడా నిరాకరణ అనే భావనను తన సిద్ధాంతంలో భాగం చేసుకుంటుంది. కానీ అది మార్క్సిస్టు నిరాకరణకు పూర్తిగా భిన్నం. మార్క్సిస్టు నిరాకరణ ఒక కొత్త, మెరుగైన వ్యవస్థను సృష్టించడంపై దృష్టి పెడితే, ఫాసిజం నిరాకరణ ప్రతిఘాత (reactionary), విధ్వంసక దృక్కోణంలో ఉంటుంది. ఫాసిజం యొక్క నిరాకరణ ప్రధానంగా విభిన్నత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
ఫాసిజం తన అస్తిత్వాన్ని తాను ఎవరిని వ్యతిరేకిస్తున్నదో, ఏమి నిరాకరిస్తున్నదో అనే దాని ద్వారా నిర్వచించుకుంటుంది. అది ఉదారవాదం (వ్యక్తిగత స్వేచ్ఛ, సమాన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు), మార్క్సిజం (వర్గ పోరాటం, విప్లవం), హేతువాదం (శాస్త్రీయ ఆలోచనలు) వంటి సిద్ధాంతాలను, వాటిని ఆచరించే సమూహాలను తన ప్రధాన శత్రువులుగా భావిస్తుంది. ఆధునిక సమాజంలో ఈ సిద్ధాంతాలు వ్యక్తుల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వానికి మద్ధతు ఇస్తాయి. కానీ, ఫాసిజం ఈ విలువలను తిరస్కరించి, అతి జాతీయత (ultra-nationalism), అసమానత ఆధారంగా నిచ్చెనమెట్ల సమాజం కోసం ప్రయత్నిస్తుంది.
ఫాసిజం ఆధునిక సమాజంలోని భిన్నత్వాన్ని ఒక పెను ముప్పుగా చూస్తుంది. ఏకాత్మతా సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. దాని చుట్టే రాజకీయాలు నడుపుతుంది. ఫాసిస్టు నిరాకరణ పాత సామాజిక క్రమాలను, సంప్రదాయాలను పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తుంది. ఈ విధానం సామాజిక పురోగతిని అడ్డుకోవడమే కాకుండా, విభిన్నతను అణచివేసే దిశగా పనిచేస్తుంది.
ఫాసిజం తన నిరాకరణను అమలు చేయడానికి హింసను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తుంది. విభిన్న గొంతులను అణగదొక్కడం, తనను ఆమోదించని ఆలోచనలను అణిచివేయడం, తనను వ్యతిరేకించే సిద్ధాంతాలను పూర్తిగా నిర్మూలించడం ఫాసిజం నిరాకరణ ధోరణిలో భాగం. మొత్తంగా విభిన్నత, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను పూర్తిగా తొలగించడమే ఫాసిజం లక్ష్యం.
ఇక గత కొన్ని నెలలుగా తెలుగునేల మీద జరుగుతున్న విడివిడి సంఘటనలు అవి తిరుపతి లడ్డు విషయంలో పవన్ కల్యాణ్ రంకెలెయ్యడం కావచ్చు, ఒక దళిత ఉపాధ్యాయుడితో అయ్యప్పల కాళ్లు మొక్కించడం కావొచ్చు, రచయితల మీద, పబ్లిషర్స్ మీద, బుక్ స్టాల్స్ మీద దాడులు కావచ్చు, హేతువాదుల మీద దాడులు, అక్రమ కేసులు కావచ్చు, చరిత్రను వక్రీకరించే సినిమాలు కావచ్చు … ఇవన్నీ కూడా ఒక పద్దతి ప్రకారం పెద్ద కుట్రలో భాగంగా జరుగుతున్నయనే అనుకోవాలి. ప్రగతిశీల తెలుగు సమాజాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే దక్షిణాన తనకు కావాల్సినంత బలం చేకూరుతుందని హిందుత్వ శక్తుల భావన. వాళ్ళు కలగంటున్న హిందూరాజ్యం రావాలంటే ఇక్కడున్న అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక సమూహాలను దెబ్బతీయాలి. అందుకే దాని కోసం హిందుత్వ శక్తులు ఎంచుకుంటున్న మార్గాలను నిర్ధిష్టంగా గుర్తించి ఎక్కడికక్కడ గుంతలు తొవ్వకపోతే వాళ్ళ ప్రయాణానికి సహకరించినవాళ్ళం అవుతాం.
చరిత్రలో ఫాసిజం మాదిరిగానే, హిందుత్వ శక్తులు అన్ని సమస్యలకు – ఆర్థిక సమస్యల నుండి సాంస్కృతిక “క్షీణత” వరకు – తాము ఎంచుకున్న “శత్రువులను” కారణంగా చూపుతూ, నిరంతరం అదే విషయాన్ని ప్రచారం చేస్తారు. ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది అసత్యమైనా కొంత కాలానికి సత్యంగా చలామణి అవుతుందనేది నాజీ గోబెల్స్ టెక్నిక్.
నాజీల మాదిరిగానే చాలా సులభంగా అర్థమయ్యే, గుర్తుంచుకోదగిన నినాదాలను ఉపయోగిస్తున్నారు. వీటిని సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకుని పునరావృతం చేయగలిగేలా రూపొందించారు. ఉదాహరణకు, నాజీలు “జాగృతమవ్వండి జర్మనీ… యూదులు నశించాలి” అనే నినాదం నాజీ జర్మనీలో గోడలపై, హోర్డింగ్‌లపై స్పష్టంగా కనిపించేది. కాషాయ శక్తులు కూడా తరచూ “జాగృతమవ్వండని” పిలుపునిస్తుంటాయి. తమ ప్రాపగండ కోసం ఉపయోగించే వాళ్ల పత్రికల్లో ఒకదాని పేరు కూడా “జాగృతి.” వీళ్ళ దృష్టిలో జాతి మొత్తం (అసలు ఒకే జాతి అనడమే దుర్మార్గం) తెలివితక్కువతనంతో, పరాయి జాతి ప్రభావంలో ఉండి నిద్రావస్థలో ఉంది. దానిని సాంప్రదాయ చక్రాల మీద “గత వైభవం” దిశగా నడిపించాలి. దాని కోసం ఎంత హింసనైనా ప్రయోగిస్తాం, విధ్వంసం కోసం ఎన్ని బుల్డోజర్లనైనా వాడుతాం. అన్నీ కూడా “దేశం కోసం, ధర్మం కోసమే”. ఇదీ వాళ్ళ తీరు.
ఈ విషయాన్ని చెప్పడంలో వాళ్ళ లక్ష్యం సాంప్రదాయ మేధావులు కాదు. శ్రామిక వర్గాలకు చెందిన దళిత, బహుజనులు. ముఖ్యంగా మత ప్రక్రియ ద్వారా బ్రాహ్మణీయ భావజాలానికి గురైన వాళ్ళే వారి టార్గెట్. ఈ ప్రచారాల ద్వారా ప్రజలను ఒక తప్పుడు ఆలోచనను నిర్మించడంలో భాగస్వాములుగా మార్చేస్తున్నారు.
బహుజనులను కేవలం భావజాల వినిమయదారులుగా, ప్రచారకులుగానే కాకుండా బలాన్ని ప్రయోగించే సందర్భంలో వాళ్ళను ఆయుధాలుగా వాడుతున్నారు. దీని ద్వారా సమాజంలో భావజాలంతో పాటుగా బలాన్ని కూడా ప్రయోగిస్తున్నారు.
హిందుత్వ ఆధీనంలో ఉన్న దళిత, బహుజనులకు ఒక narcissistic tunnel vision అభివృద్ధి చేస్తారు. ఈ దృష్టికోణంలో, “తాము” అనుకునే సమూహాలకే హక్కులు ఉంటాయి. ఇతరుల ఆలోచనలను, హక్కులను వాళ్ళు అసలే అంగీకరించలేని స్థితిలో ఉంచుతారు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంది.
తాము ఎక్కించిన మతోన్మాద మత్తు వదలకుండా ఉండటం కోసం హేతువు (reason), తర్కం (logic) వాళ్ళ ఆలోచనలకు, పరిశీలనలకు పునాది కాకుండా చేస్తారు. కేవలం పురాణాలకు (myths), భావోద్వేగాలకు (emotions) పెద్ద పీట వేసి ఆధునిక మానవుడితో అనేక రకాల విన్యాసాలు చేపిస్తారు. వారి ప్రచార వ్యూహం మొత్తం భావోద్వేగాలను చోదకశక్తిగా మార్చడంపైనే ఆధారపడి ఉంటుంది.
హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజాన్ని ఎదుర్కొనడానికి దొడ్డిదారి లేదు. ఇంకా భ్రమల్లో ఉంటే, అది చావుదెబ్బ కొట్టడం ఖాయం. అందుకే, ఎదురుపడి ఎదుర్కొనడమే చివరికి మిగిలిన మార్గం. ఈ పోరాటం అన్ని రూపాల్లో, అన్ని స్థాయిల్లో జరగవలసిన అవసరం ఉంది. నిరంకుశత్వం కేవలం బలాన్ని ఉపయోగిస్తుంది. కానీ, ఫాసిజం బలాన్ని, భావజాలాన్ని కలిపి ఉపయోగిస్తుంది. అందువల్ల, వాళ్ల దుర్మార్గాలను ప్రతిఘటించాలంటే, భావజాల పెత్తనాన్ని బద్దలుకొట్టాల్సిందే.
భావసంఘర్షణను ఆహ్వానించాల్సిందే, అదే క్రమంలో మనోభావాల పేరిట జరిగే దాడులను బౌద్ధికంగా, భౌతికంగా ఎదుర్కోవాలి. లేకపోతే నాజీలు యూదుల మీద ప్రయోగించిన “చివరి పరిష్కారం” (Final Solution) అనే అమానవీయ పద్దతిని (ఇప్పటికే మధ్యభారతంలో ఆదివాసీల మీద “ఆపరేషన్ కగార్” పేరిట ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు) మొత్తంగా వారుకాని (the “other”) సమాజం మీద ప్రయోగించే అవకాశం ఉంది.
