సాహిత్యం లో అంబేద్కర్ తాత్వికత ప్రభావం గురించి చర్చించే క్రమంలో ముందు అంబేద్కర్ కు ఒక తాత్విక దృక్పధం ఉందా, ఉంటే ఏమిటిది ఎలా అనే విషయాల్ని వివారంగా తెలుసుకోవాలి. ఆ తరువాతే అది మన సాహిత్యం లో ఎట్లా ప్రతిఫలించిందో చూడొచ్చు. కనుక ఈ వ్యాసం మొదటి భాగం అంబేద్కర్ తాత్వికత గురించి చర్చిస్తుంది. రెండవ భాగం దాని సాహిత్య ప్రతిఫలనం గురించి విశ్లేషిస్తుంది. ప్రస్తుతం మొదటి భాగం ఇస్తాను.
అంబేద్కర్ తాత్విక దృక్పధం
సాధారణంగా అంబేద్కర్ అనగానే రాజ్యాంగ నిర్మాత అనో, దళిత బాంధవుడు అనో, ఆర్ధిక నిపుణుడు అనో, కులనిర్మూలనా యోధుడనో, బహుజన రాజ్యాధికార మూలపురుషుడనో ఇంకా ఇలాగే చాలా రకాలుగా ఆయనను విశ్లేషిస్తూ వుంటారు. ఆయన తాత్విక దృక్పధం గురించి పెద్దగా మాట్లాడరు. మాట్లాడినా రెండుమాటల్లో తేల్చిపడేస్తారు. అంబేద్కర్ ఆలోచనలకు ఒక చూపు ఉంది. ఒక తాత్విక దృక్కోణం ఉంది అని ఊరుకుంటారు. నిజానికి మొత్తం మానవ ప్రపంచ తాత్వికతనీ, భారతీయ వ్యవస్థ ప్రత్యేక విధానాన్నీ ఆయన విశ్లేషించిన తీరునూ అందులో భాగంగా ఆయన చేసిన తాత్విక సూత్రీకరణలనూ పరిశీలించడం ద్వారానే ఆయన తాత్వికత మనకి అర్ధమయ్యేది.
ప్రపంచంలో ఒక మనిషి మీద మరొక మనిషి అధికారానికీ, యాజమాన్యానికీ, పీడనకీ కారణం మూడు విషయాలకు చెందిందని అంబేద్కర్ స్పష్టం చేస్తారు: అవి మతం, సాంఘిక హోదా, సంపద. ఈ మూడు అంశాలకూ ఒక మనిషి జీవితాన్నీ, స్వతంత్రతనూ ప్రభావం చేయగల శక్తి ఉన్నదనీ కాకపోతే తత్కాల సామాజిక సందర్భాన్ని బట్టి దేని ప్రభావం మిగతా వాటికంటే ప్రబలంగా ఉంటుందనేది నిర్ధారితమవుతుందనీ విశ్లేషిస్తారు అంబేద్కర్. “Religion, social status, and property are all sources of power and authority, which one man has, to control the liberty of another. One is predominant at one stage; the other is predominant at another stage. That is the only difference.” ఒక నిర్దిష్ట సమాజంలో, ఒక నిర్దిష్ట కాలంలో అధికార వనరు సాంఘిక హోదాకీ, మతానికీ చెందినదయినపుడు ఆ సాంఘిక మతపరమైన సంస్కరణ ద్వారానే మిగిలిన సంస్కరణలు సాధ్యపడతాయని స్పష్టం చేసారు. తను చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రపంచ చరిత్ర నుంచీ, భారత చరిత్ర నుంచీ సరైన ఆధారాల్ని అంబేద్కర్ చూపించారు. యూరోపియన్ల రాజకీయ విముక్తికి లూథర్ మత సంస్కరణ దారినిచ్చిందని చెబుతారు. ప్యూరిటనిజమ్ అనే మతవాదం అటు ఇంగ్లండులోనూ ఇటు అమెరికాలోనూ తీసుకొచ్చిన రాజకీయస్వేచ్ఛనూ స్వతంత్రతనూ ఈకోణం నుంచే చూస్తారు అంబేద్కర్. అయితే ఆధునిక ఐరోపాలో ఆర్థిక సంబంధాలే మానవసంబంధాల్ని నిర్ణయిస్తున్నాయనీ ఆ మేరకు సంపద మనిషి పీడనకూ దోపిడీకీ కారణమవుతుందనీ గుర్తించారు. అందుకే తన కాలం ఐరోపా గురించి మార్క్స్ చేసిన విశ్లేషణ కరెక్టని ఒప్పుకుంటారు. అరబ్బుల రాజకీయ ఏకీకరణకూ, అధికారానికీ మహమ్మద్ ప్రవక్త తీసుకొచ్చిన మత విప్లవం కారణమవటాన్నీ మరువకూడదంటారు.
భారత చరిత్ర కూడా ఇదే దృక్కోణానికి సాక్ష్యమవుతుందనీ విపులంగా వివేచించి చూపారు. బౌద్ధం తీసుకొచ్చిన మత సాంఘిక విప్లవం మౌర్య సామ్రాజ్య రాజకీయ మార్పులకు నేపథ్యంగా పనిచేసిందని నొక్కి చెబుతారు. అసలు ప్రాచీన భారత దేశ చరిత్రంతా బుద్ధిజానికీ-హిందూయిజానికీ జరిగిన సంఘర్షణలమయమనీ విశ్లేషిస్తూ, బుద్ధిజం బ్రాహ్మణిజం మీద విప్లవంగా ముందుకొస్తే, తరువాత హిందూయిజం బుద్ధిజం మీద ప్రతీఘాతుక తిరుగుబాటుగా వచ్చిందనీ అంబేద్కర్ సాధికారికంగా వివరించారు. భారతీయ చరిత్రకు చెందినంతవరకూ ఈ పరిశీలన పెద్ద బ్రేక్ తౄ అని చెప్పొచ్చు. అలాగే శివాజీ తీసుకొచ్చిన రాజకీయ విప్లవం వెనుక మహారాష్ట్ర సాధువులు నడిపిన సాంఘిక విప్లవం ఉందని వాదిస్తారు. ఇక నిత్యజీవితంలో సాధారణ సాధువులూ, బాబాలూ, స్వాములూ, ఫకీర్లూ జనం మీద వేసే ప్రభావంలో నెరిపే అధికారంలో ఉన్నది సాంఘిక హోదా ద్వారా వారికి లభించిన ఆధిపత్యమేననీ; ఆస్తుల్ని కూడా అమ్ముకొని, అప్పులు జేసి పుణ్య క్షేత్రాలకు వెళ్ళే సంస్కృతి సాంఘికమయినదే కానీ ఆర్థికమయినది కాదనీ గుర్తింపజేస్తారు అంబేద్కర్. రాజకీయ నాయకుల మీదా, జడ్జీల మీదా, వ్యాపారుస్తుల మీదా, బ్యూరోక్రాట్ల మీదా బ్రాహ్మణ పురోహితులు కలిగి ఉన్న పట్టులో కానివ్వండీ, ఏ చిన్న ఆందోళనయినా ఇక్కడ వెంటనే మతం మలుపు తీసుకోవడంలో కానివ్వండీ కనిపించేది ఇక్కడి మత-సాంఘిక వ్యవస్థ ఆధిపత్యమేననీ మనకి అర్థం చేయిస్తారు.
