సోఫీస్ చాయిస్

ఆఫీసుకు వచ్చి సీట్లో కూర్చున్నాను. టేబిల్ పై మరకలు. ప్రొద్దుటే దీన్ని శుభ్రంగా తుడిచి పెట్టడం సరోజ పని. శుక్రవారం సాయంత్రం పని ఎక్కువగా ఉండి ఫైల్సు కూడా సర్దుకోలేదు. అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సోమవారం నేను వచ్చేసరికి వీటిని టేబుల్ తో పాటు శుభ్రంగా సర్ది, పక్కన ఉన్న మనీ ప్లాంట్ లో నీళ్ళు మార్చి పెడుతుంది సరోజ. ఇవాళ ఇంతవరకు రానట్లు ఉంది. బాగ్ పక్కన పెట్టి పైల్స్ సర్దడం మొదలెట్టాను. పక్కనే ఉన్న పొడి గుడ్డతో టెబుల్ తుడిచి సింక్ దగ్గరకు వెళ్లి మనీ ప్లాంట్ లో నీళ్ళు మార్చుకుంటున్నాను. కంప్యూటర్ ముందు కూర్చుని టీ తాగుతూ కనిపించాడు సుధాకర్. నా లాగే ఎన్ని సార్లయినా టీ తాగగలడు. నవ్వుతూ చేయి ఊపాను. ప్లాస్క్ చూపించి టీ అన్నాడు నవ్వుతూ.

“ఏంటి ఇవాళ ప్లాస్క్ తెచ్చుకున్నావ్? ఓవర్ టైం చేయబోతున్నావా?” అడిగాను, చనువుగా నా కప్పులోకి టీ వంపుకుంటూ.
“నీ హీరోయిన్ మూడు రోజులు డుమ్మా కొట్టిందిగా. ఇక మనకు టీ ఇచ్చేవాళ్ళేవరు? ఆ బాయ్ తెచ్చే చెంచాడు టీ ఎన్ని కప్పులు తాగితే మన టీ దాహం తీరుతుంది. అందుకని ఇంటి నుండి తెచ్చుకున్నాను” అన్నాడు నవ్వుతూ.
సరోజను ముద్దుగా హీరోయిన్ అని పిలుస్తాడు సుధాకర్. అతని సరదా తత్వంలో ఎప్పుడు ఎటువంటి అసభ్యతకు తావుండదు అని అందరికీ తెలుసు. సరోజ కూడా అతనితో అంతే సరదాగా ఉంటుంది. ఎప్పుడు లీవ్ పెట్టవలసి వచ్చినా సరోజ నా దగ్గరే లీవ్ సాంక్షన్ చేయించుకోవాలి. లేదా కనీసం మెసేజ్ అన్నా పెట్టి రానని చెప్పాలి. మొన్న లీవ్ అడిగితే ఇవ్వనన్నాను. అయినా లీవ్ తీసుకుందా, అనుకుంటూ టీ కప్పు పక్కన పెట్తి సెల్ చెక్ చేసుకోబోయాను. వాట్శప్ లో ఏమన్నా మెసేజ్ మిస్ అయ్యానో అని.

“మెసేజ్ చెక్ చేసుకో అక్కర్లేదు. నీకు చెప్పలేదు. చెబితే ఒప్పుకోవని, మళ్లీ మరో సారి తిడతావని సరోజకు తెలుసు. అందుకని నీకు చెప్పకుండా లీవు తీసుకుంది” అన్నాడు సుధాకర్.
“అంటే ఆ బాంక్ పని కోసమేనా” ఆవేశంగా కుర్చీలోనించి లేచాను.
“ఆగు కూర్చో… అంత ఆవేశం ఎందుకు? ఇతరుల జీవితాలను నిర్ణయించే అధికారం నీకు లేదన్నది మర్చిపోతున్నావు” సుధాకర్ శాంతంగా అన్నాడు.
“అది కాదు సుధాకర్. మన కళ్ళ ముందే తాను విక్టింగా మారుతుంటే చూస్తూ ఎలా???” ఆవేశంతో ఇంక మాటలు రావట్లేదు.
“మొన్న నువ్వు తనతో మాట్లాడడం విన్నాను. నువ్వు కొంచెం ఎక్కువగా ఆమె జీవితంలోని వెళుతున్నావనిపించింది. అయినా మనం ఆమె కుటుంబీకులం కాదు, వారితో తలపడి ఆమెకు మరో కుటుంబంలా నిలబడలేం. మన పరిధి మరిచి జోక్యం చెసుకోకూడదు శాంతి” సుధాకర్ కళ్ళలో స్నేహం చూసి ఊరుకున్నాను కాని మరొకరు ఇదే సలహా ఇవ్వబోతే పెద్ద గొడవ జరిగేదే.

టీ ఒక గుక్కలో తాగి నా సీటు వద్దకు వచ్చి కూర్చున్నాను. సరోజ తండ్రి చనిపోతే కాంపస్నేషన్ గ్రౌండ్స్ మీద ఉద్యోగంలో చేరింది. కాలేజి నుండి నేరుగా ఈ ఉద్యోగంలోకి వచ్చింది. ఇంటర్ పూర్తి అవగానే తండ్రి చనిపోతే, అన్నలిద్దరూ మాకు ఈ ఉద్యోగం అవసరం లేదంటే, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయిగా ఆఫీసులో చేరింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో పర్మనెంట్ జాబ్. కానీ, తన పని ఇక్కడ బాత్ రూంలు శుభ్రం చేస్తూ అందరి అవసరాలు చూడడం. ఆ అమ్మాయిది ఇంచు మించు నా కొడుకు వయసు. ఆమె అమాయకత్వం నన్ను ఆకట్టుకుంది. అక్కడ పని చేసే అందరిలోనూ చాలా చిన్నది సరోజ. ఆఫీసులో ఆమెను చూసే పురుషుల కళ్లల్లో ఎన్నోతేడాలు. ఒకటి అరా అలాంటి కొన్నితేడా సంఘటనల తరువాత నేను సరోజను కనిపెట్టి చూసుకుంటున్నాను. ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగిస్తే నాతో పెట్టుకోవలసి వస్తుందన్న భయంతో ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలుకుంటున్నారు కొందరు మర్యాదస్తులు. అది ఆ అమ్మాయికి కాస్త ఊరట కలిగించడంతో నాకు మాలిమి అయింది. ప్రతి రోజు ఎంత పనిలో ఉన్నా నాతో ఓ అరగంట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళదు, నన్ను వెళ్లనివ్వదు.

