హవేలీ దొర్సాని

కథలన్నీ ఆధునిక కాలానికే చెంది వుండాలన్న నియమం లేని పరిస్థితి దాపురించిన ఊరది. పాత వాసనలు వీడని మనస్తత్వాలూ, మానసిక సంఘర్షణలూ… అన్నీ పాతవే! కాలమొక్కటే కదిలే నీరులా పారుతోంది.

ఆ ఊరు కొత్తదనం పూర్తిగా సంతరించుకోలేదింకా! పాత ఊరుని ఆనుకొని, కొత్త ఊరు ఇప్పుడిప్పుడే అంటకాగుతోంది. పాత నందిపురంలో పెద్ద పెద్ద ఇళ్ళు రెండు మూడు వున్నాయి. అప్పుడవి జమిందార్ల లోగిళ్ళు! వాటి నిండా జనాలూ, పశు సంపద, ధన సంపదాతో కళకళలాడుతుండేవి. జమిందారి తనంతో పాటే అన్నీ నశించి పోయి మొండి గోడలు మాత్రం మిగిలి పోయాయి. ఇప్పుడు ఆ ఇళ్ళకు వెనకవైపు రాతిగోడలు కూలి, మర్రి చెట్లు మొలిచి కూలుతున్న ఇంటిని మరింత చీకటి చేస్తూ సాయంకాలం వేళ్ళల్ని భయం మరింత భీతి గొల్పుతుంటుంది.

పక్షులన్నీ వాటిమీదే ఆవాసం! కొత్తగా తవ్విన కెనాల్ ఆ యిళ్ళ వెనకే పారుతోంది. కెనాల్ వచ్చిందగ్గర్నించీ నీళ్ళ ప్రవాహపు చప్పుడు తప్పితే, పగలూ రాత్రీ భయంకరమైన నిశబ్ధం పేరుకుపోయింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులు కూలి బండరాళ్ళు వాకిలోకి కాలు పెట్టనివ్వని పరిస్థితి తెచ్చాయి. ఇదీ పాత నందిపురంలోని హవేలీ పరిస్థితి!

కాస్త లోపలికి పోతే డంగు సున్నంతో కట్టిన ఆర్చీలూ… రంగు వెలిసిపోయిన గోడలూ… తలుపు ఊడిపోయి గదులు బోసిగా బొయ్యారాల్లా వున్నాయి. కిటికీలకు రెక్కలు అసలే లేక ఎండా వానా అన్నీ లోపలి దాకా వస్తూనే వుంటాయి. నాలుగు గదులు మటుకు కాస్త వాస యోగ్యంగా వున్నాయి తలుపులతో. రెండు గదుల్లో ఒక టీచర్ కుటుంబం వుంటుంది. మిగతా రెండు గదుల్లో ఒకటి సామాన్లు వేసి తాళం పెట్టి వుంటుంది. ఇంకొకట్టి మటుకు వసంతమ్మ కాలం వెళ్ళబుచ్చడానికి అనువుగా మార్చుకుంది.

“పట్టాభిగారు పంపించారు నన్ను… ఈ దివాణం వారం క్రితం బేరం అయ్యింది. ఇందులో వామనరావు గారు కుటుంబం వుందన్నారు. ఉన్నారా?” ఒక రోజు దివాణం ముందు కారాపి దిగి లోపలికొచ్చి అడిగాడు సురేష్. అతను నందిపురం ఇల్లు చూసి ఆశ్చర్యం వెలిబుచ్చాడు.

వసంతమ్మ పాత కుర్చీ వకటి తెచ్చి గది ముందున్న గచ్చు ఆవరణలో వేసింది, కూర్చోమని చెయ్యి చూపిస్తూ. “మీ మరిదిగారు తన వాటాగా వున్న ఈ యింటిని ఇళ్ళ జాగా క్రింద నాకు అమ్మారు. ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంట్లో మీరుంటారని చెప్పాడాయన… మీకు ఎంత మందమ్మా పిల్లలూ!” ఆవిణ్ణి చూస్తూ అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. అక్కడే సిమెంట్ బల్లమీద కూర్చనున్న పెద్దమనిషి లేచొచ్చాడామాటకి. అతనికి సుమారు ఎనభయి ఏళ్ళు వుండవచ్చు.

