‘‘సార్.. ఇప్పుడు వెళ్తున్నారా?’’ అన్న మాటలు వినపడటంతో, తలకు కట్టుకున్న కర్చీఫ్ వెనక్కి పోకుండా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటున్న అతడు- ఆగి, నెమ్మదిగా పక్కకు తిరిగి చూశాడు.
ఆయన లెక్కల మాష్టారు. తను పని మీద వెళ్లాల్సి వున్నందున ఆయనను కాస్త తొందరగా రమ్మని నిన్ననే చెప్పాడు. ఎంతకీ రాకపోయేసరికి చూసిచూసీ ఇప్పుడే బయల్దేరాడు.
‘‘మీరే చెప్పారు కదా. డైరెక్ట్ గా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి కలిస్తే పనవుతుందని..’’ అన్నాడు, వీలైనంత మామూలుగా.
అయినా, ఆ గొంతులోని అసహనాన్ని గ్రహించాడు-లెక్కల మాష్టారు కదా మరి.
‘‘వస్తుంటే, తెలిసినవాళ్లు పలకరించడంతో మాట్లాడి వచ్చేసరికి లేటయ్యింది. ఫర్వాలే. మీకు లేటేం కాలేదు. వాళ్లు మనలాగ తెల్లారగానే వచ్చెయ్యరు.’’ అన్నాడు లెక్కల మాష్టారు.
అతడిని పైకి తిట్టలేక మనసులోనే తిట్టుకుంటూ బైక్ తీసి, ఎక్కాడు. స్టార్ట్ చేయబోయినవాడల్లా ఆగాడు. ఏదో గుర్తుకు వచ్చి, మళ్లీ హెల్మెట్ తీసాడు. ఆయన హెల్మెట్ తీయడం చూసి, ఏదో చెప్పాలనుకుంటున్నాడని గ్రహించి ముందుకు కదిలిన లెక్కల మాష్టారు ఆగాడు.
‘‘పిల్లలకు అటెండెన్స్ వేసేసాను. ఆన్ లైన్లో కూడా అప్‌లోడ్ చేశా’’ అని చెప్పాడు.
‘‘ఫర్వాలేదు, అవన్నీ నేచూసుకుంటా లెండి.మీరు వెళ్లండి’’అని అభయమిచ్చాడు లెక్కల మాష్టారు.
లోపల మాత్రం ‘హమ్మయ్య.. అన్నీ పూర్తి చేశాడు. లేకపోతే, మొబైల్ సిగ్నల్స్ రాక అవన్నీ అప్‌లోడ్ చేయలేక నానా తంటాలు పడాల్సి వచ్చేది’ అనుకున్నాడు లెక్కల మాష్టారు.
‘అన్నీ పూర్తి చేశానంటే.. వీడు చూసుకునేదేమిటో?’ అని విసుక్కుంటూ వెళ్లిపోయాడు అతడు.
అతడు తెలుగు మాస్టారు. ఆ భాషలాగే, అతడన్నా అందరికీ చులకనే. అతడికి వుండే పీరియడ్స్ తక్కువే. కానీ, ఆ నెపంతో మిగిలిన పనులన్నీ ఆయన నెత్తినే వేస్తారు. ఆయనకు జీతం తప్ప వేరే ఆదాయమేమీ వుండదు. అలాని, అదేమీ తక్కువ కాదనుకోండి. కానీ, మిగిలిన సబ్జెక్స్ చెప్పే వాళ్లయితే ఉదయం, సాయంత్రం ట్యూషన్లు చెప్పుకుంటారు. కొందరు ట్యుటోరియల్స్ పెట్టి భారీగా సంపాదిస్తున్నారు. ఇవి చాలవన్నట్టు చిట్టీలు, రియల్ ఎస్టేట్లు వుండనే వుంటాయి. ఇవన్నీ చాకచక్యంగా నెరపడానికి పైవాళ్లతో సత్సంబంధాలు కొనసాగిస్తారు.
తెలుగు మాష్టారికి వచ్చిన కష్టం గురించి ఎవరూ పట్టించుకోకపోయినా,ఏదో అభిమానంతో లెక్కల మాష్టారు తనకు తెలిసిన ఆయన నెంబరు ఇచ్చి వెళ్లి కలవమన్నాడు. ఆ అధికారిని కలవడానికే అతడిప్పుడు వెళ్తున్నది.
గంట కూడా కాకుండానే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని ఆఫీసుకు చేరుకున్నాడు. అతడిలాగే వివిధ పనుల మీద వచ్చిన వాళ్లతో అక్కడి ఆవరణ అంతా సందడిగా ఉంది.
లెసన్ ప్లాన్లు, టీచర్స్ డైరీ రాయడం, ప్రాజెక్ట్ వర్క్ లు దిద్దడం గురించి మాట్లాడుకుంటున్నారు.
‘‘ఏంటి మాష్టారూ.. ఇలా వచ్చారు?’’ అని తెలిసిన వారు పలకరించారు.
‘మనందరికీ అంటే ఏవో పనులూ, పైరవీళ్లూ వుంటాయి కాబట్టి ఇక్కడ పడిగాపులు పడతాం, ఈయనకేం పనబ్బా?’ అని అక్కడున్న అందరికీ ఒకటే సందేహం.
వీళ్లందరి సందేహాలు తీర్చడానికన్నట్లు అప్పుడే అక్కడికి వచ్చాడు అటెండర్. అవ్వడానికి అటెండరే అయినా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోలాగే అక్కడా చక్రం తిప్పేది అతడే. అందుకే అందరూ అతడి చుట్టూ మూగి ‘విషయం ఏంట’ని అడిగారు.
‘‘ఆయనా, అబ్బో అదో పెద్ద స్టోరీ లెండి. పుణ్యానికి పోతే పాపం ఎదురవ్వుద్దంటారు చూశారా? ఆయనదీ అదే బాపతు’’అని నాటకీయంగా ఆపి ‘‘గొంతెండిపోతోంది’’ అని ముందుకు కదిలాడు అటెండర్.
అతడి ఉద్దేశం తెలిసిన అందరిలో, కొందరు ముందడుగు వేయడానికి జంకారు. కాస్త పెద్ద పనులు వున్నవారు మార్గదర్శకత్వం వహించడంతో మరి కొందరు సంతోషంగా కదిలారు.
కాసేపటికి, కాస్త దూరంలో వున్న వైన్ షాపు పక్కనే వున్న రెస్ట్ రూమ్ అని పిలవబడే చెత్త ప్రదేశంలో ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని అందరూ రౌండ్ టేబుల్ సమావేశంలో తేలారు.
వచ్చినవాళ్లందరూ గ్లాసులు నింపుకుని రెండు గుక్కలు తాగాక, అటెండర్ మొదలు పెట్టాడు.
**
ఏదో కొత్త సినిమా పాట పాడుకుంటూ, ఆకతాయిగా గెంతుతూ క్లాసురూమ్‌లోకి వెళ్లబోయినవాడు కాస్తా, తెలుగు మాష్టార్ని చూసి గతుక్కుమంటూ ఆగిపోయాడు ఆ విద్యార్థి.
‘‘ఆగిపోయారేం? రండి సార్.. లోపలికి రండి’’ అని వ్యంగ్యంగా పిలిచారు మాష్టారు.
కానీ, వాడి అడుగు ముందుకు పడలేదు. క్లాసులోని పిల్లలంతా నవ్వుతూ చూస్తున్నారు.
వాడు ఎంతకూ కదలకపోయేసరికి మాష్టారు, బెంచీ సొరుగులోంచి బెత్తం తీసారు.
‘‘ఇప్పుడు చెప్పరా? ఏంట్రా పాడుతున్నావ్?’’ అని అడిగారు.
‘‘ఏం లేదు సార్?’’ అన్నాడు వాడు, భయం భయంగా.
‘‘సరే.. నిన్న ఇచ్చిన హోం వర్క్ చేశావా?’’
వాడేదో గొణిగాడు.
అంతే బెత్తంతో వాడి కాళ్లపై చెళ్లుమనిపించారు మాస్టారు. వాడు ‘ఉస్.. బుస్’ అంటూ అటూఇటూ గెంతాడు. క్లాసులోని పిల్లలంతా నవ్వారు.
‘‘పోనీ, వారం క్రితం గేయం నేర్చుకోమన్నా.నేర్చుకున్నావా?’’ అడిగారు.
వాడు నేల చూపులు చూశాడు.
అంతే, మరో దెబ్బ కాళ్లపై, ఇంకో దెబ్బ చేతులపై వేసారు. ‘పోయి కూర్చో’ అన్నట్టు ఆ బెత్తంతోనే చూపించారు. వాడు అవమాన భారంతో నెమ్మదిగా వెళ్లి వాడి చోట్లో కూర్చున్నాడు.
హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు మాస్టారు ఓ రెండు రిజిస్టర్లు తీసి మార్కులను వాటిల్లో నమోదు చేసే పనిలో పడ్డారు.
మాస్టారు పనిలో పడటంతో పిల్లల్లో గుసగుస మొదలైంది.
‘‘ఫస్టటైమ్ రా నేను తన్నులు తినడం’’ అన్నాడు వాడు స్నేహితులతో.
‘‘సార్.. కొట్టడం కూడా ఫస్టయిమేరా. ఎందుకంటే, నేనెప్పుడూ చూడలే’’ అన్నాడు ఒకడు.
పిల్లలందరూ ఇలా గొడవ చేస్తుండగానే పీరియడ్ బెల్ మోగింది. మాస్టారు వెళ్లిపోయారు. ఆయన అలా వెళ్లగానే వెనుక బెంచీలో నుంచి ఒకడు పరుగున వచ్చాడు. వాడి చేతిలో మొబైల్ వుంది. వాడు ఒకింత గర్వంగా ముఖం పెట్టి, అందరి మధ్యలోకి చెయ్యి జాపి వీడియో ప్లే చేశాడు.
అది ఇందాక మాస్టారు కొడుతున్నప్పటి దృశ్యం. పిల్లలంతా చాలా ఉత్సుకతగా చూశారు.
‘‘అరే.. నీకు ఫోన్ ఎక్కడిదిరా?’’ అని అడిగాడొకడు.
‘‘నీకెందుకురా?’’ అని ముందు గదమాయించి, తరువాత ‘‘మాయమ్మ చార్జింగ్ పెట్టి మర్చిపోయి బయటకు పోయింది. తీసుకొచ్చా’’ అన్నాడు వాడు.
‘‘ఇప్పుడు దీన్ని ఏం చేస్తావురా?’’ అని అడిగాడు మరొకడు.
‘‘నువ్వన్నీ అమాయకంగా అడుగుతావ్రా. పొద్దున్న లేచి కాణ్నించి, పడుకునే వరకూ యూట్యూబ్ చూస్తూనే వుంటావుగా. నీకు తెలీదా?’’ అని వాడు ఎదురు ప్రశ్నించాడు.
మళ్లీ వాడే ‘‘మాస్టారు కొడుతుంటే, ఈడు డాన్సులు చేస్తూ కామెడీ చేశాడు కదా? దీన్ని యూట్యూబ్‌లో పెట్టామనుకో.. అందరూ చూస్తారు. మనకు పైసలు ఇస్తారు’’ అన్నాడు.
**
ఇది జరిగి సుమారు ఏడాది అయ్యింది. పిల్లలు అనుకున్నట్టు డబ్బులు ఏమీ రాలేదు. వాళ్లకు అసలు ఆ విషయం కూడా గుర్తు లేదు. కానీ, ఆ వీడియో నెమ్మదిగా పాపులర్ అయ్యింది. అంతే, ‘పిల్లల్లోని విభిన్న అభినివేశాలను వెలికితీయాలిగానీ, ఇలా కొడతారా? మనం ఇంకా రాతియుగంలోనే వున్నామా?’ అని పలువురు మేథావులు విరుచుకు పడ్డారు. సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెమ్మదిగా అధికారుల దృష్టిలోనూ పడింది. ఎవరో కావాలనే వారికి పంపారని కొందరంటారు. కులపరమైన, రాజకీయపరమైన వెన్నుదన్నేమీ లేకపోవడంతో తెలుగు మాస్టారు వారికి ‘సాఫ్ట్ టార్గెట్’గా దొరికాడు. తామూ పనిచేస్తున్నామని, విలువలు కాపాడతామని చాటుకోవడానికి అధికారులంతా ఆయనపై విరుచుకుపడ్డారు. ఒకదానికొకటి జోడించారు. సంజాయిషీ ఇమ్మంటూ నోటీసు ఇచ్చారు. సస్పెండ్ చేస్తారంటూ పుకార్లు వ్యాపించాయి.
**
‘‘అందుకే తన గోడు వెళ్లబోసుకోవడానికి ఆ అల్పజీవి ఇలా యేతించెన్’’ అంటూ చేతిలోని ప్లాస్టిక్ గ్లాసు నలిపి పడేస్తూ, మూడో పెగ్గు ముగించి లేచి నిలబడ్డాడు అటెండర్.
అతడితోపాటు వచ్చిన వాళ్లూ లేచారు. ఇంతలో వాళ్లకి ఇంకో బ్యాచ్ ఎదురొచ్చింది.
‘‘ఏంటింకా రాలేదా?’’ అని అడిగాడు అటెండర్, ఎదురుగా వచ్చినవాళ్లలో ఒకడిని ఉద్దేశించి.
‘‘జస్ట్.. వుప్పుడే. నేనిలగ వస్తన్నా, సార్ కారు లోనికి పోయ్యింది’’ అన్నాడు అతడు.
‘‘అదేటి, సార్ లోనికి పోతే, నువ్వు బయటకొస్తున్నావ్?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా.
‘‘సార్.. చెప్పిన పనే. అర్జంటు. అందుకే..’’ అని, కళ్లతోనే సైగచేసి ముందుకు వెళ్లిపోయాడు.
అటెండర్ తదితరులు ఆ ఆఫీసు ఆవరణలోకి వచ్చేసరికి వెలుగుతున్న ముఖంతో మాస్టారు బయటకు వస్తూ కనిపించారు.
వాళ్లలో ఒకడు వుండబట్టలేక ‘‘ఏంటి సార్, హుషారుగా వున్నారు’’ అని మాస్టారిని పలకరించాడు.
‘‘ఆ.. హుషారేమీ లేదు సార్. నేను చెప్పినదానికి సార్ కన్విన్స్ అయ్యారు. అదే పెద్ద రిలీఫ్. అంతకంటే కావాల్సిందేముంటుంది’’ అని మాస్టారు నవ్వేసారు.
కానీ లోపల జరిగింది వేరు.
**
‘‘వాడు నాకు బాగా తెలిసిన వాళ్ల పిల్లాడు సార్. స్వతహాగా తెలివైన వాడే. కాకపోతే, ఈ ఇంటర్నెట్, చెడు స్నేహాల పట్టి పాడైపోతుంటే.. ఏదో చిరాకులో వుండి గబుక్కున..’’ అని ఆగిపోయారు మాస్టారు.
‘‘రెండు దెబ్బలు వేసాను అంటారు-అంతేగా. రెండు కాకపోతే, నాలుగో నలభయ్యో వేయండి. కానీ, వీడియో తీస్తుంటే కూడా చూసుకోకపోతే ఎలా?’’
దానికి ఆయన దగ్గర సమాధానం లేదు.
‘‘మన వాడు, పగ వాడు ఏమిటండీ రోజుల్లో. పైవాడు చెప్పిన పని చేశామా, లేదా? బస్.. అంతే. కాదు, ఏదో ఉద్ధరించేస్తానంటారా?, ఇదిగో ఇలాగే ఇరుక్కుంటాం’’ అని ఆ అధికారి కాసేపు ఆగాడు.
మాస్టారు చేతులు పిసుక్కోవడం తప్ప ఏమీ మాట్లాడకపోయేసరికి, ఆయనకు కోపం నషాలానికి అంటింది. కానీ, అనుభవం మీద తమాయించుకున్నాడు.
‘‘సర్లెండి. మీ గొడవ అలా వుంచండి. ఇవాళ నేషనల్లో, ఇంటర్నేషనల్లో.. బుక్ డే అనుకుంట కదా? ఏం చేస్తున్నారు? వెంటనే స్కూలుకు వెళ్లి విద్యార్థులకి వ్యాస రచన పోటీయో లేదంటే నేను చదివిన పుస్తకం అనో ఏదో ఒక పోటీ పెట్టి, యాప్‌లో అప్ లోడ్ చేయండి.’’ అని ఓసారి మాస్టారి వైపు చూసి ‘‘మీ గొడవ అలా వదిలేయండి. మీరేం వర్రీ కావద్దు. నేన్జూసుకుంటాను. ఇకనైనా మీ పనేంటో మీరు చూసుకుంటే మీకూ మంచిది.. మాకూ మంచిది. ఈ తలనొప్పులు వుండవు’’ అని సెలవిచ్చారాయన.
**
ఇంత జరిగితే కూడా ‘ఆ గొడవ వదిలేయండి’ అన్న విషయమే మాస్టారికి గుర్తుంది. అందుకే ఆయన పిల్లలకు పెట్టాల్సిన పోటీపై లోపల్లోపల కంగారుపడుతూ హడావిడిగా స్కూలుకు బయల్దేరాడు.
కాస్త దూరం వెళ్లాక, మాస్టారి బుర్రకు తట్టింది. తాను తప్పు చేయకపోయినా, తలొంచిన విషయం. అప్పుడే తన గురించి వాళ్లూ, వీళ్లూ ‘సాఫ్ట్ టార్గట్’ అని మాట్లాడుకోవడం స్ఫురించింది. ‘సున్నిత లక్ష్యం’ లేదా ‘సున్నితమైన లక్ష్యం’. ఏది సరైనది అని తర్జనబర్జన పడుతూ స్కూల్‌కు చేరుకున్నాడు.
ఇందాక, హెల్మెట్, రుమ్మాలు వుండటంతో కనిపించలేదుగానీ, మాస్టారు ముఖం బాగా ఎర్రబడింది. మంచివాడిని ఎర్రిబాగులవాడిగా పరిగణిస్తే జరిగే పరిణామమే అది. ఎప్పుడూ శాంతంగా కనిపించే మాస్టారిని అలా చూసి, పిల్లలు ఒకింత జడుసుకున్నారు. కానీ, మాస్టారు వారిని గమనించనట్టే తన పరీక్ష ప్రారంభించారు.
‘‘మీలో చాలామంది పుస్తకలు చదివారు కదా. ఆ పుస్తకాల వివరాలు పేర్కొంటూ, మీ అవగాహన మేరకు ‘సున్నిత లక్ష్యం’ లేదా ‘సున్నితమైన లక్ష్యం’ గురించి రెండు పేజీలకు మించకుండా వ్యాసం రాయండి’’ అని ఆదేశించాడు.
పిల్లలు తెల్ల ముఖం వేసారు. వారి ముఖల్లో మాస్టారికి వేరెవరి ముఖాలో కనిపిస్తున్నాయి.