సుమంగళం 

ప్రకృతిని ప్రతిబింబించే అదొక కాన్వాస్‌ 
అలకల పోతలతో అద్భుతాలు
దాని పై పూవులు, ఫలాలూ, చిత్రాలై పరవశిస్తాయి
సూర్యచంద్రులు ఆముదంలో తడిసి నిగనిగలాడుతుంటారు
మహారాజు ఛాయలు నింపే మలుపుడు కత్తి 
వయ్యారాలు ఒలకపోసే పిడి కత్తి
గోరు గాలు, కత్తెరలు, బ్లేడ్లు, బ్రష్లు, దువ్వెనలనీ 
కన్నతల్లిలా కడుపులో దాచుకునే ‘అస్పి’ని
జగన్నాటక సూత్రధారిలా జబ్బకేసుకొని
నడుస్తున్న సుమంగళి తోలుసంచి 
వెనుకట మా తాత ముడిసి అల్లినదే  
ఆ క్షుర కత్తికి, మా సురికత్తికి శుద్ధి సంబంధం

గడ్డం గీకడం, నెత్తి గొరగడం, గడ్డల్ని కోయడమేకాదు
లోకంలోకి రాలేక తండ్లాడుతున్న శిశువుకు కత్తి గాటుతో
ప్రపంచంలోకి ప్రవేశపెట్టే అసలైన అమ్మమ్మ ఆ మంత్రసాని
కాన్పు చేసి బొడ్డు కోసే గైనిక్‌ వైద్య పురాచిరునామా
పుల్లేండ్లు పసిపిల్లల్లో జీర్ణశక్తిని పునరుద్ధరిస్తాయి

తలనీలాల సమర్పణలో భగవంతునికి భక్తునికీ మధ్యవర్తులు
పుండ్లనెత్తినీ పేనుకొరిగిన తలకు పెను మార్పులతో 
నీ రాజసం ఉట్టిపడేలా రచించే అందం
వాళ్ల నైపుణ్యానికి పరాకాష్ట

మంగళ స్నానంతో మైలపోలు మనిషి జీవితంలో మరవనిఘట్టం
రాసిన ప్రోలులో శుభలగ్నం మనుషుల్ని ఐక్యం చేసే వెయ్యిళ్లపంట
తప్పుకు తగిన శిక్షగా శిరోముండనం కూడా బాధ్యతే
పురిటి నుంచి పుల్లలదాకా సదా తోడుండేది వాళ్ళు 

మంచికి మమేకమై సమాజానికి నీరాజనం పట్టే మంగళా హారతి వాళ్ళు 
‘‘ఎదురుగాళ్లతో పుట్టలేకపోతున్న నన్ను 
ప్రాణం మీద ఆశలు కొట్టేసుకున్న నా తల్లికి
బ్రహ్మలా ఇద్దరికీ జీవం పోసిందని 
మంగలి మల్లక్కను మా తాతమ్మ మరీ మరీ స్మరించు

గడ్డం గీసాక అరచేయితో మృదువుగా నిమురుకుంటూ
రుంగ జుట్టి మెలేసిన మీసం మీద నెలపొడుపును చూపే మా నాయనా 
మంగళి నాగయ్య కత్తి చేసిన నవాబునని తనకుతానే చెంగలిస్తడు

చెక్కలగిలి చేస్తూ ఏడవకుండా నా పుట్టెంటికలు తీసిండనీ చంద్రన్న గురించి అవ్వ చెప్పు
నా బిడ్డ పుట్టెంట్రుకలు తీసినందుకు పెయి నిండా బట్టలు పెడితే 
పండుగ సంబూరం కత్తి పట్టిన కళ్ళల్లో పరవళ్ళు తొక్కింది 

నా చిన్నతనంలో జోరబొంతలు కట్టుకొని కటింగ్‌ చేసే నారయను అడిగిన 
‘‘మైలల పుట్టిన మనుషులకు కడజాతోల్లని కావురం రా నాయనా…!
కఠీనం గీసిన కట్టుబాటును కొరగలేని తల లేనోళ్ళం రా తండ్రీ…!
తలల్ని బోడి చేస్తాం గానీ తలపుల్ని ఏం చేస్తాం రా బిడ్డా…!’’ అన్న జవాబు నాలో విత్తిన నానా రకాల ఆలోచనలు 
పట్నంలోని అద్దాల సెలూన్‌ లూ
అన్నీ పంచినా ఆత్మీయతలు కొరతగానే ఉన్నాయి
మా ఊరి రాజనర్సు మునివేళ్లు నన్ను తాకి
మసాజ్‌ చేస్తుంటే 
ఏలినాటి శని బరువు దించుకున్నట్లయితది

అప్పటికప్పుడు నేను మహారాజునయినంత సంతోషం
మా నాయనమ్మ దివసాలకు
మా తల్లి పెద్ద కర్మకు
జలసూతుకాలు పాటించే పాలివాళ్లకు క్షవరంజేసి శుభం తెలుపుతారు 
మనుషులతో మమేకమయ్యే మంగళ్ళకు
కత్తులే కాదు నేడు జీవితాలు మొండిపోతున్నాయి
పేచిపెట్టనీ మానవతల మనుషులు 

పెట్టుబడిదారీ సెలూన్లలో బ్యూటీ పార్లర్‌లలో దినసరి కూలీలైతుంటే మనసును బాదిస్తుంది
కార్పోరేట్‌ కత్తులతో కలెవడడానికి
తరతరానికి సేవలందించిన మంగళి కత్తికి మాటలతో నైనా పదును పెడత

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply