ఆవిర్భావ సభ
12 ఆగస్టు 2023 శనివారం, ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు
దేశమంతా దుఃఖిస్తున్నది. భగ్నమైన స్వప్నాలను తలచుకొని కుంగిపోతున్నది. చెల్లా చెదరైన రాజ్యాంగ విలువల కోసం పరిపతపిస్తున్నది. మన కళ్ల ముందే ఎంత చరిత్రను చూశాం. ఇంకెంత చరిత్రను చదువుకున్నాం. ఇలాంటి రోజులు వస్తాయని ఎన్నడైనా అనుకున్నామా? ఇంతగా భయపడుతూ బతకాల్సి వస్తుందని ఊహించామా? ఇంతగా నెత్తురు, కన్నీరు కలిసి ఈ నేల చిత్తడి అవుతుందని అనుమానించామా? కానీ ఈ తరం ప్రజల మీద కాలం ఎలాంటి విషపు కత్తి దూసింది? నిద్రపట్టని క్షణాలతో సామాజిక, వైయక్తిక అశాంతి రాజ్యమేలుతున్నది. ఇది ఇప్పుడే మొదలై ఉండకపోవచ్చు. ఎప్పటికి ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. ఈలోగా ఈ దేశ ప్రజల నమ్మకాలన్నీ నేలమట్టమైపోతున్నాయి. వేల ఏళ్ల సంస్కృతులు, విలువలు ధ్వంసమై పోతున్నవి.
ప్రజలవి ఎంత మామూలు కోరికలు? ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటాం. సకల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటాం. అన్ని సమూహాల హక్కులను కాపాడాలని, రాజ్యాంగబద్ధ పాలన చేయాలని ఆశిస్తాం. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగంలోనే తమ కూటనీతి ప్రయోజనాలకు అనుగుణంగా సవరణలు చేస్తున్నాయి. మౌలిక సూత్రాలని సైతం తుంగలో తొక్కుతున్నాయి. ప్రజల జీవితాల్లో సామాజిక భద్రత కరువైంది. రాజ్యాంగ నైతికత అంతకంతకు దిగజారిపోతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లెక్కలేనన్ని దుర్మార్గాలు జరిగిపోయాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశమంతా గాఢమైన చీకటి అలుముకుపోయింది. సాధారణ ప్రజల జీవితంలోని సహజీవన భావన విచ్ఛిన్నం అవుతుంది. భిన్న జాతుల, మతాల, తెగల సాంస్కృతిక అస్తిత్వాల ఉనికి చెల్లాచెదరవుతున్నది. మెజారిటీ మతవాదమే రాజ్యాన్ని నడిపిస్తున్నది. దీనికి మత మైనారిటీలే కాదు, దళిత బీసీ కులాల, ఆదివాసీ సమూహాల జీవన భద్రత సంక్షోభంలో పడింది. ఫాసిజమంటే మానవీయతకి వ్యతిరేకి అని రుజువు అవుతున్నది.
ఒక్క మాటలో రెండు అబద్ధాలు చెప్పే పాలకులు ఉన్న చోట పారదర్శకత ఉండదు. చట్టబద్ధపాలన ఉండదు. రాజ్యాంగానికి గౌరవం దక్కదు. దేశమే ఒక అసంబద్ధ చిత్రంగా మారిపోతుంది. దేశాన్ని అగ్నికీలల్లోకి తోస్తున్నవారే దేశభక్తి అంటూ నిత్యం బరిబాతల ఊరేగింపులు తీస్తారు. దేశభక్తిలో తమను మించిన వాళ్లు లేరని దబాయిస్తారు. మిగతా అందరినీ దేశద్రోహులని విచారణ సైతం లేకుండా జైళ్లలోకి తోసేస్తారు. దేశాన్ని అమ్మేస్తున్నవారే దేశభక్తిని ఉన్మాదంగా మార్చేస్తారు. వాళ్లకు దేశభక్తి అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం. ప్రభుత్వమే కార్పొరేట్లకు దళారీగా మారడం. దేశాన్ని చందన తాంబూలాలతో సామ్రాజ్యవాదులకు అప్పగించడం. సంస్కృతీ విధ్వంసకులే బుల్డోజర్లతో ఏకంగా దేశ చరిత్రనే కూలదోస్తారు. ముస్లింల ఇండ్లను కూల్చినవారే దళితుల నెత్తిపై మలమూత్రాలు విసర్జిస్తారు. ‘బేటీ బచావో’ అంటూనే రేపిస్టులను రక్షిస్తారు. బాధితులను సజీవంగా దహనం చేస్తారు. జీవన విలువలను కాలరాసేవారే పర్యావరణ విధ్వంసకులవుతారు. ఆదివాసీ ప్రాంతాల సహజ సంపదను పెళ్లగిస్తారు.
ప్రశ్నించే గొంతుల్ని అణచి వేయటానికి సాధనాలుగా న్యాయ వ్యవస్థతో సహా రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థల్ని దురుపయోగం చేయటమే గాక రాజ్యమే రౌడీగా మారి పౌరులమీద దాడి చేస్తున్నది. మూక హత్యలకు వత్తాసు పలుకుతున్నది. సామాజిక వాస్తవాలు మాట్లాడుతున్నందుకు, విశ్లేషిస్తున్నందుకు విశ్వవిద్యాలయాల ఆచార్యుల్ని స్వతంత్ర మేధావులని, జర్నలిస్టులను వేటాడుతోంది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు, బెదిరింపులకు గురి చేస్తున్నది. యదార్థవాదుల మెడమీద కత్తులు వేలాడుతున్నాయి. సత్యవాక్కు ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. మరొక వైపు విద్యాలయాలను మతవాదుల యుద్ధ భూమిగా మార్చుతున్నారు. అధ్యాపకులు ప్రభుత్వ / ప్రభుత్వేతర సంఘపరివార శక్తుల నీడలో పాఠాలు బోధించవలసిన దుఃస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రి సిలబస్ లో చరిత్ర పాఠాలు తారుమారు అవుతున్నాయి. ఊళ్ళ పేర్లూ మారిపోతున్నాయి. ఈ పరిస్థితులలో రచయితలుగా మన కర్తవ్యం ఏమిటి? మౌన సాక్షులుగా మిగిలిపోదామా? కలాన్ని, గళాన్ని ఆయుధాలుగా చేసుకొని భావజాల రంగంలో ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికగా నిజమైన సంస్కృతీ వ్యాప్తికి సన్నద్ధులమై కదులుదామా అన్నది మన ముందున్న మౌలికమైన ప్రశ్న. తేల్చుకోవాల్సిన సందర్భం యిది. దేశ ప్రజల్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆర్థిక స్థోమతల ప్రాతిపదికన విభజించి పాలిస్తూ ‘సబ్ కా వికాస్’ ఎలా తేగలుగుతారని సృజనకారులుగా మనం ఏకకంఠంతో ప్రశ్నిచాల్సిన సమయమిది.
