గుండె నిండా బాధ కళ్ల నిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు. కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి. ఉండీ ఉండీ ఉధృతమయ్యేందుకు ఉద్వేగభరితమైన సన్నివేశం కావాలి…
సరళమైన భాష నుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు, కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు.
కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి, కెమెరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి, నానాటికీ దారిద్య్రమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి… చితికి… చివరికి ‘సిటీ లైఫ్’ పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండి.
ఒకప్పుడు పచ్చపచ్చగా బతికినవాణ్ని ఇప్పుడు పత్రహరితం కోల్పోయిన పిచ్చి మొక్కలా… అస్థిపంజరంలా… అసంపూర్తి వాక్యంలా తయారవ్వడానికి గల అనేకానేక కారణాల్లో ఒక నయవంచకుడు నాకు తలపెట్టిన ద్రోహాన్ని కూడా చేర్చవచ్చు. అయితే ఇప్పుడా వివరాలన్నీ తవ్వుకోవడం సముచితం కాదుగానీ… క్రమేణా కంప్యూటర్ల సుడిగుండంలో పడి చిక్కి మునిగిపోయే ముందు విద్యానగర్ బస్టాప్ పక్కన మెయిన్ రోడ్‌లో ‘చిత్రలేఖ’ పేరున నాకో చిన్న స్టూడియో ఉండి ఉండేది. మనిషి బతికుండగానే గుండెల్లో స్ట్రా గుచ్చి రక్తం పీల్చే ఈ రాక్షస వ్యవస్థలో అతికష్టంగా ఆరు సంవత్సరాలు ఆ స్టూడియోను నడిపిన పర్యవసానానికి దాదాపు నలబై వేల రూపాయల విలువకట్టగల నా చెమట నా యజమానైన ఒకానొక మార్వాడీ గాడి జేబులోకి ఇంకిపోయిందే తప్ప నాకు లాభించిందేమీ లేదు. పైగా అన్నమాట ప్రకారం అప్పులు చెల్లించేందుకు కరీంనగర్‌లో కన్నతండ్రి కట్టించిన ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
మధ్యతరగతి కౌగిట్లో మాధుర్యం కూడా తరిగిపోయి పరిపరి విధాల మానసిక వేదనతో పాటు పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం.
మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయి పోయింది. పుట్టిన గడ్డ నుంచి ఇక్కడికి రావటమే పొరపాటయి పోయింది.
వాస్తవానికి` అవసరానికి నన్ను వినియోగించుకున్న వాళ్లే నాపై జాలీ నోటులా జాలి కురిపించి కుళ్లిన ఆసుపత్రిలా పక్కనజేరి పరామర్శించినా నా నించి ఏమీ ఆశించని వాళ్లే నాకెంతగానో సహకరించారు. ‘ఐసోనెక్స్’ నుంచి ‘సైక్లో సెరిన్’ వరకూ ఉచితంగా మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో వి.వి., ఎ.ఎన్., నిఖిలేశ్వర్, నిమ్స్ మధు, వెంకట్, చక్రపాణి, గచ్చు మీద పచ్చనోటులా మోగే నిజాం వెంకటేశం, గంగారెడ్డి మొదలుకొని గద్దర్, కాళోజీల వరకూ, మా తమ్ముడు దయాకర్, దయామయుడు డాక్టర్ పి.పి.ఆర్. భాస్కర్‌రావు, డాక్టర్ రవీంద్రారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి (సాయిరాం నర్సింగ్‌హోం), డాక్టర్ రామచంద్రారెడ్డి (సంఘం నర్సింగ్ హోం), డాక్టర్ విజయకుమార్, ప్రొఫెసర్ వేణు, ఆయుర్వేద వైద్యులు ప్రధ్యుమ్నాచార్య నీలంగేకర్, రాధాకృష్ణమూర్తి ఇంకా ఎందరో మృత్యువు బారి నుంచి నన్నెప్పటికప్పుడు సంరక్షిస్తూ వస్తున్నారు. ఆక్స్‌ఫర్డు గ్రామర్ స్కూల్ అధినేత వేదకుమార్ మామీద చిలకరించే సానుభూతి జల్లులే మా పిల్లల చదువై కొనసాగుతుంది.
అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లి ఆరునెలల్లో అవలీలగా నయం చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి నా రెండు ఊపిరితిత్తుల్నీ పాడుచేసింది. దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది స్ట్రెప్టోమైసిన్, క్యానమైసిన్ ఇంజక్షన్‌లు నా ఒంటిమీద స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది.
మరీ సందర్భంగా ఖరాఖండిగా ఓ నిజం చెప్పాల్సేవుంది. ఎడతెరిపిలేని దగ్గు, అడుగు కదపనివ్వని ఆయాసం, రక్తం ముద్దలుగా పడుతున్న రోజుల్లో కూడా నేను కవిత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నాలోని విలువల్ని భగ్నం చేసుకోలేదు. నా ప్రాపంచిక దృక్పథాన్ని వీడి ఏ ప్రలోభాలకు లోబడలేదు. ఆఖరికి కాలి ధూళితో సమానమైన కలర్ సినిమా గ్లామర్‌ను సైతం నా కళ్లల్లో పడకుండా జాగ్రత్తపడ్డానే తప్ప ఎటువంటి కుళ్లు మార్గాలకు తలవొగ్గలేదు. మనోహరాకాశంలో ఎగిరే కొంగ మొదలుకుని మదరాసులోని కొంగర జగ్గయ్య వరకూ నా కవిత్వాన్ని అమితంగా ప్రేమిస్తారని తెలుసు.
అలిశెట్టి ప్రభాకర్‌కు పాత చెత్త కవుల్లాగా శాలువాలు కప్పించుకోవాల్సిన అవసరమెప్పుడూ కలగదనే ఆత్మవిశ్వాసం కలిగిన ఎమ్వీయల్ ఆనాడే ఆంధ్రదేశపు అనేకానేక సభల్లో నన్నూ, నా కవిత్వాన్నీ పలవరించి, పలవరించి పదైదులు నిండకుండానే ఈ ప్రపంచాన్ని విస్కీ సీసాలా తన్నేసి వెళ్లిపోయాడనీ తెలుసు. అయినా నేనేనాడూ పొగడ్తలను పోషక పదార్థాలుగా స్వీకరించి ఉబ్బి తబ్బివ్వలేదు. సగం సగం కమ్యూనిస్టుల సాహవాస దోషం లేకున్నా సహపంక్తి భోజనాల్లో కూర్చున్నట్లే కూర్చొని ఒకర్నొకరు అనుమానాస్పదంగా చూసుకొనే సాహిత్య సభల్లోకి తరచూ వెళ్లకున్నా అడపా దడపా జననాట్య మండలి గుండె చప్పుడు వినో అరుదుగా కదిలే జన మైదానాలను కనో ప్రతిస్పందించే నాకు మెజార్టీ ప్రజల బాధలూ గాధలే ముడిసరుకయ్యాయి.
చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ని, ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలూ రాత్రీ యాస్బెస్టాస్ రేకుల కింద ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ని. నరకప్రాయమైన నగర నాగరికతకు నరనరానా జీర్ణించుకున్నవాణ్ని. రోజుకో రెండు కవితా వాక్యాలు రాయలేనా… అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్‌కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిది ఆణిముత్యం కాదని అందరికి తెలుసు. కవిత్వమే పాత్రికేయ వృత్తిలో అంతర్భాగమైన ఈ రోజుల్లో ‘న్యూస్ ప్రింట్’ మీద రోజూ నా పేరు అచ్చు కావడం పెద్ద విశేషమూ కాదు.
‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్ ఎడిషన్ వెలువడుతున్న సందర్భంగా ఆప్యాయంగా నన్ను పిలిచి ఈ శీర్షిక ‘సిటీ లైఫ్’నప్పగించింది ఎ.బి.కె. ప్రసాద్ గారే అయినా ఆనాటి నుంచి ఆరేళ్లుగా, ధారావాహికంగా ప్రచురించబడటానికి సౌమ్యులూ, సౌహార్ధ్ర హృదయులైన మా నండూరి రామమోహనరావు గారు, ఎం.డి.జగదీష్ ప్రసాద్, ఆంక్షలేవీ విధించని ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ బోర్డే కారణం. ముఖ్యంగా నగరం పొలిమేరలు దాటని ఈ శీర్షికను తెలంగాణ జిల్లాలకు విస్తరింపచేసిన ఐ.వెంకట్రావు గారు అభినందనీయులు. అంతేకాదు నెలకు ఏ ఒకటి, రెండుసార్లో ఆఫీసుకెళ్ళినా మురళి, శ్రీనివాస్, గుడిపాటి, రవికిషోర్ ఎవరెదురైనా ‘‘అన్నా! ఆరోగ్యం బావుందా?’’ అని ప్రేమతో పలకరించి అరకప్పు ‘టీ’ తాగించే సబ్‌ఎడిటర్ మిత్రులూ, సంధ్యా సమయాన టెలిప్రింటర్ల మీద వార్తలు నెత్తురోడుతున్న సందట్లో సైతం ‘సిటీ లైఫ్’ను ఫోనులో చెప్పినా చక్కగా రిసీవ్ చేసుకునే ఆంజనేయులు, చిన్ని రామకృష్ణ, ఇంకా నర్సిమ్, భూషణ్, లే అవుట్ ఆర్టిస్టులు.