కేవలం కొన్ని సంఘటనలకు స్పందిస్తూ, ఎవరి దారిలో వారు వెళ్తే, అదే బలహీనతను హిందుత్వ శక్తులు ఉపయోగించుకుంటాయి. వాళ్లు వృత్తి ఫాసిస్టులుగా పనిచేస్తున్న నేపథ్యంలో, మనం ఏం చేస్తున్నాం? అని మనమే ప్రశ్నించుకోవాలి. ‘హిందుత్వ @ ఆపరేషన్ తెలుగునేల’ చరిత్రలో మన పాత్ర కూడా రాయబడుతుందనేది మరవొద్దు.
హిందుత్వ ఫాసిజం అనేది రక్త క్యాన్సర్ లాంటి విపత్తు. అది కేవలం లేపనాలతో నయం చేయబడేది కాదు. కొత్త నెత్తురు ఉత్పత్తి చేసే మూలుగ మార్పిడి జరగాలి. ఈ మార్పుకు ప్రజా కలాలు, గళాలు గతంలో కొనసాగించిన ధిక్కార సంప్రదాయాన్ని కొనసాగిస్తేనే తెలుగు నేలన బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ఆపరేషన్ ను తుదముట్టించగలం.
*ముదురుతోన్న మూకస్వామ్యం*
మతవాద ఫాసిస్టు శక్తులు తెలంగాణలో రాజ్యాధికార లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పౌర సమాజంలో మతపరమైన అశాంతిని సృష్టిస్తున్నాయి. హేతుబద్ధంగా ఆలోచించి ప్రగతిశీలమైన మార్పుకు దోహదం చేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ ఆచరణలో నిమగ్నమై ఉన్న ఆక్టివిస్ట్ లపై ముందుగా కత్తులు దూస్తున్నాయి. ప్రజా సంఘాల్లో పనిచేసే ప్రజాస్వామిక లౌకిక వాదుల మీద, రాజ్యాంగం హామీ పడ్డ స్వేచ్ఛా సమానత్వ సౌభ్రాతృత్వ భావనలను కాపాడే దిశగా కృషి చేసే సాహిత్య కారుల మీద, పితృస్వామ్య ఆధిపత్యాన్ని తిరస్కరించే మహిళా సామాజిక కార్యకర్తల మీద మతోన్మాద శక్తులు విషం కక్కుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ ప్రత్యక్షంగా చేస్తున్న వేధింపులు బెదిరింపులు భౌతిక దాడులు కేవలం వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛను హరించడంగా మాత్రమే పరిగణించలేం. వాటి వెనక మతవాద ఫాసిస్టు రాజకీయాల ప్రణాళికాబద్ధమైన కుట్రలు ఉన్నాయి. ఉత్తరాది నుండి దక్షిణానికి విస్తరిస్తున్న దురాక్రమణల దొంగదారులు ఉన్నాయి. హిందూ రాష్ట్ర స్థాపన కోసం పన్నుతున్న వ్యూహాలు ఉన్నాయి. అందుకు ఆటంకంగా ఉన్న దళితులు స్త్రీలు మైనార్టీ మతస్తులు ప్రగతిశీల బుద్ధి జీవులే వాళ్ళ టార్గెట్. బైరి నరేష్ సంధ్య సజయ నిర్మల మెర్సీ రాములు స్కైబాబా వేణుగోపాల్ … వీళ్లు వ్యక్తులు కాదు. భిన్న సమూహాల సముదాయాల భావజాలాలకు ప్రతినిధులు. వారిపై దాడి మొత్తం పౌర సమాజంలో భావజాల రంగంలో పని చేస్తున్న బుద్ధి జీవుల మీద, రాష్ట్రంలో యావత్తు జ్ఞాన రంగం పై జరుగుతున్న దాడిగా పరిగణించాలి. ఈ సందర్భంగానే కొన్నాళ్ళ క్రితం సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ నిర్వహించిన వరంగల్ సభ పై సంఘపరివారం వ్యూహాత్మకంగా చేసిన దాడిని గుర్తుచేసుకోవాలి. అనేక ప్రజాసంఘాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ భౌతిక దాడులకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. పైపెచ్చు బాధితులపైనే ఉల్టా కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు మరింతగా విజృంభించకముందే
పౌర సమాజంలో సహజీవన సంస్కృతికి విఘాతం కలిగించే శక్తుల్ని అడ్డుకోడానికి తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి. విద్వేషానికి విరుగుడుగా ప్రేమైక నినాదాన్ని వినిపించడానికి సామూహికంగా పూనుకోవాలి.
ఎ. కె. ప్రభాకర్
Nice write up andi