(దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి గురించి నాగపూర్ జైలులో నిర్బంధంలో ఉన్న సాయిబాబాకు రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన లేఖ.)
ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా
July 17, 2020
అండా సెల్
నాగ్‌పూర్ సెంట్రల్ జైల్
మహారాష్ట్ర
ప్రియమైన సాయి,
నిన్ను నిరాశ పరుస్తున్నందుకు క్షమించు. ఈ ఉత్తరం రాస్తున్నది నేను అరుంధతిని, అంజుమ్ కాదు. నువ్వు ఆమెకు మూడు ఏండ్ల క్రితం ఉత్తరం రాసావు. ఆమె నీకింకా జవాబు బాకీయే ఉంది. కానీ ఏమని చెప్పను – వాట్సాప్, ట్విట్టర్ ల వేగవంతమైన ప్రపంచాన్ని పక్కన పెట్టు, ఆమె దృష్టి లో సమయం అనే భావన మన భావన కన్న భిన్నమైనది. ఆమె దృష్టిలో ఉత్తరానికి మూడేండ్లు జవాబు ఇవ్వకుండా ఉండడం పెద్ద విషయం కాదు. ప్రస్తుతం అంజుమ్ జన్నత్ గెస్ట్ హౌజ్ లో తన గదికి గడి వేసుకొని, రోజంతా పాటలు పాడుతూ గడిపేస్తోంది.
చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇన్ని ఏండ్ల తర్వాత ఆమె మళ్లీ పాడడం మొదలుపెట్టింది. ఆమె గది ముందునుండి నడిచేప్పుడు ఆమె పాటలు వింటుంటే బతికి ఉన్నందుకు నాకు సంతోషమనిపిస్తుంది. ఆమె ‘తుమ్ బిన్ కౌన్ ఖబరియా మోరీ లేత్’ (నువ్వు తప్ప నా గురించి ఎవరు అడుగుతారు?) అనే పాట పాడినప్పుడల్లా నా మనసులో దిగులు ఆవరిస్తుంది. ఆ పాట నాకు నిన్ను గుర్తు చేస్తుంది. ఆమె పాడేటప్పుడు, ఆమె కూడా నీ గురించి ఆలోచిస్తుందని నాకు తెలుసు. అందుకే ఆమె నీకు జవాబు రాయకపోయినా, ఆమె తరచూ నీ గురించి పాడుతుందని నీకు తెలియాలి. నువ్వు ఏకాగ్రతతో వింటే, ఆమె పాడే పాటలు నీకు వినబడవచ్చు కూడా.
సమయం గురించి మన భావన అని మాట్లాడినప్పుడు అంత సునాయాసంగా ‘మన’ అని నిన్ను కలుపుకోవడం నా తప్పే – ఎందుకంటే దుర్భరమైన అండా సెల్ లో జీవిత ఖైదుగా ఉండటమంటే సమయం పట్ల నీ భావన, నాకన్నా అంజుమ్ భావనకే దగ్గరగా ఉండవచ్చు. బహుశా ఆమె భావన నుండి కూడా చాలా భిన్నంగా ఉండవచ్చు. ఇంగ్లిష్ భాషలో ‘డూయింగ్ టైమ్’ (జైలులో ఖైదీగా ఉండడం) అనే పదాలకు మామూలు వాడుకభాషలో అర్థం కన్నా ఏదో లోతైన అర్థం ఉన్నట్టు నేను అనుకునేదాన్ని. ఏమోలే, అనాలోచితంగా ఈ మాటలు అన్నందుకు క్షమించు. ఒక రకంగా అంజుమ్ కూడా తన శ్మశానవాటికలో జీవిత ఖైదు అనుభవిస్తోంది. కాకపోతే ఆమె జైలు ఊచల వెనక బతకడంలేదు. ఆమెకు మనుషులెవరూ జైలర్లుగా కాపలా కాయడంలేదు. జీనీలూ, జాకీర్ మియా గురించి ఆమె జ్ఞాపకాలే ఆమెకు జైలర్లు.
ఖాకీ కాల్పనికం
నువ్వు ఎలా ఉన్నావని నేను అడగను. వసంత నాకు చెప్తూనే ఉంది. అన్ని వివరాలూ ఉన్న మెడికల్ రిపోర్ట్ కూడా చూశాను. వాళ్లు నీకు బెయిలు కానీ పెరోల్ కానీ ఇవ్వకపోవడం ఊహకందని విషయంగా ఉంది. నిజానికి నీ గురించి నేను ఆలోచించకుండా ఒక్క రోజు కూడా గడవదు. ఇప్పటికీ నీకు అందే వార్తాపత్రికలను సెన్సార్ చేస్తున్నారా, పుస్తకాలు అందకుండా చేస్తున్నారా? నీకు రోజూ సహాయపడే తోటి ఖైదీలు నీ సెల్లులోనే ఉంటారా, షిఫ్ట్ లలో సహాయం చేస్తారా? స్నేహంగా ఉంటారా వాళ్ళు? నీ వీల్ చెయిర్ పని చేస్తోందా? వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు అది పాడయిందని నాకు తెలుసు – నువ్వేదో ప్రమాదకరమైన నేరస్తునివి అయినట్టు నువ్వు ఇంటికి వెళ్తుంటే నిన్ను కిడ్నాప్ చేశారు. (వాళ్ల తుపాకులు గుంజుకొని, ఒక చేత్తో నీ వీల్ చెయిర్ ఎత్తుకొని నువ్వు పారిపోతూ ఉంటే, ‘ఆత్మరక్షణ’ కోసం వికాస్ దుబేని చేసినట్టు నిన్ను చేయకుండా ఉన్నందుకు మనం సంతోషపడాలి. ఖాకీ కాల్పనికం అని ఈ కొత్త సాహిత్య ప్రక్రియకు పేరు పెట్టాలి, ఏమంటావు? ఈ ప్రక్రియలో సాహిత్య వార్షికోత్సవాలు జరిపే అంత మెటీరియల్ ఉంది. పారితోషికం కూడా ఉంటే బాగుంటుంది, మన నిష్పాక్షిక న్యాయస్థానాల్లోని నిష్పాక్షికమైన న్యాయమూర్తులు ఈ పని కూడా అద్భుతంగా చేస్తారు.)
నువ్వు నన్ను కలవడానికి వచ్చినపుడు, వీధి అవతల ఉన్న క్యాబ్ డ్రైవర్ లు నీ వీల్ చెయిర్ ను మెట్లపై మోస్తూ నా ఫ్లాట్ వరకూ తేవడానికి సహాయం చేసిన ఆ రోజులను గుర్తు చేసుకుంటుంటాను. ఈ మధ్య కాలంలో ఆ ప్రతి మెట్టు మీద ఒక ఊరకుక్క కూర్చొని ఉంటోంది. చడ్డా సాహిబ్ (తండ్రి), బంజారిన్ (జిప్సీ తల్లి), లీల, శీల (వాటి కుక్క పిల్లలు). కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో అవి పుట్టాయి. ఎందుకో మరి అవి నన్ను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. కానీ కోవిడ్ లాక్‌డౌన్ ముగిసాక మన క్యాబ్ డ్రైవర్ మిత్రులందరూ ఇక్కడ లేకుండా పోయారు. పని దొరకడం లేదు. క్యాబ్ లు అన్నీ కడగకుండా, మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. మెల్లగా వేళ్లూనుకొని, వాటికి కొమ్మలు, ఆకులు వస్తున్నాయి. చిన్న చిన్న మనుషులు పెద్ద నగరాల వీధుల్లో నుండి మాయమైపోయారు. అందరూ కాదు. కానీ చాలా మంది. లక్షల మంది.
నువ్వు నాకోసం చేసిన పచ్చళ్లు చిన్న సీసాల్లో ఇంకా అలానే ఉన్నాయి. నువ్వు బయటకు వచ్చి నాతో కలిసి భోజనం చేసేవరకూ వాటిని తెరవకుండా వేచి ఉంటాను. అవి చక్కగా మాగుతున్నాయి.
నేను మీ వసంతనూ, మంజీరనూ అప్పుడప్పుడు మాత్రమే కలుస్తాను. ఎందుకంటే మా సామూహిక విషాదపు బరువు ఆ కలయికల్ని కష్టతరం చేస్తుంది. అయితే, ఒక్క విషాదమే కాదు, కోపం, నిస్సహాయత… నావరకైతే నేను సిగ్గు పడుతున్నాను కూడా – నీ పరిస్థితి ఎంత అన్యాయమైనదో ఎక్కువ మందికి అర్థం చేయించలేకపోయినందుకు – 90 శాతం అంగవైకల్యం ఉన్న మనిషిని ఒక హాస్యాస్పదమైన నేరం మోపి, శిక్ష వేసి, జైలులో ఉంచడం ఎంత అమానుషమో అర్థం చేయించ లేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను. ప్రక్రియనే శిక్షగా చేసే మన న్యాయవ్యవస్థ చక్రవ్యూహంలో నీ పిటిషన్ వేగవంతం అయ్యేందుకు నేనేమీ చేయలేకపోతున్నందుకు సిగ్గు పడుతున్నాను. సుప్రీంకోర్టు అంతిమంగా నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తుంది. కానీ అది జరిగేటప్పటికి నువ్వూ, నీవాళ్లూ ఎంత మూల్యం చెల్లించి ఉంటారు!
నీ జైలుతో పాటు అన్ని జైళ్లలో కోవిడ్-19 విజృంభిస్తుండగా, ఈ యావజ్జీవ కారాగార శిక్ష, నీ పరిస్థితి వల్ల, అతి సులభంగా మరణ శిక్ష కాగలదని వాళ్లకు తెలుసు.
మనం కలిసి నవ్వుకున్న, కలిసి తిన్న, తీవ్రంగా వాదించుకున్న కొంత మంది మన మిత్రులతో సహా ఇంకా చాలా మంది – విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులు, ఆక్టివిస్టులు – ఇప్పుడు జైలులో ఉన్నారు. వివి (అంటే నేను వరవరరావు గురించి మాట్లాడుతున్నాను, నీ జైలు సెన్సార్లు నేనేదో కోడ్ భాష మాట్లాడుతున్నానని అనుకోగలరు!) గురించి వార్త విన్నావో లేదో తెలియదు. 81 ఏండ్ల ఆ అద్భుతమైన కవిని జైలులో పెట్టడమంటే ఒక నవయుగ కళాఖండాన్ని జైలులో పెట్టడమే. ఆయన ఆరోగ్యం గురించి తెలుస్తున్న వార్తలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎన్నో రోజులు ఆయన అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చాక, హాస్పిటల్ లో చేర్చారు. కుటుంబ సభ్యులు ఆయనను చూడడానికి వెళ్లిన సమయానికి ఆయన ఒంటరిగా, మూత్రంతో తడిసిన పక్కబట్టల్లో పడుకొని ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు మాటలు తడబడుతున్నాయట, నడవలేకపోతున్నారట. వివికి మాటలు తడబడటం! లక్షలాది ప్రజల ముందు సునాయాసంగా ప్రసంగాలు చేసిన వివి! ఆంధ్రా, తెలంగాణా, ఇండియా అంతటా తన కవిత్వంతో కోట్ల మంది ఊహలను వెలిగించిన వివి.
నీ గురించి భయపడుతున్నట్టే, వివి ప్రాణానికి కూడా ముప్పు ఉందని భయపడుతున్నాను. భీమా కోరేగాం కేసులో నిందితులు చాలా మంది ఆరోగ్యం సరిగ్గా లేదు, వాళ్లకు కోవిడ్-19 వచ్చే అవకాశం చాలా ఉంది. జైలులో వివికి సహాయపడిన వర్నన్ గోంజాల్వెస్ కి మరింత ప్రమాదం ఉండవచ్చు. గౌతమ్ నవ్లాఖా, ఆనంద్ తేల్తుంబ్డే కూడా అదే జైలులో ఉన్నారు. కానీ కోర్టులు పదేపదే బెయిలు నిరాకరిస్తున్నాయి. గౌహతీలో ఖైదీగా ఉన్న అఖిల్ గోగోయ్ కు కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది.
ఎంత సంకుచితమైన, ఎంత క్రూరమైన, ఎంత అల్పమైన మేధస్సు గల ఏలుబడిలో ఉన్నాం మనం? తన సొంత రచయితలు, మేధావులని చూసి ఇంత భయపడడం ఈ విశాలమైన దేశపు ప్రభుత్వానికి ఎంత విషాదకరం?
