జీవించే హక్కు ప్రశ్నగా మిగిలిన ఈ దేశంలో పుట్టే హక్కుకోసం పోరాడాల్సిన దశలోకి పెట్టబడ్డ నేపథ్యంలో…
…. శ్రీలత తనకు, తన భర్తకు తన కూతురు స్నేహ పంపిన కోర్టు నోటీసు మరోసారి చూసుకుంది. ఆ నోటీసు స్నేహ తరఫున లాయర్ వసుంధర పంపింది. తమ కూతురే తల్లిని, తండ్రిని ముద్దాయిలను చేస్తూ కోర్టుకు లాగడం బహుశా అరుదైన సంఘటన కాకపోవచ్చు కాని, ఆమె కోర్టుకెళ్ళిన విషయం మాత్రం న్యాయ చరిత్రలో దాదాపు అరుదైనదే కావచ్చు.
తన చేతిలో నోటీస్ ను విసురుగా లాక్కొన్న భర్తకేసి చూడలేకపోయింది. చూడటం అనవసరం. ఆ చూపుల్లో క్రౌర్యం వుంటుంది. వీలైతే కాల్చిపారేద్దామన్నంత కోపం వుంటుంది. ఆ కోపంలోనే మాట్లాడటం మొదలెడ్తాడు. అవి మాటలు కాదు. భయంకరమైన తిట్లు. తనకు సంవత్సరాలుగా పరిచయమైన ప్రియమైన పదాలు. భరించడానికి అలవాటు పడ్డట్టు మౌనంగా వుండిపోయింది. కాని తాను వూహించినట్టు తన ‘ప్రియమైన పదాలు’ విన్పించడం లేదు. ఇద్దరి మధ్యా భయంకరమైన నిశ్శబ్దం. అలవాటు లేని నిశ్శబ్దం భరించడం కష్టంగా తోచింది. అక్కడ నుండి తప్పుకోవడం మంచిదనిపించింది.
అనుకొంటే అంతా అదోలా అనిపిస్తుంది. చలపతితో తన పెళ్ళి, సంసారం, స్నేహ పుట్టడం ఆ తర్వాత రూప పుట్టడం, ఆ తర్వాత….. ఆ తర్వాత పెద్ద కూతురు దృష్టిలో ముద్దాయిలా మారడం…. నిజంగా కథలాగే వుంది. జీవితంలో యింత గొప్ప కథ యిన్ని మలుపులు తిరుగుతూ వెళ్తుందా అనిపిస్తోంది. నిజానికి ఈ కథలో మలుపు పెళ్ళితో మొదలు కాలేదు. అందరిలాగానే అన్ని లాంఛనాలతో తన పెళ్ళి చలపతితో జరిగిపోయింది. ఆస్తిని, ఆదాయాన్ని, ఖర్చుని ప్రతిక్షణం “ఆదాయం చిట్టా”లో బంధించే చలపతి స్వభావం తనని యిబ్బంది పెట్టలేదు.
స్నేహ కడుపులో వున్నప్పుడు తానే మొదటిగా అంది “మీకు బాబు కావాలా…. పాప కావాలా” అని. నవ్వి ఊరుకున్నాడు. చెప్పమని మారాం చేసింది. ఏవేవో లెక్కలు వేశాడు. ఇది ప్రస్తుతం తమ ఆదాయమన్నాడు. తాను వింతగా చూసింగి, “ఆ ఆదాయానికి కొంత కలుపుతావో లేకపోతే దాన్ని తగ్గిస్తావో తమరి దయ, నా ప్రాప్తం” అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మొదటిసారి చలపతి ధోరణి మీద విసుగు పుట్టింది. బిడ్డని ‘ఆదాయం చిట్టా’లో బంధించే దుర్మార్గాన్ని సహించలేకపోయింది. అయినా లేని నవ్వు తెచ్చుకొని అతని మనస్తత్వం మీద జోక్ చేసింది. కాని చలపతిని ఆ జోక్ నవ్వించలేదు. పుట్టబోయే బిడ్డ మగపిల్లాడే అయి వుండాలన్న సీరియస్సెస్ అతన్లో చూసింది.
స్నేహ పుట్టింది. పురిట్లో బిడ్డని చూస్తూ, “ఖర్చే చూపించావ్… అయినా ఫర్వాలేదు. పాప అచ్చు మా అమ్మలా వుంది…” అంటూ పాపని చేతుల్లోకి తీసుకున్నాడు. ఖర్చు సంగతి ఎత్తినపుడు బాధనిపించినా అచ్చు వాళ్ళ అమ్మలా వుందని మురిసిపోయినందుకు మనసు కాస్త కుదుటపడింది. అయినా ఏదో ఓ మూల వెలితి అనిపించడం ప్రారంభమైంది.