సరోజ కు ఇద్దరు అన్నలు. దిగువ మధ్యతరగతి కుటుంబం. కానీ, ఆ అన్నల ఆర్భాటాలకు అంతు లేదు. పెద్దవాడు సురేష్, పోయిన సంవత్సరం పెళ్లి అయింది. అప్పు చేసి అవసరానికి మించిన హంగులతో పెళ్లి జరిపించింది సరోజ తల్లి రాజ్యం. వాడిది మంచి ఉద్యోగమే. కానీ, ఖర్చులు అధికం. ప్రస్తుతం పెళ్లి చెసుకుని వచ్చిన అమ్మాయిలకు వంట రాకపోవడం ఓ పెద్ద క్వాలిఫికేషన్. పైగా ఇంటిపని నేర్చుకోవాలన్న తపన కూడా వాళ్లలో ఉండదు. ప్రస్తుత నాగరిక యువతులకు ఇంటి పని అంటేనే రోత. ఆ పనిని గౌరవించడం వాళ్ళకే చేతకాదు. ఇక మగవారి సంగతెందుకు? ఇలాంటి వారి పాలిట పెన్నిధులు స్విగ్గీ, జొమాటోలు. కావల్సినది ఆడర్ ఇచ్చుకుని తెప్పించుకోవడం తినడం. ఊరు మీదపడి తిరగడం. దానికో ద్విచక్రవాహనం. అదీ పెట్రోలు నీళ్ళలా దాగే ఖరీదయిన బండి. బండి నడిపే ఓపిక లేకపోతే కాబ్ బుక్ చేసుకుని తిరగడం. ఇక ఆ జీతం ఏం సరిపోతుంది. పదిహేను రోజుల్లోనే జేబు ఖాళి. భార్యా భర్తల మధ్య గొడవలు, అది లేదు, ఇది లేదు అని భార్య పోరు ఎక్కువ అయింది అని సురేష్ నెలకోసారి అమ్మ దగ్గర వాపోతుంటే, ఆమె కావలసినవి కొడుకు కోడలికి సర్ధుతూ ఉంటుంది.

ఇక రెండవ వాడు రమేష్. వీడికి ఎలా పట్టుకుందో క్రికెట్ బెట్టింగుల వ్యసనం పట్టింది. మొదట్లో డబ్బులు వచ్చేవట. అవి మళ్లీ ఆటలో పెట్టడం, డబ్బులు పోగొట్టుకోవడం. వాడిదీ విలాస జీవితమే. అప్పులు అయి అవి తీర్చడానికి ఇంట్లో నానా రచ్చ చేసి నేను చస్తాను అని బెదిరించి, ఇంట్లో దొరికింది దొరికినట్లు పట్టుకుపోయి అమ్ముకుంటాడు. వాడికీ ఓ ఉద్యోగం ఉంది. కాని ఆ జీతం ఎవరూ కంటితో చూడలేదు.

సరోజకి కొంచెం ఊబకాయం. పైగా ఆరోగ్యం అంతగా బావుండదు. ఇరవై ఏళ్ళకి భారీ శరీరంతో ముప్పై ఏళ్ళ మనిషిలా కనిపిస్తుంది. మేం ఒద్దని వదిలేస్తే నీకు ఉద్యోగం వచ్చింది. మా అవసరాలు తీర్చవలసిన బాధ్యత నీది అని ఆ అమ్మాయి చేతిలో రూపాయి ఉండనివ్వరు ఆ అన్నలు. ఉద్యోగంలో చేరిన సంవత్సరం, కొంత డబ్బు దాచుకుని ఓ చీటి ఎత్తి ఓ సన్నటి బంగారపు గొలుసు కొనుక్కుంది సరోజ. ఆ రోజు ఎంతో సంతోషంగా అది తీసుకొచ్చి నాకు చూపించింది కూడా. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూస్తే ముచ్చటేసింది. మెరిసే కళ్ళతో బావుంది కదా మేడం అని ఆ అమ్మాయి అపురూపంగా ఆ గొలుసు పట్టుకుని చూపిస్తే, నాకూ ఆనందం వేసింది. అలా డబ్బు దాచుకుని వస్తువులు కొనుక్కోవడంలోని ఆనందం నాకూ తెలుసు. అందుకే ఆ రోజు ఆ అమ్మాయి సంతోషంలో పాలుపంచుకుని స్వీట్ తెప్పించి పెట్టాను. ఆ ఆనందం ఒక్క రోజులో ఆవిరి అయిపోయింది. అప్పు కట్టాలి, అప్పుల వాళ్ళు గోల చేస్తున్నారని రమేష్ తల్లి దగ్గర గొడవ పెట్టుకుని అర్జంట్ అంటూ సరోజ కొన్న గొలుసు తాకట్టు మాత్రమే పెడతానని తరువాత విడిపిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఏడుస్తున్న సరోజతో రాజ్యం ఒక నెలలో విడిపిస్తాడులే అని సర్ధిచెప్పిందట. ఆ అమ్మాయి తన సంపాదనతో కొనుక్కున్న మొదటి వస్తువు అది. రెండు సంవత్సరాలు అవుతున్నా ఆ గొలుసు ఊసే లేదు.

ఇక సరోజ పై అంక్షలకు అంతే లేదు. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది? ఎక్కడకు వెళుతుంది? ఎవరితో స్నేహం చేస్తుంది. ఇవన్నీ అన్నల కనుసన్నలలో జరగవలసిందే. ఒక సారి ఏదో ఫంక్షన్ కు వెళదాం అనుకున్నాం స్టాఫ్ అంతా. రాత్రి తొమ్మిదికి డిన్నర్. కానీ సరోజ రానంది. నేను నిన్ను తీసుకువచ్చి డ్రాప్ చేస్తాను అన్నా. “లేదు మేడం అన్నలు ఒప్పుకోరు. మన స్టాప్ లో సార్లందరూ వస్తున్నారు కదా. నేను వాళ్ళతో కలిసి వెళితే అన్నలకు ఇష్టం ఉండదు” అని రావాలని కోరిక ఉన్నా అది చంపుకుని ఇంటికి వెళ్లిపోయింది.

పెద్ద కొడుకు సురేష్ పెళ్లి కోసం చాలా అప్పే చేసింది. పైగా రమేష్ అప్పులు పెరుగుతున్నాయి. దీనితో సరోజతో ఆఫీసులో ఐదు లక్షలకు లోన్ తీయించింది. సరోజ ఈ డబ్బు ఇస్తే ఇక అన్న సమస్యలు తీరుతాయి అని చెప్పినప్పుడు నాకు నమ్మకం అనిపించలేదు. ఆలోచించుకో అని చెపుతూనే లోన్ అప్లికేషన్ ను ఫార్వడ్ చేసాను. ఆ లోన్ నెల నెల తాను జీతంనుండి కడితే అన్నలు వారి వెసులుబాటును బట్టి తనకు ఆ డబ్బు తిరిగి ఇస్తారని చెప్పింది. నేను తరువాత దాన్ని పట్టించుకొలేదు. రెండో సారి ఇంకో ఐదు లక్షలకు లోన్ అప్లయ్ చేసింది. అన్న పెళ్ళికి చేసిన అప్పు తీర్చకపోతే దానికి షూరిటీగా పెట్టిన పెద్దమ్మ ఇల్లు వేలం వేసే స్థితికి వస్తుందని, పెద్దమ్మ తమను నమ్మి ఆ ఇంటి కాగితాలు ఇచ్చిందని, ఆమెను కొడుకులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని, ఆ కాయితాలు తెచ్చివమని ఆమెపై ఒత్తిడి పెంచుతున్నారని, చివరకు పెద్దమ్మ ఆ కాయితాలు విడిపించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యం అని గోల చేసిందని సరోజ చెప్పినప్పుడు బాధ్యత తప్పించుకుని తిరిగే ఆ అన్నలపై నాకు విపరీతమైన కోపం వచ్చింది.

సరోజ జీతంలో నుంచి సగం ఈ లోన్లకే పోతుంది. కొన్ని సార్లు తడి కళ్ళతో మౌనంగా ఆఫీసులో తిరుగుతూ ఉండే సరోజను చూస్తే జాలి వేసేది. ఆఫీసుకి పని మీద వచ్చే వయసులోఉన్న మగపిల్లలతో ఉత్సాహంగా ఆమె మాట్లాడుతూ ఉండడం కొని సార్లు చూసాను. ఆ వయసులోని సరదాలు, కోరికలు లోన చేసే అలజడి అర్ధం చేసుకోలేనిదాన్ని కాదు. ఒకటి రెండు సార్లు చూచాయగా తనకు వారితో కొంత దూరం పాటించమని చెప్పాలనిపించినా సభ్యత కాదని ఊరుకున్నాను. ఇన్స్ టాగ్రాం లో ఎక్కువగా పోస్ట్ లు పెడుతూ ఆనందించే సరోజ పట్ల కొంత భయం కూడా నాకు కలిగేది. చక్కగా తయారయి రకరకాల ఫోటోలు పెట్టడం సరోజకు ఇష్టం. పైగా ప్రకృతి ప్రేమికురాలు కూడా. ఎవరికీ కనిపించని అందాలు ఆమెకు కనిపిస్తూ ఉంటాయి. చాలా సార్లు ఆఫీసు పరిసరాలనే అందంగా సెల్ ఫోన్ లో బంధించి ఆమె చూపిస్తూ ఉంటే ఆ అమ్మాయి నిశిత దృష్టికి ముచ్చటేసేది.

ఒక రోజు పై ఆఫీసు నుండి నాకు ఫోన్ వచ్చింది. సరోజ డైరెక్టుగా హెడ్ ఆఫీసుకి లోన్ కి అప్లయ్ చేసిందట. ఇప్పటికీ మూడు లోన్లు ఆ అమ్మాయి పేరున ఉన్నాయని, మళ్లీ లోన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు షూరిటి సంతకం పెట్టాలని. కానీ, అంతకు ముందు ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకుని తనకు నచ్చచెప్పమని ఆఫీసర్ ఫోన్. ఆయన చాలా లోతైన మనిషి. నిక్కచ్చిగా ఉంటాడు. ఆర్ధిక విషయాలలో తగు సూచనలను కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు మాకిస్తూ ఉంటాడు. డబ్బులు ఎలా దాచుకోవాలో, పొదుపు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత అవసరమో ఆయన ప్రతి ఒక్కరినీ పిలిచి మరీ చెబుతారు. ఒక లోన్ సాంక్షణ్ చేసే ముందు ఎన్నో విషయాలను పరిశీలించి, ఉద్యోగస్తులతో మాట్లాడి మరీ సంతకం పెట్టే మనిషి. అసలు నాకు చెప్పకుండా సరోజ డైరక్టుగా ఆయనకు అప్లికేషన్ పంపడం ఆశ్చర్యం అనిపించింది. పిలిచి అడిగాను.

“మీరు ఒప్పుకోరు అని భయమేసింది మేడం” అంది అమాయకంగా..
“ఇప్పుడు మళ్ళీ లోన్ అవసరం ఎందుకు?” అడిగాను.
“పెద్దన్నకు అప్పు ఉందని వదినకు తెలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆ అప్పు ఉంటే కాపురానికి రానంది. అమ్మ దగ్గరకు వచ్చి సురేష్ నిన్నంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ అప్పు తీర్చడానికి ఈ లోన్ కి అప్లికేషన్ పెట్టమని, తాను తెలిసిన వాళ్లతో రెకమెండ్ చేయించి సాంక్షణ్ అయేలా చూస్తానని అన్నాడు. వదిన రాకపోతే మా ఇంటి పరువు పోతుందని అమ్మ కూడా ఈ లోన్ తీసుకోమంది. మా చుట్టాలలో ఎవరికీ మా అప్పుల గురించి తెలియదు. తెలిస్తే మమ్మల్ని తక్కువగా చూస్తారు. అంతకు ముందు లోన్ తీసుకుంటున్నప్పుడు మళ్ళి మరో సారి ఇలాంటి అప్లికేషణ్ ఫార్వడ్ చేయనని మీరు అన్నారని ఇంట్లో చెప్పాను. అమ్మ నాతో అప్లికేషన్ పై సంతకం పెట్టించుకుని తానే హెడ్ ఆఫీసుకు డైరెక్టుగా తీసుకెళ్లి ఇచ్చింది” అని చెప్పింది భయం భయంగా.

“మీ వదిన ఉద్యోగం చేయదా”? అడిగాను.
“లేదు మేడం. ఆమె ఆరోగ్యం అంత బావుండదు. ఎక్కువ శ్రమ పడకూడదట. అందుకని కొన్ని రోజులు దాకా ఉద్యోగం చేయదట” చెప్పింది సరోజ.
ముఖం నిండా మేకప్పుతో మా ఇంటి పక్కనుండే చైనీస్ రెస్టారెంట్ కి బైక్ పై వచ్చే ఆ జంట రూపం నాకు గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి ఉద్యోగం చేయలేని శక్తిహీనురాలని నాకెప్పుడూ అనిపించలేదు.

“ప్రెగ్నెంటా?” అడిగా.
“లేదు మేడం. అప్పులు తీరే దాక పిల్లలను కనరంట” చెప్పింది.
“అంటే నువ్వు లోన్ తీసుకుని ఆ అప్పు తీరుస్తే వాళ్లు కాపురం చేసి బిడ్డల్ని కంటారా”?
సరోజ మౌనంగా తల దించుకుంది. ఆమెను అలా చూస్తే చిరాగ్గా అనిపించింది.
“సరే భాస్కరన్ సర్ నీతో మాట్లాడమన్నారు. ఇప్పటికి తొమ్మిది లక్షలకు లోన్ తీసుకున్నావు. ఇక మళ్ళీ లోన్ ఇవ్వాలంటే ఈ ఆఫీసులో ఎవరో ఒకరు షూరిటీ ఇవ్వాలి. అది ఎంత కష్టమో నీకు తెలుసు కదా” అన్నా.
సరోజ ముఖంలో భయం “అమ్మ ఏడుస్తుంది మేడం. అన్న గోల చేస్తాడు” అంది భయంగా.

“అసలు మీ అమ్మ మీ అన్నని ఎందుకు మందలించదు. వాళ్లు అప్పు చేసారు. వాళ్ల పెళ్ళికి చేసిన అప్పు నువ్వే తీరుస్తున్నావు. మళ్ళీ మరో అప్పు. ఇదన్నా భార్యా భర్తలిద్దరూ పని చేసి తీర్చుకోవచ్చు కదా. నిన్ను లోన్ తీయమని మీ అమ్మ కూడా అడగడం ఏంటీ?” అన్నా.
“అన్న జీతం ఇంటికే సరిపోవట్లేదు మేడం” అంది మెల్లిగా.
“సరోజా మీ అన్న జీతం నలభైవేలు చేతికి ఇరవై అయిదు అన్నా వస్తుంది. ఉంటున్నది నీ పేరు మీద ఉన్న క్వార్టరు లోనే. ఇంటి ఖర్చులు నీ జీతంతోనే నడుస్తున్నాయి. ఇంకా పిల్లలు లేరు. దాంతో ఇద్దరు మనుష్యులు బతకలేరా? ఈ అప్పులు ఏంటీ? మీ అమ్మ గట్టిగా చెప్పలేదా?” అన్నాను విసుగ్గా.

తనకు ధైరాయిడ్ ఉందని అంటూ ఉంటుంది సరోజ. ఈ మధ్య ఇంకా లావెక్కింది. ఈ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశమన్నా ఆ కన్న తల్లికి ఉందా? ఎందుకో ఒక్కసారి ఆమెతో మాట్లాడాలి అనిపించింది.
“సరే మీ అమ్మను ఒక సారి రమ్మను”… అడిగా.
“అమ్మనా..” భయంగా చూసింది నా వైపు.
“అవును… రమ్మను లోన్ సాంక్షన్ కావాలంటే మీ యింటి వారితో మాట్లాడమన్నారు భాస్కరన సర్. మరి మాట్లాడాలి కదా”… అన్నా.
మరుసటి రోజు నేరుగా నా సీట్ దగ్గరకే వచ్చింది సరోజ తల్లి రాజ్యం. సన్నగా పొడుగ్గా నైలెక్స్ చీరలో నా ముందు నుంచున్న ఆమె నలభై అయిదేళ్ళ మనిషిలా లేదు. కనీసం పదిహేను సంవత్సరాలు చిన్నగా కనిపిస్తుంది. కూర్చోమని చెప్పి లోన్ విషయం ఏంటని అడిగా.
“బాబుకు అవసరం మేడం. పెద్దన్నకు చెల్లెలు ఆ మాత్రం సాయం చేయాలి కదా” కొంచెం గట్టి గొంతుతో జవాబిచ్చింది.
నాకు ఒళ్ళు మండింది.
“ఇప్పటికి ఆ అమ్మాయి పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నాయో మీకు తెలుసా”?
“తెలుసు మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి కదా ఆమెకే లోన్ ఈజీగా వస్తుంది. మగ పిల్లలిద్దరివీ ప్రైవేట్ జాబ్ లు అందుకే ఆమె చేతనే లోనుకి పెట్టిస్తున్నాం” అంది ఆమె.
“సరోజకు ఈ మధ్య మెడ దించుతే కళ్లు తిరుగుతున్నాయి మీకు తెలుసా”… అడిగాను.
అయోమయంగా చూసింది నావైపు. లోన్ కి దీనికి ఎంటి సంబంధం అనే ప్రశ్న ఆమె కళ్లలో.

“ఆ అమ్మయికి థైరాయిడ్ ఉంది. ఇప్పుడు ఆ మెడ నొప్పి చూస్తె స్పాండిలైటిస్ అని అపిస్తుంది. పైగా చిన్న పనులకే ఆయాసం, దమ్ము వస్తున్నాయి. ఆ అమ్మాయి ఆరొగ్యం అంత బాగా లేదు. కనీసం ఆ అమ్మాయి పెళ్లి గురించి అయినా మీకు ఆలోచన ఉందా” ? అడిగా…
“పెళ్లి అంటే మంచోళ్ళూ దొరకాలి కదా మేడం. ఎవరికంటే వాళ్లకిస్తామా. ఇంటర్లో ఉన్నప్పుడే ఓ సంబంధం వచ్చింది. అప్పుడు ఇలా బండగా ఉండేది కాదు. చేసుకోవే అని ఎంత పోరానో కాని అది వినలే. నాకు వాడు నచ్చలే నేను చేసుకోను అంది. చదువుతా అంది. కాని వాళ్ల నాన్న చనిపోయాక ఇక మగపిల్లలు ఆయన ఉద్యోగం మా కొద్దంటే దీనికే ఇప్పించ్చాం. ఇక ఇంటి భాద్యత దీనికి కూడా ఉంది కదా” అంది కళ్లు చికిలిస్తూ..

సరోజ వైపు చూసా. “మేడం ఇంటర్లో పెళ్ళి చేసుకోమంటే ఒద్దన్నా…” అంది నసుగుతూ.
“మరి వచ్చిన మంచి సంబంధం అప్పుడే చేసుకుంటే పోయేదిగా… అది వద్దంది. ఇక ఉద్యోగంలో పడింది. మగపిల్లలిద్దరూ పూర్తిగా సెటిల్ కాలేదు. వాళ్లు ఒద్దన్న ఉద్యోగమే కదా ఇది ఇప్పుడు చేస్తుంది. అందుకని అన్నలకు సాయం చేయాలి కదా” అంది కాస్త తల పక్కకు జరిపి.

నాకు రాజ్యాన్ని చూస్తే కోపం వచ్చింది. క్లాస్ ఫోర్త్ జాబ్ మేం చేయం అని మొండికేస్తే. ఇది గవర్నమెంట్ జాబ్ ఇందులో సెక్యూరిటీ ఉందని సుధాకర్ లాంటి కొలీగ్స్ వీరి ఇంటికి వెళ్లి చెప్పడం నాకు తెలుసు. కాని ఆ మగపిల్లలకు ఈ ఉద్యోగం చిన్నతనంగా అనిపించింది. అప్పటికి సురేష్ డిగ్రీ పూర్తి చేయలేదు. కాని ఈ ఉద్యోగం చస్తే చేయనని మొండికేసాడు. రెండు మూడు సార్లు పరిక్ష రాసి పాస్ అయి ఏదో కాల్ సెంటర్ లో చేరి ఇంగ్లీషు బాగా వచ్చన్న ఒకే ఒక కారణంతో ఓ స్థిరమైన మంచి ఉద్యోగం సంపాదించుకున్నాదు. రమేష్ ఇప్పటికీ ఓ కంపెనీలో చిన్న ఉద్యోగస్తుడిగానే ఉన్నాడు. వారికి నామోషి అనిపించి వదిలేసిన ఈ ఉద్యోగంలో ఆడపిల్లను చేర్చి వాళ్లు చేస్తున్న దోపిడి నాకు అర్ధమవుతూనే ఉంది.

“మరి ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారా” అడిగా మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తూ.
“చూస్తాం మేడం. దేనికయినా టైం రావాలి కదా” అంది ఆమె పైట సర్దుకుంటూ.
పక్కన కూర్చున్న సరోజను చూసా. ఈ కాలంలో కాస్త కుదురైన ఉద్యోగం చేసే ఏ పిల్లవాడు ఆమెను ఎన్నుకుని చెసుకోడు. ఎవరన్నా ఆమెను చేసుకోవాలన్నా ఈ ఉద్యోగం ఒకటే ఆకర్షణ. అప్పుడప్పుడు అందంగా కనిపించే యువకులవైపు ఆశగా జాలిగా చూసే సుజాత రూపం నాకు కొత్త కాదు. కొత్తగా పెళ్లైన జంటలను కళ్లు విపార్చుకుని ఆ అమ్మాయి చూస్తూ ఉండడం ఎన్నో సార్లు గమనించాను. కొన్ని సార్లు ఇంస్టగ్రాం లో కొందరు యువకుల ఫోటోలను చూపించి లైన్ వేయనా, మెసేజ్ పెట్టనా, ఇదుగో ఈ ఫోటోకి వాడు నాకు ఇలా మెసేజ్ పెట్టాడు అని అమాయకంగా చెప్పే సరోజ రూపం నన్ను కలవరపెడుతుంది.

పెళ్లి అవసరమని, తప్పకుండా ప్రతీ ఆడపిల్ల పెళ్ళి చేసుకోవాలి అని నేను నమ్మను. కాని సరోజ లాంటి పిల్లలకు ఇలాంటి పుట్టింటి నుండి బైట పడాలంటే పెళ్ళి ఒక్కటే దారి. అది జరగకపోతే ఆమె పరిస్థితి ఏంటన్న ఆలోచన నాకు కలిగింది. ఆ తల్లికి బిడ్డ గురించి ఆలోచన లేదా?
“ఈ అప్లికేషన్ నా దగ్గరకు రాలేదు. డైరెక్టుగా పర్సనల్ బ్రాంచ్ కు వెళ్లింది. నన్ను కనుక్కొమన్నారు. సరోజ పే స్కేల్ తక్కువ. దానిపై లోన్లకు ఓ పరిమితి ఉంది. అంతకు మించి ఇవ్వలేరు” అన్నా..
“అదేంటి మేడం దానికి ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది. అది కట్టకుండా పారిపోదు కదా. ఎందుకు రాదు లోన్” అడిగింది ఆమె ఆవేశంగా
నాకు చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. పెద్ద కొడుకు కాపురానికి చిన్న కొడుకు బెట్టింగులకు ముప్పై సంవత్సరాలకు కూతురుని కుదవ పెట్టే ఆ తల్లిని చూస్తే కోపం వచ్చింది. మగపిల్లలు ఆమెను బెదిరించి ఈ పని చేయిస్తున్నారేమో మరో రకంగా ఈ లోన్ ఆపుచేద్దాం అనుకున్న నాకు ఈ తల్లి కనీసం మగపిలల్లని ఎదిరించాలని, వాళ్లకు బుద్ది చెప్పాలని అనుకోకపోగా వారి కోసం కూతురి భవిష్యత్తుని పణంగా పెట్టాలని ప్రయత్నించడం భాధ కలిగిస్తుంది.
“ఇవ్వరు. ఇంకేదన్నా లోన్ రావాలంటే సుజాత పెళ్లికి మాత్రమే సాద్యం అవుతుంది. అమ్మాయి పెళ్లి కుదిర్చి లోన్ కోసం పెట్టుకో అది తప్ప మరే లోన్ సుజాతకు డిపార్ట్మెంట్ నుంచి రాదు” గట్టిగా అన్నాను నేను.

“ఏంటీ? లోన్ రాదా. మాకూ రూల్సు తెలుసు నేను యూనియన్ దగ్గరకు పోతా, ఎట్లివ్వరో చూస్తా”… అంది గట్టిగా..
“నీ ప్రయత్నం నువ్వు చేయి. కాని లోన్ రాదు. అమ్మాయి పెళ్లి సంగతి చూడు. ఆ కారణంతో అయితే లోన్ రావచ్చు” అన్నా. అప్పుడు కూడా ఎవడో వెధవను లోన్ కోసం పెళ్ళి కొడుకుగా తెచ్చి ఈ పిల్ల గొంతు కోయదు కదా అన్న అనుమానం కలిగింది. అయినా ముందు ఈ లోన్ విషయం ఆపు చేయాలంటే ఇంకో దారి కనిపించలేదు.
“ఏంది అమ్మా పెళ్ళి అంటావ్? మా పిల్లకు పెళ్ళి ఎప్పుడు చేయాలో మాకు తెలియదా? నువ్వు చెప్పాలా? మాకు చేయాలనుకున్నప్పుడు చేస్తాం. అయినా దానికి తొందరేం వచ్చింది. అదేమన్నా పెళ్ళి చేయ్ మని నీకు చెప్పిందా? దాని అన్నలు పెళ్లి కొడుకులను చూస్తూనే ఉన్నారు. అయినా దీన్ని చూసి ఎవరో ఒకరు ఇష్టపడాలిగా… వాడు మాకు నచ్చాలి. అప్పటి దాకా ఇంటి అవసరాలు ఆగుతయా”… గొంతు పెంచింది రాజ్యం.

ఇలాంటి ఆడవాళ్ళకు జవాబు చెప్పడం నాకు పెద్ద కష్టం కాదు. నేనూ గొంతు స్థాయి పెంచి, అందులో అధికారాన్ని నింపి. “ఇది ఆఫీసు. నీ ఇల్లు కాదు. గొంతు తగ్గించు. ఈ లోన్ కి అప్లయ్ చేసే అర్హత నీ కూతురికి లేదు. చేరిన ఆరు సంవత్సరాలలో మూడు లోన్లు పది అడ్వాంసులు తీసుకుంది. ముందు అవి అన్నీ కట్టి తరువాత లోన్ సంగతి మాట్లాడమను. సుజాత నువ్వు ఇక వెళ్లడం మంచిది” అంటూ మరో ఫైలు ముందేసుకున్నాను.

