(కామ్రేడ్ బెల్లపు అనురాధతో సంభాషణ)
నక్సల్బరీ విప్లవోద్యమ గతిక్రమాన్ని ఒడిసి పట్టుకొని, సామాజిక మానవ సంబంధాలను మానవీయం చేసి ఉన్నతీకరించటంలో అది నిర్వహిస్తున్న పాత్రను, వేస్తున్న ప్రభావాలను ప్రతిఫలిస్తూ తెలుగులో భిన్న ప్రక్రియలలో సాహిత్యం విస్తృతంగా వస్తున్నది. అయితే అవి సంపుటాలుగానో, సంకలనాలు గానో వచ్చినప్పుడు గుణాత్మక మార్పులు స్పష్టంగా అవగతం అవుతుంటాయి. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, చెరబండరాజు మొదలైన వాళ్ళ సమగ్ర రచనల సంపుటాలు ఆ రకంగా మన అవగహనను మెరుగెక్కించినవే. అలాగే సమకాలపు విప్లవ కవుల, రచయితల కవిత్వ కథా సంపుటాలు, నవలలు అనేకం ఈ నాడు అందివస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు. యుద్ధక్షేత్రం, నూతన ప్రజా స్వామిక నిర్మాణ కేంద్రం అయిన దండకారణ్యం నుండి వస్తున్న సాహిత్యం మరొక ఎత్తు. దండకారణ్య కథల సంకలనాలు ఆ రకంగా మరొక ముందడుగు. వరుసగా ప్రతీ సంవత్సరం అవి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చదువుకొనటం, కొత్త మానవ సమూహాలతో సంబంధం ఏర్పరచుకొనటం, మరో ప్రపంచం చుట్టి రావటం అదంతా ఒక అనుభవం. అదలా ఉంటే ఇప్పుడు పెన్నూ గన్నూ పట్టి యుద్ధరంగంలో కదం తొక్కుతూ సాగుతున్న మహిళలలో దాదాపు 50 మంది అజ్ఞాత రచయిత్రులు వ్రాసిన 282 కథలను సేకరించి వియ్యుక్క పేరుతో ఆరుసంపుటాలుగా విరసం ప్రచురించటం ఒక అద్భుతం. స్త్రీల సాహిత్య సమీకరణ, ప్రచురణల దిశగా సాగుతున్న కృషిలో ఇది ఒక చారిత్రక ఘట్టం.
ఈ సంపుటాలకు సంపాదకురాలు బెల్లపు అనురాధ. జైలు కథల రచయిత్రిగా ఆమె మనకు తెలుసు. బేబీ కాంబ్లే ఆత్మకథ “మా బతుకులు”, “మేముకూడా చరిత్ర నిర్మించాం” – అంబేద్కర్ ఉద్యమంలో మహిళలు వంటి పుస్తకాల అనువాదకురాలు. మొత్తంగా ఈ రచనలు అన్నీ స్త్రీ కేంద్రకం కావటం గమనించవచ్చు. సామాజిక ఆర్ధిక కారణాలవల్ల బాధితులు, కులం వల్ల సామాజిక అంచులకు నెట్టివేయబడిన మహిళలు వాళ్ళు. వ్యతిరేక పరిస్థితులతో సంఘర్షిస్తూ చైతన్యవంతంగా స్త్రీలు చేస్తున్న, చేసిన పోరాటాల చరిత్రను వ్యాఖ్యానించిన ఆ పుస్తకాల రచన, అనువాదాలు అనురాధ పీడిత, దళిత స్త్రీల పక్షాన నిలబడిన విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇప్పుడు ఆమె సంపాదకత్వంలో వస్తున్న విప్లవ రాజకీయ దృక్పథానికి ప్రాతినిధ్యం వహించే కథల సంపుటాలు ఆరూ కూడా స్త్రీల రచనలే కావటం గమనించవచ్చు. ఈ సంపుటాలకు కథల సేకరణ అధ్యయనాలలో అనురాధ అనుభవాలు ఏమిటో అడిగి తెలుసుకొందాం.
- విప్లవ సాహిత్య శిబిరం నుండి ఇలా ప్రత్యేకించి స్త్రీల కథలను సేకరించి ప్రచురించటం ఇదే మొదలు కదా!. ఇలా అజ్ఞాత రచయిత్రుల కథలు సేకరించాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? ఎందుకు కలిగింది?
విప్లవోద్యమంలో మహిళల పాత్ర, వాళ్ళు చేస్తున్న దోహదం, వాళ్ళ స్థితిగతులు ఇలా అనేక విషయాల మీద మదింపు వేసే క్రమంలో అజ్ఞాత మహిళా రచయితల రచనలు సేకరించాలనే ఆలోచన కూడా ఒకటి వచ్చింది. బయటి రచయితలకి తమ రచనలను ప్రచురించుకొనే అవకాశం ఉంటుంది కానీ అజ్ఞాత రచయిత్రులకి ఆ అవకాశం ఉండదు. కాబట్టి అసలు విప్లవ సాహిత్యానికి వాళ్ళ దోహదం ఎంత అంటే కూడా మదింపు వేయలేని పరిస్థితి. చాలా సార్లు వాళ్ళు అమరులైన తరవాత వాళ్ళ రచనలు కొన్ని వేస్తూ ఉంటారు. అప్పుడు మహిళా రచయితల రచనలు సేకరించాలనుకున్నాం. ఇదంతా 2007 నాటి మాట. దాదాపు ఒక వంద కథల వరకూ సేకరించి ఉంటాం. అప్పటికి ఇలా అన్నీ కలిపి వెయ్యచ్చనే ఆలోచన లేదు. రచయితల వారీగా వేద్దాం అనే అనుకున్నాం. ఈలోపు 2009 లో నేను అరెస్టయ్యాను. నాతో పాటు ఆ కథలన్నీ పోయాయి. 2013 లో నేను విడుదలయ్యాక మళ్ళీ మొదటి నుండీ మొదలుపెట్టాను.
అప్పుడే మిడ్కో కథలు విరసం 2007 లోనే ‘మెట్లమీద’ సంకలనంగా ప్రచురించిందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. నిత్య, మైనా, సుజాత, షహీదాల రచనలు సేకరించి విరసం మిత్రుల ముందు ప్రతిపాదన పెట్టాను. అయితే కథలు మాత్రం ప్రచురిస్తామన్నారు. సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నిత్య, మైనా, సుజాతల కథలు కలిపి ‘సామాన్యుల సాహసం’ పేరుతోనూ, షహీదా కథలు ‘జాజిపూల పరిమళం’ పేరుతోనూ విరసం 2014 లో ప్రచురించింది. అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించారు. షహీదా కవిత్వం ‘ఒక మాట, ఒక సంభాషణ’ కూడా అప్పుడే వేశారు. దండకారణ్య కథలు పేరు మీద సంకలనాలు కూడా వస్తున్నాయి.
నేను మూడు దశాబ్దాలుగా ప్రత్యేకంగా మహిళా రంగంలోనే పని చేస్తుండడంవల్ల విప్లవోద్యమంలో మహిళల పాత్ర గురించి అనేక సందర్భాల్లో ఏదో ఒక మేరకు రాయడం, మాట్లాడ్డం, ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే ఒక దగ్గర వాళ్ళ పాత్ర ని నమోదు చేయాలని చాలా కాలంగా ఏవేవో ఆలోచనలూ ప్రయత్నాలు చేస్తున్నాను. అప్పుడు కలిగిన ఆలోచన- ఇలా అన్నీ కలిపి వేస్తే సాహిత్యం ద్వారా చరిత్రను నమోదు చేసే ప్రయత్నం ఎలా జరిగిందో అర్థం అవుతుందనిపించింది.
2. ఎప్పుడు మొదలు పెట్టారు? ఎంతకాలం పట్టింది?
మధ్యలో రకరకాల కారణాల వల్ల నా ప్రయత్నాలు ఆగిపోయాయి. 2021-22 ల మధ్య మళ్ళీ వాటిని కొనసాగించాను అంటే ఎప్పుడు కథ దొరికితే అప్పుడు తీసి పెట్టుకోవడంగా అయ్యింది. కాబట్టి ఇదమిద్ధంగా ఇంత కాలం అని చెప్పలేను. అప్పటికి కథల సంఖ్య కూడా చాలా పెరిగింది. కనీసం 200 పైన కథలు సేకరించాకే అసలు ఎలా చెయ్యచ్చు అనే స్పష్టత వచ్చింది. కాబట్టి కనీసం రెండేళ్ల నుండీ ఒకానొక పనిగా సేకరణగా కూడా నడిచింది.
3. సేకరణకు మీరు ఎంచుకొన్న పద్ధతి ఏమిటి? ఎదురైన సమస్యలు ఏమిటి? వాటిని ఎలా అధిగమించగలిగారు?
దాదాపు నేను 90 నుండి పనిచేస్తున్నాను. కాబట్టి నాకు చాలా మంది రచయితల పేర్లు తెలుసు. డిజిటల్ యుగం కదా. దాదాపు అన్ని పత్రికలు సాఫ్ట్ కాపీలుగా అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటీ తీసుకుని దొరికిన ప్రతి కథనీ ఆ రచయిత పేరు మీద ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో వేసుకుంటూ వెళ్ళాను. ఇప్పటికే ప్రచురితమైన సంకలనాల్లో చూసి మిడ్కో , షహీదా, తాయమ్మ కరుణ వంటివారు వాడిన ఇతర కలంపేర్లు తెలిసాయి. అమరులైనపుడు వచ్చిన పుస్తకాల్లో చూసి కొంత మంది రచయితల పేర్లు తెలిసాయి.
అయితే 80 వ దశకంలో వచ్చిన కథల విషయంలోనే చాలా సమస్య ఎదురైంది. విరసంలో ఉన్న సీనియర్ రచయితల సహాయంతో ఆ పాత కాలంలో వచ్చిన కథా రచయితల్లో మహిళల పేర్లతో ఉన్నవి నిజంగా మహిళలేవేనా కాదా, మహిళలే అయితే అజ్ఞాత రచయితలేనా కాదా అని తెలుసుకోగలిగాను. ఇంకొక సమస్య ఏంటంటే చాలా కథలను కథా వస్తువుని బట్టి అజ్ఞాత రచయితలు అని అర్థం అయ్యి సేకరించగలిగాను కానీ రచయితల పేర్లను బట్టి ఆడవాళ్ళా మగవాళ్ళా అర్థం కాలేదు. చివరికి ఆలస్యమైనా ఫరవాలేదు. సమాచారం నిర్దిష్టంగా ఉండాలి అనుకున్నాను. అప్పుడు వచ్చిన ఆలోచన అరుణతారలో బహిరంగంగా ప్రకటించాలి అని. ఆ ఆలోచన కూడా ఎలా వచ్చిందంటే అరుణతారలో కథల కోసం ఒక్కో సంచికా చూస్తున్నపుడు ఒకటి రెండు ఉత్తరాలు కనిపించాయి. ఫలానా పేరుతో వచ్చిన కథ ఫలానా రచయిత రాసారు, ఈ మధ్యనే ఫలానా ఘటనలో అమరులయ్యారు, అంటూ కొంత సమాచారం ఇచ్చారు. దాంతో నేను సేకరించిన కథలన్నీ ఒక లిస్టు చేసుకుని ఇవి మాకు దొరికాయి, ఇవీ మా సమస్యలు అని ఒక ప్రకటన తయారు చేశాను. ఇది జనవరి 2023 అరుణతారలో ప్రచురించారు. ఇది చాలా ఉపయోగపడింది.
సరిగ్గా ఆరు నెలల తరవాత అరుణతారకు రచయితలు స్వయంగా ఉత్తరాలు రాశారు. అవి కూడా ప్రచురించారు. అంతే కాకుండా వివిధ ప్రాంతాల నుండి అరుణతార బాధ్యులకి, విరసం సభ్యులకి చాలా మంది ఫోన్లు చేసి కూడా సమాచారం ఇచ్చారు. రచయితల సమాచారం మాత్రమే కాదు, చాలా మంది ఫలానా ఘటన మా ఊరిలో జరిగింది. అది కథగా అరుణతారలో వచ్చింది. ఆ కథ తీసుకున్నారా లేదా? అని అడగడం మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న రచయితలని నేను స్వయంగా అడిగి కూడా సమాచారం తీసుకున్నాను.మహిళా మార్గంలో కల్పన రాసిన కథ కేవలం గట్ ఫీలింగ్ తో తీసి పెట్టుకున్నాను. రచయిత అజ్ఞాత రచయితో కాదో తెలియడం లేదు అని అరుణతార ప్రకటనలో రాస్తే పల్నాడు నుండి సానుభూతిపరులు ఫోన్ చేసి ఆమె దగ్గుబాటి కల్పన అని పల్నాడు , రాయలసీమల్లో చాలా పేరున్న నాయకురాలు అనీ చెప్పారు. దానితో విషయం అర్థం అయ్యింది. చాలా ఇమోషనల్ గా అనిపించింది ఇలా తెలియటం.
మొదట నిత్య, సుజాత మైనా ల కథలు ఒక సంకలనంగా వేసేనాటికి నిత్య రాసినవి 3 కథలే దొరికాయి. ఇంకా రాసిందనే విషయం కూడా అప్పటికి తెలియదు. ఈ లోపు తన అమరత్వం తర్వాత తాను రాసిన పాత కథలు కూడా దొరికాయి. నిజానికి వాటి మీద తేదీలు లేవు కానీ 80 -90 ల కాలం కావచ్చనిపిం చింది. ఇంకా చాలా కథలు దొరకాకుండా పోయాయి. అది మాత్రం ఒక కొరత.
4. ఇలా కథల సేకరణలో ప్రజలను భాగస్వామ్యం చేయటం బాగుంది. అవునూ డికే రచయితలు ఎందుకు ఎక్కువగా మహిళల పేరుతో కథలు, కవితలు రాశారు?
ఇది ముఖ్యంగా 80-90 మధ్య మాత్రమే జరిగింది. ప్రారంభంలో కొన్ని మహిళా సమస్యల గురించి ఇంకా మహిళలు రాయడం ప్రారంభించక ముందు వారి సమస్యలు, దళాలలో వారి భాగస్వామ్యాన్ని తెలపటం కోసం రాసినప్పుడు అలా మహిళల పేర్లు పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తరువాతి కాలంలో ఇంకా అలా పెట్టుకోలేదు. వీటిసంఖ్య కూడా మరీ ఎక్కువేమీ కాదు.
5. ఆరు సంపుటాలుగా ఈ కథలను ప్రచురిస్తున్నారు కదా!? ఇందుకు మీరు అనుసరించిన వర్గీకరణ పద్ధతి ఏమిటి?
వస్తువుని బట్టి మొత్తం కథలని రెండు భాగాలు చేశాను. విప్లవోద్యమమే వస్తువుగా ఉన్నవి మొదటి మూడు సంకలనాల్లో చేర్చాను. ఇతర విషయాల గురించి రాసినవి తక్కిన మూడు సంకలనాల్లో వస్తాయి. విప్లవోద్యమంలో కూడా ఆదివాసీ మహిళా జీవితాల్లోని సమస్యల గురించి రాసినవి ఒక టాపిక్, ఆ తరవాత దళ జీవితం, చదువు, సాహచర్యం, అమ్మతనం, పిల్లల పాత్ర, దిద్దుబాట్లు, మిలిటరీ జీవితం, సామాన్య ప్రజల సాహసాలు, నిర్బంధం, జైలు జీవితం, సల్వా జుడుమ్, అమరత్వాలు, బంధుమిత్రులు ఇలా వస్తువు ఆధారంగా ఒక క్రమంలో పేర్చుకుంటూ పోయాను.
6. వస్తువును బట్టి కదా ఈ వర్గీకరణ!? బాగానే ఉంది. ఇది సమగ్రం అనుకొంటున్నారా?
ఇలా చేస్తే అసలు విప్లవోద్యమంలో ఏం జరుగుతుంది, ఆ నడక ఎలా సాగుతుంది అనేది విహంగ వీక్షణంలో అయినా తెలుసుకోవచ్చు. ఇది దానికదే సమగ్రం కాదు. కానీ తప్పకుండా ఒక మెరుగైన పద్ధతి.
7. రచయితల వారీగా కథలను కాలక్రమ వరుసలో ఒకచోట చేర్చటం వాళ్ళ అవగాహనలో వచ్చిన పరిణితిని అంచనావేయటానికి ఉపయోగ పడుతుంది కదా? ఆ పద్ధతి గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు?
ఇందులో ఎక్కువ సంఖ్యలో కథలు రాసిన వాళ్లవి – అంటే మిడ్కో, షహీదా, తాయమ్మ కరుణ, పద్మ కుమారి, నేను రాసిన జైలు కథలు సంపుటాలుగా వచ్చాయి. ఇవి వెలువడిన తరవాత వాళ్ళు మరో సంపుటి వేయగలిగినన్ని కథలు రాశారు కూడా. తక్కువ సంఖ్యలో కథలు రాసిన వాళ్ళు లేదా ఒక్క కథే రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తం 52 మందిలో వీరి సంఖ్యే చాలా ఎక్కువ. కాబట్టి ప్రస్తుతం నేను సేకరించిన కథలన్నీ ఈ రూపంలో పెట్టడం వల్ల విప్లవ సాహిత్యానికి ఇది ఒక మంచి చేర్పు అవుతుందని నాకనిపించింది. పైగా విప్లవ జీవితంలో ప్రతీదీ సమష్టిగానే జరుగుతుంది. ఈ రచయితలంతా సమిష్టిగా విప్లవ జీవితాన్ని కలిసి మనముందుంచారు. మీరన్నట్టు రచయితల వారీగా కథలను కాలక్రమ వరుసలో ఒక చోట చేర్చితే రచయితల అవగాహనలో, శిల్పం వంటి విషయాల్లో వచ్చిన పరిణితిని అంచనా వేయొచ్చేమో కానీ, అంతకంటే ప్రాథమిక అవసరం విప్లవోద్యమంలో వచ్చిన పరిణామాన్ని రికార్డు చేయడం. అందుకు ఈ పద్ధతి మెరుగైంది అని భావించి దీనిని ఎన్నుకున్నాను.
8. ఇది ఒక రకమైన పరిశోధన వంటిది కదా! ఇందుకు పూర్వ నమూనాలు ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? అలా మీరు వాడుకున్న పరికరాలు ఏమిటి? లేక మీరే మీ పరిశోధనకు అవసరమైన కొత్త పరికరాలు ఏమైనా నిర్మించుకోగలిగారా?
నిజం చెప్పాలంటే ఈ పనికి నేను కొత్తే. నా దగ్గర ఏ నమూనా లేదు. అయితే కేవలం కథలు మాత్రం వెతకడం కాకుండా విప్లవ సాహిత్యం గురించి వ్యాసాలు, విమర్శలు, సమీక్షలూ, చర్చలూ ఏవి కనపడినా చదివి నోట్స్ రాసుకుని కొత్త సమాచారం దొరికితే అక్కడ కూడా వెతకడం అనే పద్ధతి అవలంభించాను. అలా చదువుతున్నపుడు వాళ్ళు రిఫర్ చేసిన కథల పేర్లు చూసి కొన్నిటి గురించి తెలుసుకున్నాను. అలా సాధన రాసిన ఒక వ్యాసం ద్వారా మహిళా మార్గంలో కా. స్వాతి రాసిన కథ లోపలివాళ్ళు రాసారని తెలుసుకున్నాను. మీరు (కాత్యాయిని విద్మహే) రాసిన ‘విప్లవోద్యమ కథ- తెలంగాణ రచయిత్రులు’ వ్యాసం వల్ల కూడా కొన్ని కథలు దొరికాయి.
9. ఈ పరిశోధనలో మీకు ఎదురైన అనుభవాలు ఎటువంటివి? మీ భావోద్వేగాలను కుదిపేసిన అనుభవాలను వివరిస్తారా?
ఈ ప్రశ్నకి సంక్షిప్తంగా జవాబు చెప్పడం నాకు చాలా కష్టం. అసలు ఈ మొత్తం పనే ఒక ఉద్వేగపూరితమైన పని. ఇది నేను చేయగలగడం నాకు చాలా సంతృప్తినిచ్చిన విషయం. ఈ కథల్లోని పాత్రలు చాలా మందికి తెలిసిన మనుషులు. తెలియని వారికి ఆ కామ్రేడ్స్ ని పరి చయం చేస్తున్నట్టే, లేదా జరిగిన ఒక ఘటన గురించి ముచ్చట చెప్తున్నట్టే ఉంటుంది. అవి మనం చదువుతున్నట్టు ఉండదు. మన ఎదురుగా జరుగుతున్నట్టో, మనం ఆ ముచ్చట వింటు న్నట్టో ఉండి వాళ్ళతో పాటు ఏడ్చి వాళ్ళతో పాటు నవ్వి చాలా భావోద్వేగాలకి గురవుతాం. ముఖ్యంగా అమరులకు సంబంధించిన కథలు ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు ఏడ్చాను. మనం వార్తలుగా చదివిన కొన్ని విషయాల్లో అసలు ఏం జరిగిందో తెలిపే కథలు కొన్నిఉన్నాయి.
పావురాల గట్టులో సోమ్లా నాయక్ అనే దళ సభ్యుడిని కోవర్టుగా మార్చుకొని దళాన్ని హతమార్చడానికి పంపినపుడు ముఖ్య నాయకత్వం తప్పించుకోగలిగారు. దాడిలో మరణించిన వారి పేర్లు కూడా పేపర్లలో వచ్చాయి. తరవాత మరణించిందనుకున్న ఒక మహిళా కామ్రేడ్, గాయాలతో తప్పించుకున్నట్టు వార్త వచ్చింది. బుల్లెట్ గాయాలయ్యి కూడా బతికే ఉన్న మహిళా కామ్రేడ్ ని అతను బండరాయితో మోది చంపపడానికి ప్రయత్నించాడు కూడా. నాలుగు రోజులపాటు ఆ గాయాలతో అలాగే ఘటనా స్థలికి కొద్ది అడుగుల దూరంలో ఉండి సహాయం కోసం ఎదురుచూడవలిసి వచ్చింది. తన మొత్తం అనుభవాన్ని ఆమె కథనంగా రాసింది. అలాగే 200 పైగా బలగాలతో ఒక రోజంతా ఒంటరిగా పోరాటం చేసిన రణిత గురించి పేపర్లో చదవడం ఒక ఎత్తు, ఆ ఘటన గురించి, ఆమె గురించి నిత్య రాసిన కథ చదవడం ఒక ఎత్తు.
ఒక నాయకుడి ప్రాణాలను రక్షించడానికి ఒక గ్రామానికి చెందిన అక్క తన మాన ప్రాణాలకు తెగించి సహాయపడి, సామూహిక అత్యాచారానికి గురయితే తరవాత కాలంలో ఆ నాయకుడు లొంగిపోయాడని ఆ గ్రామ వాసులకి చెప్పడానికి వెళ్లాల్సిన బాధ్యత మీద పడినపుడు ఒక మహిళా కమాండర్ అనుభవించిన వ్యథ ఇవన్నీ నన్ను కుదిపి వదిలిపెట్టాయి.
10. ప్రణీత ను రణిత అంటున్నారా ? లేక ఆమె వేరా ?
రణిత వేరు. ఆమె అసలు పేరు రాంకో .. ఈమె గురించి మొదలు పేపర్లో చదివాను. తరువాత రిపోర్ట్. నర్మద రాసిన చివరి కథ , లేక మనకు అందిన చివరి కథ అదే. కథపేరు రాంకో. ఈ రణిత చాలా చిన్న వయసులో చాలా సాహసికంగా పోరాడి అమరురాలైంది.
11. అజ్ఞాత రచయిత్రుల సామాజిక నేపథ్యం, పుట్టి పెరిగిన పరిస్థితులు, ప్రభావాలు, విద్య, విప్లవోద్యమంలో వాళ్ళు ఎక్కడ ఏ ప్రజలతో పనిచేస్తున్నారు మొదలైన అంశాల ప్రతిఫలనం వాళ్ళ రచనలలో ఏమైనా కనిపించాయా? ఏ విధంగా?
దాదాపుగా ఈ కథలన్నీ ప్రజల భాషలోనే ఉన్నాయి. కొందరు రచయితలు ముఖ్యంగా మిడ్కో, తాయమ్మ కరుణ పాత్రలకి మాత్రమే కాకుండా రచయితగా కూడా ప్రజల భాషే ఉపయోగించారు. వాళ్ళు ఎక్కువ కథలు రాసినందుకు కూడా అది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ రచనలను బట్టి సామాజిక నేపథ్యం గురించి తెలుసుకోలేం. అలాగే ఏ ప్రాంతం వారు అనేది కూడా తెలుసుకోలేం. ఏ ప్రాంతం లో పనిచేస్తే ఆ ప్రాంతం భాష విరివిగా వాడారు. నిత్య రాసిన కథల్లో ఒక కథ చైన్నై ప్రాంతానికి సంబంధించింది. దానిలో విరివిగా తమిళ వాక్యాలు రాసేసింది. దండకారణ్యానికి సంబంధించిన కథల్లో గోండి భాషని వాడింది. ఆమె అమరత్వం తరవాత గాని కృష్ణా జిల్లా అని తెలియలేదు. చాలా మంది రచయితలు తాము పని చేస్తున్న ప్రాంతాల నేపథ్యంలోని కథలే రాశారు. నిజానికి వాస్తవ ఘటనలను కథలుగా రికార్డు చేశారు. చదువుకున్న తరవాత ఉద్యమాల్లోకి వెళ్ళినవాళ్లు ఇతర సామాజిక విషయాల గురించి కూడా కథలు రాశారు. కొంత మంది విప్లవోద్యమంలోకి వెళ్ళక ముందే కథలు రాయడం మొదలు పెట్టి తరవాత కూడా కొనసాగించారు. కొంత మంది అర్బన్ ఉద్యమంలో అజ్ఞాతంలో ఉండి పనిచేసినప్పుడు దొరికిన వెసులుబాటుతో కథలు రాశారు. కొందరు ఇతర కారణాలతో బయట ఉన్నప్పుడు తమకు తెలిసిన విప్లవ జీవితం గురించి కథలు రాశారు. అలా రాసిన వాళ్ళలో కూడా పార్టీలోనే చదువు నేర్చుకుని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు.
12. అజ్ఞాత రచయిత్రులు దండకారణ్య రచయితలు కదా? వాళ్ళను మైదాన ప్రాంతపు ప్రాంతీయ అస్తిత్వాలతో గుర్తించి చెప్పటం సరైనదేనా? అందువల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?
సరైంది కాదు. అందువల్ల ప్రయోజనం కూడా లేదు. నిజానికి దండకారణ్య రచయితలు అని సింబాలిక్ గా వాడుతున్నాం కానీ, విప్లవోద్యమం దండకారణ్యానికి మాత్రమే పరిమితం కాదు. నల్లమలలోనూ, పల్నాడు, రాయల సీమల్లోనూ, ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ కమిటీ ప్రాంతం, ఈ అన్ని ప్రాంతాల గురించీ కథలున్నాయి. అదిప్పుడు పాపులర్ అయిపోయింది కాబట్టి మనం దండకారణ్య రచయితలు అంటే నష్టం లేదు. దాని అర్థం అయితే విప్లవోద్యమ రచయితలు అనే. అలా కాకుండా వాళ్ళు పుట్టిన ప్రాంతానికి చెందిన కేటగిరీలో అస్సలు వేయకూడదు. విప్లవోద్యమం లేకపోతే ఈ కథలు వాళ్ళు రాయగలిగి ఉండేవారు కాదు. అలాగే స్వయంగా విప్లవోద్యమంలో ఉండడం వల్ల మాత్రమే కథలు రాసిన వాళ్ళు మెజారిటీగా ఉన్నారు. వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన వాళ్ళు మాత్రమే అందుకు మినహాయింపు. తమ అన్ని రకాల అస్తిత్వాలని వదులుకొని అలాంటి అన్ని రకాల వివక్షలూ, అసమానతలూ రద్దు చేయడానికే పోరాడుతున్నవాళ్ళు, విప్లవోద్యమ అవసరాలు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి, ఆ భాషలు నేర్చుకుని ఆ ప్రాంత ప్రజల్లో ఒకరిగా జీవించి మరణించే వారికి ఇవన్నీ ఎందుకు అంటగట్టడం? లెక్క పెట్టుకోడానికి తప్ప అది ఏ ప్రయోజనాన్నీ సాధించదనే నా అభిప్రాయం.
13. అజ్ఞాత రచయిత్రులలో ఆదివాసీ మహిళలు ఉన్నారా? వాళ్ళ కథలకు మైదాన ప్రాంతాల నుండి విప్లవోద్యమంలోకి వెళ్లిన మహిళల కథలకు మధ్య తేడాలు ఏమైనా గుర్తించారా?
ఉన్నారు. వీళ్ళ సంఖ్య తక్కువే. ఎందుకంటే ఇక్కడ సేకరించిన కథలు తెలుగులో వచ్చినవి మాత్రమే. జర్తా వెంకట లక్ష్మి రాసిన కథ చదివినపుడు రచయిత పేరు విజయ అని ఉంది. (కింద అమిడేలులో అమరత్వం అని వివరాలు రాశారు) కానీ తరవాత తూర్పు కనుమ పత్రికలో ఆమె గురించి శ్రీధర్ రాసిన వ్యాసం( తూర్పు కనుమ, జనవరి 2008) చదివితే ఆమె సాయుధ జేఎన్ఎం కమాండర్ అనీ కొండరెడ్ల తెగకు చెందిన ఆదివాసీ కామ్రేడ్ అని తెలిసి చాలా ఉత్తేజం కలిగింది. పార్టీలో చదువు నేర్చుకుని కథ రాసింది. తన మాతృ భాషలోనే కాకుండా ఇతర ఆదివాసీ భాషల్లో కూడా అనేక పాటలు రాసింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోకుండా ఉండి ఉంటే ఎంత పని చేయగలిగి ఉండేదో, రాయగలిగి ఉండేదో.
ఆదివాసీ రచయితలకు తమ ప్రాంతంలో తెలుగు అవసరం ఉంటే తప్ప తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా తెలుగు తెలిసిన వాళ్లే తెలుగులో కూడా కథలు రాయగలుగుతారు కదా. విప్లవోద్యమం నడుస్తున్న చాలా ఆదివాసీ ప్రాంతాల్లో గోండీ, కువ్వీ, సంథాలీ, ముండారీ ఇలా వేరు వేరు భాషలు మాట్లాడ్తారు. గోండీలో కూడా చాలా సాహిత్యం వచ్చింది. అందులో కథలు ఉన్నాయా లేదా నాకు సమాచారం లేదు.ఆదివాసీలు సాధారణంగా ఆశువుగా పాటలు కడుతుంటారు. మౌఖిక సాంప్రదాయం ఎక్కువ కాబట్టి పాటలు రాసే, అల్లే పని చాలా సునాయాసంగా చేస్తారు. కథలు రాసే ప్రక్రియలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు అర్థం అవుతోంది. చాలా మంది పార్టీలోకి వచ్చాకే చదువు నేర్చుకుంటారు. ఆ తరవాత పనికి సంబంధించి రిపోర్టులు రాయడం, తీర్మానాలు, మినిట్స్, కరపత్రాలు రాయడం, ఇంకా వాళ్ళ స్థాయి పెరిగే కొద్దీ ఈ రాత పనులు ఎక్కువగానే ఉంటాయి. సాహిత్య సృజన గురించిన ప్రోత్సాహం కూడా పార్టీ అందిస్తోంది కాబట్టి కొంత రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాసిన వాటిల్లో నేను గుర్తించినది ఏంటంటే ఆదివాసీ కామ్రేడ్స్ మాట్లాడేటప్పుడు కూడా క్లుప్తత ఉంటుంది. అలాగే కథల్లో కూడా. రజిత అనే కామ్రేడ్ రాసిన ‘కిరియ’ (ప్రతిజ్ఞ) కథ ఒక్క పేజీ నే ఉంది. అయినా కూడా అది కథే. ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ కథ చదివితే తెలుస్తుంది. అసలు అలా రాయడం గురించి చేస్తున్న ప్రయత్నాలు కథా వస్తువుగా చేసుకున్న ఒక కథ కూడా ఉంది.
14. ఆ కథ పేరేమిటి?
‘చదువు రానివారు’. తాయమ్మ కరుణ రాసింది.
15. అజ్ఞాత పురుష రచయితల రచనలకు, ఈ అజ్ఞాత మహిళా రచయితల రచనలకు ఉన్న సంబంధ భేదాలను మీరేమైనా గుర్తించారా?
ప్రత్యేకంగా గుర్తించినవి ఏమీ లేదు. కానీ మహిళా రచయితలు భావోద్వేగాలను బాగా రాయగలరు అనిపించింది. మహిళలు ఎక్కువగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను కథా వస్తువుగా తీసుకున్నారనిపిస్తుంది.
16. నడుస్తున్న చరిత్ర కథనాలు ఈ కథలు అన్నారు కదా! వీటిలో కాల్పనికతకు వున్న స్థానం ఏమిటి?
ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవం, కల్పన కంటే వింతైనది అంటారు కదా దానికి చక్కని ఉదాహరణలు ఇవి. జరిగినవి యధాతథంగా రాసినవీ ఉన్నాయి. ఒక ఘటనను చిత్రీకరించడానికి, అందులో చెప్పదల్చుకున్న విషయానికి నేపథ్యం ఇవ్వడానికి వేరు వేరు సందర్భాలని ఇక్కడ ఉపయోగించి చెప్పినవీ ఉన్నాయి. అలాగే ఆ కథకి అవసరం అనుకున్నంత మాత్రమే రాసి కొన్ని ప్రస్తావించకుండా వదిలిపెట్టినవీ ఉన్నాయి. మెజారిటీ కథలు పాత్రల పేర్లు మాత్రమే కల్పించి మిగతావి యథాతథంగా ఉంచారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మెదక్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన గురించి ఇద్దరు వేరు వేరు రచయితలు ఒకరికి తెలియకుండా ఒకరు రాశారు. రెండూ వేరు వేరు ప్రాంతాల నుండి వెలువడే పత్రికల్లో అచ్చయ్యాయి. వాటిల్లో ఎంత సారూప్యత అంటే కేవలం పాత్రల పేర్లు మాత్రమే వేరు. చిన్న చిన్న తేడాల వల్ల మాత్రమే మనకి వేరు వేరు రచయితలు అని అర్థం అవుతుంది. అంటే మీరు వూహించవచ్చు. కాబట్టి ఇవి కథలు, కథనాల రూపంలో ఉన్న చరిత్ర.
17.మెదక్ ఘటన పై వేరువేరు రచయితలు రాసిన ఆ కథలు ఏవో చెప్తారా ?
చాడ విజయలక్ష్మి ‘ప్రజలే ఉక్కుకోట’ అని కథ రాస్తే జీవని సమయస్పూర్తి అనే కథ రాసింది. ఇందులోని ప్రధాన పాత్ర అసలు పేరు దుబాసీ భారతి. రామగూడా ఎన్ కౌంటర్లో అమరత్వం. ఘటన జరిగేనాటికి ఆమె సానుభూతి పరురాలు మాత్రమే.
18. విప్లవ శిబిరానికే సంబంధించినప్పటికీ జ్ఞాత (బయటి) రచయిత్రులకు, అజ్ఞాత( లోపలి) రచయిత్రులకు కథా వస్తువు, రచనా పద్ధతి, దృక్పథం, వాడే భాష, వ్యక్తీకరణ మొదలైన విషయాలలో మీరు గుర్తించిన సారూప్యత, వైవిధ్యం గురించి చెప్పండి.
బయటి రచయిత్రులూ, లోపలి రచయిత్రులూ కూడా ప్రగతిశీలమైన రచనలకే ప్రాధాన్యత ఇస్తారు. విప్లవం అంటేనే పెను మార్పు. అది అన్ని మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఆ మార్పు జరిగే క్రమంలోని ఘర్షణనీ, పాతని ధ్వంసం చేసేటప్పుడు కలిగే నొప్పినీ కొత్త సంబంధాల్లోకి మారినప్పటి హాయినీ చిత్రీకరించేవే ఈ కథలు. ఇద్దరూ ఆమేరకు పరిణామ క్రమాన్ని నమోదు చేయడానికే కథలు రాస్తారు. బయటి రచయితలు లోపలి జీవితం గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవాలి కాబట్టి విప్లవోద్యమం గురించిన కథలు రాసేటపుడు ఆ మేరకు పరిమితి ఉంటుంది. అందులోనే ఉండి రాసే వారికి అక్కడి జీవితాన్ని గురించి రాయడం తేలిక. బయటి వస్తున్న మార్పుల్ని లోపలి వాళ్ళు ఎంత ఫాలో అయినా బయటి జీవితం గురించి రాసేటపుడు పాత్రలకి కావల్సిన వాతావరణం, నేపథ్యం ఇవన్నీ చిత్రించడంలో పరిమితులు ఉంటాయి. బయట ఉండే రచయితలకు అనేక రకాలుగా సాహిత్య ప్రక్రియల గురించి తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించు కుంటారని కాదు కానీ అవకాశాలైతే ఉంటాయి. లోపలి రచయితలకు అవన్నీ తెలుసుకునేంత సమయం కూడా ఉండదు. అవకాశాలు కూడా చాలా పరిమితం. నిజానికి కొత్త పద్దతిలో రాయాల్సిన అవసరం కూడా లేదు. లోపలి రచయితలు చెప్పే వస్తువుకి చాలా బలం ఉంటుంది. అవి బయటి వారికి ఏమాత్రం తెలియని విషయాలు కాబట్టి వాళ్ళు ఏదో కొత్త పద్ధతిలో చెప్పనక్కర్లేదు కూడా. పైగా వాళ్లు తాము ఏమి రాసినా అది సామాన్య ప్రజలకి అర్థం కావాలనే స్పృహతో రాస్తారు. సామాన్య ప్రజలతో ముచ్చట పెట్టినట్టే రాస్తారు. వాళ్ళ ముచ్చటే రాస్తారు. ఎలా చెప్పినా అవి అద్భుతంగానే ఉంటాయి. కాబట్టి ఆ తేడా ఉంటుంది. అయితే భిన్న శిల్పంతో రాయడానికి ప్రయత్నించిన కథలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి అటువంటి ప్రయత్నం షహీదా చేసింది. జాతి వ్యతిరేక ఆవు, ఈ రోజుని గెలుచుకున్న వాడు వంటి కథలు ఆ కోవలోకి వస్తాయి.
19. ఆ లోపలి కథల నుండి, బయటి రచయితలు, రచయిత్రులు నేర్చుకొనవలసినది ఏమైనా ఉందనుకొంటున్నారా?
తప్పకుండా. ఆ కథలనుండి ఎవరమైనా నేర్చుకోవాల్సింది నిజాయితీగా రాయడం, పారదర్శకంగా రాయడం. మార్పుని రికార్డు చేయడం అంటే ఎక్కడా తమ లోపాల్ని, తప్పుల్ని, బలహీనతల్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు. మసిపూసి మారేడుకాయ చేయాలనుకోలేదు. ఎలా దిద్దుకున్నది కూడా అంతే బాధ్యతగా రాశారు. రచయితలకి ఆ నిజాయితీ ఉండాలి. పాండిత్య ప్రదర్శన కాదు, నమ్రత ఉండాలి. ఎక్కడా కూడా రచయిత కథని డామినేట్ చేసినట్టు కనపడదు. ఫస్ట్ పర్సన్ లో రాస్తూ కూడా అక్కడ మనకి రచయిత కాదు, పాత్రలే సజీవంగా కనిపిస్తాయి. ఇది తప్పక అందరమూ నేర్చుకోవాలి.
20. అజ్ఞాత రచయిత్రులు కథలకు ఎక్కించవలసిన జీవిత పార్శ్వాలు ఇంకా ఉన్నాయనుకొంటున్నారా? కథారచనలో వాళ్ళ కృషి ఎలా కొనసాగాలని అనుకొంటున్నారు?
చాలా ఉన్నాయి. ఉదాహరణకి అమ్మతనం శీర్షిక కింద కొన్ని కథలు ఉన్నాయి కానీ పిల్లల్ని వదిలిపెట్టి రావడంలో పడిన ఘర్షణ గురించి కథలున్నాయి. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని చెప్పే కథలున్నాయి. పిల్లల్ని వద్దనుకోవడంలోని ఘర్షణ ఉంది. కానీ పిల్లలను కనకుండా ఉండడం కోసం చాలా స్పష్టతతో నిర్ణయాలు తీసుకోవడం, పురుషులు వ్యాసెక్టమీ చేయించుకోవడం తేలిక కాబట్టి తప్పక వాళ్ళే చేయించుకోవాలని చైతన్యం కలిగించడం, పురుషులు ఆపరేషన్ చేయించుకున్నాకే వివాహం చేసుకోవడం మంచిదని యువతీ యువకులు భావించడం ఇవన్నీ సహజంగా మారిపోయిన క్రమం గురించి కథలు రాలేదు. ఒకప్పుడు అరెస్టులయినపుడు తీవ్ర చిత్రహింసలకి గురయిన అనేక ఘటనల గురించి కూడా ఒకటి రెండు కథలు మాత్రమే వచ్చాయి. మిలిటరీ పరంగా మహిళలు చేసిన సాహసాల గురించి కూడా వ్యాసాలు రిపోర్టులు వచ్చినంతగా మరి కొన్ని కథలు కూడా వచ్చి ఉంటే బాగుండేది. ఇవన్నీ కోరికలే కానీ అంత సమయం దొరకడం చాలా కష్టం అనేది కూడా ఒక వాస్తవం. వాళ్ళు చేయవలిసిన కృషికి సంబంధించి ఒక విషయం నాకు చెప్పాలనిపించింది. కొందరు రచయితలు గుర్తించవలిసింది ఏమంటే బయటి వాళ్ళకి దళజీవితం గురించి ఎక్కువ తెలియదు కాబట్టి దానిని కూడా చిత్రించాలి. సంభాషణాలుంటాయి. అయితే అవి ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, ఎలాంటి వాతావరణంలో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చిత్రించాలి. కొంత మంది కథన రూపంలోనే ఎక్కువ రాస్తున్నారు. అలా కాకుండా కొన్ని పాత్రలు, ఆ పాత్రల నేపథ్యం, ఆ సంభాషణలు, ఆక్కడి జీవితం కూడా ప్రతిఫలించేలా రాయడానికి కృషి చేస్తే బాగుంటుంది. ఈ సంకలనాల్లోనే వచ్చిన అనేక కథలను చూసే అవి నేర్చుకోవచ్చు.
21. కథా సాహిత్య విమర్శకు సిద్ధంగా ఉన్నసూత్రాలు, ప్రమాణాలు లోపలి కథల అంచనాకు సరిపోతాయా? ఈ కథల అంచనాకు కొత్త ప్రమాణాలు రూపొందించుకోవలసి ఉన్నదా?
ఏమాత్రం విశ్రాంతిలేని వర్గ పోరాటం చేస్తూ కథలు రాయడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆదమరిచి ఉండటానికి వీల్లేని సమిష్టి గెరిల్లా జీవితం గడుపుతూ ఎక్కువగా ఆలోచించడం కుదరదు. దళ జీవితంలో ఉంటూ కథలు రాయడం అంటే దానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి తప్ప, సమయం దొరకడం అంటూ ఉండదు. కాబట్టి అలాంటి కథలను అంచనా వేసేటప్పుడు తప్పక కొత్త ప్రమాణాలు ఉండాలి.
22. ఆ కొత్త ప్రమాణాలు ఏమయితే ఈ కథలకు న్యాయం చేయగలుగుతాయి అనుకొంటున్నారు?
అది కథా విమర్శకులు చెప్పగలిగే విషయం. నా వరకు ఈ కథలకి బలం విషయం. వస్తువు, శిల్పం అంతా ప్రజల జీవితం నుండి వచ్చాయి. ప్రజలభాష, ప్రజల భావాలు. ఆ జీవితం పట్ల ప్రేమ, గౌరవం ఉండడం ఈ కథల విమర్శకు మొదటి షరతు అనుకొంటా.
23.అజ్ఞాత రచయిత్రుల కథల పరిమాణాత్మక అధ్యయనం నుండి మొత్తంగా కథా అధ్యయనానికి గుణాత్మక విలువలను ఏమైనా క్రోడీకరించగలమా?
ఏదైనా ఒక ఉద్యమాన్ని గురించి కానీ, ఒక సమూహాన్ని గురించి కానీ ఒక దగ్గర చేర్చిన కథలన్నిటినీ అధ్యయనం చేయడం తప్పక ఆ విషయానికి సంబంధించిన ఒక సమగ్రతను అందిస్తుంది. ఇవే కథలు చాలా కాలంగా మనకు అందుబాటులో ఉన్న పత్రికల్లోనే నిశ్శబ్దంగా ఉండిపోయాయి. వాటన్నిటినీ ఒక దగ్గర కలిపి చదివినపుడు తప్పక గుణాత్మకంగా భిన్నమైన అంచనాకు రాగలుగుతాము. ఒక రకంగా చెప్పాలంటే విడివిడి చెట్లలాగా కనిపించిన ఈ కథలు ఇప్పుడు అడివిని చూపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా ఒక ఉద్యమాన్ని అనేక కోణాల్లో అంచనా వేయడానికి కావల్సిన పరికరాలను ఇవి అందిస్తాయి.
24. అజ్ఞాత రచయిత్రుల కథల సేకరణలో ఈ ప్రయాణం మీకిచ్చిన అనుభవం ఏమిటి? మీరు నేర్చుకొన్న గుణపాఠాలు ఉన్నాయా?
ఈ మొత్తం అనుభవం నాకు చాలా విలువైనది. నేను భవిష్యత్తులో చేయగలిగే, చేసే సాహిత్య కృషికి ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది. గుణపాఠాలు కూడా ఉన్నాయి. మొదట షహీదా కథలు సేకరించి, ఒక దగ్గర పెట్టి పేజ్ మేకర్ ఫైల్ తయారు చేసి ఇచ్చాను. అయితే వాటిని ఏ వరుసలో పెట్టాలి, ఎలా వర్గీకరించాలి ఈ పని అంతా రాజయ్య గారే చేశారు. కానీ నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే కథలకి, కవిత్వానికి కూడా కింద అవి ప్రచురించిన కాలం, పత్రికల వివరాలు ఇవ్వకపోవడం. దేనినైనా స్థల కాలాల్లో చూస్తాం కదా. ఇది చాలా పెద్ద పొరబాటు. ఒక కవిత తనది కానిది కూడా తనది అనుకుని చేర్చాను. ఈ పొరపాటు ఎలా జరిగిందంటే తాను ఎన్.డి. పేరుతో కొన్ని కథలు, కవితలూ రాసింది. ఈ పొరపాటుగా చేర్చిన కవిత కి రచయిత పేరు ఎస్. డి. అయితే అది పాతకాలం నాటి సైక్లోస్టైల్ పద్ధతిలో తీసుకువచ్చిన లోపలి పత్రికలో వచ్చింది. ఎస్. డి అంటే సుఖదేవ్ అని తరవాత మరోచోట తెలిసింది. తరవాత ఈ తప్పులను దృష్టిలోకి తీసుకువస్తూ అరుణతారకు షహీదా ఉత్తరం కూడా రాసింది. అలా గతంలో జరిగిన తప్పులకి సంబంధించి అరుణతారలో వచ్చిన ఉత్తరాలు కూడా దగ్గరపెట్టుకుని అవన్నీ ఈసారి సవరించుకున్నాను. నాకు ఇది పెద్ద గుణపాఠమే. ఇవి చరిత్రలో రికార్డయిపోతాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో అనిపించింది.
25. దండకారణ్య కథలు, ప్రత్యేకించి స్త్రీల కథలు అక్కడి సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలలో వస్తున్న మార్పులను ఎంతవరకు పట్టుకోగలిగాయి? ఈ కథలను అక్కడి సామాజిక చరిత్ర నిర్మాణానికి ఆధారాలుగా తీసుకోవచ్చా?
ఇవి ప్రధానంగా విప్లవోద్యమంలోని జీవితాన్ని చిత్రించినవి. అయితే అక్కడి సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలకు సంబంధించిన సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన మార్పులు, ముఖ్యంగా మానవ సంబంధాలలోని అనేక కోణాలు, సంభవిస్తున్న మార్పులు చిత్రించిన కథలు. అటవీ ప్రాంత ప్రజల జీవితాల్లోకి దళారీలు ప్రవేశించడం దగ్గరినుండీ, బహుళ జాతి సంస్థలు మైనింగ్ కోసం అక్కడికి వెళ్ళడం, వాటికి కావల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం రాజ్యం ప్రజలపై చేస్తున్న దాడి ఇవన్నీ కూడా కొన్ని కథల్లో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇవి విప్లవోద్యమానికి సంబంధించిన కొన్ని అపోహలను దూరం చేస్తాయి. ఉదాహరణకు స్త్రీలు నిజంగా తుపాకి పట్టి పోరాడతారా? వాళ్ళది సహాయక పాత్రేనా? ప్రజల మద్ధతు నిజంగా పార్టీకి ఉందా? నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులా? అసలు పాఠశాలలను ఎవరు కూలగొడుతున్నారు? ఇవన్నీ వివరించడమే కాదు మానవ సంబంధాలు ఎంత మానవీయంగా ఉన్నతీకరించబడుతున్నాయనేది కూడా ఈ కథలను బట్టి తెలుసుకోవచ్చు. ఇదంతా సామాజిక చరిత్రే. కాకపోతే విప్లవోద్యమ జీవితమే ప్రధానంగా ఉండడం అనే పరిమితి ఉంది.
26. దానిని దాటటం సాధ్యం కాదా ? స్థానిక ఆదివాసీ సమూహాలతో ఉండే సంబంధాలు వాళ్ళ జీవితాలను నిత్యం పరిశీలించటానికి వున్నఅవకాశాల దృష్ట్యా వాళ్ళ అనుభవాల కోణం నుండి వాళ్ళ జీవితాలలో వచ్చిన వస్తున్న మార్పులను, ఆక్రమంలో వాళ్ళు పడుతున్న ఘర్షణను కథలుగా రాయటానికి అవకాశం ఉంది కాదా ? దాని గురించి ఏమంటారు ?
ఇది అధిగమించగలిగిన పరిమితే. అయితే యథాతథ ఘటనలను రాసెయ్యడం తేలిక. ముఖ్యంగా ఆర్థికరంగంలో వస్తున్న మార్పులకు సంబంధించి చిత్రించాలంటే ఆ వాస్తవాలకు సంబంధించిన చిత్రణ కోసం కల్పన చేయాలి. అది తీరికగా చేయగలిగిన పనే తప్ప యుద్ధ రంగంలో ఉండి చేయగలిగిన పని కాదు. నిజానికి ఇవన్నీ యుద్ధరంగం నుండే రాయలేదు. చాలా కథలు అజ్ఞాతంలో పని చేసిన అనుభవంతో తరవాత కాలంలో వెసులుబాటు దొరికినపుడు రాసినవే. కొందరు రచయితలు పత్రికలు నడిపే పనిలో ఉన్నప్పుడు రాసినవి. ఆర్గనైజేషన్ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కథలు రాసేందుకు ఎక్కువ వెసులుబాటు ఉండదు. ఇది ప్రధానంగా ఆ వెసులుబాటు లేకపోవడానికి సంబంధించింది. ఉన్న వాళ్ళు రాసిన కథల్లో ఒక మేరకైనా రాశారు.
27. మొత్తంగా దండకారణ్య కథ, ప్రత్యేకించి అక్కడి నుండి వచ్చిన ఈ స్త్రీల కథలు మొత్తంగా తెలుగు కథకు, విశేషంగా స్త్రీల కథకు ఏ విధమైన చేర్పు అనుకొంటున్నారు?
తప్పకుండా ఒక ముఖ్యమైన చేర్పు అవుతుందనుకుంటున్నాను. అనేక రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాంతాల వారీ సమస్యలు గురించి, అస్తిత్వాల గురించీ, అందులో కూడా దళిత సమస్యలూ, దళిత మహిళా సమస్యలు, ఫెమినిస్టు కథలు, మైనారిటీ కథలు, మైనారిటీ మహిళా కథలు అలా విప్లవోద్యమ కథలు, అందులో విప్లవ మహిళా కథలు, అందులోనూ, మీరే అన్నట్టు జ్ఞాత రచయిత్రులు, అజ్ఞాత రచయిత్రులు ఇలా సూక్ష్మ పరిశోధనలు జరగాలి కదా. అందులో ఇవి అజ్ఞాత విప్లవ రచయిత్రులు రాసినవి. అంతే కాదు మహిళా కోణంలో రాసినవి, మహిళల సమస్యల మీద, పాత్ర మీద చాలా ఫోకస్ చేసినవి. ఆ రకంగా ఇది ఒక అవసరమైన చేర్పు. లేకపోతే ప్రధాన స్రవంతిగా చెలామణి అయ్యే సాహిత్యం అసమగ్రంగా ఉండిపోతుంది.
28. ఈ సంకలనాలకు వియ్యుక్క అని శీర్షిక పెట్టారు కదా! ఆ పేరు ఎంపిక చేసుకొనటానికి కారణం ఏమిటి?
వియ్యుక్క గోండీ భాషాపదం. వేగుచుక్క అని అర్ధం. ప్రజలకి దగ్గరగా ఉండేది లేదా ప్రకృతికి దగ్గరగా ఉండేది శీర్షికగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు ఇది తట్టింది. ప్రజల పాటలవలన మనకు రేల వంటి గోండీ పదాలు పరిచయమే. డంకారణ్య కథలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కానక అక్కడి పేరు ఏదైనా బావుంటుంది కదా అనిపించింది.
29. కథలు రాసిన అక్కలందరూ వియ్యుక్కలు అన్న మాట…
అంతేగా మరి.
30. అజ్ఞాత రచయిత్రుల కథలను సేకరించి సంకలనం చేసే బృహత్తరమైన ప్రాజెక్టు తీసుకొని విజయవంతంగా పూర్తి చేశారు. ఒక పని చేసే క్రమంలో మరెన్నో పనులగురించిన ఆలోచనలు రావటం సహజం. దీని నుండి అజ్ఞాత రచయిత్రుల సాహిత్యం గురించికానీ, మొత్తంగా అజ్ఞాత ఉద్యమ అనుభవ సాహిత్యం గురించికానీ, సాహిత్య సిద్ధాంతానికి, విమర్శకు సంబంధించిన చరిత్ర గురించి కానీ ఇంకా చేయవలసిన పని గురించిన మీకు కలిగిన ఆలోచనలను వివరిస్తారా?
ఈ కథలు సేకరిస్తున్నప్పుడు నాకు దొరికిన సమాచారం, అది వ్యాసాల రూపంలో కావచ్చు, నివేదికల రూపంలో కావచ్చు, జ్ఞాపకాల రూపంలో కావచ్చు , అదంతా ఒక దగ్గర పెడితే మొత్తంగా ఈ నాలుగు దశాబ్దాల సాయుధ విప్లవోద్యమంలో మహిళల పాత్ర గురించి ఒక పుస్తకం రాయవచ్చని అనిపించింది. దాని గురించి నేను ఇంకా నిర్దిష్టంగా ప్లాన్ చేసుకోవాలనుకోండి. కానీ అలాంటి ప్రేరణ అయితే కలిగింది. నేనే కాదు ఈ సంకలనాలను చదివాకా సమాజం పట్ల బాధ్యతతో ఆలోచించే రచయితలు, పరిశోధక విద్యార్థులు ఈ కథల మీద మరిన్ని సూక్ష్మ పరిశోధనలు చేయగలిగితే బాగుంటుంది అనిపించింది. ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి చాలా కొత్త జీవితాన్ని ఆవిష్కరించిన సాహిత్యంగా దీనిలో చేసిన వర్గీకరణ ఆధారంగా కానీ, లేదా తమకు తోచిన అంశాల మీద కానీ కొన్నైనా పరిశోధనలు జరగాలి. అంటే ఈ కథలు పరిశోధక అంశాలుగా ఉపయోగించుకోగలగాలి. ప్రగతిశీల ప్రొఫెసర్లు తప్పక తమ విద్యార్థులకి ఈ కథలను పరిశోధనా వస్తువులుగా సూచిస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు తప్పక ఈ సంకలనాలు తేవడం వెనుక కృషి సార్థకం అవుతుంది. ఇవి ఏ ప్రజల గురించి రాశారో ఆ రాయడంలో ఏ ప్రజలు భాగస్వాములయ్యారో వాళ్ళకి గుర్తింపు లభించినట్టవుతుంది. ఈ రచయితల్లోని 9 మంది అమరులయ్యారు. వారి గురించిన సంక్షిప్త సమాచారం ఫోటో తో సహా ప్రతి సంకలనం చివరా ఇచ్చాము. అలాగే ఈ కథల్లో ప్రధాన పాత్రలుగా ఉన్న అనేక మంది కూడా అమరులయ్యారు. వారందరినీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తలుచుకుంటూ నివాళి ఆర్పిస్తున్నాను.
Very informative, impressive, and and intellectual interview…. Just appreciate the Editor is a small word ….
Thankful to her for her research, collection, publishing the ‘short stories’ of the armed revolutionary writers.