గురిజాల రవీందర్ గారు చాలా ఆలస్యంగానైనా ఇప్పుడు రాసిన “బొగ్గు రవ్వలు” సింగరేణి కార్మికోద్యమ అనుభవాలు తప్పక చదువ తగిన పుస్తకం. ఈ పుస్తకములో ఒక చోట చెప్పినట్లుగా చైనాలోని యేనాన్ ప్రావిన్స్లో యాంగ్జీ నదీలోయ, అడవి ప్రాంతాలల్లోని ‘ఆనూన్’ బొగ్గు గని కార్మికులు చైనా నూతన ప్రజాస్వామిక విప్లవంలో, ప్రసిద్ధమైన లాంగ్ మార్చ్లో క్రియాశీలంగా పాల్గొన్న కార్మిక వర్గం. గోదావరి తీర ప్రాంతంలో చుట్టూ అడవులు విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గుగనులలో కూడా భారతదేశంలో ఆరంభమైన నక్సల్బరీ నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమంలో బొగ్గుగని కార్మికులు తమ శక్తి మేరకు లీనమై పోరాడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా వందకు పైనే అమరులై అనేక త్యాగాలతో విప్లవోద్యమానికి కార్మిక వర్గ నాయకత్వం అందిస్తున్నారు. రైతాంగం, ఆదివాసీ ప్రజలతో కలిసి కార్మిక, కర్షక, రాజ్యాధికారం కోసం విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్నారు.
అలాంటి మహత్తర కార్మిక వర్గ పోరాటంలో తొమ్మిది సంవత్సరాలు రాడికల్ యువజన సంఘం నాయకుడిగా, సింగరేణి కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా బహిరంగంగా -నిర్బంధంలో అజ్ఞాతంగా పని చేసిన వారు రవీందర్. రవీందర్ 1986లో అజ్ఞాత జీవితం వీడి బయటకు వచ్చారు. విద్యావేత్తగా, మిత్రులతో కలిసి సి.వి. రామన్ (నోబెల్ బహుమతి గ్రహీత) పేరుతో కేజీ టు పీజీతో పాటు రవీంద్ర మోడల్ స్కూల్ (ఇంగ్లిష్ మీడియం) స్థాపించి మూడు దశాబ్దాలు (1988-2018) విద్యార్థులకు విద్యనందించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రారంభ నాయకులుగా తెలంగాణ అంతా తిరిగి వందలాది సభలల్లో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రవిది అలుపెరుగని పోరుబాటే. సింగరేణి ప్రాంతంలోనే కాక తెలంగాణ వ్యాప్తంగా గురిజాల రవీందర్ తెలియని వారు లేరు. అందుకే రవీందర్ తన ప్రజాస్వామిక ఉద్యమాల అనుభవం కూడా తప్పక రాయాల్సి ఉన్నది.
సింగరేణి విప్లవోద్యమంలో నుండి దాదాపు ప్రపంచంలో బొగ్గు గనుల మీద ఏ భాషలో రానంత సాహిత్యం వచ్చింది. అయితే ముఖ్యంగా సింగరేణిలో పని చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పి.చంద్, మోతె శంకర్ (అమరుడు సాగర్) లాంటి వాళ్ళు కథలు నవలలు రాశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సింగరేణి కార్మికోద్యమం నిర్మించి సాయుధ పోరాటంలో అమరుడైన కామ్రేడ్ శేషగిరి, పి. చంద్ రాశారు. కార్మికుల్లో ఈ నవల విశేష ఆదరణ పొందింది.
ఉత్తర తెలంగాణలో ఆవరించి ఉన్న సింగరేణి గనుల ప్రాంతంలోనే కాదు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం గ్రామీణ ప్రాంతాలల్లో సికాస అంటే తెలియని వారుండరు. ఎప్పుడు, ఎక్కడ దౌర్జన్యం జరిగినా పీడితులు ధైర్యంగా పీడకులతో తమ వెనుక సికాస ఉందని చెప్పుకుంటే పీడకులు వణికి పోయేవారు. ఇప్పటికీ ఇలాంటి స్థితి కొనసాగుతోంది. తన పుస్తకంలో రాసినట్లుగా సింగరేణి ప్రాంతంలో దొరలు, గుండాలు, గని అధికారులు, వ్యాపారస్తులు, కార్మిక సంఘాలు, కార్మికులను పీల్చి పిప్పి చేసిన ఒక భయానక వాతావరణంలో యాభై ఆరు రోజుల సమ్మె నుండి సికాస పుట్టింది. అల్లకల్లోలంగా, ఆరాచకంగా పరమ దుర్మార్గంగా ఉండే కాలరీ వాతావరణంలో రాడికల్ విద్యార్థులు, ఆ తరువాత సికాస తమ విరోచిత, త్యాగ పూరితమైన పోరాటాలతో కార్మికులను మనుష్యులుగా నిలబెట్టారు. నిలబెట్టడమే కాదు, అర్థవలస, అర్ధ భూస్వామిక భారతీయ సమాజాన్ని మార్చి కార్మిక, కర్షక రాజ్యాధికారాన్ని సాధించడానికి, నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమానికి నాయకులుగా తర్ఫీదు నిచ్చారు.
అప్పటికే రైతాంగ పోరాటాల నుండి, ఆదివాసీ పోరాటాల నుండి పోరాట యోధులు వనజ (నర్సక్క) రాసిన ‘అడవి పుత్రిక’, సాధన రాసిన ‘సరిహద్దు’ ‘రాగో’ నవలలు వచ్చాయి.
ఇలాంటి మహత్తర పోరాటంలో పాల్గొన్న రవీందరు కూడా సింగరేణి కార్మికోద్యమం, సికాస గురించి రామయని నేను కలిసినప్పుడల్లా కోరుతున్నాను. మన కాలపు మహత్తరమైన కార్మిక వర్గ పోరాటం గురించి ముఖ్యంగా కార్మిక వర్గ పార్టీ నిర్మాణం గురించి పీడిత ప్రజలు, విద్యార్థులు, భారతదేశ కార్మిక వర్గం ఆసక్తిగా చదువుతారు. పోరాట యోధులకు ఒక పాఠంగా కూడా ఉంటుంది.
రవీందర్ సహచరుడు – విప్లవోద్యమ నిర్మాత మహమ్మద్ హుస్సేన్ సింగరేణి గురించి ‘సింగరేణి పోరాటాల నెత్తుటి త్యాగాలు’ పేర ఉద్యమం గురించి ఐదు సంవత్సరాల క్రితం పుస్తకం రాశారు. అది ఇంగ్లిష్ కూడా అనువాదమై విశేష ఆదరణ పొందింది. దేశ విదేశాల దాకా ప్రాచుర్యం పొందింది.
ఇటీవల ‘తల్లులు – బిడ్డలు’ నవల ఇప్పటిదాకా జరిగిన సింగరేణి పోరాట నేపథ్యంలో వెలువడింది. ఈ పుస్తకం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విశేష ఆదరణ పొందింది.
పి. చంద్ పదిహేను నవలలు, రఘోత్తమరెడ్డి ఒక నవల ‘నల్ల వజ్రం’, ఇటీవల నేను రాసిన ‘సైరన్’ లాంటి నవలలు వచ్చాయి. అనేక పాటలు, జీవిత చరిత్రలు, విశ్లేషణలు, సింగరేణి గనుల నుండి సాహిత్యం విరివిగా వచ్చింది. ఇవి భారతీయ సాహిత్యంలోనే విలువైన కార్మిక వర్గ సాహిత్యం, కొంత ఆలస్యంగా వచ్చిన కూడా ఈ పుస్తకం సింగరేణి కార్మికోద్యమం గురించిన తొమ్మిది సంవత్సరాల చరిత్రను, రవీందర్ తను అందులో భాగమై తన అవగాహన పరిమితుల మేరకు రాశాడు. తప్పక చదువతగిన పుస్తకం.
తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమం (1969), నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు, ఆదిలాబాద్, కరీంనగర్ రైతాంగ పోరాటాలు, సింగరేణి కార్మికోద్యమం, ఆ తరువాత మలి దశ తెలంగాణ ఉద్యమం మా తరానికి పాఠశాలలు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం, గతితార్మిక చారిత్రిక భౌతిక వాదం, యాభై సంవత్సరాల విప్లవోద్యమం ఈ ప్రాంతంలో, మన కాలంలో లక్షలాది మంది యువకులను శాస్త్రీయంగా తీర్చిదిద్దాయి.
అలాంటి చైతన్యంతో రవీందర్ జీవితం పొడుగుతా… అనేక ఉద్యమాల్లో తన వంతు కర్తవ్యంగా పోరాడుతూ, నిత్య నిర్బంధంలో సైతం తనకు వీలైనంత మేరకు ప్రజల పక్షంలో నిలబడుతున్నారు.
అలుపెరుగుని రవీందర్ నుంచి వారి అనుభవాల నుండి స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ…
ప్రేమతో…