పెంచిన నా గొంతుకు ఆమె కొంచెం జంకింది. నన్ను తినేసేటట్టు చూస్తూ వెళ్లిపోయింది. గుడ్ల నీరు కక్కుంటూ సుజాత తల్లిని అనుసరించింది.
ఇదంతా గమనిస్తున్న కొలిగ్స్ నవ్వుతూ నా వైపు చూసారు. సుధాకర్ దగ్గరకు రాబోయి ఇది సమయం కాదనుకుని ఓ. ఎస్. టేబుల్ వైపుకు వెళ్ళాడు.
నేను అకౌంట్శ్ కి ఫోన్ చేసి భాస్కరన్ సర్ తో విషయం వివరంగా చెప్పాను. సుజాత పేరున ఏ లోన్ అప్లికేషన్ వచ్చినా ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించవద్దని సుజాత పై అధికారిగా నా అభిప్రాయం చెప్పాను. ఆయన అంతా విని “పూర్ గర్ల్” అంటు ఫోన్ పెట్టేసారు.

ఇది జరిగి ఆరు నెలలు గడిచాయి. సుజాత ఇంకాస్త లావు పెరిగింది. ఒక సారి చనిపోవడానికి ఏవో టాబ్లెట్లు మింగిందని సురేష్ చూసి ఉప్పు నీళ్ళు తాగించి వాంతులు అయేలా చూసాడని విన్నాను. కారణం అడిగితే బిర్యాని దగ్గర గొడవ అయిందని చెప్పింది. ఒకో సారి ఎంతో ఉత్సాహంగా ఒకోసారి శక్తి లేకుండా కనిపిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఏమీ జరుగుతున్నట్లు లేదు. నేను నాకుగా ఆమెను ఏమీ అడగను. కాని తనలో వస్తున్న మార్పులు నన్ను అందోళన పరుస్తూనే ఉన్నాయి. తనను ఉత్సాహపరచడానికి నా వంతుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

ఒక రెండు రోజులు ఒంట్లో బావోలేదని ఆఫీసుకు రాలేదు సుజాత. తరువాత వచ్చినప్పుడు ఏడ్చి ఉబ్బిన కళ్లతో ఉన్న ఆమెను చూస్తే బాధనిపించింది. దగ్గరకు పిలిచి ఏంటి కారణం అని అడిగాను. డిపార్ట్ మెంట్ నుండి లోన్ వచ్చే ఆశ లేదని ప్రైవేట్ బాంక్ చెన్నైలో ఏదో లోన్ ఇస్తుందని, దానికి అప్లయ్ చేయమని చిన్న అన్న రమేష్ ఏవో కాగితాలు ఇచ్చాడని చెప్పింది. అది పది లక్షలకు లోన్. దిమ్మతిరిగింది నాకు. అంత డబ్బు మీకెందుకు అని అడిగా. “మేడం రమేష్ అన్న కారు కొని కాబ్ నడిపిస్తాడట. వచ్చిన జీతం సరిపోవట్లేదు. అన్న గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి ఒప్పుకోవల్టేదు. ఏమన్నా బిజినెస్ ఉంటే పెళ్లి చేస్తాం అంటున్నారు ఆమె తల్లి తండ్రులు. అన్న కార్ కొని నడిపిస్తే డబ్బు మంచిగ వస్తుందని నెల నెల తానే లోన్ కడతానని చెప్తున్నాడు. కాని ఆ లోన్ నేనే తీసుకోవాలి. నా జీతం నుంచి బాంక్ కట్ చేసుకుంటది. ఆ లోన్ కాగితాలు తెచ్చాడు అన్న” అంది.

“ఇది తీసుకుంటే, నీ జీతం నుండి ఎంత కట్ అవుతుంది” అడిగా
“మేడం పాత లోన్లకు, దీనికి నా జీతంలో మొత్తం పోయి ఐదు వందలు లేదా నాలుగు వందలు జీతం మిగులుతుంది”.
“ఎన్ని సంవత్సరాల లోన్” ఇది అడిగా
“తొమ్మిది సంవత్సరాలు మేడం” అంది కన్నీళ్ళతో
“మీ అమ్మ ఏం అంటుంది”. జవాబు తెలిసినా అడిగా…
“మేడం అమ్మ పాపం ఏం చేస్తది. ఎంతయినా కొడుకులపైనే ఆమెకు మనసుంటది కదా. చిన్న అన్న మంచిగ సంపాదిస్తే అది మనకే కదా అని చెప్పింది”.
ఏం చెప్పాలో తెలియదు. సుజాతకిప్పుడు పాతికేళ్ళు. అంటే ఓ తొమ్మిది సంవత్సరాల దాకా ఆమె జీతం దాదాపుగా రాదు. నాకు తెలిసినంతవరకు ఆమె అన్నలు ఆమెకు తిరిగి ఆ డబ్బు ఇవ్వరు. ఈ తొమ్మిది సంవత్సరాలు ఆమె పెళ్లి చేయరు. పెరిగిపోతున్న ఆమె శరీరం చూసి ఎవరూ ఆమెను భార్యగా అంగీకరించరు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రావడానికి ఉన్న ఒకే ఒక్క కారణం ఈ ఉద్యోగం. కాని తొమ్మిదేళ్లు ఆమె పని చేస్తూ కూడా జీతం తీసుకోలేదు. దీన్ని ఒప్పుకుని పెళ్లి చేసుకునే ఔదార్యం ఉన్న వాళ్లు ఉంటారా? ఈ సంగతి ఆమె తల్లికి తెలీదా? ఆ కార్ కొని రెండవ కొడుకు పెళ్ళి చేయడం ఇప్పుడు అంత అవసరమా. దానికి దశాబ్దకాలం దాకా సుజాతను ఇలా కట్టేయడం వెనుక కొడుకుల స్వార్ధం ఆ తల్లికి అర్ధం కావట్లేదా? ఆమె కన్నపేగు కొడుకుల కోసమే స్పందిస్తుందా?
సుజాతను చూస్తూ “అసలు ఏం జరుగుతుందో నీకు అర్ధం అవుతుందా సుజాతా” అడిగా.
“తెలుసు మేడం. నేను ఉద్యోగం చేస్తా కాని జీతం రాదు. జీతం రాదు కాబట్టి నాకు పెళ్లి కాదు. నాకు జీవితంలో పెళ్లి ఉండదని నాకు అర్ధం అయింది మేడం” అంది కన్నీళ్లతో.

