‘‘కన్నకొడుకు ఒక్కరున్న వాన్ని అన్నలల్లో కలువమందు
కడుపునొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండపట్టి తిరగమందును’’ అన్న పాట వినని తెలంగాణ పల్లెలుండవు. కాని స్వయంగా ఆ పాట ఎందరో అమరుల దగ్గర పాడిన సుదర్శన్ తన బిడ్డ వద్దనే పాడుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోకపోవచ్చు. అట్లా పాడుకోవటం మనకు విషాదమే కావచ్చు. కాని అతనికి సర్వసాధారణమే. అతను చెప్పిన అసలు కథే శృతి నవల.
శృతి నవల అక్టోబర్-2016లో వచ్చింది. శ్రామిక పేరుతో రాశారు. శృతి నవల ఉత్తమ పురుషలో రచయిత కాక, మరొకరు సాధారణంగా కథలో ‘నేను’ అనే ఒక పాత్ర ద్వారా కథ నడుస్తుంది.
ఇందులో నేను అని కథను నడిపిన వ్యక్తి శృతి తండ్రి సుదర్శన్ (ఉపాధ్యాయుడు) చెప్పినట్టుగా ప్రారంభమయింది. నేను పాత్ర బాల్యంలోకి వెళ్ళి తన కటుంబ నేపథ్యం తండ్రి నిజాయితీ, నిర్భయత్వం, వ్యక్తిత్వం (ఉప్పలయ్య) పరిచయం చేస్తాడు.
ఉత్తమ పురుషలో కథను చెప్పేటప్పుడు చాలా పరిమితులుంటాయి. కథకుడికి తెలియనిది, వినిపించనిది చెప్పడానికి వీల్లేదు. అందులోనూ కథలోని ఒక పాత్ర కథకుడైతే కొంత వెసులుబాటు ఉంటుంది.
ఆ రోజుల్లో దొరల దౌర్జన్యం, పల్లెల్లో ఏదైనా ఇరువర్గాల మధ్య గొడవలు జరిగినప్పుడు కుల పెద్దమనుష్యులుగా వ్యవహరిస్తూ తాగుడు, తినుడుకు ప్రాధాన్యతనిస్తూ సమస్యను జఠిలం చేసే అంశాలు కనిపిస్తాయి. సుదర్శన్ తండ్రి ఉప్పలయ్య పెద్దమనిషిగా వ్యవహరించిన తీరు, ప్రజామోదం కలిగించింది. పోయేటప్పుడు ఏం కట్టుకుపోతం, బతికినంత కాలం న్యాయంగా బతకాలి, నీతి నిజాయితితో బతకాలి ‘‘అనే తత్వం కలిగి ఉండటం’’. ఎవరికి అన్యాయం జరిగినా సహించని గుణం. అంటరానితనం తప్పంటూ, మహిళల పట్ల గౌరవం ప్రదర్శించటం కనిపిస్తుంది. మనిషికి ఇంతకన్న గొప్ప సుగుణాలేం ఉంటాయి.
స్వతంత్ర వ్యక్తిత్వం, నిజాయితీగా ఉండటం, పాటలు పాడటం తల్లిదండ్రుల నుండి వచ్చినట్టుగా సుదర్శన్ పాత్ర చెప్పుకున్నాడు. వాటిని తన జీవన విధానంలో అనుసరిస్తూ రావటం కథలో గమనించవచ్చు.
సుదర్శన్ పాత్రపై కాసాని సోమయ్య ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇతని కుటుంబ నేపథ్యం కూడా ఉద్యమ నేపథ్యం అని అర్థమవుతుంది. ఉపాధ్యాయ సంఘ నాయకుడుగా అనేక సమస్యలపై పోరాడిన వ్యక్తి కూడా.
సోమయ్య గారితో కలిసి అనేక సమావేశాలలో పాల్గొనటం, ఉద్యమాలు చేసే సాంస్క•తిక కళారంగాలకు చెందిన వ్యక్తుల పరిచయాలు, జానపద పాటలు పాడటం, రాయటం, క్రమంగా విప్లవ రాజకీయాలకు దగ్గర కావటం, విరసంలో చేరి కన్వీనర్‌గా అనేక కార్యక్రమాలు చేపట్టటం చూడవచ్చు. ఇలా విద్యార్హతలు పెంచుకుంటూ ఉద్యోగార్హత సాధించి, ప్రజల కోసం చైతన్యంగా పనిచేసే విధానం. ఇలా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఇతనికి అనేకం పరిచయమవుతారు.
నానాటికీ దిగజారుతున్న జీవన ప్రమాణాలతో ప్రజలు సతమతమైపోతూ తమ న్యాయమైన సమస్యలపై శాంతియుతంగా పోరాటాలకు దిగిన ప్రజలపై రాజ్యం చేసే హింసాకాండ. ఈ విధానాలకు వ్యతిరేకంగా పీపుల్స్‌వార్ పార్టీ విస్త•తమైన ప్రజా ఉద్యమాలను ముందుకు తెచ్చింది. ప్రపంచ బ్యాంక్ ఎజెండాను ప్రజలలో ఎండగ్ట గలిగింది.
విప్లవోద్యమాన్ని అణచకుండా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం ముందుకు పోదని భావించిన రాజ్యం విప్లవోద్యమంపై ఫాసిస్టు నిర్భంధకాండను అమలు జరిపింది. పోలీసులకు చట్టబద్ధ హక్కు కల్పించటం వల్ల బూటకపు ఎన్కౌంటర్ల పేరుమీద పెద్ద ఎత్తున విప్లవకారులను, విప్లవ సానుభూతి పరులను హత్య చేయటం ప్రారంభించారు. ఒక భయానక వాతావరణం నెలకొంది. ఒకవైపు విప్లవోద్యమంపై ఉక్కుపాదం, మరోవైపు ప్రజా సంఘాలపై అణచివేత. ఎవరిని ఏ కారణం మీద ఎప్పుడు పట్టుకు పోతారో తెలియని నిర్బంధ పరిస్థితి రాజ్యమేలింది. ఇలాంటి సమయంలోనే ప్రజా సంఘాల్లో చురుగ్గా పనిచేసే నాయకుల ఇండ్లమీద రాత్రిపూట దాడులు చేయించటం మొదలుపెట్టింది రాజ్యం. నేను అని కథ నడిపిస్తున్న వ్యక్తి కుటుంబం మీద దాడి జరుగుతుంది. ఆ కుటుంబంలో ‘‘నేను’’ అనే అతని భార్య రమ, నల్గురు అమ్మాయిలు. ‘‘నేను’’ పాత్ర సుదర్శన్ అనే ఉపాధ్యాయుడు. ఇక్కడే శృతి పాత్ర మన ముందుకొస్తుంది. తలుపులు బద్ధలు కొడ్తాం అని బెదిరిస్తుంటె, తల్లి వెనుకాముందు అవుతూ బాధ పడ్తుంటె తలుపు ‘‘తీయమ్మ చూస్తాం ఏం చేస్తారో’’ అని శృతి నిర్భయత్వం ఇక్కడే చూడవచ్చు. రివాల్వర్‌తో బెదిరిస్తున్న వారితో ‘‘మా నాన్న లేడు’’ అని సీరియస్‌గా అన గలిగింది శృతి. వాని బెదిరింపులు శృతి మీద పనిచేయలేదు కూడా. ఎంతో గంభీరతను ప్రదర్శించిన రమ, పిల్లల్ని చూసి దు:ఖం ఆపుకోలేకపోయింది. రాజ్య నిత్య నిర్భందంలో పెరిగింది శృతి. రమ చైతన్య మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొనటం, పిల్లలు ఆమె వెంట కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దాంతో శృతికి చిన్నపాటి నుండే మహిళా సమస్యల మీద ఒక అవగాహన ఏర్పడింది. పాటలు కూడా పాడేది. నానాటికి పుస్తకాల అధ్యయనం పెరిగింది.
నిర్భయ – ఢిల్లీ అత్యాచార ఘటన అనేక మందిని కలిచివేసింది. దానికి నిరసనగా నిర్భయంగా దోషులను శిక్షించాలని మీడియాలో మాట్లాడింది. విపరీతమైన బాధకు గురైంది. పురుషాధిక్య సమాజంలో స్త్రీల అణచివేత గురించి ఆలోచనలో పడింది. తండ్రితో అనేక విషయాలు చర్చించగలిగింది. నిర్భయ ఉదంతం మీద దేశవ్యాప్త నిరసనలు వచ్చాయి కాని, విశాఖ వాకపల్లి ఇరవై రెండు మంది గిరిజన స్త్రీల మీద రాజ్యం చేసిన అత్యాచారం పట్ల ప్రజల్లో అంత ప్రతిస్పందన రాలేదు. పైగా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రశ్న లేవనెత్తింది.
వాకపల్లి నిందితులు రాజ్యం (ప్రభుత్వం) పెంచి పోషించబడ్డ వాళ్లు. ఈ నిందితుల గురించి బయటికి తెలిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజలు తమ న్యాయమైన సమస్యల మీద ఎక్కడ ఉద్యమిస్తారో సాయుధ బలగాలతో రాజ్యం దారుణంగా అణచివేస్తుంది. ఈ అణచివేతకు పావుగా స్త్రీలనే వాడుకుంటారు. రాజుల చరిత్రనుండి అదే చెబుతుంది. స్త్రీల మీద అత్యాచారం చేయటం, హత్యలు చేయటం, సర్వసాధారణమైన సంఘటనగా సమజాంలో కొనసాగుతూ వస్తుంది.
శృతి తల్లి రమతో పాటు ఇంజనీర్ చదువుతూనే తెలంగాణ ఉద్యమంలో, చైతన్య మహిళా సంఘంలోనూ క్రియాశీలంగా పాల్గొన్నది. సిఎమ్ఎస్ జిల్లా కమిటీ సభ్యురాలుగా బాధ్యత తీసుకున్నది. ఏదో చేస్తున్నట్లుగా కాకుండా సహజంగా తన పనిలో నిమగ్నమయ్యేది. సకల జనుల సమ్మె, యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకాలంలో నిర్వహించిన ప్రతిచోట, ప్రతి పోరాటంలో శృతి భాగస్వామురాలిగా ఉంది. ఎక్కడ స్త్రీలపై అన్యాయం జరిగితే, అక్కడి బాధితుల తరుపున గొంతు విప్పటం, న్యాయం జరగాలని పోరాడటం ఆమె నిత్యకృత్యంగా మారింది. కొందరి మనుషుల్లో ఉన్న క్రూరత్వానికి చలించి, శృతి కళ్ళు చెలిమలవుతాయి. అయినా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కావాలనే హక్కు ఎవరికైనా ఉంటుందని నినదిస్తుంది. దీన్నిబట్టి తాత ఉప్పలయ్య, తండ్రి సుదర్శన్ ప్రభావం ఉందని గమనించవచ్చు. ఎంటెక్ చదువు కోసం హైదరాబాద్ వెళ్ళినా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగే విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నది. సకల జనుల సమ్మెను మొదలు పెట్టి అర్థాంతరంగా ముగించిన విషయాన్ని అర్థం చేసుకోగలిగింది. జెఎసి వెనుక నుండి నడిపిస్తున్న పార్టీలు వేరే ఉన్నాయని, వారికి ప్రజలు ప్రత్యక్ష పోరాటంలోకి వస్తే తమ చేతిలో ఉండరనే భయం ఉందని గుర్తించింది.
ముందైతే భౌతిక తెలంగాణ రానియ్, తర్వాత ఎటువంటి తెలంగాణను నిర్మించుకోవాలో మన చేతుల పని అన్న మేధావుల సంగతిని ప్రశ్నించగలిగింది.
వ్యవస్థీకృత నేరం అధికారం అయిన విషయాన్ని గ్రహించిన శృతి ఒక నాటిక రాసింది. మనసులో మెదిలే దు:ఖాన్ని, ఆవేదనను, కోపాన్ని వ్యక్తీకరించే క్రమంలోనే నాటిక రూపుదిద్దుకున్నది.
గుజరాత్ మారణహోమంలో వేలాదిమంది అమాయక ముస్లీంల ఊచకోతకు కారణమైనవాడు ప్రధానమంత్రి అయ్యాడని వాపోయింది. బూటకపు ప్రజాస్వామ్యంలో దోపిడీ వర్గాల ప్రయోజనాలకు భిన్నంగా ఎవరూ అధికారంలో ఉండలేరని, ఒకవేళ వస్తే అధికారం కోల్పోవటమో, భౌతికంగా నిర్మూలించటమో జరుగుతుందని చెప్పింది.
ఈ కథనంలోనే వివేక్ పాత్ర పరిచయం. శృతి కంటే చిన్నవాడైన వయస్సుకు మించిన తెలివి తేటలున్నాయి. తెలంగాణ విద్యార్థి వేదికలో క్రియాశీలంగా ఉండటం. ప్రతి పోరాటంలో మిలిటెంట్‌గా పాల్గొనటం. సరదాగా ఉండే స్వభావంతో పాటు, ఎంత సీరియస్ విషయాన్నైనా తేలిక చేసి చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. ఇద్దరి ఆలోచనలు, ఆచరణ ఒక తీరుగా ఉండటం వల్ల వాళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు.
ప్రజా ఉద్యమాలతో ముడిపడి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, విద్యావేత్తగా, శాస్త్రీయ విద్యా విధానంపై ఉద్యమించిన నాయకున్ని రాజ్యం ఎంత ప్రణాళికా బద్ధంగా చంపిందనే విషయాన్ని శృతి చెప్పిన తీరు స్వభావాన్ని పాఠకులకు చక్కగా బోధపడేట్టుగా ఉంది.
వర్గ సమాజంలో అశేష జనానికి వారిని దోపిడీ చేసే పెట్టుబడిదారులకు మధ్య ప్రధానమైన వైరుధ్యం ఉంటుంది. అదే సమయంలో దోపిడీకి పాల్పడే శక్తుల మధ్య కూడా అంతర్గత వైరుధ్యం ఉంటుంది. సామాజికంగా ఆర్థికంగా ఎదిగివచ్చిన నూతన పెట్టుబడిదారీ వర్గానికి, అంతకు ముందే ఎదిగి రాజ్యాధికారం చేజిక్కించుకున్న వారికి మధ్య అనివార్యమైన పోటీ ఉంటుంది. నూతనంగా ఎదిగిన పెట్టుబడి దారీ వర్గానికి తాము రాజ్యాధికారంలోకి వస్తే తప్ప మరింత ఎదగలేని పరిస్థితి వస్తుంది. నూతనంగా ఎదిగే శక్తులు రాజ్యాధికారం కోసం పోటీ పడుతూ ఏదో ఒక ప్రాతిపదికగా కులం, ప్రాంతం, మతం ఆలంబన చేసుకునే పరిస్థితులను, అవసరాన్ని బట్టి పోటీ లేదా ఐక్యత ఎలా ఏర్పర్చుకుంటారో శృతి నిశితమైన ఆలోచనకు అద్దం పట్టినట్టుగా ఉంది.
ప్రజలపై దోపిడీ చేసే విషయం, సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళంతా ఒక్కటిగానే ఉంటారని నిర్ధారించగలిగింది. శృతికి ఉన్న పాలకవర్గ రాజకీయాల పట్ల స్పష్టమైన వైఖరి తెలియజేస్తుంది.
తెలంగాణ చరిత్రలో ప్రజలు ఎన్నో పోరాటాలను, నక్సల్బరీ పోరాటం, దండకారణ్యంలో ఆదివాసుల వెనుకబాటుతనం, దాంతో పాటే మావోయిస్టుల నాయకత్వంలో తమ అస్థిత్వం కోసం, మనుగడ కోసం చేస్తున్న పోరాటాల గురించి చర్చిస్తూ ఇక్కడ ఒక గొప్ప మాట ప్రస్తావించింది. దేశంలోని సకల సాయుధ బలగాలు మోహరించి రక్తపాతం సృష్టించినా, ఊచకోత కోసినా ఆదివాసులు పోరాడి చస్తున్నారు. కాని ఆత్మహత్యలవైపు వెళ్ళరు అని వారి పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని, ఆదివాసీల మనోధైర్యాన్ని చక్కగా విశ్లేషించింది. మావోయిస్టు పార్టీ ప్రజలకు అలాంటి చైతన్యం అందించిందనే విషయం తేటతెల్లం చేసింది శృతి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసే ఉద్యమాల్లో బూర్జువాపార్టీ నాయకుల కవ్వింపు చర్యలు, నాటకాలే తప్పుడు సంకేతాలుగా ప్రజలకు చేరి ఆత్మహత్యలకు దారితీశాయని చెప్పింది. పాలకవర్గాలు, ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారకుండా, తమ చెప్పు చేతుల్లో నుండి జారిపోకుండా చేసిన కుట్రను కూడా ఛేదించింది.
తెలంగాణ ఉద్యమంలో నిజమైన పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసిన ప్రజలకు తెలంగాణ ఎండమావిగా మారింది. ఫలితం మాత్రం కొద్దిమంది సంపన్న వర్గాలకు, జాతీయ, అంతర్జాతీయ మల్టినేషనల్ కంపెనీలకు, తెలంగాణ దోపిడీ దొంగలకు స్వర్గధామమైన విషయం ప్రస్తావించబడింది.
ఓపెన్ కాస్టుల పేరుతో జరిగే పర్యావరణ విధ్వంసాన్ని వ్యతిరేకించకపోతే మనల్ని మనం ధ్వంసం చేసుకున్నట్టే అనే హెచ్చరిక చేసింది.
దేశ స్వాతంత్య్ర పోరాటానికి ముందు జరిగిన ప్రజా ఉద్యమాలు (గాంధీ రాకముందు), గాంధీ వచ్చిన తర్వాత శాంతి అహింసల పోరాటం వచ్చిన తీరు దేశరాజకీయాల చర్చను చూస్తే దోపిడీ వర్గాలు తమ అస్థిత్వానికే భంగం కలుగుతుందనే భావన కలగగానే బయటపడే మార్గాలు ఎంచుకోవటం గురించి విపులంగా చర్చ జరిగింది. ఎప్పుడైతే ఉద్యమ నాయకత్వం పాలకవర్గాల చేతిలోకి పోయిందో అప్పుడే విద్రోహానికి బీజం పడింది. ఏ పాలన అయినా కొత్త సీసాలో పాత సారానే అని అర్థమవుతుంది.
ప్రణాళిక బద్ధంగా యువతను నిర్వీర్యంచేసే ఘటనలు, విద్యార్థులకు సామాజిక సంబంధాలు దూరం చేయటం ఇవన్నీ గమనించిన వివేక్, శృతి ప్రజలను రాజకీయంగా చైతన్య వంతం చేసి ప్రధాన స్రవంతి పోరాటంలోకి జనాలను సమీకరించే ప్రధాన కర్తవ్యం గురించి ఆలోచించారు.
వ్యవస్థను మార్చాలంటే సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని మన పని విధానం ప్రధానంగా సాయుధ పోరాట రాజకీయాలకు బలం కల్గించాలని నిర్ణయించకున్నారు. అన్యాయంగా కట్టే పోలవరం ప్రాజెక్టు కింద, గనుల కింద నిర్వాసితులు అవుతున్న ఆదివాసీల గురించి కలత చెందారు. అడవి నుండి ఆదివాసీలను దూరం చేయటమంటే, నీటి నుండి చేపను వేరు చేయడం లాంటిదేనని గ్రహించారు. గిరిజన బతుకుల్లో వెలుగు నింపటానికి వారి కోసం తన సర్వస్వం త్యాగం చేయటానికి సిద్దమయ్యారు.
ఒక నూతన సమాజం కోసం కలలు కనటమే కాదు వాటిని సాకారం చేసుకోవాలనే కృషితో, సాయుధ పోరాటంతోనే ప్రజారాజ్యం ఏర్పడుతుందని ఆ దిశగా శృతి, వివేక్ అడుగులు వేశారు.
నూతన భావాలు తెచ్చే క్రొత్త ప్రశ్నలలో క్యాంపెయిన్ జట్టులోని సహ విద్యార్థుల్ని ఆలోచింపచేసి, వాళ్ళందరికి గుర్తుండి పోయేలా నిలిచిపోయింది శృతి. ప్రజల జీవితాన్ని దగ్గరగా చూసి తన జీవితాన్ని విప్లవకరంగా తీర్చిదిద్దుకోవడానికి తోడ్పడిన ఆ ప్రశ్నల పరంపర శృతిలో పట్టుదలను, విశ్వాసాన్ని, ధృఢచిత్తాన్ని పెంపొందించింది.
ఆ తర్వాత విప్తవోద్యమంలో భాగమైన రహస్య నిర్మాణం గురించి రాయటం సరియైందనిపించటం లేదు. సమ సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని కోరుకున్న వాళ్ళు ఆ దిశలోనే కొనసాగారు. చివరి వరకు పోరాడటం రాజ్యం కుట్రలో అసువులు బాయటం అనేక మందిని అలాగే కోల్పోయాం. శృతి, వివేక్ విషయంలో కూడా అదే జరిగింది. శృతి, సాగర్లను పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే దు:ఖం ఆగలేదు. మనుషుల్లో ఇంత క్రూరత్వం ఉందా ? అధికారాల కోసం ఇంత నీచానికి దిగజారాలా ? అని ఆవేదన కల్గించింది.
శృతి, సాగర్ల బూటకపు ఎన్కౌంటర్ని వ్యతిరేకిస్తూ చేసిన ప్రయత్నాలు, అనేక మంది ఆ విషయం మీద మాట్లాడిన ప్రసంగాలు, తీసుకున్న కార్యక్రమాలు కవితలు, పాటలు నవలలో పొందుపర్చటం జరిగింది. కొన్ని అంశాలు పునరావృతమైనట్టుగా కనిపిస్తాయి. పేజీలను పెంచే ప్రయత్నం చేసినట్టుగా ఈ నవలలో గమనించవచ్చు.
దోపిడీ పాలకవర్గంలో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల తరుపున పోరాడుతున్న విప్లవ కారులను హత్య చేస్తున్నది. ప్రజా సమస్యలు పరిష్కరించలేని పాలక వర్గాలు ఎన్కౌంటర్ చేయటమే పనిగా పెట్టుకున్న విషయం ఈ నవల తేటతెల్లం చేసింది.
దోపిడీ పీడనలు లేని ఉన్నత సమాజం కోసం కలలు కని, ఆ కలలను సాకారం చేసుకోవడానికి సర్వం త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరకుండా పోయిందనే ఆవేదన నవల గొంతెత్తింది.
బంగారు తెలంగాణ బాసలు, పోలీసు తెలంగాణను సృష్టించాయి. సమ్మక్క, సారలమ్మను ప్రస్తుతించి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొంరయ్య, కొమురం భీం వారసులమని గొప్పలు చెప్పి, పేదల కొరకు పోరాడుతూ సమున్నత మానవత్వం ప్రదర్శించే వాళ్ళపై రాజ్యహింస తీరు ఈ నవల చూపించగల్గింది.
శృతి అమరత్వం ప్రజాస్వామిక వాదులందరిని ఏకం చేసింది. ఈ నవల ఒక శృతికి సంబంధించిందిగానే చూడలేం. పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు విముక్తి లభిస్తుందని, నిజమైన విముక్తి శ్రామిక వర్గ రాజ్యంలోనే అని నమ్మి సిద్ధాంతాన్ని వమ్ము చేయకుండా ఆ బాటలో నడిచిన ప్రతి ఒక్కరి కథగా భావించవచ్చు.
మహిళలు వారు అనుభవించిన హింసనూ, రాజ్య అణచివేతనూ, అమానవీయ జీవిత పరిస్థితులను అధిగమించటానికి విప్లవ శక్తులలో చేరుతున్నారని చెప్పిన మాతృక పత్రిక, దోపిడీ పీడనలు లేని నూతన సమాజాన్ని ఆవిష్కరించే చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తమ నవయవ్వనాన్ని ఫణంగా పెట్టి అమరత్వ శిఖరాలను ఆధిరోహించిన వీర కిశోరాలు. వాళ్ళు నెలకొల్పిన ఆదర్శాలను ఆవాహన చేసుకోండన్న ప్రతాప్, వర్గపోరాటంలో పాల్గొనడం అంటే పితృస్వామ్యానికి వ్యతిరేఖంగా పోరాడడమే అని చెప్పిన బి. అనురాధ వీరి మాటలు శృతి నవలకు పాఠకులను మరింత చేరువచేశాయి.