1931 లో జన్మించిన ‘శుంతారో తనికవ’ ప్రఖ్యాత జపనీయ కవి మరియు అనువాదకుడు. టోక్యోలో జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సంవత్సరాల్లో వెలుగు లోకి వొచ్చిన కవి. యుద్ధానంతర కాలంలో, జపనీయ కవులు సాంప్రదాయ పద్యం వేసిన సంకేతాలు మరియు సంప్రదాయాల దారిని మరిచిపోవడంతో జపనీయ సృజనాత్మక వాతావరణమంతా గందరగోళంగా మారింది అంటాడు తనికవ. “ఒక విధంగా ఇది శూన్య కాలం, ఏమి నమ్మాలో తెలియని కాలం” అంటాడు తనికవ.
“కాలేజీ చదువులకు వెళ్ళిన నా తరంలో చాలా మంది వివిధ రాజకీయ ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. నేను కాలేజీకి వెళ్ళలేదు. నా తోటివారి రాజకీయ కార్యకలాపాల నుండి దూరంగా ఒంటరినై పోయాను” అని బాధ పడతాడు తనికవ.
”అనుభవాన్ని ఒక ఆధ్యాత్మిక చింతనతో స్వీకరించే గుణమేదో తనికవ కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. అత్యంత సరళమైన భాషలో, సాధారణ పదాలతో తనికవ లోతైన భావనలను, భావోద్వేగ సత్యాలను చిత్రిక కడతాడు. అతని మొట్టమొదటి పుస్తకం, ‘టు బిలియన్ లైట్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ (1952), జపాన్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, అత్యధికంగా అమ్ముడైన కవిత్వ పుస్తకాల్లో ఒకటి. తొలి కవిత్వ పుస్తకంతోనే అగ్రశ్రేణి జపనీయ కవులలో ఒకడుగా ఎదిగాడు. తొలి పుస్తకం ముందుమాటలో తనికవ ని పరిచయం చేస్తూ అతడి గురువు ఇట్లా అంటాడు – ‘ఇతడు సుదూర ప్రదేశం నుండి తన ఒంటరితనాన్ని భారంగా మోస్తూ ఈ నేల మీదకు వొచ్చాడు’
‘బీథోవెన్ సంగీతం సృజించినట్టు నేను కవిత్వం సృజిస్తాను’ అంటాడు తనికవ. గేయ కవితలు, వచన కవితలు, కథన కవితలు, పురాణ కవితలు, వ్యంగ్య కవితలు, ప్రయోగాత్మక కవితలు అన్నీ కలిసి 60 కి పైగా పుస్తకాలు వెలువరించాడు. కవితలను కళాత్మకంగా సృజించడంలో ఎంత నేర్పరో, వాటి ద్వారా ఆధునిక భావాలను ప్రసరింపజేయడంలో కూడా అంతే నేర్పరి. పిల్లల కోసం అనేక అనువాద ప్రాజెక్టులలో కూడా పాల్గొన్న కవి తనికవ. కేవలం సాహిత్యమే కాదు, అదృష్టం చెప్పే కార్డులతో సహా అనేక సాంస్కృతిక మరియు కళాత్మక ప్రయత్నాలకు సాయం చేశాడు. తనికవ కవిత్వం చైనీస్, కొరియన్, ఇంగ్లీషు వంటి ఐరోపీయ భాషలు సహా అనేక ప్రపంచ భాషలలోకి అనువదించబడింది. ఆంగ్లంలో వెలువడిన తనికవ కవితా సంకలనాలలో కొన్ని – ‘తనికవ సెలెక్టెడ్ పోయేమ్స్’ (అనువాదం – హెరాల్డ్ రైట్, 1983); ఫ్లోటింగ్ రివర్ ఇన్ మెలాంకలీ (అనువాదం – విలియం ఎలియట్ & కజువో కవామురా, 1989), సెలెక్టెడ్ పోయేమ్స్ (అనువాదం – విలియం I. ఇలియట్, 2001); ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్: కవితలు 1952-2009 (అనువాదం – తకాకో లెంటో, 2011).
సుదూర సంగీతం
ఏ సుదూర తీరంలో ఒకనాడెవరో
ఒక వాయిద్యం మీద సంగీతం సృష్టించారు
స్థలాలు దాటి కాలాలు దాటి
గాలి తరంగాలలో శబ్దిస్తూ అది
ఇప్పటికీ నా చెవులను మాయ చేస్తున్నది
సుదూర ప్రదేశం నుండి తీయని పిలుపు
దానిని వ్యాఖ్యానించలేను
గాలి గలగలలకు తలలు ఊపే తోటలోని చెట్ల వలె
నన్ను నేను ఒప్పగించుకోవడం మాత్రమే చేయగలను
తొలి శబ్దం ఎప్పుడు పుట్టి వుంటుంది?
ఈ విశాల విశ్వం నడి బొడ్డు నుండి
ఎవరో రహస్యంగా మనకోసం పంపిన
సంకేతంలా, చిక్కుముడిలా ……
జ్ణానులెవరూ సంగీతాన్ని సృజించలేదు
అర్థ తాత్పర్యాలను పక్కనపెట్టి
అమృత ఘడియల నుండి వున్న నిశ్శబ్దాన్ని
వినయంగా విన్నారు వాళ్ళు
***
నది
అమ్మా – నది ఎందుకు నవ్వుతోంది?
ఎదుకంటే, సూరీడు తనని చక్కిలిగింతలు పెడుతున్నాడు
అమ్మా – నది ఎందుకు పాడుతోంది?
ఎందుకంటే, కోయిల తన గొంతును మెచ్చుకున్నది
అమ్మా – నది ఎందుకు చల్లగా వున్నది?
ఎందుకంటే, గతంలోమంచు తనను ప్రేమించిన సంగతి
తనను ఇంకా వెంటాడుతున్నది
అమ్మా – నది వయసు ఎంత?
నిత్యయవ్వన వసంత కాలమంత
అమ్మా – నది ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదెందుకు?
ఎందుకంటే, నది ఎప్పుడు ఇల్లు చేరుతుందా అని
వాళ్ళ అమ్మ, సముద్రం, ఎదురుచూస్తూ వుంటుంది