‘సృష్టికర్తలు’ కథ నేపథ్యం- 3

సరే ఏది ఏమన్నాకానియ్యి. అసలు పాత్ర బర్ల ఓదన్న ఖాయం… ఓదన్న అట్ల ఉండంగనే రైతుకూలీ సంఘం నాయకులు రత్నయ్యను పక్కకుపెట్టి కిలిశెట్టి ఎల్లయ్యను, బుచ్చి లింగంను తీసుకున్న. వాళ్లిద్దరు అప్పటి అనేక మంది రైతుకూలీ సంఘం నాయకులకు ప్రతిరూపాలు. సాపెన్లు బెట్టిన రామయ్యపల్లె శంకరక్కను తీసుకోకపోతే ఆమె నా ముఖంలకు సూత్తె ఆ చురుకు చూపులకు తట్టుకోవడం ఎవరికి తరంగాదు. థీము లేదా కథాంశం సృష్టిర్తలు, పాత్రలు దొరికినయ్. అంతా రడీ అయినంక అసలు కష్టము షురువయ్యింది. మాటలు రడిగున్నయి గాని అవి అట్టనే చెప్పితె కథగాదు. సంఘటనలు కావాలి. బోలెడున్నాయి. చినమెట్టుపల్లి, లొత్తునూరు, మద్దునూరు, రామయ్యపల్లె జరిగిన, జరుతున్న ఘటనలన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక పేపరు మీద రాస్తే అప్పుడర్థమయ్యింది. వేరువేరు ఊళ్లల్ల జరిగినా కూడా కామన్ పాయింట్ శిఖం, బంజరు అటవీ భూములు. దాదాపు ప్రతి గ్రామంలో సంగం ఉండి అవి దొరల ఆక్రమణలో ఉండటం, అవి రైతుకూలీ సంఘాలు ఆక్రమించి పేదరైతులకు పంచడం. అంటే ఆక్రమణ అందులోకి నాగండ్లు, ఎడ్లు ఎర్రజంగాలు, గుంటకలతో పెద్ద ఎత్తున కదలడం. ఇది మామూలే. కానీ ఇదివరకే చాలా రాశా అంతకంటే భిన్నంగా సంక్షిప్తంగా రాయాలి. ఎందుకంటే అసలు కథ అదికాదు. అందులో నుండి రూపొందిన ఒక తాత్వికకథ. ఏది ఏమైనా మనం ఎంత జాగ్రత్తగా రాసినా అలాంటి మట్టి మనుషుల తిరుగు బాటంటేనే అలాంటి మనుషులు కాయిదాల మీదికి కథల్లోకి వస్తేనే అంతా దుమ్ము దుమ్మై పోయినట్టుగా ఫీలౌతారు. పైగా అలాంటి మనుషులు మాట్లాడే భాష మోటు భాష కింద లెక్క. మాల మాదిగలను అంటరాని వాళ్లుగా చూసినట్టు అప్పటికే నాకథలు, నవలలు భాషను సాహిత్య ప్రపంచం చూస్తున్నది. నాకెరికే కని తప్పదు. తొక్కక తప్పదు. ఏది ఏమైనా మొరటు దుక్కి దున్నుడు రాయాల్పిందే కాని కళాత్మకంగా రాయాలి. ఓర్ని మళ్లా చిక్కువడ్డది. గా కొట్లాట దగ్గెరికి ఎర్రసెలుక దగ్గరికి కళాత్మకత నుంచి తేవాలె? తెచ్చేదేంది ఆడనే ఉంటది, చెలుకు పక్కనే పారే వాగులుంటాయి, పచ్చగ పెరిగిన నేనెన్నడు వర్ణించజాలని అడివుంటది, పశువులుంటయి. అయ్యయ్యో వర్షం కురిసె వెలిసిన తరువాత పారే నీళ్లు కడిగిన చెట్లు అప్పుడు నీళ్లు నిలువని ఎర్ర సెలుకే కావాలి. గెర్రె భూమికావాలి. మొదటి సారి దున్నుతండ్లు కనుక నాగలి సాలు బెట్టినంక గుంటకలు గొట్టాలి. పెసాల్లలుకాలి. స్థలం, వాతావరణం ధ్వనులతో సహా తయారయ్యింది. అంటే సృష్టి, విధ్వసం రెండూ ఎదురు బొదురుగా నిలబడి కదనరంగం దొరికిందన్నమాట…

భారతదేశ గ్రామాలన్నీ తరతరాలుగా ఇలాంటి యుద్ధభూమిలో నిరంతరం మండుతూ ఉన్నాయి.
లటక్కున కారల్ మార్క్స్ వచ్చి కూచున్నాడు. నీ దండంబెడుత మార్క్స్ వద్దు, నీ దయార్థ్ర చూపులు వద్దు, నీ కమ్యూనిస్టు మ్యానిపెస్టో వద్దు, ‘చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే’ గంతగనం నా చిన్న మొదట్ల పట్టదు.

ఆఖరుకు నేనీ కథ రాయలేను, రాయజాలనని తీర్మానించుకున్న. నాకెందుకో ఉత్తగనే రాత్రి డ్యూటీలో ఒంటరిగా కూర్చున్నప్పుడు కన్నీళ్లు కారిపోయేది… ఇంత కల్లోలాన్ని, హింసను అనుభవించడం అవసరమా? నాకే గింత యాతనైతే మరి పనిపాటలు చేసుకుంటేనే బతికే గ్రామాల పరిస్థితేంటి? అనుభవించేవాళ్ల స్థితేమిటి… అప్పుడు చివరకు కథలో వచ్చిన ‘బక్క మనిషి’ వచ్చి రక్షించాడని రాయాలి? ఎవరికోసం తెలంగాణలో స్థల కాలాలల్లో బతికే రైతులు, కూలీలు, మధ్యతరగతి, దొరలు, బ్యూరోక్రాట్లు, విప్లవకారులు, నా కోసం కూడ కథ రాయాలి… సెప్టెంబరు మాసం మధ్యలో…ఒక నాటి రాత్రి డ్యూటీలో, రాత్రి పన్నెండు గంటలకు రాయడం మొదలుపెట్టిన, తెల్లారుతుండగా అయిదున్నరకు కథ పూర్తయ్యింది. ఆరోజు టైం కీపర్ గా ఆరు గంటలకు కొట్టాల్సిన కాషన్ సైరన్ అయిదు నిమిషాలు ఆలశ్యంగా మోగించాను. ఒక థ్రిల్ లో గుంపులు గుంపులుగా నా చుట్టూ మూగుతున్న కార్మికుల మధ్య నిలబడి “సృస్టికర్తలు” వెలుగుతో అదో లోకంలో ఆ రోజు ఉన్నాను.

అది మళ్ళీ చదవకుండా వెంటనే సృజన పత్రికకు పోస్టు చేశాను. అక్టోబర్ 1979 సృజనలో ఆ కథ అచ్చయింది. “గ్రామ రాజ్య కమిటీల” నిర్మాణం నవంబర్ 1979లో మొదలుపెట్టారు. ఆ కథలోని అంశాలను నోటికి అనేకమంది అనేక రకాలుగా ప్రచారం చేశారు. రైళ్ళల్లో, బసులల్లో, రైతుకూలీ సంఘాలల్లో రాత్రిపూట జరిగే మీటింగులల్లో ప్రజలు సృస్టికర్తలు అని చెప్పుకున్నారు. దాదాపుగా ‘సృస్టికర్తలు ‘ అనే మాటలు ప్రజలు మౌఖికంగా కాయం చేసుకున్నారు. పెద్ద దొరలు ఊళ్ళల్లనుండి పట్నాల బాట పట్టారు.


