సిరియాకు సాంత్వన లభించేనా ?

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన అసద్‌ కుటుంబ పాలన సిరియాలో ముగిసింది. అరబ్‌ సోషలిస్టు బాత్‌ పార్టీ నేత, అధ్యకక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలన 2000 జూలై 17 నుంచి 2024  డిసెంబర్‌ 8 వరకు సాగింది. అంతకు ముందు బషర్‌ తండ్రి హఫీస్‌ అల్‌ అసద్‌ 1971 మార్చి  14 నుంచి 2000 జూన్‌ పది (మరణించే) వరకు అధికారంలో ఉన్నాడు.   మధ్యప్రాచ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పూర్వపు సోవియట్‌ యూనియన్‌,  తరువాత రష్యా పాలకులు సిరియాకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. సిరియా పరిణామాల్లో రష్యా, అమెరికా రెండూ తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నితంచాయి. సిరియాను అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా పెద్ద ఎత్తున తిరుగుబాటుదార్లను ప్రోత్సహించింది. 

అరబ్‌ స్ప్రింగ్‌ (2011)లో భాగంగా సిరియాలోనూ  శాంతియుతంగా మొదలైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని బషర్‌ అల్‌ అసద్‌ సర్కారు అణచి వేసింది. పదమూడేళ్ల నుంచి సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం అకస్మాత్తుగా తిరుగుబాటుదారులు పైచేయి సాధించడం ఆశ్చర్యకరమే. అనూహ్యమైతే కాదు. ఇంతకాలం ఉద్యమకారులకు మద్దతుగా అమెరికా,  ఐరోపా సమాఖ్య అసద్‌ ప్రభుత్వంపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా, ఇరాన్‌లు అసద్‌కు అండగా నిలిచాయి. యుక్రెయిన్‌ యుద్ధంలో తలమునకలైన తరువాత రష్యా అసద్‌ ప్రభుత్వానికి ఆయుధాలు పంపలేకపోయింది. సిరియాలో మోహరించిన తన దళాలనూ యుక్రెయిన్‌ యుద్ధ రంగానికి తరలించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో హమాస్‌, హిజ్బొల్లా దళాలతో పాటు వారి మద్దతుదారైన ఇరాన్‌ కూడా బలహీనపడిపోయింది. ఆర్థిక సంక్షోభంతో సిరియా ప్రభుత్వం పోలీసులకు, సైనికులకు జీతాలు చెల్లించలేకపోయింది. దాంతో వారు ఆయుధాలు పడేసి నిష్క్రమించారు. తిరుగుబాటుదారులకు ఎదురే లేకపోవడంతో సునాయసంగా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించారు. అసద్‌ భార్యాపిల్లలతో రష్యా వెళ్ళిపోయాడు.

ప్రాక్‌, పశ్చిమ సంస్కృతుల సంగమ స్థలిగా, వాణిజ్య కూడలిగా, చేతివృత్తులకు కాణాచిగా అయిదు వేల సంవత్సరాల ఘన చరిత్ర సిరియా సొంతం. కానీ, వర్తమానంలో అదో శిథిల రాజ్యం… నిలువెల్లా నెత్తుటి గాయాలూ తడి ఆరని కళ్లతో శాంతికోసం అల్లాడుతున్న అసహాయుల దేశం!  ఏడున్నర  దశాబ్దాల క్రితం ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన సిరియా రాజకీయ అస్థిరతకు, తిరుగుబాట్లకు పేరుమోసింది. అలాంటి ఒక సైనిక తిరుగుబాటు ద్వారా 1970లో అధికారాన్ని కైవసం చేసుకున్న హఫీజ్‌ అల్‌ అసద్‌ అసమ్మతిని అణచివేస్తూ, ఎదురులేని నియంతగా అవతరించారు. ఆయన మరణానంతరం పదవిలోకి వచ్చిన బషర్‌ క్రూరత్వంలో తండ్రినే మించిపోయారు. 