సమయానికి ప్రెస్‌కందించే జైహింద్, జనసత్యం లాంటి తమ్ముళ్ల సహకారముండబట్టే నా అనారోగ్యం కూడా అడ్డంకి కాకుండా ‘సిటీ లైఫ్’ ఇలా నిర్నిరోధంగా సాగిపోతుంది. సిటీ లైఫే నా సమగ్ర కవితా స్వరూపానికి కొలబద్దా కాదు. సుదీర్ఘ కవితా ప్రకంపనా కాదు… కానీ ధ్వంసమై పోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్నీ నిరసించటంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికల్లాంటి చిన్న చిన్న కవితలెన్నో ప్రతిరోజూ ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకందించగలుగుతున్నాను.
రోజుకో మందు బృందంలో పాల్గొని పలుచబడిపోతున్న సాహిత్య భ్రష్టుల కోసమో, అవార్డుల కోసం క్యూలో నిలబడే అర్భకుల కోసమో, ఇస్త్రీ నలక్కుండా విప్లవ సందేశాల్ని అందించే మేధావుల కోసమో, కవిత్వంలోనూ జీవితంలోనూ ద్వంద్వ ప్రమాణాలనవలంబించే దౌర్భాగ్యుల కోసమో కాక, సామాన్య పాఠకుడి కోసమే ఈ సిటీ లైఫ్‌ని ప్రచురించటానికి పూనుకున్నామని చెప్పొచ్చు.
సామాజిక స్పృహ కలిగిన రచనల సరసన చేర్చిన ఈ ‘సిటీ లైఫ్’ ముద్రణకు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ‘సినారే’నే దీనికి మొదట శ్రీకారం చుట్టినా ఈ ప్రచురణా కార్యక్రమం మొదలైనప్పటి నుంచీ మూడుసార్లు ఆస్పత్రిలో చేరి డిశ్చార్చి కావటం. అరవై బొమ్మల కోసం అతి సన్నిహితుడైన నర్సిమ్ చుట్టూ ఆరు నెలలు ప్రదక్షిణ చేయాల్సి రావటం, బ్రోమైడ్‌లు అనుకున్న విధంగా రాకపోవటం, లై అవుట్ ఆర్టిస్టులైన నారాయణ, శ్రీనివాసులు చెరో గంట పనిచేసి చెప్పాపెట్టకుండా పారిపోవటం… ఇటువంటి చిన్నా పెద్దా సమస్యలెన్నో ఎదుర్కొన్నా వాటినధిగమించడానికి తోడ్పడిన మిత్రులు రాధాంజనేయ స్వామి (యు.ఎస్.జి.సి), ఉదయ భాస్కర్, జయధీర్, తిరుమలరావు, రాజమౌళి, పెన్మెత్స రాజు, మాధవి, కవిత్వం విషయంలో ప్రత్యేకాభిమానం చూపించే పద్మజా విద్యాసాగర్‌లు, పవన్, ఆనంద్, ప్రవీణ్‌లు, కవితాత్మీయులు స్మైల్, ఆర్కె, నవీన్, మల్లారెడ్డి, నాగేశ్వర్‌రావులు, నరేష్, హరీష్ విజన్ గ్రాఫిక్స్ మిత్రులు ఆనంద భాస్కర్ మరియు శ్రీనివాస్, ప్రెస్ కార్మికులకు హృదయపూర్వకాభివందనాలు తెలుపుతూ అతి సమయమనంగా వ్యవహరించి ముద్రించగలిగినప్పటికీ ఎంతో కొత్త అసంతృప్తి నాలాంటి వాడికి మిగిలిపోతూనే వుంటుంది. ఏమైనప్పటికీ అలల హోరులా అంతరంతరాల్లో రగులుతున్న ఈ సిటీ లైఫ్ నేపథ్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ చిన్ని కవితా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ…
ప్రేమతో
మీ అలిశెట్టి ప్రభాకర్
4 జులై 1992
(‘సిటీ లైఫ్’ కవితా సంకలనం ముందుమాట నుంచి…)