అనేక వాద వివాదాలకు, విమర్శలకు కారణభూతమైన ఈ కథ ఏది ఏమైన సాహిత్యంలో కూడా “సృష్టికర్తలు” అనే మాటను ఖాయంచేసింది. ఈ మాట విన్నప్పుడల్లా బయ్యపు దేవేందర్ రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, రత్నయ్య, చనిపోయిన – చంపబడిన – హింస గుర్తుకొచ్చి లోలోపల అల్లుకుపోయి, నేను కోలు కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి రెండు వేల మందిని నిర్దాక్షణ్యంగా, కిరాతకంగా, కుట్రపూరితంగా చంపించిన వారు ఘనత వహించిన రాజకీయ నాయకులుగా రోజు వార్తాపత్రికలలో, మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఆ కథ వేరే. సురక్షిత ప్రాంతాలైన పట్టణాలకు చేరిన దొరలు భాషమార్చి మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున హింసకు దిగే ప్రయత్నంలో ఉన్నారు. అది కొత్త కథ. నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ యుద్ధ రంగంలో ప్రపంచంలోనే అరుదైన అనుభవం గడించిన వాళ్ళు ఇగో ఈ గ్రామాల నుండే రూపొంది దేశవ్యాప్తితమై ఉన్నారు.

నిజ జీవితంలో జరిగే, జరుగుతున్న సంఘటనలను కథలుగా ఎలా మలుచాలి?
నేను స్థల కాలాలల్లో జరిగిన సంఘటనలను ఆ అనుభవం మేరకు వివరించాను. అవేమిటి? ఆనాడు జరిగిన రైతాంగ పోరాటాలు. అది ఎందుకు జరుగుతున్నయి? ఎలా జరుగుతున్నయి? ఎవరెవరు పాల్గొంటున్నారు? పోరాటాల ద్వారా ఓరిగిందేమిటి? అందులో ఉన్నవారు, ఆ కాలంలో ఆ పోరాటాలను ఎట్లా అర్థం చేసుకున్నారు? అసలు నిజం ఏమిటి? ఇట్లాంటివి ఇంకా చాలా ప్రశ్నలు. అందులో పాల్గొన్న, సంబంధించిన అందరి నుండి తెలుసుకున్నాను. అంటే రైతుల నుండి, పెద్ద నాయకుల దాక. ఈ మొత్తం అర్థం చేసుకోవడానికి మార్క్స్ నుంచి మొదలు పెడితె ఇప్పటి నాయకులదాక తమ ఆచరణ ద్వారా, అన్వయం ద్వారా చెప్పిన విషయాలు వేటికవే కాకుండా గతితార్కిక చారిత్రిక పద్దతిలో అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం.

అతికీలకమైనది ‘హింస.’ ఈ హింస చుట్టూ ఉండే ప్రపంచం పునాది. పునాది ఏమిటి? ఉత్పత్తి వనరులు – భూమి, ఫ్యాక్టరీలు అంటే ఆస్తి- ఉత్పత్తి శక్తులు శక్తుల చేతిలో నుండి జారిపోవడం వేల సంవత్సరాల హింసాత్మక సామాజిక పరిణామ క్రమం. చేజారిపోయిన ఉత్పత్తి వనరులను చేజిక్కించుకోవడం, అభివృద్ధి చెయ్యడం ప్రజలకు అనివార్యం. అవసరం. దాన్నే మార్క్స్ వర్గపోరాటాల చరిత్ర అన్నారు. ఉత్పత్తి సంబంధాలు, అవి పూర్తిగా హింసాత్మకంగ ఉన్నాయి. ఉంటాయి. అవి మార్చాలి. మార్పు ఒక పోరాటం. ఈ మొత్తం ప్రక్రియలో నుంచే తాత్వికత, భావజాలం పుట్టింది. ప్రజల తాత్వికతను అణిచివేశారు. పైగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలన్నింటిని హింసా, అహింసల పేరుతో పక్కదారి పట్టించారు. అణచివేశారు.

అది సృష్టికర్తల చరిత్ర. ఇది కథకు ఇతివృత్తం. కనుక మన చుట్టూ జరిగే సంఘటనల నుండి ఇతివృత్తం లేదా కథాంశం పుడుతుంది. అలాంటి కథాంశంలో ఉండే పాత్రలను మనం గతిక్రమానికి, మనం ఎంచుకున్న లక్ష్యానికి అనుకూలంగా ఎంచుకోవాలి. ఎవరికి చెప్పాలి? ఎంత చెప్పాలి? ఎందుకు చెప్పాలి? వీటినుంచే భాష, మాటలు అవసరం పడుతాయి. తగిన సంఘటనలు ఎంచుకోవాలి. మనం ఎంచుకున్న వైరుధ్యం, కూలిపోతున్న పాత సమాజం, రూపొందుతున్న కొత్త సమాజం, అందుకు తగిన వాతావరణం, సంఘటనలు నిజ జీవితంలో నుండి ఎంచుకోవాలి. ఇందులో నీ వైఖరేమిటి?
అందుకు తగిన భావోద్వేగాలతో కథ రూపొందుతుంది. మొదట రాయాలనే తపన, ఒత్తిడి ఉండాలి. రాయడం ద్వారానే కనిష్టస్థాయి నుండి గరిష్ట స్థాయికి ఎదుగుతాము. నాకైతే ప్రతి కొత్త కథ ఒక పరీక్ష. ఒక చాలెంజ్. అది నా చుట్టూ రూపొందుతున్న సమాజం గతిక్రమాన్ని తెలుసుకునే, అందులో భాగం పంచుకునే అద్భుతమైన ప్రక్రియ. నాకు రచన, జీవితం ఒక్కటే.

ఇటీవల విప్లవ రచయితల సంఘం వారు, పినాకపాణి వారి మిత్రులు కలిసి, అనేక సంవత్సరాల నుండి సుమారు ముప్పైదాకా కథల వర్కుషాపులు పెట్టి, వాటన్నిటిలో నేను కూడా భాగస్వామ్యం తీసుకున్నాను కనుక, వందలాది మంది కథకులు మూడు తరాలు పాల్గొన్న అలాంటి కథల సుదీర్ఘ ప్రయాణం గురుంచి కొన్ని ప్రశ్నలు అడిగారు. సమకాలీన ఉద్యమాలు ముఖ్యంగా విప్లవోద్యమాలు అన్వేషిస్తున్న సాహిత్య, సామాజిక కథల నేపథ్యంలో నా శక్తి మేరకు కొన్ని అభిప్రాయాలను, నా సహచరుల అభిప్రాయాలతో కలిపి చెప్పాను. అది పుస్తకంగా వేశారు. అందులో సమగ్రంగా వివరంగా కథలు రాయడం గురించి చెప్పాను. “విప్లవ కథా రచన – కొత్త ప్రపంచపు నిర్మాణ కళ” పుస్తకం ఇప్పుడు మార్కెట్ లో ఉంది. కథలు రాయదలుచుకున్న వారు చూడవచ్చు. చర్చించవచ్చు.
నాకన్నా ముందే కళీపట్నం రామారావు గారు ‘కథా కథనం’ పేర కథల పుట్టుక గురించి రాశారు.

ఇంకా నేను “సృష్టి కర్తలు” కథకు సంబంధించి రాసిన విషయాలతో పాటు ఆ కథ కూడ “కొలిమి” వారు పెడుతామన్నారు. కనుక ఎక్కువగా అర్థమవుతుంది.
యాభైయేండ్ల విప్లవోద్యమంలో అనేక అనుభవాలు, కొత్త సవాళ్ళు మూడో తరం రంగంలో ఉన్నది. ఆదివాసులు, దళితులు, మహిళలు, మత మైనారిటీలు రైతాంగ పోరాటాలను, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం రాజ్యాధికార సాధన దిశగా సమాయత్తం చేసి పోరాడే తరుణంలో ఈ అనుభవాలు కూడా అధ్యయనం చేయండి, విశ్లేషించండి.

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply