కుయ్యిమని సైరన్ కూసింది. కార్మికులు నిద్రమొహాలతో, మసి, దుమ్ము నిండిన గుడ్డలతో ఉరుకులు పరుగుల మీదొచ్చారు. క్యాంటీను దగ్గర కొద్దిగా ఆలిస్యంగా వచ్చిన ముసలి గూనివానికి కోడిగుడ్డు దొరకనే లేదు. వాడు గుడగుడలాడుతూ రొట్టె ముక్కను విసిరికొట్టి పరిగెత్తాడు… రైటర్ దగ్గర టోకన్లు పడేసి లైటు క్యాబిన్లో లైట్లు తీసుకొనేటాల్లకు – సెమ్మాసులు ఓ నాలుగు తక్కువపడ్డాయి… ఉన్నవాటికి కామలు సరిగా లేనే లేవు. కామలున్నవి లుకలుక లాడుతున్నాయి. తట్టలు జల్లెడలై పోయాయి…
“మాకు మంచి ఇసెరెలు ఇయ్యకుంట పనిదీసుకోను సూత్తండ్లు – కంపనీ దివాళా తీసిందా? బిచ్చమెత్తుకుంటందా?” అన్నాడు ఓ దొడ్డు పెదిమల కార్మికుడు.
“నాకదంతా తెలువదు భయ్. మీ తీటుంటె దీసుకోండ్లి – లాపోతే మానేయ్యిండ్లి – తుమ్ జానే కంపనీ జానే.” అన్నాడు పొట్టి క్లర్కు…
బాయి గడ్డమీద టోపి చేతబట్టుకొని వోర్మెన్ కేకలు పెడుతున్నాడు…
వెనుకొచ్చిన ముసలివాడికి తట్ట దొరకలేదు. సెమ్మాసు దొరకలేదు…
“నీయవ్వల కుక్కల్ దెం… ఏడికిబోయిన అల్లుకుబోతె పిల్లెదురైనట్టున్నది పని వరుస ” గొనిగాడు…
“ఎందుకత్తివిరా? ఏడనో మల్లో పవ్వగొట్టి పండక ” అమ్మోరు మచ్చల కమాన్ కిసకిసలాడిండు…
“ఔ బాంచెన్ కంపెనిచ్చే జీతానికి – శేషిచ్చే బియ్యానికి పవ్వలు గొట్టే టట్టున్నది బతుకు…” ముసలివాడు.
“ఏమాయెర్రా… టోకన్ పడేత్తె అయిపోయిందా?” వోర్మెన్.
“నాకు సెమ్మాసులేదు, తట్టలేదు” అన్నాడు ముసలివాడు.
“బి క్విక్…” మళ్లీ అరుపు…
“చేతులతో నెత్తు – పంచెల ముల్లెగట్టి లాడీసులెయ్యి” అన్నాడెవడో…
“మాకు పని ఇసిరెలు గావాలె-” అని ఒక యువకుడు కేక బెట్టాడు.
వోర్మెన్ బూట్లు టకటక లాడించుకుంటూ వచ్చిండు…
“ఉన్నయేవో తీసుకుని నడువుండ్లి.”
“లేనోల్ల మాటో?” ముసలివాడు…
వోర్మె న్ తలగోక్కున్నాడు…
“మాకు పని ఇసెరెలు గావాలె.” మళ్లీ ఓ అరుపు…
“సచ్చినోడు లేసి రావాలంటరు? లేవంటే ఏం జేత్తరు? ఇండెంటు జేద్దాం – జనరల్ స్టోరు నుంచి తెప్పిద్దాం.”
“ఆ పని అయిపోయింది. జనరల్ స్టోరులోనే లేవట ఇంకా రాలేదట.” క్లర్కు.
“ఇంతకూ ఏం జెయ్యమంటరా?” వోర్మెన్ బుర్ర వేడెక్కి పోతంది.
“ఎందుకులేవో బాయి అండర్ మేనేజరు నడుగుదాం…” అన్నాడెవడో.
“పా” అంటే “పాండ్లి” అనుకున్నారు. వోర్మె న్ చిరుబురులాడుతూ పోన్ దగ్గరికి పరుగెత్తిండు.
కార్మికులు బాయికి నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉన్న మేనేజరు దగ్గరికి పోయే సరికి మేనేజరు ఇంకా రాలేదు. చెట్ల కింద కూలబడి పోయారు…
అండర్ మేనేజరు కారులో వచ్చేసరికి తొమ్మిదయ్యింది. మేనేజరు వచ్చీ రావడంతోనే ఇంగ్లీషులో తిట్టడం సాగించాడు…
నలుగురైదుగురు ముందుకు జరిగి “సార్ నెలదినాలనుంచి చెప్పుతన్నం సెమ్మాసులు తట్టలు సరిపోతలేవని – ఉన్నవి లుకలుకలయినయని…”
“యూ బాస్టర్డ్స్ – లోపలికి దిగాల్సిందే…” అండర్ మేనేజరు అరిచి – లోపలికి నడిచాడు…
కార్మికులు ఒకల మొఖాలొకరు చూసుకున్నారు. లోపలికి పోయిన మేనేజరు ఫోన్ చేసి పర్సనల్ ఆఫీసర్‌ను పిలిచాడు. పర్సనల్ ఆఫీసర్ కాయిదాలు పట్టుకొని స్కూటర్ మీదొచ్చిండు. కార్మికులకేసి చూడకుండానే మేనేజరు గదిలోకి వెళ్లి మళ్లీ వచ్చాడు…
చెట్టుకింది కార్మికుల్లోకి సైగచేసి తన రూంలోకి పోయి కూర్చున్నాడు… కార్మికులు తర్జన భర్జన పడి వాళ్లల్లో నలుగురిని పంపించారు…
పంఖాకింద పర్సనల్ ఆఫీసర్ తీరిగ్గా కుర్చీలో జారగిలబడి కూర్చుండి కళ్లద్దాలు తీసి టేబుల్ మీద బెట్టాడు. మసిబట్టల కార్మికులు లోపలికి ప్రవేశించారు.
“ఐసీ…నీ పేరేమిటి? అలీ…నువ్వే యూనియన్లోనన్న మెంబరువా? నీ పేరు దాసు – ఏందాసు రాందాసా? దేవదాసా! నెక్టు, వీరమల్లు…నువ్వు నారాయణరెడ్డి.. బాగుంది…ఐమీన్ నేననుకుంటున్నదేమిటంటే – మీరంతా సమ్మె…”
“గంత పెద్ద పేరెందుకుసార్…పని ఇసిరెలు కావాలంటన్నమ్” వీరమల్లు.
“ఐసీ…కూర్చోండి… ఔను దానికి మీ రిప్రజెంటేషన్ ఇదేనా? ఐమీన్ మీకు గుర్తించబడిన యూనియన్లున్నాయి. వాటి ద్వారా అడుగొచ్చుకదా!”
“ఇప్పుడు యూనియన్ లీడర్లకేడ దిరిగేం?” నారాయణ రెడ్డి…
“మీరు కూర్చోనే లేదు… ఇప్పుడు టైమెంత? పది…అంటే మూడు గంటలు పని నిలిచి పోయింది… నా అంచనా ప్రకారం మీరంతా నూరుకు పైన్నే ఉంటారు…”
“యేసబ్ క్యా హై సాబ్ అమ్ కు షెమ్మాస్ దిలాదో హమ్ కామ్ పే అబీ చలేజాయింగే-” అలీ…
“నా పాయింటది కాదు…మీరు మూడు గంటలు సమ్మె చేశారని నేనంటున్న…”
“మీ మాటలకేమొచ్చె – తీరింది మొగోడ ఊరుదాటియ్యిమన్నట్టు – సల్లగ పంఖ కింద కూసుండి తీకునాలు దీత్తండ్లు. మీనుంచి కాపోతె చెప్పుండ్లి మేనేజరునే అడుగుతం… అదిగో! గడుసెగ్గెలితనం… ఇసెరెలు మీరేయియ్యరు… మీది కెల్లి ఇయ్యి మంటె సమ్మె సేసిండ్లంటరు… వారేవా! మంది కొంపలు ముంచేతందుకు బాగనే సదువుకున్నరు” అనేసి వీరమల్లు ధుమధుమలాడుతూ వెళ్లిపోయాడు.
పర్సనల్ ఆఫీసరు చిత్రంగా నవ్వి… “మీకు తెలుసో తెలియదో! రెండు సంవత్సరాల దాకా సమ్మె చేయడం చట్ట ప్రకారంగా నేరం… మీ యూనియన్లు మేనేజిమెంటుతోని చేసుకున్న ఒప్పందం… ఒకవేళ మీరట్లా సమ్మె చేస్తే…”
“చేస్తే” నారాయణరెడ్డి రెట్టించాడు.
“వెరీ సింపుల్ ఎనిమిది మస్టర్ల కోత…” పర్సనల్ ఆఫీసర్ కుర్చీలోనుండి లేచాడు…
“ఎవ్వన్నడిగి సేసుకున్నరు గీ ఒప్పందాన్ని… మరిగిప్పుడు తట్టలు సెమ్మాసులు తెచ్చియియ్యిమను… లంగలు బంచత్…” దాసు అన్నాడు.
“అక్కడ వరండాలో అలాంటి నోటీసున్నది బాగా చూడుండ్లి. మరింక మీరు వెళ్లొచ్చు” పర్సనల్ ఆఫీసర్ మేనేజర్ గదిలోకి వెళ్లాడు…
వరండాలో కొచ్చేసరికి కార్మికులంతా గుమిగూడారు. పర్సనల్ ఆఫీసర్ చెప్పిన మాటలు అందరికి చెప్పిండ్లు. వరండాలో నోటీసు కాగితం నారాయణరెడ్డి చదివి చెప్పిండు.
“నీయవ్వల కుక్కల్… ఇటునుండి యూనియన్ చందా గుంజేది కాక అటునుంచి డబ్బు గుంజినారన్న మాట…” ముసలోడు అంతూ పొంతూ లేకుండ తిట్టసాగిండు…
అందరు రెచ్చిపోయారు. తలోమాట – తలో తిట్టు. అక్కడి వాతావరణం తిట్లతో నిండిపోయింది… సమస్య ఎటూ తేలలేదు… మధ్యలో పర్సనల్ ఆఫీసరొచ్చి “మీరు పనిలోకి వెళ్ళకుంటే మేం పోలీసుల బిలవాల్సి వస్తుంది…” అన్నాడు.
“పిల్సుకో – ఆనవ్వల – మీ యవ్వల…” ముసలివాడు రెచ్చిపోయాడు…
మధ్యాహ్నం దాటిపోయింది. కొందరు “ఎట్లా చేసుకున్నారో? ఎవన్నడిగి సేసుకున్నారో ఒప్పందం యూనియన్ లీడర్ల అడుగుదాం పాండి” అన్నారు… మరి కొందరు “గాల్లనడిగేదేంది నాలంజెపియి” అన్నారు మరికొందరు. “మనదిక్కు తప్పయితదేమొ, పనిలకు పోనైతెపోదాం” అన్నారు. ఈ చివరి మాటలే నెగ్గాయి. కార్మికులంతా బాయి దగ్గరికి వెళ్ళారు. హాలరు తిరిగింది.
అంతవరదాకా నిశ్శబ్దంగా ఉన్న బాయి వాతావరణంలో కలకలం బయలు దేరింది. లాడీసులు కదిలినయ్. బొగ్గు పెళ్ళలు కూలినయ్. చెమ్మాసులాడినయ్ …
** **
మరొకనాడు మరొక బాయిలోపల –
పొక్కలమందు దట్టించి – వైర్ ను అంటించి పెంటయ్య దూరమురికాడు. బత్తి పేలింది. బొగ్గు కూలింది. కమాన్ వచ్చి కర్ర టకటకలాడించి రూఫ్ చూశాడు. టింబర్మెన్ పిలిచి నాలుగైదు చోట్ల మీట్లు పెట్టించాడు. ఫిల్లర్సు కాసెలుబూసి, బూట్లు సరిచేసుకొని సెమ్మాసులు, తట్టలు బట్టుకొని కూలిన బొగ్గు కుప్పదగ్గరికి నడిచారు.
కాని టబ్బులు రాలేదు… అర్ధగంట – గంట గడిచిపోయింది… కార్మికులు చెమటలు కక్కుతున్నారు. అయినా టబ్బులు రానేలేదు.
గంటబోయి రెండు గంటలు – మూడు గంటలు – నాలుగు గంటలు గడిచినా టబ్బులు రాలేదు. వోర్మన్ వచ్చిండు…
“టబ్బులన్ని సిక్కులో ఉన్నయి. ఇయ్యల్లరావు” అని చావు వార్త చల్లగా చెప్పిండు.
“అసలు చాలినన్ని టబ్బులుంటెగద… ఆర్నెల్లనుంచి గిదే బాగోతం… వర్కు షాపు లేంజేత్తండ్లు…? ఎన్నడు సక్కంగచ్చినయ్ గన్క…” పోశాలు అనే కార్మికుడు.
“దుత్తెరి సంచులు సదురుకొనేటాల్లకు అంగడిచ్చుల్లా…” కొమురయ్య అనే కార్మికుడు…
తలోమాట – అందరు బాయి పైకెక్కారు… అప్పటికే ఎక్కినవాళ్లు ఇదే మాటలు చెప్పుకుంటున్నారు…
“ఊకె గిదేం రంజాటకం – అడుగుదాం పాండ్లి” ఎవడో అన్నాడు.
ఇంకా సైరన్ కూయడానికి గంటటైమే ఉన్నది. లైట్లు పడేసి అందరు మేనేజర్ రూం దగ్గరికి నడిచారు. ఈ మేనేజరు మనిషి వేరు. కాని అవే తిట్లు… ఇంగ్లీషు తిట్లు.
పర్సనల్ ఆఫీసర్ కాళ్లెగరేస్తూ వచ్చిండు… పేడి మూతి. వీడు అదే మాట – “కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె హక్కు నిషేధింపబడ్డది. నోటీసులు చదువుకోండి.”
కార్మికులు నోటీసులు చదివి చెప్పగా విన్నారు… కోపం పట్టలేక అయిలయ్య అనే కార్మికుడు గిదగిద ఉరికి నోటీసు కాయిదాలు చించేసి కసపిస తొక్కిండు…
కార్మికులు కదిలిండ్లు. “మాకు పని ఇసెరెలు” ఒకడు అరిచిండు.
రేగిన దుమ్ములో, ఎత్తిన పిడికిల్లు “కావాలి” అన్నాయి… “మాకు పట్టినన్ని టబ్బులు…”
“కావాలి.”
ఊరేగింపు సాగింది…
మేనేజరు ఆకుపచ్చ అద్దం కిటికీ తెరిచి కళ్లద్దాల గుండా చూసి “బాస్టర్డ్స్, రోగ్సు.” అని తిట్టి ఫోనందుకున్నాడు…
టౌన్ పోలీసు స్టేషన్లో ఫోను మోగింది.
** **
మరో బావి దగ్గర గూని కార్మికుడొకడు కుడికాలు ఎగేస్తూ నాలుగు అడుగులేసి ఆగిపోతూ రైటర్ దగ్గరికొచ్చి “నీ తల్లి… రెక్కాడు తె డొక్కాడె బతుకాయె – మస్టర్ బోతే మన్నేగతి” అని గొనిగి టోకన్ పడేసి వోర్ మన్ దగ్గరిదాకా నడిచి రెండు చేతులెత్తి దండం బెట్టిండు.
వోర్మెన్ ముఖం – చిట్లించిండు.
“సార్…నిన్న మేనేజర్ సారొచ్చి నన్ను దవాకానల ఫిట్టు పిచ్చిండు. పదిహేనొద్దు లాయె బొగ్గు పెళ్ళ కాలు మీద పడి – తమరి డ్యూటీనే కదా! ఆ పెళ్లపడేది నెత్తిమీద పడితె గీపుల్లెందులే తప్పేది…”
రాయలింగం అనే ఆ కుంటి కార్మికుడు.
“గ మాటలన్ని తర్వాత – లైట్ తీసుకపో… నడువ్” అన్నాడు వోర్మెన్…
“గదేసార్…నిన్న మేనేజర్ సాబ్ కాలుపుండు మగ్గలేదు ఫిట్ కానంటే, నాకు ఏదన్న సర్ఫేసు వర్కిప్పిత్తనన్నడు…” అన్నాడు…
“అందరు సర్ఫేసు మీన్నే పంటె – బాయి లోపలెవ్వడు దిగాలె – మేనేజరే దిగుతడో! నువ్వే దిగుతవో నాకు తెలువదు. ఐ వాంట్ కోల్…” అని వోర్మన్ చరాచరా వెళ్లిపోయాడు…
“వీనవ్వ… ఒకని కాలు సెప్పు ఒకనికి పడది. వెయ్యో రెండు వేలో దెం…బెడితె సర్ఫేసు వర్కిత్తరు” అని గొనుగుతూ అండర్ మేనేజర్ గదికేసి నడిచిండు.
మేనేజరు కుర్చీలో చాలా వర్రీగా కూర్చున్నాడు. నిన్న పార్టీలో తన పెళ్ళాం మిస్టర్ ఖన్నా కళ్లలోకి చూసిన చూపు అర్థమేమై ఉంటుందో? తన కొడుక్కు మెడిసిన్లో సీటు వస్తుందో రాదో తెలియకుండా ఉంది… ఇంతలో రాయలింగు ప్యూనును బతిమిలాడి లోపలికి ప్రవేశించాడు…
“అయ్యా బాంచెన్…” రాయలింగం దండం బెట్టాడు. “గోటూ హెల్…” అన్నాడు మేనేజర్…
“నిన్న తమరు దవాఖాన కచ్చి ఫిట్ చేయిస్తిరి. సర్ఫేసు వర్కిప్పిత్తనంటిరి…”
మేనేజర్ సిగరెట్టు ముట్టించాడు…
“పో…పనిలోకి పో…” అరిచిండు.
రాయలింగు కళ్లల్లో నీళ్లూరినయ్… కుడికాలు మీదికెత్తి పచ్చిపచ్చిగా ఇంకా సొనకారుతున్న పుండును పట్టి జరిపి చూయించి – “అయ్యా! కాలు ఇరిగిపోతాండే – తమరు మామంచికే చెప్పిండ్లు – ఇవ్వారకే పదిహేనోద్దులు నాగబెడ్తి – పోరాగాండ్లు సిన్నోల్లు – సర్ఫేసు వర్కిప్పిత్తనంటరి” రాయలింగు గొంతు పూడుకపోయింది.
“అన్ననా! నీ ఇష్టం. ఇవ్వాళ లోపలికి పొమ్మంటున్న పో… సర్ఫేసువర్కులో చాలామందున్నారు…” అన్నాడు…
రాయలింగుకు దుఃఖం స్థానే కోపం పొంగింది…
“మీది నాలికా తాటిమట్టా…” అన్నాడు.
“యూరబ్బిష్. గెటవుట్…”
“పోతసార్… పోత… నేనే పచ్చనోట్లు బట్టుకత్తె సర్ఫేసు వర్కిత్తురు…” అన్నాడు రాయలింగు.
“ఐసే గెటవుట్…నీ తాత ముత్తాతతో చెప్పుకపో – యూరబ్బిష్…” మేనేజరు అరిచిండు…
“పోతసార్ – తమరి మిండెల దగ్గరికేపోత.” రాయలింగు కుంటుతూ నెత్తి మాడ్చే ఎండలో కుతకుతలాడుతూ తిడుతూ నడిచి టౌన్లో కొచ్చాడు… ఆ ఊపులో అట్లా అనేశాడు. కాని అతను ఇదివరకు ఇలాంటివి చూసిన వాడు కాడు. ఎవరిని కలువాలో తెలియలేదు.
మధ్యలో మరో కార్మికుడు కలిశాడు… అతనికి ఈ సంగతి చెప్పుకున్నాడు.
“నువ్వే యూనియన్లున్నవ్…” అడిగిండు కార్మికుడు…
రాయలింగం తెల్ల మొఖం వేసిండు…
“కాంగ్రేసు యూనియన్లనా? కమ్యునిస్టు యూనియన్లనా?”
రాయలింగు మరీ తికమక పడిపోయాడు.
“పోనీ నువ్వు నెలానెలా చందా నాగభూషణం సారుకు గర్హన్నవా? ఎంకటరెడ్డికి కడుతన్నవా?”
“ఓ అదా ఇద్దరికి కడ్తన్న” అన్నాడు రాయలింగం…
“అయితే ముందుగాల నాగభూషణంసారు దగ్గరికి పో… గిట్ల నాలుగడులెత్తే కంకి కొడవలి ఎర్రజెండ కనిపిత్తది. లోపటికి బోతె ఎర్రగ గుండుకు గుండున్న సారుంటడు – గయినకు జెప్పు” అన్నాడు.
రాయలింగు కుంటుకుంటూ పోయేసరికి ఎర్రజెండ ఆఫీసు మూసున్నది… చాలా సేపు ఎదురుచూసి వెంకటరెడ్డి ఆఫీసెక్కన్నో అడిగిపోయేసరికి అక్కడ చెయ్యి గుర్తు జెండున్నది –
లోపల వెంకటరెడ్డి బంగారుంగరాల చేతులు చూసుకుంటూ కూర్చున్నాడు…
రాయలింగం దండం బెట్టి తన గోడంతా చెప్పుకున్నాడు. వెంకటరెడ్డి మధ్యలో చాయ్ తాగి – ఫోన్ ఎత్తి ఎటో రింగు చేసిండు…
“చూడు నీ పేరేమిటన్నవ్… రాయలింగుకదూ! నువ్వు ఇవ్వాల్ల పని చేసి అడుగాల్సింది. సరే నేను మాట్లాడిన – ఇంతకూ నువ్వు చందా కడుతున్నావా?”
“నెలకు అయిదిత్తన్నసార్…” అన్నాడు…
“కంపినీల పనంటె కట్టె కొట్టె తెచ్చెనన్నట్టుంటదా? ఉండది కదా? నేను చెప్పుత… మళ్లీ రేపు గలువు. సూత్తాం…” అంటూ ఎటో లేచిపోయాడు.
చేసేదేమిలేక మళ్ళీ రేపొచ్చి కలిశాడు. వెంకటరెడ్డి తనకు ఇవ్వాల్ల ఎటో పోయే పనున్నదని కారెక్కి వెళ్లిపోయాడు. మరోనాడు… తర్వాత రమ్మన్నాడు… ఆఫీసు బయటకు నడిచేసరికి ఆనాడు సలహాయిచ్చిన కార్మికుడు కలిశాడు…
“నువ్వు పొమ్మంటివి వీడేమో రేపురా రేగ్గాయిత్త మాపురా మారేడు కాయిత్త నంటండు” అన్నాడు…
“ఉత్త సేతుల బోయినవా?” ఆశ్చర్యపడుతూ అడిగిండు…
ఈసారి ఆశ్చర్యపడడం రాయలింగు వంతయ్యింది…
ఆ కార్మికుడు నవ్వి, “దచ్చిన గావాలె అంటే డబ్బు” అన్నాడు…
“ఓసినీ తల్లి…గయ్యుంటే గీపుల్లెందలెందుకు? నీ యవ్వల…” కాండ్రకిచ్చి యూనియన్ ఆఫీసు దిక్కు ఉమ్మేసి నడిచిండు.
అదే కాళ్లమీన కమ్యునిస్టు లీడర్ దగ్గరికి నడిచిండు. నాగభూషణం గుండ్రంగా కుదిమట్రంగా ఉన్నాడు… “నువ్వు వెంకటరెడ్డి దగ్గరికి పోయినవా?” అన్నాడు. రాయలింగు సంగతంతా చెప్పిండు… నాగభూషణం అంతా విన్నాడు.
“అవునోయ్ నీ పేరేందన్నవ్…రాయలింగం… పెట్టుబడిదారుల కుట్రలన్ని అట్లాగే ఉంటాయి. అసలు నువ్వు ఫిట్ కాకపోవల్సింది…” అంటూ చాలా సేపు యాజమాన్యాన్ని మేనేజర్‌ను తిట్టి – “కార్మికులు ఐక్యంగా ఎర్రజెండ నీడకింద పోరాటం చేయటం ద్వారానే మన హక్కులు సాధించుకోగలుగుతాం…” అని నాలిక్కరుచుకొని “ఇంతకూ నువ్వు చందా ఇస్తున్నావా?” అన్నాడు.
“నెలకు పది కడుతున్నసార్…”
“సరే నేను మాట్లాడు…” అన్నాడు.
“సార్. తిరిగి తిరిగి నాకు యేట్టచ్చింది… కాలు పుండు రెచ్చిపోయింది… ఇంట్ల తిండికి పిరికెడిత్తులు లేవు…” రాయలింగు.
“అట్లేగిరపడ్తే ఎట్లా? మన సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవాలి” అన్నాడు…
మళ్లీ రేపు యూనియన్ ఆఫీసుకు వస్తే తెలిసిన సత్యం… లీడర్ కు లంచం…
రాయలింగుకు ఏడుపొచ్చింది… ఎర్రటెండలో కాలే కడుపుతో వేపచెట్టునీడ సొమ్మసిల్లిపోయి కూర్చున్నాడు… అతని కళ్లకు చీకట్లు కమ్ముతున్నాయి… తన స్వంత ఊరు, అమ్ముకున్న పెరడి చెక్క, కూలిపోయిన గుడిసె మసక మసకగా కనిపించాయి… అట్లా దిక్కు తోచక ఎండపోయి చీకటొచ్చేదాకా కూర్చున్నాడు. కరంటు బుగ్గ లెలిగినయ్… యూనియన్ ఆఫీసుముందు ఎర్రజెండ రెపరెప లాడుతోంది… దీనంగా ఎర్రజెండకేసి చూసి ఇంటిదోవ బట్టిండు. ఇంటిదగ్గర పిల్లలు ఏడుస్తున్నారు.
పిల్లల తల్లి మాటాపలుకు లేకుండా కాల్లు బారజాపుకొని కూర్చున్నది… ఎవరికైనా చెప్పడానికేమున్నది? అడగడానికి వాళ్లకు ఏమి మిగలలేదు… ఇదేకాలుతో బాయిలో దిగలేడు. అటిటు తిరుగా అయిదు రోజులు గడిచి పోయినయ్… ఇంకో మూడు రోజులకు కొలువు పోతది… మరింక తనకు దిక్కెవరు? గడంచ వాల్చుకొని మునుగ దీసుకొని పన్నాడు. రాత్రంతా పీడకలలు – పీడకలల మధ్య నిద్ర… తెల్లారకముందే పెళ్ళాం లేపింది…
“నీ ఏడుపేదో బాయి మీనీకే పొయ్యి ఏడువరాదు… నీ దుఃఖం సుఖం నీతో పని జేసినోల్లకే సెప్పుకోరాదు…” అన్నది పెళ్ళాం…
అదీ నిజమే ననిపించింది. మళ్లీ కుంటుకుంటూ బాయి మీదికి నడిచాడు. ఇంకా తెల్లారనే లేదు. పొద్దు పొడిసి బారెడెక్కే దాకా గువ్వ పిట్టలాగా ఒదిగి కూర్చున్నాడు.
ఏడుగంటలకు సైరన్ కూసింది. బాయి లోపలినుండి కార్మికులు బిలబిల బయట కొచ్చారు. పొద్దటిషిప్టు పనిమీదికి పోయేవాళ్లు వచ్చారు…
రాయలింగు వాళ్లందరిముందు తన పాత గుడ్డపరిచి కన్నీర్లు కారుతుండగా… “అయ్యలాలా! అన్నలాలా! నేను మీతో పనిజేసినోన్నే – మీ అందరి కండ్ల ముంగటనే – నా కాలుమీద బొగ్గు పెళ్ల బడి దవాఖాన్ల పదిహేనొద్దులున్న – పది హేనో నాడు మన సుప్పనాతి లంజకొడుకు మేనేజరు గాడచ్చిండు… ఫిట్ గా సర్ఫేసు వర్కిత్తనన్నడు. కావచ్చునని సంబురపడ్డ… సంబుర పడ్తేమయ్యింది?” గుక్క తిప్పుకున్నాడు.
“ఓరి నీ యవ్వన్ కుక్కల్…” అన్నాడు ఒకడు…
“గిందట్ల కిటుకేందో మీకేరికేనా?” అన్నాడు నారాయణ అనే కార్మికుడు…
“దె హెఁమీ మాట మీదేగాని ఆన్ని చెప్పనిత్త రాలేదా?” అన్నాడు మెల్లెకన్నువాడు…
“మొన్న సోమారం నాడు బాయి మీనికచ్చిన – అత్తేమయ్యింది? బింగి సెవుల ఓర్ మన్ నాకెరుకలేదన్నడు… ఆన్నుంచి మేనేజరుగాని దగ్గరికురికిన – ఆడేమన్నడు. నిన్న ఫిట్ కమ్మన్న ఇయ్యల్ల బాయిల దిగుమంటన్న – నీకు దిక్కున్న కాడ జెప్పుక పొమ్మన్నడు… ఓ పెద్దమనిషి లీడర్లకు గలుపుమన్నడు. అయిదు దినాలనుంచి పుచ్చిన కుక్కతీర్గ ఆళ్లసుట్టు దిర్ధిన… ఆఖరుకేం దెలిసింది? ఆ లంజ కొడుకులకు డబ్బే కావాల్నట… గ డబ్బే ఉంటే గీ బొగ్గు పొక్కలకు కొలువు కెందుకత్తు…? అయ్యా! నా దిక్కల్లా గీ రెండు రెక్కలు… నా కాలు సూడుండ్లి” అని సొనకారుతున్న కాలుచూయించి “నా దిక్కల్లా నాతో పని జేసిన నా అన్నలు తమ్ములు మీరే – అన్నమే పెడుతరో మన్నే పెడుతరో పెట్టుండ్లి – మీకు పబ్బతి బట్టిన” అని ఏడువసాగిండు.
ఒకడొచ్చి రొమ్ము కదుముకొని “పిస్సోడ ఏడుత్తారు” అన్నాడు.
నారాయణ అనే కార్మికుడు “ఇది కొత్తగాదు… ఇందట్ల చిన్న కిటుకున్నది. ఏక్సిడెంటుల పద్దెనిమిది రోజుల కన్నా మించి ఉంటే ఆక్సిడెంటు కాంపన్సేషన్ డబ్బు గట్టియ్యాలె – గందుకనే ఆడు 15 రోజులకే ఫిట్ చేయించిండు” అన్నాడు.
“మేనేజరుగాడెట్ల చెప్పిండో, డాక్టరు గాడెట్ల ఫిట్ చేసిండ్లో అడుగుదాం పాండ్లి…” అన్నాడు ఒకడు.
“మళ్ల సమ్మె చేసిన మంటరేమో?” అన్నాడు ఒకడు…
“అదె ఎందుకురా?” మరొకడు.
“రెండేండ్లదాక సమ్మె చేయద్దనలేదా?”
“వానిత్తుల వాని కానూనిత్తుల బ…సికొడితే – ఏ లంజకొడుకు మన తరపున గట్ల ఒప్పందం సేసుకుంటడు…” అన్నాడు ఒక గూనివాడు.
డ్యూటీ దిగినవాళ్లు, డ్యూటీలో కెక్కేవాళ్లు రెండు వందల మంది జమైయిండ్లు… ఊరేగింపు సాగింది…నినాదాలు…
“మేనేజిమెంటు దౌర్జన్యం నశించాలి.”
“యూనియనోల్ల లంచగొండితనం నశించాలి.”
“పని ఇసెరెలు సక్రమంగా సప్లయి చేయాలి.”
“ఆక్సిడెంటు కట్టి ఇవ్వాలి.”
“మేనేజరు ముర్దాబాద్, డాక్టరు ముర్దాబాద్, యూనియనోల్లు ముర్దాబాద్…”
నినాదాలతో మేనేజర్ గదికేసి ఊరేగింపు సాగింది…
మేనేజర్ గది ముందుకు ఊరేగింపు చేరకముందే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేరింది. కార్మికులు ఇంకా నోరు విప్పకముందే లాఠీచార్జి మొదలయ్యింది.
దెబ్బలు పెఢీ పెఢిన…
కొందరికి తలలు పగిలాయి మరికొందరికి చేతులు విరిగాయి… కొందరు అడ్డదిడ్డంగా పడి దిక్కు మొక్కు లేకుండా పరుగెత్తారు… మరికొందరు ఫిట్ కేసి పరుగెత్తారు…
రాయలింగు ముక్కుమూసుక పడిపోయాడు. అతని ఒంటిమీద గుబ్బలు తేలేదాకా ఒక పోలీసు కొట్టాడు…
ఫిట్ దగ్గర వందమంది దాకా కార్మికులు జమయ్యారు. ఎవడో గుడ్డి కన్నువాడు బొగ్గు కుప్పమీదికెక్కి చేతులారుస్తూ “నా కన్ను సూసిండ్గా బొగ్గు పెళ బడి చితికి పోయింది. ఈ లంజకొడుకు నన్ను గట్లనే సేసి నువ్వు అఫిట్ పొమ్మన్నడు…ఎనుకట గిట్లనే సేసి మత్తెక్కిన” అంటూ చెప్పసాగిండు…
ఆ ఫిట్ నుండి ఆ వందమంది మరో ఫిటుకు తరలిండ్లు – అక్కడ రాయలింగు వచ్చి చేరిండు…
“అయ్యలాలా సూసిండ్ల – నేను గీ బొగ్గు బాయిల సేరినప్పుడు కారున బడితె అముర కుంటుంటి – గిప్పుడో సీకేసిన బొక్కయి పోయిన – నా నెత్తురు గీ బొగ్గు బాయి మింగింది… నా వొంట్లె నెత్తురుగాదు మసి మిగిలింది… గీడికచ్చిన లీడరు లంజ కొడుకు లెట్లయ్యిండ్లు? ఇయ్యల్ల పుండుకాలుతోని నాతరంగాదు, మీది పనియ్యమన్న – అది సుత నా కాలు సూడుండ్లి…” అని మొత్తుకున్నాడు…
బొగ్గు లోపల నిప్పురవ్వల చిట్లించింది మేనేజుమెంటు – ఈ బొగ్గు ఆర్నెల్ల నుండి రగులుతూనే ఉన్నది… ఇవ్వల్ల గుప్పుమంది… అది కార్చిచ్చులా బాయిలన్నిటికి వ్యాపించింది.
ఫలితంగా ముప్పయేడు బావుల్లో ఒక్క బావి దగ్గరన్నా హాలరు తిరుగలేదు. లాడీసులు నడువలేదు.
బాయికడుపులో నుండి ఒక్క బొగ్గు పెళ్ళ బయటకు రాలేదు…
** **
సి.ఐ.డి సర్కిలిన్ స్పెక్టరు అప్పటికి ఆరవసారి డి.ఐ.జి.తో మాట్లాడిండు… డి.ఐ.జి సరాసరి కార్మిక మంత్రిని వెంటబెట్టుకొని ముఖ్యమంత్రిని కలువబోయుండు – ముఖ్యమంత్రి ట్రేడ్ యూనియన్ నాయకులను, సి.ఐ.డి. అధికార్లను, బొగ్గుబావుల డైరెక్టరును, ఆ డైరెక్టరు మేనేజర్లను జరూరుగ పిలువనంపిండు…
** **
అందంగా అలంకరింపబడిన భవంతిలో బావి మేనేజర్లు, డైరెక్టర్లు ఐ.జి.పి. అతని పరివారము, కార్మికమంత్రి అతని పరివారము, ట్రేడ్ యూనియన్ నాయకులు సమావేశమయ్యారు…
గనుల డైరెక్టరు తన నివేదిక చదివాడు… “గత పది సంవత్సరాలల్లో పోల్చితే ఈ సంవత్సరం – సమ్మెలు మూడు వందల పదిహేను జరిగాయి… అందుచేత గుర్తింపబడిన ట్రేడ్ యూనియన్లతో కలిసి గత ఫిబ్రవరి నెలలో కార్మికమంత్రి సమక్షంలో ఉమ్మడిగా సాధక బాధకాలు చర్చించి దేశీయ బొగ్గు అవసరాల దృష్ట్యా రెండు సంవత్సరాల దాక సమ్మెను నిషేధిస్తూ చట్టం చేయనైనది. ఈ చట్టం ప్రకారంగా పదిహేను రోజుల ముందుగా నోటీసు లేకుండా చేసిన సమ్మె చట్ట విరుద్ధమైంది. దాని ప్రకారంగా సమ్మె కాలంలో జీతం కోత నటుంచి ఎనిమిది రోజుల మస్తరుకోత కూడా విధించవచ్చు… ఇట్లా గనుల ప్రాంతంలో కార్మికశాంతిని పునరుద్ధరించి గత సంవత్సరంకన్నా ముఫ్పై లక్షల టన్నుల బొగ్గు అధిక ఉత్పత్తి సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాము…”
“ఇంతకూ యూనియన్లతో అగ్రిమెంటు కుదుర్చుకున్న తరువాత సమ్మెలు చేసేదెవరు?” ముఖ్యమంత్రి చిరాకు పడ్డాడు…
“గత మూడు సంవత్సరాలుగా తీవ్రవాద గ్రూపులు ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నాయి.” డి.ఐ.జి తన నివేదికను సమర్పించాడు…
ఆ తరువాత డి.ఐ.జి. ముఖ్యమంత్రి, కార్మికమంత్రి కలిసి రహస్య మంతనాలు సాగించారు…
కార్మికమంత్రి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఈ విధంగా తెలియజేశాడు… “ప్రస్తుతం వివాదానికి కారణమైన ఆ కార్మికున్ని పనిలోనికి తీసుకొని ఒక వారం రోజులు సర్ఫేసు వర్కివ్వాలి. జీతాల రోజునాడు నోటీసు వేసి సమ్మెలో పాల్గొన్నవారికి పనిచేసిన రోజులకు ఎనిమిది రోజుల వేతనం తగ్గిస్తున్నట్టుగా తెలిపి ఆ జీతం కోసి మిగతా జీతాలివ్వాలి… చురుకుగా సమ్మెకు ప్రోత్సహిస్తున్న శక్తులను, ఇతరత్రా తీవ్రవాద రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తుల లిస్టు బావి మేనేజర్లు తయారుచేసి వాళ్లను పనులనుండి తొలగించాలి… నాలుగు బెటాలియన్ల అదనపు పోలీసు బలగాలను సింగరేణి ప్రాంతానికి వెంటనే తరలించి – చురుకైన వాళ్ల ఇండ్లమీద దాడిచేసి వాళ్లను కస్టడీలోకి తీసుకోవాలి… అవసరమైతే అదనపు బలగాలను తరలించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ట్రేడ్ యూనియన్లు తీవ్రవాదశక్తులను కార్మికులనుండి దూరం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ ప్రభుత్వానికి యాజమాన్యానికి సహకరించాలి… అదనపు బలగాల ఖర్చు సింగరేణి యాజమాన్యం భరించవలసి ఉంటుంది.
** **
సమ్మె రెండు రోజులు సాగింది… సమ్మెకారుల కోర్కెలన్నీ బేషరతుగా తీరుస్తామని యాజమాన్యం ప్రకటించింది.
కార్మికులు సమ్మె విరమించారు…
బావుల్లో యంత్రాల రొద ప్రారంభమయ్యింది.
** **
బస్తీ అంతా దట్టంగా బొగ్గు పొగ కొమ్ముకుంది…సాయంత్రం సమయం – పడమటి దిక్కు సూర్యుడు తాగినోనిలాగా డీలాపడి పోయాడు… బస్తీ కావల యాపలకాడ కల్లు దుకాణం కాడ కాబోలు లొల్లి విన్పిస్తోంది…ఆ పొగలోనే ఎవడో లొడలొడ ఎవల్నో తిడుతూ సొలుగుతూ పోతున్నాడు.
రజియా అప్పటికి అయిదోసారి గుడిసె బయటకెల్లి చూసింది. మొగడు అలీఖాన్ జాడే లేదు. “పొద్దటి బజిలీకి పోయినోడు ఇంకా ఎందుకు రాలేదో? ఈనెకు కాలు నిలువది గదా! బాయిలకు బోయినోడు మల్ల ఇల్లు మొఖం చూసేదాక పీసుపీసేకదా?” అనుకున్నది.
పక్కింటి చెంద్రయ్య గుడిసె ముంగటికి నడిచి “వదినా ఓ వదినా!” అంటూ పిలిచింది.
చెంద్రయ్య భార్య రాధమ్మ కాల్లమట్టెలు చిటుకు చిటుకుమనంగ బయట కొచ్చింది.
“అన్నచ్చిండా?” రజియా…
“ఆఁ మాచ్చిండు” అని “నిన్నే మనిషికి సోయెక్కెడిది అలీ అన్న కనిపిచ్చిండా?” అని అడిగింది మొగన్నుద్దేశించి…
చంద్రయ్య సొలుగుతూ బయటకొచ్చి “మావత్తడు…మా బావ బావయో బంగారయ గదా!” అన్నాడు.
అలీ ముద్దు పేరు బంగారయ్య – అతను బావయో బంగారయ్య పాట పాడ్తడు గన్క ఆ పేరే స్థిరం చేశారు కార్మికులు.
“ఆఁ ఏంలేదు మాసిన్నాయినెలుగిన పిలుసుకపోయిండ్లేమొనని?” రజియా…
“మీ సిన్నాయినెవలు సెల్లె – ఏబాయిల పనిజేత్తరు” చంద్రయ్య…
“మీ బంగారయ్య పోలీసోల్లను మామలంటడు గదా?” అంది రజియా సిన్నగా నవ్వుతూ…
“ఓసోస్ – నువ్వు కయితికాలదానివే – ఏమోవ్ మా సెల్లత్తె గిదేనా ఖదరు, కుర్సిదెచ్చెయ్యి” అన్నాడు సెంద్రయ్య…
“పోత…” నని రజియా పోబోయింది… ఇంతలోనే పాలపిట్టరంగు వ్యాన్లు నాలుగు దుమ్మురేపుతూ పోయినయ్…
“పోలీసోల్లు – ఇనుప టోపీల పోలీసోల్లు” అని చంద్రయ్య గుడిసెలోపలి కురికిండు…
“సమ్మె బందయ్యిందిగదా! ఇంకెందుకు దిగబడ్జండ్లు?” అంది రాధమ్మ ముఖం చిట్లించి…
“ఏమో ఎర్రిలేసిన కుక్కలు ఎప్పుడు గరుత్తయో ఎవల కెరుక వదినే.” అంది రజియా…
రోడు మీద ముగ్గురు కార్మికులు తగువులాడుకుంటున్నారు… అందులో ఒకడు “అరె! బాయిల నెత్తురు కలికలైపోద్ది – నేనుసుత మొదట్ల తాగనే అనుకున్న – మరి తాగకుండా నిదురబట్టదే – ” అని వాదిస్తున్నాడు…
రజియా గుడిసె చేరడము అలీఖాన్ రావడం ఒక్కటే అయ్యింది.
“దేర్ హో గయాజీ…” రజియా.
“ఇంతటితోని పోనిచ్చెటట్లు లేదు… పోలీసోంకో బులాయే…” అన్నాడు అంగీ విడుస్తూ.
“పోలీసోల్లేం జేస్తరు… తుపాకులతోని బొగ్గు తీత్తరా?” రజియా అనుకుంటూనే బొగ్గు పొయ్యి మీది నీల్ల కాగు బయటకు పట్టింది… ఒళ్లు రాసి నీల్లు బోసి స్నానం చేయించింది…
రాత్రి అలీ తెరిచిన కళ్లు తెరిచినట్లుగానే ఉంచి గుడిసె కమ్మలు చూస్తుండి పోయాడు. పిల్లను జో కొట్టి పడుకోబెట్టి మొగని పక్కలో చేరిపోయింది… షాక్ తిన్నది. అలీఖాన్ ఒళ్లు మసులుతోంది.
“క్యాజీ – క్యా హోగయా! బుకారాయీ!” అన్నది…
“అదేం లేదు…రజియా! గడ్డు రోజులు రేపేదన్నా అయితే నువ్వు బేఫికరు గుండాలె సుమా!” అన్నాడు…
రజియా కళ్లల్లో బయం తొంగిచూసింది… అలీఖాన్ ఇంకా ఏదేదో చెప్పి ఎప్పుడో నిదురపోయాడు. రజియాకు నిదుర పట్టనే లేదు…
అర్ధరాత్రి కుక్కలు అదేపనిగా మొరుగుతూ పరుగెత్తుతున్నాయి. రజియా లేచి కూర్చున్నది. కుక్కలు తమ గుడిసె వేపే పరుగుతుతూ మొరుగుతున్నాయి… తలుపు మీద టకటక శబ్దం…
“కోన్ హైజీ…” రజియా గొంతు పెకలనేలేదు.
తలుపుమీద ఎవరో ఝాడిచ్చి తన్నిన శబ్దం. తలుపు విరిగి పోయింది. టార్చిలైటు వెలుగు… ఆ వెలుగులో కాకి బట్టల పోలీసులు… రజియా లేవకముందే నలుగురు గుడిసెలో చొరబడి అలీఖానను పట్టుకున్నారు. మరో ఇద్దరు టార్చిలైటు వేసి గుడిసెలో ఉన్న ప్రతివస్తువు వెతికారు. చీరెలు తొక్కారు. పాత పెట్టెలు బోర్లించారు… నాలుగైదు పాటల పుస్తకాలు దొరికించుకున్నారు…
పిల్ల గుక్క పట్టి ఏడుస్తోంది… అలీఖానసు గొరగొర ఈడ్చుకపోయి వ్యానులో పడదోశారు. అందులో అప్పటికే పదిమందున్నారు…
చిన్న పిల్ల ఏడుపులో – రజియా చూస్తుండగానే వ్యాన్లు వెళ్లిపోయాయి…
రజియా కెటు పాలుపోలేదు… ధ్వంసం చేసిన ఇంటి నట్లాగే ఉంచి ఏడ్చే సంటిదానెత్తుకొని గుడిసెల్లోకి కదిలింది…
మరో అర్ధగంటలో పెద్ద గుంపు తయారయ్యింది.
** **
తెల్లవారింది… సైరన్లు కూశాయి. కార్మికులు ఎనలల్లో వాళ్లే గొనుక్కుంటూ కొందరు… జట్లు జట్లుగా మరికొందరు బావిల దగ్గరకు చేరుకున్నారు… బావుల దగ్గర పోలీసులున్నారు…
కార్మికులు టోకన్లు రైటరు కియ్యలేదు. లైట్లు తీసుకోలేదు.
ఊరేగింపు తీశారు…ఒక్కొక్క బావి వాళ్ళతో మొదలైన ఊరేగింపులన్నీ కలిశాయి.
“మేనేజిమెంటు దౌర్జన్యం నశించాలి.”
“అక్రమ అరెస్టులు ఆపాలి.”
“అక్రమంగా పట్టుకున్న కార్మికులను వెంటనే విడిచి పెట్టాలి…”
ఎర్రజెండ యూనియన్ ఆఫీసుముందు ఆగిండ్లు…
“మేనేజిమెంటు తొత్తులు డౌన్ డౌన్…”
తిట్లు… మొత్తుకోల్లు… కాంగ్రెసు యూనియన్ ఆఫీసు ముందు మళ్లీ అవే నినాదాలు…
అట్లా ఊరేగింపు పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి ఆగింది…డి.ఎస్.పి. ఫోనులో మాట్లాడి బయటకెళ్ళాడు…
“పోలీసు జులుం నశించాలి…”
“కార్మికులను విడిచి పెట్టాలి…”
పోలీసులు పులుకు పులుకున కార్మికుల మొఖాల్లోకి, డి.ఎస్.పి. మొఖంలోకి చూస్తున్నారు…
“మీరేదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి” డి.ఎస్.పి. అరిచాడు…
కార్మికుల్లో నినాదాలాగిపోయినయ్… రాయలింగు కుంటుతూ ముందుకొచ్చి “మా కార్మికులను విడిచి పెట్టుండ్లి సార్” అన్నాడు.
“వాళ్ళు నక్సలైట్లు…” అన్నాడు డి.ఎస్.పి…
“అట్లయితే మేమందరం నచ్చలేట్లమే మమ్ములందరిని లోపల దోలుండ్లి” అన్నాడు రాయలింగు…
మళ్ళీ ఫోన్. డి.ఎస్.పి. లోపలికురికాడు…
“పోలీసు జులుం నశించాలి…” ఈసారి స్త్రీల గుంపు వచ్చి కల్సింది…
డి.ఎస్.పి. డీలాపడి బయటకొచ్చాడు. జనం ఎంతమందుంటారో లెక్క తెలియలేదు…
“సరే ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసినమ్… ఇక నుంచి బుద్ధిగా ఉంటే మీ కార్మికులను ఒదిలి పెడ్తాం…” డి.ఎస్.పి.
“బుద్ది సెప్పాల్సింది మాకుగాదు సార్ మేనేజ్ మెంటుకు…” ఎవడో అరిచిండు.
“ఉన్ కు చోడ్ దో…” డి.ఎస్.పి…
అరెస్టు చేసిన కార్మికులందరిని విడుదల చేశారు. కార్మికుల సంతోషానికి అంతు లేదు…
కొందరు డ్యాన్సు చేశారు. కొందరు గెంతారు. కొందరు మొత్తుకున్నారు…
** **
జీతాల రోజు – డ్యూటీలేని కార్మికులు పెళ్లి కొడుకుల్లా అలంకరించు కొన్నారు… కబుర్లు చెప్పుకుంటూ, కట్టవలసిన బాకీలు లెక్కలు వేసుకుంటూ, కొనవలసిన సామాన్ల గురించి లెక్కలు కడుతూ హుశారుగా ఫిట్ లు చేరుకున్నారు… పేక్లర్కు ముఖం చిట్లించు కొని ఏదో అంటున్నాడు…
అలీఖాన్ తన జీతం తీసుకోను చేయి చాపాడు…
క్లర్కు ఒకసారి అలీఖాన్ ముఖంలోకి ఎగాదిగా చూసి మూడు వందల యాభై రూపాయలు, లెక్క పెట్టి యిచ్చాడు…
“ఈనెల నాయి ఇరువై నాలుగు మస్టర్లు సార్…” అన్నాడు అలీఖాన్… యిచ్చిన డబ్బు లెక్క పెట్టుకొని.
“ఎనిమిది మస్టర్ల కోత…” క్లర్కు…
“అయితే గు…కుచ్చుకోండ్లి – ఎవన్నడిగి కోసిండ్లి?” రూపాయలు క్లర్కు మీదికి విసిరేసిండు.
“యేభాయీ నన్నుగాదు అడిగేది…నోటీసు బోర్డు మీద నోటీసేసిండ్లు చూసుక పో” అన్నాడు…
అలీఖాన్ అతనితో పాటు మిగతా కార్మికులు నోటీసు బోర్డు కేసి నడిచారు. అలీఖాన్‌తోపాటు మరో పదిమంది కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మె చేసినందుకు – సమ్మెను ప్రోత్సహించినందుకు ఎనిమిది మస్టర్లు కోత బెట్టినట్టుగా రాసున్నది…
కార్మికులు రెచ్చిపోయారు. ఒకడు గిదగిద ఉరికి రెండుమార్లు ఆపి ఆపి సైరన్ మోగించాడు. ఆక్సిడెంటు సైరనది… మిషనాగిపోయినయి. మరో అర్ధగంటకు లోపలున్న కార్మికులు బయటకెక్కారు…
బొగ్గు కుప్పమీద అలీఖాన్ నిలబడి –
“కార్మికులారా! మేనేజుమెంటు వారు మన మీద కక్ష సాధించదలుచు కున్నారు… మనకు పని ఇసిరెలు సక్రమంగా ఇవ్వక – మనం సిక్ బెనిఫిట్ పొందకుండా… ఇట్లాంటివే అనేక అవకతవక పనులు సెయ్యటం మన మేనేజుమెంటు వారి లక్షణం… మన చేతుల్లో ఉన్నదేమిటి? సమ్మె హక్కు… ప్రతినెలా టంచనుగా మన దగ్గిర చందా గుంజుక పోతూ – సమస్యలొచ్చినపుడు మేనేజుమెంటుకు కుక్కలుగా మారుతూ – మన సమ్మె హక్కును యూనియనోల్లు తాకట్టు పెట్టారు. మరందుచేత మనం మన హక్కు నిలుపుకోవాలి – బొగ్గు గనుల్లోకి పోలీసుల దెచ్చి పెట్టిండ్లు… ఈ అక్రమ పనులకు వ్యతిరేకంగా మనం మన హక్కును వినియోగించుకోవాల్సిందే. కార్మికులారా మనం జూటా మేనేజిమెంటు, జూటా సర్కార్, జూటా యూనియన్లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం అని మరిచి పోవద్దు…” అని ముగించాడు.
సమ్మె… ఇంకో బావి దగ్గర ఇంకో కార్మికుడు ఇట్లాగే చెప్పాడు. అక్కడి నోటీసు బోర్డును ధ్వంసం చేశారు… అన్నీ బావులకు సమ్మె వ్యాపించింది…
** **
సమ్మె యాభయి రోజులు దాటిపోయింది. ఫిట్లు నిర్మానుష్యమై పోయాయి… కల్లు దుకాణంలో లొల్లి తగ్గింది. కార్మికుల గుడిసెల్లో బొగ్గు కాదు రగిలేది కార్మికులే…
ట్రేడ్ యూనియన్ నాయకులు అటు రాజధానికి ఇటు కాలరీ ఏరియాకు ఆసుబోసినట్టు తిరుగసాగిండ్లు.
ఒకనాటి మిట్టమధ్యాహ్నం కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నాయకుడు వెంకటరెడ్డి జీబేసుకొని కార్మికవాడలు తిరుగుతూ – మైకులో “కార్మికులారా! విచ్ఛిన్నకర శక్తుల మాటలు నమ్మవద్దు… మీకేం భయంలేదు పనిలో చేరండి. పనిలో చేరేవారికి రక్షణగా ఫిట్ల దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు ప్రభుత్వం వారు చేశారు…” అరవ సాగిండు…
“కార్మికులారా! సమ్మెకు దిగి నష్టపోయేది మీరే – మాకు తెలుసు మిమ్ములను సమ్మెకు పురికొల్పిందెవరో?” వెంకటరెడ్డి. అప్పటికి జీబు చుట్టు చాలామంది పోగయ్యారు… రాయలింగు గుడిసెలో నుంచి దూసుకొచ్చాడు…
“ఒరే – ఇప్పటి మాటేందిరా! మేం అన్యాయంగ సమ్మె జేత్తన్నమా? మేం పనిజేసి బతికి నోల్లంగని – సమ్మెజేసి బతికినోల్లంగాదు… మమ్ముల తాపతాపకు రెచ్చగొట్టిందెవలు? బాయిల మీనికి పోలీసోల్ల దెచ్చిందెవలు? సమ్మె హక్కును కుదువ బెట్టిందెవలు? మీరు… మీరురా…”
రాయలింగు జీబు మీది కురికాడు… జనం జీబుమీది కురికారు… చెప్పుల వర్షం కురుస్తోంది. జీబు అద్దాలు పగిలినయ్ … మైకు నెవడో కిందపడేసిండు… వెంకటరెడ్డి గోచీ తట్టుకోంగ – చెప్పులు ఊడిపోయిన లెక్క చేయకుండా రోడ్డుదిగి అడ్డదిడ్డంగా పరుగెత్తసాగిండు…
“బాగ బగ్గబలిసి సమ్మె సేత్తంది మేమట? ఈల్లు సూత్తన్నరట.” రాయలింగు…
** **
గుడిసెలో సడీ సప్పులు మగ్గింది… అప్పుడొకటి ఇప్పుడొకటి పోలీసు వ్యాన్లు తిరుగుతున్నాయి.
రజియా బిడ్డ నెత్తుకొని గుడి సెముందు కూర్చున్నది… ఆమె కళ్లు తీక్షణంగా రోడ్డుకేసి చూస్తున్నాయి…
ఆ గుడిసెకు సరిగ్గా పది గుడిసెల ఆవల మరో గుడిసెలో –
పదిపది హేనుమంది కార్మికులు నేలమీద కూర్చున్నారు… ఇద్దరు ద్వారం కడ్డంగా నిలుచున్నారు. వాళ్ల మధ్యలో చిమ్నీ వెలుగుతోంది…
అలీఖాన్ ఒక్కొక్కసారి ఆవేశంగా మరొక్కమారు కోపంగా, శాంతంగా కార్మికులకు ఈ విధంగా చెప్పసాగిండు…
“కార్మికులారా! ఈ చరిత్రాత్మకమైన సమ్మె బొగ్గు గనులు పుట్టిన కాన్నుంచీ ఇన్ని రోజులు జరుపడం ఇదే ప్రథమం… ఇదివరకు మనం అర్ధరోజు సెలువుకో, జీతంలో మరో పదిరూపాయల పెరుగుదలకో సమ్మె చేసినం… యాజమాన్యానికి వ్యతిరేకంగా సమ్మెలు చేశాం. కాని మనం చేస్తున్న ఈ సమ్మె దురాశపరులైన యాజమాన్యానికి, వాళ్ల ప్రభుత్వానికి, వాళ్ల ఏజెంట్లయిన ట్రేడ్ యూనియన్లకు వ్యతిరేకంగా చేస్తున్నాం. నిజానికి ఈ సమ్మెలో మనం గెలువచ్చు. ఓడచ్చు. అది వేరే విషయం… మనం గెలువాల్సింది ఇంకా చాలా ఉన్నది… యజమానులు, వాళ్ల
మొరుగుడు లేని రాజ్యం కోసం మనవంతు పనిని మనం జేయాలె – భూమికోసం, బువ్వకోసం, ఆఖరుగా రాజ్యాధికారం కోసం మన అన్నలు తమ్ముల్లు సుట్టుపక్కల తుపాకి తూటాల మధ్య పోరాటం చేస్తున్నారు… ఎవడైతే బొగ్గుపొక్కల రేయింబవళ్లు కష్టపడుతాడో వానికి బొగ్గు పొక్క మీద అధికారం వచ్చేదాకా మనం పోరాడాలె…
అంటే ఇది ఆఖరుగాదు. మొదలు…” కార్మికులు ఆలోచిస్తున్నారు…తమ బతుకును బేరీజు వేసుకుంటున్నారు..
ఓ యువకుడన్నాడు “అంతం కాదిది ఆరంభం…” రజియా కళ్ళు రోడ్డు మీదికి సారించి చూస్తూనే ఉన్నది…
-(జూన్ 1981)