(నీరజా గోపాల్ జయాల్
ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్
జేఎన్‌యూ, న్యూ ఢిల్లీ)
భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన భారతీయ పౌరసత్వం అనే భావన ప్రస్తుతం లోతైన, మౌలికమైన రూపాంతరం చెందే క్రమంలో ఉంది. ఈ మార్పుకు దోహదపడే జంట సాధనాలు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC), పౌరసత్వ సవరణ చట్టం (CAA). మొదటిది (NRC) తమకు నచ్చని సమూహాలకు పౌరసత్వం లేకుండా చేసే మార్గాలను రూపొందిస్తుంటే, రెండవది (CAA) తమకు ఇష్టమైన సమూహాలకు పౌరసత్వ మార్గాలను సృష్టిస్తోంది. మొదటిది, భారతదేశం అంతటా విస్తరించే ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుతం అస్సాం రాష్ట్రానికి పరిమితమైంది. రెండవది భారతదేశం అంతటా అమలు చేయడానికి రూపొందించబడింది.
ఈ రెండింటినీ ఒకదానితో ఒకటి చదవడమే కాదు, మైనారిటీల పట్ల ప్రభుత్వ విధానాల కోణం నుండి చదవాల్సిన అవసరం ఉంది. ట్రిపుల్ తలాక్ ను నేరంగా నిర్ధారించి ముస్లిం మహిళల జీవితాలను బలవంతంగా మెరుగుపర్చడంలో అయినా, పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆగస్టు నుండి జరుగుతున్న అణచివేతలో అయినా మైనారిటీల పట్ల ప్రభుత్వ వైఖరిని చూడవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మైనారిటీలపై హింస వేగవంతం అయిన సందర్భంలో, ముఖ్యంగా చట్టపరమైన శిక్షల నుండి మినహాయింపు ఉందనే ధీమాతో సాయుధ ముఠాలు చెలరేగిపోతున్న సందర్భంలో వాటిని చదవాలి. మైనారిటీల పట్ల నేడు రాజ్యం, సమాజం ఏర్పరచిన వాతావరణాన్ని అర్థం చేసుకున్నపుడే NRC, CAA రెండింటిపై తగిన అవగాహన కలిగే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు పరిశీలనలో, ఒక నిర్దిష్ట వ్యవధిలో NRC ని పూర్తి చేయాలనే నిరంతర ఒత్తిడిలో, అస్సాం ఒక ప్రమాదకరమైన ప్రయోగానికి ప్రయోగశాల అయింది. ఫలితాలు అంచనాలను తారుమారు చేసినప్పటికీ, రిజిస్టర్ నుండి మినహాయించబడిన వారిని నిర్బంధ కేంద్రాలకు (detention centers) పంపుతారనే చర్చ వేలాది మంది ప్రజలకు పౌరసత్వం, హక్కులు కోల్పోయే అవకాశం ఉందనే భయాలను కల్పించింది. అస్సాంలో ప్రస్తుతం ఉన్న నిర్బంధ కేంద్రాలలో ఇప్పటికే ఎంతోమందిని నిర్బంధించగా కొత్తవి శరవేగంతో నిర్మించబడుతున్నాయి.
ఒక్క అస్సాంలోనే, మూడు వేల మంది ఖైదీల సామర్థ్యంతో ఒక పెద్ద నిర్బంధ శిబిరం నిర్మాణం జరుగుతోంది. మరో పది శిబిరాలు ఒక్కోటీ వెయ్యి మందికి సరిపోయేలా ప్రణాళికలు రూపొందించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నిర్బంధ కేంద్రం బెంగళూరుకు సమీపంలో ఉన్న నెలమంగళలో నిర్మించబడింది. గ్లోబల్ డిటెన్షన్ ప్రాజెక్ట్ సంస్థ భారతదేశంలో ఇప్పటికే 10 నిర్బంధ కేంద్రాలు ఉన్నట్టు, వీటిలో చాలా మటుకు 2005 – 2006 నుండే వాడుకలో ఉన్నట్టు గుర్తించింది.
CAA పర్యవసానాలు:
ఈ పరిణామాల పర్యవసానాలను అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. చట్టపరంగా, అవి భారత రాజ్యాంగంలో, పౌరసత్వ చట్టంలో (1955) పొందుపరచబడిన భారతీయ పౌరసత్వ భావనలో మౌలికమైన మార్పులను సూచిస్తాయి. మొదటిది, పౌరసత్వాన్ని జనన-ఆధారిత సూత్రం (jus soli) నుండి సంతతి-ఆధారిత సూత్రం (jus sanguinis) వైపు మార్చడం. రెండవది, మత-తటస్థ చట్టం నుండి మత గుర్తింపు ఆధారంగా విభజించే చట్టానికి మార్చడం. మరో వైపు సామాజిక కోణంలో, భారతదేశ సమాజంలోని బహుళత్వాన్నీ, వైవిధ్యాన్నీ ధ్వంసం చేసే ప్రయత్నాన్ని సూచిస్తాయి.