“చూడు సుజాతా, నేను నిన్ను నాకు బాగా తెలిసిన వారి దగ్గర పెడతాను. ఇది మంచిది కాదు. జీవితకాలం బందీవవుతావు. ఒప్పుకోకు. నేను సంతకాలు పెట్టను అని చెప్పు. దీనికి ఒప్పుకోకు. మీ అమ్మతో మాట్లాడతాను” అన్నా.
“సుజాత నవ్వుతూ అంతకు ముందు మాట్లాడారు కదా మేడం. తరువాత ఇంట్లో పెద్ద యుద్దం జరిగింది. నేను పెళ్ళి కావాలని అందరి దగ్గర చెప్పుకుంటున్నానని ఇంట్లో చాలా రోజులు గొడవ అయింది. పోనీండి మేడం, పెళ్ళి చేసుకున్నా వాళ్లకీ నా జీతం ఇవ్వాల్సిందే కదా. నేను తప్ప ఎవరో ఒకరు నా జీతం తింటారు. నా అమ్మా అన్నలనే తిననివ్వండి. అయినా అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఆమెకు కొడుకులంటే ప్రాణం. నేనెంత చూసినా ఆమె కోసం తపించినా కొడుకులను చూడకుండా ఆమె ఉండలేదు. వాళ్ల దగ్గరే ఆమె ముసలితనంలో ఉండాలి. రేపు నన్ను కూడా వాళ్ళే చూడాలి కదా”. సుజాత కళ్లలో విరక్తి. లీవ్ అప్లికేషన్ నా ముందుకు తోసింది. “చెన్నై వెళ్లి బాంక్ లో సంతకం పెట్టాలంట మేడం, మూడు రోజుల సెలవు కావాలి” అంది.

“సెలవు దొరకదు. నేను సాంక్షన్ చేయట్లేదు. సోమవారం ఆఫీసుకి డీ.ఆర్.ఎం. ఇన్స్పెక్షణ్ కి వస్తున్నారు. నువ్వు ఉండి తీరాల్సిందే”. అని లీవ్ అప్లికేషన్ పక్కన పడేసాను. సుజాత నావైపు నిర్వికారంగా చూసి వెళ్లిపోయింది.
కానీ సీ. ఎల్. కు ముందుగా సాంక్షన్ తీసుకోవలసిన అవసరం లేదు. సమాచారం ఇస్తే సరిపోతుంది. ఆవేశంలో నేను అది మర్చిపోయాను. సుజాత నా సంతకం అవసరం లేకుండానే చెన్నై వెళ్లింది. ఆ లోన్ కాగితాలపై ఈ పాటికే సంతకాలు పెట్టి తిరిగి వస్తూ ఉంటుంది.
ఆలోచనలలో ఉన్న నన్ను తట్టి పిలిచాడు సుధాకర్. “శాంతి చాలా సందర్భాలలో మనం సుజాత లాంటి వారికి ఏమీ చేయలేం. సానుభూతి చూపడం తప్ప. నువ్వు దీన్ని పర్సనల్ గా తీసుకోకు.” అన్నాడు.

“కానీ సుధాకర్, రత్నం సుజాత భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించదు? కన్న తల్లి కదా” అడిగా.
“అవును తల్లే. ఆమె ఎదురుగా రెండు మార్గాలున్నాయి. ఆమె ఒకటే ఎంచుకోవాలి. ఒక మార్గంలో జీవితాంతం తోడు ఉంటారనుకునే కొడుకులు, రెండవ మార్గంలో ఎప్పటికయినా పరాయిదయ్యే ఆడపిల్ల. ఆమె కొడుకులను ఎంచుకుంది. అంతే” అన్నాడు.
“సొఫీస్ చాయిస్” అనుకోకుండా నా నోట్లోంచి వచ్చింది.

సుధాకర్ నవ్వుతూ “ఎక్జాట్లీ, సోఫీస్ చాయిస్. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తల్లిని పిల్లలను వేరు చేస్తున్న జర్మన్ సైనికులు ఇద్దరు బిడ్డల తల్లి అయిన సోఫీని ఒక బిడ్డను మాత్రమే నీతో ఉంచుకోగలవు ఎవరో ఒకరిని ఎంచుకో, అంటే ఆమె అనాలోచితంగా కొడుకునే ఎన్నుకుంటుంది. జీవితం అనే యుద్దంలో ప్రతి తల్లి ఏదో ఒక సందర్భంలో కూతురిని వదిలి కొడుకునే ఎన్నుకుంటుంది. రాజ్యం అదే చేసింది. ఇట్శ్ సోఫీస్ చాయిస్”
“ఎందుకు సుధాకర్ ఎందుకలా” కళ్ళలో నీళ్ళూ తిరుగుతుండగా అడిగా…
“ఏమో స్త్రీవి, తల్లివి నీకే తెలియాలి” అన్నాడు సుధాకర్, నవ్వుతూ.
ఆ నవ్వుతుంది నా స్నేహితుడు సుధాకరా…? కాదు. ఓ పురుషుడు, జస్ట్ ఎనధర్ మాన్…

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply