పొద్దు పరంట వాలింది. మొగిలయ్యోలకు కలుపు తీస్తా ఉండే కూలోళ్ళు పైటాల సంగటి తిని మల్లీ మడిలోకి దిగతా ఉండారు. మా ఊరి గంగి కావమ్మ కావమ్మ సుభము కావమ్మా!…అని ఎలుగెత్తి కావమ్మ కత పాడతా ఉంటే, ఆ మడిగల్ల ఆసామి మొగిలయ్య బుర్ర మీసాలు దువ్వు కొంటా ఆలకిస్తా ఉండాడు.
నేను నడీది ఏప చెట్లు కింద కూసోనుంటే ఆ చెట్టు మిందొక కాకి కావ్! కావ్! మని అరిసి కుప్పలు పెడతా ఉంది. శానా సేపు నించి దాని అరుపులకు అంతూ పొంతు లేదు అప్పటికి రెండు సార్లు డూయ్ డూయ్ మని అదిలించి నాను. అయినా నిలప లేదు. కాని ఒక సారొచ్చి తలమింద పెటీలు మని తన్నింది కూడా.
అది తన్ని పొయ్యిన కాణ్ణించి, నా మనుసేందో కీడును శంకిస్తా ఉంది. దానికి తగి నట్టుగా పెద్దోళ్ళు అనేది కాకి అదే పనిగా అరిస్తే దురువార్తేదో మన కందితిందని. ఎట్టా వార్త ఇనాల్సి వొస్తిందో నని ఆందోళన నాకు అంతకంతకూ పెరగతా ఉంది. పొద్దు నెత్తరు గుడ్డుగా మారి గూట్లో పడతా ఉండే టప్పుడు కొటారేడు నుంచి మా బందగు డొకడు నెత్తిన గుడ్డేసుకొని వొస్తా కనబడి నాడు. వాణ్ణి సూస్తా ఉండంగానే నా గుండెల్లో గభీ మనింది.
వాడొచ్చి అన్నా…! మన అమాస గోడు రెండు రోజుల్నుంచి కనబడలేదు. కత్తిరి పల్లి సెరువు కట్టకింద మడి కోతలకు పొయ్యోస్తా నని పొయ్యినాడు తిరిగి రాలేదు. పోనీ అక్కడే ఉండా డనుకుంటే ఆడాలేదు అన్నాడు. అంతే నాకు లేని పోని అనుమానా లొచ్చినాయి.
ఎందుకంటే ఆర్నెల్లుకు ముందు డేరా కండిక్కాడ ఇట్టనే మా వోళ్ళు పనికి పొయ్యుండి తిరిగి రాలేదు. వాళ్ళను పొయ్యి అడిగితే చీగటి పడేదాక పన్జేసి కూలి తీసక పొయ్యినారు, మాకేం తెల్సు అన్నారు. మడుసుల్ని పంపించి యాడేడనో ఎతికించినా పలితం లేకుండా పొయ్యింది.
నాలుగైదు రోజులు మేమీ గందరగోళంలో ఉంటే మల్ల తెల్సింది నిశ్ళంక దుర్గం బోటుకాడ కాకులు గెద్దలు తిరగతా ఉండాయని ఆడికి పోతే కాలి కాలకుండా నాలుగు శవాలు దొరికినాయి గుర్తు పట్టే దానిక్కూడా కాకుండా. ఎవురెవుర్ది ఏ శవమో తెల్దుగాని తెచ్చి కాల్సి కడతేర్సు కుంటిమి. మల్ల వాళ్ళ నలుగురు పెండ్లాలు ముండ మొయ్యగా వాళ్ళ పిలకాయలు అనాదలై పొయ్యినారు.
** ** **
వాళ్ళెట్ట సచ్చి పొయ్యినారని ఎవుర్నడగతాం. తెలుసుంటే ఒక్క బగు మంతుడికే తెల్సుండాల ఆయనేడుండా డని అడిగేది. ఇంగ పోలీసు కేసులంటే మాబోటి వాళ్ళవొల్ల అయ్యే పనేనా, పొయ్యినా ఆడ నాయం జరిగితిందని నమ్మకం లేదు. అందుకే మనస్సు నిరామయం జేసుకొని గమ్మోనుండి పోతిమి.
అయితే నిజం నిలకడ మింద తెలిస్తిందని పెద్దోళ్ళు చెప్పతారు అట్ట మల్లొక రెండు నెల్లకు బయట పడింది యట్ట జరిగిందనేది. ఈళ్ళు పని కాడినించి యలబారి వొస్తావొస్తా అక్కడొక వంకాయ తోటలో వంకాయలు కోసుకోవాలని దిగి నారంట కూరకని, కాని ఆ తోటకు కరంటు పెట్టుంటారని వాళ్ళకేంతెల్సు , దిగటం కెవ్వని అరిసి సచ్చి పొయ్యి నారంట.
ఈ సంగతి ఆ కయ్య గల్లోళ్ళకు తెల్సి శవాలు ఆడనే ఉంటే దొబ్బులని, మూడో కంటికి తెలవ కుండా అడవిలో కెత్తక పొయ్యి కాల్సేసి వచ్చేసి నారంట. అన్ని నాళ్ళకు తెలిస్తే చేసే దేముంది. సాచ్చిం గూడా మిగలకుండా వాళ్ళ గుంతల మింద గెరికి పోచలు మొల్సి పొయ్యినాయి.
చెట్టంత మడుసులు పొయ్యినారే అని కొన్నాళ్ళు బాదపడి మల్ల మర్సి పోతిమి. అయితే మరద్దామన్నా మరుపు రాని బాదేమంటే? వాళ్ళు వొంకాయల దొంగ తనానికి పొయ్యి సచ్చి పొయ్యినారని అగ్ర కులపో లందురూ జేరి పలాన మాల పల్లోళ్ళే దొంగలని పేరు బెట్టి పచారం జేసేసి నారు యాడ దొంగ తనాలు జరిగినా ఎవురు జేసినా మా వోళ్ళనే పట్టక పొయ్యి నాయం అన్నాయం లేకుండా కట్టేసి కొడతా ఉండారు.
అట్టనే మల్లొక నాడు మా వోడొకడు కూలికి పొయ్యి తిరిగొస్తా ఉంటే, ఎవురో కోళ్ళు దొంగలిస్తే ఈణ్ణి పట్టక పొయ్యి సావగొట్టి కొన ఊపిర్తో వదిలి పెట్టినారు.
** ** **
యలబారి పొయ్యి మా అమాస గోడు ఎవురెవురి పన్లు జేసినాడో వాళ్ళనంతా పొయ్యి అడిగితిమి వాణ్ణి గురించి. యాడ పొయ్యినాడు ఎవురింటికాడ తిన్నాడు యాడ పడుకున్నాడు ఏమని ఒక్కరు గూడా సెప్పనంటారు. వొచ్చింది నిజమే పొయ్యింది నిజమే మల్ల యాడికి పొయ్యినాడో తెల్దంటారు, మన మెడకేడ సుట్టు కుంటుందో నని.
ఇట్ట కాదని పోలీసు కంప్లేంటు గూడా ఇస్తిమి ఎతికిస్తారేమో నని. వాళ్ళు యాడనో పొయ్యుంటాడు వొస్తాడులే అనేసినారు. మల్ల మేము గెట్టిగ అడిగే కొద్దికి మీ వోళ్ళంతా దొంగనా కొడుకులంట గదా! యాడనో దొంగ తనానికి పొయ్యుంటాడు నిదానంగా వొస్తాడులే తొందరెందుకు అని తేలిగ్గా మాట్లడి పంపేసినారు.
దాంతో మేము వొదల్లేదు పైయోళ్ళకు సెప్పతామనే కొద్దికి మీకు దిక్కుండే సోట సెప్పుకోండని మెడ బట్టి బయటికి గెంటేసి నారు దాంతో చేసేది లేక తిరిగొచ్చేస్తిమి. గాని వాడు సచ్చి పొయ్యినాడంటే మాత్రం నమ్మకం కుదర్లేదు ఎందుకంటే వాడు దొంగ తనాలు చేసేవాడుకాదు బయస్తుడు.
నిజం దాగదని అందికి తెల్సిందే కదా! కాక పోతే కొన్ని రోజులి ఆల్సెం గావచ్చు అంతే తేడా. మల్లి కొన్ని ఇసయాలు బయటకు పొక్కినాయి. కొత్తూరు లో ఒక మేక పోతును దొంగ తనంగా పట్టక పోతా ఉంటే పట్టి కట్టేసి కొట్టి చంపి తెల్లారి నాక ముందే ఏట్లో తీసక పొయ్యి పెట్టి నారంట గుంత లొడి పూడ్సే దానికి. ఇంతలో కల్లు గీసే వోళ్ళు వచ్చేసినారని పైనే పూడ్సేసి పొయ్యి నారంట.
మల్లి అదేరోజు కుక్కలు పొయ్యి శవాన్ని బయటికి లాగేస్తే ఇంటి కొక్క మడిసి పొయ్యి ఆ శవాన్ని తీసక పొయ్యి అడివిలో కాల్సి బూడిద చేసేసి వొచ్చేసి నారనతెల్సింది. దాంతో చేసేది లేక దోంగోడి పెండ్లాం ఎప్పుటికైనా ముండ మొయ్యాల్సిందే నని ఆ యమ్మిని తీసక పొయ్యి గాజు పూస తీసేసి వొచ్చేస్తిమి మల్ల ఆ సంగతే అంతటితో మర్సి పొయ్యినాము.
