1913 డిసెంబర్ లో మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో పుట్టిన మాణిక్యరావు గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక వారధి. ఆధునిక వర్తమాన కాలానికి ప్రత్యక్ష సాక్షి. సమకాలీనంలో ఆయనంత పరిశోధన, పరిశ్రమ చేసినవారు చాలా తక్కువ. హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్రను వ్రాసి వర్తమాన, భవిష్యత్ తరాల వారికి ప్రతినిధిగా కనిపిస్తారు. “భావ నగరము నందు / భ్రాంతి వీధులలోన / ఆకాశ హర్మ్యా ల / సుఖస్వప్నముల గాంచ / స్పందనలు కలిగించి / అనుభూతులందించ / కళను మించినదేది / ఇలను లేనే లేదు.” స్పందన పేరుతో గోల్కొండ పత్రికలో 1935లో ప్రచురించిన వెల్దుర్తి మాణిక్యరావు కవిత ఇది. వారి కవిత్వం అనుభూతులందించే వరకే పరిమితం కాలేదు. 1930ల నుండి 1994 వరకు సాంస్కృతిక, సామాజిక, సాహిత్యోద్యమాల్లో పాల్గొన్నారు. భావితరాలకు ఉపయోగించే విశ్లేషణలు అనుభవపూరితంగా అందించారు.
“ఏ దేశం వారైనా / ఏ కులం వారైనా / నిత్య నూతన వికాసంతో కళకళలాడేదెప్పుడు? / చివరి పెట్టుబడిదారు / నరాలతో / చివరి నిరంకుశాధికారిని / ఉరి తీసినప్పుడు / ఆ నెత్తురు మడుగులో / అభిషిక్తుడైన సూర్యుడు / అరుణకాంతుల / ప్రసరింపజేసినప్పుడు / ఆనందమయ జీవితానికి నాంతి ప్రస్తావన. ప్రపంచం, దేశం, ప్రాంతం గురించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న అసమానతలను తొలగించడానికి తన రచనల ద్వారా తీవ్రంగా కృషి చేశారని చెప్పడానికి ఈ ఒక్క కవిత ఉదాహరణగా తీసుకుంటే సరిపోతుంది.
వీరు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో ప్రావీణ్యులు. మద్యపాన నిరోధక గ్రామ సుధార్, హైదరాబాద్ కో-ఆపరేటివ్ జర్నల్స్ నిర్వహించారు. అణాగ్రంథమాల నిర్వహణలో ప్రధానపాత్ర పోషించడంతో పాటు, ఉర్దూలో, తెలుగులో చాలా పుస్తకాలు ప్రచురణలోకి వచ్చేటట్లు కృషి చేశారు. ఒకదశలో క్రియాశీల ఉద్యమకారుడిగా బొజ్జం నర్సింలు, కాటం లక్ష్మీనారాయణ, తదితరులతో కలిసి పనిచేశారు.
మాణిక్యరావు ఇంట్లో జరిగే సాహిత్య, సాంస్కృతిక చర్చా గోష్ఠులకు కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు, రాజమహబూబ్ నారాయణ, దాశరథి కృష్ణమాచార్యులు, సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి వచ్చేవారు. అనేక సామాజికాంశాలకు ప్రతిపాదనలు రూపొందించేవారు.
ఒక్క హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర వ్రాయడానికే పన్నెండు సంవత్సరాలు పట్టిందంటే ఆయన నిరంతర కృషిని మనం అర్థం చేసుకోవచ్చును. థియోసాఫికల్ సొసైటీ, హిందూ సోషల్ క్లబ్, బారిష్టర్ రుద్ర, ఆర్య సమాజం, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, సోషల్ సర్వీసు లీగ్ వంటి సంస్థలతో కలిసి సామాజిక చైతన్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి వెల్దుర్తి.
ఖిలాఫత్ ఉద్యమం, ఖాదీ ప్రచారం ద్వారా ప్రజల్లో స్వశక్తిని గుర్తించాలని ప్రచారం చేశారు. గోలకొండ కవుల సంచిక తెలంగాణలో మేటి కవులున్నారని, ప్రజా ఉద్యమకారులకు ఆధారమైందని వెల్దుర్తి వారంటారు.
వెల్దుర్తి 1930-40 మధ్య రాసిన “హసీనా గేయాలు” భావకవిత్వ స్ఫురణతో ఉన్నా కూడా పెత్తందారీ ప్రజాస్వామ్య విధానాన్ని నిరసిస్తూ పీడిత ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిన గేయాలు కూడా వ్రాశారు. “పుణ్యం పాపం రెండూ / రూపాయికి బొమ్మ, బొరుసు / ఇటువైపు బొమ్మలతో / అటువైపు బొరుసు గీత / ఇటువైపు వెలుగు కిరణం / అటువైపు చీకటి నీడు / రూపాయి తిప్పి చూస్తూ / బొరుసు గుట్టు బయటపడును / మంచి చెడును ఎప్పటికి / వెలుగు నీడ నాశ్రయించు పాపాలు రూపాయికి ఏ విధంగా బొమ్మ, బొరుసు లాంటివో మంచి చెడులు కూడా ఎప్పటికి వెలుగు నీడల వలె ఆవరించి ఉంటాయనే జీవితసత్యాన్ని తెలిపారు. వెల్దుర్తి వారి సోదరి పుత్రుడు ఆనాటి ప్రజా ప్రభుత్వంలో మంత్రి అయిన కరణం రామచంద్రారావుకు అంకితమిచ్చారు. సొంత పనుల మాట మరచి, దేశ దాస్య విముక్తి కొరకు శ్రమించాలని కోరుకున్నవారు వెల్దుర్తి.
భారత స్వాతంత్య్రం కన్నా ముందే మెదకు జిల్లాలో కథానిక పరిపుష్ఠం పొందింది. 1945లో అణాగ్రంథమాలలో అతని భారం కథానిక వెలువడింది. ఆనాడే యాభైకి పైగా వచ్చిన వెల్దురి కథానికలు జిల్లా ప్రజల్లో తెలుగు సంస్కృతిని, స్వాతంత్య్ర జిజ్ఞాసను జాగృతం చేసినాయి. తెలంగాణ స్థానిక భాషలో వచ్చిన వెల్దురి కథలు ప్రజలను ఆలోచింపజేసాయి. మాణిక్యరావు కథలు చదువుతుంటే చంద్రధర్ శర్మ గులేరి గుర్తిస్తారు. ఆంగ్లంలో ఓ హెన్రీ కథల్ని మరిపించే ఇతని కథలు తెలుగు కథాక్షేత్రం నూతన కథా రచయితలకు నీడనిచ్చే చెట్టులాగుంటుంది. ఒకరికి చేదోడువాదోడుగా ఉండే విధానం వెల్దుర్తి కథల్లో కనిపించింది.
వెల్దుర్తి కవి, కథకుడిగా, చరిత్ర నిర్మాతగా, నాటకకర్తగా, వ్యాసకర్తగా, పత్రికా నిర్వాహకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, అనువాదకుడిగా చాలా రంగాల్లో పనిచేశారు. మహారాష్ట్రలోని అహమద్ నగర్ లో పుట్టిన దత్తకవి కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు వెల్దుర్తి. కేవలం 23సంవత్సరాలు మాత్రమే బ్రతికిన దత్తోపంత్ ఘాటె కవితలు పాఠకుల హృదయాలను అలరించాయనివెల్దుర్తి వారంటారు.
సంఘసేవకు మద్యపాన నిరోధక ప్రచార మార్గాన్ని ఎన్నుకొని, మధ్యపాన నిరోధక పత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా మద్యపాన నిరోధం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ పత్రికలను నిర్వహించిన ఘనత వెల్దుర్తి వారిదే. ఆనాటి తెలంగాణ సమాజాన్ని, సాంస్కృతిక జీవితాలను, రాజకీయ మార్పులను, సామాజిక చైతన్యాన్ని ప్రభుత్వ మార్పు ప్రజల కష్ట సుఖాలను, సాహిత్య వికాసాన్ని పూర్తిగా వీరి పత్రికల ద్వారా ప్రచారం చేశారు.
వెల్దుర్తి ఆలోచనలన్నీ కుల మతాలకు అతీతంగా కలిసి జీవితాన్ని గడపాలని కోరుకునేలా ఉండేవి. ఈ వ్యాసకర్త వారి కుమారుడు హర్షవర్ధన్ గారిని కలిసినప్పుడు నాన్నగారు “సోషలిస్టు భావాలు కలిగి ఉండేవారన్నారు”. అందరినీ సమానంగా చూడాలని కోరుకునేవారన్నారు.
సభలు, సమావేశాలు, నృత్యనాటకాలు తదితర కార్యకలాపాలు హైదరాబాదులో జరుపుకోవటానికి కొండా వెంకటరంగారెడ్డి, వడ్లకొండ నరసింహారావు, వరకాంతం గోపాలరెడ్డి, ఎల్లాప్రగడ సీతాకుమారి, సత్యవతి, మాడపాటి హనుమంతరావు, బొజ్జం నర్సింలు తదితరులతో కలిసి పనిచేశారు వెల్దుర్తి వారు. నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తూ, ప్రజా ప్రభుత్వం రావాలని ఆశించారు. ప్రజా ప్రభుత్వ ఏర్పడ్డ తరువాత వారితో కలిసి పనిచేస్తూ, ప్రజల సంక్షేమానికి తోడ్పడ్డారు వెల్దుర్తి వారు. పోలీసులు, రజాకార్లు గ్రామాలను ముట్టడించి ప్రజలను బంధించి, గృహభవనాలలో వేసినా, మానభంగాలు చేసినా ఎన్నో కిరతకాలు చేసినా చూసి మనోవేదన చెందిన ప్రజల పక్షాన ఉండి, పత్రికల ద్వారా సాంఘిక సంక్షేమాన్ని ప్రచారం చేశారు. తమ లక్ష్యానికి దూరం కాక అనుకున్న పనిని నిర్వహించారు. ఎప్పటికప్పుడు మారుతున్న సమాజ నేపథ్యాన్ని గమనిస్తూ, రచనలు చేస్తూ వచ్చారు వెల్దుర్తి. ఈ రోజు హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్రను సుస్పష్టంగా చదువుకోగలుగుతున్నామంటే వారు రాసిన హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ చరిత్రయే కారణం.
మెదక్ జిల్లానే స్వాతంత్ర్య సమరానికి మొదట శంఖాన్ని పూరించింది. ఆంధ్రోద్యమం ద్వారా మాడపాటి 1920లో రాష్ట్రంలో ప్రజా చైతన్యానికి బీజం వేసారు. అది పదేండ్లలో పెరిగి, మహాసభ రూపం దాల్చింది. సాటిలేని సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెతుకు జిల్లా జోగిపేటలో వికసించింది. తుదిపోరాటం సలుపడానికి సంకేతంగా జరిగిన తుది ఆంధ్రమహాసభ సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన మెదక్ జిల్లాలోని కందిలో జరిగింది. ఈ విధంగా మొదటి మహాసభలో రెడ్డిగారు కలంపోటు పొడిచిందీ, చివరి మహాసభలో కత్తి ఝుళిపించి నిరంకుశ రాచరికాన్ని అంతం చేయడానికి తుది పోరాటంలో సర్దార్ జమలాపురం కేశవరావు దూకింది కూడా మెదక్ జిల్లా నుంచి జరగడం విశేషం. ఈ మహాసభల ప్రభావం అదే జిల్లాకు చెందిన వెల్దుర్తి పై పడిందని వేరే చెప్పనక్కరలేదు.
బద్దం యల్లారెడ్డి, గోపిడి గంగారెడ్డి, కాళోజీ నారాయణరావు, చై చంద్ర జైన్, ఆదిరాజు తిరుమలరావు, పటేలు రాజన్న, పల్లర్ల హన్మంతరావు, సురభి శేషవర్మ, కె. కృష్ణమాచారి, వెంకట రాజేశ్వర్ జ్యోషి, వి. హన్మంతరావు, కంది శ్రీనివాసరావు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహచరులు డా. సురేశ్ చంద్ర, కె.వెంకయ్య, బి. వెంకటయ్య, సదాశివశర్మ, చోళ లింగయ్య, బచ్చు వెంకటేశం, చీదు గోపాలరెడ్డి, బసవ మాణయ్య తదితరులతో పనిచేసే అవకాశం వెల్దుర్తి మాణిక్యరావుకే దక్కింది.
హైదరాబాదు రాష్ట్రమే ఒక జైలుగా మారిన 1940-48 ప్రాంత చరిత్ర విశేషాలను ప్రత్యక్షంగా చూసి గ్రంథీకరించిన వారు వెల్దుర్తి. రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు అతను ఏ వృత్తిని అవలంబించినా నిజాం అఘాయిత్యాలకు గురైనారు. ఇంటిల్లిపాది చెమటోడ్చి పండించిన పంటను రజాకార్లు కత్తులు ఝుళిపిస్తూ ఎత్తుకపోతుంటే ఇన్నాళ్లపాటు చేసిన కష్టం ఏటిపాలైందని విల విల ఏడ్చిన కర్షకుల ఆర్తనాదాలను స్వయంగా చూసినవారు వెల్దుర్తి.
కార్మిక, కర్షకులేగాక సామాన్య జనం దౌర్జన్యాలకు నిలయమైన నిజాం రాష్ట్రంలో ఆస్తికి, ప్రాణానికి, చివరకు మానానికి కూడా రక్షణ లేనందున రాష్ట్రం విడిచి వెళ్ళినారు. మరికొందరు ప్రాణత్యాగం చేశారు. పెరిగి ప్రబుద్ధులు కావలసిన చిరుప్రాయపు విద్యార్థులు అగ్నిగుండమై మత దురహంకార పొగలు కప్పుకొని సెగలు కక్కుతున్న నిజాంనేలలో చదివేదేమిటి? చదివి సాధించేదేమిటి? అతని ఆవేశంతో దేశమాత దాస్యశృంఖలాల నుండి విముక్తి చెందినాకనే ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూను’తామని సరస్వతికి దండం పెట్టి పాఠశాలను, కళాశావలను, వదిలేసి స్వాతంత్ర్య సమర రంగంలోకి దూకినారు.
నిజాం ప్రభుత్వంలో జరిగే అన్యాయాలను చూచి ఎదుర్కొన్నారు. సోదర భారతీయులవలె తాము కూడ దేశ దాస్యశృంఖలాలను తెంచివేసి తమ ఉద్యమాన్ని ఉధృతం చేసినారు. ఈ ఉద్యమ నేపథ్యమే తరవాతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి ఉపయోగపడింది. ప్రజల తిరుగులేని ఆత్మవిశ్వాసం, కఠోర దీక్ష, ప్రజల నిబ్బరం, స్వాతంత్య్ర సమరానికి తోడ్పడ్డాయి.
మధ్య యుగపు ఫ్యూడల్ వ్యవస్థ కుప్పకూలి పోవడానికి ప్రజల ఉద్యమమే తోడ్పడింది. అందులో వెల్దుర్తి మాణిక్యరావులాంటి వారి కృషి అపారమైనది. రెండు శతాబ్దాల కింద నిర్మించుకున్న అసజ్జాహీ రాచరికపు మేడ కూలిపోవడానికి సామాన్య ప్రజలతో పాటు విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, సర్వసంగ పరిత్యాగి అయిన స్వామి రామానందతీర్థ వంటి వారి త్యాగం ఎంతో తోడ్పడిందని, వెల్దుర్తి మాణిక్యరావు అభిప్రాయపడ్డారు.
వ్యాసం బాగుంది. విరివిగా వ్యాసాలు రాసేవారు.వారి పుస్తకాలేమైనా అందుబాటులో వున్నాయా?