రాజకీయ కోణంలో, అవి రాజకీయ సమాజంలోని సభ్యత్వ నిబంధనలను పౌర-జాతీయ (civic-national)భావన నుండి జాతి-జాతీయ (ethnic-national) భావన వైపు మార్పును సూచిస్తాయి. నైతిక కోణంలో, మానవ హక్కుల పట్ల మన నిబద్ధతలోని బలహీనతలను మనకు ఎత్తి చూపుతాయి. అంతర్జాతీయ కోణంలో, ఒకవైపు శరణార్థుల గురించి, పౌరసత్వం లేని స్థితిని తగ్గించడం గురించి, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో మన దీర్ఘకాలిక విరక్తిని గుర్తుచేస్తాయి. మరోవైపు, విలువైన పొరుగు దేశంతో అతి సులభంగా ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయ మంతనాలు చేయడాన్ని గుర్తు చేస్తాయి. మన సామూహిక జీవితంలోని ప్రాథమిక అంశాలను వాళ్ళు ఎట్లా సమూలంగా మారుస్తున్నారో చూపించడానికి కొన్ని విషయాలను నేను విశదీకరిస్తాను.
ఒక రకంగా చెప్పాలంటే, శాసన సభలో పౌరసత్వంపై చర్చలను మనమిప్పుడు మరోసారి రిహార్సల్ చేస్తున్నాం. దేశ విభజన సమయంలో రాజ్యాంగంలో పౌరసత్వంపై అధ్యాయం అవసరం అయింది. అయితే అది అలాంటి అసాధారణ కాలాలలో పౌరసత్వం నిర్ణయించడానికి మాత్రమే పరిమితమైనది. రాజ్యాంగంలో ఆర్టికల్ 7 దేశ విభజన కాలంలో చెలరేగిన హింస నుండి పారిపోయి తరువాత పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చిన ముస్లింల పౌరసత్వానికి సంబంధించినది. ఆర్టికల్ 7 గురించి అప్పటి చర్చ విభజన సమయంలో ఉన్న మతతత్వ వాతావరణాన్ని ప్రతిబింబించింది. తిరిగి వచ్చే ముస్లింల విశ్వసనీయత, ఉద్దేశ్యాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన పలువురు అసెంబ్లీ సభ్యులు ఆర్టికల్ 7 ను “హేయమైన నిబంధన” అని అన్నారు.
మతతత్వాన్ని బహిరంగంగా ప్రదర్శించనప్పటికీ, అసెంబ్లీలో విభిన్న వర్గాల ప్రజలను ఉద్దేశిస్తూ వాడిన పదాలలో సూక్ష్మంగా దాగున్న మతతత్వాన్ని సులభంగా చూడవచ్చు. పాకిస్తాన్ నుండి పారిపోతున్న హిందువులను శరణార్థులుగా వర్ణించి, భారతదేశానికి తిరిగి వచ్చిన ముస్లింలను వలసదారులుగా వర్ణించారు. అసెంబ్లీ చివరికి “జాతి పౌరసత్వం అనే ఆలోచన” కు విరుద్ధంగా “జ్ఞానోదయమైన నాగరికమైన” ప్రజాస్వామిక పౌరసత్వ భావనను స్వీకరించింది. 1955 పౌరసత్వ చట్టం పుట్టుకతో పౌరసత్వం (jus soli) అనే ఆలోచనకు చట్టబద్ధమైన ఆధారాన్ని ఇచ్చింది.
కాలక్రమేణా, ప్రధానంగా అస్సాంలో రాజకీయ అశాంతి కారణంగా, ఈ భావన నెమ్మదిగా అయినా ఖచ్చితంగా సంతతి-ఆధారిత పౌరసత్వం (jus sanguinis) భావన వైపు కదులుతోంది. 19 వ శతాబ్దం నుండి అస్సాం కు ఎక్కువగా బెంగాల్ నుండి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన వలసల చరిత్ర ఉంది. అస్సాం 1947 నుండి గణనీయమైన వలసలను చూసింది, 1971 లో వలసలు గరిష్ట స్థాయికి చేరుకోగా, ఆ తరువాత స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలి దశాబ్దాలలో వలస వచ్చిన వారిలో చాలామంది కమల్ సాదిక్ “డాక్యుమెంటరీ పౌరసత్వం” అని పిలిచే పౌరసత్వాలను “నేరాల్లో సహకరించే నెట్‌వర్క్‌లు” “లాభాల కోసం పనిచేసే నెట్‌వర్క్‌ల” ద్వారా పొందారన్నది రహస్యం కాదు.
1983 లో జరిగిన ఘోరమైన నెల్లీ ఊచకోత నేపథ్యంలో, 1985 లో బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినవారికి ఓటు హక్కు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన అస్సామీ విద్యార్థుల సంస్థలు రాజీవ్ గాంధీ ప్రభుత్వంతో అస్సాం ఒప్పందంలోకి ప్రవేశించాయి. దాని మూలంగా పౌరసత్వ చట్టంలో సహజీకరణకు (naturalization) సంబంధించిన పౌరసత్వ నిబంధనలలో సవరణకు దారితీసింది. ఈ సవరణ ఒక వ్యక్తి భారతదేశానికి వలస వచ్చిన సంవత్సరం ఆధారంగా పౌరసత్వానికి అర్హత గల వర్గాలను సృష్టించింది. 1966 కు ముందు వచ్చిన వారందరినీ పౌరులుగా ప్రకటించారు. 1966-1971 మధ్య వచ్చిన వారిని ఓటరు జాబితా నుండి తొలగించి పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి 10 సంవత్సరాలు వేచి ఉండమని కోరారు. 1971 తరువాత వచ్చిన వారిని అక్రమ వలసదారులుగా భావించారు. ఈ నిబంధనలు అస్సామీల న్యాయమైన డిమాండ్లకు ప్రతిస్పందనగా వచ్చినప్పటికీ, అవి అప్పటికే వలసదారుల సమస్యను రాజకీయీకరణ, వర్గీకరణ చేసే బీజాలను కలిగి ఉన్నాయి.
మతపరమైన గుర్తింపు:
మరో వైపు , పుట్టుకతో పౌరసత్వం (jus soli) సూత్రాన్ని క్రమంగా పలుచన చేయడం, మతపరమైన గుర్తింపుపై ఆధారపడి ఉండే సంతతి-ఆధారిత పౌరసత్వపు (jus sanguinis) అంశాలను బలపరచడం వేగంగా కొనసాగుతోంది. 2004 లో పౌరసత్వ చట్టంలో జరిగిన రెండు సవరణలు మతపరమైన గుర్తింపు చట్టపరమైన పౌరసత్వానికి ప్రాతిపదికగా ఎలా పుంజుకుంటుందో చూపిస్తాయి. రెండు సవరణలూ మతాన్ని చట్టం భాషలోకి ప్రవేశపెట్టాయి, మొదటిది అవ్యక్తంగా, రెండవది స్పష్టంగా. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ పుట్టుకతో పౌరసత్వం అనే సూత్రానికి మతం ఆధారిత మినహాయింపును రహస్యంగా ప్రవేశపెట్టింది. భారతీయ గడ్డపై జన్మించినప్పటికీ, ఒక వ్యక్తి పుట్టిన సమయంలో తన తల్లి లేదా తండ్రి అక్రమంగా వలస వచ్చివుంటే, ఆ వ్యక్తి పుట్టుకతో పౌరసత్వానికి అర్హులు కాదని పేర్కొంటూ ఈ సవరణ పౌరసత్వపు jus soli ప్రాతిపదికను బలహీనపరిచింది. అస్సాంలో రాజకీయ ఆందోళనకు కారణమైన బంగ్లాదేశ్ వలసదారుల్లో ఎక్కువ మంది ముస్లింలు కాబట్టి, “అక్రమ వలసదారు” అనే పదం ఈ మతపరమైన గుర్తింపును సూచిస్తుంది.
అక్రమ వలసదారుల నిర్వచనం నుండి “పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న మైనారిటీ హిందువులను” మినహాయించడానికి పౌరసత్వ నియమాలు ఏకకాలంలో సవరించబడ్డాయి. ఈ సవరణ, మొదట, హిందూ వలసదారులకు “అక్రమ వలసదారులనే” ముద్ర లేకుండా చేసింది. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్ నుండి పశ్చిమ భారతదేశ సరిహద్దు రాష్ట్రాలలోకి వచ్చారు. వారి కోసం “అక్రమ వలసదారులు” అనే లేబుల్‌ను వదలి అధికారికంగా వారిని “పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న మైనారిటీ హిందువులు” గా అభివర్ణించారు. రెండవది, అప్పటివరకూ మత-తటస్థంగా ఉన్న చట్టంలో ఒక మత వర్గాన్ని బహిరంగంగా ప్రవేశపెట్టింది.
2016 ప్రారంభంలో అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, భారతీయ జనతా పార్టీ అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను వెళ్లగొట్టి రాష్ట్రాన్ని వారి నుండి “విముక్తి” చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది. ఇది ఒక నిర్దిష్ట మతానికి కోడ్ భాషలో సంకేతాలు ఇవ్వడమే, ఎందుకంటే బీజేపీ అదే సమయంలో ఎన్నికల్లో గెలిస్తే బంగ్లాదేశ్ హిందూ వలసదారులందరికీ భారత పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం, 2019 ఆమోదించడం ద్వారా ఈ వాగ్దానం నెరవేరుతుంది. అది మతపరమైన వ్యత్యాసంతో పౌరసత్వ చట్టం ఉల్లంఘనను చట్టబద్ధం చేస్తుంది.
ఈ చట్టం పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో మత మైనారిటీలుగా ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ లో పౌరసత్వం అందిస్తుంది. ఎంపిక చేసిన మతాలైన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు సాధారణంగా తీసుకునే 11 కి బదులుగా ఆరు సంవత్సరాలలోనే భారతీయ పౌరసత్వం పొందవచ్చు. ముస్లింలు ఈ జాబితాలో లేకపోవటం వాళ్లను ఈ మూడు దేశాలలో మైనారిటీలుగా పరిగణించరని, అందువల్ల హింసకు గురైనట్లుగా చూడలేరని స్పష్టంగా తెలుస్తుంది.
అహ్మదీయాలు, రోహింగ్యాల వంటి ముస్లిం వర్గాలు కూడా ఈ దేశాలలో హింసించబడుతున్నా వాళ్లు ఇలాంటి ప్రయోజనాలకు అర్హులు కాదు. సహజీకరణ ద్వారా పౌరసత్వంపై ప్రస్తుతం మతం-తటస్థ చట్టంలో మతం-ఆధారిత వ్యత్యాసాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, ఈ సవరణ రెండు వర్గాల పౌరులను సృష్టిస్తుంది: హిందూ లేదా ఇతర “ఆమోదయోగ్యమైన” మత విశ్వాసాలను ప్రకటించేవారు; ఇస్లాంను ప్రకటించే వారు.
అస్సాం కసరత్తు:
అస్సాంలో ఇప్పుడే ముగిసిన ఎన్ఆర్సి అవ్యక్త లక్ష్యం కూడా ఇదే. 1951 లో అస్సాంలో సేకరించిన మొదటి జాతీయ పౌరుల రిజిస్టర్ కు (NRC), రాజకీయ పర్యాలోచనలు కొత్త జీవాన్ని ఇచ్చేవరకు నిద్రాణమై ఉన్నది. 2005 లో, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్రం, అస్సాం ప్రభుత్వం, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మధ్య జరిగిన సమావేశం, అస్సాం ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడానికి ఎన్ఆర్సిని నవీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంకల్పించింది.
ఎన్ఆర్సిని అప్డేట్ చేయాలని కోరుతూ 2009 లో అస్సాం పబ్లిక్ వర్క్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది జరిగేలా కోర్టు ఒక దిశానిర్దేశం చేసింది. భారతీయులని డాక్యుమెంటరీ రుజువు ఉన్న వారందరినీ, వారి లేదా వారి పూర్వీకులు 1971 మార్చి 24 న అర్ధరాత్రి ముందు భారతదేశంలో ఉన్నట్లు రికార్డ్ చేసే లక్ష్యంతో 2015 లో ఈ కసరత్తు ప్రారంభమైంది. భారతదేశం వంటి చారిత్రికంగా లిఖిత పత్రాల్లో నమోదు కాని సమాజం, అందులోనూ వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు క్రమం తప్పకుండా వచ్చే ప్రాంతంలో, తమ పూర్వీకులను స్థాపించడానికి పత్రాలను చూపించలేనివాళ్లు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి, వలసదారులు “కాగితపు పౌరసత్వం” సంపాదించినప్పటికీ తరతరాలుగా స్థానిక నివాసులుగా ఉన్నవారు నమోదుకానివారు ఉండవచ్చు.
నమోదుకాని జాతీయులు వారి పౌరసత్వ హోదాను అన్యాయంగా కోల్పోయే అవకాశం ఉందని ఎన్ఆర్సి ఫలితం నిరూపించింది. మొదటి రౌండ్ ముగిసేసరికి, దరఖాస్తు చేసుకున్న మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల మందిలో నలభై లక్షల మంది మినహాయించబడ్డారు. 36 లక్షల మంది తాజా దరఖాస్తులు దాఖలు చేయగా ఆగస్టు 2019 లో ఆ ప్రక్రియ ముగిసేసరికి 19 లక్షల మంది ధృవీకరించబడలేదు.
