ఆమెదొక చిత్రమైన సమస్య –
తలకాయ విస్తీర్ణం అంతకంతకూ పెరిగిపోతోంది. రోజులూ వారాలూ కాదు, తొమ్మిది నెలలు! భూకంపం వచ్చినట్టు తలలో నొప్పి, వికారం, వాంతులు, కళ్ళు తిరుగుడు… భరించలేక ఆస్పత్రికి పోయింది. టెస్టుల్లో ఏమీ తేలదు.
ఏ డాక్టరుకూ అంతుపట్టదు. ఇలాగే పెరుగుతూ పోతే మెడ నరాలు తెగిపోయి, బ్రెయిన్ బద్దలవుతుందనీ, విస్తరించుకుపోతున్న మెదడు భారాన్ని మొయ్యలేక శరీరం చచ్చి వూరుకుంటుందనీ మాత్రం తేల్చి చెప్పారు. వార్తల్లో, సోషల్ మీడియాలో ఇది సెన్సేషనల్ కేసు.
ఇంట్లో వాళ్లంతా ఆశలు వదిలేసుకొని ఏడుపులు మొదలెట్టారు. న్యూరాలజిస్టులూ, సైకియాట్రిస్ట్ లూ
కలిసి తొమ్మిది నెలలపాటు తల్లకిందులయ్యాక చేసిన డయాగ్నోసిస్ – ఎమోషనల్ ప్రెగ్నెన్సీ! దానికి మూల కారణం – ప్రేమ!
కొంతకాలంగా తను ఓ కుర్రాడితో ప్రేమలో ఉన్నమాట నిజమే. ఆ ప్రేమ ఇంకా చాలా ముందుకు సాగాలని తను ఆశించింది. అతడు అలా అనుకోలేదు. అక్కడితో ఆ కథ ముగిసింది. ఆ మాత్రానికే ఇంత హింసా? ప్రేమలో పడితే తలకాయ ఇలా వాచిపోతుందా? దాన్ని ప్రెగ్నెన్సీ అంటారేమిటి వీళ్ళు? పైగా, గర్భవతులకు లాగానే తనకూ వాంతులు, వికారమూ…
ఆమెకేమీ అంతుపట్టడం లేదు .
** **
నెలల తరబడి ఆమె గతాన్నితవ్వి, జ్ఞాపకాలను కెలికిన సైకోథెరపిస్ట్ కొన్ని వివరాలు రాబట్టింది –
తల్లిదండ్రులకు ఆమె ఒక్కగానొక్క సంతానం. ప్రేమగా పెంచారు. ఆర్థికంగా లోటు లేని కుటుంబం. ఆ అమ్మాయి చదువుల్లో ఫస్ట్. మంచి ఉద్యోగం.
ఆమెకు టీనేజ్ నుండి ఓ సమస్య మొదలైంది.
తలలో నుంచి నల్లగా, జిడ్డుగా, వింత వాసనతో నూనెలా కారేది. ఆ వాసన భరించలేక క్లాస్మేట్స్ ఆమెకు దూరంగా ఉండేవాళ్ళు.
ఆమె ఉద్యోగంలోకి వచ్చాక ఒక పెళ్ళిలో అశోక్ పరిచయమయ్యాడు. మొదట్లో అతడి బెరుకుతనాన్ని ఆటపట్టించింది. మిర్చీరామ్, అని పేరుపెట్టి అల్లరి చేసింది. క్రమంగా అది స్నేహంగా మారింది. కొత్తగా హైదరాబాద్ వచ్చిన అతడిని ఊరంతా తిప్పి చూపింది.
అతడు కూడా ఆమె స్నేహాన్ని ఆనందిస్తున్నాడు.
థెరపిస్ట్ తో ఇదంతా చెప్తూ “నాకీ మిర్చీరామ్ అంటే ఎప్పుడో, ఎక్కడనో ఇష్టం మొదలై ఉండే. నేను గుర్తించలే” అన్నదామె. అతడితోబాటు కెఫేలో హలీం తింటూ తన ఇష్టాన్ని చెప్పింది. “నువ్వూ నేనూ హలీం లెక్క ఉండాలి… ఇందులో ఇప్పుడు ఏది మటన్ అన్నట్టు? ఏది గోధుమ? ఏది పప్పు అన్నట్టు? చెప్పనీకి అయితదా?” ఆమె ఎప్పుడూ మాట్లాడే సరదా మాటలే, అంతరార్థం మాత్రం అతి గాఢమైనది.
ఆమె ప్రపోజ్ చేసిన తీరుకు అతడు హడలిపోయాడు.
నాలుగు వారాలు మొహం చాటేసిన తర్వాత ఓరోజున కలిసి, “మీకేం కావాలో నేనది ఇవ్వలేను. అదంతా ఇక్కడే సమాధి అయిపోవాలి”, అంటూ ఆవేశంగా నేలకేసి వేలు చూపించాడు. ఆ నేల తాలూకు ప్రదేశం కుతుబ్షాహీ టూంబ్స్ – పొయిటిక్ జస్టిస్!
ఆ మాటలు అని ఊరుకుంటే ఆమెకు అర్థమయ్యేది.
కానీ, “దగ్గరకొచ్చిండు… నన్ను తాకేటంత దగ్గరకొచ్చిండు… తాకిండు నా బుగ్గల్ని… దగ్గరకు లాక్కుని నుదురుపై ముద్దుపెట్టుకున్నడు. వాడి గెడ్డం నా తలపై ఆన్చి గట్టిగా హగ్ ఇచ్చిండు. ఒక నీటి చుక్క. రెండు చుక్కలు. నా నెత్తిలోకి. నా మొహం పైకి.” అని గుర్తు చేసుకున్నదామె. అతడు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.
అంతే! ఆమె బుర్రలో ఎడతెగని సందిగ్ధం. రోజు రోజుకూ తలకాయ పరిమాణం పెరుగుతూ పోవటం. సరిగ్గా అప్పటినుంచే నెత్తిలోంచి నల్లటి ద్రవం కారటమూ తగ్గిపోయింది.
* * *
ఎప్పుడో ఏడాది కిందట ముగిసిపోయిన ఈ కథకూ, ఇప్పటి తన పరిస్థితికీ సంబంధం ఏమిటో సైకాలజిస్ట్ వివరించి చెప్పిందాకా ఆమెకు అర్థం కాలేదు –
అమ్మానాన్నలు తనకు ఏ లోటూ రాకుండా పెంచారు. కానీ వాళ్లకు వాళ్ళ కుటుంబాలతో ఏవో గొడవలు. ఆ అశాంతుల నడుమనే తన బాల్యం గడిచింది. తనకు వాళ్ళంటే ప్రేమే. దాన్ని వ్యక్తం చేసేందుకు ఒక్కటే దారి తనకు – వాళ్ళకున్న సమస్యల్లో తానొక సమస్యగా మారకూడదనే ఎరుకతో, జాగ్రత్తతో నడుచుకోవడం.
వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం. ఈ ప్రాసెస్ లో బాధ్యత తప్ప స్వేచ్ఛ లేదు.
ఈ స్థితిలో ఉండగా అశోక్ పరిచయం అయ్యాడు. తన కుటుంబమనే చట్రానికి బయట, ఏ బాధ్యతల, బరువుల ఒత్తిడి లేని ప్రపంచంలో అతని స్నేహం తనకొక అవుట్ లెట్ అయ్యింది. అతనితో హాస్యాలాడింది, అల్లరి చేసింది, గైడ్ చేసింది, ధైర్యాన్నిచ్చింది.
బహుశా, ఇంత స్వేచ్చగా ప్రవర్తించే అమ్మాయిని భార్యగా ఆమోదించటానికి అతడికి ధైర్యం చాలలేదేమో, వెళ్ళిపోయాడు.
ఆమె స్నేహాన్ని ప్రేమించాడు కూడానేమో, రెండు కన్నీటి చుక్కలతో వీడ్కోలు చెప్పాడు.
“మీరు ఎదిగే క్రమంలో మీ ఎమోషనల్ నీడ్స్ తీరనేలేదు.
మీ మనసు సహజంగానే కొన్నింటికి ఆశపడింది, ఎదురు చూసింది. కానీ ఆ అవసరాలు తీరక మిగిలిపోయాయి కాబట్టే మీ తల్లోంచి జిడ్డుగా, వాసనగా బయటపడ్డాయి. జస్ట్ లైక్ స్పెర్మ్ కోసం ఎగ్ ఎదురుచూసి చూసి రాకపోయాక బ్లీడింగ్ స్టార్ట్ అయినట్టు… అది మీ ఎమోషనల్ మెన్స్ట్రువేషన్ సైకిల్… ఇన్నేళ్ల మీ జీవితంలో ఎప్పటికీ తీరని ఎమోషనల్ నీడ్స్ అశోక్ వల్ల తీరాయని ఈ మొత్తానికి అర్థం … ఇది ఎమోషనల్ ప్రెగ్నెన్సీ”.
సైకాలజిస్ట్ చెప్పిన వివరణ అర్థమయింది. కానీ, “ఏందిది? నాకే ఎందుకీ లొల్లి? లోకంల ఎంతమంది ప్రేమించడంలే? మిర్చీ రామ్ కి ఏమ్ ఎందుక్కాలే?
ఏడ్చిండు కదా, వాడి కళ్లు ఎందుకు తాటికాయలవ్వలే?”
అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
“దట్స్ నేచర్. యువర్ నీడ్. ఇంకొకరిని మీలో పెంచి పోషించాలనే అవసరం. దానికి కావాల్సినవి మీలో ఉండడం”.
** **
తనకు తాను అర్థమయ్యింది. టెస్టులు, థెరపీలు ఆపేసింది. తనది జబ్బు కాదు, ఒకరికి స్పందిస్తున్న తీరు మాత్రమేనని అర్థమయ్యాక “ప్రాణం హుషారని పించింది”.
ఇప్పుడు తనేం చెయ్యాలి? అతని ప్రేమ కోసం ప్రాధేయపడాలా? అతణ్ణి ద్వేషించాలా? నిరాశతో కుంగి పోవాలా? అసలు ప్రేమలో పడినందుకు పశ్చాత్తాప పడాలా? సాధారణంగా విఫల ప్రేమికులు వీటిలో ఏదో ఒకటి చెయ్యటం రివాజు. ఆమె వీటన్నిటికీ ఆవల సృజనాత్మకమైన మరో మార్గాన్ని ఎన్నుకుంది. ఆన్లైన్లో బొమ్మలు గియ్యటంతో సాధన మొదలెట్టింది. ఆ వంకర గీతాలు క్రమంగా ఒక రూపం దాల్చాయి. ఆమె కార్టూన్లు, అందులో కనబడే “శ్లోక్ ” అనే పాత్ర మంచి హిట్.
ఏ వైద్యాలూ లేకపోయినా ఆమె తలకాయ పెరగటం ఆగిపోయింది. పెరిగిన సైజు మాత్రం తగ్గలేదు. స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రేమించ గలగటం అనే అనుభవంతో విశాలమైన ఆమె హృదయానికి అది చిహ్నం. ఆ ప్రేమను ఒక చట్రంలో బిగించాలనే పొసెసివ్ నెస్ నూ, అది కుదరనప్పుడు కలిగే ద్వేషాన్ని దాటగలిగిన పరిణతితో “అంతా హల్క హల్క అనిపించింది. నెత్తినొప్పి కూడా తగ్గింది. హుషారుగా తయారైన.” అని చెబుతోంది ఆమె.
తన బొమ్మల్లోని శ్లోక్ ఆకారంలో అశోక్ రూపం కనబడుతుందేమోనని అప్పుడప్పుడూ వెతుక్కుంటుంది
కానీ దొరకటం లేదు. “దమ్ పట్టి ఉడికించిన హలీంల మటన్, గోధుమ, పప్పులు అలగ్, అలగ్ దొరకనట్టు.”
అవసరాల లెక్కలకందని ప్రేమ భావనతో హృదయం శుభ్రపడ్డాక అశోక్ అందులో కరిగి పోతాడేతప్ప వేరుగా దొరుకుతాడా ?
ఇంతసేపూ చెప్పుకున్న ఈ సర్రియలిస్టిక్ కథ, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ.” అదే టైటిల్ తో వెలువడిన ఆమె కథల పుస్తకంలో ఇదొక కథ. హైదరాబాదీ తెలుగు యాసలో అలవోకగా సాగే ఈ కథ విఫల ప్రేమలను ప్రాసెస్ చేసుకోటానికి గొప్ప థెరపీని అందించింది. ఆమె ఇతర కథలు కూడా వస్తువుల్లో, టెక్నిక్ లో తెలుగు కథా సాహిత్యానికి ఒక మంచి చేర్పు.
ప్రసిద్ధ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో రచనల అనువాదంగా “సియా హాషియే” తెచ్చిన పూర్ణిమ, “ఎలమి” ప్రచురణలను రోహిత్, ఆదిత్య కొర్రపాటి తో కలిసి నిర్వహిస్తున్నారు.
కొత్త పుస్తకం తెస్తున్న రచయితలెవరన్నా తన పుస్తకాన్ని పాఠకులు ఎందుకు చదవాలో చెప్పుకుంటారు కదా! ఈ పూర్ణిమ మాత్రం “ఇవి అందరికీ నచ్చే కథలు కావు. అందుకని ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ పుస్తకం కొనండి“, అని తన పుస్తకం బ్యాక్ కవర్ మీదనే చెబుతుంది. ఆమె మాటలను పట్టించుకోకుండా “ఎమోషనల్ ప్రెగ్నెన్సీ” కొనుక్కుని చదవండి. అక్కడొక విలక్షణమైన కథా ప్రపంచం ఎదురవుతుంది.
(ప్రతులకు : ఎలమి పబ్లికేషన్స్, ఫోన్: +91 8247474541)