స్నేహకి, రూపకి మధ్య దాదాపు ఆరేళ్ళు గాప్ వుంది. రూప కడుపులో వున్నపుడే అసలు కథ ప్రారంభమైంది. ఈసారి ఖచ్చితంగా బాబు కావాలనే మాట రోజుకోసారైనా అనడం మామూలు ధోరణిగా మారిపోయింది. పుట్టబోయేది మగబిడ్డా, ఆడబిడ్డా అనే ఆలోచన, తెలుసుకొంటే బాగుండు అనే తపన అతన్లో ఎక్కువైంది. తన తపన ఆపుకోలేక తన డాక్టర్ ఫ్రెండ్ ని కలుసుకున్నాడు. అతనేం చెప్పాడో తెలీదు; తనని మరుసటి రోజే హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు. “
డాక్టర్ మోహన్ చంద్ర తెలిసిన వ్యక్తే. తనని ఏవేవో పరీక్షలు చేశాడు. తనకేసి చూసి నవ్వుతూ అన్నాడు. “మీ ఆయనకి పుట్టబోయేది ఆడా, మగా అని తెలుసుకోవాలనే తపన ఉందమ్మా… అందుకని నీకు “అమ్నియోసెంటిసిస్’ పరీక్ష చెయ్యాల్సి వుంది. ఏమీ లేదు…. చాలా సింపుల్…. గర్భంలో పిండం చుట్టూ నీరు వుంటుంది కదూ… దాన్ని టెక్నికల్ గా “అమ్మియాటిక్ ఫ్లూయిడ్” అంటాం. జననేంద్రియాల ద్వారం గుండా సూదితో ఆ నీటిని కాస్త తీస్తాం. దాంట్లోని సెల్సుని వేరుచేసి వాటిని టెస్టు చేస్తాం. పుట్టబోయేది మగా, ఆడా అనేది తేలిపోతుంది. అంతే…. నో రిస్కు, నో ప్రాబ్లం” డాక్టర్ నవ్వుతూనే అన్నాడు. తాను అనుమానంగా చలపతికేసి చూసింది. తత్తరపాటును అప్పపుచ్చుకొంటూ చలపతి అన్నాడు. “జస్టు తెలుసుకోడానికే…. అంతే…” అని. కాని అతని మాటలమీద తనకి నమ్మకం లేదు. అతని మాటల్లో కుట్ర వుంది. నవ్వులో మోసం వుంది. తత్తరపాటులో వూహకందని దారుణం వుంది.
“వొకవేళ పాప అయితే” సూటిగా అడిగింది. ఊహించని ప్రశ్న. చలపతి విసుగ్గా చూశాడు.
మళ్ళీ అడిగింది. జవాబు తెలీకగాదు. అయినా అడిగింది. అప్పుడు చలపతి నోటంట జవాబు లేదు. బండబూతులు వర్షంలా కురవసాగాయి. చెవులు గట్టిగా మూసుకొంది. తిట్టుకోనీ, అలిసిపోయేంతగా తిట్టుకోనీ అనుకుంది. కాని చలపతికి యిలాంటప్పుడు అలుపు రాదు. అందుకే మాతృత్వాన్ని పరీక్షకు పెట్టడానికి తలవొంచింది.
“కాని చలపతీ… ఈ టెస్ట్ చాలా ఖరీదైంది. పైపెచ్చు దీన్ని బాన్ చేశారు. పెద్ద పెద్ద సిటీలో పెద్ద పెద్ద హాస్పిటల్లో తప్ప యిది చెయ్యరు. మద్రాస్ కాని, బాంబే కాని వెళ్ళాల్సి వుంటుంది”. డాక్టర్ మాటలు విని శ్రీలతలో కాస్త ఆశ చిగురించింది. డబ్బు కక్కుర్తి మనిషి అంత దూరం వద్దంటాడనుకొంది. సుమారుగా యింత కావచ్చని డాక్టర్ అన్నాడు. చలపతి లెక్కల్లో మునిగిపోయాడు. లెక్కలు తనకి అనుకూలంగా తోచినట్లుంది. మద్రాస్ వెళ్తామన్నాడు.
మద్రాస్ ప్రయాణం వద్దని గొడవ పెట్టుకొంది. తన మాటలు పట్టించుకోవడం లేదు. ప్రయాణం ఏర్పాట్లలో మునిగిపోయాడు. స్నేహ తాను కూడా వస్తానంది. తన తర్వాత పుట్టేది ఆడదైతే దాన్ని కడుపులోనే చాలా ఖరీదుగా చంపడానికి వెళ్తున్నామని దానికి తెలీదు – మాయమాటలు చెప్పి స్నేహని వాళ్ళ నానమ్మ దగ్గరికి పంపాడు. నానమ్మ అడిగితే మద్రాస్లో కృష్ణత్తని చూడ్డానికి వెళ్ళారని చెప్పమన్నాడు. కృష్ణవేణి తన అయిదుగురు ఆడబిడ్డల్లో చిన్నది. వాళ్ళాయన మద్రాలో ఏదో కంపెనీలో పచ్చేస్తాడు. అక్కడే స్థిరపడ్డారు. మద్రాస్ చేరాక లాడ్జిలో దిగుదామన్నాడు. కృష్ణ దగ్గరికి వెళ్లామని పట్టుపట్టింది. అసలు విషయం అక్కద చెప్పకుండా వుండే షరతు మీద కృష్ణవేణి యింటికి సరేనన్నాడు.
కృష్ణవేణి ఆప్యాయంగా ఆహ్వానించింది. గడపదాటని ఆడబిడ్డని గడపదాటేలా చేసిన ఆ ఘనకార్యం ఏదో చెప్పమంది. చలపతి తనకేసి చూశాడు. నవ్వి వూరుకుంది. అతనే ఏదో చెప్పాడు. ఏమి, చెబుతాడో తనకనవసరం. కృష్ణవేణి వెనకాలే జారుతున్న కళ్ళద్దాలు పైకి తోసుకుంటూ తనకేసి పలకరింపుగా చూస్తున్న కృష్ణవేణి కూతురు వసుంధరని గుర్తు పట్టలేకపోయింది. చాలా ఎదిగింది. తన పెళ్ళినాటికి ఏడేళ్ళ పిల్ల. లా చదువుతోంది. ఆంధ్రాలో ప్రాక్టీస్ చెయ్యాలని ఆలోచిస్తోంది. చాలా హుషారైంది. మహిళా సంఘాలలో చురుకుగా పాల్గొంటుంది.
జరగాల్సిన పరీక్షలు ఆ రోజు సాయంత్రమే జరిగాయి. ఆడపిల్లేనని తేలిపోయింది. ఆపరేషన్ డేట్ కూడా తీసుకున్నాడు చలపతి. ఆపరేషన్‌కు ఓ నాలుగు రోజులు ఆగాల్సి వుంది.
ఆ రాత్రి వాతావరణం వింతగా అనిపించింది. కలుషితంగా వున్నట్టనిపించింది. తన ‘ఆదాయం చిట్టా ‘ దారుణంగా దెబ్బతినడంతో చలపతి తట్టుకోలేక పోతున్నాడు. అబార్షన్ చేయించుకోమని రాత్రంతా వేధిస్తూనే వున్నాడు. మరో ఆడపిల్ల కోసం కట్నాలకి, కానుకలకి వెచ్చించే ఓపిక తనకి లేదన్నాడు. చాలా విశాలంగా ఆలోచించమన్నాడు. “విశాలంగా” ఆలోచించమని అతను అన్నప్పుడు నవ్వొచ్చింది. అంత నిస్సిగ్గుగా ఆ పదాన్ని వాడుతున్నందుకు ఆశ్చర్యమేసింది. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకోవడం విశాలత్వం అవుతుందా ? అదే విశాలత్వం అయితే తాను సంకుచితంగా వుండటమే మంచిదనిపిస్తోంది.
ఒకవేళ అబార్షన్ చేయించుకొంటే ! ఆ ఆలోచన వచ్చినందుకే శ్రీలత ఖంగారు పడింది. సహజంగా ప్రసవ వేదన పునర్జన్మ అంటారు. కాని యిప్పుడు అబార్షన్ అంటే పునర్జన్మ ఎత్తడంలా మారిపోయింది. ప్రసవవేదన తాలూకు పురిటినొప్పులు భరించవచ్చు. పెద్ద పెట్టున ఏడ్చినా, అరిచినా అందులో ఆనందం వుంది. ఆ బాధకి అందరి సానుభూతి వుంటుంది. ఒక కొత్త జీవితాన్ని ఈ విశాల ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు గర్వం వుంటుంది. ఆ ఆనందం, ఆ గర్వం స్త్రీకి మాత్రమే సొంతం. కాని అబార్షన్లో పెదవి విప్పలేము. పెదవి విప్పకుండా గుండెలోనే నొప్పిని, బాధని దాచుకోవాలి. గట్టిగా నిట్టూర్పు కూడా విడవలేని దుస్థితి. సానుభూతికి నోచుకోని బాధ. నిజంగా థర్డ్ డిగ్రీ పనిష్ మెంట్ కంటే మించిన శిక్ష.
ప్రస్తుతం తనది డి ఎండ్ సి ద్వారా తొలగించే మూడు నెల్ల గర్భంకాదు. సేఫ్ అబార్షన్ స్టేజి దాటిపోయిన పరిస్థితి. హిస్ట్రాటమీకి సిజేరియన్ ఆపరేషనకున్నంత తతంగం వుంది. అదేమాట చలపతితో అంది. అయినా అతన్లో మార్పు లేదు. అవసరం లేకపోతే అబార్షన్ చేయించుకోవచ్చు. అదో పాపం అనే గుడ్డి నమ్మకం తనకి లేదు. కాని పుట్టబోయేది ఆడపిల్ల కాబట్టి దాన్ని పిండంలోనే హత్య చెయ్యడం దారుణం. ఆ దారుణాన్ని తాను సహించలేదు. అట్లాగని భర్తని ఎదిరించలేదు. ఆర్థికపరమైన, సాంప్రదాయ సిద్ధమైన అనేక కట్టుబాట్లు, నిస్సహాయత తనని వేధిస్తున్నాయి. కృష్ణవేణికి విషయం చెప్పేద్దామనుకొంది. ఎవరికో ఒకరికి తన బాధని పంచుకొనే వారికి చెప్పాలనుకుంది. ఆమె కోసం హాల్లోకొచ్చింది. అక్కడ వసుంధర వుంది. ఆ పిల్లతో పాటు అదే వయసు ఆడపిల్లలు మరో ముగ్గురున్నారు. వాళ్ళను చూస్తే ఎప్పట్నుంచో చాలా సీరియస్ గా వాళ్ళు ఏదో విషయం మీద చర్చ జరుగుతున్నట్టు అనిపించింది. వసుంధర మాటలు తనని కదలకుండా కట్టివేశాము. ఆ మాటలు తనకోసమే మాట్లాడుతున్నట్టనిపించాయి.
“నేను మాట్లాడుతుంది ప్రాథమిక హక్కుల గురించే. ఈ రోజు జీవించే హక్కు కోసమే కాదు. పుట్టే హక్కుకోసం కూడా ఆందోళన చెయ్యాల్సి వుంది. రాజ్యాంగంలో 14, 15, 21 ఆర్టికల్స్ యింకా పుట్టని గర్భంలో పెరుగుతున్న బిడ్డని ఓ వ్యక్తిగానే గుర్తించాయి. గర్భంలో పెరిగే బిడ్డకు పుట్టే హక్కు కల్పించాయి. మతపరంగా, జాతిపరంగా, కులపరంగా, లింగపరంగా ఆ వ్యక్తి పుట్టుకని గర్భంలోనే తుంచి వేయటం శిక్షారంగా పేర్కొన్నారు. అలా చేయడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే అవుతుందని చెప్పాయి”. వసుంధర మాటలు సూటిగా వున్నాయి. వాడిగా వున్నాయి. తన కాళ్ళని కట్టివేసి కూర్చొనేలా చేశాయి. వసుంధర తన కోసమే మాట్లాడుతోంది. తన కడుపులో పెరిగే పాప తరఫునే మాట్లాడుతోంది. చాలా గొప్పగా మాట్లాడుతోంది. నిశ్శబ్దంగా కూర్చొంది.
“పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలిశాక, ఆ బిడ్డ ప్రాణాల్ని గర్భంలోనే తుంచివేసే దారుణాలు లక్షలాదిగా జరుగుతున్నప్పుడు రాజ్యాంగం ఏం చేస్తోంది ? చట్టం ఏ మూల కూర్చొని నిద్రపోతోంది ? ఈ దారుణానికి మేధస్సు బలిపశువులా ఎందుకు మారుతోంది ….. ఇవన్నీ మనముందు వున్న సమస్యలు… ఈ సమస్యలకి పరిష్కారాలు వెతకడం కోసమే మనం ఆందోళన చెయ్యాల్సి వుంది”. వసుంధర చెప్పడం ఆపి అందరికేసి చూసింది. ఆ తర్వాత చాలా మాట్లాడుకొన్నారు. ఏదో చెయ్యాలని తీర్మానించుకొన్నారు. ఎంతో విశ్వాసాన్ని ఒకరికొకరు పంచుకొంటూ విడిపోయారు. అంతా మరో లోకంలా వుంది. కడుపులో పాప కదిలినట్టు అనిపించింది. ఇక అక్కడ వుండలేకపోయింది. ఒంటరిగా కూర్చొని తనవితీరా ఏడ్వాలనిపిస్తోంది. ఉండబట్టలేక అందర్నీ సాగనంపిస్తున్న వసుంధర నడిగింది. మీరేం చెయ్యబోతున్నారని. మహిళా సంఘాల తరఫున పెద్ద వూరేగింపు తియ్యబోతున్నామని చెప్పింది. అనుకోకుండా అనేసింది. “నేనూ వస్తాను” అని. ఆ తర్వాత మాట్లాడలేకపోయింది. విసురుగా వెళ్ళిపోయింది. మంచం మీద కూలబడి వెక్కివెక్కి ఏడ్చింది. తన తలని ఎవరో ప్రేమతో నిమురుతుంటే తల పైకెత్తి చూసింది. కృష్ణవేణి తనకే సేచూస్తోంది… ఇక ఆగలేకపోయింది. తమ మద్రాసు ప్రయాణం అసలు విషయం చెప్పింది. తన గుండెకోతను ఆడబిడ్డ ముందు వుంచింది. భారం తీరినట్టు కృష్ణవేణి వొడిలో తలపెట్టి నిద్రపోయింది.
రెండో రోజు గేటు తీసుకుంటూ అత్తయ్య వస్తుంటే ఆశ్చర్యపోయింది. కృష్ణవేణి టెలిగ్రాం యిచ్చినట్టు అత్తయ్య చెప్పింది. కృష్ణవేణి, అత్తయ్య చాలా సేపు మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత చలపతిని పిలిచారు. అత్తయ్యకి, చలపతికి దాదాపు యుద్ధమే జరిగింది. అత్తయ్య చలపతిని తిట్టిపోసింది. ఈ దారుణం తన యింటావంటా లేదంది. అంతగా ఆ పిల్ల భారమనుకొంటే తన పేర వున్న రెండెకరాల మాగాణి ఆ బిడ్డకే యిస్తానంది. బుద్ధి తెచ్చుకొని బయల్దేరమంది. చలపతి మెత్తబడ్డాడు. మెత్తబడడానికి కారణం బుద్ధి తెచ్చుకోవడం కాకపోవచ్చు. రెండెకరాల మాగాణి కావచ్చు. ఏది ఏమైనా మద్రాసు ప్రయాణం బిడ్డని పోగొట్టలేదు. వసుంధరని పరిచయం చేసింది. తనని సాగనంపుతూ వసుంధర మీ వూళ్ళో ప్రాక్టీస్ పెడతానంది.
ట్రైన్లో ప్రక్కనే కూర్చొన్న అత్తయ్య మొరటు చేతుల్ని ప్రేమగా నొక్కింది. అత్తయ్య తన ముందుతరానికి చెందింది. జీవితాన్ని యింతగా ఛిన్నాభిన్నం చేసే రోజులకన్నా ముందు పెరిగింది. భర్త, భూమి, పంట, పిల్లలు అవే తన జీవితంగా పెరిగింది. అయిదుగురు ఆడపిల్లల్ని కన్నది. ఆఖరివాడు చలపతి.
రూప పుట్టినప్పుడు, అచ్చు అమ్మలా వుందనో, నాన్నలా వుందనో చలపతి అనలేదు. కనీసం “నీలా దరిద్రపు గొట్టు మొగంతో వుందని” తిట్టినా బాగుండేది. అత్తయ్య మాత్రం “ఎంకట నరిసింగం యిట్టా ఆడపిల్లలా పుట్టేడేంటే కోడలా” అంది. వెంకట నరసింహం మామయ్య పేరు. వెంకట నరసింహం అయిదుగురు ఆడపిల్లల్లో ఏ ఒక్కర్నీ తక్కువగా చూడలేదు. పసుపు కుంకుమ కింద తలో ఎకరా యిచ్చాడు. మిగిలిన అయిదెకరాలు చలపతి పేర రాశాడు. అత్తయ్యకి వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిన రెండెకరాలు ఆవిడ పేరే వుంచుకొంది. కూతుళ్ళకిచ్చిన అయిదెకరాలు మామయ్యే సాగుచేసేవాడు. పండుగనాడు యింటికొచ్చిన కూతుళ్ళకి ఎవరి ఆదాయం వాళ్ళకిచ్చేవాడు. అదో రకం జీవితం. భూమితో సంబంధాలున్న జీవితం.
చలపతి ఆ సంబంధాల్ని తెంచుకోవాలనుకున్నాడు. తండ్రి చనిపోయాక అయిదెకరాలు అమ్మేశాడు. అక్కలకిచ్చిన అయిదెకరాలు తాను చెయ్యనన్నాడు. వీలైతే తనకి అమ్మమన్నాడు. వాళ్ళంతా అదే పని చేశారు. వాళ్ళ దగ్గర్నుంచి కొని కాస్త ఎక్కువ ధరకి మరొకరికి అమ్మాడు. ఆ డబ్బంతా ఎక్కడెక్కడో పెట్టుబడిగా పెడున్నాడు. ఏవేవో కంపెనీలలో షేర్లు అంటూ కొంటున్నాడు, అమ్ముతున్నాడు. చలపతి జీవితం షేర్లతో ముడిపడిపోయింది. అంతర్జాతీయ సంస్థలలో కూరుకుపోయింది. పరుగులు తీస్తున్నాడు. బొంబాయి మార్కెట్లో ఏదేదో జరిగిపోతున్నట్లు ఒక్కొక్కప్పుడు హుషారుగా చెప్పేవాడు. మరొకప్పుడు ఎవరెవర్నో తిట్టిపోసేవాడు. ఏవేవో కాగితాలు తన ముందు పర్చుకొని లెక్కలు చూసేవాడు. ఒక్కోసారి తృప్తిగా కనిపించేవాడు.. మరోసారి తలపట్టుకొని కూర్చునేవాడు. తన బ్రతుకు తన చేతుల్లో లేనట్టు వాపోయేవాడు.
రూపకి ఎనిమిదేళ్ళు దాటాయి. స్నేహ దూరంగా రెసిడెన్షియల్ లో చదువుతోంది. అత్తయ్య ఇంటికి రావడం మానేసింది. ఆమె రెండెకరాలు అమ్మకపోతే తన గడప తొక్కొద్దన్నాడు చలపతి. అత్తయ్య అమ్మనంది. అది ఆడపిల్ల సొమ్మంది. గడప తొక్కనని పందెం కాసి రాకుండా మానుకుంది. అనుబంధాల, ప్రేమల, మమతల విలువలు సరికొత్త రూపాలు దిద్దుకొంటూ చాలా మార్పులకు గురవుతున్నాయనిపిస్తోంది.
వసుంధర మాట అన్నట్టే లా ప్రాక్టీస్ పెట్టింది. స్నేహ సెలవలంతా వసుంధర దగ్గరే గడుపుతోంది. మహిళా సంఘాలు, ఉద్యమాలంటూ తిరిగే పనైతే ఆ
పిల్లని తన ఇంటికి రావద్దన్నాడు చలపతి. స్నేహని కూడా ఆ పిల్లని కలవొద్దన్నాడు. స్నేహ తండ్రి మాటని లెక్కచెయ్యలేదు. ఆ కోపం తన మీదే చూపించేవాడు.
రూప కాన్వెంట్ కు వెళ్ళాక తాను ఇంట్లో ఒంటిరిగానే మిగిలిపోతోంది. అనేక రకాల ఆలోచనలు. కొన్ని అర్థం కావు. కొన్ని అవసరంలేనివి. చలపతికి తనతో మాట్లాడే తీరిక లేదు. తీరిక దొరికినా అదో నరకంలా అనిపించేది. విసుగుతో, అర్థంలేని మాటలతో, ఆరోపణలతో మొదలై తిట్లతో ముగి సేది. అప్పుడప్పుడు చాలా ఉల్లాసంగా మాట్లాడేవాడు. అప్పుడు ఊరటగా వుండేది. కాని ఆ వూరట ఎక్కువ కాలం మిగిలేది కాదు. ఆనందంగా మాట్లాడుతూనే ఆ ఇద్దరూ మగపిల్లలైతే బాగుండేదనేవాడు. మనసు చివుక్కుమనేది. విరక్తి పుట్టేది. స్నేహ, రూపలు గుర్తొచ్చేవాళ్ళు. వాళ్ళు అనాధల్లా అన్నించేవాళ్ళు. బ్రతకాలనిపించేది. తనలాంటి వో అనాధ మరో ఇద్దరు అనాధల కోసం జీవించాలనుకొంటోంది. తమాషాగా అనిపించేది.
జీవితం తాను అనుకున్నట్టే సాగదు. అలా సాగకపోవడమే జీవితం కావచ్చు. ఆ ఇద్దరి కోసమే బ్రతకాలనుకొంది. కాని మరోబిడ్డ తన కడుపులో ప్రాణం పోసుకొంటుందని తెలిసి భయపడ్డది. ఆ విషయం చలపతికి చెప్పాలంటే ప్రాణాన్ని ఎవరో కత్తితో కోస్తున్నట్టనిపించింది. చాలాకాలం దాచగలిగింది. ఇక దాచే వీల్లేదు. ఏదో ఒకరోజు ప్రళయం జరక్కమానదు. అదే జరిగింది. అనుకొన్న దానికన్నా భయంకరంగా జరిగింది. మళ్ళీ పరీక్షకు తాను నిలబడక తప్పలేదు. ఈసారి పరీక్షలో గెలిస్తే బాగుండును. ఈ నరకం నుంచి తనని కాపాడటానికి మగబిడ్డే పుట్టే బాగుండు.
ఈసారి మరో రకమైన పరీక్షకు కూర్చుంది. బొంబాయి, మద్రాసులు తిరిగేందుకు యిప్పుడు చలపతికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఆల్ట్రా సౌండ్ పరీక్షలో తన కడుపులో పిండం యిమేజ్ ని టి.వి. తెరపై ప్రాజెక్టు చేశారు. పరీక్ష అయ్యాక చలపతికన్నా ముందే తాను ఆతురతగా అడిగింది. మగా ? ఆడా ? అని….. డాక్టర్ మౌనం భయాన్ని పుట్టించింది. అతని మౌనం “సమాధానం నీకు చెప్పాల్సిన అవసరం లేదన్న”ట్టు వుంది. ‘ఆడపిల్లే’ అని ఆ తర్వాత నర్సు చెప్పింది. ఆ తర్వాత తనతో ఎవ్వరూ మాట్లాడలేదు. వసుంధర కోసం కబురు చేసింది. వసుంధర ఏదో కాన్ఫరెన్స్ అంటూ ఢిల్లీ వెళ్ళిందని, రావడానికి పది పదిహేను రోజులు పడుతుందని తెలిసింది.
ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. చలపతి తన ముందు కాగితం వుంచాడు. తను యిష్టపడి గర్భ విచ్ఛేదనం చేసుకొంటున్నట్టు డాక్టర్ కివ్వాల్సిన హామీ పత్రమిది. దానిమీద ఓమూల చలపతి సంతకముంది. చలపతికేసి చూసింది. “అతను ఎటో
చూస్తున్నాడు. ఏడ్చి మొత్తుకోవాలనిపించలేదు. అతన్ని చూస్తే అర్థించాలనే తలంపే రావడం లేదు. ద్వేషం, రోషం, కసి అంతా కలిసి తనచేత ఆ కాగితం మీద సంతకం చేయించాయి.
ఇక రంగం ఎలా వుంటుందో తనకి తెలుసు. రూప సందర్భంలోనే ఈ తతంగం తాలూకు విషయాలు తెలుసుకొంది. మౌనిలా వుండిపోయింది. తన మౌనాన్ని అనేక విధాల భగ్నం చేస్తూ, బిడ్డ ప్రాణాలు తీశారు. ఆపరేట్ చేసి బయటకు తీశారు. చాలు. ఇక తానేమైనా ఫర్వాలేదు. చలపతి కోర్కె తీరింది. ఓ రెండు గంటల తర్వాత చలపతి లోపలికి వచ్చాడు. అతని మొహం చూడాలనిపించలేదు. కళ్ళు గట్టిగా మూసుకుంది.
ఆ కళ్ళు శాశ్వతంగా మూతబడినా బాగుండుననిపించింది. నిముషాలు భారంగా దొర్లుతున్నాయి. అతను వెళ్తే కళ్ళు తెరవాలనుంది. అతను వెళ్ళలేదు. కాని అంత నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అతని ఏడ్పు వినిపించింది. ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే ఆ ఏడ్పు తారాస్థాయికి చేరింది. అప్రయత్నంగా కళ్ళు తెరిచింది…. చలపతి ఆమె కాళ్ళ దగ్గర దోషిలా రోధిస్తున్నాడు. డాక్టర్ లాగుంది అతన్ని ఓదారుస్తున్నాడు. ఏమైందో అర్థం కావడం లేదు. చివరకు డాక్టర్ అన్నాడు… “పొరపాటు జరిగింది మేడమ్ ! ఆల్ట్రాసౌండ్ “జులా ఫలానా బిడ్డని నిర్ధారించడం కరెక్టుగా చెప్పలేని ప్రమాదం వుందమ్మా. టి.వి.పై పడ్డ పిండం పొజిషన్ బట్టి ఒక్కోసారి పురుష అవయవం స్త్రీ అవయవంగా, స్త్రీ అవయవం పురుష అవయవంగా కనిపించే పరిస్థితి వుంది. మీ విషయంలో అదే జరిగింది. మీ గర్భంలో పిండం ఆడ కాదు మగ”.
డాక్టర్ ఆ మాటలు అంటున్నపుడు చలపతి రోదన మరీ ఎక్కువైంది. మగపిల్లాడని తెలిసి ఏడుస్తున్నాడు. ఆడపిల్లనుకొన్నప్పుడు చంపాలనుకొన్నాడు. చలపతి యిప్పుడు మరీ అసహ్యంగా కనిపిస్తున్నాడు. “మీరంతా గదిలోంచి వెళ్ళిపోండి” అని గట్టిగా అరవాలనిపించింది. అరిచే ఓపిక లేదు. కళ్ళు మూసుకుంది. అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు జారుతున్న అనుభూతి. విషాదమయమైన ఈ అనుభూతి ఎందుకోసం. చలపతిలా మగబిడ్డని పోగొట్టుకున్నదనే బాధతో కాదు. “అమ్మా నన్ను కనమ్మా” అంటూ మాతృ గర్భంలో మూగవేదన అనుభవిస్తున్న కోట్లాది పాపలు తనముందు విషాదంగా నిలబడ్డట్టుంది. సుందర ప్రపంచాన్ని చూడాలనుకొన్నవాళ్ళు, తప్పటడుగులతో తనివితీర ఈ మానవ ప్రపంచంలో తిరుగాడాలనుకొన్నవాళ్ళు, చిరు పాదాలతో తల్లి గుండెల మీద నర్తించాలనుకొన్నవాళ్ళు, భాష రాకున్నా మాతృబంధానికి కొత్త పలుకులు వినిపించాలనుకొన్నవాళ్ళు, సమస్త అందాలకు చిహ్నాలుగా, మానవత్వానికి మరో మూర్తులుగా తమని తాము ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని ఉబలాటపడ్డవాళ్ళు, మాతృ హృదయాన్ని చీల్చుకొని తమ హృదయ స్పందనల్ని ఎప్పుడు వినిపిస్తామోననే ఆరాటంతో తల్లి శరీరంలో శరీరంలా ఎదుగుతున్నవాళ్ళు… చిట్టి హృదయాలు, చిన్నారి దీపాలు… అమ్మా మమ్మల్ని కనండి, మమ్మల్నిలా సుఖసంపదల్ని కొల్లగొట్టే చీడపురుగుల్లా చూడకండని, మా గుప్పెడు గుండెని రక్తపుముద్దని చెయ్యకండని తనని వేడుకొంటున్నట్టుంది. తన చుట్టూ తిరుగుతున్నట్టుంది. తన గుండెల్ని పిండుతున్నట్టుంది.
తనని ముద్దాయిగా బోనులో నిలబెట్టాలనుకొన్న కూతురుకు యిదంతా శ్రీలత చెప్పాలనుకొంది. ఇంత జీవితాన్ని తన కూతురు ముందు అరమరకలు లేకుండా వుంచుదామనుకొంది. కాని స్నేహ తనకా అవకాశం యివ్వలేదు. తనకి ఆపరేషన్ జరిగాక ఓ పదిహేను రోజుల తర్వాత సెలవలకి స్నేహ యింటికొచ్చింది. చలపతి పిల్లాడిలా స్నేహతో జరిగిందంతా చెప్పాడు. బంగారంలాంటి తమ్ముణ్ణి పొట్టన పెట్టుకొన్నానంటూ బాధపడ్డాడు. అంతా విన్న స్నేహ సూటిగా అడిగింది. “అదే చెల్లి అయితే నీ చేతుల్తో, నువ్వు చంపినందుకు బాధపడవా” అని. చలపతి ఆ ప్రశ్న వూహించలేదు. స్నేహ సమాధానం కోసం ఎదురు చూడలేదు. ఎంత వారించినా వినకుండా రూపతో సహా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత తనని, తన భర్తని ముద్దాయిల్ని చేస్తూ కోర్టు నోటీసు పంపింది.
అలా కూతురు తనని కోర్టుకు లాగినందుకు స్నేహమీద కోపం రావడంలేదు. మరోవైపు గర్వంగా కూడా వుంది. తన కూతురు యింత కాలం తనలో జరుగుతున్న సంఘర్షణకి ఓ రూపం యివ్వబోతోంది. స్నేహని యిప్పుడు కలుసుకోవాలనిపిస్తోంది. కలవాలంటే అత్తయ్య దగ్గరకెళ్ళాలి. చలపతిని ఎంత ద్వేషించినా ఈ పరిస్థితుల్లో అత్తయ్య దగ్గరకి వెళ్ళాలనిపించడం లేదు. ఏది ఏమైనా స్నేహని కలుసుకోవడం కోర్టులోనే కావచ్చు. ఆ రాత్రి చలపతి ముభావంగానే వుండిపోయాడు. మధ్య మధ్య తనకేసి చూస్తున్నాడు. ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతున్నాడు. బహుశా అహం అడ్డు వస్తోందనిపిస్తోంది. రాత్రి యింత దీర్ఘంగా వుండకపోతే బాగుండుననిపిస్తోంది. సూర్యుడు ఎందుకింత మొద్దు నిద్రపోతున్నాడని విసుక్కొంది…
కోర్టు ఆవరణలో స్నేహ కోసం వెతికింది. చలపతి చూపులు కూడా కూతురు కోసమే వెతుకుతున్నాయి. నిముషాలు గంటలుగా మారుతున్నప్పుడు స్నేహ రావడం కనిపించింది. పక్కనే లాయర్ వసుంధర వుంది. వాళ్ళ వెనుక రూప చెయ్యి పట్టుకొని భారంగా నడుస్తున్న అత్తయ్యను చూసి ఆశ్చర్యపోయింది. వాళ్ళు తమకి దగ్గరగా వస్తున్నారు. కాని తమ దగ్గర ఆగలేదు. తప్పుకొని వెళ్ళిపోయారు. గట్టిగా వాళ్ళకోసం అరవాలనిపించింది. తననెందుకు ఒంటరి చేసి వెళ్తున్నారని వాళ్ళమీద తిరగబడాలని పించింది. ఆ శక్తి లేదు. అదే వుంటే చలపతి మీదనే తిరగబడేది.