ఈ ఫలితం చూసి ఎన్ఆర్సి సమర్థకులు ఆశ్చర్యపోయారు, నిరాశ చెందారు. ఎందుకంటే మినహాయించబడిన వారిలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్నారు. అంతే కాక బహిష్కరణ శాతం స్వదేశీ ప్రజలు నివసించే ప్రాంతాలలో ఎక్కువగానూ అక్రమ వలసదారులు స్థిరపడిన సరిహద్దు ప్రాంతాలలో తక్కువగానూ ఉన్నది. మినహాయించబడిన వారిలో భారత సైన్యంలో, సరిహద్దు భద్రతా దళాలాలో దశాబ్దాలుగా పనిచేసిన వ్యక్తులు, భారత మాజీ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మేనల్లుడు, అస్సాంకు ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి సయ్యదా అన్వారా తైమూర్ కూడా ఉన్నారు.
హాస్యాస్పదంగా, ఒక మాజీ ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక కార్యకర్త, ఒక స్థానిక బీజేపీ నాయకుడు కూడా మినహాయించబడ్డారు. కొన్ని సందర్భాల్లో, పిల్లల పత్రాలు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించబడ్డాయి, కాని వారి తండ్రుల పత్రాలు కాదు. ఎన్ఆర్సి ఫలితం ఊహించనిదయినప్పటికీ, అధికార పార్టీ చేసే బహిరంగ ప్రకటనలు దేశవ్యాప్తంగా రిజిస్టర్ అమలయ్యే ముప్పును తెలియజేస్తున్నాయి. అయితే ఈ పద్ధతిలో పౌరులను ‘క్రమబద్ధీకరించడానికి’ రాజ్యానికున్న సామర్థ్యం సందేహాస్పదమనేది వేరే విషయం.
ఎన్ఆర్సి వాస్తవిక ఫలితాలు ఈ కసరత్తు ఔత్సాహికుల రాజకీయ అంచనాలకు విరుద్ధంగా ఉండటంతో హిందువులెవరూ బహిష్కరించబడరని రాజకీయ ప్రకటనలు చేస్తూ వాళ్ళ భయాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించారు. వారు ఎలాగూ వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా, CAA క్రింద పౌరులుగా తిరిగి నియమించబడతారు. ముస్లిం మతానికి చెందిన నమోదుకాని భారతీయ పౌరులు, CAA నుండి ఎటువంటి సహాయం లేకుండా మినహాయించబడతారు. అయితే డాక్యుమెంట్ చేయబడిన ఇతర మతాలకు చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం లభించవచ్చు.
న్యాయ పోరాటం:
ప్రాథమిక హక్కులపై అధ్యాయంలోని ఆర్టికల్ 14, 15 లను ఉల్లంఘిస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని కోర్టులో సవాలు చేస్తే దాని రాజ్యాంగబద్ధత ప్రశ్నార్థకం అవుతుంది. “రాజ్యం ఏ వ్యక్తికీ సమానత్వాన్నీ, భారతదేశ భూభాగంలోని చట్టాల సమాన రక్షణను నిరాకరించకూడదు” అని ఆర్టికల్ 14 హామీ ఇస్తుంది. ఇది ఒక వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండటంపై ఆధారపడిన హక్కు కాదు, ఇది భారతదేశ భూభాగంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తుంది.
మత విశ్వాసం ఆధారంగా వ్యక్తుల పట్ల వ్యత్యాసం చూపడం సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది. ఆర్టికల్ 15 “మతం, జాతి, కులం ఆధారంగా మాత్రమే ఏ పౌరుడిపైనా” రాజ్యం వివక్ష చూపకుండా నిషేధిస్తుంది. పౌరసత్వం వంటి ప్రాథమికమైన అంశంలో మతపరమైన గుర్తింపును ఒక ప్రమాణంగా ప్రవేశపెట్టడం ఖచ్చితంగా సమస్యాత్మకమైన విషయం. ప్రజలను నిర్బంధ కేంద్రాల్లో ఉంచడం అనేది జీవించే హక్కుకు, స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ను ఉల్లంఘించడమే.
ఒక నిబంధన మాతృ చట్టపు నిబంధనలను ఉల్లంఘించే అవకాశం లేదనే కారణంతో కూడా నిపుణులు NRC చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. పౌరసత్వ చట్టం (Citizenship Act) ప్రకారం పుట్టుకతో పౌరసత్వం నిర్వచించడానికి ప్రమాణమైన 1987ను కట్-ఆఫ్ తేదీగా కాకుండా అస్సాం ఒప్పందం ఆధారంగా 1971 నాటి కట్-ఆఫ్ తేదీని NRC ఉపయోగిస్తుంది.
NRC, CAA లు వాటి లక్ష్యాలలో స్పష్టంగా కలిసి ఉన్నాయి. మొదటిది చాలా మంది పేద, దుర్బలులైన ప్రజలను, కేవలం వారి మతం ఆధారంగా తమ నిజమైన జాతీయతను తిరస్కరించబడే ప్రజలను, పౌరసత్వం లేకుండా చేసి వారిని నిర్బంధ కేంద్రాలకు పంపే మార్గం సుగమం చేస్తుంది. రెండవది వారి మతం ఆధారంగా మాత్రమే ఎంపిక చేయబడిన వలసదారుల సమూహాలకు పౌరసత్వం మంజూరు చేయడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఒకరు భారతీయ పౌరుడు అవునో కాదో నిర్ణయించడానికి మత విశ్వాసం ప్రత్యేకమైన ప్రమాణంగా మారింది.
ఎన్ఆర్సి, సిఏఏ ల వల్ల కొన్ని వర్గాల ప్రజలకు పౌరుల జాబితాలో చేరడానికి ప్రత్యేకాధికారాలు ఉండగా, మరికొన్ని వర్గాలు మినహాయింపునకు గురి అవుతారు. అట్లా పౌరసత్వ హక్కుల్లో భిన్న స్థాయిలను ఏర్పరచడంతో సార్వత్రిక సమాన పౌరసత్వం యొక్క రాజ్యాంగ సూత్రాన్ని బలహీనం చేసి భారతదేశాన్ని మెజారిటేరియన్ సమాజంగా మార్చగల సామర్థ్యం NRC, CAA లకు ఉంది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) చట్టపరమైన పౌరసత్వ హోదాను కోరుకునే వలసదారులకు మాత్రమే సంబంధించినది అయినప్పటికీ, ఇది వలసదారుల గురించి మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి అమలు చేస్తామనే బెదిరింపు అక్రమ వలసలు అనే ముసుగులో ముస్లిం పౌరులందరి పౌరసత్వాన్ని ప్రశ్నార్థకం చేయడానికి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. అస్సాంలో ఉన్నవారితో మొదలుపెట్టి వలసదారులు అనే సాకును దేశవ్యాప్తంగా వివక్ష చూపడానికి వాడుకుంటున్నారు. అస్సాంలో చారిత్రాత్మకంగా బహుళ అస్తిత్వాలు ఉండగా అక్కడ వలసదారుల పట్ల ద్వేషభావాన్ని కేవలం ముస్లింలపై హిందూ మనోభావాలుగా చూపించే ప్రయత్నం కపటంతో కూడుకున్నది.
సంయుక్త పార్లమెంటరీ కమిటీ మే 2018లో అస్సాంను సందర్శించినప్పుడు, అప్పటి పౌరసత్వ సవరణ బిల్లు (CAB)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వందలాది సంస్థలు పిటిషన్ వేసాయి. మతం ఆధారిత పౌరసత్వ నిబంధనలను ప్రవేశపెట్టడం పట్ల లౌకిక రాజ్యాంగ వ్యతిరేకతను మాత్రమే కాకుండా, చాలా మంది అస్సామీ మాట్లాడేవారికి, మూలవాసులైన గిరిజన సమూహాలకు వారి స్వంత భూమిలో మైనారిటీలుగా మారే భయాలను ఆ పిటిషన్ లలో వ్యక్తపరిచారు. అస్సాం పరిస్థితిని జాతీయ స్థాయి హిందూ రాజకీయ ఏకీకరణకు అన్వయించి వివరించే ప్రయత్నం ఆ రాష్ట్రంలోని భిన్న అస్తిత్వాలను సరిగా అర్థం చేసుకోకపోవడం మీద ఆధారపడి ఉంటుంది.
ఒక వైపు CAA ముస్లిం వలసదారులను ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం నుండి మినహాయిస్తుండగా, మరో వైపు పుట్టుకతో పూర్తి పౌరులుగా ఉన్న భారతీయ ముస్లింలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాన పౌరసత్వం హక్కులు రద్దు చేయబడుతున్నాయి. భారతదేశ ప్రభుత్వ సంస్థలలో వారికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, విద్య, ఉపాధి సూచికల్లో వెనకబడి ఉండడం తెలిసిన విషయాలే. గత కొన్నేళ్లుగా వారిపై సాయుధ ముఠాలు అధిక సంఖ్యలో జరుపుతున్న హింస సంఘటనలు, అలాంటి హింసకు పాల్పడినవారికి శిక్ష నుండి మినహాయింపు, వారిని రెండవ తరగతి పౌరులుగా మార్చడానికి ఒక క్రమబద్ధమైన రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాన్ని సూచిస్తుంది.
జాతీయవాదం ఛాయలు:
మతపరమైన గుర్తింపును రాజకీయం చేయడం, చట్టం ద్వారా దాన్ని ప్రకటించడం, పౌర-జాతీయత రూపంలో ఉన్న భారత జాతీయత యొక్క వ్యవస్థాపక దృష్టిని కాలరాసే సంకేతం. పుట్టుకతో పౌరసత్వం (jus soli) నుండి సంతతి-ఆధారిత పౌరసత్వం (jus sanguinis) వైపుకు పోవడం ఏకకాలంలో పౌర-జాతీయవాదం నుండి జాతి-మత జాతీయవాదం వైపు, ఒక సార్వత్రికమైన, అందరినీ కలుపుకునే జాతీయవాదం నుండి శ్రేణులుగా విభజించే మినహాయింపు రూపంలోకి మారడమే. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ప్రేరణనిచ్చి, రాజ్యాంగంలో పొందుపర్చబడిన భారతదేశం ఊహను సమూలంగా మార్చడమే.
NRC కి అంతర్లీనంగా ఉన్న వలస-వ్యతిరేకత, CAA ద్వారా “అక్రమ వలసదారులుగా పరిగణించబడేవారిలో” ఎంపిక చేయబడిన సమూహాలకు పొరసత్వం ఇవ్వడమనే సందర్భం చాలా ముఖ్యమైనది. ఇది ముస్లిం మైనారిటీల హక్కులను గణనీయంగా నిరాకరించడం, వారి పట్ల జరిగే హింసను సాధారణీకరించడం, సమర్థించడం. మరో వైపు ఈ మైనారిటీలు రోజువారీ జీవితంలో చట్టపరమైన, సామాజిక వివక్షకు గురి అయ్యే హిందూ రాష్ట్ర రూపంలో భారత దేషాన్ని పునర్నిర్మాణం చేయడం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులిస్ట్ రాజకీయ నాయకులు వలస-వ్యతిరేక, ముస్లిం-వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నారు. అయితే అక్కడితో పోల్చితే భారతదేశంలో “ఇతరులు” పూర్తిగా, చారిత్రాత్మకంగా, మౌలికంగా భారతీయులని, యూరప్ లేదా అమెరికాలో వలె ఇటీవలి కాలంలో ప్రవేశించిన అపరిచితులు కాదని చాలా అరుదుగా అంగీకరించబడింది. శ్రీలంక తమిళులు, ఆఫ్ఘన్లు, టిబెటన్ బౌద్ధులు భారతదేశానికి ఇటీవల వలస వచ్చినవారు, అయినా CAA కు ముందే, భారతదేశం వారిని ఇముడ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు. భారతీయ దేశం లాంటి బహుళమైన, వైవిధ్యమైన సమాజంలో, మతం సరిహద్దులను దేశం సరిహద్దులను మేళవించాలనే తపన 1947 విభజన తాలూకు పాత గాయాలను రేపడంతో సమానం. భాష, ప్రాంతం, కులం, మతపరమైన వర్గాల బహుళ వైవిధ్యాలను కలిగి ఉన్న సమాజంలోని సున్నితమైన సమతుల్యత దెబ్బతినకుండా దానిని సాధించలేరు.
అదే సమయంలో, భారతదేశానికి మానవ హక్కుల పట్ల నిబద్ధతలో అద్భుతమైన రికార్డు ఎప్పుడూ లేదు. మన ముందున్న సమస్య ఒక వివాదాస్పదమైన విషయాన్ని గుర్తుచేస్తుంది, హానా అరెండ్ట్ (Hannah Arendt) తన పుస్తకం ‘ది ఆరిజిన్స్ ఆఫ్ టోటాలిటేరియనిజం’లో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తించారు. పౌరసత్వం లేని సందర్భాల్లో మనిషి యొక్క సార్వత్రిక, శాశ్వతమైన హక్కుల కోసం దావా వేయడం, పోరాడడం సాధ్యం కాదని అరెండ్ట్ వాదించింది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో, కోటి మంది పౌరసత్వం లేని ప్రజలు తమ మానవ హక్కుల కోసం విజ్ఞప్తి చేయగల అంతర్జాతీయ సంస్థ లేదు. ఎందుకంటే ఏదో ఒక రాజకీయ సమాజంలో సభ్యుడు కాని మనిషికి అలాంటి హక్కులు అందుబాటులో ఉండవు.
