వేలా జాలం!

ఒకటో స్సారి…  రెండో స్సారి… మూడో స్సారి…

ప్రతిస్సారీ…

స్సారీ…  

సారీ!

దేవుడిపాట… లక్షా పదివేలు!

లక్షా పాతిక వేలు… లక్షా యాభై వేలు… అరవై… లక్షా డబ్భై… రెండు లక్షలు… రెండున్నర… మూడు… నాలుగైదారేడు…

పాట పైకి సాగుతోంది!

వేలానికి వేళ్ళాడలేని చేతులు యెత్తేస్తున్నాయి!

పైపైకి యెగబాక లేని వాళ్ళు తమ స్తోమతని మాత్రమే తిట్టుకుంటున్నారు! బంగారమొంటి అవకాశం అని కూడా అందరూ అనుకుంటున్నారు! అందులో యెవరికీ తేడాలు లేవు!

అప్పు దొరకక పోవడం అన్యాయం అంటున్నారు! వడ్డీ లోకాన లేని విధంగా వుందని, అధర్మమని అని కూడా అనుకుంటున్నారు!

పొలమూ పుట్టా అమ్ముకోవాలని ప్రయత్నించారు! అందరూ అదే పని చేయడంతో భూమికి వున్నరెక్కలు కూడా తెగిపోయాయి! అయినా కొనే నాధుడేడి?

ఎంతకోకంతకు వున్నకాడికి అమ్ముకోక తప్పదు! భూమ్మీద పంట యేడాదికి వొకసారి తప్పితే రెండుసార్లు… నీటి వసతి వుంటే కొసర పిసర పంటలు! అదీ వానలు సమయానికి పడాలి! పీడలూ పీడనాలూ అల్పమో స్వల్పమో వొచ్చినా వుపద్రవమే, యిక అంతే… నెత్తిన చెంగేసుకోవడమే!

అలాంటిది వుద్యోగం నిత్య పంట! నెల పంట! చెక్కా ముక్కా అమ్ముకున్నా అవస్థ తీరిపోద్ది! బతుకు బండి సాగిపోద్ది!

ఉద్యోగం కోసం వూడ్చి పెట్టినా తప్పు లేదు గాని యిలాగ పోటీ పడడమే బాగోలేదనుకున్నారు కొందరు!

ఏమి బాగోలేదు? మీవాడు బాగా చదివి కుస్తీపట్టినా వుద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు! లంచాలు కట్టకా తప్పదు! కట్టిన వాళ్ళకే వుద్యోగాలు! అయినా లంచాలు యేమిటి పబ్లిగ్గా యివ్వగలమా? లేము! ఇవ్వలేము! రాతకోతలు చేసుకోగలమా? లేము! చేసుకోలేము! వాడంత యిచ్చాడు… వీడింత యిచ్చాడు… యెవడెంత యిచ్చాడో తెలీదు! అంతా లోపాయికారీ గుద్దులాట! నీట్లో గేదెట్టి బేరమేల? ఒడ్డున పడితే మనమూ వొడ్డున పడిపోతాము! కంచం లేని యిల్లూ లంచం లేని ఆఫీసూ వుండదు కాబట్టి ఆ విధాయకం విఘ్నం లేకుండా జరిగిపోవడమే మంచిది!- అని తీర్మానించారు యింకొందరు!

ఔనౌను… అన్నారు యించుమించు అందరూ! కట్టిన లంచాలు లోపాయికారీవి! రేపు పనయితే ఫరవాలేదు! అవకపోతే అడగడానికి వుంటుందా? వుండదు! ఇచ్చినవాడి దయా దాక్షిణ్యం మీద యెంత యిస్తే అంత పుచ్చుకోవాలి! ఆ ఖర్చుకింత యీ ఖర్చుకింత అని సగం మడతెట్టో- మళ్ళీ సారికి చూద్దామనో- వాయిదాలుగానో- యిప్పుడింత అప్పుడింత యిస్తే పులుసులో పడిపోతుందే తప్ప… ఆ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికి పనికొస్తుంది తప్ప… అయినా నోట్లు పోగెట్టి సమర్పించి యిచ్చి చిల్లర యేరుకోవడమేల?- అని సాధకబాధకాలు లోతుగా చర్చించుకున్నారు!

మొత్తానికి వేలం పాట వల్ల డబ్బుకి బెంగ లేదు! బెరుకు లేదు! అంతా పబ్లిక్కు! ఫుల్ సెక్యూరిటీ! ఎటూ పోదు! పోటీ వుంది కాబట్టే పాటా వచ్చింది! ఎవడి శక్తి కొద్దీ వాడు పరుగు తీయడమే!- అని అంతా మేలోబలి అన్నారు!

మరి ఆ శక్తి లేని వాడి సంగతేటి?- అని లేనోళ్ళు నోళ్ళు తెరిచారు!

ఈ వొక్క వుద్యోగానికేనా?, అన్నిటికీ అంతే కదా? పిండి కొద్దీ రొట్టె! నీకు పులిసింది పిల్లల్ని మాంచి ప్రైవేటు స్కూళ్ళల్లో వేస్తావు! ఆపై మాంచి కాలేజీల్లో చదివిస్తావు! డబ్బు పెట్టే కదా కోచింగులకి గట్రా పంపిస్తావు? అంత ఖర్చు పెట్టినా సీట్లు రాకపోతే కొనేసి డాక్టరో యింజనీరో చేయిస్తావు! అంతెందుకు మన లీడర్లకి మాత్రం సీట్లు వత్తి పుణ్యానికి వచ్చినాయా? కోట్లూ లక్షలూ లంచాలు అనకూడదు, పార్టీ ఫండు కట్టడం లేదా?- దమాయించాడు ప్రజాప్రతినిధి దగ్గరుండే ప్రతినిధి!

సత్యాన్ని కాదనడానికి యెవరికీ మాట రాలేదు! లంచాల్ని కాదనడానికి లోకాన్నీ మార్చెయ్యడానికి మనమెవరం?- అని మరికొంతమంది అనుభవజ్ఞులు వత్తాసు పలికి దీర్ఘాలు తీశారు!

లంచాల్ని లీగలైజ్ చెయ్యమన్నట్టు వుంది- అన్నాడు చదువుకున్నోడొకడు!

లీగలైజ్ మాటతో కొందరు ఆలోచనల్లో పడిపోయారు!

నిశ్శబ్దం ఆవరించబోయింది!

ఫర్ సపోజ్… నేను ప్రజా ప్రతినిధిని! నేను లంచాలు తీసుకుంటే వుద్యోగాలు అమ్మితే ఆ సొమ్ము యెవడికి పోతాది?- అని తెల్లచొక్కా అంత తేటుగానూ నవ్వాడు!

ఇంకెవరికి? మీ జేబులోకే- వొకే కంఠం అందరిదీ!

అదే నేను పబ్లిక్కుగా వుద్యోగాలకి వేలం పెడితే?- ప్రజా ప్రతినిధి అడిగాడు!

లంచం ధర వుద్యోగాల వేలం వల్ల యెక్కువ పలుకుతుంది… మరి దాని రేటు పెంచీసినట్టా అవదా?- చదువుకున్న కుర్రోడు తగ్గలేదు!

అదీ నిజమేనన్నట్టు అందరూ తలలాడించారు!

ప్రజలు బాగా డబ్బు చేస్తే యెక్కువకి పాడుతారు! ప్రజలదగ్గర డబ్బులు లేవనుకో తక్కువకి పాడుతారు! మార్కెట్టుని బట్టే మార్కెట్టు రేటు- అవునా- అన్నట్టు చూశాడు ప్రజా ప్రతినిధి!

అంతా దీనికీ తలలాడించారు!

నేను లంచాలు తీసుకుంటే వుద్యోగాలు అమ్మితే ఆ సొమ్ము యెవడికి పోతాది?- అని మళ్ళీ అడుగుతున్నాను!- అని అడిగాడు ప్రజా ప్రతినిధి!

అందరూ పబ్లిగ్గా చేయ్యొచ్చును, కాని చెప్పడం సంస్కారం కాదని- బుద్ధిగా నోటిమీద వేలేసుకోకుండా మూసుకున్నారు!

ఇంకెక్కడికి పోతాది? ఆ సొమ్ము నా జేబులోకి పోతాది!- తళతళ మెరిశాడు తెల్లచొక్కా ప్రతినిధి!

అందరూ అవాక్కయి చూస్తున్నారు!

కదా, నా జేబులోకి పోకుండా నేరుగా ప్రభుత్వం జేబులోకి పోయిందనుకోండి… ప్రభుత్వం అంటే యెవరు?, ఇంకెవరు ప్రజలే! అంటే మళ్ళీ మీ జేబుల్లోకే పోతుందన్నమాట! అప్పుడూ మీరనొచ్చు తీసుకోవడం యెందుకు? మాళ్ళా యివ్వడమెందుకు?- అని! ఎవరి దగ్గర తీసుకుంటున్నాం? పులిసీ బలిసినోడి దగ్గర తీసుకుంటున్నాం! ఎవరికీ యిస్తున్నాం? బీదాబిక్కికి! ఇంకా చెప్పాలంటే అందరికీ! అరే బాబూ ప్రభుత్వం జేబులు ఖాళీ అయిపోయింది కాదు కాదు చిల్లు పడింది, టాక్సులు అదే పన్నులు కట్టమంటే కడతారా? కట్టరు! అంచేత అభివృద్ధి అంటేనే అది!- ప్రజా ప్రతినిధి వివరించాడు!

అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు!

ఇప్పుడూ మద్యం అమ్మడం తప్పే, అలాగని ప్రభుత్వం అమ్మకపోతే జనం తాగడం మానేస్తారా? మానరు! మానలేరు! అది మనం కాకపొతే యెవడో అమ్ముతాడు! చాటుగా! దొంగతనంగా! నువ్వు కూడా అలాగే కొంటావు! చాటుగా! దొంగతనంగా! ఆ లాభం యెవడ్నో పెంచడానికా? బలిపించడానికా? ప్రభుత్వం బలంగా వుంటే ప్రజలు బలంగా వుంటారు! అసలే మన రూపాయి అమెరికా డాలరు ముందు పూతిక జబ్బొచ్చినట్టు యెండిపోతోంది!- అలుపొచ్చి ఆగాడు ప్రజా ప్రతినిధి!

ఇంతుందా అన్నట్టు భారంగా తలలూపారు అంతా!

అయ్యగారు సెలవిస్తే నాదో మాట! మనదేమి దేశం? ఏమి దేశంగా మారబోతోంది? డిజిటల్ దేశంగా మారుతోంది! అందుకే మన ప్రభుత్వం కూడా లావా దేవీలన్నీ ఆన్ లైన్లో జరపమని చాలా కట్టడి చేస్తోంది! అలాంటప్పుడు లంచాలు యివ్వడమూ కష్టమే! తీసుకోవడమూ కష్టమే! అది అటుంచు… కరెన్సీ అఫీషియల్ గా లేకపోవడం వల్ల ప్రభుత్వానికి డబ్బు చేరకుండా పోతోంది! అంటే డెడ్ అయిపోతోంది! అది దేశానికి చాలా నష్టం! ప్రతిదాన్నీ లీగలైజ్ చెయ్యడం ప్రభుత్వానికి లాభం! ప్రజలకీ లాభం!- అన్నాడు ప్రజా ప్రతినిధి దగ్గరుండే ప్రతినిధి!

అంతా పెద్దగా వూపిరి వొదిలారు!

ఈ డబ్బుతో ప్రభుత్వ ఆఫీసుకి స్థలమొస్తుంది! బిల్డింగ్ వస్తుంది! ఫర్నిచర్ వస్తుంది! ఏమైనా వస్తుంది! ముఖ్యంగా డబ్బు వినియోగంలోకి వస్తుంది!- ఆఖరి మాటగా చెప్పాడు ప్రజా ప్రతినిధి!

చదువుకున్న కుర్రోడు చదివిన చదువు మర్చిపోయి అక్కడనుంచి వెళ్ళిపోయాడు!

స్వయం సమృద్ధితో ప్రభుత్వాలు నిలదొక్కుకోవాలంటే మన నియోజకవర్గంలో చేసి ఆగిపోతే చాలదు, యీ ఐడియాని ప్రభుత్వానికి పంపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా చూడాలని మేథావులు అప్పటికప్పుడు వినతిపత్రం రాసి పంపారు!

ప్రజలు ఆ ప్రజా ప్రతినిధిని పూలదండలతో ముంచెత్తారు!

జనం యెటు వాళ్ళటు వెళ్ళిపోయారు!

డోరు తీసి కారెక్కి ప్రజా ప్రతినిధిని కూర్చొని సర్దుకోనిచ్చాక అతని అనుంగ శిష్యుడు వొక ప్రశ్న వేశాడు!

మీరు చెప్పినదంతా బాగుంది, కాని మీకేమిటి లాభం?- అని అడిగాడు!

తేటుగా నవ్వి- మన పేరుచెప్పి యెవడికి వాడు లంచాలు నొక్కేస్తున్నారు! ఆ కీర్తి మొయ్యలేకపోతున్నాను! ఈ బ్రోకర్నాకొడుకులు యివాళ కాకపోయినా రేపు మనకి పోటీ అవుతారు! ఇదంతా అవసరమా? ఈ చిల్లర గోల ప్రభుత్వానికి పడేస్తే – ఐడియా పారిందనుకో, పారుతుంది! మనం చరిత్రలో వుండి పోతాం! మనం మన కాంట్రాక్టులు చేసుకుంటే మన కోట్లు మనకు యెలాగూ వుంటాయి! ప్రజల డబ్బు మన కంపెనీల్లో డిపాజిట్ కింద చేరుతుంది! ప్రజలకి మనం సాయం! మనకి ప్రజలు సాయం!- అన్నాడు ప్రజా ప్రతినిధి!

అనుంగ శిష్యుడికి ఆ జ్ఞానపు వెలుగు వల్ల చిన్నమెదడులో ఫిలమెంట్ పెటిల్లున పేలిపోయింది!!

One thought on “వేలా జాలం!

  1. బజారా తన దైన శైలి లో లంచం నుంచి మొదలుపెట్టి ఇవ్వల్టీ రాజ్యాంగం గురించి చాలా బాగా రాశారు

Leave a Reply