రేణుక అమరురాలైందని తెలిసినప్పటి నుంచి ఎడతెగని ఆలోచనలు. దుఃఖం.
రష్యా విప్లవ కాలంలో రాసిన నవల అది. ఆ నవలలో విప్లవకారులున్న భవనాన్ని ప్రభుత్వ సైన్యం చుట్టుముడుతుంది. చాలా మంది చనిపోతారు. ఒక కామ్రేడ్ బహుశా గోడకున్న మాళిగలో దాక్కుంటాడు. అప్పుడు కొన్ని రోజులు సైన్యం భవనాన్ని చుట్టుముట్టి ఉంటుంది. బయటకు రాలేని పరిస్థితి. మళ్లీ కొన్ని నెలల తర్వాత సైన్యం ఆ భవనానికి వచ్చినప్పుడు ఆ కామ్రేడ్‌ను చూసి ఓ సైనికుడు భయంతో కేకలు వేసి తనవారిని పిలుస్తాడు. వాళ్లు అతడిని బయటికి తీస్తారు. అన్ని నెలల తర్వాత ఎండను చూసి తట్టుకోలేకపోతాడు. చిక్కిశల్యమై, కనుగుండ్లు బయటకు పొడుచుకొచ్చిఎముకల గూడులా మారిన ఆ కామ్రేడ్‌ను చూసి సైనికులు భయపడతారు. ఇప్పటికైనా సరెండర్ కమ్మని అడుగుతారు. అందుకు ఆ కామ్రేడ్ ఒప్పుకోడు. విప్లవ నినాదాలు చేస్తూ కొద్ది క్షణాల్లోనే చనిపోతాడు. చనిపోయిన రేణుక ఫొటోను చూస్తే నవలలోని ఆ కామ్రేడ్ గుర్తుకు వచ్చాడు.
రేణు ఫొటోను చూస్తే దుఃఖం అసలు ఆగలేదు. ఎముకల మీద చర్మం మాత్రమే వుందా అన్నట్టుగా కనిపిస్తోంది. అంతగా బక్కచిక్కిపోయింది. తను బక్కపల్చటి మనిషే. కానీ మరీ ఇంతలా కాదు. తీవ్రమైన అనారోగ్యంతో వున్న రేణుకను ఒక గ్రామంలో ఉంచారట. నెల రోజులుగా అదే గ్రామంలో వుంటోందట. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి వెహికిల్ మీద అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపారట. అరుణారుణ జోహార్లు రేణుకా! ఇంతకు మించి నీకు నివాళులు ఎట్లా అర్పించగలం.
అక్కడున్న పరిస్థితి ఏంటో తెలియదు కానీ నువ్వు బయటకు వచ్చి, ఇంట్లో వాళ్లను కాంటాక్టు చెయ్యాల్సింది. రహస్యంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సింది అని మనసు అక్రోశిస్తోంది రేణు.
రేణుక మొదట తన కథల ద్వారా నాకు పరిచయం. తను విప్లవోద్యమంలోకి పూర్తికాలం రాకముందు నుంచే కథలు రాయడం ప్రారంభించింది. నేను చదివిన మొదటి కథ తనది ‘భావుకత’. ‘ఆహ్వానం’ పత్రికలో అచ్చయింది. రేణుక పేరుతోనే రాసింది. అలాగే నిర్మల, జమీన్, మిడ్కో పేర్లతో కూడా కథలు రాసింది. దమయంతి పేరుతో దండకారణ్యం (డి.కె.)లో ఆదివాసీలపై ప్రభుత్వ దమనకాండను పుస్తకంగా రాసింది. మిడ్కో గోండీ పదం. అర్థం ‘మిణుగురు’ అని. తన అన్న వెంకటకిషన్ ప్రసాద్ సహచరి మిడ్కో (ఆదివాసీ అమ్మాయి) ఉద్యమంలో అమరురాలైంది.
ఈ సందర్భంగా మిడ్కో గురించి కూడా రెండు వాక్యాలు… మిడ్కో గురించి ఐ.వి. సాంబశివరావు మాస్టారు చాలాసార్లు మా దగ్గర ప్రస్తావించేవారు. ‘క్రాంతి’ పత్రిక యూనిట్‌లో మేము (నేను, మంజీర-మఠం రవికుమార్) పని చేస్తున్నప్పుడు మాస్టారు నిత్యం మా దగ్గరికి వచ్చేవారు. ఆ క్రమంలో ఎన్నో కబుర్లు. మాస్టారు సంవత్సర కాలం దండకారణ్యంలో పనిచేశారు – అక్కడి ఉద్యమాన్ని పరిశీలించడానికి, నేర్చుకోవడానికి. కమాండర్‌లు నెలకోసారి అందరి కిట్‌లను చెక్ చేసేవారట – అనవసరమైన బరువులను తీసివేయడానికి. అనవసర బరువులు ఎప్పుడూ ఆటంకమే. మాస్టారు చదువుకోడానికి కొన్ని పుస్తకాలను దళ కామ్రేడ్స్‌కి ఇచ్చారట. ఒకటి, రెండు పుస్తకాలుంటే పర్వాలేదు కానీ, ఎక్కువ పుస్తకాలు మోయరు, డంపు చేస్తారు. చదవడం అయిపోయిన తర్వాత మళ్లీ తెప్పించి ఇస్తారు. అయితే ఈ మిడ్కో దగ్గర కూడా మాస్టారివి పుస్తకాలు రెండు ఉండెనట. అవి దళకమాండర్ తీసేస్తారని వాటిని చెట్టుమీద పెట్టి వచ్చిందట. కమాండర్ కిట్ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ తన బ్యాగులో పెట్టుకుందట. మాస్టారు ఓ ఆర్టికల్ అర్జంటుగా రాయాల్సి వచ్చి, రిఫరెన్స్ కోసం ఆ పుస్తకం అవసరమైందట. అప్పటికి దళం డంపు పెట్టిన ప్లేస్ నుంచి చాలా దూరం వెళ్లిపోయిందట. దానిని డంపు నుంచి తెప్పించి ఇవ్వలేని పరిస్థితి. మాస్టారు కమాండర్‌తో ఆ పుస్తకం తెప్పించాలని మాట్లాడుతుంటే విన్న మిడ్కో తన బ్యాగులోనుంచి తీసి ఇచ్చిందట. మాస్టారు ఎప్పుడూ ఈ విషయం చెప్పి, ‘బడుద్దాయి’ అని నవ్వేవారు. నేను, మా రవి డి.కె.కు వెళ్లిన కొత్తలో మాకు కలిసింది. చాలా యాక్టివ్‌గా ఉండేది.
మిడ్కో పేరునే తన కలం పేరుగా పెట్టుకుంది రేణుక. తన కథలు చాలా వరకు పాత్రల అంతఃసంఘర్షణతో కూడి ఉండేవి. తన కథలంటే నాకు చాలా ఇష్టం.
డి.కె.లో బహుశా 2001లో అనుకుంటా తనున్న వీడియో ఒకటి చూశాను. ఏఓబీలో జరిగిన ఓ మిలిటరీ క్యాంపుకు తను అటెండ్ అయిన వీడియో అది. తనను ప్రత్యక్షంగా కలిసింది మాత్రం 2004 చర్చల టైమ్‌లో. అంతకుముందే తన గురించి విని వుండటం, వీడియోలో చూసి ఉండటం వల్ల వెంటనే గుర్తుపట్టాను. నా గురించి తను కూడా విని వుండటం వల్ల వెంటనే గుర్తుపట్టింది. బక్కపల్చగా ఉండేది. ఎత్తు కూడా ఎక్కువే. నల్లమలలో ఆర్.కె. (రామకృష్ణ) టీమ్‌లో ‘విప్లవ మహిళ’ ఎడిటర్‌గానూ, కంప్యూటర్ వర్క్‌లో ఉండేదాన్ని. కంప్యూటర్, దానికి సంబంధించిన సామాన్లు ఉండటం వల్ల ప్రత్యేకమైన టెంట్ వేసేవాళ్లు. అప్పుడు తను నాతోపాటే టెంట్‌లో ఉండేది. తక్కువగా మాట్లాడేది. తనకు తాను కల్పించుకుని మాట్లాడటం చాలా తక్కువ. అన్నానికి, ఛాయ్‌కి వెళ్లేటప్పుడు మాత్రం నా కోసం తప్పకుండా ఆగేది. ఇద్దరం కలిసే వేళ్లేవాళ్లం. ఒకోసారి కంప్యూటర్ పనిలో నేను వుంటే ఛాయ్ తీసుకువచ్చి ఇచ్చేది. తను తక్కువగా మాట్లాడినా బహుశా అందువల్లనే కావచ్చు మా మధ్య ‘గ్యాప్’ ఉన్నట్టు అనిపించేది కాదు.
తను ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. జనరల్‌గా అడగము కూడా. శాఖమూరి అప్పారావే ఓసారి ‘తను పెళ్లి చేసుకోబోతున్నానని, ఆమె ఇక్కడే ఉందని, ఎవరో కనిపెట్టు’ అన్నారు. అప్పుడు క్యాంపులో ఇద్దరు అమ్మాయిలు కొత్తవాళ్లు ఉన్నారు. ఒకరు రేణుక, మరొకరు ఇంకో అమ్మాయి (పేరు ఎందుకని చెప్పడం లేదు). అప్పటికే సంతోష్‌రెడ్డి చనిపోయి 5 సంవత్సరాలు అవుతోంది. తను మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు లేదు. అందుకని, రేణుకనే అయ్యివుండవచ్చు అని తన పేరు చెప్పాను. అప్పారావు నవ్వాడు.
ఆ క్యాంపులో ఓసారి రేణుక మాట్లాడుతూ… తను విరసం కథల వర్క్‌షాపుకి వెళ్లానని, చాలా మంచి చర్చ జరిగిందని, అల్లం రాజయ్య గారు ఆ వర్క్‌షాపులో మాట్లాడుతూ కథల్లో అంకెలు, సంఖ్యలు ఎప్పుడూ వాడకూడదని, వాటిని అక్షరాల్లో రాయాలని చెప్పారని, అది తనకు కొత్త విషయమని చెప్పింది. నిజానికి నాకు కూడా అది కొత్త విషయమే.
మరోసారి 2005లో శాఖమూరి అప్పారావును కలవడానికి వచ్చింది. బహుశా అది మార్చి నెల అనుకుంటా. ఆకు రాలుతుంది. ఎండ పడకుండా దుప్పట్లు కట్టుకుంటున్నాము. అక్కడ వుండేది కొద్దిరోజులే కాబట్టి కంప్యూటర్ టెంట్ వేయలేదు. అప్పుడు కూడా తను పగలంతా నా దగ్గరే వుండేది. ఇదిగో… ఇప్పుడు… ఇన్నేండ్ల తర్వాత 55 ఏండ్లు నిండకుండానే నిర్జీవమైన రేణుకని మళ్లీ కలవబోతున్నాను.
విప్లవోద్యమంలో పని చేసిన మహిళా కామ్రేడ్స్ మధ్య తెలియని బంధమేదో అల్లుకుని వుంటుంది. ఈ సమాజం నుంచి ఎన్నో ఎదుర్కొన్నవాళ్లంగా, సమాజ మార్పులో భాగమైనవాళ్లంగా, మా మధ్య అనుబంధమేదో పెనవేసుకుని వుంటుంది. మమేకతేదో మమ్మల్ని ఒక్కటిగా కలిపి ఉంచుతుంది.
గతంలో మిడ్కో కథలు ‘మెట్లమీద’ పేరుతో సంపుటిగా వెలువడ్డాయి. ఇటీవల విరసం ప్రచురించిన ‘వియ్యుక్క’ సంకలనాలు వెలువడే వరకు తను రాసిన అన్ని కథలు వాటిల్లో చోటు చేసుకున్నాయి. ఈ కథలు చదివితే తనేంటో, తన ఆలోచనా రీతి, జీవితం పట్ల తనకున్న స్పష్టత అర్థమవుతుంది.
రేణుక బాల్యం, చదువు…
రేణుక తల్లిదండ్రులు గుమ్మడవెల్లి యశోద, సోమయ్యలు. సోమయ్య సారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు. రేణుకకు ఒక అన్న, ఒక తమ్ముడు. అన్న వెంకటకిషన్ ప్రసాద్ విప్లవోద్యమంలో పని చేసి సరెండర్ అయ్యారు. తమ్ముడు రాజశేఖర్ అడ్వకేట్. మధ్యతరగతి పద్మశాలి కుటుంబం.
రేణుక 1970 అక్టోబర్ లో పుట్టింది. స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి. ప్రాథమిక విద్య కడివెండిలోనే చదివింది. వాళ్ల అమ్మమ్మ ఊరు మోత్కూరులో 8, 9 తరగతులు, 10వ తరగతి దేవరుప్పలలో పూర్తి చేసింది. ఇంటర్ జనగామలో చదివింది. ఇంటర్ అయిపోగానే పెళ్లి చేశారు. కొద్దికాలంలోనే విడాకులు తీసుకున్నది.
విడాకులు అయిన తర్వాత డిగ్రీని దూరవిద్య ద్వారా పూర్తి చేసింది. ఎల్‌ఎల్‌బి తిరుపతిలో చదివింది. ఈ క్రమంలోనే అక్కడి మహిళా సంఘంలో యాక్టివ్‌గా పాలుపంచుకోవడం ప్రారంభించింది. అప్పటికే తన అన్న ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా కొనసాగుతున్నారు. దానికితోడు తనకు జీవితంలో ఎదురైన సమస్యలు. ఈ నేపథ్యంలో తను కూడా విప్లవోద్యమంలో పూర్తికాలం పని చేయాలని నిశ్చయించుకుంది.
అయితే తిరుపతిలో బహిరంగ జీవితంలో వుంటూ యాక్టివ్‌గా పలు పోరాటాల్లో పాల్గొంటూనే కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిని పెళ్లి చేసుకుంది. అప్పటికి సంతోష్‌రెడ్డి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యుడు. పెళ్లి అయిన సంవత్సరంన్నర కాలవ్యవధిలో ఆయన ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. సహచరుడు అమరుడైనా… తన దుఃఖాన్ని బహిరంగంగా పంచుకోలేని స్థితి రేణుకది.
పూర్తి కాలం కార్యకర్తగా…
ఆ తర్వాత కాలంలో రేణుక కార్యరంగం విశాఖకు మారింది. విశాఖలో కౌముది (తరాలపల్లి)తో కలిసి పనిచేసింది. వీరి మధ్య సాహిత్య చర్చలు బాగా జరిగేవి. ఇక్కడి నుంచే బహిరంగ జీవితాన్ని వదిలి దళాల్లోకి వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలైంది. ప్రభాత్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టింది. పార్టీలో రాష్ట్రకమిటీ సభ్యులుగా ఎదిగిన మహిళలు అతికొద్ది మంది. అందులో రేణుక ఒకరు. ఇటీవలనే రాష్ట్రస్థాయి నాయకురాలు ఉర్మిళ అమరురాలైంది. ఇప్పుడు రేణుక.
రేణుక మరణం పార్టీకి, ప్రజలకు తీరని నష్టం. రేణుకది చనిపోయే వయసా? ఇంకా చాలా కాలం బతకాల్సింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. చివరికంటా ఉద్యమంలోనే కొనసాగింది.
చివరగా… మరోమాట
ఒక్కతే అమ్మాయి అవ్వడం వల్లనేమో ఇంట్లో వాళ్లందరికీ రేణుక అంటే విపరీతమైన ప్రేమ. అమ్మకు మరీ ఎక్కువ. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని అత్తింటివారు పెడుతున్న ఇబ్బందులను చూసి యశోదమ్మ (జయమ్మ) తట్టుకోలేకపోయింది. తన కూతురు బతికుంటే చాలని ముందుబడి విడాకులు ఇప్పించిందని విన్నాను. కూతురు విప్లవోద్యమంలోకి పోయినప్పుడు అల్లాడిపోయింది. బిడ్డ చేస్తున్న పని మంచిదే. కానీ కండ్లముందర లేదనే బాధ ఆమెను నిరంతరం వెంటాడింది. ఆ బాధతోనే రేణుక పూర్తికాలం ఉద్యమ జీవితంలోకి వెళ్లిన కొత్తలో… ‘నా బిడ్డను పంపి మీరు బయట బతుకుతున్నారా’ అని రేణుక స్నేహితుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసేది. వెంటనే ‘మీరూ మా చిట్టెమ్మ లాంటి వాళ్లేనమ్మ. తను కండ్ల ముందట లేదన్న బాధతో అట్లన్న’ అని మళ్లీ తనను తాను సముదాయించుకునేది. బిడ్డ రాసిన ఉత్తరాలను పదే పదే చదువుకునేది. హైదరాబాదులోనే వుంటున్నప్పటికి బిడ్డ యాదికి వచ్చినప్పుడు మోత్కూరు వెళ్లేది. ఎందుకంటే బిడ్డ రాసిన ఉత్తరాలను మోత్కూరులో దాచుకునేది. ఊరికి వెళ్లగానే బీరువాలో దాచుకున్న ఉత్తరాలని చదువుకునేది. బిడ్డను ఒక్కసారన్నా కండ్ల చూడాలని ఏండ్లుగా ఎదురుచూస్తోంది యశోదమ్మ. ‘బిడ్డను చూసుకున్న తర్వాత తను వున్నా, సచ్చిపోయినా పర్వాలేదు’ యశోదమ్మ ఎప్పుడూ అనే మాట. ఆ బిడ్డను రేపు చూడబోతోంది అమ్మ.
రేణుక అలియాస్ మిడ్కో అలియాస్ చిట్టెమ్మ రేపు కడివెండి నడిబొడ్డున కాలూనబోతోంది.
రేణూ… నీ తలపులు, నీ ఆశయం ఎప్పటికీ సజీవమే!
రేణుక గురించి పరిచయం అవసరం. అది మీ ద్వారా జరిగింది
గుండె బరువెక్కిపోయింది
చాలా ఆర్ధ్రంగా రాశావురా కరుణా! మనసంతా ఎంతో భారమైపోయింది!