రాజకీయ సమాజాన్ని కోల్పోవడం అంటే మానవత్వం కోల్పోవదమే, ఎందుకంటే రాజకీయ సమాజంలో సభ్యత్వం, అంటే పౌరసత్వం మాత్రమే, ప్రజలకు “హక్కులను కలిగి ఉండే హక్కు”ను ఇస్తుందని అరెండ్ట్ అంటారు. న్యాయపరమైన ఉనికిని కోల్పోవటమంటే నైతిక ఉనికిని కోల్పోవటంతో సమానం. హక్కులు అనేవి ఒక సమాజంలో అనుభవించడానికి ఉద్దేశించినవి. హక్కులు లేనివారు ఏ సమాజానికీ చెందినవారు కానందున, వారికోసం ఎటువంటి చట్టాలూ ఉండవు, ఎవరికీ వాళ్లను అణచివేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే నాజీలు యూదులను నిర్బంధ శిబిరాలకు పంపే ముందు వాళ్ల పౌరసత్వాన్ని రద్దు చేశారు.
అస్సాంలో, ఎన్ఆర్సి తరువాత, ఇప్పటికే ఆరు నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 1,145 మంది దుర్భర పరిస్థితులలో నివసిస్తున్నారు; వాళ్లలో 335 మంది మూడేళ్లుగా శిబిరాల్లో ఉన్నారు; నిర్బంధ శిబిరాల్లో “విదేశీయులు” అని ప్రకటించిన 25 మంది ఇప్పటికే మరణించారు; పేపర్లు లేవనే భయంతో 33 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ కేంద్రాల్లో పరిస్థితులు మెరుగుపరచాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, భారతదేశ రాజ్యాంగ విలువలను, మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న ఇటువంటి నిర్బంధ కేంద్రాల ఆలోచనే ఒక నైతిక ఆందోళన కలిగిస్తుంది. ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేయడం అనేది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (Universal Declaration of Human Rights) ప్రకారం దేశాలు పాటించవలసిన విధిని స్పష్టంగా ఉల్లంఘించడమే.
అదే సమయంలో, “చెదపురుగులు”, “చొరబాటుదారులను” బంగ్లాదేశ్ కు తిరిగి పంపించే రాజకీయ ప్రసంగాలు అంతర్గత విషయమనీ, నిజానికి బహిష్కరణ జరగదని బంగ్లాదేశ్ తో అత్యున్నత ప్రభుత్వ స్థాయిలో ఒప్పందం చేసుకున్నారు. వాస్తవానికి, నేడు అభివృద్ధి చెందుతున్న బంగ్లాదేశ్ ఆర్థిక సూచికల దృష్ట్యా భారతదేశం నుండి బంగ్లాదేశ్ కంటే బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి తక్కువ వలసలు జరుగుతున్నాయనే అంచనాలకు దారితీస్తుంది. ఇప్పటికే, 11 లక్షల మంది అక్రమ భారతీయ వలసదారులతో, భారతదేశానికి డబ్బులు పంపే దేశాల్లో బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల మధ్య రెండు వైపులా వలసలు జరుగుతున్నాయి కాబట్టి, రెండు దేశాలూ గెస్ట్-వర్కర్ వీసాల ఆధారంగా పరస్పరం ఆమోదయోగ్యమైన ఏర్పాటు చేసుకోవచ్చు.
మరోవైపు, ఎన్ఆర్సి చట్టబద్ధమైన పౌరులను అక్రమ వలసదారులుగా, అక్రమ వలసదారులను పౌరసత్వం లేని వ్యక్తులుగా మారుస్తున్న సందర్భంలో; CAA ఎంపిక చేసిన అక్రమ వలసదారులకు చట్టబద్ధత ఇస్తున్న సందర్భంలో; కపట చట్టాలతో మైనారిటీలను రెండవ తరగతి పౌరులుగా మారుస్తున్న సందర్భంలో, భారతదేశం, దాని రాజ్యాంగ విలువలు మాత్రమే కాకుండా దాని నైతిక దిక్సూచి కూడా తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి.
- ”ది ఇండియా ఫోరం”(ఇండిపెండెంట్ ఆన్ లైన్ మ్యాగజీన్) లో ప్రచురితం
అనువాదం: చైతన్య చెక్కిళ్ల