ఇరవై ఏళ్ల కిందటి గుజరాత్ మోడల్ తర్వాత ఫాసిస్టు దాడికి గాయపడని నేల ఈ దేశంలో లేదు. అన్ని చోట్ల మత మైనారిటీలు, వెనుకబడిన తెగలు, దళిత ఆదివాసీలు పేదలే వాళ్ల లక్ష్యం. ఈ సమూహాల్లో కూడా మహిళల శరీరాల మీద, లైంగికత మీద ఫాసిస్టు రాజ్యం నిర్మాణమవుతున్నది. గుజరాత్ ప్రయోగాన్ని మించిన కుట్రపూరిత, అమానవీయ, రాజ్యాంగ వ్యతిరేక, మానవ వ్యతిరేక ప్రయోగం మణిపూర్‌లో జరుగుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రంలో కుకీ తెగ మహిళలను నగ్నంగా ఊరేగించారు. అత్యాచారం చేశారు. దేశమే సిగ్గుతో చచ్చిపోవలసిన అనాగరికత దశలోకి తీసికెళ్లారు. వీళ్లే ఇంకో పక్క మహిళా సాధికారత కోసమే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తున్నామని అంటున్నారు. వివాహం, విడాకులు, ఆస్తిహక్కు మొదలైన విషయాల్లో మహిళలకు మేలు చేస్తుందని వంచిస్తున్నారు. ఈ దేశంలోని వేలాది సమూహాల సంస్కృతులన్నిటి మీద చట్టబద్ధ నిరంకుశ అధికారం సంపాదించుకోడానికే ఈ ఉమ్మడి పౌరస్మృతి అని అనుమానిస్తే తప్పవుతుందా? భిన్నత్వంలో ఏకత్వం అనే పేరిట బహుళత్వాన్ని రద్దు చేసే కుట్ర ఇందులో లేదా? ఏకరీతి జీవనవిధానం తేవాలనుకోవడం దానికదే ఫాసిజం. అసమ సమాజంలో ప్రజలందరికీ ఒకే చట్టం అనే సమానత్వ భాష వెనుక సంఘపరివార్ ఏకతా భావన తప్ప ఆధునిక విలువలు లేవు. ఇందులో ఉమ్మడితనం లేదు. ఐక్యతా లేదు. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే మార్కెట్, ఒకే మతం, ఒకే దేవుడు అనే ఆలోచనల వెనుక ఎంత హింస ఉంటుందో ఇప్పుడు దేశ ప్రజలకు పూర్తిగా అనుభవంలోకి వచ్చింది. ఒకే ఒక్కటి తప్ప మరేమీ ఉండకూడదని ఎవరు అన్నా అది ఫాసిజమే. దేశమంతా ఊపిరాడని ఉక్కబోతలో తల్లడిల్లుతున్నది. దేశం దేశమే పెద్ద గ్యాస్ చాంబర్‌గా మారుతున్నది. రాజ్యమే బుల్డోజర్ అవతారం ఎత్తి జీవితాల్ని కూల్చుతున్నది. ఒకప్పుడు గంగా యమునల సహజీవన సంస్కృతి వెల్లివిరిసిన తెలంగాణ ప్రజల మధ్య కూడా మత విద్వేషపు గోడలు మొలుచుకొస్తున్నాయి.
అంతా ఇంతే కాదు. మరోవైపు ఈ దుర్మార్గాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశం ఆగ్రహంతో రగిలిపోతున్నది. మతతత్వంపై పోరాడుతున్నది. భంగపడిన మానవతను కాపాడటానికి పిడికిలిగా మారుతున్నది. ఈ సమయంలో రచయితలు సంస్కృతీ నిర్మాతలైన ప్రజల పక్షాన నిలబడాలి. పీడిత సమూహాల భాష, కళా సాహిత్య వ్యక్తీకరణలు, సాంస్కృతిక జీవన ప్రత్యేకతలను రద్దు చేయాలనుకుంటున్న మనువాదుల ఏకత్వను ప్రశ్నించాలి. సంస్కృతీ విధ్వంస క్రీడను అడ్డుకొని మానవతను నిలబెట్టాలి. ఎందుకంటే రచయితలు మానవ హృదయ నిర్మాతలు. సాహిత్యమంటేనే జీవన సారం. ప్రజలను తప్పుడు భావోద్వేగాలకు లోనుచేసి తమ వెనుక కాల్బలంగా మతతత్వవాదులు మార్చుకుంటున్న చోట సహజ మానవ స్పందనలను సజీవంగా ఆర్ద్రంగా నిలిపి ఉంచేది కళా సాహిత్యాలే.
తెలుగు రచయితలకు సాహిత్యకారులకు ప్రజా జీవనమే ప్రమాణం. బహిరంగ ప్రజా జీవితంలోకి కుల మతాల పెత్తనం, పితృస్వామ్య దాష్టీకం రావడానికి వీల్లేదనే లౌకిక, ప్రజాస్వామిక విలువ ఇక్కడి సాహిత్యానికి ప్రాణం. అందుకే అన్ని చారిత్రక సందర్భాల్లో మన కవి గాయక సృజనకారులు ప్రజాస్వామ్యం కోసం పరితపించారు. నిలబడి పోరాడారు. సాహిత్య రచన అంటేనే సామాజిక ఆచరణ అనే మౌలిక భావనను అన్ని భావజాలాల రచయితలు తమ వెలుగుదారిగా భావించారు. ఇటీవలి చరిత్రలోనే గుజరాత్ మారణకాండ దగ్గరి నుంచి అన్ని సందర్భాల్లో లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేశారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మళ్లీ రచయితలందరూ ‘సమూహ’గా సంఘటితం అయ్యారు. ఇప్పటికే ఇందులో భిన్న ప్రజాస్వామిక స్రవంతులకు చెందిన ఎందరో రచయితలు ఉన్నారు. ఇందులో భాగం కావాల్సిన వారు అంతకంటే చాలా ఎక్కువే ఉంటారు. ముఖ్యంగా అనేక పీడిత అస్తిత్వాలకు చెందిన యువతరం సాహిత్యకారులు ఇందులో భాగమైతేనే ఈ ‘సమూహ’ క్రియాత్మకం అవుతుంది. సృజనాత్మకం అవుతుంది.
సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారుల, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక సమూహ. ఇది మనందరిదీ. కలలను సహితం దొంగిలిస్తున్న చోట కఠోర వాస్తవాలతో తలపడక తప్పదు. ఆ పని రచయితలు చేయకపోతే ఎలా? అందుకే సమూహ ఏర్పడింది. దీని ఆవిర్భావ సభలో మనందరం పాల్గొని దీన్నొక సృజనాత్మక పోరాట సభగా మారుద్దాం. అందులో భాగమవుదామని మనకు మనమే చెప్పుకొనే ఆహ్వానం ఇది. అందరూ తప్పక రండి. ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా రచయితలుగా మన అందరి వుమ్మడి స్వరం వినిపిద్దాం. విద్వేష రాజకీయ కూటనీతికి సమాధానంగా ప్రేమను పంచే వొక సామూహిక నినాదాన్ని అందిద్దాం. అంబేడ్కర్ మార్గదర్శనంలో పౌరులందరం నిర్మించుకున్న రాజ్యాంగంలోని లౌకిక ప్రజాస్వామ్య సమత్వ భావనలను కాపాడుకుందాం. జీవించే హక్కు కోసం సంఘర్షించక తప్పని వివిధ ప్రజా సమూహాలకు అండగా నిలుద్దాం.
ప్రారంభకులు :
ప్రకాష్ రాజ్, ప్రముఖ సినీ నటులు
వక్తలు :
పద్మజా షా, సామాజిక ఉద్యమకారులు; విశ్రాంత ఆచార్యులు
(అంశం: ఉమ్మడి పౌర స్మృతి – ప్రజాస్వామిక రాజకీయ దృక్పథం)
భంగ్యా భూక్యా, ప్రొఫెసర్; హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
(అంశం: మనువాద కార్పోరేట్ ఫాసిజం – దేశ భవిష్యత్తు )
మీర్ అయూబ్ అలీ ఖాన్, రచయిత; జర్నలిస్టు
(అంశం: కాషాయీకరణలో ప్రజాస్వామ్య మూల స్తంభాలు-పౌరుల కర్తవ్యాలు)
కె. శ్రీనివాస్, సంపాదకులు; ఆంధ్రజ్యోతి
(అంశం: లౌకిక ప్రజాస్వామ్య విలువలు: రచయితల కర్తవ్యాలు)
అందరూ తప్పక రండి. ఫాసిజానికి వ్యతిరేకంగా రచయితలుగా మన అందరి వుమ్మడి స్వరం వినిపిద్దాం.
సమూహ – సెక్యులర్ రైటర్స్ ఫోరం
సన్నాహక కమిటీ
నేటి సామాజిక అవసరం