విశిష్టమైన కవితల బండి: బల్దేర్ బండి

ఈ కవి వయసు ఇరవై రెండేళ్ళన్న విషయం పక్కన పెట్టేద్దాం. అతను రాసిన కవిత్వంతో పోలిస్తే అతను నూనూగు మీసాల యువకుడన్న వాస్తవం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ కవిత్వం ఓ అరవై ఏళ్ళ కవి రాసినా అబ్బురమే.

** ** **

కవిత్వాన్ని ఒక్కో కవి ఒక్కో పెర్సప్షన్ తో రాస్తాడు. ఒకరు చెప్పటానికి రాస్తే మరొకరు చెప్పుకోటానికే రాస్తారు. చెప్పటంలో ఉపదేశముంటుంది. చెప్పుకోవటంలో పంచుకోవటం వుంటుంది. చెప్పటంలో సానుభూతి వుంటుంది. చెప్పుకోవటంలో సహానుభూతి ఆశించటం వుంటుంది. చెప్పటంలో స్వాతిశయం వుంటుంది. చెప్పుకోవటంలో స్వీయానుభవం తాలూకు సంవేదన వుంటుంది. కార్తీక్ అచ్చు రెండో రకం కవి. అతను పూర్తిగా తన గురించి చెప్పుకోటానికే “బల్దేర్ బండి” ఎక్కాడు. తన గురించి చెప్పుకోవటం అంటే తన పూర్వీకుల నుండి తన తల్లిదండ్రులతో సహా తన వరకు అందరి గురించి చెప్పుకోవటం. తండాలోని తన ఇంటితో మొదలు పెట్టి సమస్త తండా సంస్కృతి గురించి చెప్పుకోవటం! అయితే ఈ చెప్పుకోవటం దేనికి? ఎలా చెప్పుకున్నాడు? అనే ప్రశ్నలకి సమాధానమే అతని కవిత్వం.

కార్తీక్ కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలిపి చూపించే అంశం అతని అస్తిత్వం. అతను తన తాను పుట్టి పెరిగిన తెగ వాతావరణాన్ని ప్రాతిపదికగా చేసుకొని కవిత్వం రాసాడు. అతను సాంఘీకంగా లంబాడ తెగకి చెందినవాడు. ఒక ప్రజా సమూహం ఒక తెగగా గుర్తింపు తెచ్చుకుందంటే దానికి ఆ దేశపు ప్రధాన మతం, విశ్వాసాల నుండి ఆ సమూహం వేరుగా వుందని అర్ధం. లంబాడ తెగకి ప్రత్యేకమైన భాష, వస్త్రధారణ, సంస్కృతి వున్నాయి. లోలాకులు, పోగులు, గాజులు, అద్దాలతో తళుక్కున మెరిసే స్త్రీల ఆహార్యం వారెంత ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి వున్నారో చెబుతుంది. శ్రామిక జీవన విధానం, మిగతా సమాజం నుండి తిరుగులేని ప్రత్యేక నిర్దిష్ట సంస్కృతి కలిగిన తెగ అది. ప్రధానంగా సంచార తెగ ఐన లంబాడ తెగ ఆచార వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు కూడా ప్రత్యేకంగా వుంటాయి. వారి పితృస్వామిక వ్యవస్థ ఆడపిల్లని వివాహబంధం ద్వారా శాశ్వతంగా కుటుంబం నుండి వేరు చేసేంత కఠినంగా వుంటుంది. జలగం వెంగళ్రావు వారి అస్థిర సంచార జీవనాన్ని, పేదరికాన్ని, నిరక్షరాస్యతని, వెనుకబాటుతనాన్ని, సమాజంలో వారెదుర్కొంటున్న చిన్న చూపు, వివక్షని దృష్టిలో వుంచుకొని ఆ తెగకి “షెడ్యూల్డ్ ట్రైబ్” హోదాని కల్పించారు. అప్పటి నుండి వారి జీవన విధానంలో మార్పులు మొదలయాయి. విద్య, స్థిర నివాసం, ప్రభుత్వ ఉద్యోగాలు లభ్యమై వారు పట్టణీకరణ చెందుతున్నప్పటికీ ఇంకా తండా జీవితమే ప్రధానంగా వున్న తెగ అది. ఈ సంధి దశలో కార్తీక్ ప్రధాన స్రవంతికి, తన తెగకి మధ్యన తన కవిత్వం కారణంగా ఒక వారధి అయ్యాడు. విద్యావంతుడు కాబట్టి ప్రధాన సమాజంతో కలిసాడు. కానీ తన అస్తిత్వ మూలాల్ని వొదులుకోలేదు. తన మూలాల్లోని కళాత్మక జానపద వాసనల్ని వొదులుకోలేదు. తన కవిత్వం ద్వారా అతను తన వారి అస్తిత్వంలోకి పాఠకుల్ని వేలు పట్టుకొని తీసుకు వెళ్తున్నాడు.


