‘విరసం’ సదస్సును జయప్రదం చేద్దాం

కరపత్రం

కాల్పుల విరమణ ఒప్పందాలు – విప్లవోద్యమ పంథా: మార్క్సిస్టు దృక్పథం
సదస్సు

జూలై 6, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా

సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు

సాయుధ పోరాట సంస్థలకు, ప్రభుత్వాలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు రాజ్యాంగపరిధిలోనే జరుగుతాయి. ఈ కారణం వల్లనే మావోయిస్టు పార్టీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందాలకు రావాలని వివిధ ప్రజాస్వామిక శక్తులు ఆకాంక్షిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ డిమాండ్‌ ప్రజా ఉద్యమ రూపం తీసుకున్నది. శాంతి చర్చల ఆవశ్యకతను వివరిస్తూ అనేక విశ్లేషణలు వస్తున్నాయి. వీటితోపాటు కాల్పుల విరమణ ఒప్పందాలుశాంతి చర్చల మీద మార్క్సిస్టు విశ్లేషణ కూడా ఉంది. 2004లో శాంతి చర్చలు జరిగినప్పుడు విప్లవోద్యమం ఈ కోణంలో కొంత వివరణ ఇచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం, అందరూ అంగీకరించే రాజ్యాంగ విలువల మీద ఆధారపడి విప్లవోద్యమం కాల్పుల విరమణకు సిద్ధమైనప్పటికీ, తనదైన మార్క్సిస్టు వైఖరిని కూడా వినిపించింది. ఇది ప్రజాస్వామికవాదుల ఆలోచనలకు విరుద్ధమైనది కాదు. పైగా దాన్ని బలపరుస్తుంది. విస్తృతపరుస్తుంది. ఉన్నత స్థాయికి తీసికెళుతుంది. కాల్పుల విరమణ ప్రతిపాదనను తాను ప్రభుత్వం ముందు ఎందుకు పెట్టిందీ తెలియజెప్పడమే విప్లవోద్యమం ఉద్దేశం. సమాజంలో ఉన్న అన్ని సమస్యలను, పరిష్కార మార్గాలను విశ్లేషించినట్లే కాల్పుల విరమణను కూడా మార్క్సిస్టులు వివరించగలరు. నక్సల్బరీ పంథాలో ఆవిర్భవించిన విప్లవ రచయితల సంఘం కూడా ఆ పని చేయవలసి ఉన్నది. పైగా ఈ విడత శాంతి చర్చల ప్రతిపాదన సందర్భం గతం కంటే పూర్తి భిన్నమైనది. అంతర్యుద్ధాన్ని తలపిస్తున్న అణచివేతను నివారించడానికి విప్లవోద్యమం కాల్పుల విరమణకు సిద్ధమైంది. ఇది కేవలం సైనిక సంబంధమైనదే కాదు. దీనికి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పార్శ్వాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల కాల్పుల విరమణ అవసరాన్ని రాజ్యాంగబద్ధ దృష్టితో, ప్రజాస్వామిక ప్రాతిపదికపై పూర్తిగా బలపరుస్తూనే మార్క్సిస్టు వైఖరిని కూడా చెప్పవలసి ఉన్నది. గత రెండు నెలల కింద మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణను ప్రతిపాదనను ముందుకు తెచ్చిన సందర్భంలోని ప్రత్యేకతల వల్ల విప్లవోద్యమ పంథా మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలనగానే సమాజ స్థితి మీద, దాని భవితవ్యం మీద అనేక ఆలోచనలు బైటికి వస్తున్నాయి. ఆ రకంగా ఇది చాలా అరుదైన సందర్భం. వీటన్నిటినీ స్వాగతించాల్సిందే. అయితే వీటిలో చాలా వరకు విప్లవోద్యమ ఆచరణకు, సిద్ధాంత అవగాహనకు సుదూరంగా ఉన్నాయి. పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ తరహా అభిప్రాయాలు కాల్పుల విరమణను అర్థం చేసుకోడానికి పనికి రావు. కార్పొరేట్‌ ఫాసిస్టు శక్తులచే చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకున్న ఈ దశ విప్లవోద్యమాన్ని తెలుసుకోడానికి అసలే పనికి రావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న ఈ అంతిమ యుద్ధంలో అత్యద్భుతమైన కామ్రేడ్స్‌ అమరులవుతున్నారు. వారికంటే మూడు వంతుల మంది సాధారణ ప్రజలు చనిపోతున్నారు. నక్సల్బరీ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తీవ్రమైన నిర్బంధాన్ని విప్లవోద్యమం ఎదుర్కొన్నప్పటికీ ఇది అత్యంత విషాదకరమైన సంక్షోభం. ఈ కాలాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అంచనా వేయాలి? ఈ ఫాసిస్టు యుద్ధాన్ని దాటి ప్రజాయుద్ధం ముందుకుపోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అని చర్చించవలసి ఉన్నది. ప్రపంచ విప్లవోద్యమాల్లో ఇట్లాంటి తీవ్ర సంక్షుభిత సందర్భాల్లోంచే అద్భుతమైన సిద్ధాంత ఆవిష్కరణలు జరిగాయి. అణచివేతను, ఆటుపోట్లను దాటి విప్లవోద్యమాలు ముందుకు సాగాయి. మన దేశ విప్లవోద్యమం గడిరచిన అనుభవాల దృష్ట్యా కూడా ఈ ఫాసిస్టు యుద్ధాన్ని అధిగమించడానికి అవకాశం ఉన్నది. దానికి తగిన ఆలోచనలు, ఎత్తుగడలు ముందుకు రావాల్సి ఉన్నది. కానీ కొద్ది మంది విమర్శకులు నక్సల్బరీ పంథానే సరైనది కాదని విమర్శలు పెడుతున్నారు. శాంతి స్థాపనను విప్లవోద్యమం నిజాయితీగా కోరుకుంటే చట్టబద్ధ పోరాటాలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ అంటే సాయుధ పోరాట విరమణే అంటున్నారు. మన సామాజిక దశ గురించి నక్సల్బరీ చేసిన మౌలిక విశ్లేషణలకు కాలం చెల్లిపోయిందని అంటున్నారు. అసలు ఇది సాయుధ పోరాటాల కాలమే కాదని సూత్రీకరిస్తున్నారు. ఎన్నికల రాజకీయ యుగమని చెబుతున్నారు. ఇలాంటి అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ యాభై ఏళ్లలో ప్రపంచం చాలా మారిపోయిన మాట నిజమే. కానీ ఎంత మారింది? విప్లవమే అవసరం లేనంతగా మారిందా? సాయుధ పోరాటాలు అవసరం లేనంత గొప్పగా మారిందా? విప్లవాన్ని వదిలేసి లొంగిపోయి ఎన్నికల రాజకీయాలతో సరిపెట్టుకొనేంతగా మారిందా? నక్సల్బరీ పంథాను విప్లవోద్యమం ఆచరణాత్మకంగా ఈ యాభై ఏళ్లలో ఎంతగా అన్వయించిందీ, అభివృద్ధి చేసిందీ తెలుసుకొనే ఈ మాటలు అంటున్నారా? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమం గత ముప్పై ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయోగాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలు చర్చించవలసి ఉన్నది. దేశాన్ని ఆవరించిన కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజం.. మధ్య భారతదేశ ప్రజలపై చేస్తున్న యుద్ధం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. దేశమంతా అనేక రూపాల్లో కొనసాగుతున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, ప్రజలపై యుద్ధాన్ని ఆపివేయాలని మావోయిస్టులు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో విప్లవోద్యమ పంథా చుట్టూ ఎన్నడూ లేనంత చర్చ జరుగుతున్నది. ఇది ఎంత మాత్రం ఆశ్చర్యకరం కాదు. యుద్ధంశాంతి` విప్లవం ఇక వేర్వేరు విషయాలు కావని రుజువు అయింది. అందువల్ల కూడా కాల్పుల విరమణ మీద, విప్లవోద్యమ పంథా మీద జరుగుతున్న చర్చలను కలిపి చూసి, మార్క్సిస్టు దృక్పథంలో వివరించాలని విప్లవ రచయితల సంఘం అనుకుంటున్నది. ఇది మావోయిస్టు ఉద్యమం కోసమే కాదు. భారత విముక్తి మార్గమైన నక్సల్బరీ పంథా ప్రాసంగికతను చెప్పడానికి.
ప్రత్యామ్నాయ రాజకీయాలు, సంస్కృతి, కళా సాహిత్యాలు, ప్రజాస్వామిక జీవన విలువలు సమాజమంతా విస్తరించడానికి దోహదం చేసిన నక్సల్బరీ పంథా ఈరోజు ఫాసిజానికి బలమైన సవాలుగా నిలిచింది. దాన్ని అడ్డం తొలగించుకోనిదే తమ కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిస్టు లక్ష్యాన్ని చేరుకోలేమని పాలకులు గుర్తించారు. దానిని అంతం చేయడానికి ఆపరేషన్‌ కగార్‌ను రాజ్యం మొదలు పెట్టింది. ఆ రోజుల్లో పరాయి పాలకులు కూడా అమలు చేయని అణచివేతను ఈ దేశప్రజలైన విప్లవకారులపైన, ఆదివాసులపైన దళారీ పాలకులు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, అత్యంత అధునాతన ఆయుధాలు, లక్షలాది సైన్యంతో, కోటానుకోట్ల రూపాయలు వెచ్చించి సొంత ప్రజలపైనే చేస్తున్న యుద్ధం ఆగాలని ప్రజాస్వామికవాదులు శాంతి చర్చలను ప్రతిపాదించారు. దీనికి మావోయిస్టు పార్టీ సానుకూలంగా స్పందించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు చేస్తానంటున్నది. పునరావాస ప్యాకేజీలు ప్రకటిస్తున్నది. లేకుంటే చివరి మావోయిస్టును కూడా హత్య చేస్తానని గడువు పెట్టి మరీ హంతకభాషలో మాట్లాడుతున్నది. దీనికి వ్యతిరేకంగా బీజేపీ కూటమికి బైట ఉన్న రాజకీయ పార్టీలు కూడా మావోయిస్టులతో కాల్పుల విరమణ ఒప్పందాలకు రావాలని కోరుతున్నాయి.

తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించే దాకా ఉద్యమించాల్సిందే:
ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ వివిధ స్థాయి నాయకులు కోరుతున్నారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలనే ప్రజా ఉద్యమంలో భాగమవుతున్నారు. జాతీయస్థాయిలోనూ ఇదే వైఖరి వినిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా కాక సామాజిక సమస్యగా తమ ప్రభుత్వం చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఇవన్నీ నోటి మాటలుగానే ఉండిపోయాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని కాంగ్రెస్‌ అధిష్టానం పదేపదే చెబుతోంది. సంఫ్‌ుపరివార్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడతానని అంటోంది. సారాంశంలో బీజేపీకంటే తమ పార్టీ భిన్నమైనదని రాహుల్‌ గాంధీ అంటున్నారు. కాబట్టి తన విభిన్నతను చాటుకోడానికైనా తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మావోయిస్టులతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధం కావాలి. ప్రజా ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్న కాంగ్రెస్‌ పార్టీ ముందు తెలంగాణలో ఆ పని చేయాలి. తద్వారా తన విశ్వసనీయతను చాటుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే, ప్రచ్ఛన్న బీజేపీ పాలన కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ కన్నా తాను భిన్నమని రుజువు చేసుకోవాలి.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌లో తమ ప్రభుత్వం ఇందులో భాగం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయినప్పటికీ తెలంగాణలో గోదావరి తీరం పొడవునా పోలీసులు క్యాంపులు పని చేస్తున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లో చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వ బలగాలు, కేంద్ర ప్రభుత్వం పంపిన వివిధ రకాల సైనికబలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్టల ఆపరేషన్‌ దీనికి ఉదాహరణ. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న సైనిక చర్యల్లో తెలంగాణ నుంచి విప్లవోద్యమంలోకి వెళ్లిన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ ప్రాంత ఆదివాసులు తీవ్ర నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. ఈ మరణాలను, హింసను నివారించడానికైనా, బీజేపీ కొనసాగిస్తున్న అంతిమయుద్ధ వాతావరణంలో రాజకీయ మార్పు రావడానికైనా తెలంగాణలో కాల్పుల విరమణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధం కావాలి.
తెలంగాణలో కాల్పుల విరమణకు సిద్ధం కావడానికి ఇంకో ముఖ్యమైన ప్రాతిపదిక ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మావోయిస్టు ఉద్యమం చాలా క్రియాశీలంగా పని చేసింది. తొలి దశ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఆకాంక్షలకు విప్లవోద్యమం దృఢంగా కట్టుబడి ఉండింది. తెలంగాణలో ప్రజాస్వామిక చైతన్యం వెల్లివిరియడంలో విప్లవోద్యమం పాత్ర గణనీయమైనది. ఇవాళ కాల్పుల విరమణను కూడా అదే చైతన్యంతో తెలంగాణ సమాజం స్వీకరించింది. గత రెండున్నర నెలలుగా ఒక్క బీజేపీ మినహా తెలంగాణలో అనేక ప్రజా సమూహాలు, రాజకీయ శక్తులు కాల్పుల విరమణ ఉద్యమంలో భాగమవుతున్నాయి. వందలాది ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటన చేస్తేనే ఈ ప్రజాస్వామిక ఆకాంక్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించినట్లు లెక్క. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించేలా ఒత్తిడి చేయవలసి ఉన్నది. ఈ ఉద్యమంలో దేశ ప్రజలపై జరుగుతున్న యుద్ధాన్ని నిలువరించాలనే రాజ్యాంగ విలువలు ఉన్నాయి. ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక కోణం కూడా ఉన్నది. ఇంత ప్రధానమైన విషయాన్ని విరసం తన ఆవిర్భావ సభలో చర్చనీయాంశం చేయాలనుకుంటోంది. అందరికీ స్వాగతం.

Leave a Reply