“నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడవరు. నువ్వు జనంలో కలిసిపోవాలి. నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలచు కోవాలి. అనునిత్యం ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని సాగించాలి”- అన్నారు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈ మాటలు ప్రజల్లో పని చేసే ఏ నాయకుడికైనా తు.చ. తప్పకుండా ఆచరించ తగినవి. మన కాలపు సమరశీలమైన, అపురూపమైన నాయకుడు ‘శంకర్ గుహా నియోగీజీ’ కి ఇవి నూటికి నూరుపాళ్ళూ వర్తిస్తాయి! ప్రపంచ కార్మికుల దినం మే డే సందర్భంగా శ్రామిక ప్రజల్లో పాలల్లో నీళ్ళలా మమేకమై పోయి, వారి హక్కుల కోసం నిజాయితీగా పోరాడి, కార్మికుల కోసం ఒక దిక్సూచిగా భావితరాలకు పోరాట మార్గాలను నిర్దేశించిన శంకర్ గుహా నియోగీజీ గురించి స్మరించుకుందాం!
శంకర్ గుహా నియోగీజీ అసలు పేరు ధీరేష్. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు హర్మా కుమార్. తల్లి పేరు కళ్యాణి. అస్సాం లోని నాగోవన్ జిల్లాలోని జమున ముఖ్ గ్రామంలో తన ప్రాధమిక విద్య నభ్యసించారు. అస్సాం లోని అందమైన సహజ దృశ్యాలు అతన్ని ప్రకృతి ప్రేమికుడుగా చేశాయి. అసన్ సోల్ సమీపంలోని ‘సాన్కోటొయ కొల్ఫీల్ద్’ ప్రాంతంలో తన మేనమామ గారింట్లో అతను తన ఉన్నత పాఠశాల విద్య నభ్యసించారు. ఆ సమయంలో బొగ్గు గని కార్మికుల జీవితాలను దగ్గరగా చూసి, ధనవంతులు మితిమీరిన ధనవంతులుగా ఎలా ఎదుగుతారో, పేదలు రోజు రోజుకీ మరింత పేదరికం లోకి ఎలా నెట్టబడతారో అర్ధం చేసుకున్నారు. ‘జల్పాయిగురి’లో ఇంటర్మీడియట్ సైన్స్ కోర్సు అధ్యయనం చేస్తున్నప్పుడు, అతను విద్యార్ధి ఉద్యమంలో కొచ్చారు. త్వరలోనే ‘స్టూడెంట్స్ ఫెడరేషన్’ లో అంకితభావంతో పనిచేయడం ప్రారంభించారు. 1959 లో బెంగాల్ అంతటా కరువొచ్చింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నైపుణ్యం గల విద్యార్ధి నిర్వాహకుడిగా సభ్యత్వం పొంది, క్రియాశీల కార్యకర్తగా ఎదిగారు. విద్యార్థి రాజకీయాల్లో తీవ్రంగా పాల్గొనడంతో పరీక్షల్లో మంచి ఫలితాలు రాలేదు. కుటుంబ సిఫారసుతో జల్పాయిగురి లో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కానీ అతను దానిని అన్యాయమైన హక్కుగా భావించి ఇల్లు విడిచిపెట్టి, విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టారు!
తర్వాత ధీరేష్ కోక్-ఓవెన్ విభాగంలో ఉద్యోగి గా చేరారు. ఉక్కు కర్మాగారంలో పని చేసే యూనియన్ ఐ ఎన్ టి సీ యు కు అనుబంధంగా ఉండేది. అంతకంటే ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పెద్ద యూనియన్ ఎ ఐ టి యు సి తో కలిసి కార్మికుల వివిధ సమస్యల పరిష్కారం కోసం ధీరేష్ కృషి చేయడం ప్రారంభించారు. 1964 లో సి పి ఐ రెండు భాగాలుగా విడిపోయింది. ధీరేష్ సి పి ఐ(ఎం) లో చేరారు. ఆ సమయంలో, ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ వైద్యుడు ‘డాక్టర్ బి. ఎస్. యాదు’ మార్గదర్శకత్వంలో శాస్త్రీయ మార్క్సిజం-లెనినిజం అధ్యయనం చేశారు. 1967 లో వచ్చిన నక్సల్బరి తిరుగుబాటు మధ్యప్రదేశ్ ని కూడా కుదిపేసింది. ఈ ప్రాబల్యం దాదాపు అన్ని సి పి ఐ (ఎం) కార్యకర్తలపై ప్రభావం చూపింది. అప్పుడు ధీరేష్ కి కమ్యునిస్ట్ రివల్యూషన్స్ కి సంబంధించిన ‘ఆల్-ఇండియా కోఆర్డినేషన్ కమిటీ’ తో సంబంధమేర్పడింది. 1969, ఏప్రిల్ 22 న సి పి ఐ (ఎం ఎల్) ఏర్పడిన తరువాత ఆయన కొంతకాలం దానితో ఉన్నారు. ‘భిలాయ్ స్టీల్ ప్లాంట్’ లో సమ్మెకు నాయకత్వం వహించి నందుకు గానూ అతని ఉద్యోగం ఊడిపోయింది. మరొక వైపు, పోలీసులు ఆయనను నక్సలైటుగా ముద్ర వేశారు. ఆ సమయంలో అతను రహస్య జీవితంలో కెళ్ళిపోయి, అక్కడ నుంచి హిందీ వారపత్రిక ద్వారా సాధారణ కార్మికుల్ని చైతన్య పరిచే పని ప్రారంభించారు. లెనిన్ స్ఫూర్తితో రచనలు చేశారు. దానితోపాటు అతను గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని కలిసే ప్రయత్నాలు మొదలెట్టారు.
ధీరేష్ చత్తీస్ ఘఢ్ ప్రజలతో మమేకం కావడానికి 1968 నుండి గ్రామాలలో అజ్ఞాత జీవితం గడిపారు. దుర్గ్, భిలాయ్ ప్రాంతాల్లో మేకలను అమ్మేవాడిగా, కొనేవాడిగా వేషం వేశారు. కొన్నిసార్లు మత్స్యకారునిగా, కొన్నిసార్లు ఉద్యోగిగా, కొన్నిసార్లు వీధుల్లో తిరుగుతూ చిల్లర వస్తువులను అమ్ముకునేవాడిగా నటిస్తూ తన తోటి కామ్రేడ్స్ తో సంబంధాలు నిరంతరం నిలుపుకునేవారు. ఆ విధంగా ప్రజల్ని చైతన్య పరుస్తూ ‘దైహాన్’ ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా, ఆదివాసీలను నిర్వాసితుల్ని చేసే ‘మోంగ్రా ఆనకట్ట’ నిర్మాణానికి వ్యతిరేకంగా, ‘బాలోడ్’ రైతుల నీటి కోసం – ఈ విధంగా స్థానికంగా అవసరమైన అనేక ఉద్యమాలను నిర్మించారు ధీరేష్!
1971 లో ‘భిలాయ్ స్టీల్ ప్లాంట్ దనిటోలా క్వార్ట్జైట్ గని’ లో ధీరేష్ ఒక ‘కాంట్రాక్టు కార్మికుడు’ గా చేరారు. కోక్-ఓవెన్ లో నైపుణ్యంతో పని చేసిన కార్మికుడు ఇప్పుడు పొట్టకూటి కోసం పొట్టి లాగులు ధరించి రాళ్ళు కొట్టే పనిలో నిమగ్నమయ్యారు. చైతన్యవంతమైన ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదగడం వల్ల ఇక్కడినుంచి ధీరేష్, శంకర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఇక్కడ అతనికి తన సహోద్యోగి అయిన సయ్యం కుమార్తె, కాబోయే భార్య ఆశా తో పరిచయ మయింది. అతను సంఘటిత పరిచిన మొట్ట మొదటి ‘మైనర్స్ యూనియన్’ కూడా ‘దనిటోలా’ లోనే ఉంది. నియోగి స్థాపించిన సంస్థ కార్యకలాపాలు దనిటోలాలో నడుస్తున్నాయి. భిలాయ్ స్టీల్ ప్లాంట్ లోని అతిపెద్ద ఇనుప ఖనిజం గనులు ‘దల్లి-రాజారా’ అనే ప్రాంతంలో ఉన్నాయి. శంకర్, రాయ్ పూర్ జైలులో ఉన్న సమయంలో, దల్లి-రాజారా కాంట్రాక్ట్ మైనర్లు స్వతంత్రంగా ఒక ఉద్యమంలో ఉన్నారు!
ఐ ఎన్ టి సీ యు, ఎ ఐ టి యు సి రెండు సంఘాల నాయకత్వాలు భిలాయ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో ఒక అన్యాయమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కార్మికులు రెండు విభాగాలుగా శాశ్వత కార్మికులు – కాంట్రాక్టు కార్మికులుగా విభజించబడ్డారు. ఒకే పనికి రెండు రకాల వేతనాలు, శాశ్వత కార్మికులకు 308 రూపాయలు, కాంట్రాక్టు కార్మికులకు 70 రూపాయలు చెల్లించేవారు. ఈ అన్యాయమైన ఒప్పందంపై నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులు ఈ రెండు సంఘాల నుండి బయటికి వచ్చి, సమ్మె చెయ్యడాని కుద్యుక్తులయ్యారు. అది ఎమర్జెన్సీ చివరి దశ. 1977, మార్చి 3 న, కార్మికులు పనిని నిలిపి, ‘లాల్ మైదాన్’ లో నిరవధిక ధర్నా ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత, అత్యవసర పరిస్థితి ముగియడంతో, శంకర్ జైలు నుండి విడుదలై, కొంతకాలం దనిటోలాలో ఉన్నారు. ఎ ఐ టి యు సి కార్మికుల ప్రతినిధుల బృందం తమ ఉద్యమాలకు నాయకత్వం వహించమని అభ్యర్థించడానికి దనిటోలాకు వెళ్లారు. వారి ఆహ్వానంతో శంకర్ నియోగీ, దల్లి-రాజారాకు వచ్చి, కాంట్రాక్ట్ మైనర్ల స్వతంత్ర సంస్థ – “చత్తీస్ ఘఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్” ను ఏర్పరిచారు. కార్మికుల స్వీయ త్యాగానికి ప్రతీకగా ఎరుపు, రైతుల శ్రమకు ప్రతీక గా ఆకుపచ్చ రంగులను ఎంచుకుని, ఈ కొత్త సంఘం చత్తీస్ ఘఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్ జెండా ఎరుపు-ఆకుపచ్చ రంగుల్లో రూపొందించారు!