** ** **
మల్లన్నా దొంగతనాలు ఆగినాయా అంటే లేదు. ఈళ్ళు మేం దొంగతనాలు సెయ్యలేదు మొర్రో అన్నా పట్టుకొని పొయ్యేది ఎక్కడ దొంగతనాలు జరిగినా వీళ్ళే అని కేసులు పెట్టి కోరట్ల సుట్టూ తిప్పించు కొంటా ఉండారు.
అయితే మాకు నాయం మింద నమ్మక ముంది. ఎవురో ఒక మహన్నభావుడు వొస్తాడు అసలు దొంగలు పట్టు కుంటాడు మనకు నాయం జరిగి తిందని ఎదురు సూస్తానే ఉండాము. కొన్నాళ్ళకు మేమనుకున్నట్టే కొత్త ఎస్సై వొచ్చినాడు. రాత్తి గస్తీ పెంచి గట్టి నిఘా పెట్టి ఇన్నాళ్ళు మమ్మల్ని దొంగలని ఏలెత్తి ఎవురైతే సూపించినారో అగ్ర కులపోళ్ళు వాళ్ళ పిలకాయలే కొంతమంది జులాయిగా తిరిగే వోళ్ళు తాగుడుకు మరిగి టెంకాయ మాన్లల్లో కల్లు దుత్తలు దొంగలిస్తా పట్టు బడినారు. ఇంగేముంది వాళ్ళ పాపం పండింది.
పట్టక పొయ్యి రెండు రోజులు టేసన్లో ఏసి నిగడ కొట్టితే యడాడ దొంక తనాలు జేసి మా దళితుల్ని ఇరికించి వాళ్ళు తప్పించు కొనింది సెప్పినారంట. అట్టనే మా అమాస గోడి ఇసయం గూడా బైట పెట్టి నారని తెల్సింది. వీళ్ళే మేక పోతును దొంగలించక పోతా ఉంటే జనం ఎంబడించి నారంట. ఈ పొద్దిటితో మన బండారమేడ బయట పడితిందో ననే బయంతో నిద్దర పోతా ఉండే మా అమాసగోడి పక్కన తీసక పొయ్యి కట్టేసి ఇద్దో దొంగని పట్టిచ్చేసి వాళ్ళేమో తెలివిగా తప్పించు కున్నారు.
సచ్చింది మా వోడే గదా! వాడు నేను దొంగను గాదు అని కాళ్ళు పట్టుకొని ఏడుకున్నా నువ్వే దొంగనా కొడుకువని అట్ట వాణ్ణి పట్టక పొయ్యి సంపేసి నారు పోనీ వాడే దొంగను కున్నా నాయం అన్నాయం లేదా? ఇసారించాల్సిన పని లేదా? ఎద్దు ఈనిందంటే గాట్లో కట్టేయండని తీసక పొయ్యి సంపేసేదేనా? నాలుగు దెబ్బలేసి వొదిలేసేదో లేక పదో ఇరవయ్యో తప్పేసి కట్టమనో చెప్పచ్చు గదా ఇంత మాత్రానికే ఒక మడిసి పేణాలు తీసేస్తారా?
తిన్న కుక్క తినేసి పోతే కన్న కుక్కను కట్టేసి కొట్టి నట్టు, వాళ్ళు మేక పోతును దొంగలించే దేంది నిద్దర పోతా ఉండే మా వోడిని తీసక పొయ్యి సంపేసే దేంది. మా వోళ్ళు ఆ నాడు వంకాయలు దొంగలించిక పొయ్యుంటే పలానోళ్ళు దొంగలని ఈ పేరొచ్చుండేది కాదు. ఇంత మంది సావుకు కారణ మయ్యుండేది కాదు. ఇప్పుటికైనా అసలు దొంగలు పట్టుబడి ఆ పళి మా మిందినుంచి తొలిగి పొయ్యింది సాలు సంతోషమే అయితే పొయ్యిన పేణాలు మల్లీ తిరిగొస్తాయా అంటే రావు.
గాంధీ తాత మమ్మల్ని అరిజనులని పేరు పెట్టినా, అంబేత్కర్ మా కోసం ఎన్నో చట్టాలు తెచ్చినా, అయ్యన్ని మాకు చేరనే లేదు. సెయ్యని నేరాలకు ఇప్పటికీ చిచ్చలు అనుబవిస్తానే ఉండాం.