తనమీద తనకే అసహ్యం పుడుతోంది. తన భుజం మీద ఆప్యాయంగా చెయ్యివేసిన కృష్ణవేణిని చూసి ఆశ్చర్యపోయింది. చలపతి ఎప్పుడొచ్చావే అన్నాడు. ఇప్పుడే అని కృష్ణవేణి అంది. కృష్ణవేణి ఆసరాతో కోర్టు హాల్లో అడుగు పెట్టింది.
కోర్టు తతంగం జరగాల్సిన పద్ధతిలో జరిగిపోతోంది. వసుంధర తన వాదన వినిపిస్తోంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, వైద్యాన్ని , విజ్ఞానాన్ని, సమాజాన్ని, సమస్త రూపాల్ని ప్రశ్నిస్తోంది. చాలా మాటలు తనకు అర్ధం కావటంలేదు. చలపతి గుడ్లప్పగించి వింటున్నాడు. షేర్ల బావిలో కూరుకుపోయిన కప్పలా, యిపుడిపుడే కళ్ళు తెరుస్తున్నట్టు… ప్రపంచం యింత విశాలంగా వుందా అన్నట్టు వింతగా చూస్తున్నాడు. కుంచించుకుపోయిన చలపతి మొహం చూస్తుంటే శ్రీలతకి ఆనందంగా వుంది. తన వాదాన్ని పూర్తిచేసి వసుంధర తన స్థానంలో కొచ్చింది. శ్రీలత వసుంధరనే చూస్తూ వుండిపోయింది. ఎందుకో తెలీదు కృష్ణవేణి చేతిని యిష్టంగా నొక్కుతోంది. పదే పదే ముద్దు పెట్టుకొంటోంది. కోర్టు హాల్లో కలకలం చూసి ఉలిక్కిపడింది. అంతా గందరగోళంగా వుంది. బోనుకేసి నడుస్తున్న స్నేహకేసి గుడ్లప్పగించింది. తన కళ్ళముందు తన వూహకందని అద్భుతం జరుగుతోంది. తన ప్రాణం తన గొంతు సవరించుకొంటోంది. తనలో పెరిగిన పాప, తనతో ప్రేమని పంచుకొన్న పాప స్నేహ మాట్లాడుతోంది. ప్రతి మాట తన రక్తంలోకి ప్రవహిస్తోంది. ఉద్వేగం ఆపుకోలేకపోతోంది.
తన స్నేహ మాట్లాడుతోంది. తన నడకని శాసించారంది. తన నవ్వుని శాసించారంది. తనకున్న సమస్త విలువల్ని, ఆశల్ని ధ్వంసం చేశారంది. సహనం ఉరితాడు బిగించి తన బ్రతుకుని నొక్కి వేశారంది. తన నడక తన యిష్టమంది. తన నవ్వు తన యిష్టంతో జతపడాలని కోరుకొంది. తనకు రావాల్సిన సమస్త విలువల కోసం, సంపూర్ణ జీవితం కోసం నిరంతరం పోరాడుతానంది. అందుకోసం తనని పుట్టుకతోనే హత్యచేసే దుష్ట సంస్కృతి మీద తిరగబడ్డానంది. దగాపడ్డ స్త్రీల ప్రతినిధిలా ఒక్కొక్క మాట ఒక్కో బాణంలా ఎక్కు పెట్టి వదులుతోంది.
“నన్ను కనే హక్కు నా తల్లికుంది. ఆ హక్కుని ఆమె నుండి బలవంతంగా ఎందుకు లాక్కుంటున్నారు” ఆవేశంగా, ఆక్రోశంగా స్నేహ అంటున్న ఆ మాటలు శ్రీలత హృదయాన్ని బలంగా తాకాయి. కళ్ళు వర్షించాయి. తాను ఉద్రేకపడ కూడదనుకుంది. కన్నీళ్ళు పెట్టకూడదనుకొంది. ఒక్కసారి కోర్టు హాలంతా చూసింది. తలలు తెగిపడున్నట్టు, గుండెలు విడిపోతున్నట్టు, ప్రళయం వచ్చి పాతనంతా కొట్టుకు పోతున్నట్టు… నిశ్శబ్దం…
ఇప్పుడు శ్రీలతలో సంవత్సరాలుగా దాగిన అలజడి ఓ తీరం చేరినట్టుంది. కొస్త దీర్ఘంగా ఆలోచిస్తే జీవితం విషాదంగా మారటం లేదనిపిస్తోంది.
ఆత్తయ్య చూసిన జీవితం, తనూ, కృష్ణవేణి అనుభవిస్తున్న జీవితం, స్నేహలు, వసుంధరలు ప్రశ్నిస్తున్న జీవితం ఎక్కడో మొదలైన నీటిపాయ, ఏరులా సాగి, వరదలా ఉరకలేస్తూ సాగరమవుతున్నట్టనిపిస్తోంది. ఆ సాగర తీరాన అసంఖ్యాకంగా, సమస్త అందాలకు చిహ్నాలుగా తమని తాము పరిచయం చేసుకొంటూ, తమ ప్రపంచాన్ని తాము సృష్టించుకొంటున్న చిన్నారి పాపలు. స్వేచ్ఛా విహంగాలు.
- (మెడికల్ న్యూస్’ పత్రిక ఫిబ్రవరి 1994లో ప్రచురితం)