‘సత్యం’ కథ నేపథ్యం

1980 సెప్టెంబర్ నెలలో ఒకనాడు…

మా టైం ఆఫీసు పక్కనుండే రైల్యే సైడింగు ఆఫీసు క్లర్కు రాజన్న వచ్చి నేను నైట్ డ్యూటీ చేసి బయట పడుదామనుకునే సరికే “పెద్దపల్లి రైల్యే క్యాంటీన్ హరనాథ్ ఎందుకో జరూరుగ రమ్మన్నడని” చెప్పిండు.

హరనాథ్ వాళ్లు కేరళ నుంచి వచ్చి ఇక్కడ సెటిలయ్యిండ్లు. ఆయనకు ముగ్గురు చెల్లెండ్లు. అప్పటికి ఉద్యమాలల్లో తిరిగే వాళ్లకు ఆడపిల్లలు దొరకడం కష్టం. పైగా కట్నకానుకలు లేకుండా బ్రాహ్మణ పూజారి లేకుండా స్టేజీ పెళ్లిళ్లు ఇంకా కష్టం. నా క్లాస్ మేట్, మిత్రుడు చందుపట్ల క్రిష్టారెడ్డి (మహారాష్ట్రలో ఉద్యమ నిర్మాణంలో తొలితరం ప్రజానాయకుడు ట్రేడ్ యూనియన్, పౌరహక్కుల నాయకుడు, ప్రజల లాయరు. అరెస్టులు, సోదాలు అనేకం అనుభవించి ఒత్తిడికి లోనై స్కిజోఫ్రినియా వ్యాధితో ఆత్మహత్య చేసుకున్నారు.) అప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో క్లర్కుగా పనిచేస్తున్నాడు. అతనికి సహచరి కోసం మేమంతా వెతుకుతున్నాం. హరనాథ్ వాళ్లు సుముఖంగా ఉన్నట్టు తెల్సింది. అదే మతలబు మీద పిల్సి ఉంటడని జరూరుగ ట్రేన్ పట్టుకొని పోయి స్టేషన్ల దిగిన.

అప్పుడు పెద్దపల్లి స్టేషను పక్కనే బస్టాండు. స్టేషన్ ప్లాట్ ఫాం వేపు హోటల్. అదే హోటల్ బస్టాండు వేపు రేకులేసి ఉండేది. ఎప్పుడు వంద మందితో హోటల్లో నిలబడడానికి జాగా ఉండేది కాదు. నాకు హరనాథ్ తో పెద్దగా పరిచయం లేదు. కౌంటర్ మీద ఫుల్ బిజీగా ఉన్న అతను నన్ను గుర్తుపట్టి ఎవరినో తోడిచ్చాడు. ఒక కిలోమీటర్ నడిచిన తరువాత ఒక చింతచెట్టు నీడకు ఒక సైకిలాయనకు అప్పజెప్పిండు.

నాకేమి అర్థంకాలేదు… పిల్లను సూద్దామని వస్తే గిదేమిటో? అనుకుంటండగానే ఆ పిలగాడు నన్ను సైకిలెక్కించుకొని మామిడి తోట్లకు తీసుకుపోయిండు. నన్నాడ దించి పిలగాడు మాయమయ్యిండు.

నేను బిక్కిరి బిక్కిరి చూసుకుంట నిలబడేసరికి కిసకిసనవుకుంట కోటన్న. (మేం అట్ల పిలిచేటోల్లం. మల్లోజుల కోటేశ్వరరావు. 1972 నుంచి మేమందరం జిగ్రీ దోస్తులం… ఎక్సర్ సైజులు, దంగల్లు చేసేటోళ్లం. గామా పహిల్వాన్ ను గోదావరిఖనికి పిల్వడం, సందపల్లె రామస్వామి పహిల్వాన్, నా క్లాసుమేటు శేషగిరి పహిల్వాన్ తో పరిచయం అప్పుడే. మొదటి సారి డిశంబర్ పుండసోంటి సలిలో మా ఇంటికి కాలి నడకన నడిసిపోయినం. మా అవ్వ ఎండుచాపలు (జెల్లలు) పులుసు చేసింది. అప్పుడు మేము చేపలు చాలా పట్టేది. కండ్లపొంట నీళ్లుగారంగ ఊదుకుంట తిన్నడు. ఆ రాత్రి గడ్డకట్టుకపోయే చలి. కప్పుకోను బట్టలు లేవు. మా అవ్వచీర మా ఇద్దరికి ఎటూ సరిపోతలేదు. తెగిన కుక్కిగడంచ నెగడు ముట్టిచ్చి అక్కడ ముచ్చెట్లల్ల మంట వెలుగులో అతను బ్రాహ్మణుడని తెల్సింది. మా అవ్వ బాపనాయనకు నీసు పెట్టినందుకు తిట్టింది. తెల్లారి మంథని హైస్కూలులో చారు మంజుదారు మరణం గురించి క్లాసు రూంలల్ల మాట్లాడుతుంటే పంతుళ్లు, హెడ్ మాస్టర్, నేను గుడ్లు తేలేసినం. అగో గసోంటి మనిషి.) ఇద్దరం కల్సి కొంత దూరంబోయేసరికి అక్కడ బండమీద నా కెరుకలేని ఇంకో ఆయన కూకుండి ఉన్నడు. వాళ్లేదో మాట్లాడుకుంటున్నట్టున్నది, నేను కొంచెం దూరంబోతనని అడిగిన.

“పర్వలేదు కూకో. ఇదేం రహస్యం కాదు. నీకు తెలువాల్సిందే” నన్నడు.

నేను మామిడి మొద్దుమీద కూర్చున్న.

“మేం ఓపిక బడ్తన్నమ్. ఇంక దంగల్లకు దిగలే మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు” కోటన్న.

అవతలి మనిషి ఎవరో ఏమి మాట్లాడలేదు.

“తెలంగాణ సాయుధ పోరాటంల దాచుకున్న తుపాకులున్నాయనే కదా మీ ధీమా? అవి ప్రజలవి. మాకేసి ఎక్కు పెట్టవద్దు” మళ్లా కోటే.

“కాదు కామ్రేడ్… ఎక్కడో అక్కడ ఈ కొట్లాటలకు పులిస్టాప్ పెట్టాలె. మా మీద మీరు మీ మీద మేము కరపత్రాలు వేసుడు” అవతలతను.

“మీరేమో ఎలక్షన్లల్ల దిగుతండ్లు. మీకుమాకు పొత్తుకుదరదు. ఇవ్వాళ్లే ప్రజాసంఘాల పెద్దలంత కలుస్తున్నరు కదా… మా నిర్ణయం మేం అక్కడ ప్రకటిస్తం” కోటీ.

“సరే కామ్రేడ్! ప్రజలు నవుతుండ్లు. ఎవల జాగలవాళ్లం ఎవరి పద్దతిలో వాళ్లం ఉందాం. అతివాద మితవాద చర్చలు ఇప్పట్లో తేలవు. మన ఆచరణలో తేలుతయి” కోటీ చెప్పిండు.

అతను వెళ్లిపోయిండు. “రెండు నిమిషాలల్లో మనం పోవాలి”అన్నాడు కోటీ.

నేను ఊపిరి పీల్చుకొని “మీదగ్గర లేవా?” అన్న చిన్నపిల్లవాడి తీర్గ.

“ఉన్నయ్ దీపావళి సుతిలి బాంబులు కపులింగ్ వి, బటన్ చాకులు, తపంచాలు, టోవెల్ బోర్లు” అని మార్మికంగా నవ్విండు.

నాకర్థమయ్యింది అవి సరీగ పనిచేస్తలేవని… ఈ గొడువంతా విప్లవ గుంపుల మధ్యన అని.

“సరే … కరీంనగర్ ల మీటింగున్నది ఇప్పుడు విన్నవుగద. వాళ్ళ తరపున వస్తారు. నువ్వు పోవాలి.”

“నేనా?”

“నువ్వే! వాళ్లకు కూడా నువు తెలుసు గనుక”

“నాకేడ మాట్లాడస్తది?”

“మాట్లాడేటోల్లు చాలా మాట్లాడుతరు. మీ జాగలకు మేం రాం. మాజాగలకు మీరు రాకుండ్లీ గీ ఒక్కమాటే”

“ఇప్పటి పరిస్థితుల్లో ఒకల ప్రాంతానికి మరొకలు చొరబడి కొట్లాడే బదులు ఎవరి ఏరియాలో వాళ్లు పని చేసుకోవడం మంచిది. అందుకు ప్రజా సంఘాల ముందు ఒప్పుకొని పాటించాలి.”

” రైట్ “

“మరి మీరు పాటిస్తరా?”

” ప్రజా సంఘాల వాళ్లు చెప్పినంక పాటించాలి.”

అతను పోబోతూ “ఇప్పుడైతే మనమే ఆయుధాలం. ఆయుధమెప్పుడు నిర్ణాయక శక్తి కాదు. రాజకీయాలే మన బలం. మనకు అంత కెపాసిటీ ఉంటే ఆయుధాలన్నీ ప్రజలు తయారు చేసినవే కదా?”

“వోర్ని పెద్ద దెబ్బే ఉన్నది” నేను…

బస్సు పట్టుకొని చలో కరీంనగర్. మబ్బులు గిరేసుకొని ఒకటే ఉరుముడు. చిన్నప్పుడు “అర్జునా పాల్గునా అంటే పిడుగులు పడవని” దుర్గక్క చెప్పింది. “పాండవులు, కౌరవులు యుద్ధం చేస్తున్నరంట. గ సప్పుడు అర్జునుని రథందట” నమ్మకాల నుండి ఎంత దూరమో వచ్చినంగదా… అయినా యుద్ధరంగం విస్తరిస్తోంది.

బస్సులో ఒకటే ఆలోచన. మెదడు నిండా ఆయుధాలే. లోలోపల ఎక్కడనో గూడుకట్టిన విశాదపు తాలూకు పుండు అవ్విచ్చినట్లయింది. 1977 లో జగిత్యాల కన్నాపురంలో లక్మిరాజంను దొరల గుండాలు పాశవికంగా చంపారు. చినమెట్టుపల్లిలో బంగ్లామీది నుండి దొర, దొర బావమరిది తుపాకితో కాల్చి చంపిండ్లు. లొత్తునూరు గడిమీదికి పోయిన జనం మీదికి కాల్పులు. పోచాలు చనిపోయాడు. కొదురుపాకలో రాజవ్వను చెరిచారు… ఇట్లా అనేకానేకం. వాళ్ల దగ్గర ‘తుపాకి’ ఉండడం వల్లనే కదా ఇంత జరిగింది. ఇది వరకే అవ్వన్ని, కథల్లో, నవలల్లో చాలా రాసిన గాని గీ ‘తుపాకీ’ మూడక్షరాల మహమ్మారి ఎంత సంపదను దోచుకున్నది. ఎన్ని కోట్లమందిని భయపెట్టింది. ఎందరి ప్రాణాలు తీసి ఉసురు తీసింది. ‘తుపాకీ’ నా మెదడునిండా వ్యాపించింది. కొన్ని స్థితులను అలలను రాయడానికి మాటలు భాష చాలవు.

మా వీరన్న (స్వతహాగా ఆర్ద్రత నిండిన సున్నితమైన హాస్యం ఆయన ఊపిరి) అప్పుడప్పుడు చెప్పిన జైలు సహచరుల కథలు, సైకిల్ల దొంగ చారి వర్గ దృక్పథం, నెనరు; చాలుగాడైన తన మామను చంపి కత్తికి గొర్రె రక్తం పూసి కేసునుండి బయటపట్ట శంకర్ రెడ్డి చాలుబాజి తనంతో పాటు కార్యదక్షత; వీళ్లందరితో పాటు, సైకిలు గొట్టాలతో తుపాకి తయారు చేసి విచారణ లేకుండా అరెస్టు చూపకుండా సబ్ జైల్లో ఉన్న అవుసులోల్ల పిలగాని కథ గుర్తొచ్చింది…

గురుడు బతికిచ్చిండు. లేకపోతే నా మెదట్లో ఎన్నో పేలుల్లు జరిగేయి. తుపాకి దొరలకే కాదు, ప్రజలకు చేసుకోవత్తది. ఇది ఎరుక. బుగులు పడ్డ నాకు ఈ ఎరుక ఎంత ఉద్వేగానికి లోను చేసిందో? నిమ్మల పడి ఆ పిలగాన్ని జాగర్తగా నా మెదట్లో పెట్టుకొని మున్సిపల్ టౌన్ హాల్లోకి కురిసే వానలోంచి అడుగు పెట్టిన…

అక్కడ చలపతి రావు, వల్లూరిపల్లి రాజారావు ( నా మిత్రుడు వల్లూరి పల్లి రంగారావు తమ్ముడు సెకరేట్రేయేటులో ఉద్యోగి), పౌరహక్కుల నాయకులు జాపా లక్ష్మారెడ్డి, రాజేశం సారు ఉన్నారు. అప్పటికే అందరి చేతుల్లో కరపత్రాలున్నాయి. ఇయ్యర మయ్యర మాట్లాడుకున్నట్లే వాళ్ల ముఖాలు చెప్పతున్నాయి.

నేను వాళ్లందరికి తెలిసినోన్నే కాని ఆ మీటింగుకు పిలిసినోన్ని కాదు…

నా పక్కకు కూర్చున్న లక్ష్మారెడ్డి “ఇది తెగదు, బల్వదు చాయతాగత్తామా?” అన్నడు.

చాయ తాగంగ చెప్పిన “ఎవలజాగలల్ల వాళ్లు పనిచేసుకుంటే కదా… ఇంకా బోలెడు ప్రాంతమున్నది, దేశమున్నది. గీ కిరికిరెందుకు?” అన్న.

” నిజమేకని ఎవరు చెప్పాలె?”

“మీరే?”

“వింటరా?”

“వినకపోతేంజేస్తరు? ఇప్పటికే అందరు నెరివడ్డరు”

లోపలికచ్చినంక లక్ష్మారెడ్డిగారు తన ప్రతిపాదన చెప్పారు.

చలపతిరావు, రాజారావు అవతలి పక్షాణ ఒప్పుకున్నారు.

“సరే మరి అవతలి పక్షం తరపున ఎవరొచ్చినట్లు?” అడిగారు.

“మనందరం ఇద్దరి పక్షం. ఒకపక్షమని కాదు” లక్ష్మారెడ్డి.

“కాదు ఈ ప్రతిపాదన ఒప్పుకోవాలి కదా?”

“ఒప్పుకోకపోతే ఎవరు ఊకుండరు కదా? కనుక ఆచరణే. ఇప్పుడైతే ఒప్పుకున్నట్లే అనుకోరాదుండ్లి” లక్ష్మారెడ్డి చివరి మాట.

మీటింగు అయిపోయింది…

తుపాకి నా మెదడు నిండా ఆక్రమించింది. ఈ చిన్న దుర్మార్గమైన కర్ర, లోహపు గొట్టాల నిర్జీవమైన ఉపకరణం చరిత్రలో ఎంత రక్తపాతానికి, ఎంత సంపద దోపిడీకి కారణమైంది? రెండు ప్రపంచ యుద్ధాలు ఈ మహమ్మారి అమ్మకానికే జరిగాయి. ప్రపంచాన్ని ఆక్రమించాలన్న దురాశపూరితమైన నియంత హిట్లర్ ఉత్తాన పతనాలకు కారణమైంది. చివరకు హిట్లర్ ఈ తుపాకితోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచ ప్రజల కలల రూపం సోవియట్ రష్యాలో మూడు కోట్ల మంది, దాదాపు ఐదో వంతు జనాభా హత్యాకాండకు ఇదే కారణం. ఆఖరుకు టక్కుటమారాల నక్కజిత్తుల అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి కారణం, కనపడని శక్తి ఈ తుపాకే. దీని మార్కెట్టే.

ఐపోయింది. మిల్లీమీటర్ల దూరంలో నా మెదడు ట్రిప్పవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదట్లా జరుగుతుండగానే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో లైసెన్స్ తుపాకులన్నీ పోలీసులు ఎందుకనో పోలీసు స్టేషన్లలో భద్రపర్చాలని నోటీసులు పంపారు. మా కంపెనీలో ఉండే తుపాకీని భద్రపర్చడానికి మా సెక్యూరిటీ ఆఫీసర్ తో వెళ్లి అక్కడ వందలాది తుపాకులు, రకరకాల తుపాకులు చూసి డంగైపోయాను. మా దూరపు చుట్టం ఆర్.ఎస్.ఐ గా ఉన్న ఒకాయినెను అడిగితే… ఈ రెండు జిల్లాలలో దొరల దగ్గర అధికారిక, అనధికారిక తుపాకులు చాలా ఉన్నాయని చెప్పాడు. కోలాం ఆదివాసులు లోహ శాస్త్రజ్ఞులట. తుప్పుు పట్టని ఉక్కును తయారుచేయగల నిపుణులట. క్రూర జంతువుల నుండి రక్షణ కోసం ఆదివాసీ గ్రామాలలో వాళ్లే తయారు చేసుకున్న తుపాకులుంటాయట.

అదేమి చిత్రమో గాని నైట్ డ్యూటీలో మా ఎక్స్ మిలటరీ సెక్యూరిటీ సిబ్బంది, అప్పటికే మా కంపెనీలో తిష్టవేసిన 150మంది రిజర్వ్ పోలీసులు, నైట్ పెట్రోలింగ్ కు నా డ్యూటీలో భాగంగా అడివిలో గల మా క్రషర్ దాకా పోయేవాళ్లం. నేను వద్దనుకున్నా తుపాకులు వాళ్ల చేతుల్లో. వాళ్లకు మరే ముచ్చట ఉండదు గనుక దాని ముచ్చట్లే.

అట్లా నేను మొదటెప్పుడు తుపాకీని చూశానో మతికచ్చింది. బహుశా పదేండ్ల వయసులో మా అమ్మమ్మ ఊళ్లో వెన్నంపల్లిలో అవుసల నారాయణ దగ్గర. ఆయన దొర తుపాకీ తెచ్చి వారానికొకసారి గ్యాసునూనెతో తుడిచేవాడు. తుపాకీ ఎదురుగా అడ్డగోడ చిలుక్కొయ్యకు తగిలించి ఉండేది. ఆ వయసులో అదేమిటో తెలిసేది కాదు. నారాయణ లోడ్ చేసిన తుపాకిలాగా మౌనంగా కొలిమి ముందు… నిప్పుల్లా మెరిసే కండ్లతో కూర్చుండి మొద్దు మీద సుత్తితో లయబద్ధంగా కొట్టేవాడు.

ఆ తరువాత మా తాత కొరుకూరి దుర్గయ్య కమ్యూనిస్టుల కాలంలో లోతు ఒర్రెల రామగిరి అడవుల్లో తుపాకులు చూసిండట. మా పెద్ద నాయిన వరుసాయన వెన్నంపల్లి దొరను తుపాకీతో చంపిన గ్యాంగుల ఉండి, దెంకపోయి ఎనగందుల మఠంలో సన్యాసుల్ల గల్సి బాలసంతులాగా ఇప్పటికీ ఊరూరు తిరిగి భిక్షం అడుక్కుంటున్నడట.

సత్యం కథ కింద లింక్ క్లిక్ చేసి చదవండి. https://kolimi.org/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

One thought on “‘సత్యం’ కథ నేపథ్యం

  1. రాజన్న నోట ముక్కలు ముక్కలుగా ఎన్నోసార్లు విన్న కథే, సృజనలో సత్యం అచ్చు వేసినప్పుడు విన్న కథే ఇప్పుడు మొత్తంగా ఒక్క చోట చదువుతుంటే బతికిన దినాల తలపోత బరువు చేత కళ్లలో నీళ్లు తిరిగాయి. రాజన్నా, నీ చేతులను ముద్దు పెట్టుకుంటూ… (అవునూ, పెద్దపల్లి స్టేషన్ క్యాంటీన్ ఆయన పేరు అమర్ నాథ్ అని గుర్తున్నది నాకు, నాలుగైదు సార్లు కలిసిన. ఆయన పేరు హరనాథా?)

Leave a Reply