రష్యా, ఇరాన్‌, అసద్‌ కొమ్ముకాయగా అమెరికా మిత్రపక్షాలు సిరియా విపక్ష సైన్యాలకు దన్నుగా నిలిచాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన 1990 దశకం తరువాత ”ఆపరేషన్‌ టింబర్‌ సైకామోర్‌” (అంటే, అమెరికా సిఐఎచే నిర్వహించబడే ఆయుధ సరఫరా, సైనిక శిక్షణ కార్యక్రమం. ఇది 2013లో సిరియన్‌ అంతర్యుద్ధంలో బషర్‌ అల్‌ అసద్‌ను అధికారం నుంచి దించడానికి చేపట్టిన కార్యక్రమం. అయితే ఇది 2016లో సిరియా ప్రజలకు తెలిసింది) పేరుతో అమెరికా భారీ మొత్తాలను సిరియాలో కుమ్మరించింది. ఉదారవాద తిరుగుబాటుదార్ల ముసుగులో 2013 నుంచి 2017 వరకు నాలుగు సంవత్సరాలలో అమెరికా సిఐఏ ద్వారా వివిధ సంస్థలకు వంద కోట్ల డాలర్లకు పైగా అందచేసిందని అంచనా. అమెరికా మిలిటరీ కూడా 50 కోట్ల డాలర్లతో తిరుగుబాటుదార్లకు శిక్షణ, ఆయుధాలను అందచేసింది. ఇవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి.

అమెరికా మద్దతు ఇచ్చిన మిలిటెంట్‌ సంస్థలన్నీ అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, గూండాయిజాలతో కొట్టుకు చచ్చాయి. అల్‌ఖైదాకు ఆయుధాలు అమ్ముకున్నట్లు విమర్శిస్తున్నారు. ఈ శక్తులు అసద్‌ మీద ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ సమాజంతో చర్చలకు నెడతాయని అమెరికా ఊహించినదానికి భిన్నంగా అసద్‌ బలమైన శక్తితో అనేక నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిరియాలో మాజీ అమెరికా రాయబారి (2011-2014) రాబర్ట్‌ స్టీఫెన్‌ పోర్డ్‌ చెప్పాడు. అమెరికా నుంచి నిధులు పొందిన ఫ్రీ సిరియన్‌ ఆర్మీ వంటి సంస్థలు చివరకు టర్కీ అనుకూల సిరియన్‌ నేషనల్‌ ఆర్మీగా మారిపోయాయని, వారు కుర్దులపై అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడటంతో అదే అమెరికా చివరికి మానవ హక్కులకు భంగం కలిగించారనే పేరుతో ఆంక్షలు విధించింది. 

బషర్‌ అల్‌ అసద్‌, ఆయన తండ్రి పాలనలో సిరియా దాదాపు 50 ఏళ్ల పాటు చిత్రహింసలు అనుభవించింది. 13 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో మగ్గింది. భద్రత దళాల హింసలో లక్షలాది మంది అమాయకులు చనిపోయారు. సైన్యం ప్రజలపై రసాయన ఆయుధాలను ప్రయోగించింది. దాదాపు మూడు లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. మరెందరో శరణార్థులుగా వలస బాట పట్టారు. అసద్‌ పాలనలో సిరియా దుర్భర పరిస్థితులను చవిచూసింది. 90 శాతం ప్రజలు దారిద్య్రరేఖ దిగువకి చేరారు.  ప్రజలకు 24 గంటల కరెంట్‌ అందుబాటులో లేదు. మందులు లేవు. పెట్రోలుకి రేషన్‌ ఉంది. బ్రెడ్‌ కొనుక్కోవటానికి గంటల తరబడి లైన్‌లో నిలబడాలి.  చాలామందికి ఉపాధి లేదు. పొట్ట చేత పట్టుకుని ఎక్కడెక్కడికో వెళుతున్నారు. ఒక కోటి ఇరవై లక్షల మంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. సిరియా పౌండ్‌ దాని విలువలో 99 శాతం కోల్పోయింది. రాజధాని నగరమైన డమాస్కస్‌ మినహా దేశంలో ఏ నగరాన్ని చూసినా ఇప్పుడు యుద్ధం మిగిల్చిన విధ్వంసపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశాన్ని పునర్నిర్మించటానికి 250 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా.