కులాలకు అంటగట్టిన విలువలకూ గౌరవాలకూ అనుగుణంగా ఆయా కులస్తులకు ఆదాయన్నీ, ఆర్థిక వసతినీ సమకూర్చే కుల వ్యవస్థ భారతీయ ఆర్థిక వ్యవస్థను రూపొందించి నడుపుతుందని అంబేద్కర్ అనితర సాధ్యంగా నిరూపించారు. ఆర్థిక వ్యవస్థను కులవ్యవస్థ నడుపుతున్న కారణంగానే ఇక్కడ శ్రమ విభజనే కాకుండా ఎక్కడా లేని శ్రామికుల విభజన ఏర్పడిందని తాత్వీకరించారు అంబేద్కర్. ‘The caste system is not only a division of labour. It is also a division of labourers’ అనే అంబేద్కర్ సూత్రీకరణ భారతీయ వ్యవస్థని సరిగా అర్థం చేసుకోడానికి పనికొచ్చే తాత్త్విక కొలమానం. చరిత్రను ఆర్థిక విశ్లేషణకు పరిమితం చేసిన వారికి గొప్ప సవాల్ ఈ సూత్రీకరణ. పీడిత కులాలకు మనుధర్మం అంటగట్టిన వృత్తులే వారి పేదరికానికి కారణమనీ, అవే వారి అధికార లేమికీ, ఆత్మగౌరవ భంగానికీ కారణమనీ వివరించి చూపారు. మరోపక్క పీడక కులాల వృత్తులే వారి సంపదకూ, అధికారానికీ కారణమౌతున్న తీరును చూపారు. కుల వృత్తుల్ని పక్కన బడితే భారతదేశ ఆర్ధిక వ్యవస్థే లేదని నిరూపిస్తూ విస్తారమైన వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో మార్క్సిస్టులకు ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించారు. కొంతమంది అధికారానికీ, ఆర్థిక ఉన్నతికీ – మరికొంతమంది అగౌరవానికీ, పేదరికానికీ కారణమయిన కుల వ్యవస్థను కూలదోయకుండా ఇక్కడి ఆర్థిక వ్యవస్థను మార్చగలరా? భారత కార్మిక వర్గాన్నీ, పీడిత వర్గాన్నీ విప్లవంలో ఐక్యం కాకుండా అడ్డుపడుతున్నదేంటి? విప్లవానంతరం తమను మిగతా పైకులాల వారు గౌరవంగా సమానంగా చూస్తారనే భరోసా ఇక్కడి విప్లవ చోదక శక్తులకు ఉందా? లేనప్పుడు ఆ భరోసాను ఎలా కలుగజేయాలి? పీడనను పీడితులే సంరక్షించే ఏర్పాటును, అవమాన భారతాన్ని అవమానితులే కాపలా కాసే చట్రాన్ని, ఆకలిని ఆకలిలో దహించుకుపోయేవాళ్ళే కాపాడే దుస్థితిని పకడ్పందీగా పరిపాలించటంలోనే కులవ్యవస్థ క్రూరత్వం ఉంది. ఈ వైచిత్రిని నిరంతరం నడపడానికి కారణం కుల వ్యవస్థ సృష్టించిన గ్రేడెడ్ ఇనీక్వాలిటీలో ఉందని అంబేద్కర్ బయటపెట్టారు. అసమానుల మధ్య అంతరాల్ని పట్టుకు రావడం, అంతర శ్రేణులమధ్య నిచ్చెనమెట్ల అధికార సోపాన భ్రమల్ని కలిగిస్తూ పీడితుల్ని వాస్తవాలవైపు దృష్టి మళ్ళనీయకుండా చేయటంలోనే దోపిడీని శాశ్వతంగా శాసనీకరించిన కులవ్యవస్థ తత్వం ఉందని గుర్తించడం అంబేద్కర్ తాత్వికతకు హైలైట్. మార్క్సిస్టులు తరచూ చెప్పే పునాది-ఉపరితలాల సంబంధాన్ని భారత వాస్తవికతనుంచి చూస్తూ అంబేద్కర్ చేసిన విశ్లేషణ చూడండి. ‘ఆర్థిక సంబంధాల పునాదిమీద మత, సాంఘిక, రాజకీయ సంస్థలతో కూడిన మేడ నిలబడుతుంది అంటే పునాది ఎంత నిజమో మేడా అంతే నిజం. మనం పునాదిని మార్చాలనుకుంటే ముందు ఆ పునాది మీద నిర్మితమయిన మేడను కూలదోయాల్సి ఉంటుంది. అట్లాగే సమాజంలో ఆర్థిక సంబంధాల్ని మార్చాలనుకున్న వాళ్ళు అమలులో ఉన్న సాంఘిక రాజకీయ ఇతర సంస్థల్ని నిర్మూలించాలి’. ‘కమ్యూనిస్టు భ్రమ’ అనే శీర్షికలో రాసిన వ్యాసంలోని ఈ భాగం అంబేద్కర్ తాత్వికతను స్థూలంగా పట్టిస్తుంది. మార్క్సిస్టులకు వారి లాజిక్ నుంచే వారు తెలుసుకోవాల్సిన తాత్విక ఎరుకను అంబేద్కర్ ఇక్కడ అందించారు.
కులవ్యవస్థకు దైవ సమ్మతిని అంటగట్టిన హిందూ పవిత్ర గ్రంథాల్నీ అందులోని తాత్వికతనీ ఎండగడుతూ అంబేద్కర్ వెలువరించిన రచనలు ఈ దేశ ప్రగతివాదులకే కాదు అన్ని దేశాల మేధావులకీ అనుసరణీయం. పవిత్ర గ్రంథాలు ప్రజల మనసుల్లో చిమ్మిన విష భావజాలంతో యుద్ధం చెయ్యమని ఆయన ఇచ్చిన పిలుపు కుల నిర్మూలనకొక తాత్విక పరిష్కారం. కులాంతర వివాహాలు మరొక పరిష్కారం. సాంఘిక హోదా ఆర్థిక స్థాయిని నడుపుతున్న వ్యవస్థకు విరుగుడుగా రిజర్వేషన్లకు ముందుకు తెచ్చారు అంబేద్కర్. పీడిత కులాలు హిందూ మతాన్ని వదిలి వెయ్యటం అసలు సిసలు పరిష్కారమనీ – బుద్ధిజం హిందూయిజానికి ప్రత్యామ్నాయమనీ అంబేద్కర్ విశ్లేషించారు. బుద్ధిజాన్ని స్వీకరించారు. రాజకీయ రంగంలో పీడిత కులాల రాజ్యాధికార భావనను తీసుకురావడంలో ఇమిడి ఉంది కూడా తాత్విక దృష్టే. ‘The emancipation of the mind and the soul is a necessary preliminary for the political emancipation of the people.’
ఒక పక్క హిందూ పవిత్ర గ్రంథాల్లో, శాస్త్రాల్లో నమ్మకం ఉంచుకుంటూనే మరోపక్క ఉదారంగా ప్రగతిశీలంగా ఆధునికంగా ఉన్నామని ఎవరయినా అనుకోవడంలో వైరుధ్యం ఉన్నదని అంబేద్కర్ వాదన. గాంధీవాదులకీ, లెఫ్ట్‌వింగ్ హిందువులకీ ఇది వర్తిస్తుంది. గాంధీ విషయంలో ఆశ్చర్యం కలగక పోయినప్పటికీ ఎస్ఏ డాంగే విషయంలో అంబేద్కర్ చాలా ఆశ్చర్యాన్నీ దిగ్భ్రమనీ పొందారు. 1928లో బాంబే ప్రెసిడెన్సీలో జరిగిన కార్మికుల సమ్మె సందర్భంగా, కార్మికుల్లో దళిత కులాలకూ, మిగతా కులాలకూ మధ్య ఉన్న ఉద్యోగ హోదా వివక్షను రూపుమాపాలని అంబేద్కర్ డాంగేకు సూచించారు. దళితుల్ని వీవింగ్ సెక్షన్‌కు రానివ్వని వివక్షను రద్దు చేయడానికి డాంగే ఒప్పుకోరు. ఇది బ్రాహ్మణవాదం నుంచి బయటపడని అగ్రకుల కమ్యూనిస్టు నాయకుల మనస్తత్వానికి నిదర్శనంగా అంబేద్కర్ పసిగట్టారు. అందుకే నమ్మకం, విశ్వాసం, మూఢతల స్థానంలో హేతువు, వివేకం, వివేచనను అంబేద్కర్ బలపరిచారు. బుద్దిస్టు తత్వాన్నీ, యూరోపియన్ వికాసవాదాన్నీ కలపడం ద్వారా బుద్ధ భారతాన్ని నిర్మించాలని కాంక్షించారు. ఆయన సంపాదకత్వం వహించిన న్యూస్ పేపర్‌కి అంబేద్కర్ పెట్టిన పేరు ‘ప్రబుద్ధ భారత’. అంబేద్కర్ స్వీకరించిన బుద్ధిజం హిందూయూకరించబడిన బుద్ధిజం కాదు. అది ‘నవయాన’ బుద్ధిజం. అది ప్రపంచాన్నీ, సామాజిక రుగ్మతల్నీ అర్థం చేసుకునే ఒక పద్ధతి. ఒక జీవన విధానం. ప్రపంచాన్ని పునర్ నిర్మించే సాధనం ‘The purpose of Dhamma is to reconstruct the world’ అని అంబేద్కర్ ప్రకటిస్తారు.
ప్రస్తుత ప్రపంచాన్ని చూసినప్పుడు అటు ఆర్థికాన్నీ ఇటు రాజకీయాన్నీ ఒక ఊపు ఊపుతున్న మత బలాన్ని గమనిస్తాం. భారత దేశంలో సెక్యులరిజాన్ని చీదరించుకునే రాజకీయాల వెనుకా, ఆవు మాంసంను రాజకీయ పోరాట స్థానంగా మలుస్తున్న కాషాయం కదలికల్లో ఉన్నదీ హిందూ ‘మత’లబులే అని గమనించవచ్చు. చరిత్రను తిరగరాయడాలూ, ప్రశ్నించిన వాళ్ళను కాలరాయటాలు ,రోజువారిగా ఏం చెయ్యాలో, ఏం తినాలో నిర్దేశించటాలూ , మతాధార పౌరసత్వాలూ, బహిరంగంగా ముస్లింలను ఊచకోత కోయాలని మంత్రులూ ఎంపీలూ ఎంఎల్లేలూ పిలుపునివ్వడాలూ, హిజాబ్ రాజకీయాలు, బుల్డోజర్ తో ముస్లింల ఇళ్లు కూల్చటాలూ -ఇవన్నీ క్రమంగా హిందూ రాజ్యం వైపు దేశాన్ని తీసుకెళుతున్న సన్నివేశంలో – వీటి రంగు రుచి వాసనల్తో సహా పట్టించేది అంబేద్కర్ తాత్విక దృష్టే. కనుక అంబేద్కర్‌ని సొంతం చేసుకోవడమంటే ఆయన తాత్వికతను సొంతం చేసుకోవటం. సైడ్ హెడ్డింగ్ స్థానం నుంచి కుల సమస్యను మెయిన్ హెడ్డింగ్ స్థానంలోకి తీసుకు రావడం. మనుషుల్లోని మానసిక ‘అల్పత్వాన్ని’ అలాగే ఉంచి ఎన్ని విప్లవాలు చేసినా వాటివల్ల మానవీయ సమాజాలు ఏర్పడవని గుర్తించటం.
నిజంగా ఒక దేశ సామాజిక మనస్తత్వ మార్పును పక్కన పెట్టి దాని భౌతిక వాస్తవికతని మార్చినా అందులో మానవీయ నవ సమాజం నిర్మితం కాదనడానికి నేటి రష్యా చైనాల పెత్తందారీ సంస్కృతిని అర్థం చేసుకుంటే సరిపోతుంది.
ఈ తాత్విక నేపథ్యంలో సాహిత్య విశ్లేషణ ను వచ్చే నెల చేద్దాం.
మంచి విశ్లేషణ sir