చీకటి పాలనపై గొంతెత్తిన పాట – ‘హమ్ దేఖేంగే’

భుట్టో ప్రభుత్వాన్నికూలదోసి సైనిక నియంత జియా ఉల్ హక్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నకాలమది. నిరంకుశ శాసనాలతో పాటు, తన సైనిక పాలనకి ఊతంగా ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ప్రేరేపిస్తున్న రోజులవి. సోవియట్ యూనియన్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణని ఎదిరిస్తున్న ముజాహిదీన్లకి మద్దతుగా నిలిచిన పాశ్చాత్య దేశాలన్నీ పాకిస్తాన్ పాలకులకే వత్తాసు పలుకుతున్న సమయమది. 1985లో నిర్బంధ ఇస్లామీకరణలో భాగంగా జియా ఉల్ హక్ ప్రభుత్వం మహిళల వస్త్ర ధారణని నియంత్రిస్తూ, చీర ధరించడాన్నినిషేధించింది.


అప్పుడు జరిగింది ఫైజ్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ. లాహోర్ నగరం. యాభై వేలమందితో కిక్కిరిసిన స్టేడియం. సుప్రసిద్ధ గాయని ఇక్బాల్ బానో ఒక నల్లటి చీర కట్టుకుని పాడడానికి వచ్చింది ‘హమ్ దేఖేంగే’ ఫైజ్ కవితని ఆలాపిస్తూ ఇక్బాల్ బానో గొంతెత్తింది. నల్లటి చీర కట్టుకుని రావడమే ఒక తిరస్కారం, ఒక నిలువెత్తు ధిక్కారం. ఇంక తాను ఎంచుకున్నది ఫైజ్ గీతమేమో జియా ఉల్ హక్ పాలనపైకి గురి చూసి ఎక్కుపెట్టిన బాణం. ‘అన్యాయాన్ని మోపే నిర్బంధపు మహా పర్వతాలు దూది పింజల్లా ఎగిరిపోతాయి’, ‘కిరీటాలు ఎగిరిపోతాయి, సింహాసనాలు కూలిపోతాయి’ అంటూ ఇక్బాల్ బానో పాడుతుంటే ఒక్కొక్క చరణానికీ కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం మార్మోగింది. స్టేడియంలో దీపాలు ఆర్పివేశారు, మైకులు వినిపించకుండా ఆపేశారు. అయినా ఆమె పాట కొనసాగింది. అప్పటికప్పుడే అదే స్టేడియంలో రికార్డు చేసిన ఆ పాటని వెంటనే క్యాసెట్లలో వెంటనే కాపీలు చేసి పంచారు. అతి కొద్ది రోజులలోనే ఆ క్యాసెట్ల కాపీలు వేల సంఖ్యలో వ్యాపించి ఢిల్లీ దాకా చేరుకున్నాయి.


ఆ తర్వాత ఇక్బాల్ బానో ఎక్కడా పాడకుండా పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. స్టేడియంలో ఆనాటి సభకి హాజరయిన అనేక మందిని మిలిటరీ పోలీసులు నిర్బంధించి విచారించారు. చాలా రోజులపాటు వేధించారు. అయినా వాళ్ళు విఫమయ్యారు. ఆ పాట,ఇక్బాల్ బానో ధిక్కార స్వరమూ చరిత్రలో నిలిచి పోయాయి. నియంతృత్వాన్ని ఎదిరించే ధిక్కార స్వరానికి పర్యాయ పదంగా ‘హమ్ దేఖేంగే’ స్థిరపడిపోయింది. ఫైజ్ కవితలో కనిపించే ధిక్కార స్వరం, ఆత్మవిశ్వాసంతో పాటు, మత చాందసవాదాన్ని అడ్డుపెట్టుకున్న నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా, కవితలో తాను ఎంచుకున్న ప్రతీకలు కూడా విలక్షణమైనవి.


అంతర్జాతీయంగా దేశదేశాల ప్రభుత్వాల మద్దతు పాలకులకి పెద్ద ఎత్తున దొరకవచ్చు. ఆంక్షల మధ్య సమాచారం అందకుండా నియంత్రించవచ్చు, మతం పేరుతొ, మత విశ్వాసాల పేరుతొ ఉద్వేగాలనీ, ఉద్రేకాలనీ రెచ్చగొట్టి మహా బలశాలులుగా తమని తాము చిత్రించుకుని, అదే నిజమని పాలకులు నమ్ముతూ ఉండవచ్చు. ఒక మాట, ఒక గీతం, ఒక ధిక్కార స్వరం, ఒక నినాదం – వాళ్ళని భయపెడుతూనే వుంటాయి. తాము బలహీనులమేనన్న విషయాన్ని వాళ్లకి పదేపదే గుర్తు చేస్తుంటాయి.


ఫైజ్ గీతానికి అనువాదం ఇది…

మేం చూస్తాం
మేం ఖచ్చితంగా చూస్తాం
మాకు వాగ్దానం చేసిన ఆ రోజునీ
శాశ్వతంగా లిఖించిన ఆ రోజునీ మేం చూస్తాం

నిరంకుశ అన్యాయపు మహా పర్వతాలు దూది పింజల్లా తేలిపోతాయి
మా పీడితుల పదఘట్టనలో భూమి కంపించిపోతుంది
పాలకుల తలలపై పిడుగులు పడతాయి

పవిత్ర మందిరంలోనుండి అబద్ధపు విగ్రహాలని విసిరి వేస్తారు
అవిశ్వాసులుగా వెలివేసిన మాలాంటి విశ్వాసులని పీఠాలమీద కూర్చోబెడతారు
కిరీటాలు ఎగిరిపోతాయి, సింహాసనాలు కూలిపోతాయి

అల్లాహ్ పేరు ఒక్కటే నిలిచిపోతుంది
అతడు కంటికి కనిపించని వాడూ, కళ్ళ ముందు నిలిచిన వాడూ
అతడు కళ్ళ ముందు నిలిచిన దృశ్యమూ, దృశ్యాన్ని చూసే ప్రేక్షకుడూ
నేనే సత్యాన్ని అన్న మాట మార్మోగుతుంది
ఆ సత్యం నేనూ, ఆ సత్యం నువ్వూ
దేవదేవుని రాజ్యం నెలకొంటుంది
ఆ మాట నాదీ, ఆ మాట నీది కూడా

ఇక్బాల్ బానో గొంతులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ ధిక్కార గీతాన్ని ఒక్కసారి వినండి.

ఫైజ్ అహ్మద్ ఫైజ్ గొంతులో ఆ కవితని కూడా ఇక్కడ వినవచ్చు.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply