వీరుడు-5

(గత సంచిక తరువాయి భాగం)

7

పోలీసులు మరోమారు దాడికి సిద్ధమైండ్లు.. సాయుధ పోలీసులు కొంతమంది క్వార్టర్స్‌ ముందువైపు, మరికొంతమంది వెనుక వైపుకు పోయిండ్లు. దూరంగా నిలుచున్న పోలీసు అధికారి చేతులు ఆడిస్తూ ఏవో ఆదేశాలు జారీ చేస్తున్నాడు..
ఏం జరుగుతుందోనని జనం ఊపిరి బిగపట్టిండ్లు.. వేలాది మంది జనం గుంపులు గుంపులుగా నిలబడి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అందరి మొఖాల్లో ఏదో విషాదం అలుముకున్నది.
‘‘అశోకన్నను చంపేస్తారా?’’ ఎవడో విషాదంగా అరిచిండు..
‘‘చూడబోతే గట్లనే ఉంది’’
‘‘చంపుడెందుకు అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించవచ్చుకదా’’ మరోకరు అమాయకంగా అడిగిండు…
‘‘దొంగలం.. కొడుకులకు ఏ చట్టం లేదు.. చంపుడే పనిపెట్టుకున్నరు… ఎంతమందిని చంపుతే అన్ని ప్రమోషన్లు మరొకరు కోపంగా అరిచిండు….

సింగరేణిలో పనిచేసే కార్మికులు చాలావరకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినవాళ్ళే.. గ్రామాల్లో దొరల పెత్తనం భరించలేక, బ్రతుకు వెళ్ళక చావో రేవోనని పొట్ట చేతపట్టుకొని వచ్చి బొగ్గుగని కార్మికులైండ్లు. బహుశా ఎప్పటికైనా ఊళ్ళో ఇంత భూమి కొనుక్కోని మళ్ళీ వ్యవసాయం చేసుకొని బ్రతకాలనే ఆశ చాలామంది కార్మికుల్లో ఇంకా అలా ఉండిపోయి ఒక కాలు కాలరీలో ఉంటే మరో కాలు ఊరిలో ఉండేది. పరిస్థితి ఏమి బాగా లేదు… అంతవరదాక దొరల చెప్పుల క్రింద అణిగి మణిగి ఉన్న కూలి నాలి జనం ఒక్కటై సంఘాలు పెట్టుకొని దొరల దోపిడీని ప్రశ్నించే సరికి అంతవరదాక ఎదురు సదురు లేని దొరలు వణికిపోయిండ్లు…

ఇక్కడ కాలరీ ప్రాంతంలో కార్మికులు కూడా అణిగి మణిగి ఉన్నంత కాలం ఎవరికి ఏ బాధ లేదు… ఎప్పుడైతే కార్మికుల్లో చైతన్యం వచ్చి హక్కుల గురించి బొగ్గుబాయి రక్షణల గురించి, అన్యాయం గురించి ప్రశ్నించే సరికి ప్రభుత్వానికి, బాయి దొరలకు మింగుడు పడటంలేదు. ఎట్లాగైన ప్రజలను అణిగి మణిగి ఉంచాలని తమ దోపిడి పీడనలను యదాతదంగా కొనసాగించటానికి ఊళ్ళలోకి, ఇటు కాలరీ ప్రాంతంలోకి సాయుధ బలగాలను పంపించి సాగించిన హింస అంత ఇంత కాదు.. ఇందుకు అటు కాంగ్రెస్‌ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ అన్న భేదం లేదు.. ప్రజలను అణచటంలో పాలక వర్గాలు అన్ని ఒక్కటేనని చరిత్ర మరోసారి రుజువు చేసింది.

ప్రజాస్వామ్యం, తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ సొల్లు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రామారావు అదే చేసిండు, అధికారం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి హైద్రాబాద్‌లో మత కలహాలు సృష్టించి రక్తపుటేర్లు పారించి ముఖ్యమంత్రి అయిన నెదురుమల్లి జనార్థన్‌ రెడ్డి అదే పని చేసిండు. ఇప్పుడు దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నాడు.

జనాలను మాయం చేసి పట్టుకపోయి కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ కట్టు కథలు అల్లడం చూసి చూసి, విని విని జనం విసిగి పోయి ఉన్నారు.
అయితే ఇంతవరదాక విన్నది, చూసింది చాలా తక్కువ కాని ఇప్పుడట్లా కాదు… తమ కండ్లముందే ఎన్‌కౌంటర్‌ జరిగిపోతుంది. అందుకే వాళ్ళు తట్టుకోలేకపోతున్నరు… ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు…
బక్క మొఖం యువకుడొకడు ఏం చెయ్యాలో తెలియని కోపంతో రగిలిపోతూ కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగాడుతున్నాడు.
ఉండీ ఉండీ ఒక్కసారి పెద్ద ఎత్తున నినాదాలు చెలరేగినవి.
‘‘పోలీసుల జులుం నశించాలి’’
‘‘ఎన్‌కౌంటర్‌ను తక్షణమే ఆపివెయ్యాలి’’
‘‘అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలి’’

నినాదాల జోరు పోలీసు అధికారిని కలవరపరిచింది. కంగారు పడిపోయిండు. జనం తిరుగబడితే పరిస్థితులు చెయ్యిదాటి పొయ్యేట్టుందని భావించిండు.. ఏదో గుట్టు చప్పుడు కాకుండా పని ముగించుకొని పోదామనుకుంటే వేలాది మంది జనాలు పోగు పడటం ఆయన ఊహించలేదు.. పైగా జనంకు అంతు లేనట్టుగా ఇంకా జనం తిరుణాళ్ళకు వచ్చినట్టుగా, వస్తూనే వున్నరు. తన చేతిలో ఉన్న ఫోర్స్‌ ఏమో అంతంత మాత్రమే. ఇప్పుడు ఏదైనా జరుగకూడనిది జరిగితే పరిస్థితి చెయ్యిదాటిపోతుందనే భయం పట్టుకున్నది. దాంతో ఆయన కంగారు పడిపోయి జనం దగ్గరికి రాకుండా కంట్రోల్‌ చేయడానికి అటువైపు కొంతమంది పోలీసులను పంపించిండు….
పోలీసులు లాఠీలు ఊపుకుంటూ జనంవైపు కదిలిండ్లు.. అంతవరదాక నినదించిన యువకులు భయం లేకుండా గుర్రుగా చూస్తూ నిలబడ్డారు. పోలీసులు ఏమన్నా అతిగా ప్రవర్తిస్తే అంతకంతకు బదులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు. గొంతువిప్పి ‘‘ఇక్కడ ఎవ్వరూ నినాదాలు ఇవ్వవద్దు.. మీరంత దూరంగా పోవాలి ఏమైనా అయితే మాత్రం మీకే ప్రమాదం’’అంటూ సున్నితంగా హెచ్చరించిండు….
‘‘ఏం చేస్తరు చంపుతరా… చంపే అధికారం మీకు ఎవ్వరు ఇచ్చిండ్లు.. ఏదన్న ఉంటే అరెస్టు చెయ్యాలి కాని ఇలా కాల్చి చంపుతారా’’ అంటూ యువకుడు ఒకడు ఆవేశంగా అరుచుకుంటూ ముందుకు చొచ్చుకొచ్చింది. చెదిరిపోయిన గుబురు వెంట్రుకలు.. పీక్కపోయిన నల్లటి మొఖంలో మండే చూపులు.
మరోసారి అయితే హెడ్డు ఏం చేసే వాడో ఏమో కాని ఉబికి వస్తున్న కోపాన్ని మనసులోనే తొక్కిపట్టి పైకి మాత్రం శాంతాన్ని కొని తెచ్చుకొని ‘‘అటువంటిదేమి జరుగదు.. మీరంత దూరంగా పోవాలి’’ గాల్లో చేతులు ఆడిస్తూ జనాలను హెచ్చరించిండు.

ఇందాకటి యువకున్ని చుట్టుముట్టిన పోలీసులు మెల్లగా అతన్ని తోసుకుంటూపోయిండ్లు. జనం అటూ ఇటూ కదిలిండ్లు. లొల్లి సద్దుమణిగిందని పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో శ్రీరాంపూర్‌ నుండి వచ్చే రోడ్డుకాడ మళ్ళీ లొల్లి మొదలైంది… జనం అటువైపు పరుగులు పెట్టిండ్లు….
అటువైపునుండి వస్తున్న ఒక వ్యక్తిని ఆపి ‘‘అక్కడ ఏం జరుగుతుంది?’’ అని అడిగాను.
‘‘ఓ ముసల్ది లొల్లి పెడ్తాంది’’ అన్నాడతను
‘‘ముసల్దా?’’ అన్నాను ఆశ్చర్యంగా
‘‘అవును’’
‘‘ఎందుకటా?’’
‘‘ఇది ఊరా అడివా? కొడుకును అట్లెట్ల సంపుతరు అంటాంది’’ అంటూ క్షణ కాలం నిలబడిపోయి సమాధానం ఇచ్చి మళ్ళి ముందుకు కదిలిండు..
నాలో ఆసక్తి కల్గింది. ‘‘ఏం జరుగుతుందో చూద్దాం పద’’ అంటూ మిత్రులతో కలిసి అటువైపు కదిలాం….

మేము అక్కడికి పొయ్యేసరికి పోలీసులు అప్పటికే ఆ ముసల్దాన్ని ఆమెతో పాటు ఉన్న ఐదార్గురు ఆడవాళ్ళను చుట్టేసి ఉన్నారు…వారికి కాస్త దూరంలో నిలబడి ఉన్న జనాలను ముందుకు రాకుండా మరికొంతమంది పోలీసులు ఆపుతున్నారు.
ఆ ముసల్దానికి దాదాపు అరువైఏండ్ల పైబడి వయసు ఉంటది కావచ్చు. సగం నెరిసిన తల రేగిపోయి ఉంది. తెలంగాణ సంప్రదాయమైన గోచికట్టు చీర, వేసుకున్న రవిక ఏ రంగో తెలియనంతగా ఎలిసిపోయి ఉంది.. ఎండిపోయిన చాతికి అచ్చాదనగా కొంగు చుట్టుకొని ఉంది. చెంపలు తేలిన బక్క మొఖంలో ఆవేశం కమ్ముకున్నది. సూటిగా స్థిరమైన చూపులతో తనముందు నిలిచిన యస్సైని నిలదీస్తున్నది. ఆమె వెన్నంటి ఉన్న స్త్రీలు కూడా ఆమెంత వయసు లేకున్నా ఆమెలాగే పల్లెటూరి మనుషుల్లా ఉన్నారు… అందులో ఒకామె సంకన చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు.. ఇక్కడ జరుగుతున్న విషయం తెలిసి ఉన్నఫలంగా పరుగున వచ్చినట్టున్నారు. ఆవేశం తప్ప వాళ్ళ మొఖాల్లో ఎక్కడ భయమన్నది లేదు.

చాలావరకు బొగ్గుగని కార్మికులుగా వచ్చినవాళ్ళు పల్లెటూరు వాళ్ళు… వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కాలరీకి వచ్చినవి. అక్కడ పల్లెటూర్లో ఏది ఉన్నా లేకున్నా ఒక పచ్చటి విశాలమైన ప్రపంచం ఉంటుంది. చేను చెలుకలు, చెట్లు, పక్షుల కిల కిల రావాలుంటాయి. ఈ కులం ఆ కులమని పట్టింపు లేకుండా వరుసలు పెట్టి పిలుచుకునే ఆత్మీయ బంధాలుండేవి. కాలరీ ప్రాంతం అందుకు భిన్నమైంది…

గుది గుచ్చినట్టుండే మురికి కూపాల్లాంటి కార్మిక బస్తీల్లో, అట్ట పెట్టెలతో, తడుకలతో కట్టుకున్న గుడిసెల మధ్య బొగ్గు పోయ్యిలు ఎగజిమ్మె విషవాయువుల మధ్య ఊపిరి సలుపేదికాదు. నీళ్ళకు నిప్పులకు, పిల్లల చదువులు, ప్రతిది సమస్యే. దానికితోడు బొగ్గుబాయి కార్మికులు మూడు షిప్టుల్లో పని చేయాల్సి వస్తుంది. కార్మికుల షిప్టులకు అనుగుణంగా స్త్రీలు కూడా తమ దినచర్యను మార్చుకోవాల్సి వచ్చేది. చాలీ చాలని జీతాలు, వాటికి తోడు వాడ వాడన వెలిసిన ప్రభుత్వ సారా కొట్లు కార్మికుల ఇళ్ళు ఒళ్ళు గుల్లచేసేవి. ఇలా ఏండ్లకు ఏండ్లు గడిచే సరికి బ్రతుకు పెనం నుండి పొయ్యిలో పడ్డటయ్యేది. ఎక్కడికిపోయినా, ఏడేమానికలు అన్నట్టు ఆశలన్నీ కుప్పకూలి పోయే. చివరికి చీకేసిన బొక్కలా బ్రతుకులు తెల్లారి పోయేవి.

ఇటువంటి చీకటి బ్రతుకుల్లోకి వెలుగు రేఖలు తీసుకొచ్చిన వాళ్ళు రాడికల్‌ పిల్లగాండ్లు… గుడిసె గుడిసెకు తిరిగి అవ్వా, అక్కా అంటూ ఆత్మీయంగా పలకరించేవాళ్ళు, పెట్టింది తిని, వాళ్ళలో ఒక్కరుగా కలిసిపోయి వాళ్ల మనసులను చూరగొన్నారు.. వాళ్ళ కడుపుల బాధలు విన్నారు… ఓపిగ్గా బాధలు పోయే మార్గాలు అర్థం చేయించిండ్లు…. తమ బ్రతుకులు ఇంతేనని సర్దుకుపోయి భయం భయంగా బ్రతికేటోళ్ళను అగ్ని కణాలను చేసిండ్లు… తాగేందుకు గుక్కెడు నీళ్ళు కావాలని, ఒక సంకన పిల్లగాండ్లను వేసుకొని మరో చేత ఖాళీ కుండలు పట్టుకొని గంటల తరబడి స్థానిక ఆఫీసులను దిగ్భంధనం చేసిండ్లు… పోలీసు లాఠీలకు ఎదురు నిల్చిండ్లు.. మదాంధకారుడైన పర్సనల్‌ ఆఫీసర్‌ కొడుకు కార్మికుని భార్య అయిన రాజేశ్వరిని చెరిచి హత్య చేసిన సందర్భంలో వీధుల్లోకి వచ్చి స్త్రీ జరిపిన పోరాటం వీరోచితమైంది. పోలీసుల లాఠీలు తూటాలు కూడా వారిని ఆపలేకపోయాయి. ఆనాటి వారి పోరాటం అసెంబ్లీని కుదిపేసింది. ఒక్కటా రెండా ఎన్నని చెప్పేది.. కార్మికుల ఇళ్ళు వొళ్ళు గుల్ల చేసి వారి కుటుంబాలను పీల్చి పిప్పిచేస్తున్న సారా వ్యతిరేక పోరాటంలో ముందు భాగాన నిలిచి వాళ్ళు జరిపిన పోరాటం అంతా ఇంతా కాదు. చివరికి ప్రభుత్వం పోలీసు స్టేషన్లను సారా కొట్లుగా మార్చి అమ్మకాలు సాగించిందంటే మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఎంత ఉవ్వెత్తున సాగిందో అర్థం చేసుకోవచ్చు…

చాలీ చాలని బ్రతుకులు, మానవ కనీస అవసరాలు నోచుకోక నిత్యం సమస్యలతో సతమతమయిపోతు భయం భయంగా బ్రతుకే ఈ సామాన్య స్త్రీలే అంత వీరోచిత పోరాటాలు జరిపిండ్లంటే ఆశ్చర్యం కలుగక మానదు.
ఇప్పుడు అదే స్త్రీలు రణరంగం లాంటి యుద్ధ వాతావరణంలో నిలబడి గయ్యర గయ్యరమంటూ నిలదీయటం పోలీసులకు మింగుడు పడటం లేదు.

పోలీసులకు నాయకత్వం వహిస్తున్న కుర్ర యస్సై కోపంతో రగిలిపోయిండు… కాని ఎటువంటి భయం బెరుకు లేకుండా తమ ముందు నిలిచిన ఆ ముసల్దాని చూపులు తట్టుకోలేకపోతున్నాడు.. మరోసారి అయితే ఏం చేసేవాడో ఏమో కాని ఇప్పుడు కోపాన్ని దిగమింగుకొని మొఖం మీదికి శాంతాన్ని తెచ్చుకొని.. ‘‘మీకు మరోసారి చెప్పుతున్న… మీరంత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి’’ అన్నాడు…
‘‘మేం ఎందుకు పోవాలి మీరే పోండ్లీ’’ రివ్వున బాణంలా ముందుకు వచ్చిన స్త్రీ ఒకతి అరిచింది.
‘‘మేమంత వెళ్ళిపోతే బంగారం అటువంటి కొడుకును చంపుతారా! చంపే అధికారం మీకు ఎవడిచ్చార్రా! చంపేదుంటే ముందుగా మమ్ముల్ని చంపుండ్రీ’’ ముసల్దీ నిలదీసింది.
యస్సైకి ఏం చెయ్యాలో అర్థంకాక నిలువు గుడ్లేసుకొని మౌనంగా ఉండిపోయిండు.
‘‘ఏం ముసల్దానా ఏందో మంచి మాటకు చెప్పుతాంటే నీకేమి అర్థం కాదా! ఒక్కటి ఇచ్చుకుంటే రోగం కుదురుద్దీ’’ అంటూ కోపానికి వచ్చిన జవాను ఒకడు చేతిలోని తుపాకిని మర్లేసిండు…

ముసల్ది గయ్యిన ఆ పోలీసోని మీదికి లేచింది. ‘‘ఏందిరా కొడ్తవా కొట్టు చూద్దాం. ఎవ్వని సొమ్ము తిన్నమని కొడ్తవు.. మంది సొమ్ము తిని బ్రతికేటోళ్ళకు గులాంగిరి చేసుకుంటూ బ్రతికే టోడివి… మా మీద ఎగురుతానవు… ఏం పాపం చేసిండని మా కొడుకును చంపటానికి వచ్చిండ్లు… ఏంటీ మీ జులుం.. ఎంతకాలం సాగిస్తరు..’’ అంది.
‘‘ఏయ్‌ ముసల్దానా ఎక్కువ మాట్లాడకు’’ చిరాకు పడ్తూ పోలీసు వాడొకడు అరిచిండు…
‘‘అరేయ్‌ మాట్లాడేది ఏందిరా! నా కొడుకును ఒక్కన్ని చేసి చంపటానికి మందలెక్క తుపాకులు ఏసుకొని వచ్చిండ్లా…. అయినా కొడుకు చంపేంత తప్పేమి చేసిండు?’’ అంటూ కోపంతో ఊగిపోతున్నది..

అక్కడున్న పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.. ముందుకు రాకుండా ఆపటానికి నానా తంటాలు పడుతున్నరు…
అప్పటి వరకు మేము రోడ్డు చివర నిల్చోని ఉన్నాం… ఒక విప్లవకారుని పట్ల ఆ అవ్వకు ఎందుకంత ప్రేమ.. ఎటువంటి బంధం ఇది… అవును దగ్గరి దాక పోయి చూడాలనే ఆసక్తితో జనాన్ని పాపుకుంటు ముందుకు పోయాను…
అప్పటికింక వాళ్ళు తమను ఆపటానికి ప్రయత్నిస్తున్న పోలీసులతో ఘర్షణ పడుతూనే ఉన్నారు.
దగ్గరదాక పోయి చూసిన నాకు ఆ అవ్వను ఎక్కడో చూసిన అన్పించింది. కాని ఎక్కడ చూసింది వెంటనే గుర్తుకు రావటం లేదు. ఆఁ గుర్తుకు వచ్చింది….
బహుశా పందొమ్మిది వందల తొంభైలో అనుకుంటాను. అప్పటికి సింగరేణి ఆవిర్భవించి వంద సంవత్సరాలు దాటింది. సింగరేణి చరిత్రలో ఎన్నడులేని విధంగా అశోక్‌ ఆర్గనైజేషన్‌ చేసే శ్రీరాంపూర్‌ ఏరియాలో కంపెనీ కొత్తగా కట్టించిన నాలుగు వందల పై చిలుకు క్వార్టర్స్‌ను కార్మికులు అక్రమంగా ఆక్రమించుకున్నారనే వార్త తెలిసింది.

నిజంగా అది సంచలన విషయమే. ఎందుకంటే కార్మికుల్లో నూటికి తొంబై శాతం మందికి కంపెనీ ఎటువంటి క్వార్టర్‌ సౌకర్యం కల్పించలేదు… ఉన్న కొద్ది క్వార్టర్స్‌ కూడా క్లర్క్‌లు, బావుల్లో సూపర్‌వైజర్‌ పనులు చేసే మైనింగ్‌ స్టాప్‌ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బొగ్గు బావుల్లో మొద్దు కష్టం చేసే ఫిల్లర్స్‌ వంటి మెజార్టీ కార్మికులకు పాతిక ముప్పయేండ్లు పని చేసినా క్వార్టర్‌ దొరికేది కాదు. దాంతో వాళ్ళంత కార్మిక బస్తీలలోనే నివసించేవాళ్ళు, ఏ సౌకర్యాలు లేకుండా బురద గుంటలాంటి కార్మిక బస్తీలలోనే వాళ్ళ జీవితాలు గడిచిపోయేవి…

ఎనభై దశకం తరువాత కార్మికుల్లో చైతన్యం పెరిగి కార్మిక బస్తీలలో సౌకర్యాలు మెరుగు పరచాలనే ఆందోళనలు సాగినవి. పెద్ద ఎత్తున స్త్రీలు వీధుల్లోకి వచ్చి స్థానిక జియం ఆఫీసుల ముందు గంటల తరబడి ఆందోళనలు చేసిండ్లు. ఫలితంగా పరిస్థితి కొంత మెరుగైంది. అటు తరువాత కంపెనీ స్థలాలను ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు…
అటువంటి పోరాటం ఒకటి 1989 మార్చి నెలలో శ్రీరాంపూర్‌ ఏరియాలోని అర్కెసిక్స్‌ కాలనీ వద్ద కంపెనీకి సంబంధించిన రెండు వందల ఎకరాల భూమిని ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారు. అక్కడి నుండి వారిని తొలగించటానికి ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి కంపెనీ సకల ప్రయత్నాలు చేసింది. చివరికి జాతీయ సంఘాలను కూడా కలుపుకొని ప్రయత్నించింది. కాని సాధ్యం కాలేదు.

ఆ రోజుల్లో ఇటువంటి పోరాటాలు పెద్ద ఎత్తున సాగినవి. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌లోని గోదావరిఖని ప్రాంతంలో జరిగినవి. ఆక్రమించుకున్న ప్రాంతాలకు అమరుల పేరు మీద కార్మిక బస్తీలు వెలిసినవి. కాని, కంపెనీ చరిత్రలో మొదటిసారి కొత్తగా కట్టించిన క్వార్టర్స్‌ను, కంపెనీ ఇంకా అలాట్‌మెంట్‌ చెయ్యక ముందే ఇంత పెద్ద ఎత్తున కార్మికులు ఆక్రమించుకొని కుటుంబాలతో సహా తిష్టవేయటం ఎవ్వరు ఊహించనిది. గతంలో అయితే ఎక్కడైనా ఒకటి అరా క్వార్టర్స్‌ ఇల్లీగల్‌ ఆక్రమణ జరిగితే కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ డిపార్టుమెంటు వాళ్ళు వచ్చి బోళ్ళు బొచ్చెలు బయట వేసి క్వార్టర్‌ ఖాళీ చేయించే వాళ్ళు… సెక్యూరిటీ డిపార్టుమెంటు వాళ్ళు వస్తున్నారంటెనే కార్మికులు భయపడి పోయ్యేవాళ్ళు, కాని ఇప్పుడు సెక్యూర్టీ డిపార్టుమెంటు కాదు కదా! సిఐయస్‌ఎప్‌ జవాన్లు వచ్చినా ఖాళీ చెయ్యటం లేదని అక్కడ పెద్ద లొల్లి జరుగుతుందని తెలిసి జర్నలిస్టులకు సహజంగా ఉండే కుతుహలం కొద్ది అక్కడికి పరుగుపెట్టాను…

నేను అక్కడికి చేరుకునే సరికి ఉద్రిక్త వాతావరణం ఉంది.. వందలాది మంది పోగైండ్లు… అందులో ఎక్కువ శాతం మంది స్త్రీలు ఉన్నారు… ఆందోళనలో మగవాళ్ళు ముందుంటే కంపెనీ దృష్టిలో పడుతమనో, పోలీసుల దృష్టిలో పడుతామనో తద్వారా వేధింపులకు గురి కావాల్సివస్తుందనో ఏమోకాని ఆ పోరాటంలో ముందు వరుసలో స్త్రీలు నిలబడిండ్లు…
ఒకవైపు వందలాదిమంది పోలీసులు.. అందులో కంపెనీ సెక్యూరిటీ సిబ్బందే కాకుండా, సిఐయస్‌ఎఫ్‌ జవాన్లు, వాళ్ళకు సపోర్టుగా వచ్చిన సివిల్‌ పోలీసులకు ఎదురు బదురుగా నిలబడి ఒక్క అడుగు కూడా ముందుకు రాకుండా నిలబడ్డ స్త్రీలు గయ్యర గయ్యర అరుస్తున్నారు…

ఎర్రటి బక్క మొఖం పర్సనల్‌ అధికారి ఒకరు.. ఓపికంతా కూడా దీసుకొని ‘‘అమ్మా ఇట్లా ఇల్లీగల్‌గా క్వార్టర్స్‌ ఆక్రమించుకోవటం నేరం… మీరు మర్యాదగా ఖాళీ చెయ్యండి… కంపెనీ సీనియార్టీ ప్రకారం క్వార్టర్స్‌ అలాట్‌ చేస్తుంది. లేకుంటే పరిస్థితులు సీరియస్‌గా ఉంటాయి’’ అంటూ హెచ్చరించిండు…
‘‘ఏందయ్య ఏమో బాగా చెప్పుతానవు’’ అంటూ ఒక గొంతు గయ్యిమంది….
అప్పుడు మొదటిసారి ఆమెను చూసాను… సగం తెల్లబడిన చింపిరి తల, భయం బెరుకు లేకుండా సూటిగా నిలదీస్తున్నట్టుగా చూపులు….
‘‘దొర నీవు కొలువుకురాంగనే నీకు కంపెనీ సకల సౌకర్యాలతో క్వార్టర్‌ ఇస్తుంది.. ఇంటిముందో నల్లా ఇంటి వెనుకో నల్లా, ఇంట్లో అర్ర అర్రకు నల్లాలు పెడ్తది.. నల్ల గిట్ల ఇప్పగానే అట్లా బల బల నీళ్ళు వస్తయి… మాకు తాగెందుకు నీళ్ళు కూడా ఉండవు… కంపెనీల నువ్వే పని చేస్తానవా? మావోళ్ళు పని చెయ్యటం లేదా? పుట్టెడు బండ క్రింద గుక్కెడు నీళ్ళు తాగుతు ప్రాణాలు ఫణంగా పెట్టి బొగ్గు తీస్తే మాకేమి ఇచ్చిండ్లు… ఏం సౌలత్‌ చూసిండ్లు… ముప్పయేండ్లు పని చేసి నా పెనిమిటి చీకేసిన బొక్క తీర్గ అయిపోయి, బొక్కలు తేలి నవిసి నవిసి సచ్చిండు. ఇప్పుడు నా కొడుకు బాయి పని చేస్తాండు.. వాని బ్రతుకు అంతే కావాల్నా? లేబరోడు మనిషి కాదా? వానికి సౌలత్‌ ఉండవద్దా? మీ లెక్క మేం కాదా’’
పర్సనల్‌ అధికారికి ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్ళు నమిలిండు ‘‘అది కాదమ్మ’’… అంటూ ఏదో చెప్పబోయిండు…
కాని ఇంతలో పొట్ట తేలి కాస్త లావుగా ఉన్న సిఐయస్‌ఎఫ్‌ అధికారి చిరాకు పడిపోతు ‘‘సార్‌ వీళ్ళకు మంచిగ చెప్పితే వినరు.. ఈడ్చి పారేస్తే కాని రోగం కుదరదు’’ అన్నాడు కటువుగా… ముసల్ది సిఐయస్‌ఎఫ్‌ అధికారి మీద విరుచుకు పడింది.
‘‘ఏందయ్యో బాగా లావు మాట్లాడతానవు… భుజం మీద తుపాకి వేసుకొని లాఠీలు ఊపుకుంటూ తిరిగటోనివి… అదిరించి బెదిరించి బ్రతికేటోనివి నీకెట్లా తెలుస్తది. మా కష్టం నిన్నగాక మొన్న వచ్చిన మీకు వచ్చిరాంగానే కంపెనీ క్వార్టర్స్‌ ఇచ్చింది. మీరు ఆడుకోను క్లబ్‌లు కట్టించింది.. ఏం చేసినోడివి? ఎప్పుడైనా బొగ్గు బాయిలకు తొంగిచూసినోడివా? తట్టెడు బొగ్గు ఎత్తినోడివా? నువ్వు ఇట్లా లాఠీలు ఊపితే భయపడటానికి ఇక్కడ ఎవ్వరు లేరు… మేం సచ్చినా క్వార్టర్స్‌ ఖాళీ చెయ్యం.. ఏం చేస్తరో చేసుకోండ్లీ’’ అంది కోపంగా….

సిఐయస్‌ఎఫ్‌ అధికారి కోపంతో రగిలిపోయిండు. ‘‘ఏయ్‌ ముసల్దానా? ఎక్కువ మాట్లాడుతానవు’’ అంటూ లాఠీ ఎత్తిండు. కాని పర్సనల్‌ అధికారి పరిస్థితి చెయ్యిదాటి పోతుందని వారించిండు…
బక్క పలుచగా ఉన్న స్త్రీ ఒకతి ముందుకు వచ్చి, ‘‘ఇది కంపినోనికి మాకు మధ్య గొడవ మధ్యల నీ పెత్తనం ఏందీ?’’ అంటూ నిలదీసింది.
అక్కడున్న స్త్రీలంత గయ్యి గయ్యిమని లేచే సరికి అధికారి చిరాకుపడుతూ మెల్లగా జారుకున్నాడు.

ఆ రోజు వందలాది మంది పోలీసులతో వచ్చి కూడా కంపెనీ క్వార్టర్స్‌ కాళీ చేయించలేకపోయింది. అటు తరువాత క్వార్టర్స్‌ ఆక్రమించిన వారిని డిస్మిస్‌ చేస్తామంటు చార్జీషీటు ఇచ్చింది.. దానికి వ్యతిరేకంగా సికాస రమాకాంత్‌ సమ్మె పిలుపు ఇచ్చిండు.. శ్రీరాంపూర్‌ ఏరియాలోని అన్ని బావులు ఇరువై రోజులు సమ్మె చేసిండ్లు.. చివరికి మేనేజుమెంటు దిగివచ్చి సీనియార్టీ ఉన్న కార్మికులకు క్వార్టర్స్‌ ఇస్తామని, జూనియర్‌ కార్మికులకు ఇండ్ల స్థలాలు చూయించి గుడిసెలు వేసుకోవటానికి పదివేలు లోను ఇవ్వటానికి ఒప్పుకోవటంతో సమ్మె ముగిసింది.
ఆ విధంగా ఆమె నన్ను మొదటి సారి ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి ఆమె ఈ రూపంలో దర్శనమిచ్చింది.
స్త్రీలను ముందుకు రాకుండా పోలీసులు నానా తంటాలు పడుతుండగానే మరోవైపు పటపటమంటూ పోలీసుల కాల్పుల శబ్ధం వినిపించింది. దాంతో అందరిదృష్టి అటువైపు మళ్ళింది.
‘‘అన్నను చంపుతాండ్లు’’ ఎవరో ఉద్విగ్నం ఆపుకోలేక బాధగా అరిచిండు…
‘‘వీళ్ళింట్ల పీనుగెల్లా కొడుకును చంపుతాండ్లు’’ అంటూ ఇందాకటి ముసల్ది రెండు చేతులతో నొసలు కొట్టుకుంటూ పెద్దగా రోదిస్తూ శాపనార్థాలు పెట్టింది.
జనం ఊపిరి బిగబట్టి కాల్పులు జరుగుతున్న క్వార్టర్‌ కేసి దృష్టి మళ్ళించిండ్లు…
ఎవరో యువకుడు ఆవేశం ఆపుకోలేక ‘‘అశోకన్న అమర్‌ హై’’ అంటూ నినదించిండు.
వందలాది మంది వంత పాడిరడ్లు..
‘‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’’
‘‘ఎన్‌కౌంటర్లు అన్ని పోలీసు హత్యలే’’

నినాదాల జోరు ఎత్తింది.. నిలువు గుడ్లేసుకొని చూడటం తప్ప పోలీసులు ఏం చెయ్యలేక పోతున్నరు. వేలాదిగా జనం అన్ని వైపులా చుట్టేసి ఉన్నరు..
వచ్చిన జనంలో చాలామందికి విప్లవకారులతో బహుశా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది.. తమ కండ్ల ముందే తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తిని హత్య చేస్తున్నప్పుడు ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో వాళ్ళంతా కొట్టు మిట్టాడుతున్నారు. ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. తిట్టే వాళ్ళు తిడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో జనం ముందుకు తోసుకొని వస్తున్నరు. పోలీసులు జనం ముందుకు రాకుండా ఆపటం వశమైతలేదు. ఇంకా వస్తూనే ఉన్నారు. జనాలకు అంతుపొంతు లేదు.

ఏదో తెలియని బాధ మనుసును కమ్మేసింది. ఏవో జ్ఞాపకాలు చుట్టు ముట్టి మనసు భారమైంది. మందిని పాపుకుంటూ మరికాస్త ముందుకు పోయాను.
క్వార్టర్‌ వెనుకవైపున ఉండే కాంపౌండ్‌ గోడకు రెండు వైపుల పోలీసులు తుపాకులు పొజిషన్‌లో తీసుకొని భయం భయంగా తలలు ఎత్తి పిట్టగోడ మీదుగా తొంగి చూస్తున్నారు. కాని అటువైపు నుంచి అలికిడి లేదు.

క్వార్టర్‌కు ఉన్న తలుపులు కిటికీలు అన్ని మూసేసి ఉన్నాయి. అశోక్‌ లోపల ఎక్కడ ఉన్నది అర్థం కావడం లేదు.
చప్పున నాకు అశోక్‌ నాయకత్వంలో జరిగిన నాల్గవ వేజు బోర్డు సమ్మె గుర్తుకువచ్చింది.

(మిగతా భాగం వచ్చే సంచికలో…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply