(నీలీ రాగం – 6)
1932 లో ప్రారంభమైన హరిజన సేవక్ సంఘ్ ద్వారా కాంగ్రెస్ హరి జనాభ్యుదయానికి చేపట్టిన కార్యక్రమాలు 1940 నాటికి బాగా విస్తరించాయి. బావులు, బడులు, గుడులు అన్నీ హరిజనుల వినియోగానికి అందివచ్చేలా చర్యలు చేపట్ట బడ్డాయి. సహపంక్తి భోజనాలు ప్రోత్సహించబడ్డాయి. 1939 లో తమిళనాడు లోని మధురై లో నాయకులు మీనాక్షి గుడిలోకి హరిజనులతో ప్రవేశించిన ఘటన ప్రభావం చెప్పుకోదగినది. కుసుమధర్మన్నవంటి నిమ్నజాతి ఉద్ధరణకు నడుం బిగించిన దళిత నాయకులు గాంధీ ప్రభావానికి, జాతీయోద్యమ రాజకీయాల ప్రభావానికి గురి కావటం చూస్తాం.ఆ రకంగా 1940 నాటికి కాంగ్రెస్ లోకి దళితుల సమీకరణ పెరుగుతూ వచ్చింది. మరొక వైపు 1925 లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు 1935 నాటికి ఆంధ్ర ప్రాంతాలకు విస్తరించాయి. గ్రామగ్రామాన ఏర్పడిన రైతుకూలీ సంఘాలలోకి సహజంగానే వ్యవసాయకూలీలు, భూమిలేని నిరుపేదలు అయిన దళితులు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సంఘటితం కావటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అంబేద్కర్ ప్రభావం లోని స్వతంత్ర దళిత ఉద్యమ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ దశలో వర్ణ వైరుధ్యాలను మించిన మానవీయ సంస్కారాలు మనుషులమధ్య అభివృద్ధికావటం గురించిన చింతన పెరిగింది. కాళోజి వ్రాసిన “తెలియక ప్రేమ తెలిసి ద్వేషము” (1943)కథ ఇందుకు నిదర్శనం.
యమదూతలు రెండు మానవ ప్రాణాలను తీసుకొని యమపురికి పోతూ మధ్యదారిలో ఒక పాటకు పరవశించి కాసేపు విని పోదామనుకొని ఆ ప్రాణులను వైతరణీ నదీ తీరంలో వదిలి వెళ్ళటం కులరాజకీయనాటకానికి నాందీ. రెండవ దృశ్యం వైతరణీ నదివొడ్డున విడువబడిన ప్రాణుల సంభాషణ. ఇద్దరూ తామెక్కడున్నదీ తెలియక ఒకరినొకరు ఎక్కడివారంటూ ప్రశ్నించి సమాధానాలు తెలుసుకొని సంతోష పడటంతో ఈ దృశ్యం మొదలవుతుంది. ఇద్దరూ భారతదేశవాసులేనని, నిజాం రాష్ట్రంలోని తెలంగాణ మనుషులమని, ఇద్దరూ మాట్లాడేది తెలుగేనని తెలుసుకొంటూ అంచలంచలుగా సోదర స్నేహానుభావానికి, సంతోషానికి లోనవుతారు. ఉదయం వూళ్ళో జరిగిన కొట్లాటలో తలలు పగిలిన తరువాత ఏమైందో తెలియదు అనుకొంటూ దానిని తెలుసుకొనే ప్రయత్నంలో సంభా షణను కొనసాగించి తాము అక్కడ ప్రత్యర్థి వర్గాలకు చెందినవాళ్లమని తెలిసి ఒకరినొకరు ద్వేషించుకొని, దూషించుకొనే స్థితికి దిగజారడం తో ఈ దృశ్యం ముగుస్తుంది.
మూడవ దృశ్యం యమదూతల సంభాషణ. నదీ తీరం నుండి వినిపించే కేకలను గురించి బతికి ఉన్నప్పటి బ్రాహణ మాదిగ పంచాయతీని ఇక్కడికి కూడా తెచ్చారని అనుకొంటూ చచ్చినా వదలని మత పిచ్చి గురించి, వర్ణభేద శత్రుత్వం గురించి ప్రస్తావించి వాళ్ళ ప్రవర్తనకు యమపురిలో శిక్ష పడుతుందని భవిష్యత్ కథను సూచిస్తూ ముగిసే ఈ చిన్న దృశ్యం నాటకంలో విష్కంభకం వంటిది.
నాలుగవ దృశ్యం లో ప్రవేశపెట్టబడిన మానవ ప్రాణులకు యమధర్మరాజు శిక్షలు విధించటం.
ఈ కథలో రెండవ దృశ్యంలో కథావస్తు విస్తరణ, నాలుగవ దృశ్యంలో పరిణామాల పరాకాష్ఠ దశ కనబడతాయి. కథావస్తువు ఏమిటి? ఉదయం వూళ్ళో జరిగిన కొట్లాటలో తలలు పగిలిన తరువాత ఏమైందో తెలియదు అనుకొంటూ దానిని తెలుసుకొనే ప్రయత్నంలో కొనసాగించిన విగతజీవుల సంభాషణలో అది విచ్చుకొంటుంది. విగతజీవులిద్దరూ తెలంగాణలోని ఒకే ఊరివాళ్ళు. ఆ వూళ్ళో ఒక పురాతన దేవాలయం ఉంది. ప్రతిసంవత్సరం అక్కడ జాతర సాగుతుంది. ఆ ఏడు జాతర లో అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం కార్యక్రమం ఉంది. జాతర కంటే ఒక వారం ముందు నుండి హరిజనులు దేవాలయ ప్రవేశాన్ని కోరుతూ సత్యాగ్రహం మొదలుపెట్టారు. దానిని అడ్డుకొనటానికి బ్రాహ్మణులూ ఇతర హిందువులూ లాఠీలతో గుడి చుట్టూ కాపలాగా నిలబడ్డారు. ఆరోజు ఉదయం హరిజనులు కూడా సత్యాగ్రహం విరమించి లాఠీలతో దేవాలయ ప్రవేశానికి సిద్ధమయ్యారు. దానితో సవర్ణ హిందు వులకు, హరిజనులకు మధ్య జరిగిన కొట్లాట జరిగింది. అందులో బ్రాహ్మాడి దుడ్డుకర్రకు తలపగిలి మరణించిన మాదిగ చెప్పగా తెలిసే సమాచారం ఇదంతా.
ప్రపంచంలో అన్యాయం వుంది. దయ అన్నది ఈ కోశానా లేదు అని చెప్తూ అతడు తన కథ వింటే ,వినే వాళ్లకు తనపట్ల సహానుభూతి కలుగక మానదని ముక్తాయించాడు.
అవునవును, ప్రపంచంలో ధర్మమనేది నాశనమయి పోతున్నది ఆచార వ్యహారాలు మంట గలిసి పోతున్నాయి అంటూ అతనిని సమర్ధిస్తూ మాట్లాడిన మరొక ప్రాణం ముందుగా నీ కథ ఏమిటో చెప్పు అని మాదిగ ప్రాణాన్ని అడుగుతుంది. దేవాలయ ప్రవేశ సందర్భంగా జరిగిన కొట్లాటలో తల పగిలి ఇక్కడ తేలాను అని చెప్తే ధర్మ యుద్ధంలో పాల్గొన్న మహావీరుడివి, స్వర్గంలో ఇంద్రవైభవాలు పొందుతావని అభినందించి, నీ తల పగులగొట్టిన పాపాత్ముడికి నరకం తప్పదని ఓదార్చి వాడెవడో గుర్తున్నదా అని అడిగాడు. “కష్టమన్నది తెలియక రోజూ మూడుపూటలూ అన్యాయంగా మమ్మల్ని దోచుకొని తిని బాగా బలిసిన ఒక లావాటి బాపనయ్య అని చెప్తూ అయినా అతనికి మంచి శాస్తే జరిగిందిలే మా వెంకడు అప్పుడే గొడ్డలితో అతని బుర్రపై కొట్టటం జ్ఞాపకం అని సంతృప్తి పడినట్లు చెప్పేసరికి కథలో ఘర్షణ ఫెటిల్లున విచ్చుకుంది. కథ చెప్పిన వాడు మాదిగ, విన్నవాడు బ్రాహ్మణుడు కావటం ఆ ఘర్షణకు కారణం. వాళ్లిద్దరిమధ్య కొనసాగివస్తున్న తరతరాల వర్ణవిద్వేషం యొక్క ఫలితం అది. ప్రయోజనాల వైరుధ్య పరిణామం అది.
ప్రపంచంలోని ఏ అన్యాయాన్ని గురించి, దయరాహిత్యాన్ని గురించి విగత మాదిగ చెప్పదలచుకొన్నాడో అది వర్ణ అసమానతకు, దురహంకారానికి, ద్వేషానికి సంబంధించినది. దానికి కర్త, కర్మ, క్రియ బ్రాహ్మణుడు. అతనికీ ఒక ధర్మం వుంది. అది వర్ణధర్మం. నిచ్చెన మెట్ల వర్ణధర్మం. అందులో ఆయన పై స్థానంలో ఉన్నాడు. వర్ణధర్మాన్ని నిలబెట్టటానికి యుద్ధం చేయటం అతనికి ధర్మంగా తోస్తుంది. దేవాలయ ప్రవేశ ఘటనలో తలపగిలినవాణ్ణి అని మాదిగ చెప్పుకున్నప్పుడు అతను తనలాగే హరిజనుల దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకొనటానికి దుడ్డుకర్ర చేతపట్టినవాడు అని భ్రమపడ్డాడు కనుకనే ధర్మవీరుడివి అని మెచ్చుకోగలిగాడు. అతను ప్రత్యర్థి వర్ణం అని తెలిసిన మరుక్షణం అతనిధర్మం – తన ధర్మంకన్నా భిన్నమైనది అని అర్ధమై దూషణలకు దిగాడు. కులం తెలియనంతసేపు ప్రేమగా మాట్లాడుకున్న వ్యక్తుల మధ్య అది తెలిసే సరికి ద్వేషం పెల్లుబికింది అంటే వర్ణ రాజకీయాలలోని ప్రయోజనాల వైరుధ్యం వల్లనే. కనబడని కులం, చెప్తే గానీ తెలియని కులం మానవసంబంధాలను ఎంతగా వికృత పరచిందో చూపించాడు కాళోజి.
మరణించిన ఇద్దరినీ యమధర్మరాజు విచారించిన తీరు గమనించదగినది. బ్రాహ్మడి మీద యమభటుల ఆరోపణ “అమాయకులైన హరిజనులు దేవాలయ ప్రవేశం చేస్తామంటే అడ్డుపడటమే కాకుండా ఒక హరిజనుని కర్రతో బాది చంపాడ”ని. నిజమేనా అని యమధర్మరాజు అడిగిన ప్రశ్నకు నిజమే కానీ ధర్మసంరక్షణకు అంటూ అతడు ఏమో చెప్పబోతుంటే నోరుమూయి అని గద్దించి పదిరోజులు అగ్నిగుండం .. ఆ తరువాత కొచ్చిన్ లోని పరయా కుటుంబంలో జన్మ అని శిక్ష చెప్పాడు. బ్రాహ్మలు దైవం పేరు, మతం పేరు చెప్పి ధర్మసంరక్షణ చేస్తున్నామని అధికారం చేతిలోకి తీసుకొనటం, సాటిమనుషులను పీడించటం దైవం మెచ్చే పని కాదన్న సూచన ఇందులో ఉంది. వర్ణధర్మం ధర్మం అనుకుంటున్న వాళ్లకు, అదెంత అధర్మ ధర్మమో తెలిసిరావాలంటే వాళ్ళు మాలమాదిగలై పుట్టాలి. అందుకే బ్రాహ్మడికి ఆ శిక్ష. ధర్మం అంటే సమానత్వం అని అప్పుడు కానీ తెలిసి రాదు.
బ్రహ్మాడి దుడ్డుకర్ర దెబ్బకు చచ్చిన మాదిగను విచారించేటప్పుడు యమధర్మరాజు మహాత్ముడు చెప్పిన అహింసావాదాన్ని విడిచి లాఠీ చేతపట్టినందుకు మందలించి కోపం తగ్గటానికి రెండురోజులు మంచు మీద ఉంచటం, తిరువాన్కూర్ లో హరిజన కుటుంబంలో జన్మ ఎత్తటం శిక్షగా చెప్పాడు. తెలుగుదేశంలో కాక మలయాళ దేశంలో ఎందుకు పుట్టాలి అని మాదిగ అడిగిన ప్రశ్నకు యమధర్మరాజు సమాధానం ‘మళ్ళీ దేవాలయ ప్రవేశపు చిక్కులేకుండా.. మళ్ళీ ఏ బ్రాహ్మడి చేతనో తలపగలగొట్టించుకొని తన వద్దకు రాకుండా ..’ తిరువాన్కూరులో అప్పటికి హరిజనాదేవాలయ ప్రవేశ బిల్లు వచ్చింది కనుక అక్కడ పుడితే అందుకోసం మళ్ళీ ఉద్యమించాల్సిన అవసరం, తల పగలగొట్టించు కోవలసిన అవసరం అతనికి రాదని కాళోజీ అభిప్రాయం.
ఇక్కడ గమనించవలసిన మరొక అంశం ఉంది. అగ్నిగుండం, మాదిగ జన్మ శిక్ష అంటే బ్రాహ్మడు అన్యాయం! ఘోరం అని గగ్గోలు పెట్టాడు. వర్ణ నిర్మాణంలో పై స్థాయిలో ఉండి సర్వప్రయోజనాలు అనుభవిస్తున్న అతడికి మాదిగ జన్మ అంటే నాలుగువర్ణాల చట్రానికి, వూరికి బహిష్కృతుడు కావటం. ఏ సామాజిక సమత్వం, గౌరవం లేని జీవితాన్ని జీవించటం.. అది ఊహకే భయంకరంగా తోచి ఉంటుంది. అందుకే ఆ విలవిల. మంచులో పడెయ్యమన్నా హరిజన కుటుంబంలో జన్మ అన్నా మాదిగ ‘మహాభాగ్యం’ అన్నాడే కానీ ‘అయ్యో’ అనలేదు. ఆ జీవితంలోని నిష్ఠురతను అంతా అనుభవించిన అతనికి భయపడాల్సింది ఇంకేమీ లేదు. బ్రాహ్మడికి మాదిగ జన్మ ను శిక్షగా ఇచ్చిన యమధర్మరాజు మాదిగకు బ్రాహ్మణ జన్మ వరంగా ఇచ్చి ఉండకూడదా అని ఎవరికైనా అనిపించవచ్చు. బ్రాహ్మణ జన్మ మనిషితనం నుండి పరాయీకరణ. అందువల్ల అది శిక్షే కానీ వరం కాదు. కుల అధికార వ్యవస్థ అభావం కావటం కోరదగినది. మాల మాదిగలపట్ల ద్వేషం నశించి ప్రేమ వికసించటాన్నీ సమాన సంస్కృతి వ్యాపించటాన్నీ ఆశించిన కాళోజి ఈ కథలో ఉన్నతీకరింపబడిన నూతన మానవుని ఆవిష్కారం మాలమాదిగల నుండే సాధ్యం అని వ్యంగ్యమానం చేసాడు.