సంగీతం, కవిత్వం, ప్రేమ
కొన్ని నెలల క్రితమే పరిస్థితులు నిజంగానే మారబోతున్నట్లు అనిపించింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), పౌరుల జాతీయ రిజిస్టర్‌కు (ఎన్‌ఆర్‌సి) వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు. చాలా ఉద్విగ్నభరితంగా ఉండింది. గాలిలో సంగీతం, కవిత్వం, ప్రేమ నిండిపోయాయి. ఒక విప్లవం కాకపోయినా, ఎట్టకేలకు కనీసం ఒక తిరుగుబాటు. నువ్వు చాలా సంతోషడి ఉండేవాడివి.
కానీ అదంతా ఘోరంగా ముగిసిపోయింది. ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ లో 53 మందిని ఊచకోత కోసారు. పూర్తిగా శాంతియుతమైన నిరసనలు చేసిన సిఎఎ వ్యతిరేక నిరసనకారులను ఆ ఊచకోతకు బాధ్యులుగా నిందిస్తున్నారు. అది సాయుధ ముఠాలు, చాలాసార్లు పోలీసుల మద్దతుతో పథకం ప్రకారం చేసిన దాడి అని వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆ సాయుధ ముఠాలు కార్మికవర్గాల వాడల గుండా అల్లర్లు చేస్తూ, దహనాలు, హత్యలు చేస్తూ సాగిపోయాయి. ఆ ప్రాంతాల్లో కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొని ఉంది, అందుకే స్థానిక ప్రజలు సిద్ధంగానే ఉన్నారు, ఎదురుతిరిగి పోరాడారు.
కాకపోతే ఎప్పటిలాగానే, బాధితులనే నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ ముసుగులో, వందలాది మంది యువకులను, ముఖ్యంగా ముస్లింలను, అలానే చాలా మంది విద్యార్థులను ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేశారు. ఎలాంటి సాక్ష్యాలూ లేని సీనియర్ కార్యకర్తలను కేసుల్లో ఇరికించడానికి అరెస్ట్ చేసిన యువకులపై ఒత్తిడి చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.
ఇక ఫిక్షన్ రచయితలు మహత్తరమైన ఒక కొత్త కథ రాయడంలో బిజీగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక గొప్ప కుట్రలో భాగంగా ఢిల్లీ ఊచకోత చేశారని వాళ్ల కథనం. పోలీసులు చెప్తున్న తేదీలను బట్టి చూస్తే ట్రంప్ పర్యటన ఖరారు కాకముందే ఆ ప్రణాళికలు వేసినట్లుగా ఉంది. అంటే సిఎఎ వ్యతిరేక కార్యకర్తలు వైట్ హౌస్ లో ఎంత లోతుగా పాతుకుపోయి ఉండాలి! ఇది ఎలాంటి కుట్ర? ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి నిరసనకారులు తమను తాము చంపుకున్నారా?
అంతా తలకిందులుగా ఉంది. ఇక్కడ చంపబడటం నేరం. వాళ్లు నీ శవం పైన కేసు పెట్టి, నీ భూతాన్ని పోలీస్ స్టేషన్ కు హాజరవమంటారు. నేనిది రాస్తుండగానే, బీహార్ లోని అరారియా నుండి ఒక వార్త వచ్చింది. అక్కడ ఒక మహిళ తనపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెతో పాటు, ఆమెతో ఉన్న మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
ఇప్పుడు కలతపెట్టే విషయాలు ప్రతిసారీ రక్తపాతం, లించింగ్, ఊచకోతలు, అరెస్టులే కానవసరం లేదు. కొన్ని రోజుల క్రితం, అలహాబాద్‌లో కొందరు దుండగులు – ఒక ఇళ్ల వరుస మొత్తాన్ని బలవంతంగా కాషాయం రంగుతో స్ప్రే పెయింట్ చేసి, ఆపై యజమానుల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ దేవుళ్ల భారీ చిత్రాలతో వాటిని నింపేశారు. ఎందుకో గాని, ఈ విషయం నా వెన్నులో వణుకు పుట్టించింది.
నిజంగా, ఇండియా ఈ దారిలో ఇంకెంత దూరం వెళ్లనుందో నాకు తెలియదు.
నువ్వు జైలు నుండి బయటకు వచ్చినపుడు సమూలంగా మారిపోయిన ఒక ప్రపంచంలో అడుగుపెడతావు. కోవిడ్ -19, అనాలోచితంగా చేసిన లాక్‌డౌన్ ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించాయి. పేదలకు మాత్రమే కాదు, మధ్యతరగతి ప్రజలకు కూడా. హిందుత్వ దళాలతో సహా. 138 కోట్ల జనాభా ఉన్న దేశంలో నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్ ప్రకటించే ముందు కేవలం నాలుగు గంటల నోటీసు (రాత్రి 8 నుండి అర్ధరాత్రి వరకు) ఇవ్వడం నువ్వు ఊహించగలవా?
ప్రజలు, సరుకులు, యంత్రాలు, మార్కెట్లు, కర్మాగారాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలూ అక్షరాలా అన్నీ స్థంభించిపోయాయి. చిమ్నీలలో పొగ, రోడ్లపై ట్రక్కులు, వివాహాలలో అతిథులు, ఆసుపత్రులలో చికిత్స. ఏమాత్రం ముందస్తు నోటీసు లేకుండా. అతి గారాబం వల్ల చెడిపోయిన డబ్బున్నవాడి కొడుకు క్లాక్ వర్క్ బొమ్మకు కీ లాగేసినట్టు, ఈ భారీ దేశం మూసివేయబడింది. ఎందుకు? ఎందుకంటే వాడు చేయగలడు కాబట్టి.
కోవిడ్ -19 మన సమాజాన్ని పీడిస్తున్న కులం, వర్గం, మతం, లింగాలకు సంబంధించిన భారీ సంస్థాగత అన్యాయాలను బయటపెట్టే ఒక రకమైన ఎక్స్-రేగా పరిణమించింది. వైరస్ వ్యాపిస్తూ వృద్ధి చెందుతుంటే, సరైన ప్రణాళిక లేని లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయింది. మనం ఒక గడ్డకట్టిన విస్ఫోటనంలో బతుకుతున్నట్లు అనిపిస్తుంది. మనకు తెలిసిన ప్రపంచం ముక్కలైపోయి, ఆ ముక్కలన్నీ గాలిలో వేలాడుతున్నాయి. అవి ఎక్కడ పడుతాయో, నిజంగా నష్టం ఎంత విస్తృతమైనదో ఇంకా తెలియదు.
కూడు, గూడు, డబ్బు, రవాణా లేని నగరాల్లో చిక్కుకున్న లక్షలాది మంది కార్మికులు వందల, వేల మైళ్ల దూరం తమ గ్రామాలకు నడిచివెళ్లారు. నడుస్తున్న వాళ్లని పోలీసులు కొట్టి అవమానించారు. వాళ్లు తరలిపోవడం చూస్తుంటే జాన్ స్టెయిన్బెక్ రాసిన ‘ది గ్రేప్స్ ఆఫ్ రాత్’ గుర్తుకు వచ్చింది. నేను ఈ మధ్యనే ఆ పుస్తకం మళ్లీ చదివాను. ఎంత గొప్ప పుస్తకం.
ఆ నవలలో (అది అమెరికాలో ఆర్థిక మాంద్యం సమయంలో జరిగిన భారీ వలసల గురించి రాసిన నవల) జరిగినదానికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే, భారతదేశంలో ప్రజలలో పూర్తిగా ఆగ్రహమే లేనట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆగ్రహం చెలరేగుతుంది, కాదనను, కానీ అదేదీ పాలకులు నిలువరించ లేనిదైతే కాదు. అందరూ తమ పరిస్థితిని మారుమాట్లాడకుండా అంగీకరించడం వణుకు పుట్టిస్తోంది. ప్రజలు ఎంత విధేయులై ఉన్నారు? కష్టాలను ఓర్చుకోవడంలో, విధేయత చూపించడంలో ప్రజలు చూపించే అంతులేని ఈ ఓపిక పాలకవర్గాలకు (కులాలకు) హాయిగా ఉండవచ్చు. కానీ బాధను ఓర్చుకునే ఈ సామర్థ్యం ఒక వరమంటావా, శాపమంటావా? నేను దీని గురించి చాలా ఆలోచిస్తున్నాను.
లక్షల మంది శ్రామికవర్గ ప్రజలు తమ ఇళ్లకు లాంగ్ మార్చ్ మొదలుపెట్టినప్పుడు, టీవీ ఛానెళ్లూ, ప్రధానస్రవంతి ప్రచారసాధనాలు అకస్మాత్తుగా “వలస కార్మికులు” అనే వాస్తవాన్ని కనుగొన్నాయి. విలేకరులు ప్రజల ముఖాల్లో మైక్రోఫోన్లను పెట్టి “మీరు ఎక్కడికి వెళుతున్నారు? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మీరు ఎన్ని రోజులు నడుస్తారు?” అని అడుగుతుంటే, వాళ్ల దుస్థితిని చూసి ఎంతోమంది, కార్పొరేట్లు స్పాన్సర్ చేసిన మొసలి కన్నీళ్లు కార్చారు.
కానీ నువ్వూ, నీలా జైళ్లలో ఉన్న మిగిలిన వాళ్లూ, ఈ పేదరికాన్ని సృష్టించి, పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజలు గ్రామాలను విడిచిపోయేలా చేసిన ఈ యంత్రానికి వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలు ఉద్యమించారు. మీరందరూ న్యాయం కోసం మాట్లాడుతుంటే – ఇవే టీవీ ఛానెల్స్, కొన్ని సందర్భాల్లో వీళ్లే జర్నలిస్టులూ, వ్యాఖ్యాతలూ – ఆ యంత్రాన్ని కీర్తించారు. వాళ్లు మిమ్మల్ని నిందించి, తూలనాడి, ముద్రలు వేశారు. వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టుకుంటూ, భారతదేశ జిడిపి 9.5శాతం పడిపోబోతోందని ఆందోళన చెందుతుండగా – మీరంతా జైలులో ఉన్నారు.
ఆ మొసలి కన్నీళ్లు కారుస్తూనే ఈ ప్రభుత్వం చేసే ప్రతీ విషయానికి మీడియాలో అదే పనిగా చప్పట్ల కొడుతారు. ఒకోసారి ఇక లేచి నిలబడి మరీ చప్పట్లు కొడతారు. లాక్‌డౌన్ సమయంలో నేను చదివిన మొదటి నవల వాసిలీ గ్రాస్‌మన్ రాసిన స్టాలిన్ గ్రాడ్. (గ్రాస్‌మన్ ఎర్ర సైన్యంతో ఫ్రంట్‌లైన్స్ లో ఉన్నాడు. అతని రెండవ పుస్తకం ‘లైఫ్ అండ్ ఫేట్’ సోవియట్ ప్రభుత్వం ఆగ్రహానికి గురయింది. ఆ పుస్తకం రాతప్రతి “అరెస్టు చేయబడింది” – అదేదో మనిషి అయినట్టు.) అది చాలా సాహసోపేతమైన పుస్తకం, సృజనాత్మక రచనా తరగతులలో బోధించలేనటువంటి సాహసం అది.
ఇంతకీ, అది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ పుస్తకంలో, రష్యాలో యుద్ధంలో పాల్గొంటున్న ఒక సీనియర్ నాజీ సైనికాధికారికి, హిట్లర్ కి మధ్య జరిగిన సమావేశం గురించి అసాధారణమైన వివరణ ఉంటుంది. అప్పటికే యుద్ధంలో జర్మనీ పరిస్థితి బాగాలేదు. ఆ అధికారి ఆ సమావేశంలో హిట్లర్‌కు వాస్తవ పరిస్థితిని వివరించాల్సి ఉంటుంది. కానీ తీరా హిట్లర్ ను ముఖాముఖి కలిసినప్పుడు, అతను ఎంత భయానికీ, ఉద్విగ్నతకూ గురి అవుతాడంటే అతని మెదడు పనిచేయకుండా పోతుంది. ఫ్యూరర్‌ను ప్రసన్నం చేసుకోవటానికి, అతను ఏది వినాలనుకుంటున్నాడో అదే చెప్పేట్టు అతని మెదడు పెనుగులాడుతుంది.
ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోంది. సంపూర్ణంగా సమర్థవంతమైన మెదళ్లు భయంతో, ముఖస్తుతి చేయాలనే కోరికతో గడ్డకట్టి పోతున్నాయి. మన సామూహిక మేధస్సు క్షీణిస్తోంది. నిజమైన వార్తలకు ఇక్కడ అవకాశం లేదు.
మరోవైపు కరోనా విపత్తు ఉధృతమవుతోంది. ప్రపంచంలో తీవ్రంగా ప్రభావితమైన దేశాల పోటీలో విజేతలైన దేశాలు, ఇరవై ఒకటవ శతాబ్దపు ముగ్గురు మేధావుల నేతృత్వంలో ఉండటం యాదృచ్చికం కాదు. మోడీ, ట్రంప్, బోల్సొనారో. ఢిల్లీ ముఖ్యమంత్రి (ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చుట్టూ తేనెటీగ లాగా తిరుగుతున్నాడు) అమరమైన వాక్యాల్లో చెప్పాలంటే, వాళ్ల నినాదం ఇప్పుడు : హమ్ అబ్ ఫ్రెండ్స్ హై నా? (మేము ఇప్పుడు దోస్తులం కదా?)
ట్రంప్ నవంబర్‌లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భారతదేశంలో కనుచూపుమేరలో ఆశ కనిపించడం లేదు. ప్రతిపక్షాలు కుప్పకూలిపోతున్నాయి. నాయకులు భయపడిపోయి, నిశ్శబ్దంగా ఉన్నారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కాఫీ పై నురుగులా ఊదేస్తున్నారు. రోజువారీ వార్తల్లో ద్రోహాలు, ఫిరాయింపులు ఆనందంగా నివేదించబడుతున్నాయి. లంచాలు తీసుకొని అమ్ముడు పోకుండా ఆపడానికి ఎమ్మెల్యేలను హాలిడే రిసార్ట్స్ లోకి తోలి బంధించడం కొనసాగుతూనే ఉంది. అమ్మకానికి సిద్ధంగా ఉన్నవాళ్లను బహిరంగంగా వేలం వేసి ఎక్కువ వేలంపాట పాడినవాళ్లకు ఇచ్చేస్తే సరిపోతుందని నేనంటాను. నువ్వేమంటావు? వాళ్లు ఎవరికి ఉపయోగపడతారని? సరే వాళ్లని వదిలేద్దాం. అసలు విషయాన్ని మాట్లాడుకుందాం: మనం ఒక్క-పార్టీ ప్రజాస్వామ్యంలో ఇద్దరు వ్యక్తులచే పాలించబడుతున్నాం. చాలామంది ఇది ఒక కాలం చెల్లిన వ్యవహారమని కూడా గ్రహిస్తున్నట్టు లేరు.
లాక్‌డౌన్ సమయంలో మధ్యతరగతి ప్రజలు చాలా మంది తాము జైలులో ఉన్నట్టుగా అనిపిస్తోందని ఫిర్యాదు చేశారు. కానీ ఆ మాటలు ఎంత అవాస్తవమో నీకు బాగా తెలుసు. వాళ్లు తమ కుటుంబాలతో ఇళ్లలోనే ఉన్నారు (అయితే అది, చాలామందిపై, ముఖ్యంగా మహిళలపై హింసగా పరిణమించింది). వాళ్లు తమ దగ్గరివారితో మాట్లాడుకోగలిగారు, వాళ్ల పనులు యధావిధిగా చేసుకోగలిగారు. వాళ్ల దగ్గర ఫోన్లు ఉన్నాయి. వాళ్లకు ఇంటర్నెట్ ఉంది. నీలాగా కాదు. కశ్మీర్ ప్రజల లాగా కాదు. గత ఏడాది ఆగస్టు 5న సెక్షన్ 370 రద్దు చేయబడి, జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ప్రత్యేక హోదాను, రాష్ట్ర హోదాను కోల్పోయినప్పటి నుండి కశ్మీర్ ప్రజలు లాక్‌డౌన్ లో ఇంటర్నెట్ లేకుండా ఉన్నారు.
రెండు నెలల కోవిడ్ లాక్ డౌనే భారతదేశం ఆర్థిక వ్యవస్థకు ఇంత పెద్ద దెబ్బ అయితే, ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఇంటర్నెట్ లేకుండా సైనిక లాక్ డౌన్ ను భరించాల్సి వచ్చిన కశ్మీరీల గురించి ఆలోచించు. వ్యాపారాలు కుప్పకూలిపోతున్నాయి. వైద్యులు రోగులకు చికిత్స అందించలేక ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. అలాగే, గత ఏడాది ఆగస్టు 5 లోపే వేలాది మంది కశ్మీరీలు జైలు పాలయ్యారు. అవి ముందస్తు – నిరోధక నిర్బంధాలు. ఎటువంటి నేరం చేయని వ్యక్తులతో నిండిన జైళ్లు ఇప్పుడు కోవిడ్ వ్యాధి ప్రేరక కేంద్రాలుగా మారుతున్నాయి. దాని గురించి ఏమనాలి?
సెక్షన్ 370 ని రద్దు చేయడం అహంకారంతో కూడిన చర్య. “ఒకేసారి శాశ్వతంగా” విషయాన్ని పరిష్కరిస్తామని ప్రగల్భాలు పలికినా, ఆ చర్య ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక గర్జిస్తున్న భూకంపాన్ని తెచ్చిపెట్టింది. పెద్దపెద్ద భూఫలకాలు కదులుతూ తమను తాము కొత్త స్థానాల్లోకి అమర్చుకుంటున్నాయి. తెలిసిన వాళ్లు చెప్పేదాన్ని బట్టి, చైనా పిఎల్‌ఎ సరిహద్దును దాటి, లదాఖ్‌లోని పలు చోట్ల, వ్యూహాత్మక స్థానాలను ఆక్రమించింది. చైనాతో యుద్ధం అంటే పాకిస్తాన్‌తో యుద్ధానికి పూర్తి భిన్నమైన పరిస్థితి. అందుకే, మామూలుగా చేసే తొడ గొట్టడాలు అంత బలంగా లేవు. చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకైతే భారతీయ టీవీలో ఎలాగూ ఇండియానే గెలుస్తోంది. కానీ టీవీకి దూరంగా, ఒక కొత్త ప్రపంచ క్రమం తన ఉనికిని తెలియజేస్తోంది.
ఈ ఉత్తరం నేను అనుకున్న దానికంటే పెద్దదైపోతోంది. ప్రస్తుతానికి ఇక వీడ్కోలు చెప్తాను. ప్రియమైన మిత్రమా, ధైర్యంగా ఉండు. సహనంగా కూడా. ఈ అన్యాయం ఎప్పటికీ కొనసాగదు. ఆ జైలు ద్వారాలు తెరుచుకుంటాయి, నువ్వు మా దగ్గరకు తిరిగి వస్తావు. పరిస్థితులు ఎప్పటికీ ఇట్లా కొనసాగలేవు. అట్లా కొనసాగితే, మనం విచ్ఛిన్నమవుతున్న వేగం దానికదే ఒక కొత్త ఊపందుకుంటుంది. అప్పుడు మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. అట్లా జరిగితే, అది మనం ఊహించలేని స్థాయిలో ఒక పెద్ద విషాదం అవుతుంది. కానీ బహుశా ఆ శిథిలాల నుండి సున్నితమైనదేదో, వివేకవంతమైనదేదో ఉద్భవించవచ్చు.
ప్రేమతో,
అరుంధతి
(నాగపూర్ లోని జైలులో అండా సెల్ లో ఉన్న ప్రొ. జి ఎన్ సాయిబాబు ఉద్దేశించి ప్రఖ్యాత నవలా రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ 2020 జూలై 17న ఈ బహిరంగ లేఖ రాశారు.)
(అనువాదం: చైతన్య చెక్కిళ్ల)
అరే!అనుకోకుండా ఒకరిదొకరికి తెలియకుండా ఇద్దరం ఇదే లెటర్ ను అనువాదం చేశాం రా ఛైతూ! అంటే మనిద్దరం ఒకేరకమైన ఆలోచనలతో ఉన్నామన్నమాట!సంతోషం. బాగుంది నీ అనుసృజన.