(గత సంచిక తరువాయి)
జవాన్లు మా చుట్టు చేరి ‘‘పదండి సార్ పదండి’’ అంటూ ముందుకు తోసిండ్లు…..
చేసేదేమి లేక మేము వెనక్కి తిరిగినం
ఆగయ్య ఏదో అసహనంగా గుణిగిండు..
ఉన్న ఒక్క ఆశ అడుగంటిపోయేసరికి మనసులో నిస్సహాయత ఆవరించింది. యాంత్రికంగా అక్కడి నుంచి వచ్చి రోడ్డు వద్ద ఉన్న ఒక చెట్టు నీడకు చేరుకున్నాం.
జనం ఎక్కడికి అక్కడ గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నరు. ఉత్కంఠ నెలకొన్నది.
మేం నిలుచున్న చెట్టు నీడనే ఒక ప్రక్కన కుర్చీలో ఒక వ్యక్తి తుంటి వరకు సిమెంటు పట్టి వేసుకుని కూచున్నడు. అతని ప్రక్క అతని భార్య నిలబడిపోయి బీరిపోయి చూస్తాంది…. వాళ్ళ చుట్టూ మూగిన వాళ్ళు వారితో ఏదో మాట్లాడుతున్నరు.
తెలిసిన కార్మిక మిత్రుడు ఒకరు నా దగ్గరికి వచ్చి.. వారికేసి చూయిస్తూ ‘‘అన్న ఐదవ నెంబర్ క్వార్టర్ వాళ్ళదే’’ అంటూ అటువైపు చూయించిండు.
‘‘గొల్ల శంకరయ్య ఆయనేనా?’’ అని అడిగాను
‘‘ఆయనే’’
‘‘సరే ఒకసారి మాట్లాడుదాం పద’’ అంటూ వారికేసి నడిచాం… గొల్ల శంకరయ్య కూడా ఆయన నన్ను గుర్తు పట్టినట్టుంది. ఎందుకంటే నేను జర్నలిస్టుగా చాలామంది కార్మికులకు తెలుసు…
నన్ను చూసి కుర్చిలో కూచోనే రెండు చేతులు జోడించి నమస్కరించిండు. ప్రతిగా నమస్కరించి ‘‘ఏం జరిగిందన్నా?’’ అన్నాను. ఆసక్తిగా…
ఆయన భార్య మౌనంగా నిలుచోని ఉన్నది. ఊహించని సంఘటన ఆమె ఇంకా తేరుకున్నట్టు లేదు… ఆందోళనగా ఉంది.
గొల్ల శంకరయ్య చెప్ప సాగిండు.
‘‘నేనెమో బాయిల దెబ్బతాకి సిక్కులఉన్నా. కాలు కదుపత నిస్తలేదు. మా ఆవిడేమో ఇంట్ల పనిలో ఉంది. బయట లొల్లయితాంది.. ఏం జరుగుతాంది అని అంటే మా ఆవిడ చూసి వచ్చి ఏందో బాగా పోలీసులు వచ్చిండ్లు ఎందుకోసమో ఏమో? నిరంజన అక్క ఇంటిముందున్నరు అంది.. నేనేమో బయటికి పోయి చూసేటట్టు లేదు… మా ఆవిడకేమో ఏం తెల్వదు.. అప్పటికే పోలీసోల్లు ఇంటి ముందు ఉన్నరు. బయిటికి పొయ్యేటట్టులేదు.. ఇంట్లా ఉండేటట్టు లేదు… బయట ఏం జరుగుతాందో ఏమో తెలుస్తలేదు.. ఏం చేస్తామని ప్రాణాలు బిగపట్టుకొని ఉన్నం… కాసేపటికి పట పటమంటూ తుపాకి కాల్పుల చప్పుడ్లు విన్పించినయి. ఏదో జరుగకూడనిదే జరిగింది అనుకుంటాన. ఇంతలోకే అశోకన్న వెనక తలుపు తోసుకొని ఇంట్లకు ఉరికి వచ్చిండు…’’ అంటూ ఆవేదనతో గుటుకలు మింగి మళ్ళీ చెప్పసాగిండు.
