ఆదివారం ఉదయం టీ తాగి టిఫిన్ తిని మళ్లీ ఒకసారి టీ తాగి రేడియో తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాను.
టీవీలో రకరకాల వ్యాఖ్యానాలతో అనేక రకాల రంగుల్లో అసత్యాలను చూస్తున్నా, సెల్ ఫోన్ లో ఆన్లైన్లో దినపత్రికలు రకరకాలుగా వండిపెడుతున్న రెడీ మేడ్ వార్తలను చదువుకుంటున్నా, రేడియోలో అనేక రకాల గొంతుల్లోంచి అదే అసత్యాలను పదేపదే వింటున్నా, రేడియో అంటే ముందు నుంచి ఏదో అభిమానం .. సాంకేతికత ఇంతగా విజృంభించడానికి ముందు కనీస సమాచారం ఇచ్చింది అదే కదా అనే అభిమానం.. అందుకే ఇంతకాలం భరిస్తూ వచ్చాను.
రేడియోలో అపద్దాలు వినీ వినీ విసిగిపోయాను.రేడియోని వదిలించుకునేముందు చివరి అవకాశంగా దానికి సత్యం అంటే ఏమిటో చూపించాలని వినిపించాలని అనిపించింది. సత్యాన్ని చూసి విని అది తట్టుకోగలదో లేదో తెలియదు.
ఎండ పరమ దారుణంగా ఉంది.నిర్దయగా ఉంది. చాలా కఠినంగా ఉంది. ఎండ నుండి తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం కనబడటం లేదు.
ఎవరి ముఖాలకు వాళ్ళు రంగులు పూసుకుని, రంగులు మార్చుకుని ,మొత్తానికి వాళ్లది కాని ముఖాలతో, ఎవరికి వాళ్ళు ఎవరిని ఎవరు గుర్తుపట్టకుండా రకరకాల వాహనాల మీద హడావిడిగా జీవితాన్ని నెట్టుకుంటూ ఎటో పోతున్నారు. దేన్నీ చూసేటట్టు లేదరు, ఏదీ వినేటట్టు లేరు.
మొదటగా అటువైపు వినిపించిన పాట వైపే నడిచాను.
నగ్నంగా కనిపిస్తున్న సినిమా తారల వాల్ పోస్టర్స్ పైన ఒక అమ్మాయి తెల్ల కాగితాలు అంటిస్తూ వాల్ పోస్టర్లను శుభ్రం చేసుకుంటూ వెళుతుంది ఆమె చుట్టూ ఆమె స్నేహితులు ముగ్గురు తెల్ల కాగితాలతో గంప్యాకెట్స్ తో సందడి సందడిగా. పాఠశాల ప్రహరీ గోడలపై నీచులు అంటించిన అర్ధ నగ్నపు సినిమా వాల్ పోస్టర్స్.పిల్లలు పాఠశాలకు వస్తూ వెళుతూ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన మహానుభావుల చిత్రాల స్థానంలో వాళ్ళ ముఖాలపై అంటించిన సినిమా వాల్ పోస్టర్స్.
ఆ అమ్మాయిల ముఖాల్లో ఏదో మెరుపు వెలుతురు కనిపిస్తోంది.
విద్యావంతులు మేధావులు అనేకమంది యధాలాపంగా వాళ్ళు చేస్తున్న పనిని చూస్తూ ముందుకు వెళుతున్నారు. మనిషితనం పైన నమ్మకం కలిగించేలా అటువైపు నుంచి ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆ గుంపులో కలిసింది. ఆ పాఠశాల ప్రహరి గోడ సామూహిక గానాన్ని ఆలపిస్తున్నట్టుగా ఉంది. మనుషులు మంచిపని చేస్తుంటే పక్షుల పాట వినిపిస్తుంది కదా అలాంటిదే… ఏదో పాట. గోడలు మాట్లాడితే గోడలు గొంతెత్తి పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది.
ఇంకోవైపు ఇంకేదో పాట వినిపిస్తోంది.కదలక తప్పదు.ఇంకా ఎన్ని పాటలు ఇంకెన్ని గొంతులు వినిపిస్తాయో తెలియదు.
పేరుకుపోయిన మురికి నీరు, గడ్డకట్టుకుపోయిన మురికి నీటి కాలువలు.ఆ కాలువలను దురాక్రమణ చేసిన బండ రాళ్లు, ఇండ్లు దుకాణాలు తోపుడుబండ్ల మధ్య ఒక నల్లటి మనిషి వెన్నెల్లా మెరిసిపోయే మొహంతో, ఏదో పాట పాడుకుంటూ ఆ బండరాళ్లు తొలగిస్తూ ఒక పొడవాటి కర్రకు కట్టిన పారతో సుశిక్షితుడైన మున్సిపల్ కార్మికుడిలాగా తన పని తన చేసుకుపోతూ ఉన్నాడు. అతడి చుట్టూ అతడి స్నేహితులు ఎవరూ లేరు. చుట్టూ శత్రువులే. అతడు చేస్తున్న పనిని అసహ్యంగా చూస్తూ అతడిని హత్య చేసేలా ఉద్రిక్త మొహాలతో ఉద్రేకంగా ఆ వీధిలోని వాళ్ల ఆ దుకాణాల వాళ్ళు, ఆ కాలువను ఆక్రమించిన మహానుభావులు.
అతని మొహంలో భయం లేదు ఏదో తెంపరితనం. అతడు మురికినీటి కాలువను శుభ్రం చేస్తున్నట్టు లేదు. దేశాన్ని శుభ్రం చేస్తున్నట్టు ఉంది. అతడు ఆ మురికి నీటి కాలువ పైన దురాక్రమణలను తొలగిస్తున్న కార్మికుడిలా లేదు. దేశ సరిహద్దుల్లోకి చొచ్ఛుకు వచ్చిన శత్రువుల్ని తరిమికొడుతూ దేశ సరిహద్దుల్ని కాపాడే సైనికుడిలా…. అతడి చేతుల్లోని కాలువలను శుభ్రం చేసే ఆ పార పనిముట్టుగా కనబడడం లేదు. శత్రువుల్ని హతమార్చే మారణాయుధంలా ఉంది. ఆ పాట ఏదో స్వేచ్ఛకు సంబంధించింది .బహుశా విముక్తికి సంబంధించింది. భాష తెలియటం లేదు కానీ లయ తెలుస్తోంది నిద్రపోతున్న మనుషుల్ని, నిద్ర నటిస్తున్న మనుషుల్ని కూడా తట్టి లేపే శక్తి ఏదో ఆ పాటకు ఉంది. చలనం మొదలైంది మురికి నీరు ప్రవహించే కొద్దీ దుర్వాసన భరించలేనిదిగా ఉంది. అతడు దేన్నీ పట్టించుకునే స్థితిలో లేడు.
మెల్లగా మురికినీటి కాలువ వెంట ఒక పాట లాగా ముందుకు కదులుతూ ఉన్నాడు. దుర్గంధం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంది. అతడిని బండ బూతులు తిట్టుకుంటూ మనుషులు ఒక్కొక్కరే అక్కడి నుండి మాయమైపోతున్నారు.
అక్కడే ఉందామంటే ఇంకో పాట ఎటువైపు నుంచో.
ఈసారి రోడ్లు దాటి విధులు దాటి ఇంకాస్త లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇంటింటి ముందు ట్రాక్టర్ ఆగుతోంది. కాలేజీ కుర్రాడు .. జోరుగా ఉన్నాడు.
వెతకండి… మీకు అనవసరమైన అన్నీ దీంట్లో వేయండి. బట్టలు దుప్పట్లు చెప్పులు గొడుగులు పాత్రలు పుస్తకాలు ఫ్యాన్లు పెన్నులు ఏమి ఇస్తారో ఇవ్వండి పడేయండి. వీటి కోసం జనం ఉన్నారు. మీకు అవసరం లేకపోయినా సంవత్సరాలల తరబడి ఇంట్లో నిధుల్ని పోగెట్టుకుంటున్నారు. మీరు చేయి వేసి తాకి ఉండరు. కొన్ని ఏళ్లు అయి ఉంటుంది. వెతకండి బయటపడేయండి మీ ఇండ్లు శుభ్రం చేసుకోండి. మీ మనసులు శుభ్రం అవుతాయి. ఖాళీ చేయండి.. మీకు పనికిరాని సామాన్లు ఖాళీ చేయండి.. మీకు ఇదే గొప్ప అవకాశం. ఈ ఒక్క ఆదివారం అయినా జీవించండి… రికార్డు చేసి వినిపిస్తున్నట్లు అతని గొంతులో ఏదో సంగీతం దాగి ఉన్నట్టుంది.
కాసేపటి తర్వాత మనుషులు బెరుగ్గా ఇంట్లోకి బయటకు తచ్ఛాడుతూ ఉన్నారు. సందేహిస్తూ ఉన్నారు అనుమాన పడుతూ ఉన్నారు. ఆ కుర్రాడిని పరీక్షగా చూస్తున్నారు పరిశీలిస్తున్నారు. అంత తొందరగా వాళ్ళ మనసులు బుర్రలు చేతులు పనిచేయడం లేదు. ముందుగా ఒక ముసలావిడ కదిలింది. వెంటనే ఒక చిన్న కుర్రోడు కదిలేడు. ఒక వీల్ చైర్ బయట వచ్చింది ఉత్సాహంగా.
ఒక వర్షం మెల్లగా మొదలైనట్టుంది. ఆకాశంలో కాదు జనం గుండెల్లో.
గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్నాయి. కుర్చీలు వచ్చాయి వాటర్ బాటిల్స్ వచ్చాయి కాలేజీ బ్యాగులు వచ్చాయి. బకెట్స్ మగ్స్ బట్టలు, పుస్తకాలు, పెన్నులు, ఒక టైలరింగ్ మిషన్, హెల్మెట్స్, మాల్ మొత్తం ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఇంటింటి ముందుకెళ్లి అతడు చేతులు జోడించి తలవంచి వినయంగా ఆ ఇంట్లోని వాళ్లను అభ్యర్థిస్తూ ఉంటే.. పాట రాకుండా ఉంటుందా? వంద సీతాకోకచిలుకలు ఒక్కసారిగా నాట్యం చేస్తూ పాడుతున్నట్టు వైభవంగా ఒక పాట..
అరరే..ఈ ఆదివారం పాటలే పాటలు. ఉత్తర దిశగా వినిపిస్తున్న ఈ పాట ఏదో ప్రత్యేకంగా ఉంది. భూమి నవ్వుతున్నట్టు… భూమి పాడుతున్నట్టు ఏదో పాట.
పొలాల నుంచి నేరుగా రైతులు రకరకాల కూరగాయలతో ఆకుకూరలతో పూలతో పండ్లతో.. ఆ సువాసన వర్షం పడుతున్నప్పుడు మట్టి పులకించినట్టు ఉంది. దళారీ లేని మార్కెట్ మాయాజాలం లేని పొలం నుండి ఇంటికి.. చేరువవుతున్న పంట ఫలాల మధ్య రైతుల చెమట వాసన, మరిగిపోతున్న రక్తం, వాళ్ల ముఖాలపైనే కనబడుతున్న అప్పులు, వడ్డీలు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, కూలీల లెక్కలు, దళారీ మామూల్లు, నగరంలో వ్యాపారం చేయడం కోసం కట్టిన పన్నులు, నాణ్యత, చౌక… భలే బేరం భలే బేరం.
రైతులు చెబుతున్నది తక్కువ ధరే అయినా కొనుగోలుదారులు బేరాలాట ఆడుతూనే ఉన్నారు. రైతులతో బేరాలాట. సూపర్ మార్కెట్లో మాల్స్ లో చెప్పిన ధరకు. చేతులు కట్టుకొని డబ్బులు చెల్లించి, చివరగా ఒక కవరు కానీ ఒక బ్యాగు కానీ పొందలేని అభాగ్యులు, నిస్సిగ్గుగా రాత్రి పగలు కష్టపడి అన్నం పండించే రైతులతో వ్యూహాత్మకంగా వ్యాపారాలు చేస్తూ.. వ్యాపారస్తులు అవుతున్న మనుషులు. పంట ఫలాలు అమ్మిన రైతు నవ్వుల్లోంచి, వస్తోంది ఆ పాట. భూమి పాడే పాట. నేల పాడే పాట, పంట పాడే పాట.
రైతు నవ్వితే భూమి నవ్వినట్టు ఉంది ఆ పాట.
రైతు నవ్వితే భూమి పాడినట్టు ఉంది ఆ పాట.
ఈసారి పాట తూర్పు దిక్కు నుండి.
అంత స్పష్టంగా వినిపించడం లేదు.
ఆ పాట నగరానికి దగ్గరగా లేదు నగరానికి కొంచెం దూరం నుండి వినిపిస్తోంది.
నేను, నా రేడియో నగరాన్ని దాటాక, పాట వినిపిస్తున్న దిక్కుగా వేగంగా నడిచాము. అన్ని పాటలను రేడియో నాతో బాటే వింటోంది.
విస్తరిస్తున్న నగరం ఏదో పల్లెను కబళిస్తోంది. పొలాలు అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. అప్పుడు ఒక చెరువు ఉండేది. బహుశా అక్కడే అపార్ట్మెంట్స్ మొలిచాయేమో. చెరువులు లేవు అడవులు లేవు చెట్లు లేవు, పక్షులు లేవు,
మంచినీరు లేదు గాలి లేదు. అక్కడొక స్మశానం కూడా ఉండాలి. ఆ సమాధులు ఆ శవాలు ఏమయ్యాయో తెలియవు. ఎక్కడా ఏమీ ఆనవాళ్లు లేవు. చెరువు గురించి అడవి గురించి, వాగు గురించి చెట్ల గురించి, స్మశానం గురించి శవాల గురించి కాంక్రీట్ కట్టడాలు ఏం జవాబు చెబుతాయి? మనిషి అన్న వాడు ఎవడైనా నేల పైన నడిస్తే కదా, తల్లి ఒడి గురించి, చనుబాలధార గురించి తెలియడానికి.
అపార్ట్మెంట్ వెనక నుండి వస్తోంది ఆ పాట.
ఆకాశం కిందికి వంగి భూమి చెవిలో పాడుతున్నట్టు ఉంది.
ఇంకా నడవాలి ఇంకాస్త దూరం. ఇదిగో వచ్చేసాం.
ఏమి దృశ్యం ఏమి దృశ్యం!
ఊరు మరిచిపోయిన రచ్చబండ చుట్టూ జనం.
రచ్చబండ కళకళలాడుతోంది.అడవి లేకపోతే చెరువు లేకపోతే చెట్టు పిట్టా లేకపోతే మనం లేం. వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు.. నగరాన్ని మింగినోళ్లు పల్లెను మిగటానికి వచ్చేస్తున్నారు. వాళ్ళ ఆకలి దీంతో తీరదు. ఇంతటితో ఆగరు. మన పొలాలే కాదు మన గుడిసెలు పోతాయి మన ఇండ్లూ పోతాయి. మన పశువుల పాకలు గడ్డివాములు ఎరువు దిబ్బలు అన్నీ పోతాయి. మన రచ్చబండ పోతుంది. మనం మట్టి కొట్టుకుపోతాం. మేలుకోవాలి మనం ఇంకా మేలుకోకపోతే మనం ఇంకా నష్టపోతాం. ఊరుని మాయం చేసిన వాళ్ళు ఇసుకని మాయం చేసినోళ్ళు, వాగుని వంకని చెరువుని అడవిని స్మశానాన్ని మాయం చేసినోళ్ళు రేపు మనుషుల్ని మాయం చేయకుండా ఉంటారా ?
వీళ్ళ మాటలు చర్చలు సరే అసలు పాట ఎక్కడి నుంచి వస్తోంది?. అది కాదు ఆ చివరన ఏదో ఇల్లు కులుతున్న దృశ్యం. ఇల్లు కూలదోసి, ఇల్లు పొలం అవుతున్న దృశ్యం. కట్టడపు రాళ్లు సిమెంటు కాంక్రీట్ వెళ్లిపోతోంది . ట్రాక్టర్లు కదులుతున్నాయి. అక్కడే మాయమైపోయిన పొలం మళ్లీ కనబడుతోంది.
విత్తనాలు మొలకెత్తుతున్నాయి. భూమిపైన పచ్చగా మొక్కలు తలలు
పైకెత్తుకుని పాడుతున్నాయి. జీవం అయినా జీవనం అయినా పొలంతోనే అన్నట్లు గా ఆకుపచ్చని పాట… రేడియో మైమరచి వింటోంది.
ఇంకాసేపు ఉందామని ఉంది కానీ, ఈశాన్యం నుండి ఇంకో పాట ప్రేమగా పిలుస్తోంది. మాటలకన్నా పాటలే కదా ప్రేమగా పిలుస్తాయి మనుషుల్ని. పాటలే కదా ఉద్యమాలవుతాయి. అసలు పాట లేని చోటే కదా మనుషులు నిరసించిపోయి శవాలుగా ఉన్నారు.ఈశాన్యం వైపు పరుగు లాంటి నడక.
టీ దుకాణం వద్ద ఇంత పెద్ద గొడవా?
టీ కప్పులో ఏముంది? అంతా టీ కప్పుల్లోనే ఉంది.
చూడగానే అర్థం అయిపోయింది. మనుషులు చంద్రమండలానికి వెళుతున్న సమయంలోనే ఇంకా రెండు గ్లాసుల టీ వ్యవస్థ. అక్కడ మనుషుల రక్తం కుతుకుతా ఉడుకుతుంది. టీ మరిగినట్టు మరిగిపోతోంది. గ్లాసులు బద్దలవుతున్నాయి. పెద్దమనిషి చేతులు కట్టుకున్నాడు చేతులు పట్టుకున్నాడు కాళ్లు పట్టుకున్నాడు.
గ్లాసులు చేతులు మారాయి.
రెండు రకాల గ్లాసులు లేవు.
దేశంలో మనుషులందరూ సమానం అవునో కాదో కానీ, అక్కడ అప్పటికి గ్లాసులు రెండూ సమానమయ్యాయి.
ఇప్పుడు అందరూ ఒకటే.
అన్నీ కప్పులే.
ఆ టీ కప్పులే పాడుతున్నాయి. టీ పాడితే పాట ఎలా ఉందో అలానే ఉంది.
ఇంకా ఎంతకాలం ఎవరికోసం భరించాలి సహించాలి? పొలాలు వాళ్ళవే ఫ్యాక్టరీలు వాళ్లవే.. కూలీ కోసం పోతా ఉండాం కదా అని అంత చులకన చేస్తే ఎట్లా? ఏలిముద్ర వొదిలి సంతకం నేర్చినంత మాత్రాన చదువుకున్నట్టు కాదు కదా. అందుకే చెప్పేది ఆడ మగ తేడా లేకుండా అందరూ అక్షరాలు కాదు పుస్తకాలు చదవాలని. చదువు రాతలు. మారుస్తుంది అంటే ఇదే కదా. రాత్రి బడి మళ్లీ మొదలు పెట్టాల్సిందే. మన పిల్లలు గ్రూప్ వన్ లు సివిల్ సర్వీసులు రాసేదానికి కోచింగ్ కి పోయినంతమాత్రాన మన బతుకులు మారిపోవు. ఊర్లో ఆడోళ్ళకి మగాళ్ళకి మిగతా ఊరి జనాలకు ఉన్నట్టే మర్యాద ఉండాలంటే మనం ఉత్తుత్తి మర్యాదల్ని భయాల్ని మొహమాటాలని వదిలించుకోవల్ల .మన తిండి గురించి మాట్లాడే దానికి వాడెవుడు? వాడి బతుకు గురించి మనం మాట్లాడుతున్నామా? ఆ వెజిటేరియన్ లు సాచాలా?
మాటలు వాదనలు సలహాలు నిర్ణయాలు అవుతున్నాయి. సందేహాలు ఎటో పారిపోతున్నాయి. వాళ్ల మాటలు అడుగులు సమానత్వం దిశగా….
టీ గ్లాసులు చప్పుడు చేస్తూ పాడుకుంటున్నాయి. మళ్లీ మళ్లీ వినేలా ఉంది ఆ పాట. స్వేచ్ఛ కోసం లేచిన గొంతు. పిడికిలి బిగించిన గొంతు. సంకెళ్లు తెంచుకున్న ఆ గొంతు.
రేడియో నోరు మూసుకుని కళ్ళు చెవులు బాగా తెరుచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాటు వింటోంది. ఇన్నేండ్లుగా కీ ఇచ్చిన బొమ్మ లాగా మాట్లాడింది అదే. పదేపదే మాట్లాడింది అరిగిపోయిన మాసిపోయిన చినిగిపోయిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వినిపించింది. ఎప్పుడూ పెద్దపెద్ద మాటలే మాట్లాడింది. సాంఘికచరిత్ర పాఠం లాగా పెద్దపెద్ద పదాలతో అదేదో భాష మాట్లాడింది. జనం మాట అయినా పాట అయినా ఎప్పుడు వినిపించింది రేడియోలో?
ఏం తినాలో ఏం మాట్లాడాలో ఏం చేయాలో అసలు ఏం ఆలోచించాలో ఏ పుస్తకాలు చదవాలో ఈ గుడులకి పోవాలో ఏ సంప్రదాయాలు పాటించాలో ఏ దేవుళ్ళని మొక్కలో ఎవరిని ద్వేషించాలో ఎవరిని పోగొట్టుకోవాలో ఎవరికి దూరం కావాలో, ఏవి హత్యలో ఏవి ఆత్మహత్యలో ఏవి అత్యాచారాలో, ఏవి తీర్పులో ఏవి శిక్షలో అది చెప్పిందే కదా ఇంతకాలం చెల్లుబాటు అయ్యింది. ఆఖరికి పిల్లల పుస్తకాల్లో పేజీలు చినిగి పోయి పాఠాలు మారిపోయ.
ఇంకోకోపక్క ఏదో డప్పు చప్పుడు.
ఏదో పాట ఉత్తేజంతో ఊగిపోతూ, ఊపేస్తూ ఏదో పాట.
ఎవరో దరువేస్తున్నారు. పాటకు తోడు ఆట కూడా జతచేరినట్టుంది. ఏం గొంతు అది.ఏం పాట అది…. సంకెళ్లు తెగుతున్న చప్పుడు. ఉరితాళ్లు తిరుగుతున్న చప్పుడు. విషం సీసాలు బద్దలవుతున్న చప్పుడు. బావుల్లోంచి చెరువుల్లోంచి శవాలుగా మారకుండా రైతులు మనుషులుగా పైకొస్తున్న చప్పుడు.
మనిషి శవం కావడం సహజం .శవం మనిషి అవ్వడమే
యుద్ధం. అక్కడేదో యుద్ధగీతం వినిపిస్తోంది. చరిత్ర తిరగరాస్తున్న చప్పుడు. రేడియో ఆ పాట వినడనికే భయపడుతోంది.ఈ పాటలన్నీ ఎప్పటికీ ఆ రేడియో వినిపించదని తెలుసు. వినటానికే భయపడేది ఇంకా మళ్లీ ఏం వినిపిస్తుంది?
కరువు జిల్లాలో ఎండలధాటికి కూడూ నీళ్లు లేకుండా సగం చచ్చిపోయిన రైతు ఇంటి ముందు బ్యాంకు జీపు నిలబడి ఉంది.
మేమేం ఇమానాలు ఏసుకుని దేశం ఇడిసిపెట్టి ఏ పరాయి దేశానికో ఎల్లిపోతా ఉండామా? చస్తా అయినా వడ్డీలు కడతా ఉండామే కానీ, రాయితీలు అడగతా వుండామా? సారూ మీ బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టినోళ్ళు వడ్డీలు ఎగ్గొట్టినోళ్ళ లిస్టు తీయండి. లక్షలు కోట్లు వదిలేసి పేదోడి మెడకాయే దొరకతాదా మీకు? ఉరి తీసేదానికి?ఊపిరి తీసేదానికి.? కోర్టులో చూసుకుందాంలే సారూ… న్యాయం కోసం పోరాడేదానికి ఇండ్లు పొలాలు అమ్ముకోలేం కదా సారూ.మా ఇండ్లల్లోనూ లాయర్లు ఉండారు సారూ. రెండు గ్లాసుల్లో టీలు తాగినవాళ్ళం కదా రెండాకులు ఎక్కువే చదువుకున్నాంలే. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం లే!
ఆగిపోయిన ఆత్మహత్యలు, నిలుపుకున్న ఆత్మాభిమానాలు, బ్రతికిపోయిన బ్రతుకులు.. తలెత్తుకున్న రైతులు, ముందుకొచ్చిన వెనక బెంచీల వాళ్ళు, ఎదిరిస్తున్న ఏలిముద్రల గాళ్లు, ఊరి కొయ్యలు ఎంట్రిన్ బాటిల్స్ చెరువులు బావులు …ఏదో పాట , గుండెను మెలితప్పేలా ఏదో పాట…
నోరు మూసుకుని కళ్ళు చెవులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ బతుకు పాట వింటోంది రేడియో.
ఇంకో దిశగా ఇంకో పాట..పాట…ఇంకేదో పాట.
నడవాలని అనిపించక,.. పరుగులు తీస్తే,చూస్తే మనుషులు కదా మనుషులు.!
ఆదివారం బద్ధకాన్ని వదిలిపెట్టి రోడ్లపైకి వచ్చిన మనుషులు. రోడ్డు పొడవునా మనుషులు.రోడ్డుపైన మనుషులే మనుషులు! జాతరలా మనుషులు..భయంకరమైన చావులకు కారణమైన గుంతలను పూడుస్తున్న మనుషులు.
వాళ్లు రోడ్లను మరమ్మత్తు చేస్తున్నట్టు లేదు. ఈ దేశపు నాగరికతను
సరి చేస్తున్నట్టు, మొత్తం దేశాన్నే మరమ్మత్తు చేస్తున్నట్టు ఉంది. రక్తంతో తడిచిన రోడ్లు. ఎన్నో ప్రాణాలని క్షణాలలో తీసేసిన కర్కశమైన రోడ్లు. మనం రోజూ వెళ్లే రోడ్లు.మనం ,దేశం పట్టించుకోని రోడ్లు. రోడ్లు బాగుపడుతుంటే,
అక్కడొక పాట వినిపించకుండా ఉంటుందా? ఎన్నో చావులకు కారణమైన ఆ రోడ్డు పాడుతోంది. రోడ్డు పాడే పాట.
ఇంకేదో పాట..కదలాలి, వెళ్లాలి.
కుట్రలో భాగంగా అమ్ముడుపోయిన రేడియోలు, అసత్యాలనే ప్రచారం చేసే దినపత్రికలు, మనిషి దుఃఖాలని, ఉద్వేగాలను నిజాయితీగా చూపించలేని నిజం చెప్పలేని టీవీలు ఆ పాటలోని ఆ మాటల్ని ఆ మనుషుల్ని ఆ సమూహాన్ని ఆ ఉద్వేగాలను వింటూనే చూస్తూనే ఉన్నాయి, ఉంటాయి.
కొత్త మాటలు కొత్త రాతలు కొత్త నడకలు కొత్త సమూహాలు కొత్త పాటలు కొత్త గొంతులు కొత్త గుండెలు.. సరికొత్త మనుషులు.తాజా..తాజా..గా!
నిజం చెప్పొద్దూ..జారిపోయిన రేడియో ఆత్మహత్య చేసుకుంది.