అసద్‌ పాలన ముగియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అసద్‌ క్రూరమైన నియంతృత్వం పతనమైంది. నియంత పాలనకు తెరదిగడంతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయనీ, మంచికాలం ముందున్నదనీ సిరియన్లు ఆశించి సంబరపడటంలో తప్పులేదు. సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో ఆఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్లలానే ఇక్కడ ఇస్లామిస్ట్‌ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. సిరియాను ప్రజాస్వామిక దేశంగా మలచేందుకు కృషి చేస్తామంటూ తిరుగుబాటుదారులు హామీనివ్వడం చిమ్మచీకటిలో వెలుగురేఖగా తోస్తున్నది. అయితే, దేశ పునర్నిర్మాణం ఎలా జరుగుతుందన్నదే ప్రధాన ప్రశ్న.

అసద్‌ను పదవి నుంచి తొలగించి సున్నీ పాలనను స్థాపించాలనే లక్ష్యంతో పోరాడిన హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌టిఎస్‌) డిసెంబర్‌ 8న విజయం సాధించింది. రెండో తిరుగుబాటు బృందం సిరియన్‌ డెమాక్రటిక్‌ ఫోర్సెస్‌ కుర్దుల మిలిటెంట్ల సమూహం. మూడోది అటు అసద్‌నూ, ఇటు కుర్దులనూ వ్యతిరేకించే సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ. సిరియాలో రెబెల్‌ గ్రూపుల్లో  ప్రధానంగా హెచ్‌టిఎస్‌కు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. సిరియన్‌ నేషనల్‌ ఆర్మీకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, సైన్యాన్ని అందించటంతో పాటు రాజకీయంగా కూడా మద్దతుగా నిలిచింది. అలాగే సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) గ్రూపునకు వ్యతిరేకంగా అమెరికా పోరాడుతోంది. సిరియా మిలటరీ స్థావరాలపై ఇటీవల కాలంలో అనేకమార్లు ఇజ్రాయెల్‌ మిస్సైల్‌ దాడులు చేసింది. అసద్‌ పతనం తర్వాత ఇజ్రాయెల్‌ తన సైనిక విస్తరణవాద ఎజెండాను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రాంతీయ అస్తిరతను సద్వినియోగం చేసుకుంటూ తన దూకుడును పెంచింది.  ఆగ్నేయ ప్రాంతంలోని క్వెనిత్రాలోని రోడ్లు, విద్యుత్‌ ప్రసార సాధనాలు, వాటర్‌ నెట్‌వర్క్ ను ధ్వంసం చేసింది. 

పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పై జిహాదిస్టులు  తిరుగుబాటు చేసి పదవీచ్యుతున్ని గావించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చమురు సంపన్నమైన ఈ ప్రాంతంలో రష్యా, ఇరాన్‌ పలుకుబడిని దెబ్బతీసి, తన ఆధిపత్యానికి ఎదురు లేకుండా చూసుకోవాలన్న అమెరికా దుష్ట పన్నాగంలో భాగమే సిరియాలో అసద్‌పై తిరుగుబాటు. ఇంతకుముందు అరబ్‌ ప్రపంచంలో వర్ణ విప్లవాలను అమెరికా ఎలా ప్రోత్సహించినదీ చూశాం. సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు గత దశాబ్దిన్నర కాలంగా అమెరికా కుట్రలు పన్నుతూనే ఉంది. తీవ్రవాదంపై పోరాడుతున్నట్లు బయటకు ఫోజు పెట్టే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కపట వైఖరి సిరియాలో మరోసారి బట్టబయలైంది. అసద్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అల్‌ఖైదా మూలూలున్న జిహాదిస్టు గ్రూపులకు సామ్రాజ్యవాద దేశాలు అధునాతన ఆయుధాలు, డబ్బు ఇచ్చి ఎలా ఎగదోసిందీ అందరికీ ఎరుకే. ఒకప్పుడు అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసిన హెచ్‌టిఎస్‌ను తీవ్రవాద సంస్థగా ముద్ర వేసినా, ఇప్పుడు హెచ్‌టిఎస్‌ నేతలతో బైడెన్‌ ప్రభుత్వం టచ్‌లో ఉంటోంది. యూఎస్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్‌ దీనిపై మాట్లాడారు. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలన్నారు.

సిరియాలో అసద్‌ నిష్క్రమణ వెనుక ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తుల పాత్ర తక్కువేమీ లేదు. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌టిఎస్‌) అధినేత అబూ అహ్మద్‌ అల్‌ అల్వాని (వలీద్‌ జస్సేమ్‌ అల్‌ అల్వాని) అమెరికా కస్టడీలో అయిదేళ్లు ఉండి 2011లో సిరియాలో తలెత్తిన తిరుగుబాటుకు ముందు విడుదలయ్యాడు. ఆ తిరుగుబాటును లేవనెత్తడంలో అల్వానీ పాత్ర ఉంది. హెచ్‌టిఎఎస్‌,  ఫ్రీ సిరియన్‌ ఆర్మీ, స్థానిక తీవ్రవాద గ్రూప్‌ను అన్నిటినీ కలుపుకుని సిరియన్‌ నేషనల్‌ అలయెన్స్‌ పేరుతో కూటమి ఏర్పాటు చేసి అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడమే ఏకైక ఎజెండాగా సిరియాలో అలజడి సృష్టించాడు. గత నవంబర్‌ 28న ఇడ్లిబ్‌లో మొదలైన తిరుగుబాటు అలెప్పో, హామ్‌ పట్టణాలను ఒక్కొక్కదానిని వశపరచుకుంటూ రాజధాని డమాస్కస్‌ను డిసెంబర్‌ 7 రాత్రి ముట్టడించడం జరిగింది. పరిస్థితి తీవ్రతను గమనించిన అధ్యకక్షుడు అసద్‌ హింసను నివారించేందుకు శాంతియుతంగా అధికార బదలాయింపునకు వీలుగా దేశం వీడి కుటుంబంతో సహా రష్యాకు వెళ్లిపోయారు. సిరియా ప్రధాని జలాలీ  అధికార మార్పిడిలో తిరుగుబాటుదారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో రాజ్యాధికారం ఇప్పుడు జిహాదిస్టుల చేతుల్లోకి వచ్చింది. తహ్రీర్‌ అల్‌-షామ్‌, ఆధిపత్య ప్రతిపక్షవర్గం, సిరియన్‌ సాల్వేషన్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి మొహమ్మద్‌ అల్‌-బషీర్‌కు పరివర్తన పరిపాలనకు నాయకత్వం వహించే బాధ్యతను అప్పగించింది. ప్రస్తుతం 2026 నాటికి ఎన్నికైన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 

తిరుగుబాటు నాయకుడు అబూ మహ్మద్‌ అల్‌ జోలానీ నేతృత్వంలోని హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌టిఎస్‌) ఒక ప్రకటన చేస్తూ ‘ఈ రోజుతో ఒక చీకటి శకం ముగిసింది. కొత్త శకానికి నాంది పలుకుతున్నాం’ అని పేర్కొంది. సిరియాలో చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలపై రష్యా, ఇరాన్‌, ఇరాక్‌ తదితర పశ్చిమాసియా దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, అమెరికా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలు దీనిని స్వాగతించాయి. సిరియాలోని డమాస్కస్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ప్రభుత్వ ప్రసార కేంద్రాలతో సహా కీలకమైన కేంద్రాలను వశపరచుకున్న తర్వాత తిరుగుబాటు దళ కమాండర్‌ అహ్మద్‌ అల్‌ షరా మొదటిసారి జాతినుద్దేశించి టెలివిజన్‌లో ప్రసింగిస్తూ, ప్రభుత్వ సంస్థలు వేటితోను మిలిటరీ అప్రోచ్‌ కాకూడదని హుకుం జారీ చేశారు. అధికారికంగా అధికార మార్పిడి జరిగేంత వరకు మాజీ ప్రధాని మహ్మద్‌ అల్‌ జలాలీ ఆధ్వర్యంలోనే పరిపాలన ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ దేశ ప్రధానిగా జొలానీ, విదేశాంగ మంత్రిగా అసద్‌ హసన్‌ అల్‌-షీబానీ, రక్షణ మంత్రిగా ముర్హాఫ్‌ అబూ కస్రా నియమితులయ్యారు. వీరందరు హెచ్‌టిఎస్‌ నాయకుడు అహ్మద్‌ అల్‌ షారాకు మిత్రులు.

సిరియాలో అనిశ్చితి!

డిసెంబర్‌ ఎనిమిదో తేదీన అధ్యక్షుడు అసద్‌ పదవి నుంచి తప్పుకొని రష్యాలో ఆశ్రయం పొందటం, టర్కీ మద్దతు ఉన్న హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌టిఎస్‌) సాయుధ బృందం అధికారాన్ని చేపట్టడంతో దశాబ్దాలుగా అంతర్యుద్ధంలో ఉన్న సిరియాలో మరో అధ్యాయం మొదలైంది. ఇప్పటికే చింపిన విస్తరిలా తలా ఒక ప్రాంతాన్ని అదుపులో ఉంచుకున్న శక్తుల పాత్ర ఏమిటో స్పష్టంగాక ముందే ఇజ్రాయెల్‌ మరోసారి దాడులకు తెగబడింది. మరోవైపు అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాద సంస్థ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని బైడెన్‌ మీడియాతో అన్నారు. అలా జరుగగూడదనే వైమానిక దాడులు చేశామన్నారు. అక్కడ అసలేం జరుగుతోందో వివరాలు బయటి ప్రపంచానికి తెలియటం లేదు. రకరకాల వ్యాఖ్యానాలు, వార్తలు వెలువడుతూ గందరగోళంలోకి నెడుతున్నాయి. పొంతన లేని ఈ సమాచారంలో ఏది నిజమో, ఏది కాదో వెంటనే నిర్ధారించటం కష్టం. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇంతవరకు ఏ దేశమూ గుర్తించలేదు. పశ్చిమాసియాలో భాగమైన సిరియాతో సరిహద్దులు కలిగి ఉన్న టర్కీ, ఆర్మీనియా, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలో కుర్దులు అనే తెగ నివసించే ప్రాంతాలతో కలిపి మధ్యలో కుర్దిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్నది అమెరికా దీర్ఘకాలిక ఎత్తుగడ.

కుర్దుల ప్రాంతాలలో కొన్ని న్యాయమైన సమస్యలున్న మాట నిజం. వాటికి స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటుతో సహా ఆయా దేశాల పరిధిలో పరిష్కారం చూడాలన్నది ఒక అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక దేశం ఏర్పాటు కాకూడదని ఆయా దేశాలు, ఏది ఏమైనా తమకు ఒక మాతృభూమి ఉండాలని కుర్దులు థాబ్దాల తరబడి సాయుధ సాయుధ పోరాటం చేస్తున్నారు, అణచివేతకు గురవుతున్నారు. సిరియాలో తన పథకాన్ని అమలుచేసేందుకు కుర్దులతో పాటు ఐఎస్‌, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలను అమెరికా ప్రోత్సహిస్తున్నది. వందల కోట్ల డాలర్లు, ఆయుధాలను కుమ్మరిస్తున్నది. ఆ క్రమంలోనే సిరియాలో చమురు, గ్యాస్‌ నిల్వలు, పంటలు పండే ప్రాంతాలను ఫ్రీ సిరియన్‌ ఆర్మీ సాయుధుల పేరుతో అమెరికా ఆక్రమించటమే గాక అక్కడ మిలిటరీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన హెటిఎస్‌ సాయుధులు టర్కీ మద్దతుతో ఎప్పటి నుంచో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. మరోవైపు గోలన్‌ గుట్టల ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. ఇటీవలి వరకు అధికారంలో ఉన్న అసద్‌ ప్రభుత్వ మిలిటరీ, మద్దతు ఇచ్చే సాయుధ బృందాల ఆధీనంలో రాజధాని డెమాస్కస్‌, తదితర ప్రాంతాలు ఉన్నాయి. 

ఒకప్పటి అల్‌ఖైదా నేత అహ్మద్‌ అల్‌ షరా తన గతాన్ని, పాత మారు పేరును వదిలించుకొని సిరియా పగ్గాలు చేపట్టారు. ఈ పరిణామాలు అంతర్యుద్ధంతో పదిహేనేండ్ల కాలంపాటు కకావికలమైపోయిన సిరియాకు శాంతిని ప్రసాదించగలవా? లేక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందా అనేదే ప్రశ్న. ఆసద్‌ ప్రభుత్వ పతనం తర్వాత జరుగుతున్న కొన్ని పరిణామాలు కలిగిస్తున్న ఆందోళనే ఇందుకు కారణం. సిరియాపై ఆధిపత్యం కోసం విభిన్న గ్రూపుల మధ్య విబేధాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేం. తీవ్రవాద సంస్థ అల్‌ఖైదాకు ఒకనాటి శాఖ అయిన హెచ్‌టిఎస్‌ లక్ష్యం సిరియాను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే. సున్నీలు, షియాలు, క్రైస్తవులు, అలవిలు, డ్రూజ్‌లు తదితర మతాల  ప్రజలు సహజీవనం చేసే ప్రాంతాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దడంలో నియంతఅసద్‌ నేతృత్వంలోని బాత్‌ పార్టీ విశేషమైన కృషి చేసింది.  ఇంతలోనే సిరియాకు చెందిన గొలాన్‌ హైట్స్‌ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్‌ భీకర దాడులు ప్రారంభించింది. 1967లో యుద్ధం తరువాత కుదిరిన ఒప్పందం ప్రకారం ఏర్పాటైన గొలాన్‌ హైట్స్‌ బఫర్‌ జోన్‌లోకి ఇజ్రాయెల్‌ చొరబడడంపై అరబ్‌ లీగ్‌ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఆపాలని ముక్తకంఠంతో అవి డిమాండ్‌ చేస్తున్నా అమెరికా, వాటి మిత్ర పక్షాలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. సిరియా పరిణామం తరువాత ఈ ప్రాంత రాజకీయ భౌగోళిక స్వరూపంలో పెనుమార్పులు చేటుచేసుకునే అవకాశముంది. తిరోగామి మతవాద శక్తుల చేతుల్లో సిరియా భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. 1970లో అధికారంలోకి వచ్చిన హఫీజ్‌ అల్‌ అసద్‌ను ఆధునిక సిరియా నిర్మాతగా పేర్కొంటారు. ఆయన వారసుడిగా 2000లో పగ్గాలు చేపట్టిన తనయుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలనలో పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. సుమారు కోటి 20 లక్షల మంది వలసపోయారు. ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా రోజులు నెట్టుకొస్తున్నారు.

సిరియాలో ఐసిస్‌ మళ్లీ విజృంభిస్తుందా ? :

బషర్‌ అసద్‌ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్‌ ప్రభావం ఎక్కువ. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌) తీవ్రవాదసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇప్పుడు హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ హెచ్‌టిఎస్‌ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టిఎస్‌ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్‌ విస్మరిస్తోంది. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్‌ తీవ్రవాదం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టిఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. తీవ్రవాద సంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్‌ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. తీవ్రవాద మూలాలున్న వ్యక్తికి యావత్‌ దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 

నేటివరకు అంతర్జాతీయ శక్తుల ప్రచ్ఛన్న యుద్ధానికి సిరియా వేదికగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్‌ తమ తమ ప్రాబల్యం కోసం సిరియాలో రకరకాల శక్తులను వెనకేసుకు వచ్చాయి. యుక్రెయిన్‌ యుద్ధంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా మద్దతు తగ్గించడం వల్లనే అసద్‌ ప్రభుత్వం పతనమైందని చెప్పవచ్చు. సిరియాలో అసద్‌ ప్రభుత్వం పతనం తరువాత మరింత కరుడుగట్టిన ఇస్లామిక్‌ శక్తులు దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చని పాశ్చాత్య, అరబ్‌ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. హయత్‌ తహ్రీర్‌ -అల్‌-షామ్‌ (హెచ్‌టిఎస్‌) జిహాదీ మిలిటెంట్ల నేతృత్వంలోని ప్రతిపక్ష దళాలు డమాస్కస్‌తో సహా ప్రధాన నగరాలపై నియంత్రణు సాధించాయి. సిరియాలో స్పష్టమైన అధికారం లేకపోవడం అస్థిరత, తీవ్రవాదానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో అమెరికా ఇజ్రాయెల్‌, ఇతర అరబ్‌ శక్తులు బలపడుతున్నాయి. వివక్ష శక్తులు ఎంతగా ఛిన్నాభిన్నమయ్యాయో, సిరియాను ఎలా పాలించాలో, బహుళ వర్గాలు, జాతుల సమూహాలతో కూడిన దాని సంక్లిష్ట జనాభాను ఎలా నిర్వహించాలో ప్రస్తుతానికి స్పష్టమైన ప్రణాళిక లేదు. 

షియా-సున్నీ విబేధాలు, రష్యా-అమెరికా తగాదాలకు నెలవుగా మారిన సిరియా ఇప్పుడు జిహాదీ  శక్తుల చేతుల్లోకి వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా శాంతి ఎండమావిగా మారి, అంతర్జాతీయ తీవ్రవాదం పెచ్చరిల్లేందుకు ఆస్కారం ఉన్నది. ఇది సిరియాకే కాకుండా యావత్తు ప్రపంచానికి సమస్యగా పరిణమించవచ్చు. ఇందుకు మనకు ఆఫ్ఘానిస్తాన్‌, ఇరాక్‌ ఉదాహరణలు ఉండనే ఉన్నాయి. 2017లో రష్యా, ఇరాన్‌, టర్కీ ఆధ్వర్యంలో చేపట్టిన అస్తానా శాంతి చర్చల క్రమాన్ని కొనసాగించాలి. ఉద్రిక్తతలు తగ్గించి, మానవతా సహాయం చేరవేతకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడం, రాజకీయ చర్చలకు వీలు కల్పించడం అనే త్రిముఖ వ్యూహంతో ఆ చర్చలు మొదలయ్యాయి. 22 విడుతల చర్చలు జరిగినా నిర్వాహకులు ప్రత్యర్థి వర్గాలను చెరోవైపున సమర్థిస్తుండటంతో పెద్దగా పురోగతి సాధ్యపడలేదు. 

ముగింపు :

సున్నీలు షియాలు, కుర్దులు, అలవైట్లు, డ్రూజ్‌లు, క్రైస్తవులు సిరియాలో జీవిస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోట్లాడుకునే తీవ్రవాద గ్రూపుల కారణంగా రానున్న రోజుల్లో పాక్షిక ఘర్షణలు తీవ్రమవడం తథ్యం. ఈ పరిస్థితి దిగజారి మరో అంతర్యుద్ధం చోటు చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. అసద్‌ ప్రభుత్వ పతనం తర్వాత ఆశలు పెట్టుకున్న సిరియా ప్రజలకు అది ప్రమాదకరంగా మారనుంది. మరోవైపు తమ మహాధిపత్య దురాశలను నెరవేర్చుకోవడానికి గాను సిరియాను ఒక రంగ స్థలంగా ఉపయోగించుకోవడానికి అమెరికా సామ్రాజ్యవాదులు, యూదు జాత్యహంకారులు చొరబడడానికి చేసే ప్రయత్నాలకు సిరియా ప్రజలు అవకాశం ఇవ్వకూడదు. 

ఆర్థికంగా చితికిపోయిన సిరియాలో ఏర్పడే ఏ ప్రభుత్వమైనా పూర్తిగా విదేశీ సహాయంపై ఆధారపడాల్సిందే. సిరియా కొత్త ప్రభుత్వంలో ఛాందస భావజాలం కలిగిన హెచ్‌టిఎస్‌ ప్రధాన పాత్రధారిగా ఉండనుంది. ఈ భావజాలమంటే గిట్టని సౌదీ అరేబియా, యుఎఇలు ఆర్థిక సహాయానికి ముందుకు రాకపోవచ్చు. ఖతర్‌ మాత్రం నిధులు ఇవ్వవచ్చు. అసద్‌ల పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు, ప్రజాస్వామిక వ్యవస్థను పాదుగొల్పేందుకు ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకు రావాలి. అంతర్యుద్ధాలతో దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోవడంతో దేశ జనాభాలో 80 శాతం మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. వారికి మానవతాసాయం అందించడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యం. శాంతి, సౌభాగ్యం, ప్రజాస్వామ్యం, విభిన్న సంస్కృతులు, జాతులు, మతాలతో కూడిన వైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఐక్యంగా ముందుకు సాగడం నేడు సిరియా ముందున్న అతి పెద్ద కర్తవ్యం. ఇందుకోసం సిరియాలోని లౌకిక, ప్రజాతంత్ర శక్తులు సాగించే పోరాటానికి అంతర్జాతీయ కార్మిక వర్గం బాసటగా నిలవాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply