ఇదీ తెలంగాణ కవిత్వ భాషకు తగుళ్ల గోపాల్ తొడిగిన అందమైన వెండి ‘దండ కడియం’. ఉత్పత్తి వర్గాల జీవన సంస్కృతిలో ప్రత్యేకమైనది దండ కడియం. స్వంత కష్టార్జితంగా సాధించుకున్న నిలుపుకున్న శ్రామిక వర్గ సాంస్కృతిక చిహ్నం. తెలంగాణ పల్లెలో చెమట పూల పరిమళంలో తడిసి ముద్దయ్యే తల్లిదండ్రులు, తాత, నాయినమ్మలు ఆత్మీయంగా మాట్లాడుకునే పదబంధాల అలంకారమిది. దండకడియంలో బాల్యపు ఆకలి కన్నీళ్లు దాగివున్నాయి.పై మెరుపులతో బోలుగా నిర్మించిన కడియం కాదిది. రక్తమాంసాలు, చెమట సుక్కలు, మానవీయ సుగంధాలతో నిండివున్న జ్ఞాపకాల సంపుటి. తెలంగాణ సాహిత్యానికి గోపాల్ అందించిన ఒక విలువైన, అందమైన కానుక ‘దండ కడియం’. నేటి సమాజంలోని తన కళ్లకు కనిపిస్తున్న అసమానతలు, పేదరికంలో ఎదుర్కొన్న కష్టాలే ప్రాతిపదికగా అన్నివర్గాల పాఠకులకు అర్థమయ్యే రీతిలో తన శైలిని తీర్చిదిద్దుకున్న కవి.
గోపాల్ కవిత్వంలోని తాత్త్వికతనీ, సాంద్ర అభివ్యక్తిని, భావుకతనీ అర్థం చేసుకోవడానికి ముందుగా కవి గోపాల్ నడిచి వచ్చిన దారి అర్థమైతేగానీ, ఆయన అక్షరాల అంతరంగంలోని భావాల తీవ్రతలు మనలోకి ఇంకిపోవు. కవి వస్తు సంస్కృతి పట్ల వ్యతిరేకత, ప్రంచీకరణ వల్ల కలిగిన దుష్పరిణామాల పట్ల ఆందోళన, కన్నీటి దు:ఖం ప్రస్పుటంగా మనకు చూపుతాడు. గోపాల్ తన కవితల్లో వినమరుగైపోయిన తెలంగాణ జీవభాషను సమర్థవంతంగా ప్రయోగించారు. భావుకత కలిగిన అభివ్యక్తిని కూడా సుమధురంగా ప్రాంతీయమైన ఉపమానాలు, కవి సమయాలతో అద్భుతంగా నిర్మించారు. తనదైన కొత్త రకమైన అభివ్యక్తిని రూపొందించుకోవడంలో కవి సఫలమయ్యారు. తనలో బాల్యం నుంచి గుడిసెలా గూడు కట్టుకున్న భావోద్వేగాలను అక్షరాలతో దృశ్యం చిత్రించడం కనిపిస్తుంది. ‘దండకడియం’ యాభయి కవితలు కలిగి రెండో ముద్రణ పొందిన సంపుటి. 2016లో ‘తీరొక్కపూవు’ల పేరుతో నానీల కూడా సంకలనాన్ని ప్రచురించారు. ఈయన కవిత్వం మిగతా కవుల కవిత్వం కంటే భిన్నత్వంగా కనిపిస్తుంది. అతను ఎంచుకున్న భాష పటిమ నుండి కవిత్వ పదాల పరిమళం వికసిస్తుంది.
కవి గోపాల్ను వచన కవిత్వంలోనూ నానీల డిక్షన్ వెంటాడిన తీరు కొన్నిచోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఏడంత్రాల మల్లె’లో ‘కవిత్వం అన్నం పెట్టదు నాయిన!/నిజమే గానీ నన్ను బతికిస్తుందమ్మా…అన్నం తింటుంటే ఫోన్ చేశానట/ కమ్మని మాటల ముద్దల్ని తినిపించాడు, జీవితమంటే మరేందో కాదు/ తాటిమట్టను చీరి పొర్కను కట్టడమే’ అంటాడు. నానీల ప్రభావం నుంచి చక్కని చిక్కని సాంద్రత కవిత్వం సృజించిన కవిగా గోపాల్ అక్షరాల నిండా ఆ భావుకత నిండి వుంటుంది. మనిషులు తమ చుట్టు నిర్మించుకున్న జంతువుల ప్రపంచంలోని నియతిని ఎత్తిపడుతూనే తమ తల్లిదండ్రుల పట్ల పిల్లల నిర్లక్ష్యంగా సుతిమెత్తగా విమర్శకు పెడుతాడు. ‘అమ్మదీపం’ కవితలో వత్తిజేసి, నూనెబోసి/ బతుకును వెలిగించినందుకు కొడుకు/ ఈ అమ్మ దీపాన్ని గాలికి పెట్టిపోయిండు’అని ఆవేదన చెందుతాడు. కోడి, ఆవు,కుక్క జంతులను పోషించి విశ్వాసం పొందగలం. పిల్లల్ని సాది సమరిచ్చిన తల్లిని గాలికి వదిలేసే కొడుకులు, బిడ్డలను హెచ్చరించే పద్యం.
తెలుగునేలపై తన ఆటపాటలతో ప్రభావితం చేసిన కవిగాయకుడు గోరటి వెంకన్న. సాహిత్యంలో బలమైనవ్యక్తీకరణ కలిగిన రచయితలు వర్ధమాన కవులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. పూర్వపు మహబూబ్గనర్కు చెందిన గోపాల్ మీద కూడా ఎంకన్న ఆట,పాటల ప్రభావం ఉంది. అందుకేనేమో ‘పాలమూరు గోరువంక’గా పిలుచుకునే గోరటి ఎంకన్న వీరాభిమాని యువకవి. ఆ ప్రేమతోనే మంచి ‘దుసరితీగల పాన్పు వాడి పాట’ని కవితా ఊయల కట్టి పాడుకుంటాడు. సృష్టిలోని ప్రతీ అణువును అర్థం చేసుకున్న ప్రకృతి తాత్వికుడిగా ఎంకన్నను అభివర్ణిస్తాడు.
సాధారణమైన మనుషుల కంటే కవి మనస్సు విశాలమైనది. తన ఊరువాడ పరిసరాల్లో కనిపించే అమ్మలక్కల పట్ల ఆత్మీయత కలిగిన మానవీయ కవి. తనతో ఏ సంబంధం లేకపోయినప్పటికీ ఒకే నేల, అకాశం కింద బతుకుతున్న మనుషులం అనే జీవన బాధాసారుప్యత కలిగిన భావన ‘ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్లం’ కవిత రాయించి వుంటుంది. అవును దు:ఖంలేని జీవితాలు ఉంటాయా ? ఎంత చెట్టుకు అంతగాలి అన్నచందంగా ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు తప్పక వుంటాయి. దు:ఖ హేతువు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కారణమై వుంటుంది. కష్టాలకు, కన్నీళ్లకు భయపడి నిండు జీవితాన్ని అర్దంతరంగా ఆత్మహత్యలకు బలి చేసుకోవడం భావ్యంకాదని హితవు పలికాడు. ఆ దు:ఖాన్ని నాలుగు అక్షరాలుగా మలచమంటాడు. ఆ బాధను ఆత్మీయులతో పంచుకొని సాంత్వన పొందాలి. ‘దు:ఖపు గంప’లో ‘జీవితమన్నాక దు:ఖం ఉంటుంది/కనబడని ఈ దు:ఖాన్ని కండుపులో దాచుకొని/నీ గండెభాష వినే వాళ్లముందు/ దు:ఖపు గంపను దించుకోవాలి…’ అంటాడు కవి.
‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్’ శ్రీశ్రీ అన్నట్లు శ్రామిక, ఉత్పత్తి వర్గాల జీవితాలను మరింతగా కవిత్వంలోతీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందమైన ఆధునిక ప్రపంచీకరణలో కనుమరుగైపోతున్న చెమట చుక్కల సౌందర్యాన్ని కాంక్రీట్ జంగల్లో జన్మించిన కవి ఎట్లాగు సృజించలేడు. అది కేవలం చెమటమట్టి పోరల్ని చీల్చుకొని వచ్చిన అట్టడుగు శ్రామిక, ఉత్పత్తి వర్గాల నుంచి వచ్చిన పీడిత వర్గ కవులు మాత్రమే రాయగలరు. ఆ భాష పనిముట్లను, ఆ చెమటపూల బిందువుల జీవన సారాన్ని సృజనాత్మకంగా అక్షరీకరించడంలో గోపాల్ భాష పాఠకుడిని తన జీవన మూలాల్లోకి తీసుకుని వెళ్లుతుంది. తాను నడిచి వచ్చిన పల్లె జీవితం ఇంత అందమైనదా ? అని పాఠకుడు తనకు తానే విస్మయంతో తదాత్మీకరణం చెందేలా సంబరాశ్చర్యాల్లో ముంచెత్తుతాడు. ‘వాళ్లు రంగులద్దిన వాక్యాలు’ కవితలో ‘కొండుకుకు నౌకరి దొరకాలని/ ఒక గునుగు పూవు/ సిరసనగండ్ల జాతరలో/ మెట్టుమెట్టుకు మొక్కుకుంటున్నపుడు/ గుండెను నింపుతుందో వాక్యం…ఒంట్లోని నరాలను వడికి/మగ్గంపై దారాలుగా పేర్చి/ పడుగుపేకల మధ్య చూపుల్ని బిగించి/నేతన్న నేసిన పట్టు చీరకు/అంచుగా నిలిచిపోతుంది…సద్దిమూటతోపాటు/ఎండను నెత్తిన కట్టుకొని బాటపొంట గొర్లను మర్లేసుకుంట పోయే/ అవ్వచేతికి మంజేతి కడమై నవ్వుతుంది/ వాళ్లు రంగులద్దిన వాక్యాలు’ అంటూ వారి బతుకుల్ని అద్భుతమైన భావుకతగా వ్యక్తీకరిస్తాడు.
శ్రామిక, ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన కవుల అక్షరాల తడిలోని ఆంతర్యాన్ని ఆ కవిత్వం చదివితేనే తెలుస్తుంది. ఏ కవితను తిరగేసిన తడితడిగానే ఆ కన్నీళ్లు పాఠకుడి మునివేళ్ల హృదయాన్ని తాకుతుంది. ఇది ఒక్క గోపాల్ జీవితంలోని జ్ఞాపకాల కవిత్వం కాదు. అతను నడిచ్చిన ముళ్లదారిలోని నిరుపేద పీడితుల కన్నీటిలో మునిగి తేలిన కవిత్వమాల. తాను పుట్టిన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామం కండగల స్వచ్ఛమైన పల్లెకవిని తెలంగాణ సమాజానికి అందించింది. తల్లిదండ్రులు తగుళ్ల కృష్ణయ్య, ఎల్లమ్మ గురించి ‘దు:ఖనదిని దాటుకుంటూ…’, ‘బువ్వచేతి కొంగు’లో రెండు కవితల్లో అద్భుతంగా చెబుతాడు. ‘కాంటాలు చిమ్మెటలు వేలాడే/ పసుపుతాడు/ ముక్కుపుల్ల లేని నిండు ముఖం/ బువ్వచేతికొంగు ఏసుకునే అమ్మ/ ఒక నిరలంకార పద్యం/ పుట్టినప్పటి నుంచి/ మావురాల ఎల్లమ్మలెక్క/ గండదీపం మోస్తూనే ఉంది…పొద్దటి నుంచి పొద్దుందాక/మెదమోసి, వడ్లు దులిపి/కుండెడు వడ్లను నెత్తినబెట్టుకొని/పచ్చినొప్పులతో ఇంటికి జేరే మా అమ్మనే/ ఒక జానపదపాట’ని చెబుతాడు. ‘కూలి తల్లి’ కవితలో కూడా ఆ తల్లి తన కన్నతల్లి గురించి మాత్రమే కాదు. ఉత్పత్తి రంగంలో శ్రమైక జీవితంతో ముడిపడివున్న అందరి తల్లుల జీవితంలోని కష్టాల శ్రమకావ్యంగా రాస్తాడు కవి. ‘లేనిచోట’ కేవలం తన నాయనమ్మ మీద మాత్రమే రాసిన కవితగా భావించడానికి వీల్లేదు. వృద్ధులయిన తల్లిదండ్రుల పట్ల ఆధునిక సమాజం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిపొడిచిన పద్యంగా అవగాహన చేసుకోవాలి.
జీవితం అంటే పంచభక్ష పరమాన్నాలు తినడం కాదు. బతుకులో తియ్యదనం ఎపుడు కనిపిస్తుంది ? ఎన్నో ఎడారి దారులు, ఎగుడుదిగుళ్లను దాటి వస్తే తప్పా ఆ జీవన మాధుర్యాన్ని ఆస్వాదించలేం. ‘గంజి’ కవితలో పొయ్యిమీద ఎసరు కాగుతుంటే/ బియ్యంగింజలు చెప్పె గెలుపుపాఠం గంజి/ గంజి అనంగనే/కూరలేని లోటును తీర్చిన/ ఆ పండ్లరసం గుర్తొస్తుంది./ ఉప్పేసిన గంజి కలుపుకోని/ ఊదుకొని తిన్న రోజులు గుర్తొస్తాయి/పట్టుబట్టలను గంజిలో అద్ది/ఇస్త్రీ చేసిన కొన్ని బతుకులు గుర్తొస్తాయి/ అమ్మా…/ బతుకుమీద ఆశ చస్తుంది/ వెచ్చని గంజివోసి, ఇంత దొడ్డుప్పు కలిపి/ మళ్ళీ నన్నూ బతికించవే…’ అంటాడు. ఇంతకంటే భావుకత కలిగిన గొప్ప శ్రామికజీవన కావ్యం ఏముటుంది. పిల్లలంటే కవికి అమితమైన ప్రేమ. అవును మన జీవితంలో అత్యంత మధురమైన మరపురాని జీవితం బాల్యమే కదా! బాల్యాన్ని ఆస్వాదించడానికి, అనుభూతిని పొందడానికి మనమూ పసితనం అప్పు తెచ్చుకోవాల్సిందేనని ‘పిల్లల ముందు’ చక్కగా చెబుతాడు. చదువుకునే పిల్లల కలలను వారి తల్లిదండ్రులు తెలుసుకొని ప్రోత్సహించాలి. కాని తల్లిదండ్రులు తమ కలలను చదువుకునే పిల్లలపై బలవంతంగా రుద్దితే ఆ ఒత్తిడికి బలవన్మరణాలు తప్పవని హెచ్చరిస్తాడు. పిల్లలకు ఇష్టంలేని చదువులను అంటకట్టి ఉరి తాళ్లు పేన వద్దు. ‘కడుపుకోత లెందుకు?’ కవితలో లక్షల పెట్టుబడులను పెట్టి / ర్యాంకుల పంటను ఆశిస్తున్నారు గానీ/ ఆ పొలంలో ఏ పంట పండుతుందో / ఒక్కసారైనా ఆలోచిస్తే / కడుపు కోతలు ఆగెవేమో…మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ వ్యాక్యాలు చక్కని సందేశాన్ని పంచాయి.
కవిత్వం చేయడానికి అన్ని వస్తువులు, సందర్భాలు అనువైనవే. ఐతే కవి ఎలా చెప్పాడన్నదే పాఠకుడి హృదయ స్పందనను అనుసరించి ఆ కవిత్వానికి ప్రాధాన్యత లభిస్తుంది. గోపాల్ తనకు ఆత్మీయులైన వారి మీద రాసిన కొన్ని స్మృతి కవితలు పాఠకుల కళ్లలో నీటిపొరను ఉబికిస్తుంది. తన హాస్టల్ దోస్తు అంధుడైన శ్రీనివాస్ కోసం రాసిన ‘అమ్మలేని నేను’ ఉత్తమ పురుషలో రాసిన కవిత మనుసును కదిలిస్తుంది. జీవితంలో విఫలమై చనిపోయిన కొందరు సోదరిమణుల గురించి ‘మా బంగారానికి కదూ!’ తన దు:ఖాన్ని పంచుకుంటాడు. శ్రామికుల జీవితాల్లో పనిముట్లు కూడా దేహాల్లో కలిసిపోయి మమేకమైతయి. వాటిని వినియోగించిన మనుషులు దూరమైనపుడు వాటిని చూసినపుడుల్లా తప్పకుండా ఆ మనుషులు గుర్తుకు రావడం సహజం. అట్లాగే కవి తన తండ్రి శ్రమ జీవితంలో భాగమైన ‘నాన్న గొడ్డలి’ని కూడా కవిత్వంలో చేయడంలో గోపాల్ ప్రతిభను చూడొచ్చు. ‘నాకు ఉహ తెలిసినప్పటి నుంచీ / నాన్న చేతుల్ని రోజూ/ ఆప్యాయంగా ముద్దాడిరది ఈ గొడ్డలే…/నాన్న పిడికిట్లో కూర్చొని / నాన్న గుండె బాలసలను విన్నది ఈ గొడ్డలే… అందూ నాన్న పోటోకు దండం పెడుతుంటే / నేనుమాత్రం గొడ్డలి ప్రక్కన కూర్చున్న/నాన్నరూపం గొడ్డలిలో కనిపించేసరికి!’ అని దు:ఖితుడవుతాడు.
కళ కళ కోసం కాదనే తాత్విక దృక్పథం కవికి నిండుగా ఉంది. తన కవిత్వ కళ ప్రజల్లో చైతన్యం నింపాలనే ఆకాంక్ష బలంగా కలిగిన కవి మాత్రమే ‘ఎక్కడిగాలో’నని ఎన్నికల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తాడు. ఓట్ల రాజకీయాల్లోని నంగనాచి వేషదారులను ఉతికి ఆరేస్తాడు. గోపాల్ను కేవలం అస్తిత్వవాద కవిగా చూడ్డానికి వీలులేదు. దేశంలో లౌకిక విలువలపై జరగుతున్న దాడుల్ని గమనించే దృక్కోణం కలిగి వున్నాడు. కశ్మీర్లో మనువాదుల ఉన్మాదానికి బలైన అసిఫా కోసం ‘అడవి పొద్దుకూకినట్లు’ందని అక్షరాలు కన్నీరుమున్నీరవుతాయి. దళితుల పట్ల సమాజంలో జరుగుతున్న హింస, దుర్మార్గాలపై తన కలాన్ని నిరంతరం సంధించడంలో కవి ఎంతో మెలకువతో ఉన్నాడని చెప్పడానికి ‘వెలి మామిడి’ కవిత చదివితే అవగతం అవుతుంది. కుటీర పరిశ్రమలోని మహిళల ప్రతిభా ఔన్నత్యాన్ని తెలిపే ‘ఈతసాప’, ‘చియ్యకూరల పాట’లు పాఠకుల గవాక్షాలను తెరిపిస్తాయి. కొందరు కవి పుంగవులను ఉద్దేశించి గోపాల్ చెప్పిన మరొక మాట చెప్పాలి. నగరాల్లోని ఏసీ గదుల్లో కూర్చోని కవిత్వం రాసుకునే కవికోకిలలను ‘ఉగాది పిలుపు’నిస్తాడు. యాంత్రికమైన జీవితాల నుంచి బయటపడి స్వచ్ఛమైన ప్రకృతి ఊరికి రమ్మంటున్నాడు. రైతన్న ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని కవిత్వం రాయమని మంచిమాట చెప్పడం గమనార్హం. ఏసీ గదుల్లో ఎత్తైన మేడల్లో/ కవితాగానం చేస్తే కోయిలలు కూస్తాయా?/ మ్యాంగో జ్యూస్ తాగుతూ / ఉగాది పచ్చడి గురించి మీరు వర్ణింస్తుంటే / నేను నవ్వు ఆపుకోలేక పోతున్న…కవులారా..కవికోకిలలారా…/ రండి…మా ఊరికి రండి…/నెర్రెలు వారిన పొలాల మధ్య/ వేపచెట్టు నీడలో సభ పెట్టుకుందాం’అని చెప్పడంలో కవుల బాధ్యతను కూడా గుర్తు చేయడం కనిపిస్తుంది.
కవి సృజన్మాత్మ రచనలో తనదైన శైలి, శిల్పాన్ని నిర్మాణం చేసుకోవడానికి భాష కూడా ప్రధానమైన వనరుగా ఉపయోగపడుతుంది. అలా తెలంగాణ జానపదులు మాట్లాడుకునే భాషనే తన కవిత్వంలోని శైలి ప్రత్యేకత. ఇపుడు నడుస్తున్న యువతరం కవులు విస్తృతంగా తెలంగాణ భాష స్పృహను కలిగి వుండటం అభినందనీయం. గోపాల్ అద్భుతంగా ప్రయోగించడం వల్లనే పాఠకుడికి తెలియకుండానే తనవెంట నడిపించుకునిపోతాడు. చిక్కని భావుకత కలిగిన పదచిత్రాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. దుసరి తీగల పానుపు, గూల్లో రెపరెనలాడుతున్న దీపం, చెట్ల మెడకోసిన మనిషి, ఆకలిపాము, అర్థరాత్రి పేగులు మాట్లాడే భాష, కమ్మని మాటల ముద్దలు, రెండు కాళ్ల చెట్టు, మనిషిచెట్టు, అమ్మ ఒక సుక్కల ముగ్గు, మలినమంటని మట్టి చేతులు, ఆకలి గీతం, పొద్దున మోసె సుట్టబట్ట, పాలకంకుల మనసు, శ్రమకావ్యం తదితర పదబంధాలు కవిలోని సాహితీ ప్రతిభను మనకు పట్టిచూపుతాయి. తెలుగు కవిత్వంలో తనదైన శైలిలో ముందుకు వచ్చిన గోపాల్ ‘దండకడియం’ కవిత్వాన్ని తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
KODAM GARU — YOU ARE RIGHT SIR
GOOD BOOK -WELL WRITTEN
Thank you sir
Thank you very much sir…
దండకడియం లోని మానవీయత గురించి , నేను నడిచిన దారి గురించి ,నానీల గురించి ఎంతో ఆత్మీయంగా రాసిన మీ ప్రేమ తీరొక్క పరిమళం సార్. చాలా వాక్యాలు ఎంతో కవితాత్మకంగా ఉండి ఉద్వేగంలోకి తీసుకెళ్ళాయి. ఈ కవితలన్నీ స్వీయ అనుభవం తో రాసిన అవి సమాజం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినారని నాయినమ్మ కవితను ఉదహరించడం ఎంతో ధైర్యం అనిపించింది.
మీ వాక్యాలకు ,కొలిమి పత్రిక సంపాదకులకు అనేక నెనర్లు..
మీ స్పందన కు ధన్యవాదాలు గోపాల్ గారు…
విలువైన అర్టికిల్ sir
ధన్యవాదాలు సర్…