శంకర్ గుహా నియోగీ నాయకత్వంలో శ్రామికులు మొట్ట మొదటిగా ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. మే 1977 లో ఐడిల్ వేతనం (యజమాని తనకు పనిని ఇవ్వ లేనప్పుడు, కార్మికుడికి చెల్లించవలసిన వేతనం) కోసం, హౌస్ రిపేరింగ్ భత్యం 100 రూపాయల కోసం కార్మికులు ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదట కార్మికుల, అధికారుల సమక్షంలో ఈ ఉద్యమ ఉధృతికి భయపడి ఈ రెండు డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. తీరా చెల్లించే సమయానికి కపట నాటకాలతో తిరస్కరించాయి. కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టారు!
1977, జూన్ 2 అర్ధరాత్రి, రెండు జీపుల నిండుగా పోలీసులు వచ్చి, యూనియన్ కేంద్రం నుండి నియోగిజీని అరెస్టు చేశారు. ఒక జీప్ నియోగీతో వేగంగా కదిలిపోయింది. రెండో జీపు కదిలే ముందు, నిద్ర నుండి మేల్కొన్న కార్మికులు, వారి నాయకుడిని వదిలేయమని డిమాండ్ చేస్తూ మిగిలిన పోలీసులను చుట్టుముట్టారు. వెంటనే పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు కార్మికుల్ని పేల్చి చంపారు. వారిలో అనసూయ బాయి అనే మహిళా ఉద్యోగి, సుదామ అనే బాలుడు ఉన్నారు. యాజమాన్యం అంతటితో తృప్తి పడలేదు. జూన్ 3 న, దుర్గ్ నుండి ఒక భారీ పోలీసు బృందం వచ్చి మరో నలుగురు కార్మికుల్ని చంపేశారు. కానీ కార్మిక శ్రేణులు అత్యంత సాహసోపేతంగా చుట్టు ముట్టిన పోలీసుల నుంచి తమ వారిని రక్షించుకున్నారు. కార్మికుల ఉద్యమాన్ని అణిచి వేసేందుకు యాజమాన్యాలు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. 18 రోజులు నిరంతరాయమైన సమ్మె చేశారు. ఆ సమయంలో నియోగీజీ జైలులో ఉన్నారు. నియోగీజీ భౌతికంగా తమతో లేనప్పటికీ, ఆయన నేర్పిన అవగాహన, పోరాట చైతన్యంతో కార్మికులు తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రాణాలివ్వడానికి సైతం సిద్ధమై పోరాడారు! ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ఉద్యమాల ఒత్తిడిని తట్టుకోలేక గని నిర్వహణ కాంట్రాక్టర్లు, యజమానులు దిగి వచ్చి కార్మికుల డిమాండ్లకు అంగీకరించారు! తర్వాత నియోగీజీ జైలు నుండి విడుదలయ్యారు.
ఈ విజయం సృష్టించిన ఉత్సాహంతో భిలాయ్ స్టీల్ ప్లాంట్ కి చెందిన దనిటోలా, నందిని, హీర్రి లాంటి భిలాయ్ స్టీల్ ప్లాంట్ లోని ఇతర నిర్బంధిత గనుల్లో చత్తీస్ ఘఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్ శాఖలు ఏర్పడటానికి దారితీసింది. అన్ని శాఖలు ఐక్య సంఘటన కట్టి కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించ నారంభించాయి!