‘‘బయటనేమో పోలీసులు కమ్ముకున్నరు. మరోవైపు అశోకన్న లోపలికి వచ్చిండు.. మరోసారి అయితే ఎట్లుండెదో ఏమో కాని అప్పటికి పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరుపుతుండటంతో అశోకన్నను చూసి ఏం చెయ్యాలో తెలియక భయపడ్డాం..’’ అంటు క్షణమాగిండు…
మేం భయపడ్తాంటే చూసి అశోకన్న ‘‘శంకరన్నా నువ్వేమి భయపడకు, పోలీసు వాళ్ళు చుట్టుముట్టిండ్లు ఇప్పుడో ఇంకాసేపటికో కాల్పులు జరుపుతారు. వాళ్ళో నేను తెల్చుకుంటా కాని మధ్యలో మీకు ప్రమాదం అయితది… కాబట్టి నేనే ఏం చెప్పుతానంటే అక్కా నువ్వు తలుపులు తీసుకొని బయటికి పోండ్లీ.. మీరు బయటికి పోయినంక నేను తలుపు వేసుకుంటా’’ అన్నాడు…‘‘ అన్నా నేను కదల లేకుండా ఉన్న కదా అంటే సరే నేను ఒక దిక్కు అక్క ఒక దిక్కు పట్టుకొని మెల్లగా తలుపు దాక తీసుకపోతం తరువాత మెల్లగా బయటికి పో’’ అని ఉపాయం చెప్పి నన్ను తలుపుదాక మోసుకొచ్చిండు.. మెల్లగా తలుపు తీసుకొని మేం ఇట్లా బయటికి కాలు పెట్టినమో లేదో అన్న లోపలి నుండి తలుపు పెట్టుకున్నడు.’’ అంటూ ఉద్విగ్నం ఆపుకోలేక పటపటమంటు కన్నీరు కార్చిండు…
తమ స్వార్థం కోసం ప్రక్కవాని ప్రాణం తియ్యటానికైన వెరువని ఈ సమాజంలో తన ప్రాణం పోయినా ఫర్వాలేదు, మరోకరికి హాని జరుగకూడదని భావించిన అశోకన్న త్యాగం ఎంత ఉన్నతమైంది…
మనసు ద్రవించింది.
జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. జనానికి అంతులేకుండా ఉంది. నస్పూర్ రోడ్డు, రామక్రిష్ణాపూర్, శ్రీరాంపూర్, నుండి వచ్చే రోడ్లన్నీ సందడిగా ఉన్నాయి. ఎవ్వరి మొఖంలో చూసిన ఏదో విషాదం గూడుకట్టుకొని ఉంది.. యువకులు కోపంతో ఏం చేయలేని నిస్సహాయతతో రగిలిపోతాండ్లు.
ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో పిల్లలు పెద్ద వాళ్ళ కాళ్ళ సందులో నుండి దూరి మరింత ముందుకు పోతున్నరు. పెద్దవాళ్ళు వారిని వారించే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు. అందరు చేష్టలు ఉడిగిపోయి నిస్సహాయంగా చూస్తూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు…..
‘‘ఇదేం అన్యాయం? ఇంతమంది చూస్తాంటే ఓ మనిషిని చంపుతారా? ఇది ఊరా అడవా?’’ అంటూ ఓ పెద్దమనిషి వాపోయిండు.
‘‘అవును ఇది అడివే ఇక్కడ నీతిలేదు రీతిలేదు… తుపాకి రాజ్యం నడుస్తాంది’’ అన్నాడు మరొకరు కోపంగా..
‘‘అరే ఇంట్ల ఉన్న ఒకన్ని పట్టుకోవటానికి ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇన్ని తుపాకులు ఎందుకు?’’ అన్నారొకరు ఆశ్చర్యంగా.
‘‘మంచిలేదు చెడు లేదు…. ఏమి మాట్లాడేటట్టు లేదు… ఊళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పోలీసోళ్ళకు పట్టపగ్గాలు ఉంటలేవు’ అంటూ ఓ కార్మికుడు వెనక్కి చేతులు కట్టుకొని భారంగా నిట్టూర్చి చెప్పసాగిండు.
‘‘మొన్న ఇంటికి పోదామని ఊరెళ్లితే ఊరంత గెబ్బడ పాలయి ఉంది. ఊళ్ళో ఒక పొరగాడు లేడు. ఏమైందో అర్థం కాక మా చిన్నను అడిగితే మూడు రోజుల క్రింద బక్క సాయిలు కొడుకును ఇంట్ల పండుకున్న వాన్ని ఆయన కండ్లముందే పట్టుకపోయి అదే రోజు గుట్టకు కాల్చి చంపిండ్లట… పోరడు మంచి ఉషారుండే… సాయిలు నేను ఒకే ఈడు వాళ్ళం… చిన్నప్పుడు కలిసి తిరగే వాళ్ళం.. నేను వచ్చి గీ బాయిల పడ్డ. వాడు ఎద్దు ముడ్డి పొడుసుకుంటూ చావలేక బతుకుతాండు….’’ అంటూ క్షణమాగిండు.
‘‘వానికి ఒక్కడే కొడుకు ప్రాణ ప్రాణంగా బాగా చూసుకునేటోడు… ఉన్న ఒక్క కొడుకును పోలీసోల్లు కండ్ల ముందే చంపే సరికి మనిషి పూర్తిగా ఎట్లనో అయిపోయిండు’’ గతాన్ని తలుచుకొని బాధపడ్డడు.
‘‘అంతటా గట్లనే ఉన్నదే కొమురన్న’’ అన్నడు మరొకరు సానుభూతిగా.
జనం తలో మాట మాట్లాడుకుంటాండ్లు.
తెల్ల బట్టలు వేసుకున్న మైనింగ్ సర్దారు ఒకరు భారంగా నిట్టూర్చి చెప్ప సాగిండు.
‘‘ఎన్టిగాడు బొగరి వేషాలు వేసి అది చేస్తా ఇది చేస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినంక రిజర్వు పోలీసోల్లను దింపి ఉత్తోన్ని పచ్చోన్ని అనకుండా చంపి ఆగంచేసిండ్లు. ఇట్లయితే లాభం లేదని కాంగ్రెసును గెలిపిస్తే చెన్నారెడ్డి నాల్గు రోజులు మంచిగనే ఉండే… మళ్ళీ ఏమైందో ఏమో చెన్నారెడ్డిని దించి నెదురుమల్లి జనర్దన్‌రెడ్డి వచ్చే…. వాడు అధికారంలోకి వచ్చి రాంగానే మళ్ళీ విరుచుకపడ్డడు. నిషేధం అన్నడు. ఊరూర క్యాంపులు పెట్టి నెత్తురు పారించి ఎన్టీ గానికంటే ఎక్కువ జులుం చేసే. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాళ్ల ఉచ్చతొక్కిండు. పోలీసొల్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు కాబట్టే. ఇది తప్పుబిడ్డ ఇట్ల చేయవద్దు అంటే ఎవ్వడైనా వినే పరిస్థితి ఉందా’’ అన్నాడు భారంగా….
‘‘వాని బొల్లి మొఖం చూస్తేనే అసహ్యం వేస్తుంది. వాడు చెప్పేది ఒకటి ఉంటది. చేసేది మరొకటి ఉంటది. కన్నింగ్ ఫెలో…’’ అంటూ కోపం అరిచిండొకరు.
‘‘అందరికి అందరు తోడు దొంగలు. వీళ్ళందరికి పేదోడు బ్రతకవద్దు, కష్టపడటోడు బ్రతకవద్దు. కుక్కిన పేనుల్లా పడి ఉండాలి తప్ప కడుపు చాలుతలేదంటే నేరం…. హక్కుల గురించి అడిగితే మరి నేరం…’’
‘‘ఈ పాపం ఎన్ని రోజులు నడుస్తదో?’’ అన్నారోకరు విచారంగా…
రోడ్డుకు కాస్త దూరంలో గల్లీలోకి చీలిపోయే రోడ్డు వారన జెండా గద్దె ఒకటి ఉంది. దాని మీద రంగు వెలసిన ఏఐటియుసి జెండా ఒకటి ముడుసుకపోయి వ్రేలాడుతుంది.
జెండా గద్దెమీద కూచొని పిట్ సెక్రటరీ స్థాయి యూనియన్ నాయకుడు ఒకరు తన చుట్టూ ఉన్న అనుచరులతో అంటున్న మాటలు చెవిన సోకినయి…
ట్రేడ్ యూనియన్ రంగంలో ఇటువంటి దుందుడుకు చర్యలు వద్దని మేము మొదటి నుండి చెప్పతనే ఉన్నాం. కాని మా మాటలు కార్మికులు ఎవ్వరు పట్టించుకున్నారు….ఇప్పుడు చూడు ఏమైందో పిడాత ప్రాణాలు పోబట్టే.’’.. అంటూ ఇంకా ఏదో చెప్పుతున్నాడు….
వారికి కాస్త దూరం నిలుచున్న యువకునికి ఆ మాటలు కోపం తెప్పించినట్టుంది. దాంతో ఆ యువకుడు గయ్యిమని లేచిండు…
‘‘మీలెక్క పైరవీలు చేసుకుంటూ ప్రతి పనిలో లంచాలు గుంజుతూ తేరగ బ్రతుకుతూ బొర్రలు పిర్రలు పెంచుకుంటూ తిరిగితే బాగానే ఉండు’’ అన్నాడు కోపంగా….
ఏమనుకున్నడో ఏమోకాని గద్దెమీద కూచొని బాతకాని కొడుతున్న వాడల్లా లీడర్ ముఖం మాడ్చుకొని మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయిండు….
పోలీసుల్లో కదలిక మొదలైంది. ఏదో పకడ్బంది ప్లాన్‌తో మళ్లీ దాడికి సిద్ధమౌతున్నట్టుంది..
చూస్తూ చూస్తూ కూడా ఏం చెయ్యలేని నిస్సహాయతతో మనసు మొద్దుబారి పోతుంది.. బుర్ర పనిచెయ్యటం లేదు…
సరిగ్గా అటువంటి పరిస్థితే నా మిత్రుడు ఆగయ్యను వేధించినట్టుంది. అంతవరదాక మౌనంగా ఉన్న వాడల్లా ‘‘అన్నా ఒక పనిచేద్దాం’’ అన్నాడు ఉత్సాహంగా..
ఏంటన్నట్టుగా చూసాను
‘‘మనం చెప్పితే పోలీసు వాళ్ళెవరు వింటలేరు… పై నుంచి చెప్పిస్తే?’’
‘‘పై నుంచి అంటే?’’ అన్నాను ఆసక్తిగా…
‘‘ప్రజల హక్కుల కోసం పోరాడే ప్రజా సంఘాలు ఉన్నాయి కదా…. వారి దృష్టికి తీసుకపోతే ఏమన్నా ప్రయోజనం ఉంటదేమో?’’ అన్నాడు.
అంత వరదాక ఒక విధమైన నిర్లిప్తత, నిరుత్సాహంతో, ఏం చెయ్యలేని నిస్సహాయతలో ఉన్న నాకు మిత్రుడు ఆలోచన సబబే అనిపించింది. ఈ విధంగానైన ఏదైనా ప్రయోజనం కల్గుతుందో అన్న ఆశ కల్గింది. అంతకుమించి మేము చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు.
చాలాకాలంగా పత్రికా రంగంలో పనిచేస్తున్న వాన్ని కాబట్టి వివిధ సందర్భంలో ప్రజా సంఘాలు కోల్ బెల్టు ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు, ఎన్‌కౌంటర్ వంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిజ నిర్ధారణకు వచ్చే పౌర హక్కుల సంఘం వారితో పరిచయం ఉంది. ప్రముఖ పౌరహక్కుల సంఘం నాయకుడు కన్నాబిరాన్, కార్మికులకు సంబంధించిన అనేక కేసులను స్వచ్చందంగా ఎటువంటి ఫీజు లేకుండా వాదించేవారు… ముఖ్యంగా చట్టం ఉల్లంఘనలు జరిగినప్పుడు మేనేజ్‌మెంటు కార్మికులను అక్రమంగా డిస్మిస్ చేసిన సందర్భాల్లో, పోలీసులు అక్రమ అరెస్టులు చేసినప్పుడు కార్మికుల తరపున పనిచేసిండ్లు. ఇక పౌరహక్కుల సంఘం నాయకుడు బాలగోపాల్‌కు సింగరేణి కార్మికులకు అనుబంధం చాలా సుదీర్ఘమైంది. సింగరేణిలో విప్లవ కార్మికోద్యమం పుట్టి, మిలిటెంట్ కార్మిక పోరాటాలు ముందుకొచ్చినవి. అదే స్థాయిలో విప్లవోద్యమాన్ని అణచటానికి సింగరేణిలో రాజ్యహింస కూడా పెరిగిపోయింది. యధేచ్ఛగా చట్టాలను ఉల్లఘించిబడ్డాయి. అక్రమ అరెస్టులు, ఎన్‌కౌంటర్లు మనుషులను మాయం చెయ్యటాలు పెరిగిపోయినవి. అటువంటి ప్రతి సందర్భంలో పౌరహక్కులను కాపాడటం కోసం బాలగోపాల్ ఎటువంటి భయం బెరుకు లేకుండా పర్యటించేవాడు.. వాస్తవాలను బయటికి తీసి రాజ్యాన్ని ప్రశ్నించేవాడు. బాధితులకు అండగా నిలిచేవాడు. ఆ రోజుల్లో బాలగోపాల్‌కు సహకరించినా, ఆశ్రయం ఇచ్చినా ఆయనతో వెంట తిరిగిన పోలీసులకు కంటగింపు అయ్యేది. వేధింపులకు గురిచేసేవాళ్ళు… దాంతో చాలామంది ఆయన వెంట తిరగాలంటే భయపడేవాళ్ళు… అటువంటి సందర్భంలో నేను బాలగోపాల్ వెంట తిరిగాను. అనేక ఎన్‌కౌంటర్లపై, మిస్సింగ్ కేసులపై విచారణ చేసాం… ఆ విధంగా పోలీసులకు నాపై కోపంగా ఉండేది… కాని నేను అదేమి లెక్కచేసేవాన్ని కాదు.. పరోక్షంగా అదిరింపులకు బెదిరింపులకు పాల్పడేవాళ్ళు.. ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చి పలానా వాడు వచ్చిండు అని ఇంట్లో సోదాలు చేసేవాళ్ళు. ఇంట్లో వారిని భయబ్రాంతులకు గురి చేసే వాళ్ళు. మనం చేస్తున్న పని న్యాయం అయినప్పుడు ఎందుకు భయపడాలనే తత్వం నాది… దాంతో పోలీసులు ఏమి చెయ్యలేక అవకాశం కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు…
దగ్గర్లో ఉన్న ఫోన్ కాడికి పోయిమొదట కన్నాబిరాన్ సార్ ఫోన్ చేసాను. కాని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది… ఆ వెంటనే బాలగోపాల్‌కు ఫోన్ చేసాను ఫోన్ రింగ్ అవుతుంది కాని ఎవ్వరు ఎత్తలేదు….
‘‘ఏమైందన్నా ఎవ్వరు ఫోన్ ఎత్తటం లేదా?’’ అని ఆత్రంగా అడిగిండు ఆగయ్య…
‘‘లేదు’’ అన్నాను
ఆయన ఒకసారి గడియారంకేసి చూసి ‘‘అన్న సమయం పదకొండు దాటింది కాబట్టి బాల గోపాల్ సార్ ఏదైనా పనిలో ఉన్నారేమో’’ అన్నాడు సాలోచనగా….
‘‘నిజమే’’
‘‘ఏం చేద్దాం ఇంకెవ్వరన్నా ఉంటే ట్రయ్ చెయ్’’ అన్నడు.
ఒకరిద్దరికి ఫోన్ చేసాను. ఒకరేమో దూరంగా ఎక్కడో ఉన్నడట… ఈ పరిస్థితిలో ఏం చెయ్యలేను’ అని జవాబు వచ్చింది. మరొకతను ఫోన్ ఎత్తనే లేదు…..
ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు.
జనంలో ‘‘ఎన్‌కౌంటర్‌ను వెంటనే ఆపివెయ్యాలి’’ ‘‘పోలీసు దౌర్జన్యం నశించాలి’’ అన్న నినాదాలు మొదలైనవి. అవి అంతకంతకు పెరిగిపోతున్నవి.
కాసేపటికి బాలగోపాల్ సార్ నుండి ఫోన్ వచ్చింది.
‘‘నమస్తే సార్’’
‘‘నమస్తే ఒక కేసు విషయంలో పనిలో ఉంటి. అది అయిపోయి వచ్చి చూస్తే నీ ఫోన్ ఏ సంగతి’’ అన్నాడు..
‘‘ఇక్కడ ఘోరం జరిగిపోతుంది సార్’’
‘‘ఘోరమా?’’
‘‘అవును సార్ శ్రీరాంపూర్ ఏరియాలోని నస్సూర్ కాలనీలో ఎన్‌కౌంటర్ జరుగుతుంది’’
‘‘ఎన్‌కౌంటరా?’’
‘‘అవును సార్’’
‘‘ఎవరెవరికి?’’
‘‘సికాస వాళ్ళకు పోలీసులకు మధ్యన’’
‘‘ఎన్‌కౌంటర్ జరిగిందా! జరుగుతుందా?’’
‘‘ఇంకా జరుగుతుంది’’
‘‘ఇంకా జరుగుతుందా? మరి జనం లేరా?’’
‘‘వేలాది మంది జనం చూస్తుండగానే జరుగుతుంది’’
‘‘జనం ముందే జరుగుతుంటే ఎవ్వరు ఆపటానికి ప్రయత్నించలేదా?’’
‘‘మేం ప్రయత్నం చేసినం సార్.. కాల్పులు ఆపితే మాట్లాడి సరెండర్ చేయిస్తం అన్నం కాని పోలీసులు వినకుండా కాల్పులు మొదలు పెట్టిండ్లు.. ఒక యస్సైకు కూడా గాయమైంది’’
‘‘యస్సైకు గాయమైందా?’’
‘‘అవును సార్’’
‘‘మరి సికాస వాళ్ళకు?’’
‘‘తెలువది’’
‘‘సికాస వాళ్ళు ఎక్కడున్నారు?’’
‘‘ఒక కార్మికుని ఇంట్లో చిక్కుకున్నారు’’
‘‘ఎంతమంది?’’
‘‘మొదట్లా ఆ ఇంట్లో చాలామందే ఉన్నరన్నారు కాని అటు తరువాత ఆ ప్రాంత నాయకుడు రమాకాంత్ ఒక్కరే అని తేలింది’’
‘‘రమాకాంతా?’’ అంటూ ఆయన ఆశ్చర్యపోయిండు.
ఆయన అట్లా ఆశ్చర్యపోవడం పెద్ద విశేషమేమి కాదు. అప్పటికే సికాస అంటే రమాకాంత్… రమాకాంత్ అంటే సికాస అని రాష్ట్రమంతా ప్రబలిపోయి ఉంది.
‘‘అయితే ఏం చెద్దమంటావు?’’ అన్నాడు బాలగోపాల్
‘‘రాష్ట్రస్థాయిలో ఏదైనా ప్రయత్నం చేస్తే ఎన్‌కౌంటర్ ఆపవచ్చు… రమాకాంత్ ప్రాణాలు కాపాడవచ్చు’’ అన్నాను.
‘‘కాని ఫలితం ఉంటదంటవా… ప్రభుత్వ అండదండలు లేకుండా ఇదంత జరుగుతుందా?’’ అంటూనే ‘‘సరే మన ప్రయత్నం మనం చేద్దాం… వారికి ఏమాత్రమైన ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఫలితం ఉండవచ్చు’’ అన్నాడు…
5
నేను మొదటి సారి సమ్మిరెడ్డిని చూసింది మందమర్రిలోని కళ్యాణి ఖని 5 ఏ బావి మీద. ఆ రోజుల్లో నేను ఆక్టింగ్ క్లర్క్‌గా పనిచేస్తుండేవాడిని. సెకండ్ షిప్టులో ఒక రోజు మ్యాన్ వే రైటర్‌గా పనిచేస్తున్నప్పుడు, మ్యాన్ వే రైటర్ గదిలో ఉన్న కిటికీ ఆవల నిలబడి మస్టరు చెప్పడం కోసం వేచి ఉన్న యువకుడు కన్పించిండు.
గ్రామాల్లో బ్రతుకు ఎల్లక పొట్ట చేత పట్టుకొని బ్రతకవచ్చి బొగ్గు బాయిలో కార్మికులుగా చేరినవాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందరు కార్మికుల్లాగే అతను ఉన్నాడు. పొడువైన ఆకారం, యవ్వనంతో తొనికిసలాడుతున్న నల్లని ముఖం చురుకైన చూపులతో, కిటికీ ఆవల నిలబడి సార్ హాజర్’’ అన్నాడు.
రెగ్యులర్‌గా మ్యాన్‌వేలో పనిచేసే రైటర్‌కు కార్మికులు వచ్చి నిలుచునే సరికే అతను ఎవరో తెలిసిపోయి మస్టరు వేసుకుంటాడు. కాని నేను రెగ్యులర్ మ్యాన్ వే రైటర్‌ను కాదు. ఆక్టింగ్ క్లర్క్‌గా ఎవరైనా సెలవులో ఉంటే వారి ప్లేస్‌లో తాత్కాలికంగా పని చెయ్యటానికి వచ్చాను. అందుకే మస్టర్ కోసం వచ్చే కార్మికులను తొందరగా గుర్తుపట్టలేకపోయేవాన్ని.
‘‘ఏం పేరు?’’
‘‘మాదిరెడ్డి సమ్మిరెడ్డి’’
‘‘ఏం పని చేస్తవు?’’
‘‘కోల్ కట్టర్’’
గబ గబా పేజీలు తిప్పి హాజర్ వేసి ‘నెక్ట్స్’ అన్నాను. అతను ముందుకు కదిలిండు. మరో కార్మికుడు వచ్చిండు.
బావి మీద షిప్టు ప్రారంభ సమయంలో మ్యాన్‌వే కాడ కార్మికుల హడావిడీ ఎక్కువగా ఉంటది. ఆ సమయాలలో మ్యాన్‌వే రైటర్‌కు క్షణం తీరిక ఉండదు. అలా ఓ అరగంట గడిచే సరికి ఆ షిప్టు కార్మికులంతా మస్టర్లు చెప్పి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతరు… మళ్ళీ షిప్టు ముగింపు సమయంలో బాయిలో పనిచేసి తిరిగి వచ్చే అవుట్ మస్టర్ చెప్పే కార్మికులతో, కొత్తగా డ్యూటీలకు వచ్చే కార్మికులకు ఇన్ మస్టర్లు వేయటంతో మళ్ళీ బిజీగా ఉంటుంది. అవుట్ మస్టర్, ఇన్ మస్టర్ వేసిన తరువాత మ్యాన్ వే రైటర్‌కు పెద్దగా పనేమి ఉండదు.
మ్యాన్‌వే ప్రక్కన ఖాళీ టబ్బులు పోవటానికీ, బొగ్గుతో నిండిన టబ్బులు రావటానికి ఏర్పాటు చేసిన సొరంగం నుండి డబడబలాడుతూ వచ్చే లాడీసుల చప్పుళ్ళు… దూరంగా బయ్ మంటూ నిరంతరం చప్పుడు చేసే బారి ఎగ్జాస్ట్ ప్యాన్ చప్పుడు కలగలసిపోతుంది. మ్యాన్ వేకు ఎదురుగా కాస్త దూరంలో ఉన్న బంకర్, నుండి లారీల్లోకి బొగ్గు లోడ్ చేసే చప్పుళ్లు కలగలిసిపోయి ఒక విధమైన వింత వాతావరణం నెలకొంటుంది.
మస్టర్ల హడావిడీ అయిపోయిన తరువాత, ఏయే గ్యాంగ్ వాళ్ళు ఎంతమంది వచ్చింది లెక్కలు తీసి సంబంధిత వోవర్‌మెన్ లేదా అండర్ మేనేజర్ కో లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఖాళీ సమయంలో మ్యాన్ వే కిటికీ నుండి చూస్తే దూరంగా ఎత్తయిన మట్టి దిబ్బను అనుకొని ఊడలు దిగిన ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. దాని ఆకులు వర్షా కాలంలో తప్ప మిగతా కాలమంత బొగ్గు దుమ్ముతో కప్పబడి ఉంటాయి. ఎండకాలంలో అయితే ఆకులు రాలిపోయి ఎండు పుల్లల్లా కనిపిస్తాయి. వర్షాకాలంలో మాత్రం కడిగేసినట్టు కళకళ పచ్చటి ఆకులతో కలకలలాడుతూ కనిపిస్తుంది…
ఒకప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన అడివి ఉండేదని చెప్పటానికి సాక్షంగా ఆ చెట్టు ఒకటి మిగిలిపోయింది. బొగ్గు గనులు వచ్చిన తరువాత అడవులు నశించినవి. కనుచూపు మేర చూస్తామంటే కూడా ఒక చెట్టు లేకుండా పోయి విశాలంగా పరుచుకున్న మైదానంలో అక్కడక్కడ పెరిగిన గుబురు పొదలు తప్ప చెట్లేమి కనిపించవు.
మ్యాన్ వే రైటర్‌కు మ్యాన్ వేను వదిలిపోవడానికి వీలుండదు. బాయిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాయిలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి అర్ధాంతరంగా కార్మికులు ఎక్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా బావి మేనేజరో, సేప్టీ అఫీసరో ఎప్పుడైన వచ్చి బాయిలో దిగుతారు. అ సమయంలో మ్యాన్‌వేలో లేకుంటే కోపానికి వస్తరు. కొన్నిసార్లు చార్జీషీట్లు సస్పెండ్లు కూడా చేసిన సందర్భాలున్నవి. కావున మ్యాన్ వే రైటర్ మ్యాన్ వే రూంను వదిలిపోవటానికి వీలుండదు.
కార్మికులందరు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత డ్యూటీ సమయం ముగిసే వరకు ఒక్కడే ఉండాల్సి వస్తుంది. మ్యాన్ వేలో రోజువారి డ్యూటీ చేసే రైటర్స్‌కు అది అలవాటు అయిపోతుంది. కాని అప్పుడప్పుడు అక్టింగ్ డ్యూటీ చేసే నాలాంటి వారికి పొద్దుపోవడం కష్టమయ్యేది. అయితేమాత్రం తప్పుద్దా….
0
ఆక్టింగ్ క్లర్క్‌ను కాబట్టి బావి మీద పని చేసే రైటర్ ఎవ్వరైనా లీవ్‌లో ఉన్నప్పుడు వారి స్థానంలో పనిచేయాల్సి వచ్చేది….
అలా ఒకరోజు స్టోర్స్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నప్పుడు సమ్మిరెడ్డి మళ్ళీ కన్పించిండు. అదే చిర్నవ్వు చిందిస్తూ హుషారుగా వచ్చిండు… యధాలాపంగా ఒక మూలకు ఉన్న చెక్క డబ్బాలో అవసరమైన డ్రిల్ బిట్స్‌ను ఏరుతున్నాడు…
‘‘ఏమైందయా ఏందో కూరగాయలు ఏరినట్టు ఏరుతున్నావు?’’ అన్నాను సరదాగా…
‘‘ఏం చేస్తాం సార్ కొత్తవే కాని సరిగా పని చేస్తలేవు’’ అంటూ చేతిలోకి తీసుకున్న డ్రిల్ బిట్‌ను పరీక్షగా చూస్తూ అన్నాడు
‘‘కొత్తవేనయ్యా,, మొన్ననే స్టాక్ వచ్చింది’’ అన్నాను.
‘‘కావచ్చు సార్ కాని పని చేస్తలేవు’’
‘‘అదే ఎందుకు నాణ్యత ఉంటలేదా?’’
‘‘అవును సార్ డ్రిల్లింగ్ చేస్తాంటే మధ్యలోనే విరిగిపోతుంది…. దాంతో పని మొదటికి వస్తాంది’’
‘‘అదే ఎందుకు?’’
‘‘ఎందుకంటే ఏం చెప్పుతం… అధికారులు పీతిలో పైసలు ఏరుకుంటాండ్లు.. తమ జేబులోకి పది పైసలు వస్తాయంటే కంపెనీకి ఎంత నష్టమొచ్చినా పర్వాలేదు అనుకుంటాండ్లు’’ అంటూ తాను పట్టుకున్న డ్రిల్ బిట్లు నా టేబుల్ మీద పెట్టిండు…
వాటిని స్టాక్ రిజిస్టర్‌లో ఎంటర్ చేసుకుంటూ ‘‘పెద్దోళ్ళ ముచ్చట మనకెందుకు లేని పోని తంటా’’ అన్నాను….
‘‘అట్లనుకుంటే ఎట్లా సార్, అట్లా అనుకోబట్టే కార్మికులకు బాధలు ఎక్కువైతానయి. కంపెనీ మైనింగ్ బూట్లు ఇస్తే ఆర్నేల్లు కూడా ఆగుతలేవు. పని చేస్తమంటే ఓ చమ్మాస్ సరిగా ఉండదు… పిల్లరోళ్ళు బొగ్గు నింపుతామంటే డబ్బులు సప్లయి సరిగా ఉండదు… కార్మికుల సౌలత్ సంగతి వదిలేయ్.. బొగ్గు ఉత్పత్తికి అవసరమైన పనిముట్లు కూడా కార్మికునికి అందించక అదిరించి బెదిరించి పనులు చేయిస్తామంటే ఎల్లకాలం సాగుద్దా?’’ అన్నాడు నింపాదిగా….
ఆయన డ్రిల్ బిట్లు తీసుకొని పోయిండు…
అట్లా అతనిలోని ప్రశ్నించేతత్వం మొదటి సారిగా నన్ను ఆకర్షించింది.
(ఇంకా ఉంది…)