“మేమందరం ఈ దివాణం పిల్లలమే!” అతని మాటలో పెద్దతనపు ఒణుకు వినిపిస్తోంది “అదేంటి!!” సురేష్ చకితుడైనాడు.

“చూడండీ… ఇదంతా ఉమ్మడి ఆస్తీ ఒకప్పుడు. తరతరాలనించీ వస్తున్న సంపద ఇది. వందేళ్ళు పైబడి కట్టుబడి కలిగిందీ దివాణం… పెద్ద రాజావారు నందిపురం ఏలుబడికి ముందే ఈ కట్టడం పూర్తయ్యిందట…”

అతని మాటలు వింటుంటే సురేష్ తల తిరిగిపోయింది… ఈ కాలంలో ఈ రాజావారేంటీ… ఈ ఏలుబళ్ళేంటీ… తనేం సినిమా షూటింగ్ లొకేషన్లో గానీ లేడు గదా!

“ఆయన తరువాత వారి కుమారుడు… ఆ తరువాత మనవడు… ఆ తరువాత వామనరావుగారి తండ్రీ…”

హమ్మయ్య ఈ వామనరావెవరో గానీ ప్రస్తుత కాలానికి వచ్చి పడ్డామన్న మాట కాస్త ఊపిరి తీసుకున్నాడు సురేష్.

“వామనయ్య గారి భార్యే వసంతమ్మ గారు… ఆయన కాలం చేసి చాన్నాళ్ళయ్యింది… పిల్లలు లేరు… మరిది గార్లనే తన పిల్లలుగా పెంచారు… రెక్కలొచ్చాక పక్షులు ఎగిరిపోకుండా పాత గూళ్ళల్లో వుండవుగా! అవునూ ఇంతకూ మీరెవరూ?”

“అదేంటి ఇందాక వారితో చెప్పాగా!”

అనవసర వివరాలకు మతిపోతుంటే విసుగు పడ్డాడు సురేష్.

“దివాణంలో తిని పెరిగిన వాణ్ణి… అయ్యగారికి నమ్మిన బంటుని… పాతుకు పోయానని పెళ్ళగించి పారేసిన ప్రభువులకు పెద్దగా అవసరం లేని వాణ్ణి…”

“వామ్మో!!”

సురేష్ గుండె వేగం పెరిగిందా గ్రాంధికానికి. బుద్ధి గడ్డి తిని లోతుల్లోకి వెళ్ళాను అని మనసులో లెంపలు వేసుకుని – “అవన్నీ నాకెందుకు లెండి… ఇందులో ఎవరెవరు వుంటున్నారో కనుక్కుని చుట్టూ స్థలం చూద్దామని వచ్చాను… మొత్తం అయిదు ఎకరాలని చెప్పారు. ఖాళీ జాగాతో సహా త్వరలోనే పట్టాభి గారు కూడా వస్తానన్నారు. ఆయన వచ్చాక మళ్ళా వస్తా!”

వసంతమ్మతో చెప్పి, ఆమె మంచిదని తల ఊపాక వెళ్ళి కార్లో కూర్చున్నాడు, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ…

***

నాలుగు వంకాయలూ, రెండు టమాటాలూ రెండు పచ్చిమిర్చీ ప్లాస్టిక్ కవర్ బోర్లించి కూరలు లెక్కించింది వసంతమ్మ. మురారయ్య గడప అవతల నిలబడి చూస్తున్నాడు. వసంతమ్మకు కావల్సిన కాసిని కూరలకు కూడా ఎంతో యాతన పడవల్సి వస్తుంది ఒక్కొక్కసారి మురారయ్య! అందుకే అతన్ని ఊరికే వారిస్తుంటుంది.

“మురారయ్య నా జానెడు పొట్టకు ఎంత కావేలేంటి? చూడు హవేలీ అంతా రకరకాల ఆకులూ తీగెలూ అల్లుకోని… చారెడు బియ్యానికి చాటడు ఆక్కూర… ఊర్కే హైరానా పడబాకండీ… నాకు ఇవన్నీ పెద్దగా తినాలని వుండదు” అనేది.

కానీ ఈ రోజు మరిది పట్టాభి గారూ… అయన్తోపాటు తోటి కోడలూ ఇతర బంధువులు వస్తున్నారు. “అమ్మా మార్కెట్లోకి వెళ్దామనుకుంటే ఈలోపు గంపల వాళ్ళు వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పటి మందం నాలుక్కాయలు పట్టుకొచ్చాను… చాలాయా!”

నిర్వికారంగా ఆయన వంక చూసి పళ్ళెంలోకి ఎత్తింది వాటిని మహా ప్రసాదంగా!

“కొన్ని పరిస్థితుల్లో డబ్బెందుకూ కొరగాకుండా వెల వెల పోతుందని చాలా ఆలస్యంగా తెల్సుకున్నాను. మావగారు ఎక్కడ చెయ్యిబెట్టినా డబ్బే లభించింది. మా వారు ఏం చేసినా డబ్బు పోవడం గమనించాను… అలాంటి ధనం నేనంటే గిట్టదనుకున్నాను కానీ నా మనసే ధనాన్ని ఒప్పుకోవడం లేదు…” గోడలకు చెప్తున్నట్టుగా అంది వసంతమ్మ.

“అమ్మా… ఏవంటున్నారు…!” మురారయ్య సందిగ్ధపడ్డాడు.

“మైదాసు కథ వినలేదా… కన్న బిడ్డ కూడా బంగారు బొమ్మ అయ్యింది. నా గతీ అంతే బంధువులతో, స్నేహితులతో చివరకు మీ అందరితో కూడా నాకు ఆర్థిక సంబంధాలే మిగిలాయి.”

“మీరు వ్యధ చెందద్దు… జరగబోయేది మంచే…” మురారయ్య ఇంకేదో అనబోతున్నాడు.

“కాస్తంత ఆత్మీయత, ప్రేమ ఎవ్వరికీ నాయందు లేకపోయింది. కట్టెలో పుట్టిన అగ్ని కట్టెనే కాల్చేస్తుంది… నా ఆవేదన నిర్లిప్తత నన్ను మింగేస్తాయని నాకు చాలా నమ్మకం. నాకు మనుషులంటే వెగటు మాత్రం లేదు. ఇన్నాళ్ళు నేను కాస్త భోజనం, ఈ కాస్త నీడ అనుభవించానంటే అది మీలాంటి వాళ్ళ మంచితనం మాత్రమే మురారయ్య! ఆ మంచితనం అనేది గాజు వస్తువు లాంటిది. దాన్ని పదిలంగా ఇన్నాళ్ళూ కాపాడుకున్నాను గనుకే మీ దివాణంలో నేను మసల గలిగాను…”

వసంతమ్మ కనుకొలుకుల్లో నీటి తడి చమక్కుమని మెరిసింది. వెంటనే తెప్పరిల్లి – “మురారయ్య దివాణం కొనే సురేష్ గారు వచ్చేది ఈరోజే… మరిది గార్లల్లో పెద్దాయన పట్టాభి గారు వస్తారట… వకుళ కూడా వస్తోందట… పక్క గది టీచర్ కి ఫోన్ చేసి చెప్పారు…”

ఆ మాటకు మురారయ్య తల పంకించాడు. దివాణంలో వెనకటికి ఎవరైనా పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు అందరూ తల పంకించడం అలవాటై… ఇప్పుడు దివాణంలో అన్నీ పోయినా… అంతా తుడిచి పెట్టుకు పోయాక కూడా తల అలవోకగా ఊపడం మాత్రం ఆయనకు పోలేదు. ఇంట్లో భార్యకు ఒళ్ళు మండినప్పుడు చాటతో ఒక్కటేస్తుంటుంది అతని తలమీద ఆ పాడు అలవాటు మానుకోమని.

“బియ్యం… గోధుమ పిండీ ఇంకా రేషన్ లో రానట్టుంది… వారొస్తున్నారంటే నాక్కాళ్ళూ చేతులూ ఆట్టం లేదు…”

వసంతమ్మ మొహంలో ఆ మాట చెప్తోంటే స్పందన భావాతీతం! మురారయ్యకు ఒక్క క్షణం గుండె నిబ్బరం చెడినట్టయ్యింది. మరొకరూ మరొకరూ అయితే వెన్నెముక విరిగిపోయి నేలకంటుకు పోవలసిన పరిస్థితే! కానీ ఏం చెయ్యలేడు.

ఆయనకు వెనకటి దివాణం పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు అయ్యింది. వెనకటి హవేలీలో పెరటి వైపు ఎప్పుడూ గాడి పొయ్యిలు… డేగిసాల్లో కుతకుత ఉడికే వంటలు భారీ అండాల్లో ఎసరు మురుగుతోంటే, కడిగిన తడి బియ్యం చేతుల్తో కుమ్మరించి కట్టె తెడ్డు పెట్టి కలుపుతుండేవారు వంట వాళ్ళు. ఊళ్ళోంచి రైతులూ, కూరలు పండించే వారూ తెల్లారుజామునే హవేలీలో కూరగాయలు ఇచ్చి వెళ్ళడం ఒక ఆచారం. హవేలీలో మనుషులకు కాకుండా ప్రతీరోజూ పది విస్తళ్ళు వేసి తీయవలసిందే. చాపలు పరిచి తెచ్చిన కూరలు గుట్టగా పోసి, గంగాళంలో వేసి కడిగి, కొన్ని కూరలైతే తరక్కుండానే ఆ పళాన పెద్ద పెద్ద మూకుళ్ళల్లో వేసి వండేవారు. ఉదయం పదకొండు గంటలకంతా హవేలీలో పని చేసేవారు వరుసల్లో కూర్చుంటే వడ్డనగాళ్ళు అలుపు సొలుపు లేకుండా వడ్డించేవారు.

సాంబారు, పప్పు, రోటి పచ్చళ్ళు, పాయసం ఇవి రోజూ వుండాల్సిందే! అలాంటి దేవిడీకీ కాపురానికి వచ్చిన వసంతని పగలూ రాత్రీ నడుముకు వడ్డాణం లేకుండా ఎవరూ ఎన్నడూ చూళ్ళేదు. చేతులకు నిండుగా రాశిపోసినట్టు బంగారు గాజులూ, బంగారు నాగుం పావులా వున్న నిడుపాటి జడకు అరచెయ్యంత రాళ్ళ బిళ్ళ పూల దండకు అండగా ఒదిగి వుండేది. పసుపు ముద్దల్లాంటి పాదాలతో చిరుగజ్జెల శబ్దం చేస్తూ వసంత నడుస్తుంటే తల తిప్పి చూడని వారు అరుదు…

పెళ్ళయి ఎనిమిదేళ్ళయినా సంతానం కలుగక పోయేసరికి వామనరావు కృంగిపోయాడు… పనిమీద కుటుంబం బెంగుళూరు వెళ్ళినప్పుడు డాక్టరు దగ్గరికి వెళ్తే అతనికి సంతాన యోగ్యత లేదని చెప్పారన్న సంగతి ఆమెకి తెల్సి అధోముఖి అయిపోయింది. సముద్రపు అలలకు కొట్టుకుంటున్న రాయిమాదిరి మౌనం దాల్చింది.

మరుదులిద్దరూ కొడుకులనుకుంది… అలానే పెంచింది. కొన్నాళ్ళు. తల్లి కంటే వదిన దగ్గరే వాళ్ళు పై చదువులకు పై ఊళ్ళకు వెళ్ళే వరకూ కాలక్షేపం చేసారు. మామగారు చనిపోయాక దివాణం లొసుగులు బైట పడ్డాయి… రెండు వందల ఎకరాల భూమి కనిపించకుండా పోయింది… తోటలు దొడ్లు పరుల హస్తగతం అయ్యాయి. తనఖాల క్రింద పెట్టిన బంగారం మరుదుల చదువులకు కరిగిపోయింది. అత్తగారు పోయేటప్పటికి శూన్యహస్తాలతో నిలబడిపోయారు వామనరావు దంపతులు.

చదువుతోపాటు మంచి ఉద్యోగాలతో ఆస్తిపరురాళ్ళయిన భార్యలతో వడ్డున పడిపోయారు మరుదులు.

భర్త వామనరావు చనిపోయాక మరుదులు తన కళ్ళ రెప్పలనుకుంది కళ్ళకు రెప్పలు దూరం కావని భ్రమించింది వసంతమ్మ!

కానీ తోటి కోడళ్ళు పేచీలకు సిద్ధపడ్డారు. పెట్టిపుట్టందే ఎలా వస్తాయి సుఖాలూ సంబరాలూ అని నోరు పారేసుకునే వారు. మగవాళ్ళు రావడం తగ్గించేసారు హవేలీకి. ఎవరూ లేని అనాధ అయ్యింది దివాణం. వసంతమ్మ తిన్నదా, ఉన్నదా అని అడిగే వారు లేకుండాపోయారు. దొర్సానమ్మ పూర్తిగా మౌన మునిలా అయ్యింది… తిండి గింజలైనా దయ చూడాలని మురారయ్య పట్టాభికి ఫోన్ చేస్తుంటే మధ్య మధ్య పదో పరకో ఆయనకు విదిలించేవాడు. ఆమె తిండీ తిప్పలు అరకొరగానే ఉన్న చిల్లరతో నెట్టుకొచ్చేవాడు. తన తిండి వ్యవహారం ఆమెకేమీ పట్టేది గాదు. మురారయ్యకు మాత్రం వెనక ఏం వుందని సహాయం చెయ్యగలడూ?

గోడ పెట్టూ చెంప పెట్టుగా వసంతమ్మ కడుపులో లివర్ చెడిందని పరీక్ష చేసిన డాక్టరు చెప్పింది. ఆమె అన్నగారికి చెప్పుదామని మురారయ్య ప్రయత్నం చెయ్యబోతే తీవ్ర అభ్యంతరం చెప్పింది ఆమె.

“ఏనాడైతే పసుపు పారాణితో హవేలీలో అడుగు పెట్టానో ఇదే నాకు స్వర్గం నరకం. నా పుట్టింటి వారు నెల జీతం మీద బ్రతికేవారు… నా బరువు నేనెవ్వర్నీ మొయ్యనివ్వను!! అని స్పష్టంగా అతనికి చెప్పింది. పైగా అసహాయంగా నవ్వుతూ – ‘నన్ను మా అన్నగారు ఇంటికి తీసుకువెళ్ళడం అన్నది నిప్పును ఒడిలో మూట గట్టుకోవడం లాంటిది. ఊళ్ళో వుంటే ఎల్లలేం తెలుస్తాయని సామెత! హవేలీలో నేనేం జుర్రుకుంటున్నానో అన్న భ్రమలో వాళ్ళుంటడమే నాకిష్టం.” అంది ఒకసారి.

ఆరోగ్యం క్షీణిస్తున్న క్రమంలో వసంతమ్మకు ప్రపంచం అంతా అరణ్యంగా తోస్తోంది. ఒక వంక అనారోగ్యం… మందులకు డబ్బులు లేవు… దివాణంలో టీచర్ కుటుంబం ఇచ్చే రెండు వందలు చిరుదీపం ఆమెకు. ఆ చీకటి హవేలీలో వెనక దక్షత లేని వసంతమ్మ మూగ దెయ్యంలా అయిపోయింది. రాత్రిపూట నిలువనియ్యని అసహాయత… వేదన… తిండి లేని రోజులు గుర్తుకు వచ్చి ఆమెని అనంత రోదన అతలా కుతలం చేస్తున్నాయి. పట్టాభి వస్తున్నాడంటే ఏదో ఆధారం దొరక్క పోదని మురారయ్య ఆశపడుతున్నాడు. కానీ మర్నాడు వాళ్ళు ఇంటికి రాలేదు హోటల్లోనే బేరసారాలు అయ్యాయి…

“అమ్మా మీ అన్నయ్య గారికి ఒక్క మాట చెప్తే, ఆయన వస్తారు… మీ మాటగా వారేమయినా పట్టాభి గారికి చెప్తే ఈ ఆస్తి పాస్తుల్లో మీకేమయినా ఫలం దక్కుతుందేమో ఫోన్ చేయించమంటారా?” ఆశగా అడిగాడు మురారయ్య.

“లక్షల వెలగల మాట అన్నావు… కానీ నా ప్రాప్తం అంత లేదని తెలిసింది. పట్టాభి గారు మా అన్నగారిని చేతపట్టుకున్నారని తెలిసింది… తృణమో పణమో హవేలీ నించి ఆ యింటికి వెళ్ళింది… ఆయన గురించి మీకు తెలవంది లేదు… నాకు అరవయి ఏళ్ళు నిండిపోయాయి… వున్నానా చచ్చానా అన్న ఆసక్తి అనేది సంపద లూటీ అయినప్పుడే పోయింది అందరికీని. ఈ ఆస్తినీ, కుటుంబ రుణానుబంధాన్నీ వదులుకుంది నా మనసు. రేపో మాపో మీ రుణం కూడా తీరుతుంది…”

ఆమె గుండె ఎంతగా వక్కలయ్యిందో! ఆ మాటక కళ్ళనీళ్ళు తీసుకున్నాడు మురారయ్య. అతని అవస్థ చూసి నవ్వింది మూగగా “కళ్ళల్లో పెట్టుకునే వారు లేకా… మంచీ చెడ్డా చూసేవారు లేకా… మనసు చెదిరిపోయింది. మా అన్నకు తాటాకుల చిన్న ఇల్లు వుండేది. ఈ సంబంధం వీళ్ళు ఇష్టపడి చేసుకున్నాక పుట్టింటికి చాన్నాళ్ళు వెళ్ళిందే లేదు. వాళ్ళు భయపడే వారు రావడానికి. ఆయన పోయాక నన్ను భరించలేమని వాళ్ళు తీసుకెళ్ళిందీ లేదు. ఈ హవేలీ దొర్సాన్ని వాళ్ళు మొయ్యలేరు… వామనరావు గారు వున్నప్పుడే అన్నీ హరించుకుపోయి బీదరికంలోకి అడుగు పెట్టినా ఈ దొరసాని తనం నన్ను విడువకుంది. ఆయన వున్నప్పుడు పప్పూ చారూతో కాలం వెళ్ళదీసినా, ఇప్పుడు మటుకు కూరగాలయ గంపల వాళ్ళు పారబోసే పుచ్చు వంకాయలో, కుళ్ళు టమాటాలో ఆసరా అయితున్నాయి. ఇంతకంటే అనుభవించేదేం లేదు… ఏ అన్నా ఆదుకోడు… ఆదుకోవడానికి ఇది ఆయన సంపదా… సొత్తు కాదు… పట్టాభి గారి సొత్తు…” ధృడ చిత్తంగా వాస్తవం చెప్పిందావిడ.

“అమ్మా ఈశ్వరుడు అందరి పాప పుణ్యాలు విచారించి శిక్ష వేస్తాడు…”

ఆయన మాటలు మధ్యలోనే ఆపేయించింది చెయ్యెత్తి వారిస్తూ. “ఒకరికి వేసే శిక్షల గురించి నాకేం ఆసక్తి లేదు మురారయ్యా! పదహారేళ్ళప్పుడు పారాణి పాదాలతో ఈ యింటికి వచ్చా! పైవాడి అనుగ్రహం ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవాలి… కానీ అది పట్టాభి రూపంలో అనుజ్ఞ అయితున్నదని ఊహించలేకపోయాను!!”

ఉబికి వస్తున్న కన్నీళ్ళు కొంగుతో తుడుచుకుంది. ఆయన కలవరపడ్డాడు ఆ మాటకు. తనను తాను సంబాళించుకుంటూ – “పట్టాభిగారు నన్ను హోటల్ కు రమ్మన్నారమ్మా వెళ్ళనా! కలిస్తే ఏం మాట్లాడతారో ?” అడిగాడు.

“……….”

వసంతమ్మ ఏం మాట్లాడలేదు. ఈ తల్లి అభిమానాన్ని ఎవరు గుర్తిస్తారు పాపం అనుకున్నాడాయన. పుచ్చువో చచ్చువో కూరలు ఎత్తుకుని లోపలికి పోయింది. ఈ నాలుగు రోజులు మరిదిగారు ఇంటికి వస్తే ఏం మర్యాదలు చెయ్యాలో… ఏవీ లేని ఇంటిలో ఎలా వుంటారో అని నిద్రాహారాలు మాని వ్యధ చెందింది. వాళ్ళు హోటల్లో దిగారని తెలిసాక గుండెల మీది భారం తగ్గి ఊపిరి పీల్చుకుంది. ఈ దరిద్రం అనుభవించడంలోనే పగళ్ళూ రాత్రుళ్ళు గడిచేవామెకు.

అన్నగారు తమ్ముళ్ళిద్దర్నీ నెత్తిమీద పెట్టుకొని ఆదరించారు. వాళ్ళ చదువుల కోసం తేరాని చోటల్లా చేబదుళ్ళు తెచ్చారే తప్ప హవేలీ జాగా పై చూపు మళ్ళించలేదు. ఆనాడే ఇది అమ్మి వాళ్ళకు పెట్టినా తమ వాటా అంటూ తనకు జాగా వుంచేవారు… ఆయన పోయినా కనీసం ఉనికి వుండేది తనకు. ఆలోచిస్తూ గోడవైపు చూసింది. ఫోటోలో వాడిపోయిన పూలదండ చాటున అపరాధ భావంతో కన్పించాడు మసక మసకగా వామనరావు. ఈ ముప్పయి ఏళ్ళల్లో సెనగలు తిని చెయ్యి కడుక్కున్నట్టు అయ్యింది ఆస్తి అంతా.

దివాణంలోని విలువైన వస్తువులు… డబ్బు దస్కం కరిగిపోతుంటే ఒళ్ళో చేతులు పెట్టుకుని కూచుంటే సాగేట్టు లేదని ఆవేదనతో ఎన్నో సార్లు బాధపడేవాడు భర్త! ‘దొరవారు’ అన్న ఒక్క పదం ఎన్ని ఆపదల్నో దాటించుకుంటూ వచ్చింది గానీ, ఉన్న ఊరు దాటి బైటి ప్రాంతంలో పనివ్వలేదని భర్తతోని చెప్పి ఆక్రోశించేది. ఈ ఒక్క పదమే తమ జీవితాలలో ఎంతో స్థబ్దత నింపిందని యిద్దరూ గుర్తించారు. దొరవారూ, అన్న హోదానీ, ఇతర కష్టాల్ని తొలగ దోసుకుని ఆయన వెళ్ళిపోయినా, పుట్టుకతో దొరసాని కాని దొరసాని వసంతమ్మ అనుబంధం హవేలీతో ముడిపడి పోయింది. ఆ ముడి విప్పదీస్తే అంతా డొల్లే… అటు పట్టుగొమ్మా లేక, యిటు ఊత కొమ్మా లేక నిస్సహాయురాలై పోయింది… మరుదుల సంపాదన మొదలయ్యాక హవేలీకి విముక్తి కలగపోతోంది.

ఈ చీకటి బొయ్యారం… ఒంటరి బంగ్లా… దీన్ని నేను వీడిపోవాలా? లేక ఇది నన్నొదిలి పోతుందా! ఆలోచిస్తున్న ఆమె హృదయం మరుభూమయ్యింది.

వసంతమ్మ వంటా గింటా లేకుండానే చాపమీద పడుకుండి పోయింది. కనీసం తోటి కోడలు మర్యాదకు కాకున్నా హవేలీ కాపలా మనిషిని చూడటానికి రాకపోవడం అన్నది ఆమె గుండెకు అఖాతమైంది.

కన్నీరు గడ్డకట్టి గుండె బరువును పెంచుతుంటే అందరి రూపాలూ మనసు నుంచి ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ వున్నాయి. చెల్లెళ్ళకు ఈ యింటికి రావడానికి నా భాగ్యాలు చాలేయిగాదు అని అనుకుంటే మనసు అదుపు తప్పుతోంది. ఈశ్వర కటాక్షం వుండాలిక! చాపలో ఒకప్రక్కకు వత్తిగిలి పడుకుండి పోయింది.

గది తలుపు వెయ్యనే లేదు… తన అన్నగారు ఏనాడయినా వచ్చి వెళ్ళాడు ఈ యింటికి? మురారయ్య ఎంత వెర్రివాడు! ఈయన రమ్మన మనంగానే మరిది వస్తాడూ? ఎవరికైనా ‘తక్తుమీద వున్నంత కాలమే గౌరవం!’

ఎండవేళ బాదం చెట్టుమీద కాకి ఉత్తపుణ్యానికి గావు కేకలు పెడుతోంది. కొంపదీసి అన్నగారు గానీ వస్తాడా! ఈ దివాణంలో చెల్లెలు భోగభాగ్యాలు చూసి నోరు వెళ్ళబెడతాడా ? హు… పూర్వకాలం మనిషి మురారయ్య! లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలని తనకు హితబోధ చెయ్యబోతాడు ప్రతీసారీ, కానీ ఆత్మాభిమానం ముందు వెర్రి మొర్రి లౌక్యాలతో లాభం ఏవిటి?

ఎండతగ్గి హఠాత్తుగా ఆకాశం మసకబారింది. చల్లగాలి వంటిని తాకుతుంటే కనురెప్పలు మెల్లిగా తెరిచింది. ఉరుము శబ్దం… ఈదురు గాలి… చెవులు చిల్లులు పడేలాగా పిడుగు శబ్దం. మెరుపు వెలుగు గోడల్ని తళతళలాడిస్తోంది.

హవేలీ ముందు కార్లు ఆగిన శబ్దం… మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. నవ్వులు… ఉల్లాసం… చెప్పులు విడుస్తున్న సడి… ఆడవాళ్ళ చీరల రెపరెపలు…

“వసంతమ్మా ఎవరొచ్చారో చూడు… మీ అన్నగారూ… మరుదులూ, తోటి కోడళ్ళూ… నిన్ను పుట్టింటికి తీసుకుపోతార్ట! పట్టాభి గారు, మీ అన్నగారూ చాలా బాధపడుతున్నారు… ఏదో ఇన్నాళ్ళకు మంచి రోజులు వచ్చి పడ్డాయి. మా హవేలీ దొర్సాని ఎలా వుందని నవ్వుతూ హోటల్లో చాలా సార్లు అడిగారు… మీ ఊరికి వెళ్ళి నాల్రోజులు వుండి రామ్మా!”

మురారయ్య హడావుడిగా డబ్బులున్న పెద్ద కవరొకటి పట్టుకుని లోపలికి వచ్చాడు. వెనకాలే పట్టాభ… వకుళ… వసంతమ్మ అన్నగారూ లోపలికి వచ్చారు. గది మధ్యలో చాపమీద అచేతంగా వున్న ఆవిడ్ని చూసి నిశ్చేష్టులయ్యారు!

***

స్వర్గరథంలో పూల రాశుల మధ్య హవేలీ గేటు దాటుతున్న వసంతమ్మ పార్ధివ దేహానికి దండం పెడుతూ “అభిమానం గల తల్లి… ఈ దివాణం పరుల పాలయ్యాక ఎక్కడ బ్రతకాలీ అన్న సమస్య ఆమెని వేధించింది. అన్నగారు ఇంటికొచ్చి తనను పుట్టింటికి రమ్మనమనడం ఆవిడకు సుతారమూ ఇష్టం లేదు. ఇక్కడ ఏం లభించినా అది మరుదుల సొత్తేగానీ తన పుట్టింటిది కాదని ఖరాఖండీగా చెప్పింది… భర్త వాటా ధనం పట్టుకుని పుట్టింటి గడప తొక్కనని నాకు స్పష్టంగా చెప్పింది.”

మురారయ్య మొహం దాచుకున్నాడు చేతుల్లో.

“ఆమే అసలు హవేలీ దొర్సానమ్మా!”

ఆయన మాటలకు మిగతావారు అల్పభావంతో అల్లాడిపోతుంటే, దర్జాగా పూలరధం గేటు దాటింది.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన తొర్రూరులో నివాసం. ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. 2007 నుండి కవితలూ, కథలూ రాస్తున్నారు. 2007లో 'మనో నేత్రం' కవితా సంపుటినీ, 2008లో మరో కవితా సంపుటి 'నేల కంటి రెప్పల కదలిక' ని ప్రచురించారు. వందకు పైగా కథలు వివిధ పత్రికలలో వచ్చాయి. 2010లో 'బతుకు గోస' కథా సంపుటినీ, 2019లో 'మాతృవందనం' కథా సంపుటిని ప్రచురించారు. పదిహేను కథలకు బహుమతులు పొందారు.

Leave a Reply