శిశిర

పారిజాత పూల వాసన చల్లగా చుట్టూరూ పరుచుకుని వుంది. నేల పైన రాలిన పారిజాత పూలు వెన్నెలలో పుట్టినట్టుగా వున్నాయి తెల్లటి పారిజాత పూలు, అక్కడక్కడ కనబడుతున్న వాటి ఎర్రటి కాడలు, మందార, కనకాంబర పూలు, ఇంద్రధనుసు విరబూసినట్టుగా వుంది ఆ ప్రదేశమంతా.

“కాశ్మీర్ లొ ఆర్టికల్ 370 రద్దు “ సన్నటి గొంతుతో న్యూస్ రీడర్ చదువుతున్న వార్త ఆ ప్రదేశాన్ని రెండు పాయలుగా చీల్చుతున్నట్టు వినబడుతుంది.

“ కొంచెం పాలు తేనా “ అడిగాడు అరవింద్. అక్కడే వున్న రాతి బల్ల మీద కూర్చుని మోకాళ్ళ మీద తల ఆన్చి పూలు చూస్తున్న మైథిలి ని.
“ వుహు” పాదాలను నెమ్మదిగా జరుపుతూ కాళ్ళని యింకొంచెం దగ్గరకు లాక్కుంటూ చెప్పింది మైథిలి.

“నొప్పిగా వుందా” అడిగాడు అరవింద్

“ వూ “ చెప్పింది మైథిలి.

ఇంత బాధ వుంటుంది అనుకోలేదు మైథిలి. అందరికీ వుంటుందా ఇంత నొప్పి,గుర్తు తెచ్చుకుంది తనకు తెలిసిన వారిని. వుహు అందరికీ ఇంత లేదు. కొంత మందికే వుంటుంది. నొప్పి ఒక జ్ఞాపకంలాగా శరీరం లో,మనసులో,ఆత్మలో దాక్కుని వుంటుంది.కాసేపు నొప్పి లేనట్టే వుంటుంది. హటాత్తుగా దాడి చేసి సకల అవయువాలను స్తంభింప చేస్తుంది.

మళ్ళీ నొప్పితో విలవిల లాడిపోయింది మైథిలి. తల నుంచి పాదం దాకా వున్న సకల తంత్రులను ఎవరో పట్టుకుని నమిలేస్తున్నట్టు, లోపలి రక్తాన్నంతా తోడేస్తున్నట్టు అల్లాడిపోయింది ఆమె. నిరంతరం తన లోపలి భాగాలని ఎవరో బలంగా వొత్తు తున్నట్టు గా వుంది ఆమెకి. ఈ బాధ ఎవరికైనా అర్థం అవుతుందా ?

నాకు అర్థం అవుతుంది, నీ మొఖంలో నీబాధ తెలుస్తుంది అంటాడు అరవింద్. ఎలా తెలుస్తుంది, అనుభవిస్తేనేగా తెలుస్తుంది, ఎప్పటికీ ఈ స్థితి అరవింద్ కు రాదు కదా అనుకుంది మైథిలి.

నొప్పి, భరించలేని నొప్పి.

“సరే నేను వెళ్లి వస్తాను, టేక్ కేర్. బై” మైథిలి జుట్టుని మృదువుగా నిమిరి బయలుదేరాడు అరవింద్
నల్లటి మబ్బొకటి చంద్రుడిని కప్పేసింది. నేల పైన వెన్నెల కాంతి మసకబడింది. ఆ మసక వెన్నెలలో కూడా పూలు తమ వెలుగును విరజిమ్ముతూనే వున్నాయి.

వెన్నెలలో మెరుస్తున్న పారిజాత పూల ఎర్రటి కాడలు శిశిర మొఖం పైన గాయాలను గుర్తుకు తెస్తున్నాయి మైథిలికి.

*** ***

“ఎంత అందంగా వుంది ” మొదటి సారి చూడగానే శిశిరని అలా చూస్తూ వుండిపోయింది మైథిలి. చాలా మంది అందంగానే వుంటారు కానీ ఈమె వేరుగా వుంది అనుకుంది.ఆమె అందంలో ఏదో ప్రత్యేకత వుంది. మిగతా వాళ్ళకంటే భిన్నంగా. మనసులోని కాంతి, ప్రశాంతత మనిషి రూపం తీసుకున్నట్టుగా వుంది.

“వాళ్ళని నేను చాల సార్లు అడిగినా ఒప్పుకోలేదు. బంధువులతను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసి వాళ్ళే వచ్చారు చేసుకోమని” విజయ గర్వంతో చెప్పాడు భరత్.

భరత్ గైనకాలజిస్ట్. రాజకీయంగా,ఆర్దికంగా చాలా బలవంతుడు. అరవింద్ కి చిన్న నాటి స్నేహితుడు. మొగ గైనకాలజిస్ట్ లకు ఏమర్థంఅవుతాయి ఆడవాళ్ళ బాధలు అనేది మైథిలి,అరవింద్ భరత్ ని పరిచయం చేసిన కొత్తలో.

“అంత అర్థం చేసుకునేది ఏముంది. అన్నిటిలాగే యుటరస్ కూడా ఒక పార్ట్ .కాకపోతే ఆడవాళ్లకు మాత్రమే వుంటుంది.” అనేవాడు భరత్. ఇలాంటి భరత్ తో అరవింద్ కి అంత గాఢమైన స్నేహం ఎలా కుదిరిందో అర్థం అయ్యేదికాదు మైథిలికి. భరత్ స్వభావం, కఠినంగా మాట్లాడే అతని తీరు మైథిలికి అప్పుడప్పుడు చిరాకు తెప్పించేది. అరవింద్ స్నేహితుడిగా అతనిని భరించేది.

భరత్ శిశిరతో సున్నితంగా ఉండగలడా ,సందేహం కలిగింది మైథిలికి.

“ నీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” చెప్పింది మైథిలి.

“ ఒక ఒప్పంద పత్రాన్ని రాసిస్తాలే ,ఆమెని ఎలాచూసుకోవాలి అన్న దాని మీద” శిశిర ని పొందిన ఆనందంతో హామీ ఇచ్చాడు భరత్.

శిశిరకి భరత్ ని చేసుకోవటం ఆనందంగా వుందా. శిశిర వైపు చూసింది మైథిలి. అభావంగా వుంది ఆమె మొఖం.

“ ఎలా చెప్పగలను. తరువాత కదా తెలుస్తుంది. భరత్ మంచివాడు అంటున్నారుగా అందరూ” అంది శిశిర ని అడిగినప్పుడు.

*** ***

కాలం నెమ్మదిగా నిశ్శబ్దమవసాగింది. అక్కడినుంచి లేచి వెళ్ళాలని వుంది మైథిలికి. చిన్న కదలిక కూడా లోపలి సమస్త భాగాలని మెలిపెట్టేస్తుంది. ఆగని నొప్పి. కాసేపు ఉదృతంగా, కాసేపు ప్రశాంతంగా, కాసేపు భీభత్సంగా. వొళ్ళంతా పాకుతున్న నొప్పి.

”అమ్మా” చిన్న కదలికకే వొళ్ళంతా పాకిన నొప్పికి చిన్నగా కేక పెట్టింది మైథిలి.చేతులు పొత్తికడుపుని వొత్తి పట్టుకున్నాయి. కాళ్ళను మరింత దగ్గరకు లాక్కుంది.

“నొప్పి బాగా ఎక్కువ వుంటే పెయిన్ కిల్లర్ వేసుకో” ఫోన్ లో భరత్ చెప్పిన మాట గుర్తు వచ్చింది. శిశిర దగ్గరకు వెళ్ళాలని ఇంతకు ముందు ఒక టాబ్లెట్ వేసుకుంది ఆమె. అది ఆమె పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

“ఇంకొకటి వేసుకుని చూడు“ పక్కనే పెట్టి వెళ్ళాడు అరవింద్. పెయిన్ కిల్లర్ నొప్పి వుందని తేలియకుండా మోసం చేస్తుంది. అంతా బాగానే వున్నట్టు అనిపిస్తుంది.

“కొన్ని సమస్యలకు పెయిన్ కిల్లర్ వేసుకోక పోవటమే మంచిది, జాగ్రత్త గా వుంటాము. ఇంకో డాక్టర్.

ఏది సరి అయినది. అంతా బాగానే వుంది అనుకోవటమా. ఎంత బాగాలేదో తెలియటమా.

*** ***

“ బాగా లేను” ఈ మాట శిశిర చెప్పవలసిన అవసరం రాలేదు మైథిలికి చాలా రోజుల తరువాత కలిసినప్పుడు.

“మీతో మాట్లాడాలి,మనం కలవటం కుదురుతుందా” శిశిర ఫోన్లో అడిగింది మైథిలిని ఒకరోజు. అప్పుడప్పుడు భరత్ ని కలుస్తున్నా శిశిరని చాలా తక్కువ సార్లు కలిసింది మైథిలి.

“కలుద్దాం” ఎక్కువ ప్రశ్నలు వెయ్యకుండానే చెప్పింది మైథిలి. కొంత వరకు విషయం గ్రహించింది ఆమె. ఇదేమీ కొత్త కథ కాదుగా. ఆ రోజు సాయంకాలం శిశిర దగ్గరకు వెళ్ళింది మైథిలి. ఆ టైం లో భరత్ ఇంట్లో వుండడని తెలుసు మైథిలికి.

పెళ్ళి నాడు వున్న వెలుగు ఆమె మొఖం మీద కనబడలేదు. పళ్ళ బిగువున ఏదో మొయ్య లేని భారాన్ని మోస్తున్నట్టు, ఇక మోయలేను అన్నట్టు వుంది శిశిర.

ఒక బంధం సకల చైతన్యాన్ని నిద్ర లేప గలదు, సర్వ శక్తులని నిర్వీర్యం చెయ్యగలదు. ఈమె ఎలా వుంది.ఆమె వైపు చూసింది మైథిలి. ఎంత అణిచినా ఇంకా ఆమెలో వెలుగు పూర్తిగా ఆరలేదు.

దూరంగా కనబడుతున్న ఆకాశం వైపు చూస్తుంది శిశిర. ఖాళీగా వుంది ఆకాశం.ఒక్క మేఘం కూడా లేదు. ఎండి పోయినట్టు వుంది. శిశిర మొఖం పై మొబ్బులు కమ్ముకుని వున్నాయి.

“నా జీవితం నాకు కావాలి” చెప్పింది శిశిర
ఒక్క మేఘమైనా రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తుంది ఆకాశం.

*** ***

“వాడితో ఊరేగాలని అనుకుంటుంది అందుకే…” కోపంతో మాట తడబడుతూ వుంది భరత్ కి.

ఎప్పటి నుంచో చెప్పిన మాటే చెబుతున్నాడు. తర తారాలు గా వింటున్న మాటే వింటుంది మైథిలి.

“నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నిరూపిస్తావు.” అరవింద్ అడిగాడు.

“చాలా వున్నాయి” చెప్పాడు భరత్, సాక్ష్యాధారాలు కావాలనుకుంటే కోటి దొరుకుతాయి. సాక్ష్యాలు తయారు చెయ్య బడతాయి.

“సరే భరత్. ఒక వేళ నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాం. ఆమె నీతో ఉండలేను అంటుంది కదా. ఆమెని వెళ్ళనివ్వ రాదూ” చిరాకును అణుచుకుంటూ అంది మైథిలి.

“వాడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తాడు” కసిగా చెప్పాడు భారత్.

“ ఆమె జీవితం గురించి నిర్ణయించుకునే హక్కు ఆమెకి వుంటుంది. అయినా నువ్వంటే నమ్మకం లేని, ఇష్టం లేని,గౌరవం లేని మనిషితో నువ్వు ఎలా కలిసి వుండాలను కుంటున్నావు. సిగ్గుగా అనిపించటం లేదూ నీకు” కోపం గా వుంది మైథిలి కి భరత్ మూర్ఖత్వం చూస్తే.

“ నువ్వు కూడా అలాంటి దానివేగా, అందుకే ఆమెని సమర్దిస్తున్నావు, నీలాంటి, ఆమె లాంటి వాళ్ళందరినీ వురి తియ్యాలి. మీరంతా బరితెగించిన వాళ్ళు. నేను భర్తను. నాకు ఆమె మీద హక్కు వుంది. నేను ఆమెని దారికి తెస్తాను. విడిపోవటానికి ఒప్పుకోను,” కోపంతో, కసితో గట్టిగా అరవ సాగాడు భరత్. బలవంతుని అరుపు దిగంతాలు దాటి నిజం లాగా ప్రతిధ్వనిస్తూ వుంది.

*** ***

శిశిర మొఖం పై గాయాలు ఏమి జరిగిందో చెబుతున్నాయి. మౌనంగా గడ్డకట్టుకు పోయినట్టు బయట వున్న కనకాంబరం పూలు చూస్తూ కూర్చుంది శిశిర.

పెళ్లి అయిన కొద్ది రోజుల తరువాత వారి ఇంటికి వచ్చినప్పటి సంగతి గుర్తు వచ్చింది మైథిలికి. ఇంటి ముందు అన్నీ కనకాంబరాలే. ఇంకో పూల చెట్టు గాని, మొక్క గానీ లేదు.

“ఇంకా బోలెడు రంగు రంగుల పూల మొక్కలు వేసుకోవచ్చుగా, చూడటాకి బాగుంటుంది” చెప్పింది మైథిలి.

“అన్నీ ఒకే లాగా వుంటేనే అందం అంటాడు భరత్, అతనికి ఇష్టం లేదు. నాకు బంతి, మల్లె, చేమంతి,లాంటి చాలా రంగుల పూలు వుంటే బాగుంటుంది అనిపిస్తుంది.” కొంచెం నిరాశ ధ్వనించింది శిశిర గొంతులో.

“ నువ్వు ఒప్పించలేక పోయావా భరత్ ని” అడిగింది మైథిలి.

“మీకు తెలిసిన భరత్ వేరు, నాకేమి తెలియదని, అన్నింటిలోను తనే సరిగ్గా వున్నానని అనుకుంటాడు. అందరికీ అంతే చెబుతాడు. అలానే చేస్తాడు. ప్రతి దానికీ ఘర్షణ పడి ప్రశాంతతని పోగొట్టుకోవడం ఇష్టం లేదు.” చెప్పింది శిశిర.

“అల్లరి మూకలపై పెల్లెట్లు ప్రయోగించి చెదర గొట్టిన సైన్యం “ తయారు చేసిన వార్తల శబ్దానికి ఈ లోకంలోకి వచ్చింది మైథిలి…

“ చాలా హింస పెడుతున్నాడు అమ్మాయిని. మీకు చెప్పుకున్న తరువాత ఇంకా ఎక్కువైంది. నోటితో చెప్పలేని మాటలు మాట్లాడుతున్నాడు. పిల్ల జీవితాన్ని చేతులారా నాశనం చేసాము” టి వి సౌండ్ తగ్గిస్తూ దుఃఖంతో పూడుకు పోయిన గొంతుతో చెప్పింది శిశిర అమ్మ. తల్లులు శాప గ్రస్తులు. తమ జీవితంలో భారాన్ని, బాధనే కాకుండా పిల్లల జీవితంలోని దుఃఖాన్ని కూడా వారే అనుభవించాలి.

“ ఎలా అయినా అతనిని విడాకులకి ఒప్పించండి, పిల్ల బతికి వుంటే చాలు” తాము చేసిన చిన్న పొరపాటు తన బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ కుమిలి పోతుంది ఆ తల్లి.

*** ***

“ ఇద్దరి వైపు పెద్దమనుషులని కూర్చో బెట్టండి. వాళ్ళు ఏమి చెబితే అదే చేస్తాను.” మొండిగా చెప్పాడు. నీతో కలిసి ఉండలేను అన్న మనిషి కి మరుక్షణం మొఖం చూపకుండా ఉండాలి. ఈ ఇద్దరు కలిసి ఉండాలో లేదో ఎవరో నిర్ణయిస్తారు.

“ దాని వల్ల ఏమీ ఉపయోగం వుండదు. వాళ్ళు చెప్పేదేముంటుంది. సర్దుకోండి అనేగా.”నువ్వు నాకు వొద్దు అన్నా కలిసి వుంటాను అంటున్న భరత్ పైన చిరాకుగా వుంది మైథిలికి.

“ పోనీ అతను చెప్పినట్టు చేద్దాం,వాళ్ళు మాత్రం బలవంతంగా కలిపి వుంచలేరుగా” అటు వైపే మొగ్గాడు అరవింద్.

“ ఇదంతా ఉపయోగం లేని పని” నిరాశ గా అంది శిశిర. “అతని నుంచి విడిపోతేనే నేనుజీవంతో ఉండగలను”. చెప్పింది శిశిర.
“మైథిలి నువ్వు కూడా ఉంటావుగా, వాళ్ళంతా ఏమి మాట్లాడతారో,ఎలా మాట్లాడతారో తెలుసు. నువ్వు వుంటే నాకు కొంచెం వూరటగా వుంటుంది” అడిగింది మైథిలిని శిశిర.

“నేనూ,అరవింద్ ఇద్దరమూ తప్పకుండా ఉంటాము” హామీ ఇచ్చింది మైథిలి.

*** ***

అరవింద్ కోసం ఎదురుచూస్తూ వుంది మైథిలి. పెద్దగా మార్పులు ఏమీ వుండవు అని తెలిసినా ఎప్పుడూ ఏదో ఆశ వుంటుంది.

“ నువ్వు రాకుండానా” నిరాశ గా అడిగింది రాలేను అని చెప్పిన తరువాత మైథిలిని శిశిర ఫోన్ లో.

“ చాలా నొప్పి వుంది శిశిర, ఎలా అయినా రావాలనుకున్నాను, అసలు కదలలేక పోతున్నాను.పెయిన్ కిల్లర్ వేసుకున్నా ఏమీ తగ్గలేదు” నొప్పి మైథిలి గొంతులో వినబడుతూ వుంది శిశిరకి.

అరవింద్ ఒక్కడే వెళ్ళాడు. లోపలి నొప్పి ఉదృతంగా వుంది. పారిజాత పూలన్నీ రక్తంతో తడిచి ఎర్రగా కనబడుతున్నాయి మైథిలి కళ్ళకు.

“ ఇంకా ఇక్కడే కుర్చుని వున్నావా” అక్కడే వున్న మైథిలిని చూసి నిర్ఘాంత పోయాడు అరవింద్.

“ కదలటం కష్టంగా వుంది. ఏం జరిగింది” అడిగింది మైథిలి.

“ ముందు లోపలికి పద.”

కదలాలంటే భయంగా వుంది. అరవింద్ ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నెమ్మదిగా లేపాడు. లేచి నిలబడింది మైథిలి. శరీరం వోణికిపోయింది. లోపలి రక్తం ప్రవాహంలా ఉదృతంగా బయటికి పోతున్నట్టు అనిపించింది.

“ ఇప్పుడు చెప్పు“ అతి ప్రయత్నం మీద పరుపు మీద వెనుకకి వాలుతూ అడిగింది అరవింద్ ని మైథిలి.

“ ఏముంటుంది.ఎన్ని చూడలేదు.ఇది కూడా అలాగే. భరత్ తప్పులు,శిశిర తప్పులు ఎత్తి చూపారు. ఇలాంటి తప్పులు జరగకుండా ఇద్దరూ సుఖసంతోషాలతో గడపండి అని చెప్పారు”

అంతేనా ఇద్దరు మనుషులు కలిసి బతకటం అంటే తప్పొప్పుల చిట్టానా. ఇంకేమీ లేదా. లోపల అలజడిగా వుంది మైథిలికి.

“అరవింద్ నువ్వంటే నాకు ప్రేమ లేదనుకో, నాతో కలిసి వుండటం నీకు ఇష్టంగా ఉంటుందా” లైట్ ఆపి పక్కన పడుకున్న అరవింద్ భుజానికి తల ఆన్చి అడిగింది మైథిలి.

“అదేం ప్రశ్న, అది నా హక్కు, అది నీ ధర్మం” వులిక్కిపడింది ఆ మాట అరవింద్ నుంచి విని మైథిలి.

ఎలా వుందో శిశిర. కలతగా వుంది మైథిలికి. నేను వెళ్లి వుంటే అనుకుంది. ఫలితం ఏమీ తేడా వుండదు. కానీ శిశిరకు కొంచెం ఓదార్పుగా వుండేది కదా. మనసులో బాధ, శరీరానికి అంటుకుందో, శారీరక బాధని మనసు మోస్తుందో అర్థం కావటం లేదు మైథిలికి.

*** ***

“ పోనీ కేసు పెడితేనో” తరువాత కలిసినప్పుడు శిశిరని అడిగింది మైథిలి.

“ఆతను చాలా బలవంతుడు. అన్నిటినీ, అందర్నీ మాయపుచ్చుతాడు. అమ్మాయి ఎవరితోనో సంబంధం పెట్టుకుని విడాకులు కావాలంటుంది అని అందరికీ ఇప్పటికే ప్రచారం చేసాడు.ఇక దాని బతుకంతా పతివ్రతని అని నిరూపించుకోవటమే సరిపోతుంది.” నిరాశగా చెప్పింది శిశిర అమ్మ.

“కాశ్మీర్ లో కొనసాగుతున్న గృహ నిర్బంధాలు” ప్రపంచం తో సంబంధం లేని టి వి మాట్లాడుతూ వుంది.

చీకటి ముసురుతున్న ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు.

“ప్రతి చోటా ఇబ్బందులు కలిగిస్తాడు, అధికారం, డబ్బు వుంది కదా అతని చేతిలో…” చెబుతూ వుంది శిశిర.

“ఇంక నోరు మూస్తావా” ఎప్పుడు వచ్చాడో గమనించలేదు, శిశిర వైపు నిప్పులు కురిపిస్తూ తిట్టటం మొదలు పెట్టాడు భరత్.

ఉలిక్కిపడింది శిశిర. అవమానం తో మొఖం అంతా ఎర్రగా కందిపోయింది. తలెత్తి భరత్ మొఖంలోకి చూసింది.

లేచి భరత్ దగ్గరకు నెమ్మదిగా వెళ్ళింది. ఎన్నో తరాల అణిచివేత లావాలా పొంగినట్టువుంది.

తనకున్న శక్తినంతా కూడతీసుకుని భరత్ చెంప మీద లాగి కొట్టింది. ఆ శక్తికి వణికిపోయాడు భరత్. ఊహించని ఆ ఘటనకి నిచ్చేస్టుడయ్యాడు.

చీకటి ముసిరిన ఆకాశాన్ని కాంతి వంతం చెయ్యటానికి చందమామ ఆకాశంలో సగం దూరం వచ్చాడు.

స్వస్థలం ప్రకాశం జిల్లా పెదమోపాడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి బోధనా రంగంలో వున్నారు. అంతర్ బహిర సంఘర్షణలు కథనం చెయ్యటం లో ఆసక్తి. దాదాపు డజను పైగా కథలు రాసారు. ప్రస్తుత నివాసం నెల్లూరు.

4 thoughts on “శిశిర

  1. సాక్ష్యాలు తయారు చెయ్యబడే ఈ దుర్మార్గపు వర్తమానంలో , శిశిర కొట్టిన ఆ చెంపదెబ్బకు ఎంత దూరంలో ఉన్నామో ఇంకా..! – ఆర్ద్రత , కధ నిండా పరచుకుని! – అభినందనలు మీకు!

  2. థప్పడ్… కొత్తగా! చాలా రోజుల తర్వాత నీ కథ చదువే అవకాశం కలిగింది హరితా. Keep writing regularly .

  3. అంతర బాహ్య సంఘర్షణ లని బాగా రాసారు.

  4. చాలా చాలా బాగుంది హరిత. ‘కాశ్మీర్ – గృహ నిర్బంధాలు’ అని రెండింటిని మీరు సంధించడం వల్ల – కథా బాణం – గురిలో సరిగ్గా గుచ్చుకోవడం అంటే ఏమిటో తెలిసింది.

Leave a Reply