“మా తండా ఓ పిట్టగూడు
మా ఇళ్ళు పగిలిన గుడ్లు
మా బతుకులు
గాలిలో తేలుతున్న ఈకలు
………
అద్దాలు ఆశల్ని రేకెత్తించి
మా ముఖాల్ని మాకే చూపిస్తూ
సడి లేకుండా చేతి బొక్కల్ని విరిచేసి
రవ్వలా పగిలి గుండెకి గుచ్చుకుంటాయి
…….
యాడిలంతా (అమ్మలంతా)
రాత్రిని ముస్తాబు చేస్తున్న
నూనె బుడ్డిని నిద్ర పుచ్చటానికి
అడవి గీతం పాడతారు
బాపులంతా (నాన్నలంతా)
ఇంటికి కాపులా
ఓ కన్ను ఇంట్లో
ఇంకో కన్ను పొలంలో
తలను ఇంటి బైటపెట్టి
తమని తాము కాగడాల్లా వెలిగించుకుంటారు”
(మా తండా)

బల్దేర్ బండి అంటే మామూలు ఎడ్ల బండే. కానీ ఆ బండి గురించి అతను ఏ విధంగా లంబాడ జీవన విధానంలో విడదీయరాని అంతర్భాగమో వివరిస్తూ అనేక ఆసక్తికర, విభ్రాంతికర సంగతులు చెప్పాడు. వలసలు ప్రధానమైన తెగకి చక్రాల బండి చాలా ప్రధానమైనది. ఒకచోట నిలవలేని జీవన విధానంలో వివాహాల్లో ఆడపిల్లలతో తెగిపోయిన మానవ సంబంధాలు తిరిగి తగులుతాయేమోనన్న ఆశతో ఎదురు చూస్తూ వారికోసం ఆ బండిలో ఎప్పుడూ తేనె, ఇంకా కొన్ని చిన్న బహుమతులు పెట్టుకొని సంచరిస్తుంటారట. లంబాడ సంచార జీవితానికి ప్రతీకగా అతను తన కవిత్వానికి “బల్దేర్ బండి” అనే పేరు పెట్టడం అతనిలోని ఆర్తి కోణాన్ని తెలియచేస్తుంది.


“కాసింత కనుమరుగయ్యే దూరంలో
వేప చెట్టు కింద
ఓ చక్రాల బండి మూలుగుతూ
వేపకాయల్ని లెక్కిస్తుంటుంది
రాలే ఆకుల్ని
పిల్లల చలికాలపు మంట కోసం పోగు చేస్తూ
చుట్టూ మనుషులుండరు
ఎడ్లుండవు. బర్రెలుండవు
అప్పుడప్పుడు కుక్కలే వచ్చి
ఉచ్చ పోసి వెళతాయి”
(బల్దేర్ బండి)

నిజమైన కవులు తమ అనుభవం నుండి, పరిశీలన నుండి విషాద వాస్తవాల్ని, సునిశిత ఆనందాల్ని, తాత్విక సత్యాల్ని స్వీకరించి, వాటికి సృజనాత్మక ఊహల్ని జోడించి కవిత్వం చెబుతారు. కవిత్వం అంటే పదచిత్రాలు, భావచిత్రాలు మాత్రమే కాదు. వైరుధ్యాలతో నిండిన వాస్తవంలో కొత్తగా కనుక్కున్న ఏ ఒక్క కోణాన్నైనా అతి సాధారణ స్టేట్మెంట్లా ఇచ్చినా నా దృష్టిలో అది కవిత్వమే. కార్తీక్ తన కవిత్వంలో ఆ రెండు పద్ధతుల్ని చూపించాడు. ఉదాహరణకి ఈ కవిత చూడండి:
“మీరు చెబితే నమ్మరుగాని
మా జొన్న రొట్టెలు
తండాకు రానన్న ప్రతివాడినీ
గల్లా పట్టి లాక్కొస్తాయి
………
విశ్వమంత రొట్టెలపై సంచరిస్తూ మేము
రొట్టెల కింద తండాలన్ని మొక్కజొన్న కాడల నీడలో
మా జీవితాలు పచ్చగా పైరులైపోతాయి”
(జారేర్ బాటి)

“కాలం పూర్వీకులెవారో
రాత్రికి పగలుకి నడుమ
నిద్ర అనే వంతెనని నిర్మించారు
ప్రపంచమంతా ఆ వంతెనని నమ్ముకుంది
……
నిద్ర వంతెన కూలిపోయి
శూన్యం వేర్లు మొలుస్తాయి
వంతెనపై కథ అర్ధాంతరంగా ఆగిపోయి
గరిగి కళ్ళ కొసల నుండి జారిపోతుంది”
(నిద్ర వంతెన)

పై కవితల్లోని స్టాంజాల్ని గమనించండి. నేను పైన చెప్పిన రెండు పద్ధతులు కనిపిస్తాయి. మొత్తం మీద ఈ కవి కవిత్వంలో కవిత్వం కాని వాక్యం ఒక్కటి కూడా కనిపించదు. చాలా శ్రద్ధ పెట్టి, ధ్యానం చేసి రాసిన వాక్యాలవి. ప్రతి కవిత వెనక ఒక చిన్న కథని ఊహిస్తాడు. అందుకే ఓ కవితలోని ఏ నాలుగు వాక్యాలో తీసి ఉటంకిస్తే అర్ధం కాదు పాఠకుడికి. కార్తీక్ అంత తొందరగా అర్ధం కాడు కానీ అతను ఒక్కో కవిత కోసం తాను అనుకున్న విషయాన్ని మెల్లగా మొదలెట్టి పకడ్బందీగా అన్ ఫోల్డ్ చేస్తుంటాడు. అతని కవిత్వంలో శ్రామికుడి ఆకలీ వుంటుంది, శ్రమ సౌందర్యమూ వుంటుంది. ఇందుకు “పునర్జన్మ”, “చెమటపూలు” అన్న కవితలు ఉదాహరనగా నిలుస్తాయి.

కార్తీక్ ఎంతో బలమైన ఊహాశాలి. సాధారణంగా ఒంటరితనాన్ని అనుభవించిన వాళ్ళు లేదా అనుభవిస్తున్న వాళ్ళు గొప్ప ఊహా శక్తిని కలిగి వుంటారు. ఒంటరితనం కొంతమందికి ఐఛ్ఛికం కాగా మరికొందరికి నిర్బంధం. మనుషుల్లో కలవలేకనో, మనుషుల్తో సర్దుకుపోలేనంత వ్యత్యాసం ఫీలవటం వల్లనో లేదా సర్దుకుపోకే పోవటం వల్లనో, అనేకానేక సందేహాల, సందిగ్దాల కారణంగా మనుషులు అర్ధం కాకపోవటం వల్లనో ఒంటరితనం ఏర్పడుతుంది. ఒంటరిగా వున్న మనిషి, మరీ ముఖ్యంగా బాల్యంలో, కౌమార్యంలో ఏ రకమైన మనఃస్తితిని కలిగివుంటాడు? అతను ప్రకృతితో సంభాషిస్తుంటాడు తన ప్రమేయం లేకుండానే! ఇతని కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణమిదే. తనదో ఏకాకి స్వీయ సంభాషణలా తోస్తుంది అనేక సందర్భాల్లో. మామూలు మాటలకి వివరించి చెప్పుకోవాలసిన జవాబుదారీతనం బోలెడంత వుంటుంది. కానీ ఈ జవాబుదారీతనానికి అతీతంగా జీవితానికి, సమాజానికి సంబంధించిన వాస్తవం తాలూకు నిజస్వరూపాన్ని అర్ధం చేసుకోటానికి దాని గుట్టుమట్లన్ని పట్టుకోటానికి కవి ఒక ఐంద్రజాలికుడి అవతారమెత్తిన కవితలు చాలా కనబడతాయి ఈ సంపుటిలో. బహుశః ఈ మేజిక్ రియలిజం లక్షణం వల్లనేనేమో ఇతని మీద స్పానిష్ కవి మార్క్వెజ్ ప్రభావం కనిపిస్తుందంటారు. అయితే ఒక విషయం మనం గమనించాలి. సాధారణంగా తెగల్లోని ఆచారాల్లో, నమ్మకాల్లో బలమైన మార్మికత వుంటుంది. అంతుబట్టని ప్రకృతి తాలూకు మార్మికతని తాత్వికంగా ఆవాహన చేసుకునే లక్షణం ఆ తెగల అస్తిత్వంలో సహజంగానే నిబిడీకృతమై వుంటుంది. కార్తీక్ కవిత్వంలో ఈ మార్మికత కనబడుతుంది.

అతను తన గోమ్యా తాత గురించి రాసినా, తండాల్లో జరిగే ప్రసవాలు (బొడ్డు తాడు) గురించి రాసినా, అన్ లెర్నింగ్ గురించి తాత్వికంగా రాసినా (పునరుజ్జీవనం)… ఆ మాటకొస్తే విధానం ఏదేనైప్పటికీ ఈ సంపుటిలోని మెజారిటీ కవితలకి వస్తువు ఇప్పుడిప్పుడే స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్న ఒక సంచార తెగ సంధి దశపు తాలూకు అస్తిత్వమే. అతని ఊహాశాలిత్వం కూడా అతని అస్తిత్వం తాలూకు యునీక్నెస్ మంజూరు చేసినదే. ఈ సంపుటి నిండా తన తెగ సాంస్కృతిక విశిష్టతకి సంబంధించిన ఎన్నో బంజార భాషా పదాలు వుంటాయి. కొన్ని తెలుగు పదాలు కూడా వాళ్ళెట్ల పలుకుతారో అట్లానే రాసాడు. ఆ కన్నొటేషన్ అతని కవిత్వానికి బలం ఇచ్చింది.

మెజారిటీ సంస్కృతిలో నీళ్ళలో చేపలా వుంటూనే, అభివృద్ధి చెందుతూనే, ఇప్పటివరకు కవిత్వాన్ని అతను ఓ కళాత్మక మేధో ప్రక్రియగా అవలంభించిన తీరుకి అభినందిస్తూనే, అతను చిక్కదనం కోల్పోకుండా మరింత సరళతరం కావాలనీ, తన అస్తిత్వం తాలూకు యునీక్నెస్ ని, అందులోని సహజ తాత్వికతని, అమాయకత్వాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నాను.

అన్నట్లు తన కవిత్వం అంత చిక్కగానే అయినా ఎంతో సరళంగా మనందరికీ అర్ధం అయేటట్లు తన జీవితం గురించి రాసుకున్న ముందు మాట “ఏకాంతానికి ఓ లేఖ” కూడా ఎంతో విలువైనదే. ఈ కవిత్వ బండి మీద ప్రయాణంలో గుండెకి మొదటి కుదుపు అక్కడే తగులుతుంది.
కార్తీక్ కవిత్వం కోసం మరింత ఎదురుచూస్తూ…

(“బల్దేర్ బండి” రమేష్ కార్తీక్ నాయక్ కవిత్వ సంపుటి. వెల: 120 రూపాయిలు. “మొబొడ” ప్రచురణలు. కాపీలకు కవిని సంప్రదించండి. ఫోన్: 7286942419)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

Leave a Reply