దుర్గి జిల్లాలో దల్లి-రాజారా, పొరుగు జిల్లాలో బస్తర్ ఉన్నాయి. బస్తర్ లో అధికారులు ఇనుము-ధాతువు గనుల పూర్తి యాంత్రికీకరణ కోసం సిద్ధపడ్డారు. ఎ ఐ టి యు సి నాయకత్వంలో యాంత్రికీకరణను నిరోధించడానికి పోరాడుతున్న కార్మికులపై జనతా ప్రభుత్వం 1978, ఏప్రిల్ 5 న కాల్పులు జరిపింది. ఈ పోరాడుతున్న సహచరులకు, పొరుగున ఉన్న దల్లి-రాజారా కార్మికులు తరలి వచ్చి, తమ సంపూర్ణ మద్దతునిస్తూ వారి పక్షాన నిలబడ్డారు. సంఘటిత కార్మికశక్తితో వారు 1994 వరకు యాంత్రికీకరణను నిలువరించగలిగారు. యాంత్రికీకరణ కార్మికుల పతనానికి దారితీస్తుందని రాబోయే ప్రమాదం గురించి తెలుసుకున్న నియోగీజీ కార్మికులందర్నీ చైతన్యంతో ఒక్క త్రాటిపై నిలిపారు. ఈ ప్రాంతాలన్నీ అప్పటికి మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి. కానీ 1994 లో నాయకత్వంలోని ఒక విభాగం కార్మికులతో మోసపూరితంగా ప్రవర్తించి, దల్లి -రాజారా గనులను పూర్తి యాంత్రీకరణ కోసం అనుమతించింది. ఇది కార్మికులకు శాపంగా మారిన ఒక అనివార్య పరిణామం.
యూనియన్ ఆధ్వర్యంలో చేసిన ఆర్థిక ఉద్యమాల వల్ల సాధించిన విజయాలు దల్లి-రాజారా కార్మికుల రోజువారీ వేతనాల్లో పెద్ద పెరుగుదలకు దారి తీసింది. కానీ అది వారి జీవన ప్రమాణాల మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు. అయితే ఆదివాసీ కార్మికులు మద్యానికి పూర్తిగా బానిసలయ్యారు. “అమరుల త్యాగం మద్యపు కాలువలో కలపటమేనా?” అని సూటిగా నిక్కచ్చిగా అడుగుతూ, కౌన్సిలింగ్ చేస్తూ నియోగీజీ యాంటీ-మద్యం ఉద్యమాన్ని ప్రారంభించారు. మత్తు అలవాటు నుండి వేలమందిని తప్పించారు. ఈ ఉద్యమం కొనసాగిస్తున్నప్పుడు, శంకర్ గుహా నియోగీ జాతీయ భద్రతా చట్టం కింద మళ్ళీ ఖైదు చేయ బడ్డారు!
నియోగీజీ ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి కొత్త కోణాన్నిచ్చారు. అప్పటివరకూ ఉన్న యూనియన్ లన్నీ అధిక వేతనాల కోసం, బోనస్ ల కోసం డిమాండ్ చేస్తూ పోరాడడం, చార్జ్-షీట్లకు సమాధానా లివ్వడం తప్ప ఏమీ చెయ్యలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు కార్మికుల పని ప్రదేశాలతో సంబంధం కలిగి ఉన్న విషయాలను మాత్రమే కవర్ చేశాయి. “ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. మార్క్స్, ఏంగెల్స్ ల ఈ ప్రసిద్ధ ప్రకటనను సంపూర్ణంగా అవగాహన చేసుకున్న నియోగీజీ ఎనిమిది గంటల పని సమస్యలకు మాత్రమే కార్మికుల జీవిత సమస్యలు పరిమితం కావని, కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పనితో పాటు ఎనిమిది గంటల విరామం, ఎనిమిది గంటల విశ్రాంతి కూడా ఖచ్చితంగా అవసరమని లెనిన్ నిర్దేశించినట్లు గ్రహించి, రష్యన్ కార్మికుల్ని లెనిన్ ఉద్యమాలకు సంఘటిత పరిచినట్లే, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు ఇరవై నాలుగు గంటల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కార్మికుల్ని ఎడ్యుకేట్ చేశారు. ఈ ఆలోచనలతో, నియోగీజీ నాయకత్వంలో కొత్త యూనియన్ దల్లి-రాజాలో అనేక కొత్త ప్రయోగాలను ప్రారంభించింది!
కార్మికుల హౌసింగ్ పరిస్థితులను మెరుగుపరచడానికి మొహల్లా కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతకు ముందు భిలాయ్ స్టీల్ ప్లాంట్ నడుపుతున్న పాఠశాలల్లో, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు చదువు చెప్పాలనే నిబంధనలేమీ లేవు. యూనియన్ నాయకత్వంలో ఈ పిల్లలకు ఆరు ప్రాధమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంతే కాదు, నిరక్షరాస్యులైన కార్మికులకు వయోజన విద్యా కార్యక్రమం చేపట్టారు. విద్యావ్యాప్తి కోసం చేస్తున్న ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గిన యాజమాన్యాలు అనేక ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేశారు. కార్మికులందరి ఆరోగ్యం కోసం ప్రక్షాళన ఉద్యమం (సపాయ్) రూపంలో ప్రారంభమైంది. 1983 నాటి అమరవీరుల స్మృతి చిహ్నంగా ‘షహీద్ హాస్పిటల్’ ప్రారంభమైంది. కార్మికులకు మంచి కాలక్షేపం కోసం, ఆరోగ్యవంతమైన సంస్కృతి విస్తరణ కోసం, “ఉదయ సూర్యకాంతి” (నయా అంజోర్) అనే సాంస్కృతిక బృందం ఏర్పాటు చేయబడింది. వ్యాయామం కోసం షహీద్ సుదామా ఫుట్బాల్ క్లబ్, రెడ్-గ్రీన్ అథ్లెటిక్ క్లబ్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మహిళల విముక్తి కోసం “మహిళా ముక్తి మోర్చా” అనే ఉద్యమ సంస్థ ఏర్పడింది. ఛత్తీస్ ఘడ్ లో, జరుగుతున్న అంతులేని దోపిడీని అరికట్టి శ్రామిక రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు మొదలెట్టారు. నిర్వహించారు. ప్రజలకు చెందిన అటవీ వనరుల విధ్వంసానికి దారితీస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, యూనియన్ ప్రాంగణంలో ఒక మోడల్ అటవీ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేశారు. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ చత్తీస్ ఘఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్ (సి ఎం ఎం) నూతనోత్తేజంతో పనిచెయ్యడం ప్రారంభించింది.
1978 లో ఏర్పడిన చత్తీస్ ఘఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్ కార్మిక సంక్షేమం కోసం ఈ క్రింద పేర్కొన్న వివిధ శాఖలను ఏర్పరచింది.
- ట్రేడ్ యూనియన్ శాఖ.
- వేతనాలు, బకాయిల చెల్లింపుల శాఖ
- రైతుల విభాగపు శాఖ
- విద్యా శాఖ
- డబ్బు పొదుపు చేసుకొను శాఖ
- ఆరోగ్య శాఖ
- క్రీడా విభాగం
- మద్యపాన నిషేద శాఖ
- సంస్కృతి శాఖ
- మురికివాడల అభివృద్ధి శాఖ.
- మహిళల ముక్తి మోర్చా శాఖ
- యూనియన్ కిచెన్
- నిర్మాణం
- విభాగాల లీగల్ డిపార్ట్ మెంట్
- లైబ్రరీ డిపార్ట్ మెంట్
- ప్రచార శాఖ
17.వాలంటీర్స్ డిపార్ట్ మెంట్. - పర్యావరణ శాఖ
మహిళలు మహిళా ముక్తి మోర్చా ఉద్యమంలో గణనీయమైన సంఖ్యలో పాల్గొని చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. శాశ్వత పరిశ్రమల్లో శాశ్వత ఉద్యోగాలు, యూనియన్లను నిర్వహించుకునే హక్కు, ఖనిజ, అటవీ, నీటి వనరుల రక్షణ లాంటి చాలా సాధారణమైన డిమాండ్ల కోసం కార్మికులు ఉద్యమం చేపట్టారు. దుర్గ్, బస్తర్, రాజనంద్ గావ్, రాయ్ పూర్, బిలాస్ పూర్ లలో ముక్తి మొర్చా అతి వేగంగా విస్తరించింది. నియోగీజీ మళ్ళీ కొంతకాలం పాటు జైలు పాలయ్యారు. నిరంతర పోరాటాలూ, పోలీస్ యాక్షన్ లతో ఆ ప్రాంతమంతా భీకర రణరంగంగా మారింది. నలుగురు కార్మికులు అమరులయ్యారు. ఐదు జిల్లాల నుంచి నియోగీజీని బయటకు తేవడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఉద్యమాన్ని ఎవరూ, ఏవిధంగానూ ఆపలేకపోయారు. ఉద్యమానికి మద్దతుగా ప్రజల అభిప్రాయాన్ని సమీకరించేందుకు నియోగీజీ విశిష్ట నాయకత్వంలోని పెద్ద బృందం ఢిల్లీకి వెళ్లి, రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికీ నివేదిక సమర్పించారు. రెండు వారాల తర్వాత, సెప్టెంబరు 28 న, యజమానులు నియమించిన రహస్య హంతకులు నియోగీజీని హత్య చేశారు!
భౌతికంగా కార్మికుల మధ్య లేనప్పటికీ నియోగీజీ రగిలించిన కార్మిక చైతన్యం ఆయన తిరిగిన ప్రాంతమంతా చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. వ్యవస్థాపక సభ్యుడిగా శంకర్ గుహ నియోగీజీ ప్రారంభించిన ‘చత్తీస్ ఘఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్’, ‘చత్తీస్ ఘఢ్ మహిళా ముక్తి మోర్చా’లాంటి ఎన్నో సంస్థలు ఇప్పటికీ అంతే పోరాట చైతన్యంతో పనిచేస్తున్నాయి!
తండ్రి బాట లోనే పయనిస్తున్న నియోగీజీ పిల్లల్లో ఆయన కుమారుడు ‘జీత్’ భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ట్రేడ్ యూనియన్ నాయకుడు. పెద్ద కుమార్తె ‘క్రాంతి’ ఉపాధ్యాయురాలిగా పిల్లలకు అభ్యుదయ పాఠాలు నేర్పిస్తున్నారు. తండ్రి అందించిన చైతన్యంతో ఆయన లాగే పని చేస్తున్న ఆయన రెండో కుమార్తె “దల్లి లోని ప్రతి ఇంట్లో మా తండ్రి ఫొటో ఉంటుంది” అని చెప్పారు. అతి సాధారణమైన చదువుతో కార్మికుడిగా, కూలీగా పని చేసి వారితో పాటే మమేకమై జీవిస్తూ అంచెలంచెలుగా అసలైన మార్క్సిస్టు చదువులో ఆరితేరిన శంకర్ గుహ నియోగీజీ చైతన్యం అసాధారణమైనది!
స్వాతంత్ర్యం వచ్చాక జాతీయోద్యమ ఫలితంగా మొదటి మూడు దశాబ్దాల్లో బలమైన కార్మికోద్యమం, త్యాగాలు చేసిన కార్మిక నాయకులు ఒక నూతన చరిత్రను సృష్టించారు. ఇలాంటి ఉద్యమంలో నుండి శంకర్ గుహా నియోగి లాంటి అరుదైన నాయకులు వచ్చారు. ఆయన ఒక్కడే కాదు, ఆ రోజుల్లో అలా నిజాయితీ కలిగి అత్యున్నత విలువలను ఆచరించి వ్యక్తిగత త్యాగాలు చేసిన వారు ప్రతి ప్రభుత్వరంగ సంస్థలో, ప్రతి ఫ్యాక్టరీలో చరిత్ర పొడవునా మనకు కనిపిస్తారు. అందుకే స్వాతంత్ర్యం వచ్చాక చాలా తక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు 400 కి పెరిగాయి. ఆ రోజుల్లో సామాజిక న్యాయం, దేశ సంక్షేమం మీదే దృష్టి పెట్టారు! అలాగే కార్మిక నాయకులూ, కార్మికులూ కూడా అసమాన త్యాగాలతో సకల సంపదల సృష్టికర్తలుగా దేశాన్ని అభివృద్ధిబాటలో నడిపించారు. ఇప్పటి ప్రభుత్వాలు కావాలనే వారి కృషిని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. పైపచ్చె పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలంటూ విషప్రచారం చేస్తూ అన్నిటినీ అమ్మకానికి పెట్టారు.
ఇక ప్రస్తుత పరిస్థితి కొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలనన్నిటినీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రహదారులు, భారీ నీటి ప్రాజెక్టులు, స్టీలు, బొగ్గులాంటి సహజ వనరులు, డిఫెన్స్ ప్రొడక్షన్, ఔషధాల ఉత్పత్తి, రైళ్లు, విమానాలు, బస్సులు విద్య, వైద్యం, ప్రతిష్ఠ కలిగిన ఐ ఐ టిలు, విశ్వవిద్యాలయాలు – ఒకటి కాదు సామాజిక అవసరాలకు, అలాగే మార్కెటు ఆటుపోటులను తట్టుకోవడానికి ప్రారంభించబడిన భిన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అమ్మేస్తానని పార్లమెంట్ లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా ప్రకటించేసింది!
రైతులకు హాని తలపెట్టే మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చింది. రైతు ఉద్యమాలు, రైతు ఆత్మ హత్యలు, చేనేత ఆత్మ హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు, ఎక్కడ చూసినా కనిపిస్తున్న భీభత్స పరిస్థితులే! ప్రశ్నించిన ప్రతివారి మీదా భయంకరమైన నేరాలు మోపి, కరోనా అతివేగంగా విస్తరిస్తున్న నేటి రోజుల్లో కూడా జైళ్ళల్లో కుక్కుతున్నారు. జైళ్ళను బానిసత్వానికి ఆధునిక రూపాలుగా మారుస్తున్నారని ఆఫ్రికన్ బ్లాక్ పాంథర్స్ నాయకుడు కెవిన్ “రషీద్” జాన్సన్ అన్నారు.
కనీస వేతన చట్టాలు, నిర్ణీత పని గంటలు, సంఘాలు పెట్టుకునే హక్కు, యూనియన్ల పోరాటాలు, కార్మికుల ఐక్య కార్యాచరణ, స్త్రీల హక్కులు, ప్రజా సంక్షేమ చట్టాలు మొదలైన వన్నీ నామామాత్రంగా నైనా ఈనాటి వరకూ వ్యవస్థలో ఇంకా బతికి ఉండడానికి కారణం బలమైన ఉద్యమాలే! ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిని కూడా నిలవనిస్తాయన్న నమ్మకం రోజు రోజుకీ అడుగంటిపోతుంది!
వ్యాపార సామ్రాజ్యంలో కుట్రలూ, కుతంత్రాలూ పన్నగలిగిన ధనిక వర్గపు చేతిలో సమాజాన్ని నడిపించే పగ్గాలుంటాయి! పెట్టుబడిదారీ విధానమే ఒక పెద్ద దుష్ట శక్తి. అది వ్యక్తి వాదాన్నీ, వ్యక్తి ప్రయోజనాన్నీ కృత్రిమ కోరికల్నీ ప్రేరేపిస్తుంది. మనిషిని సహజీవనానికి దూరం చేస్తుంది. ప్రభుత్వ బలగాలన్నీ ఈ ధనస్వామ్యానికి సర్వదా తమ సేవలందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాయి! భౌతికంగా తమ దౌర్జన్యం కొన సాగించడానికి యాజమానుల వద్ద సైన్యం, పోలీసులు, ఆయుధాలు, తూటాలు, జైళ్ళు ఉంటాయి. ఇంకా ఆలోచనల్ని అణచడానికి వివిధ రాజకీయపార్టీలూ, ప్రణాళికలూ, విద్యాసంస్థలూ, గుళ్ళూ, పత్రికలూ, సాహిత్యం, సినిమాలూ ఉంటాయి. “ధనవంతుల ఆస్తులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల నుంచి దోచుకున్నవే!” – అని బెర్నార్డ్ షా అన్నారు.
ఈ ధనిక వర్గానికి ప్రత్యామ్నాయంగా మనుషులందరూ ఒక్కటే, అందరూ ముఖ్యమే అన్న మానవ స్వభావం లోనే పుట్టుకతోనే ఉన్న భావనను కార్మికులు ప్రచారం చెయ్యాలి. కళ్ళముందు కనిపించే కఠోర వాస్తవాల పట్ల అప్రమత్తంగా ఉండి చుట్టూ సమాజాన్ని నిరంతరం మేల్కొల్పుతుండాలి. కూలి చేసుకుని బతికే అణగారిన ప్రజలు, అసంఘటిత రంగాలలోని శ్రామికులు, ఉద్యోగులు పడుతున్న కష్టాల్నీ, సమాజంలో జరుగుతున్న మార్పుల్నీ కార్మికులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ప్రజలను ఓట్ల కోసం పాలకులు, తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం కోసం కార్పొరేట్ శక్తులు మానసికంగా, సాంస్కృతికంగా లొంగదీసు కుంటున్నప్పుడు వాళ్ళను చైతన్యపరిచే విధంగా కార్మికులు పని చెయ్యాలి. వాళ్ళకర్ధ మయ్యేటట్లు తేలికగా ఉండే పదాల నుపయోగిస్తూ అసలు కిటుకులనూ, కుట్రలనూ విప్పి చెప్పాలి. నిజమైన సంపద సృష్టికర్తలకు నిత్య దారిద్ర్యం సృష్టిస్తున్నదెవరో కష్టజీవులకు కార్మికులు తేటతెల్లం చెయ్యాలి! పోరాడే ప్రజలతో కలిసి పోరాడుతూ కామ్రేడ్స్ తమవంతు కృషి చెయ్యాలి. కార్మికులు తమ జీత భత్యాలకోసం చేసే పోరాటాలే కాకుండా సామాజిక స్పృహతో శ్రీ శ్రీ అన్నట్లు ప్రపంచపు బాధని మన బాధగా సహానుభూతితో అర్ధం చేసుకుంటూ పాలకులు ప్రచారం చేస్తున్న వ్యక్తి వాదానికి ప్రత్యామ్నాయంగా సమిష్టి భావనను పెంపొందించాలి! శంకర్ గుహ నియోగీజీనీ, ఆయన నాయకత్వంలో పనిచేసిన కార్మికుల్నీ ఆదర్శంగా తీసుకుని పోరాడాలి!
సాధారణ ప్రజలకు ఏది, ఏమిటి అనే వాస్తవ చైతన్యం రానంతవరకే ఈ కార్పొరేట్ శక్తుల ఆటలు సాగుతాయి. ఒకసారి ప్రజలకు నిజమైన చైతన్యం వచ్చిందంటే ఇప్పుడు విజృంభిస్తున్నదుష్టశక్తులన్నీ శలభాల్లా మాడిపోతాయి! ఈ శ్రామిక శక్తులకు చైతన్యాన్నీ, దిశా నిర్దేశాన్నీ కలిగించడంలోనే కార్మికుల కీలకమైన బాధ్యత ఉంటుంది.
కార్మిక, కర్షక, మేధావి ఐక్యత వర్ధిల్లాలి అన్న అద్భుతమైన వాక్యంలో కార్మికుల బాధ్యతే గురుతరమైనది! ఎందుకంటే కర్షకులకు రుతువులు, పంటలు, ఎరువులు, వర్షాభావ సూచనలు వీటి గురించిన జ్ఞానమే తప్ప సామాజిక స్పృహ ఉండదు. చిన్న చిన్న కూలి పన్లు చేసుకునే వారికి రోజువారీ అవసరాలు గడిస్తే చాలు అన్న ధ్యాసే తప్ప సమాజం గురించి పట్టదు. మేధావులు సమాజాని కవసరమైన జ్ఞానాన్నందిస్తారు గానీ వాళ్ళు ప్రజలకు నేరుగా విశాద పరిచే పరిస్థితుల్లో అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇక మిగిలింది పాలకులకూ ప్రజలకూ మధ్య అనుసంధాన కర్తలైన కార్మికులే! ప్రపంచానికి, భావి తరాలకు ఆశలన్నీ కార్మికుల మీదే!
ఈ రోజుల్లో శంకర్ గుహ నియోగీజీ లాంటి మిలిటెంట్ నాయకుడినీ, అంతే మిలిటెంట్ గా పోరాడిన కార్మికుల్నీ ఇక చూడలేమనిపిస్తుంది. అందుకే ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో లక్షల సంఖ్యల్లో ఆదివాసీలు మాయమవుతున్నారు! ఖనిజ వనరుల దోపిడీ వైపు రద్దీ ఉంది. వేచి చూసే పరిస్థితే లేదు. కార్పొరేట్ల ఆంబోతు ఆశలకు అంతుండదు. వాటిని సొంతం చేసుకోవడానికి ఎంత కౄర పైశాచిక పద్ధతుల నైనా సరే అమలు చేసి దౌర్జన్యంగా లాక్కుంటారు. దానికోసం ప్రజల ప్రాణనష్టం ఎంతైనా ప్రభుత్వాలకు పట్టదు. ఇప్పటికే మన కళ్ళముందే అనేకమంది నిరాశ్రయులైన గ్రామస్తులు నకిలీ పోరాటంలో చంపబడుతున్నారు. “ఆదివాసీ సామూహిక మారణకాండతో మనం జీవిస్తున్న ఈ శతాబ్దం ముగిసే అవకాశం ఉందన్నారెవరో!”- అని సుధా భరద్వాజ్ వాపోయారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఈ అమాయక ప్రజల తరఫున వాదిస్తున్నందుకే ఆమె ఉపా చట్టం కింద జైలు పాలయ్యారు!
విద్యార్ధిగా ఉన్నప్పుడు నియోగీజీ విడుదల కోసం చేసిన విద్యార్ధి ఉద్యమాల్లో సుధా భరద్వాజ్ గారు పాల్గొన్నారు. చదువైపోయాక ‘మహిళా ముక్తి మోర్చా’ లో పని చేయడానికి ఛత్తీస్ ఘడ్ వెళ్లినప్పుడు మహిళా సంఘంలో కంటే నియోగీజీ పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్ లో పనిచెయ్యడం చాలా అవసరమని భావించి నియోగీజీతో పని ప్రారంభించారు. రైతు కూలీ సంఘాల ఉద్యమాలతోనూ, నిర్వాసితులవుతున్న ప్రజల ఉద్యమాలతోనూ మమేకమై పని చేశారు. ‘జన్ హిత్’ లో, ‘ఛత్తీస్ ఘఢ్ బచావో ఆందోళన్’ లాంటి వివిధ విభాగాల్లో పని చేశారు. “పీపుల్స్’ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్” (PUCL) జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు.
“మన ప్రజలు మనకు పర్వతాలంత ఉన్నతమైనవాళ్ళు” అని అంటారు “అమిల్కర్ కాబ్రాల్”. హిమాలయాలంత పర్వతశక్తి గలిగిన ఈ కష్టజీవుల నుంచే మనకి అపరిమితమైన బలం వస్తుంది. కార్మికులు ఈ బలాన్ని సవ్యమైన రీతిలో ఆచరణలో పెట్టడానికి కృషి చెయ్యాలి. సమ సమాజాన్ని కాంక్షించే ప్రపంచ మేధావులందరూ కార్మికులే నూతన సమాజ మార్గదర్శకులని నమ్ముతున్నారు! కాబట్టి నిర్వాసితులవుతున్న, సకల పీడనలకు గురవుతున్న ప్రజలతో కలిసిపోయి కార్మికులు పోరాడుతూ, ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉద్యమాల కనుగుణంగా మలచుకోవాలి. “మే డే సందేశం” నిర్దేశిస్తున్న తక్షణ కర్తవ్యమిదే!
(సుధా భరద్వాజ్ ఒకసారి హైదరాబాద్ కి వచ్చిన సందర్భంలో పద్మజా షా ఆమెని ఇంటర్వ్యూ చేశారు. ఈ రచనకు ఆ ఇంటర్వ్యూ తో పాటు, అంతర్జాల సహకారం తీసుకున్నాను).